జాతీయం
భారత్-ఈయూ సమావేశం
భారత్-ఈయూ శిఖరాగ్ర సమావేశం పోర్చుగల్ ఆధ్వర్యంలో మే 8, 9 తదీల్లో వర్చువల్‌గా జరిగింది. ఈయూ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మిచెల్. ఈయూలోని సభ్యదేశాల సంఖ్య 27. ఈ సమావేశంలో భారత్ తరఫున ప్రధాని మోదీ పాల్గొన్నారు. స్వేచ్ఛా వ్యాపారం, ఆర్థిక, కొవిడ్-19 పరిస్థితులపై చర్చించారు.
అసోం సీఎంగా హిమంత
అసోం 15వ ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వకర్మ మే 10న ప్రమాణం చేశారు. గువాహటిలోని శంకరదేవ కళాక్షేత్రలో గవర్నర్ ప్రొఫెసర్ జగదీశ్ ముఖి ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఈశాన్య రాష్ర్టాల సీఎంలు కాన్రాడ్ సంగ్మా (మేఘాలయ), బిప్లవ్‌కుమార్ దేవ్ (త్రిపుర), ఎన్ బీరేన్‌సింగ్ (మణిపూర్), నైఫియి రియో (నాగాలాండ్) హాజరయ్యారు.
వైద్య మౌలిక వసతుల సూచీ
దేశంలోని 8 ప్రధాన వైద్య మౌలిక వసతుల పరంగా నిర్వహించిన సర్వే సూచీ మే 12న విడుదలైంది. అమెరికాకు చెందిన న్యూస్‌కార్ప్, ఆస్ట్రేలియా గ్రూప్ సంస్థ ఆర్‌ఈఏకు చెందిన స్థిరాస్తి పోర్టల్ హౌసింగ్ డాట్‌కామ్ ‘భారత్‌లో ఆరోగ్య సంరక్షణ స్థితి’ పేరుతో ఈ సూచీని విడుదల చేసింది. దీనిలో పుణె మొదటి స్థానంలో నిలువగా.. అహ్మదాబాద్ 2, బెంగళూరు 3, ముంబై 4, హైదరాబాద్ 5, చెన్నై 6, కోల్‌కతా 7, ఢిల్లీ 8వ స్థానాల్లో నిలిచాయి. ప్రతి 1000 మంది జనాభాకు అందుబాటులో ఉన్న ఆస్పత్రుల పడకల సంఖ్య, గాలి-నీటి నాణ్యత, పారిశుద్ధ్యం, మెరుగైన జీవనం లాంటి వాటిని ప్రమాణాలుగా తీసుకుని ఈ ర్యాంకులను కేటాయించారు.
భారత్-స్విస్ కాన్ఫరెన్స్
భారత్-స్విస్ దేశాల సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మే 13న నిర్వహించారు. ఈ సమావేశంలో భారత్ నుంచి అజయ్ సేథ్, స్విట్జర్లాండ్ నుంచి డానియేలా స్టోపెల్ పాల్గొన్నారు. ఆర్థిక అంశాలపై చర్చించారు.
పీఎం కిసాన్ నిధి
మే 13న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 2021-22 పథకం కింద నిధులు విడుదల చేసే కార్యక్రమంలో ఏపీలోని అనంతపురం జిల్లాలోని మహిళా రైతు వన్నూరమ్మతో ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయంలో దేశానికి ఆదర్శం వన్నూరమ్మ లాంటి మహిళా రైతులే అని మోదీ కొనియాడారు. ఈమె ప్రకృతి వ్యవసాయం చేసి పెట్టుబడి మీద నికరం నాలుగు రెట్ల ఆదాయం సంపాదించింది.
అంతర్జాతీయం
కూలిన చైనా రాకెట్
చైనా అంతరిక్ష కేంద్రం ఏర్పాటు కోసం 2021, ఏప్రిల్ 29న పంపిన లాంగ్ మార్చ్-5బి రాకెట్ మే 9న మాల్దీవుల సమీపంలో హిందూమహాసముద్రంలో కూలింది. ఈ రాకెట్ బరువు 18 టన్నులు.
చైనాను మించనున్న భారత్
2027 నాటికి భారత్ జనాభా పరంగా చైనాను అధిగమించి ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా అవతరిస్తుందన్న ఐక్యరాజ్యసమితి (ఐరాస) అంచనాలను చైనా జనసంఖ్యాశాస్త్ర విభాగం మే 12న సమర్థించింది. 2019లో ఐరాస ఓ నివేదికను విడుదల చేస్తూ భారత్ ఆరేండ్లలో చైనాను అధిగమిస్తుందని, ముప్ఫై ఏండ్ల (2050)లో దేశ జనాభా 27.3 కోట్లు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. రెండేండ్ల కిందటి అంచనాల ప్రకారం భారత్ జనాభా 137 కోట్లు, చైనా జనాభా 143 కోట్లు. చైనా తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆ దేశ జనాభా 141.2 కోట్లు. ఐరాస నివేదిక ప్రకారం ప్రపంచ సంతాన సాఫల్యత రేటు 2.5 శాతం ఉండగా.. చైనాలో అతి తక్కువగా 1.3 శాతం ఉంది.
నేపాల్ ప్రధానిగా ఓలీ
నేపాల్‌లో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఖడ్గప్రసాద్ (కేపీ) శర్మ ఓలీని ఆ దేశాధ్యక్షురాలు విద్యాదేవి భండారీ ఆహ్వానించగా మే 14న ప్రమాణం చేశారు. ఓలీ ప్రభుత్వానికి పుష్పకుమార్ దహల్ అలియాస్ ప్రచండ నేతృత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్ట్ సెంటర్) మద్దతు ఉపసంహరించుకున్నారు. దీంతో ఓలీ ప్రభుత్వం మైనారిటీలో పడి అధికారం కోల్పోయింది. ఇటీవల జరిగిన విశ్వాస పరీక్షలో ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ కూటమి విఫలమయ్యాయి. దీంతో అధ్యక్షురాలు ఆ దేశ రాజ్యాంగంలోని 78 (3) అధికరణం ప్రకారం అతిపెద్ద పార్టీ నేతగా ఓలీకి అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించారు. 271 స్థానాలున్న పార్లమెంటులో ఓలీ నాయకత్వంలోని నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (ఎన్సీపీ)కి 121 సీట్లు ఉన్నాయి. 2008లో లౌకిక రాజ్యాంగంగా ఏర్పడింది.
చిన్నారులకు వ్యాక్సినేషన్
ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికాలో 12 నుంచి 15 ఏండ్ల పిల్లలకు వ్యాక్సినేషన్‌ను మే 14న ప్రారంభించారు. అమెరికాలో ఇప్పటివరకు 15.4 కోట్ల మంది కొవిడ్ డోస్ తీసుకున్నారు. అందులో 11.75 కోట్ల మందికి రెండో డోస్ కూడా పూర్తయ్యింది.
వార్తల్లో వ్యక్తులు
అరుణ్
ఇంగ్లండ్‌లోని ‘బేజింగ్ స్టోక్’ వాయవ్య నియోజకవర్గం ప్రతినిధిగా భారత సంతతి వ్యక్తి ముమ్మలనేని అరుణ్ (ఆంధ్రప్రదేశ్) మే 9న ఎన్నికయ్యారు. హ్యాంప్‌షైర్ కౌంటీ నుంచి కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి రాష్ట్రస్థాయి ప్రజాప్రతినిధిగా విజయం సాధించారు. ఈ పదవిలో ఆయన నాలుగేండ్లు ఉంటారు.
సుమతికి అవార్డు
తెలంగాణ రాష్ట్ర మహిళా భద్రత విభాగం డీఐజీ సుమతికి అసోచామ్ పురస్కారం లభించింది. మే 13న ఆన్లైన్లో నిర్వహించిన ‘ఉమెన్ ఇన్ సైబర్: మేకింగ్ ఏ డిఫరెన్స్’ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి జ్యోతి అరోరా ఈ అవార్డును ఆమెకు అందజేశారు. మహిళలకు సైబర్ భద్రతలో భాగంగా ఆమె అందిస్తున్న సేవలకుగాను ఈ అవార్డు దక్కింది.
ఇందూ జైన్ మృతి
టైమ్స్ గ్రూప్ చైర్పర్సన్ ఇందూ జైన్ మే 13న మరణించారు. ఆమె 1999లో టైమ్స్ గ్రూప్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. విపత్తుల సమయంలో ప్రజలను ఆదుకునేందుకు టైమ్స్ రిలీఫ్ ఫండ్‌ను స్థాపించారు. 1983లో స్థాపించిన ఫిక్కీ మహిళా విభాగానికి వ్యవస్థాపక అధ్యక్షురాలిగా పనిచేశారు. భారతీయ భాషలను ప్రోత్సహించేందుకు సాహు శాంతి ప్రసాద్ జైన్ 1944లో స్థాపించిన భారతీయ జ్ఞానపీఠ్ ట్రస్టుకు 1999లో ఆమె చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. 2016లో పద్మభూషణ్ అందుకున్నారు.
తెంజింగ్ షెర్పా
నేపాల్‌కు చెందిన మింగ్మా తెంజింగ్ షెర్పా నాలుగు రోజుల్లో రెండుసార్లు ఎవరెస్టును అధిరోహించి మే 13న ప్రపంచ రికార్డును సృష్టించారు. తూర్పు నేపాల్‌లోని సంకువాసభ జిల్లాకు చెందిన తెంజింగ్ షెర్పా మొదట రోప్ ఫిక్సింగ్ టీం సభ్యుడిగా (మే 7 సాయంత్రం) ఎవరెస్ట్ శిఖరాగ్రానికి చేరాడు. తిరిగి మే 11న పర్వతాన్ని అధిరోహించాడు.
రాజేశ్ అగర్వాల్
భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త రాజేశ్ అగర్వాల్ లండన్ డిప్యూటీ మేయర్‌గా తిరిగి మే 13న నియమితులయ్యారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందినవారు. సాదిఖ్ ఖాన్ రెండోసారి లండన్ మేయర్‌గా ఎన్నికయ్యారు.
క్రీడలు
హామిల్టన్ రికార్డు
మే 8న ఫార్ములా వన్ ట్రాక్‌పై ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (బ్రిటన్) కెరీర్లో వందో పోల్ పొజిషన్ సాధించి ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. ఈ ఘనత సాధించిన తొలి రేసర్‌గా అతడు నిలిచాడు.మే 10న నిర్వహించిన ఎఫ్1 స్పెయిన్ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను హామిల్టన్ సాధించాడు. ఇది అతడికి 5వ టైటిల్ కాగా.. మొత్తంగా ఇది 98వ టైటిల్. 7 సార్లు ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ విజేత. నైట్‌హుడ్ లేదా సర్ బిరుదు లభించింది.
సబలెంక
మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ టైటిల్‌ను సబలెంక (బెలారస్) సాధించింది. మే 9న జరిగిన ఫైనల్స్‌లో ఆష్లీ బార్టీ (ఆస్ట్రేలియా)పై సబలెంక విజయం సాధించింది. దీంతో ఆమె తొలి డబ్ల్యూటీఏ టైటిల్‌ను గెలిచింది.
మనోజ్ తివారి
భారత్ మాజీ క్రికెటర్ మనోజ్ తివారి పశ్చిమబెంగాల్ క్రీడల మంత్రిగా మే 10న ప్రమాణం చేశాడు. అతడు భారత్ తరఫున 2008లో క్రికెట్ ఆడాడు. తన కెరీర్లో 12 వన్డేలు, 2 టీ20లు ఆడాడు.
మాడ్రిడ్ ఓపెన్ విజేత జ్వెరెవ్
జర్మనీ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ మాడ్రిడ్ ఓపెన్ విజేతగా నిలిచాడు. మే 10న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌లో జ్వెరెవ్ ఇటలీ ఆటగాడు మాట్ బెరిటినిని ఓడించాడు. అతడి కెరీర్లో ఇది రెండో మాడ్రిడ్ టైటిల్. 2018లో తొలిసారి ఈ టైటిల్ గెలిచాడు. మొత్తంమీద అతడికిది నాలుగో ఏటీపీ టైటిల్.
అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారులు
ఫోర్బ్స్ మేగజీన్ అత్యధికంగా సంపాదిస్తున్న 10 మంది క్రీడాకారుల జాబితాను మే 12న విడుదల చేసింది. ఈ జాబితాలో కోనార్ మెక్ గ్రెగర్ (యూఎఫ్‌సీ) మొదటి స్థానంలో నిలిచాడు. లియోనల్ మెస్సీ (ఫుట్‌బాల్) 2, క్రిస్టియానో రొనాల్డో (ఫుట్‌బాల్) 3, డాక్ ప్రెస్కాట్ (ఎన్ఎఫ్ఎల్) 4, లెబ్రాన్ జేమ్స్ (బాస్కెట్‌బాల్) 5, నెయ్మార్ (ఫుట్‌బాల్) 6, రోజర్ పెదరర్ (టెన్నిస్) 7, లూయిస్ హామిల్టన్ (ఎఫ్1) 8, టామ్ బ్రాడీ (ఎన్ఎఫ్ఎల్) 9, కెవింట్ డురాంట్ (బాస్కెట్‌బాల్) 10వ స్థానాల్లో ఉన్నారు. కోనార్ మెక్‌గ్రెగర్ వార్షికాదాయం దాదాపు రూ.13.24 కోట్లు.
మహిళా క్రికెట్ జట్టు కోచ్‌గా రమేష్
టీమిండియా మాజీ స్పిన్నర్ రమేష్ పవార్ భారత మహిళల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా మే 13న ఎంపికయ్యాడు. ఆయన డబ్లూవీ రామన్ స్థానంలో నియమితులయ్యాడు.
వేముల సైదులు
జీకే, కరెంట్ అఫైర్స్ నిపుణులు
ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ హైదరాబాద్
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు