అమ్మ కోసమే ఐఏఎస్..ప్రతి ఆడపిల్లకూ స్ఫూర్తినిచ్చే నిజామాబాద్ అమ్మాయి కథ
అప్పటికి నాకు ఐదేండ్లు. చెల్లి పసిబిడ్డ. నాన్న తన బాధ్యతల్ని వదిలేశారు. అమ్మ శక్తికి మించిన భారాన్ని తలకెత్తుకుంది. అప్పటి నుంచీ అమ్మే మా లోకం. నాకు అమ్మంటే ఇష్టం. అమ్మకు చదువంటే ఇష్టం. నేను బాగా చదివితే అమ్మ సంతోషించేది. నాకు ఎన్ని మార్కులొస్తే అంత మురిసిపోయేది. అమ్మ కళ్లల్లో మెరుపు కోసం మరింత కష్టపడి చదివేదాన్ని. ప్రతి పరీక్షలో ఫస్ట్ వచ్చేదాన్ని. ఐఏఎస్ విజయం కూడా అమ్మకే అంకితం’ అంటారు సివిల్స్‌లో 136వ ర్యాంకు సాధించిన స్నేహ అరుగుల. మట్టిలో మాణిక్యాన్ని తలపించే ఈ నిజామాబాద్ అమ్మాయి కథ ప్రతి ఆడపిల్లకూ స్ఫూర్తినిస్తుంది.
ఐఏఎస్.. చిటారు కొమ్మన మిఠాయి స్వప్నం. లక్షల మందిలో ఏ పిడికెడు విజేతలో గమ్యాన్ని చేరుకుంటారు. కుటుంబ చరిత్రలు, ఖరీదైన ఢిల్లీ కోచింగ్‌లు.. ఇవేవీ లేకుండానే దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన స్నేహ అరుగుల ఆ శిఖరాన్ని అధిరోహించింది. ఆ కల వెనుక ఆమె కఠోర శ్రమ ఉంది. పగలూ రాత్రీ కష్టపడింది. తన చేతికొచ్చిన ప్రతి రూపాయినీ చదువు కోసమే ఖర్చుపెట్టింది. ఒకటి, రెండు, మూడు.. నాలుగు సార్లు శక్తినంతా కూడగట్టుకుని సివిల్స్ రాసింది. ఆ పట్టుదల ముందు విజయం మోకరిల్లింది. ఐఏఎస్ వరించింది.
ఆ కథంతా స్నేహ మాటల్లోనే..
‘ఊహ తెలిసిన దగ్గర నుంచీ మా కుటుంబం అంటే అమ్మ, చెల్లి, నేను… అంతే. అమ్మ పెద్దగా చదువుకోలేదు. పదో తరగతి పాసైంది. మమ్మల్ని పోషించడానికి రకరకాల పనులు చేసేది. కొన్ని రోజులు బట్టలమ్మింది. కొన్నిరోజులు కిరాణా దుకాణం నడిపింది. అదీ అంతంత మాత్రంగానే నడిచింది. అయినా కుంగిపోలేదు. ఏదో ఒక కొత్తదారి వెతుకుతూనే ఉండేది. మరో పక్క మా అమ్మమ్మ బట్టలు కుట్టిన డబ్బులు దాచిపెట్టి, మా కోసం ఇస్తుండేది. అప్పట్లో మా జిల్లాకు ఒక కలెక్టర్ వచ్చారు. మా ప్రాంతంలో మహిళా సాధికారత కోసం కంప్యూటర్ శిక్షణ తరగతులు నిర్వహించారు. మా కుటుంబానికి ఇదేమైనా సాయంగా ఉంటుందేమో అని అమ్మ అందులో చేరింది. కంప్యూటర్ బేసిక్స్ నేర్చుకుంది. ఒక ప్రభుత్వ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా చేరింది. జీతం తక్కువే. అయినా ఆ మొత్తం మాకు ఎంతో సాయపడేది. ఏ పరిస్థితుల్లోనూ అమ్మ మా చదువులను నిర్లక్ష్యం చేయలేదు.
చిరునవ్వులు చూడాలని..
నిజానికి నేను మామూలు విద్యార్థినే. ఎవరైనా ‘మీ బిడ్డ బాగా చదువుతుంది’ అని మెచ్చుకున్నప్పుడు అమ్మ కళ్లలో ఆనందం కనిపించేది. ఆ మెరుపు నాకు ఇష్టం. అమ్మను సంతోషపెట్టడానికి నేను చేయగలిగింది ఒకటే.. బాగా చదవడం. అందుకే ఎప్పుడూ చదువుతూనే ఉండేదాన్ని. ప్రతి పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకునేదాన్ని. పదోతరగతే కాదు ఇంటర్మీడియెట్‌లోనూ అంతే. ఏం చదువుతాం? ఎందుకు చదువుతాం? అన్నది కాదు. మంచి మార్కులు రావాలంతే… ఇదే నా లక్ష్యం. ఇంటర్ తర్వాత ఎన్ఐటీలో సీటు వచ్చింది. నిజానికి నాకు ఎన్ఐటీ అంటే ఏమిటో కూడా తెలీదు. బాగా చదివితే వచ్చిందంతే. నాగ్‌పూర్ క్యాంపస్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివాను. ప్లేస్మెంట్ కూడా వచ్చింది. చిన్నప్పుడు, మా ఊరికొచ్చిన కలెక్టర్ కారణంగానే అమ్మ కంప్యూటర్స్ నేర్చుకుంది. ఉద్యోగం సంపాదించింది. మమ్మల్ని చదివించింది. నేనూ కలెక్టర్ అయితే, మా అమ్మ లాంటి ఎన్నో జీవితాలు బాగుపడతాయి కదా! అందుకే ఎనిమిదో తరగతిలో తీసుకున్న నిర్ణయానికి ఇంజినీరింగ్ తర్వాత కూడా కట్టుబడి ఉన్నాను. లక్షల జీతాల ప్యాకేజీలు, మల్టీనేషనల్ కంపెనీల ఆర్భాటాలు నన్ను ఆకర్షించలేదు. పట్టా చేతికి రాగానే హైదరాబాద్ వచ్చి సివిల్స్ కోచింగ్‌లో చేరాను. మొదటి రెండుసార్లు ఇంటర్వ్యూ దాకా వెళ్లలేదు. మూడోసారి ఒక్కటంటే ఒక్క మార్కుతో ర్యాంకు కోల్పోయాను. అప్పుడు, ఎంత బాధపడ్డానో! మాకు కోచింగ్ ఇచ్చిన బాలలత మేడమ్, నాతో పాటు చదివిన స్నేహితులు ఆ సమయంలో మద్దతుగా నిలిచారు. నేను ఎక్కడ డీలా పడిపోతానో అన్న భయంతో.. రోజూ ఉదయం ‘ఐ లవ్ యూ..’ అంటూ మెసేజ్ చేసేది ఓ స్నేహితురాలు. కన్న కూతురిలా చూసుకున్న పిన్ని, బాబాయ్ ఆ కష్ట సమయంలో అండగా నిలిచారు.
స్ఫూర్తి వాక్యాలు
ఇప్పటికీ అమ్మ జీతం పదిహేను వేలే. చెల్లి సంగీతం క్లాసులు చెబుతూ నాకు డబ్బు పంపుతుంది. ఆ సంక్షోభ సమయంలో నా మనసులోని ఓ మాటను నా ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకున్నా, పట్టుదల పెంచుకున్నా.. ‘నువ్వు కొండవే కావచ్చు. నేను నీ ముందు చిన్న మనిషినే కావచ్చు. కానీ నువ్వు ఎదగలేవు. నేను ఎదగగలను. అభివృద్ధి చెందగలను. మరింత బలంగా మారి నిన్ను ఢీకొట్టగలను’. కచ్చితంగా ఏడు నెలల్లో నేను ఆ శిఖరాన్ని అధిరోహించాను. ఇలాంటి మరెన్నో శిఖరాలు ఎక్కాలని, ఎక్కగలననీ అనుకుంటున్నాను. మా అమ్మలాంటి ఎందరో అమ్మలకు సాయం చేయాలనీ.. పేద, మధ్యతరగతి ఆడపిల్లల అభివృద్ధికి పని చేయాలనీ కలలు కంటున్నాను. ఈ విజయం అమ్మకు, నా కుటుంబానికి అంకితం” అంటూ ఉద్వేగభరితులయ్యారు స్నేహ. అమ్మ కళ్లల్లో ఆనందం నుంచి అమ్మల కళ్లల్లో ఆనందం వైపుగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు స్నేహ.
… లక్ష్మీహరిత ఇంద్రగంటి
ఫొటోలు : గడసంతల శ్రీనివాస్
- Tags
- competitive exams
- Groups
- upsc
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?