-జీవావరణంలో జీవుల మధ్య పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటుంది. వీటినే ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు అంటారు.
-జీవ నిర్జీవ వలయంలో నిర్జీవ అంశాలైన ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్, ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, నీరు వంటివి మొక్కల ద్వారా జీవుల్లో చేరి, వాటి విసర్జితాలు, మృతదేహాలు విచ్ఛిన్నం కావడంవల్ల జరిగే నిర్జీవ కారకాలుగా మారుతాయి. ఈ విధంగా జీవ, నిర్జీవ వలయాలు నిరంతరంగా నిర్వహించబడుతూ నిర్మాణ, విచ్ఛిన్న క్రియలకు కారణం కావడంతో భూమిపై జీవం నిరంతరం మనుగడ సాగించబడుతుంది.
-జీవావరణ శాస్ర్తాన్ని ఇంగ్లిష్లో ఎకాలజీ (Ecology) అంటారు. ఈ పదానికి గ్రీకు భాష మూలం. గ్రీకులో ఒకాయిస్ (Oikos) అంటే ఇల్లు అని, లాగోస్ (Logos) అంటే అధ్యయనం అని అర్థం. ఈ రెండు పదాలను జతచేసి ఎకాలజీ అని 1885…లో కార్ల్ లైటిక్ మొదటిసారిగా ఉపయోగించారు.
-ఒకాయిస్= ఇల్లు+లాగోస్= అధ్యయనం= ఎకాలజీ= ఆవాసాల అధ్యయనం శాస్త్రం.
జీవావరణ వ్యవస్థ నిర్మాణం
-నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలోని జీవ, నిర్జీవ అణుఘటకాల సముదాయాన్ని ఆవరణ వ్యవస్థ నిర్మాణం అంటారు.
-జీవ అనుఘటకాలు: జీవావరణ వ్యవస్థలోని జీవరాశులు అంటే మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు ఈ వర్గంలోకి వస్తాయి. ఇవి ఒకదానిపై ఒకటి ఆధాపడి జీవిస్తాయి.
చర్యలను బట్టి ఇవి రెండు రకాలు..
ఎ. స్వయం పోషక అనుఘటకాలు: సూర్యుని నుంచి వెలువడే వికిరణశక్తిని ఉపయోగించుకుని కిరణజన్యసంయోగ క్రియ జరిపి పత్రహరితాన్ని తయారుచేసుకునే మొక్కలు. వీటిని స్వయం పోషితాలు (Autotrops) అని ఉత్పత్తిదారులు అని కూడా అంటారు.
బి. పరిపోషక అనుఘటకాలు: ఇవి మొక్కలు తయారుచేసిన ఆహార పదార్థాలపై ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఆధారపడి జీవించే వివిధ జంతువులు. వీటిని పరపోషితాలు (Hetero trophs) అంటారు. వీటిని వినియోగదారులు, విచ్ఛిన్నకారులు అని రెండు రకాలు.
1. వినియోగదారులు- జంతువులు
2. విచ్ఛిన్నకారులు- సూక్ష్మజీవులు
నిర్జీవ అనుఘటకాలు
ఇవి మృత్తిక నీరు, కాంతి వంటి నిర్జీవమైన అనుఘటకాలు. వీటి విభజన..
ఎ. శీతోష్ణపరమైనవి- కాంతి, ఉష్ణం, వర్షం
బి. భౌతిక పరమైనవి- గాలి, నీరు, నేల
సి. రసాయనిక పరమైనవి- ఇవి సేంద్రియపరమైనవి (కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్స్, లిపిడ్స్), నిరేంద్రీయమైనవి (సోడియం, పొటాషియం, కాల్షియం, పాస్ఫరస్ వంటివి)
జీవావరణ వ్యవస్థ అంశాలు
1. నిర్జీవకాంశాలు
ఎ. అకర్బన బి. కర్బన సి. శీతోష్ణ
2. జీవకాంశాలు
ఎ. ఉత్పత్తిదారులు (మొక్కలు)
బి. వినియోగదారులు
a. స్థూల వినియోగదారులు
i. ప్రాథమిక ii. ద్వితీయ iii. తృతీయ
b. సూక్ష్మవినియోగదారులు
(ఉదా: బ్యాక్టీరియా, శిలీంధ్రాలు)
మానవ ప్రమేయాన్ని ఆధారంగా తీసుకుని ఆవరణ వ్యవస్థ మూడు రకాలు..
1. సహజసిద్ధ జీవావరణ వ్యవస్థ: ఇది మానవుని ప్రభావం లేకుండా ఏర్పడిన జీవావరణ వ్యవస్థ. వాతావరణం పొరలు, జలావరణం, జీవావరణం, శిలావరణం సహజసిద్ధమైన ఆవరణ వ్యవస్థలుగా ఉంటాయి. ఇవి రెండు భాగాలు..
ఎ. ఖండ (భౌమ్య) ఆవరణ వ్యవస్థ
1. అరణ్య జీవావరణ వ్యవస్థ
2. ఎడారి జీవావరణ వ్యవస్థ
3. గడ్డి మైదాన ఆవరణ వ్యవస్థ
4. టండ్రా ఆవరణ వ్యవస్థ
జలావరణ వ్యవస్థ ఇది రెండు రకాలు..
1. సముద్ర జీవావరణ వ్యవస్థ- ఖండతీరపు అంచు జీవావరణ వ్యవస్థ, ఖండతీరపు వాలు జీవావరణ వ్యవస్థ, అబిసల్ మైదానపు జీవావరణ వ్యవస్థ, ట్రెంచ్ లేదా అగాథాల జీవావరణ వ్యవస్థ.
2. మంచినీటి జీవావరణ వ్యవస్థ: లోటిక్ లేదా ప్రవాహపు నీటి జీవావరణ వ్యవస్థ, లెంటిక్ లేదా స్థిరనీటి జీవావరణ వ్యవస్థ, ఈస్టరైన్ లేదా నదీముఖ ద్వార జీవావరణ వ్యవస్థ.
కృత్రిమ జీవావరణ వ్యవస్థ
ఇది మానవుని ప్రభావం వల్ల ఏర్పడిన ఆవరణ వ్యవస్థ.
ఉదా: పంట పొలాల జీవావరణ వ్యవస్థ, సామాజిక అడవుల జీవావరణ వ్యవస్థ, ప్రయోగశాల జీవావరణ వ్యవస్థ, పారిశ్రామిక జీవావరణ వ్యవస్థ, విశ్వాంతరాల జీవావరణ వ్యవస్థ.
పరివర్తన జీవావరణ వ్యవస్థ: ఇవి ఖండ, జలావరణ వ్యవస్థల మధ్య విస్తరించి తేమ, బురద, క్షారత్వాన్ని కలిగి విలక్షణమైన జీవవైవిధ్యం కలిగి ఉంటాయి. ఇవి తీర ప్రాంతా ల్లో మృత్తికా క్రమక్షయాన్ని నియంత్రిస్తాయి.
ఉదా: ఈస్టరీస్ లేదా ఉప్పునీటి సరస్సు, డెల్టా లాగూన్లు
ఖండ జీవావరణ వ్యవస్థ
ఈ వ్యవస్థను మూడు రకాలుగా వర్గీకరించారు. అవి..
1. అటవీ జీవావరణ వ్యవస్థ: మనదేశంలో అనేక రకాల అటవీ వ్యవస్థలు ఉన్నాయి. పశ్చిమ కనుమల్లో, ఈశాన్య భారతదేశంలో సతతహరిత అటవీ జీవావరణ వ్యవస్థ ఉండగా, ద్వీపకల్ప పీఠభూమిలో అధికభాగం ఆకురాల్చే అడవులతో కూడిన జీవావరణ వ్యవస్థ కనిపిస్తుంది. అలాగే హిమాలయాల్లో 1500 మీ. ఎత్తు నుంచి 3500 మీ. ఎత్తున పర్వతాలు శృంగాకార అటవీ బయలు ఉంటుంది.
2. గడ్డిభూముల జీవావరణ వ్యవస్థ: ద్వీపకల్ప పీఠభూములపై స్టెప్పీ రకానికి చెందిన (పొట్టిగడ్డి) గడ్డి భూములు కలిగి ఉండగా రాజస్థాన్ నుంచి అసోం వరకు గల శివాలిక్ దిగువన గల బాబర్ నేలలో సవన్నా రకానికి (పొడవైన గడ్డి) చెందిన గడ్డి భూములు కనిపిస్తాయి.
3. ఎడారి జీవావరణ వ్యవస్థ: రాజస్థాన్లోని థార్ ఎడారి ప్రాంతం ఈ వ్యవస్థను కలిగి ఉంది. ఎడారి ఆవరణ వ్యవస్థలో బాష్పోత్సేకాన్ని నిరోధించేలా ఉన్న చిన్న దళసరి ఆకులు లేదా ముళ్లు కలిగి ఉన్న గ్జిరాఫైట్ వర్గానికి చెందిన మొక్కలు ఆవరించి ఉన్నాయి.
ఖండ జీవావరణ వ్యవస్థ-సమస్యలు
-మానవ అవసరాలకు అడవులను విచక్షణారహితంగా నరికి వేయడం.
-గనుల తవ్వకానికి, జలవిద్యుత్ ప్రాజెక్టులకు అడవులను ప్రభుత్వమే వినియోగించుకోవడం
-గిరిజన బేస్ పోడు వ్యవసాయం, అడవుల కార్చిచ్చు వంటి చర్యల వల్ల కూడా ఖండ ఆవరణ వ్యవస్థ దెబ్బతింటుంది.
-వైద్య, ఆరోగ్య పరిశోధనలకు, అణు ప్రయోగాలకు అడవులను ఉపయోగించడం.
-భూములు, అటవీ ప్రాంతాలను అధిక వ్యవసాయ ఉత్పత్తులకు ఉపయోగించడం వల్ల భౌమ ఆవరణవ్యవస్థ నాశనమవుతుంది.
జలావరణ వ్యవస్థ
సముద్ర అంచు, అనేక సరస్సులు, నదులు కలిగి ఉన్న భారతదేశ జలావరణ వ్యవస్థ రెండు రకాలు..
1. సముద్ర జీవారణవ్యవస్థ: ప్రపంచంలోనే అతి విశాలమైన సముద్ర తీర అంచు కలిగి ఉన్నది భారతదేశం. 7516.4 కి.మీ. సముద్ర తీరం కలిగి ఉంది. అంతేకాకుండా అనుకూలమైన సముద్ర వాలు, మైదానం కలిగి ఉండి మంచి సముద్ర జీవావరణ వ్యవస్థను కలిగి ఉంది.
మంచినీటి జీవావరణ వ్యస్థ: గోదావరి, కృష్ణా వంటి నదులు మంచి ప్రవాహ జీవావరణ వ్యవస్థ కలిగి ఉన్నాయి. కొల్లేరు, చిల్కా వంటి సరస్సులు నిలకడ నీటి జీవావరణ వ్యవస్థలను కలిగి ఉన్నాయి. దేశంలో భూమి, జలావరణ వ్యవస్థలకు మధ్యస్తంగా తేమ, బురద, క్షారత్వాల వంటి విలక్షణమైన పరివర్తన జీవావరణ వ్యవస్థలు కూడా కలిగి ఉంది. ఇది మూడు రకాలు..
1. జీవావరణ వ్యవస్థ: నర్మద, తపతి నదుల ముఖద్వారాలు
2. డెల్టా జీవావరణ వ్యవస్థ: గోదావరి, కృష్ణా డెల్టాలు
3. లాగూన్స్ ఆవరణ వ్యవస్థ: పులికాట్, చిల్కా, వెంబనాడ్ లాంటి ప్రాంతాలు
జలావరణ వ్యవస్థ-సమస్యలు
-పరిశ్రమలు, నివాస ప్రాంతాల నుంచి విడుదలయ్యే ఘనపదర్థాలు, నదీ వ్యవస్థలను కాలుష్యానికి గురిచేస్తున్నాయి.
ఉదా: గంగ, కావేరి, మూసీ నదులు
-ఆక్వా కల్చర్, పిసి కల్చర్ లాంటి అభివృద్ధి ప్రాజెక్టుల వల్ల జలాశయాలు, సరస్సులు ఆక్రమణకు గురవుతున్నాయి.
ఉదా: కొల్లేరు సరస్సు
-నేల క్రమక్షయం వల్ల ఏర్పడిన అవక్షేపం జలాశయాల్లో నిలువ ఉండి నీటి నిలువ సామర్థ్యాలను కోల్పోతున్నాయి.
పర్యావరణం రెండు రకాలు. అవి..
1. భౌతిక పర్యావరణం: జీవరాశులకు ప్రధాన ఆధారమైన కాంతి, ఉష్ణం, గాలి, తేమ, నీరు, మట్టి, ఖనిజాలు, రసాయనాలు మొదలైనవి నిర్జీవ అంశాలు. ఇవి భౌతిక పర్యావరణానికి చెందినవి.
2. జీవపరమైన పర్యావరణం: ఇది ప్రాణమున్న పర్యావరణం. భూమిపై ఉన్న మానవులు, జంతువులు, పక్షులు, జలచరాలు, సూక్ష్మజీవులు, వృక్ష సంపద దీని అంతర్భాగాలు. వీటిని జీవ సంబంధమైన అంశాలు అంటారు. ఇవి జీవ పర్యావరణానికి చెందినవి.
-జీవ పర్యావరణానికి చెందిన మొక్కలు, జంతువులకు మధ్య సంబంధ బాంధవ్యాలతోపాటు ఈ రెండింటికీ భౌతిక పర్యావరణంతోగల సంబంధాల అధ్యయనమే జీవావరణ శాస్త్రం (ఎకాలజీ)గా నిర్వచిస్తున్నారు.
-ఒకటికంటే ఎక్కువ జీవసముదాయాలతో (ఒకటి కంటే ఎక్కువ జనాభాలను కలిగి ఉన్న నిర్దిష్ట భౌగోళిక ప్రాంతం) కూడిన ఉనికి, పరిమాణం, విస్తృతి, సాంద్రత వంటి నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాన్ని జీవావరణ వ్యవస్థ అంటారు. ఈ పదాన్ని 1935లో ఏజీ టాన్లే తొలిసారిగా ఉపయోగించారు.
జీవావరణ వ్యవస్థ నిర్మాణం
-ఆహారపు గొలుసును బట్టి వినియోగదారులు (పరపోషకాలు) రెండు రకాలు..
1. స్థూలవినియోగదారులు: పెద్ద పరిమాణంలో శరీరం కలిగిన జంతువులు మొక్కలపై ఆధారపడుతాయి. ఇవి మూడు రకాలు..
ఎ. ప్రాథమిక వినియోగదారులు: ఆకుపచ్చని మొక్కలను, మొక్కల భాగాలను నేరుగా ఆహారంగా తీసుకునే శాఖాహారులు.
ఉదా: ఆవులు, జింకలు, ఆహారపు గొలుసు ఏర్పాటులో ఇవి రెండో స్థానం.
బి. ద్వితీయ వినియోగదారులు: పై శాఖాహార జంతువులను ఆహారంగా తీసుకునే మాంసాహారులు. ఆహారపు గొలుసు ఏర్పడటంలో వీటిది మూడోస్థానం.
ఉదా: పాములు, పక్షులు, కుక్కలు, పిల్లులు మొదలైనవి. 1939లో ఎల్టన్ వీటిని కీ ఆఫ్ ఇండస్ట్రీ యానిమల్స్ అని వర్ణించాడు.
-కొన్ని ద్వితీయ వినియోగదారులు నేరుగా మొక్కల నుంచి లేదా ప్రాథమిక వినియోగదారుల నుంచి ఆహారాన్ని గ్రహిస్తాయి. వీటిని సర్వభక్షకాలు అంటారు. ఉదా: మానవుడు
-సూక్ష్మవినియోగదారులు: ఈ జీవులను సాధారణంగా విచ్ఛిన్నకారులు (Decorporers) లేదా ఆస్మోట్రాప్స్ (Osmotrepns) అంటారు. ఇవి చనిపోయిన జీవరాశులను విచ్ఛిన్నం చేసి తమ ఆహారాన్ని పొందుతూ అనేక లవణాలను నేలలోకి చేరుస్తాయి. దీని ఫలితంగా నేల సారవంతమవుతుంది.
ఉదా: పూతికాహార బ్యాక్టీరియా, శిలీంధ్రాలు మొదలైనవి.