సోషల్ స్టాక్ ఎక్సేంజ్ అంటే ఏమిటి?
- వైద్యరంగంపై పార్లమెంటరీ స్థాయీ సంఘం పేర్కొన్న కింది వాటిలో సరైనది? (ఎ)
ఎ) వైద్య ఆరోగ్య రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతుంది
బి) కరోనా సమయంలో కేంద్రం
సమయోచితంగా పనిచేసింది
సి) వైద్య రంగానికి కేటాయింపులు సమర్థంగా ఉన్నాయి
డి) ఏదీ కాదు
వివరణ: దేశంలో వైద్య ఆరోగ్య రంగం ఏండ్లుగా తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతుందని పార్లమెంటరీ స్థాయీ సంఘం పేర్కొంది. నిధుల కేటాయింపులో ఆ శాఖకు సముచిత ప్రాధాన్యం దక్కడం లేదని విమర్శించింది. ఆస్పత్రుల్లో మానవ వనరులు, మౌలిక వసతుల కొరత తీవ్రం అవుతుందని చెప్పింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో తమకు రూ.1,21,889 కోట్లు కేటాయించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కోరితే కేటాయించింది రూ.71,268 కోట్లు మాత్రమే అని పేర్కొంది. వైద్య రంగానికి బడ్జెట్లో సముచిత ప్రాధాన్యం ఇచ్చే దేశాల జాబితాలో 189 దేశాలకుగాను భారత్ 179వ స్థానంలో ఉంది. - అసోం, యునిసెఫ్‌లు సంయుక్తంగా చేపట్టిన ప్రాజెక్ట్ లక్ష్యం? (డి)
ఎ) చిన్నపిల్లల విద్య
బి) పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు
సి) కరోనా కట్టడి
డి) వరదల ఆన్లైన్ రిపోర్టింగ్
వివరణ: అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, యునిసెఫ్‌లు సంయుక్తంగా ‘ఆన్లైన్ ఫ్లడ్ రిపోర్టింగ్ సిస్టమ్ (వరద సంబంధిత సమాచారం)’ను అభివృద్ధి చేశాయి. వరదల సమయంలో కలిగే ప్రభావాలను డిజిటల్ పద్ధతిలో సేకరించే తొలి రాష్ట్రంగా అసోం నిలిచింది. వరదల సమయంలో రోజువారీ సమాచారాన్ని సేకరిస్తారు. ఇది పూర్తిగా డిజిటల్ విధానంలో ఉంటుంది. పంటలు, పశుసంపద నష్టాలను కూడా అంచనా వేస్తారు. - ‘2డీజీ’ ఇటీవల వార్లల్లో నిలిచింది. ఇది ఏంటి? (సి)
ఎ) 5జీ స్పెక్ట్రమ్‌కు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానం
బి) భారత్ చేపట్టనున్న చంద్రయాన్‌కు రూపొందించిన సాఫ్ట్వేర్
సి) కొవిడ్-19కు డీఆర్డీవో రూపొందించిన ఒక ఔషధం
డి) స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్డీవో
తయారు చేసిన యుద్ధ విమానం
వివరణ: కొవిడ్-19 కట్టడిలో భాగంగా భారత రక్షణ పరిశోధన సంస్థ 2-డియాక్సీ డీ-గ్లూకోజ్ (2డీజీ) అనే ఔషధాన్ని తయారుచేసింది. అత్యవసర అనుమతిలో భాగంగా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా దీనికి అనుమతి ఇచ్చింది. సాధారణం నుంచి తీవ్రమైన కొవిడ్ లక్షణాలు ఉన్న వారికి కూడా ఇది పనిచేస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది. శరీరంలోకి ప్రవేశించిన కొవిడ్ వైరస్ కణంలోకి ఈ ఔషధం నేరుగా వెళ్లి వాటికి గ్లూకోజ్ అందకుండా నిరోధిస్తుంది. దీంతో కణ విభజన ఆగిపోతుంది. - ఆర్గానియా దినోత్సవాన్ని మే 10న నిర్వహిస్తారు. ఆర్గానియా అంటే? (బి)
ఎ) ఒక సూక్ష్మక్రిమి బి) వృక్షం
సి) జలచరం డి) దోమ
వివరణ: ఆర్గానియా అనేది ఒక వృక్షం. ఆర్గ్గానియా వృక్ష దినోత్సవంగా మే 10న నిర్వహిస్తారు. ఈ వేడుక నిర్వహించడం ఈ సంవత్సరమే తొలిసారి. మొరాకోలో ఇది కనిపిస్తుంది. దీనికంటూ ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలని మొరాకో సూచించగా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 2021 మే 3న తీర్మానం చేసింది. - పెస్కో ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది ఏంటి? (ఎ)
ఎ) యూరోపియన్ యూనియన్
రక్షణ విధానం
బి) సైబర్ దాడులను అడ్డుకొనే
అమెరికా పద్ధతి
సి) ఐక్యరాజ్యసమితిలో చేపట్టిన కొత్త ఓటింగ్ విధానం
డి) ఏదీకాదు
వివరణ: పెస్కో అనేది యూరోపియన్ యూనియన్‌కు చెందిన ఒక రక్షణ విధానం. దీని సంక్షిప్తరూపం పీఈఎస్సీవో. దీనిని విస్తరిస్తే పర్మనెంట్ స్ట్రక్చర్డ్ కో ఆపరేషన్ (రక్షణకు శాశ్వత నిర్మాణం). 2009లో లిస్బన్ ఒప్పందం ప్రకారం దీనిని తీసుకొచ్చారు. పెస్కోలోని 4/5వ వంతు దేశాలు నాటోలో కూడా సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. పెస్కో సభ్య దేశాల్లో సైనికుల కదలికలు స్వేచ్ఛగా ఉంటాయి. అధికారుల అడ్డంకులు ఏమీ ఉండవు. ముందస్తుగా నోటీస్ ఇవ్వడంతో పాటు పాస్‌పోర్ట్ కలిగి ఉంటే చాలు. ఇటీవలకాలంలో ఇది వార్తల్లో నిలవడానికి కారణం నార్వే, కెనడా, అమెరికా దేశాలు ఇందులో పాల్గొనేందుకు యూరోపియన్ యూనియన్ అనుమతి ఇచ్చింది. - ఎంటీవోటీవో (టోటో) అనే పదం ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచింది. ఇది ఏంటి? (సి)
ఎ) కొత్త రకం వైరస్
బి) కంప్యూటర్ల సాఫ్ట్వేర్ వ్యవస్థను ఇబ్బందికి గురిచేసే సాఫ్ట్వేర్
సి) అతి పురాతన ఖననం
డి) ఎక్కువ దేశాలు ఆమోదించిన క్రిప్టోకరెన్సీ
వివరణ: 78,000 సంవత్సరాల నాటి ఖననాన్ని ఆఫ్రికాలోని కెన్యా తీరంలో కనుగొన్నారు. మూడేళ్ల చిన్నారిని అక్కడ ఖననం చేశారు. ఆ చిన్నారికి ఎంటీవోటీవో అని పేరు పెట్టారు. ఒక పురాతన గుహలో దీనిని గుర్తించారు. ఒక దిండు (పిల్లో) కూడా ఆ చిన్నారితో పాటు ఉంచారు. ఈ ప్రాంతంలో వేటపై ఆధారపడి జీవించే సంస్కృతి ఉంది. - హిమాలయాల్లో సేంద్రీయ పద్ధతిలో పండించిన చిరుధాన్యాలను ఏ దేశానికి మొదట ఎగుమతి చేశారు? (డి)
ఎ) అమెరికా బి) అర్జెంటీనా
సి) ఫ్రాన్స్ డి) డెన్మార్క్
వివరణ: హిమాలయాల్లో సేంద్రీయ పద్ధతిలో పండించిన చిరుధాన్యాలతో కూడిన తొలి ఎగుమతిని డెన్మార్ దేశానికి చేశారు. ఉత్తరాఖండ్‌లో పండించిన రాగి, ఊదలను పంపారు. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్లో భాగంగా వీటిని పండించారు. తెలుగులో సేంద్రీయ ఉత్పత్తులకు జాతీయ కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. పంటలు, పశు సంపద, కోళ్ల ఉత్పత్తులు, చేపలు తదితర అంశాల్లో ఎగుమతి నాణ్యత ప్రమాణాల కోసం ఈ కార్యక్రమాన్ని 2011లో ప్రారంభించారు. దీనిని ఏపీఈడీఏ అమలు చేస్తుంది. ఏపీఈడీఏ పూర్తి రూపం-అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. - పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగసామి ఏ పార్టీకి చెందినవారు? (డి)
ఎ) భారతీయ జనతా పార్టీ
బి) పుదుచ్చేరి రాష్ట్ర మనీలా కాంగ్రెస్
సి) ఏఐఏడీఎంకే డి) ఏఐఎన్ఆర్సీ
వివరణ: పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్ రంగసామి ఎన్నికయ్యారు. 2001 నుంచి 2008 వరకు ఆయన ఈ కేంద్ర పాలిత ప్రాంతానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పట్లో ఆయన భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందిన నేత. ఆ తర్వాత ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ అనే కొత్త పార్టీని స్థాపించారు. ఇప్పటి వరకు ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుతం ఎన్డీఏ (జాతీయ ప్రజాస్వామ్య కూటమి) పక్షాన ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రాష్ట్రంలో మొత్తం 30 శాసనసభ స్థానాలకుగాను ఎన్డీఏ మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. - దేశంలో తొలి డ్రైవ్ ఇన్ వ్యాక్సినేషన్ సెంటర్‌ను ఏ నగరంలో ప్రారంభించారు? (సి)
ఎ) బెంగళూర్ బి) న్యూఢిల్లీ
సి) ముంబయి డి) నాగ్‌పూర్
వివరణ: దేశపు తొలి డ్రైవ్ ఇన్ వ్యాక్సినేషన్ సెంటర్‌ను ముంబయిలో ప్రారంభించారు. దాదర్‌లోని కోహినూర్ స్కేర్ టవర్ వద్ద ఇది అందుబాటులోకి వచ్చింది. దివ్యాంగులు, వృద్ధులు, సొంత వాహనాలు లేని వాళ్లను వ్యాక్సినేషన్ కేంద్రానికి తరలించేందుకు ఇది ఉపయోగపడుతుంది. మొత్తం ఏడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. - సోషల్ స్టాక్ ఎక్సేంజ్ అంటే ఏమిటి? (బి)
ఎ) సంస్థలు అన్ని సాంఘిక సేవలో నిమగ్నం కావడం, దాని ఆధారంగా స్టాక్ ఎక్సేంజ్‌లో రాయితీలు పొందడం
బి) స్వచ్ఛంద, సంక్షేమ సంస్థలు మూలధన సేకరణకు ఉద్దేశించిన స్టాక్ మార్కెట్లు
సి) సంక్షేమ సంస్థల కోసం సెబీ కొత్తగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సూచీ
డి) ఏదీకాదు
వివరణ: సాంఘిక సంస్థలు, స్వచ్ఛంద, సంక్షేమ సంస్థలు మూలధనాన్ని (క్యాపిటల్) సేకరించడానికి ఉపయోగపడే స్టాక్ ఎక్సేంజీలు ఇవి. మొదట వీటిని 2019-20 బడ్జెట్లో ప్రస్తావించారు. సెబీ నియంత్రణలో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2020 జూన్‌లో వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. దీనికి ఇషాత్ హుస్సేన్ నేతృత్వం వహించారు. 2020లో నివేదికను సమర్పించింది. ఆ తర్వాత సెప్టెంబర్ 2020లో హర్ష్ బన్వాల నేతృత్వంలో ఒక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేశారు. అది ఇటీవల తన నివేదికను
సమర్పించింది. - కింద పేర్కొన్న ఏ రెండు దేశ ప్రభుత్వాలు ప్రస్తుతం అస్థిరంగా ఉన్నాయి? (డి)
- దక్షిణ కొరియా 2. నేపాల్
- బంగ్లాదేశ్ 4. ఇజ్రాయెల్
ఎ) 1, 2 బి) 1, 2, 3
సి) 2, 3, 4 డి) 2, 4
వివరణ: ఇజ్రాయెల్‌లో ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ రాలేదు. ఆ దేశ పార్లమెంట్లో 120 స్థానాలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. లికుడ్ అనే రాజకీయ పార్టీ అత్యధికంగా 30 స్థానాలను గెలుచుకుంది. అయితే అవసరమైన మద్దతు కూడగట్టడంలో ఆ పార్టీ విఫలమయ్యింది. మరోవైపు నేపాల్ ప్రధాన మంత్రి ఓలీ సభా పరీక్షలో విశ్వాసాన్ని కోల్పోయారు. ఆ దేశ పార్లమెంట్లో 271 మంది సభ్యులు ఉన్నారు. ఆయన రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని, నేపాల్ ప్రజాస్వామ్యానికి ఇబ్బందిగా మారారని ఆరోపిస్తూ నేపాల్‌లోని కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది. అయితే ఎవరికీ మెజారిటీ లేకపోవడంతో మళ్లీ ఓలీని ప్రధానమంత్రిగా నియమించారు.
- బెన్ను ఇటీవల వార్తల్లో నిలిచింది.ఇది ఏంటి? (సి)
ఎ) కొత్తగా కనిపెట్టిన ఉపగ్రహం
బి) ఒలింపిక్స్‌లో ప్రవేశపెట్టనున్న కొత్త క్రీడ
సి) గ్రహ శకలం
డి) ఆక్సిజన్ తయారీ కొత్త పద్ధతి
వివరణ: బెన్ను అనేది ఒక గ్రహ శకలం. భూమికి అతిదగ్గరగా ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. సౌర వ్యవస్థ ఏర్పడిన 10 మిలియన్ సంవత్సరాల్లోపే ఇది ఆవిర్భవించి ఉంటుందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. అప్పటి నుంచి ఇది పెద్ద మార్పులకు లోనుకానందున నాటి కాలపు రసాయన, శిలా వ్యవస్థలను అధ్యయనం చేయడం ద్వారా సౌర వ్యవస్థ ఆవిర్భావాన్ని అవగాహన చేసుకోవచ్చు. ఈ గ్రహ శకలంపైకి 2018లో అమెరికా ఒక అంతరిక్ష నౌకను ప్రయోగించింది. దీనిపేరు అసిరిస్. ఇది రాళ్లను సేకరించి భూమికి పయనం అయింది. - వరల్డ్ ఫుడ్ ప్రైజ్-2021ని ఎవరు గెలుచుకున్నారు? (ఎ)
ఎ) శకుంతల హరక్సింగ్
బి) సనా రామ్‌చంద్
సి) గీతా మిట్టల్
డి) ఎవరూకాదు
వివరణ: వ్యవసాయ రంగంలో నోబెల్‌గా భావించే వరల్డ్ ఫుడ్ ప్రైజ్‌ను 2021కిగాను ప్రపంచ పోషకాహార నిపుణురాలు, శాస్త్రవేత్త శకుంతల హరక్సింగ్ థిల్స్టెడ్కు ప్రకటించారు. ఆమె భారత సంతతికి చెందిన వ్యక్తి. జలజీవుల పెంపకం, ఆహార వ్యవస్థలో సంపూర్ణ పోషణ విధానాలను అభివృద్ధి చేసినందుకు ఆమె ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
సనా రామ్‌చంద్: పాకిస్థాన్‌లో అత్యున్నత సర్వీస్ అయిన పాకిస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్‌కు ఎంపికయిన తొలి హిందువుగా సనా రామ్‌చంద్ చరిత్ర సృష్టించారు. ఆమె వైద్యురాలు.
గీతా మిట్టల్: జమ్ముకశ్మీర్ హైకోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్ ప్రతిష్ఠాత్మక ‘ఆైర్లెన్ పాచ్ట్ గ్లోబల్ విజన్ అవార్డ్-2021’ని గెలుచుకున్నారు. - ఈవీఏ (ఈవా) చాట్‌బోట్‌ను ప్రారంభించిన బ్యాంక్ ఏది? (డి)
ఎ) ఐసీఐసీఐ బ్యాంక్
బి) ఎస్బీఐ
సి) స్టాండర్డ్ చార్టెర్డ్ బ్యాంక్
డి) హెచ్డీఎఫ్సీ
వివరణ: కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఈవా చాట్‌బోట్‌ను కామన్ సర్వీసెస్ సెంటర్ సాయంతో హెచ్డీఎఫ్సీ ప్రారంభించింది. గ్రామస్థాయి వ్యవస్థాపకులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. బ్యాంక్ సేవలు, ఉత్పత్తులను తేలికగా అర్థమయ్యేలా వివరిస్తుంది. ఖాతాలు తెరవడం, రుణాలు తీసుకొనే పద్ధతులను కూడా ఈ చాట్బోట్లు ముఖ్యంగా గ్రామ వాసులకు అర్థమయ్యేలా వివరిస్తాయి. - దేశంలో ఏ రోజున ‘జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని’ నిర్వహిస్తారు? (సి)
ఎ) మే 10 బి) మే 9
సి) మే 11 డి) మే 12
వివరణ: జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఏటా మే 11న నిర్వహిస్తారు. 1998లో ఇదే రోజున భారత్‌లో అణుపరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాతి సంవత్సరం నుంచి జాతీయ సాంకేతిక రోజుగా నిర్వహిస్తున్నారు. ఈ అణు పరీక్షను రాజస్థాన్‌లోని పోఖ్రాన్లో చేశారు. దీనికి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నేతృత్వం వహించారు. భారత శాస్త్రవేత్తలు సాధించిన ఘనతను ప్రపంచానికి చాటిచెప్పడానికి ఈ రోజును ఎంపిక చేశారు.
వి.రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ , వ్యోమా.నెట్
9849212411
Previous article
జాతీయం
Next article
గాయాలను త్వరగా మానిపించేది?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు