Bala latha | ఆ వంద మంది నా ప్రతిబింబాలు.. బాలలత సక్సెస్ స్టోరీ
Bala latha | బాలలత మేడం.. తెలుగు రాష్ట్రాల్లో సివిల్ సర్వీసు పరీక్షలకు సిద్ధం అవుతున్న చాలామందికి సుపరిచితమైన పేరు. ఆమె దగ్గరికి వెళ్తే విజయానికి సగం చేరువైనంత భరోసా. వందమందిని సివిల్స్ విజేతలుగా ఢిల్లీకి పంపిన బాలలత నిజానికి ఓ నిత్య యోధురాలు. ఆమె రెండు కాళ్లనూ పోలియో మహమ్మారి కబళించింది. అందరిలా ఆడుకోలేక పోతున్నానే, బడికెళ్లలేకపోతున్నానే.. అని ఎన్నిసార్లు కుమిలిపోయారో, ఎంతసేపు కన్నీళ్లు పెట్టుకున్నారో! ఆ వైకల్యమే తనకు గెలుపు మీద కసిని పెంచిందంటారు. ఈ ఏడాది ఫలితాల్లోనూ పద్నాలుగు మందిని ర్యాంకర్లుగా నిలబెట్టిన బాలలత మల్లవరపు తన విజయగాథను ‘జిందగీ’తో పంచుకున్నారిలా…
పదకొండు నెలల వయసులో నాకు పోలియో చుక్కలు వేయించారు. అమృతంలా పనిచేయాల్సిన మందు విషమై వికటించింది. నా రెండు కాళ్లూ చచ్చుబడిపోయాయి. ఎన్ని ఆసుపత్రులకు తిప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇక నేను ఇంతేనని నాతో పాటు కుటుంబానికి, సమాజానికి అర్థమైపోయింది. బడికి వెళ్లాలన్న ఆశ ఉన్నా.. ఎవరో ఒకరు ఎత్తుకుని తీసుకెళ్లాల్సిన పరిస్థితి. దీంతో సరిగ్గా వెళ్లలేకపోయాను. గుంటూరు దగ్గర ఓ పల్లెటూరు మాది. ఇంటి దగ్గర ఉంటూనే పది, ఇంటర్మీడియెట్, డిగ్రీ పూర్తిచేశాను. ఆ తర్వాత లా చదివాను. అందులోనూ నేనే ఫస్టు. ఎంత చదువుకున్నా నన్ను వికలాంగురాలైన అమ్మాయిగానే సమాజం గుర్తించేది. ఆ పరిమితిని అధిగమించేంతగా ఎదగాలనుకున్నా. అప్పుడే సివిల్ సర్వెంట్ కావాలని తీర్మానించుకున్నా. అప్పటికి నాకు తెలిసిన అతిపెద్ద్ద ఉద్యోగం అదొక్కటే. ఆ లక్ష్యం కోసం పగలూ రాత్రీ చదవడం మొదలుపెట్టాను. ఎంత కష్టపడ్డానంటే, ఆ రెండేండ్లు నా మొహం ఎలా ఉందో కూడా అద్దంలో చూసుకోలేదు. తిండి, నిద్ర సైతం చదువు తర్వాతే. నాన్న శౌరయ్య జర్నలిస్టు కావడంతో సమకాలీన అంశాలను ఆయనతో చర్చించేదాన్ని. మొదటి ప్రయత్నంలోనే ర్యాంకు సాధించాను. డిఫెన్స్ అకౌంట్స్ సర్వీసుకు ఎంపికయ్యాను. ఆ విజయం నన్ను నలుగురిలో ప్రత్యేకంగా నిలబెట్టింది, నా మీద నాకే కాదు సమాజానికీ నమ్మకం కలిగించింది. నేను ఎక్కడా కోచింగ్ తీసుకోలేదు. నా అంతట నేనే చదువుకుని సివిల్స్ సాధించాను. మాకూ ఆ మెలకువలు చెప్పమంటూ చెన్నైలోని నా నివాసానికి చాలామంది వచ్చేవారు. నా అనుభవాన్ని పాఠాలుగా మలిచి చెప్పేదాన్ని. చాలా మందికి మంచి ర్యాంకులు వచ్చాయి. క్రమంగా నా సలహాల కోసం వచ్చేవారి సంఖ్య పెరిగింది.
నాలాంటి వాళ్ల కోసమే
‘మెంటర్ హోదాలో నేను గెలుపు పాఠాలు చెప్పిన వాళ్లు ర్యాంకులు సాధించి ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యుత్తమ సర్వీసులలో చేరుతుంటే ఎంతో ఆనందంగా అనిపించేది. వాళ్లలో ఎవరైనా నిజాయతీగా వ్యవహరించారనో, ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారనో పేపర్లో వార్తలు వస్తే పొంగిపోయేదాన్ని. అప్పుడే నాలో ఆలోచన మొదలైంది. నేను ఒక ముప్పై సంవత్సరాలు సర్వీసులో ఉంటే అన్నేళ్లు మాత్రమే దేశానికి సేవ చేయగలను. కానీ గెలవాలన్న తపన ఉన్నవాళ్లకు మార్గదర్శకత్వం వహిస్తే.. నాలాంటి చాలా మందిని తయారు చేయగలను. వాళ్లు ఒక్కొక్కరూ కనీసం ముప్పైయేండ్ల పాటు దేశానికి సేవ చేయగలరు కదా.. అనిపించింది. మరుక్షణం నా ఉద్యోగానికి రాజీనామా చేశాను. హైదరాబాద్ వచ్చేశాను. ఆరేండ్ల క్రితం సివిల్ సర్వీసెస్ కోచింగ్ మొదలు పెట్టాను. మొత్తం పదిహేనేళ్లలో వంద మందిని సివిల్ సర్వెంట్లుగా దేశానికి అందించాను. వాళ్లంతా నా ఆలోచనలకు, భావాలకు ప్రతిరూపాలు, నా ప్రతిబింబాలు. చదువు చెప్పాలంటే ముందుగా మనల్ని మనం పరీక్షించుకోవాలి. అందుకే సర్వీసులో ఉన్నా కూడా మళ్లీ సివిల్స్ రాసి 167వ ర్యాంకు సాధించాను. ఆ విజయంతో మెంటర్గా వ్యవహరించే అర్హత నాకుందని గట్టిగా నిర్ధ్ధారించుకున్నా.
గొప్ప అధికారులుగా…
‘మీ దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్లే ఎక్కువగా ఎందుకు ఎంపిక అవుతున్నారు?’ అని అడుగుతుంటారు చాలామంది. సివిల్స్ కోచింగ్ అంటే గంటల తరబడి చదవడం మాత్రమే కాదు, మన వ్యక్తిత్వాన్ని ఇంటర్వ్యూలో చక్కగా ప్రదర్శించడం కూడా. అందుకే మేం ఇక్కడ ఒక గాజు గదిని ఏర్పాటు చేశాం. నమూనా ఇంటర్వ్యూలు నిర్వహించి ఆ వీడియోలు వాళ్లకు చూపిస్తాం. కూర్చునే భంగిమ, హావభావాలు, ఇంటర్వ్యూలో వాడాల్సిన పదాలు.. అన్నీ విశ్లేషిస్తాం. చర్చించుకుంటాం. చిత్రవిచిత్రమైన ప్రశ్నలు వేసి సమాధానాలు రాబడతాం. అన్నిటికన్నా ముందుగా సత్ప్రవర్తన కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దుతాం. దేశం పట్ల ప్రేమ, సమాజం పట్ల స్పృహ, సేవా గుణం.. వాళ్లలో చొప్పించే ప్రయత్నం చేస్తాం. వీటన్నిటి మేళవింపుగా తయారైన వ్యక్తులు ఎంత పెద్ద పరీక్షనైనా సులభంగా అధిగమిస్తారు.
ఇంద్రగంటి లక్ష్మీహరిత
ఫొటోలు : గడసంతల శ్రీనివాస్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?