విశాలాంధ్ర-తెలంగాణ అనుకూల వాదన
-379. తెలంగాణ తనంతట తాను స్వయంపోషకంగా మనగలుగుతుందనే భావన ఇక్కడి వారిలో ఉన్నది. ప్రస్తుత గణాంకాలను బట్టి చూస్తే ఈ ప్రాంత ఆదాయం 17 కోట్ల రూపాయలు (రాష్ర్టాల పునర్విభజన కమిటీ విచారణ సమయంలో). కృష్ణా, గోదావరి ప్రాజెక్టులపై పెట్టే పెట్టుబడి కొత్త రాష్ట్రంపై వడ్డీల రూపంలో కొంత భారం వేస్తున్నా.. తలెత్తే ఆర్థికలోటు తీర్చలేనంత పెద్దదేమీ కాదు. అనుకూలమైన పరిస్థితుల్లో రెవెన్యూ రాబడి అక్కడికక్కడే సరిపోయేదిగానో, కొంత మిగులుగానో ఉంటుంది. భవిష్యత్తును సానుకూల దృష్టితో అంచనా వేసినప్పుడు దీన్ని సమర్థించవచ్చు.
-380. ఏప్రిల్ 1952 నాటి ఆర్థిక సంఘం సూచనలను అమలు చేయడంవల్ల తెలంగాణ, హైదరాబాద్ ఎంతో లబ్ధిపొందడం అభివృద్ధికి ఒక ముఖ్య కారణంగా భావించాలి. ప్రస్తుతం అమలవుతున్న విధానంవల్ల, కేంద్ర ఆదాయపన్ను, సెంట్రల్ ఎక్సయిజ్ ఆదాయంలో పెరుగుదల ఉండే అవకాశం ఉన్నందున, తెలంగాణలో పరిస్థితులు మెరుగుపడుతున్నందున, పోలీసు శాఖపై చేస్తున్న వ్యయం తగ్గడంవల్ల జమకాబడేది అంతా కస్టమ్స్ పన్నులను రద్దు చేయడంవల్ల కలిగే లోటును సమానం చేస్తుంది. కొన్ని రాష్ట్ర విభాగాల్లో వచ్చే ఆదాయంలో కొంత వృద్ధి సాధించే అవకాశాలను కనిపెడితే తెలంగాణ ఆర్థిక స్థితిని గురించిన ఆందోళన ఉండనే ఉండదు.
హైదరాబాద్ రాష్ట్రం వాదనలు
-381. విశాలాంధ్ర ఏర్పాటువల్ల కలుగబోయే ప్రయోజనాలు స్పష్టమే. కృష్ణా-గోదావరి నదుల పరీవాహక ప్రాంతాలను ఏకీకృత నియంత్రణ కిందకు తీసుకురావాలనే ఆకాంక్ష ఆంధ్ర-తెలంగాణల మధ్య వాణిజ్య అనుబంధాలు, మొత్తం ప్రాంతానికి హైదరాబాద్ రాజధానిగా సరిపోతుందనే వాదనలు క్లుప్తంగా విశాల రాష్ర్టానికి అనుకూలమైనవి.
-382. విశాల రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా చాలా చెప్పుకోవచ్చు. ఆ లక్ష్యాన్ని నెరవేర్చడాన్ని అడ్డుకోవాల్సిన అవసరం లేదు. అదే సమయంలో, ఆంధ్రలో ప్రజాభిప్రాయం విశాల రాష్ర్టానికి ఎంతో అనుకూలంగా ఉన్నదనే ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. కానీ తెలంగాణలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఆంధ్రలో ప్రజాభిప్రాయానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారంతా తెలంగాణను ఆంధ్రతో విలీనం చేయడాన్ని స్వాగతిస్తున్నా, అది వాంఛనీయమైనప్పటికీ తెలంగాణ ప్రజలు మనస్ఫూర్తిగా, స్వచ్ఛందంగా తమ భవిష్యత్తు గురించి వారు నిర్ణయించుకునే దాని ఆధారంగా జరుగాలి.
-383. తెలంగాణ విశాలాంధ్రలో విలీనమైతే తెలంగాణ ప్రయోజనాలను కాపాడటానికి, చాలినన్ని రక్షణలు కల్పించడానికి ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర నాయకులు సిద్ధంగా ఉన్నారని మాకు అర్థమైంది. ఈ రక్షణలు గ్యారంటీ రూపంలో (రాయలసీమ, కోస్తాంధ్ర వారి మధ్య చేసుకున్న శ్రీబాగ్ ఒడంబడిక తరహా) తెలంగాణకు జనాభా నిష్పత్తి ప్రకారం ప్రభుత్వ సర్వీసుల్లో మూడింట ఒక వంతు ఉద్యోగావకాశాలు, ఈ ప్రాంతం సర్వతోముఖంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన ప్రణాళికపై ప్రత్యేక దృష్టి పెట్టడం వాటితో కూడి ఉండవచ్చు.
-384. ఈ ప్రతిపాదిత ఏర్పాట్ల వివరాలన్నీ మేం జాగ్రత్తగా పరిశీలించాం. ఈ శ్రీబాగ్ ఒడంబడిక తరహా గ్యారంటీలు కానీ, లేదా యునైటెడ్ కింగ్‌డమ్‌లోని స్కాటిష్ డివోల్యుషన్ వంటి రాజ్యాంగ సాధనాల ద్వారా గానీ, మార్పుచెందే దశలో తెలంగాణ అవసరాలు తీర్చడంలో ఇవేవీ పని చేయవు. తెలంగాణ ప్రత్యేక అవసరాలు తీర్చడానికి ఉద్దేశించిన వీటిపై కేంద్ర ప్రభుత్వ పూర్తి పర్యవేక్షణ లేకుంటే అవి పనిచేయజాలవు. తెలంగాణకు సంబంధించి అలాంటి ఏర్పాట్లు సూచించాలనే బాధ్యతను మాకు అప్పగించలేదు.
-385. ఇటీవలే ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రం మార్పుచెందే దశలో తలెత్తే ఒత్తిళ్ల నుంచి ఇంకా బయటపడలేదన్న విషయాన్ని మనం మరువరాదు. ఉదాహరణకు మద్రాసు రాష్ట్రం నుంచి విభజించడం ద్వారా ఉత్పన్నమైన సమస్యలను ఇంకా పూర్తిగా పరిష్కరించలేదు. భూ సంస్కరణలకు సంబంధించిన విధానాన్ని ఇంకా రూపొందించుకోవాల్సి ఉన్నది. ఈ సమయంలో తెలంగాణ ఆంధ్రతో విలీనం కావడంవల్ల ఆంధ్రకు, తెలంగాణకు పరిపాలనా సంబంధమైన ఇబ్బందులు ఏర్పడుతాయి.
-386. ఈ విధమైన కారణాలన్నింటిని పరిగణలోకి తీసుకు న్న తర్వాత ఆంధ్ర, తెలంగాణల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని, మేం అంతిమ నిర్ణయానికి వచ్చాం. ఈ రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రంగా పిలవబడుతుంది. 1961లో అవశేష హైదరాబాద్ రాష్ర్టానికి జరిగే సాధారణ ఎన్నికల్లో గెలిచిన శాసనసభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది ఆంధ్ర రాష్ట్రంతో విలీనానికి అంగీకరిస్తే… అప్పుడు విలీనం చేయడానికి వెసులుబాటు కల్పిస్తున్నాం.
-పేజీ 387.. ఈ ఏర్పాటు వలన ప్రయోజనమేమిటంటే, ఆంధ్రతో ఏకీకరణన అనే లక్ష్యాన్ని వదిలివేయలేదు లేదా నిరాకరించలేదు. రాబోయే ఐదేండ్లలో ఏకీకరణ లక్ష్యం దిశగా ఈ రెండు ప్రభుత్వాలు తమ పాలనా యంత్రాంగాన్ని స్థిరపర్చుకుంటాయి. సాధ్యమైతే తమతమ భూమిశిస్తు వ్యవస్థ (ల్యాండ్ రెవెన్యూ సిస్టం)ను సమీక్షించుకుంటాయి. ఈ ఐదేండ్లు మధ్యకాలం ఏకాభిప్రాయ సాధనకు, భయసందేహాల నివృత్తికి ఒక అవకాశాన్ని కల్పిస్తుంది.
-పేజీ 388.. ఆంధ్ర, తెలంగాణకు గల ఉమ్మడి ప్రయోజనాలే ఈ రెండు ప్రాంతాల ప్రజల మధ్య సయోధ్యకు కారణమవుతాయి. ఒక వేళ మేము ఆశించినట్లుగా ఏకీకరణకు అవసరమైన వాతావరణం అభివృద్ధి చెందనట్లయితే, తెలంగాణలో ప్రజాభిప్రాయం ఏకీకరణకు వ్యతిరేకంగా స్పష్టమైతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగానే కొనసాగుతుంది.
-ప్రస్తుతం ఏర్పడే హైదరాబాద్ రాష్ట్రం మహాబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్,( ఖమ్మంతో కలిపి) కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, మెదక్‌తోపాటు బీదర్, ప్రస్తుత ఆంధ్రరాష్ట్రపు కృష్ణా జిల్లాలోని మునగాల పరగణాలతో నల్గొండ జిల్లాతో కలిసి ఏర్పాటు చేయడబడుతుంది.
-చాందా జిల్లాలోని సిరోంచ తహసిల్‌లో 51.2 శాతం ప్రజలు తెలుగు మాట్లాడే వారున్నా, తెలంగాణకు ఆనుకోని ఉన్నందున విశాలాంధ్రలో కలపాలని కోరినా ఈ తహాసిల్ను ఇప్పుడున్నట్లే యధాతథంగా ఉంచాలని భావించాము. హైదరాబాద్ రాష్ట్రంలో సిరోంచను చేర్చడం లేదన్నారు.
-బీదర్‌లో ప్రజలు 39 శాతం మరాఠీ, 28 శాతం కన్నడ, 16 శాతం ఉర్ధూ, 15 శాతం తెలుగు మాట్లాడతారు. కానీ ప్రస్తుతం ఈ జిల్లాకు తెలంగాణలో హైదరాబాద్‌తో పరిపాలన పరంగా ఉన్న సంబంధాలు, సౌలభ్యం దృష్ట్యా బీదర్ జిల్లాను హైదరాబాద్ రాష్ట్రంలో కొనసాగించాలని భావించామన్నారు. ఈ జిల్లాలో ప్రవహించే మంజీరా నది మెదక్ జిల్లాలో వినియోగించబడుతుందన్నారు. ఈ జిల్లాలో మరాఠీ మాట్లాడే ప్రజలుండే తాలూకాలు రైలు మార్గం ద్వారా, కన్నడ భాష మాట్లాడే ప్రజలున్న తాలూకాలు జాతీయ రహదారి ద్వారా హైదరాబాద్‌కు సంధానమై ఉన్నాయని జిల్లాలోని కన్నడ ప్రాంతాలు మైసూర్, బెంగుళూర్‌లకు దూరంగా ఉన్నాయని, మరాఠీ ప్రాంతాలు బొంబాయికి దూరంగా ఉన్నాయని పేర్కొన్నారు. బీదర్ జిల్లాను హైదరాబాద్‌లో చేర్చడానికి గల కారణాలను సుధీర్ఘంగా వివరించారు. హైదరాబాద్ రాష్ట్రం 45,300 చదరపు మైళ్ల విస్తిర్ణంతో, కోటీ ముప్పయి లక్షల జనాభాతో ఉంటుందన్నారు.
విశ్లేషణ
-ఈ స్టేట్స్ రీఆర్గనైజేషన్ సిఫార్సులను నిశితంగా పరిశీలిస్తే తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రతో ఐక్యం చేస్తే ఏర్పడగల పరిణామాలను ఎస్సార్సీ సభ్యులు ఎంతో జాగ్రత్తతో అంచనా వేసినట్లు స్పష్టమవుతుంది. నదీ జలాల విషయంలోను, నిధుల విషయాలలో, ఉద్యోగాల విషయంలో తెలంగాణ ప్రజల భయాందోళనలు సరైనవేనని కమిషన్ గుర్తించినట్లు కన్పిస్తుంది. అదే సమయంలో ఆంధ్ర ప్రాంత నేతల వ్యవహారశైలిని కూడ సరిగ్గానే అంచనా వేసినట్లు స్పష్టమవుతున్నది. శ్రీబాగ్ తరహా లేదా స్కాటిష్ డోవోల్యుషన్ వంటివి ఏవీ అమలు జరిగే అవకాశమే లేదని కమిషన్ నిర్మోహమాటంగా చెప్పింది. కేంద్రపర్యవేక్షణలో ఉంటే తప్ప ఉపయోగం ఉండదని తేల్చింది.
-హైదరాబాద్ రాష్ట్ర ఏర్పాటును ప్రకటిస్తూ, ఐదేళ్ల తర్వాత జరిగే ఎన్నికల ద్వారా ఏర్పాటయ్యే శాసనసభలో మూడింట రెండువంతుల శాసనసభ్యులు అంగీకరిస్తేనే తెలంగాణను ఆంధ్రతో ఐక్యం చేయాలన్నారు. అలా కుదరకపోతే (తెలంగాణ ప్రాంతం) హైదరాబాద్ రాష్ట్రం అలాగే కొనసాగుతుందన్నారు.
-హైదరాబాద్ రాష్ట్రం విషయంలో కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని పరిశీలిస్తే కేవలం భాషనే ప్రాతిపదికగా తీసుకోలేదని స్పష్టమవుతుంది. భాషతో పాటు పరిపాలన సౌలభ్యాన్ని, ఆర్థికస్థితిని, భౌగోళిక పరిస్థితిని, నదుల గమనాన్ని, సంస్కృతిని ఇలా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్నారు. ఎస్సార్సీ నివేదికను 1955 సెప్టెంబర్ 30న ప్రభుత్వానికి సమర్పించగా, 1955 అక్టోబర్ 10న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్, ప్రజల ముందుంచింది. స్టేట్స్ రీ ఆర్గనైజేషన్ కమిషన్ సిఫార్సులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరిన వారిని సంతృప్తి పరిస్తే, విశాలాంధ్ర కోరుకున్న వారిని అసంతృప్తికి, అశాంతికి గురిచేసింది. 1956, ఆగస్టు 31న రాష్ట్రపతి ఎస్సార్సీ నివేదికను ఆమోదించారు.
ఎస్సార్సీ సిఫార్సులపై వివిధ నాయకుల అభిప్రాయాలు
-బెజవాడ గోపాల్‌రెడ్డి, ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి: వెంటనే విశాలాంధ్ర నిర్మాణం జరగలేదన్న ఉద్రేకానికి లోనుకాక, కమిషన్ సిఫార్సులను స్థూలంగా ఆమోదించాలని ఆంధ్రప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను (కోయంబత్తూర్ సభలో, 1955, అక్టోబర్ 11న).
-నీలం సంజీవరెడ్డి-ఆంధ్రరాష్ట్ర ఉపముఖ్యమంత్రి: విశాలాంధ్ర నిర్మాణానికి ఆరు సంవత్సరాల వ్యవధి ఇచ్చినపుడు విశాలాంధ్రకు అడ్డురాగల ధోరణిలో ఉన్న వర్గాలు బలపడగలవు. కనుక ఇప్పటి లెజిస్లేచర్ సభ్యులకు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ విశాలాంధ్ర సమస్యను నిర్ణయించే అవకాశమివ్వడం మంచిదని భావిస్తున్నా.
-మర్రి చెన్నారెడ్డి, హైదరాబాద్ రాష్ట్రమంత్రి: తెలంగాణను ఆంధ్రలో విలీనం చేయడం వలన తెలంగాణకు ఎట్టి ప్రయోజనం కలుగదు. లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉన్నాయి.(గోల్కొండ పత్రిక, 1955, నవంబర్ 27)
-కేవీ రంగారెడ్డి, హైదరాబాద్ రాష్ట్రమంత్రి: తెలంగాణ ప్రత్యేక రాష్ర్టాన్ని సిఫారసు చేసిన రాష్ట్ర పునర్విభజన కమిషన్ ఎంతో రాజకీయ చతురతను, దూరదృష్టిని చూపించింది.
-అయ్యదేవర కాళేశ్వరరావు, విశాలాంధ్ర మహాసభ అధ్యక్షులు: సత్వరం విశాలాంధ్ర నిర్మాణాన్ని సిఫారసు చేయకుండా ఫజల్ అలీ కమిషన్ ఆంధ్రులకు పెద్ద అన్యాయం చేసింది. సత్వరమే విశాలాంధ్ర నిర్మాణం కోరుతూ తెలంగాణ శాసనసభ్యులు అధిక సంఖ్యలో కమిషన్ ముందు సాక్ష్యం చెప్పిఉన్నందున మళ్లీ తెలంగాణ ప్రతినిధుల నిర్ణయం జరగవలసిన అవసరం లేదు. ఏ పరిస్థితులలోనూ విశాలాంధ్ర అవతరణ వాయిదా పడరాదు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు