నిశ్శబ్దమొక శక్తిమంతమైన శతఘ్ని, చల్లారని నిప్పు
బీఎన్ శాస్త్రి
-ఈయన పూర్తిపేరు భిన్నూరి నర్సింహశాస్త్రి. నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామంలో 1932లో జన్మించారు. స్వస్థలం వలిగొండ గ్రామం. కవి, రచయిత, ప్రజ్ఞను ప్రదర్శించారు. చారిత్రక పరిశోధకునిగా గుర్తింపు పొందారు. నిద్రాహారాలు మాని ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా చరిత్ర రచన కోసం కృషి చేశారు. మంచి రచయితే కాకుం డా తెలంగాణ గర్వించదగ్గ గొప్ప పరిశోధకుడు. 9వ తరగతిలోనే సంధ్యారాగం అనే నవల రాశారు.
-ఇతర రచనలు: 1) గేయ కావ్యాలు: తపోభంగం, పాపాయి పతకం 2) నవలలు: రాధాజీవనం, తీరని కోరిక, వాకాటక మహాదేవి, విప్లవ జ్వాల 3) పులిజాల వెంకటరంగారావు జీవిత చరిత్ర 4) కాశీఖండం దాని ప్రాశస్త్యం (సాహిత్య విమర్శ), 5) ఆంధ్రదేశ చరిత్ర- సంస్కృతి (3 భాగాలు) 6) భారతదేశ చరిత్ర-సంస్కృతి (21 సంపుటాలు) 7) నల్లగొండ, ఆదిలాబాద్, మహబూబ్నగర్ జిల్లాల సర్వస్వాలు 8) రెడ్డి రాజ్య, బ్రాహ్మణ రాజ్య సర్వస్వాలు 9) 12 శాసన సంపుటాలు 10) శాసన సాహిత్యంలో తెలుగు భాషా వికాసం (పీహెచ్డీ పరిశోధన గ్రంథం) మొదలైనవి.
-తన పరిశోధన ద్వారా ఆదికవి నన్నయ కాదు నన్నెచోడుడు అని నిరూపించారు. విష్ణుకుండినుల రాజధాని గుంటూరు ప్రాంతం కాదని, నల్లగొండ జిల్లాలోని తుమ్మలగూడె ప్రాంతం (ఇంద్రపాలనగరం) అని తేల్చి చెప్పారు. బృహత్కథను రచించిన గుణాఢ్యుడు మెదక్ జిల్లా కొండాపురం నివాసి అని నిర్ధారించారు. మూసీ పత్రికను స్థాపించి, దీని ద్వారా ఎన్నో చారిత్రక, సాంస్కృతిక పరిశోధనలకు సంబంధించిన వ్యాసాలను వెలువరించారు. 1997లో తెలుగు విశ్వవిద్యాలయం వారి విశిష్ట పురస్కారం లభించింది. వీరు వెలువరించిన శాసన సంపుటాల్లో కొన్ని త్రిపురాంతక దేవాలయ శాసనాలు, కందూరు చోడుల శాసనాలు, చరిత్ర-సంస్కృతి, గోల్కొండ చరిత్ర-సంస్కృతి, శాసనాలు, రేచర్లరెడ్డి వంశ చరిత్ర-శాసనాలు, వేములవాడ చరిత్ర-శాసనాలు, మల్యాల వంశ చరిత్ర-శాసనాలు, ముఖలింగ దేవాలయ శాసనాలు, రేచర్ల పద్మ నాయకులు మొదలైనవి.
ముకురాల రామారెడ్డి
-మహబూబ్నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు. కవి, రచయిత. మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి సమీపంలోని ముకురాల గ్రామంలో 1929 జనవరి 1న జన్మించారు. 1947 నుంచి 1948 వరకు నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. తెలుగులో ప్రాచీన కవుల సృజనాత్మక ప్రతిభ అనే అంశంపై పరిశోధన చేసి పీహెచ్డీ పట్టా పొందారు. తెలుగు అకాడమీ ఉపసంచాలకులుగా పనిచేశారు. దుందుభి అనే మాసపత్రికకు సంపాదకత్వం వహించారు. ఆంధ్రసారస్వత పరిషత్తు, తెలంగాణ రచయితల సంఘం, విజ్ఞానవర్ధని పరిషత్ మొదలైన సంస్థల్లో చురుకుగా పాల్గొన్నారు.
ఆయన రచించిన విడిజోడు కథకు కృష్ణా పత్రిక కథల పోటీలో ద్వితీయ బహుమతి లభించింది. 1988 ఆంధ్రజ్యోతి దీపావళి సంచికలో ఆయన రచించిన క్షణకోపం కోపక్షణం అనే కథను ప్రచురించారు. ఆకాశవాణి ఢిల్లీవారు ఆంధ్రప్రదేశ్ నుంచి 1976లో జాతీయకవిగా గుర్తింపునిచ్చి సన్మానం చేశారు. 2003 ఫిబ్రవరి 24న మరణించారు.
-రచనలు: దేవరకొండ దుర్గం, నవ్వేకత్తులు (దీర్ఘ కవిత), హృదయ శైలి (గేయ సంపుటి), మేఘదూత్ (అనువాద కవిత్వం), రాక్షస జాతర (దీర్ఘ కవిత), ఉపరిశోధన (పరిశోధనా పత్రాల సంకలనం), తెలుగు సాహిత్య నిఘంటువు, ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం (సిద్ధాంత గ్రంథం), తెలుగు ఉన్నత వాచకం (సంపాదకత్వం) మొదలైనవి.
ఇరివెంటి కృష్ణమూర్తి
-తెలంగాణ ప్రాంతానికి చెందిన తొలితరం కథారచయితల్లో ఈయన ఒకరు. మహబూబ్నగర్ జిల్లాలో 1930 జూలై 12న జన్మించారు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి జైలుకెళ్లారు. యువ భారతి సాహిత్య సంస్థకు అధ్యక్షులుగా ఉండి తెలంగాణ సాహిత్య వికాసానికి కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ కార్యదర్శిగా, ఆంధ్ర సారస్వత పరిషత్తు కార్యదర్శిగా ఉంటూ సాహిత్య లోకానికి ఎనలేని సేవ చేశారు. సంస్కృతాంధ్ర ఉర్దూ భాషల్లో ప్రావీణ్యముంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి సీ నారాయణరెడ్డి పర్యవేక్షణలో కవి సమయాలు అనే అంశంపై పరిశోధన చేసి పీహెచ్డీ పట్టాపొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఆచార్యులుగా పనిచేసి ఉద్యోగ విమరణ చేశారు. 1989 ఏప్రిల్ 26న మరణించారు.
-రచనలు: వెలుగు చూపే తెలుగు పద్యాలు (బాల సాహిత్యం), దేశమును ప్రేమించుమన్న (బాల సాహిత్యం), లక్ష్మణుడు (బాల సాహిత్యం), వీచికలు (కవితా సంకలనం – మరో ముగ్గురు కవులతో కలిసి), కవి సమయాలు (పరిశోధన గ్రంథం), దశరూపక సందర్శనం, భావన (సుభాషితాల సంకలనం), ఇరివెంటి వ్యాసాలు, తెలుగు-ఉత్తర భారత సాహిత్యాలు, చాటువులు, వాగ్భూషణం భూషణం, వేగుచుక్కలు, వెలుగు బాటలు, అడుగు జాడలు మొదలైనవి. పఠనీయం శీర్షికతో 39 ఉత్తమ గ్రంథాల పరిచయాలు రాశారు.
వేముగంటి నర్సింహాచార్యులు
-మెదక్ జిల్లా సిద్దిపేటలో 1930 జూన్ 30న జన్మించారు. తల్లిదండ్రులు రామక్క, రంగాచార్యులు. సాహితీ వికాస మండలి సంస్థను, మెదక్ జిల్లా రచయితల సంఘాన్ని స్థాపించి సాహిత్య వికాసానికి కృషిచేశారు. ఆయన సుమారు 40 పుస్తకాలు రాశారు. తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. కవికోకిల, కావ్యకళానిధి, విద్వత్కవి ఆయన బిరుదులు. 2005 అక్టోబర్ 29న మరణించారు.
-రచనలు: వ్యాస కలాపం, పురుషకారం, శ్రీరామానుజతారావళి, ప్రబోధం, అమరజీవి బాపూజీ, కవితాంజలి, నవమాలిక, తిక్కన, వీరపూజ, మణికింకిణి, జీవన స్వరాలు, వేంకటేశ్వరోదాహరణం, తెలుగు బాలనీతి, మంజీర నాదాలు, బాల గేయాలు, కవితా సింధూరం, గణేశోదాహరణం, వివేక విజయం, అక్షర దీపాలు, భక్త రామదాసు, భావ తరంగిణి, వేముగంటి మాట మొదలైనవి. ఎంత చల్లని దానవే మంజీర ఎంత తీయని దానవే అంటూ మంజీర నది జలాల గొప్పతనం గురించి ఆయన రాసిన గేయం ప్రసిద్ధి.
అనుమాండ్ల భూమయ్య
-కవి, పరిశోధకుడు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్టు గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు శాంతమ్మ, లక్ష్మయ్య. 1980లో కాకతీయ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ పూర్తిచేసి, అదే విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేశారు. తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా కూడా పనిచేశారు.
-రచనలు: వేయి పడగలు-ఆధునిక ఇతిహాసం, అష్టాదశ పురాణాలు, వేయి నదుల వెలుగు, మాలపల్లి, అగ్నివృక్షం, చలువ పందిరి, తెలుగు నందనం, ఆంధ్ర పురాణం-భారతీయ సంస్కృతీ వైభవం, జ్వలిత కౌసల్య, వెలుగు నగల హంస, అష్టావక్రగీత, ఆధునిక కవిత్వంలో దాంపత్యం, అంతర్వీక్షణం, కొరవి గోపరాజు సాహిత్య విశ్లేషణ, నాయని సుబ్బారావు కృతుల పరిశీలన, పంచవటి, వ్యాస భూమి, ఆనందగీతాలు, సౌందర్యలహరి (గీతాల సీడీ) మొదలైనవి.
-పురస్కారాలు: వేయి నదుల వెలుగు పద్య కావ్యానికి ఉత్తమ పద్యకావ్యంగా గరికపాటి సాహిత్య పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం.
లింగంపల్లి రామచంద్ర
-సుప్రసిద్ధ కవి, పరిశోధకులు, విమర్శకులు. ఈయన వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం వెల్ది గ్రామంలో 1945 జనవరి 1న జన్మించారు. తల్లిదండ్రులు శ్రీలక్ష్మి, రత్నయ్య. స్వగ్రామం వెల్ది వాల్మీకి తాత్కాలిక ఆశ్రమస్థలిగా, బౌద్ధాచార్య నాగార్జునుని జన్మస్థలంగా ప్రసిద్ధిగాంచింది. ప్రస్తుతం ఈయన నల్లగొండ జిల్లా ఆలేరు సమీపాన గల గుండ్లగూడెంలో నివసిస్తున్నారు. గుండ్లగూడెం ఉన్నత పాఠశాలలో సుదీర్ఘకాలం ఉపాధ్యాయులుగా పనిచేసి 2002 డిసెంబర్లో ఉద్యోగ విమరణ చేశారు. శ్రీరంగరాజు కేశవరావు సాహిత్యం-పరిశీలన అనే అంశంపై పరిశోధన చేసి కాకతీయ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా పొందారు.
అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా, అధికార భాషాసంఘం సభ్యులుగా పనిచేశారు.
-రచనలు: ఆత్మ అక్షరమైన వేళ, ఎప్పుడూ వసంతానివే, అమ్మ పిలుస్తోంది, ఆమనిలో వెన్నెల కోయిల, ఆకాశం నా సంతకం, గదిలో నక్షత్రం, మరో ఉదయాన్ని పిలుస్తా, తూర్పుతీరం మొదలైనవి కవితాసంపుటాలు. సినారె కవితాలోకనం, సినారె వాక్కుకు వయసు లేదు తత్వ విశ్లేషణ అనే వ్యాస సంపుటాలు, శ్రీరంగరాజు కేశవరావు సాహిత్యం-పరిశీలన (సిద్ధాంత గ్రంథం), వాల్మీకి సంతకం వెల్ది, జనగామ ప్రాంత సాహితీమూర్తులు, వ్యాసవాహిని మొదలైనవి.
-బిరుదులు: కవిసౌజన్య, వ్యాసాల వ్యాసుడు, సుకవి భూషణం, ఆదర్శ కవి, మహోపాధ్యాయ, మధురకవి, భువన భారతీభూషణ మొదలైనవి.
-పురస్కారాలు: రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, బీఎన్ రెడ్డి సాహితీ పురస్కారం, ఆచార్య తిరుమల సాహితీ పురస్కారం, తేజ జీవిత సాఫల్య పురస్కారం మొదలైనవి.
వేణు సంకోజు
అసలు పేరు సంకోజు యాదగిరి. 1951 జనవరి 1న నల్లగొండ జిల్లా చండూరు గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు శాంభవి, వీరబ్రహ్మం. విద్యాభ్యాసం సికింద్రాబాద్, హైదరాబాద్లో పూర్తిచేశారు. తెలుగు నవలల్లో చిత్రితమైన రాజ్యం-రాజ్యాంగ యంత్రం అనే అంశంపై పరిశోధన చేసి అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఫిల్ పట్టా పొందారు.
రచనలు
-కవితా సంకలనాలు: మనిషిగా పూచేమట్టి, మనం, నేలకల, ప్రాణపదమైన
-స్పర్శ (కథాసంపుటి)
-సుద్దాల హన్మంతు జీవిత చరిత్ర
-పీఠికలు
-సంపాదకత్వం: చలనం, వీర తెలంగాణ, ప్రజల పక్షాన ప్రతిజ్ఞ (శ్రీశ్రీ శతజయంతి సంచిక)
-కాళోజీ ఉత్సవ్ (కాళోజీ శతజయంతి సందర్భంగా)
-మరో కొత్తవంతెన ఏక్ ఔర్ నయాపూల్ (ఆధునిక తెలుగు ఉర్దూ సాహిత్యాల్లో తొలి ద్విభాషా కవితాసంకలనం)
-మజర్ మెహదీ ఉర్దూ కవితలకు తెలుగు అనువాదం మొదలైనవి.
నిర్వహించిన సంస్థలు
-1985లో జయమిత్ర సాహితీ సంస్థను స్థాపించి అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 100 పుస్తకాలను ప్రచురించటమేకాకుండా 150 పుస్తకాలను ఆవిష్కరించారు. శ్రీశ్రీ, కాళోజీల శతజయంతి సందర్భంగా నల్లగొండలో నెలనెలా సాహి త్య కార్యక్రమాలను నిర్వహిం చి వారికి ఘన నివాళి అర్పించారు. 2001లో తెలంగాణ రచయితల వేదికను స్థాపించి నందిని సిధారెడ్డి, ఆయన అధ్యక్ష, కార్యదర్శులుగా ఆరేండ్లు పనిచేసి తెలంగాణ అస్థిత్వం కోసం ఎన్నో సాహిత్య కార్యక్రమాలను నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో పొలిటికల్ జేఏసీ జిల్లా అధికార ప్రతినిధిగా ఉంటూ జిల్లా ప్రజలను ఉద్యమంలో పాల్గొనేటట్లు చేయడంలో కీలకపాత్ర పోషించారు.
పురస్కారాలు
-మనం కవితా సంకలనానికి 2002లో తెలుగు యూనివర్సిటీ పురస్కారం, సాహిత్య గౌతమి కరీంనగర్ వారిచే పురస్కారం, పలు సాహిత్య సంస్థలచే జీవన సాఫల్య పురస్కారం మొదలైనవి. ఆయన కథలపై పచ్చమట్ల రాజశేఖర్ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పరిశోధనచేసి ఎంఫిల్ పట్టా పొందారు. ఆయన సమగ్ర రచనలపై ద్రవిడ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేస్తున్నారు.
సుప్రసిద్ధ కవితాపంక్తులు
-సముద్రమై పొంగిపొరలుతూనే నేను దాహంలో ఉన్నాను దుఃఖాన్ని తాగుతానుకనుకనే, నిలిచి గెలుస్తూ ఉన్నాను (అన్వేషణ)
-నిశ్శబ్దమొక శక్తిమంతమైన శతఘ్ని, చల్లారని నిప్పు – ఒక బతుకు శావస (బతుకు శ్వాస).
మాదిరి ప్రశ్నలు
1. కిందివాటిలో బీఎన్ శాస్త్రి రచించిన నవల?
1) రాధా జీవనం 2) తీరని కోరిక
3) విప్లవ జ్వాల 4) పైవన్నీ
2. దేవరకొండ దుర్గం కావ్య రచయిత?
1) ముకురాల రామారెడ్డి
2) ముదిగొండ వీరభద్రయ్య
3) బీఎన్ శాస్త్రి 4) కపిలవాయి లింగమూర్తి
3. ఇరివెంటి కృష్ణమూర్తి రచించిన పరిశోధన గ్రంథం?
1) వేగుచుక్కలు 2) వెలుగు బాటలు
3) కవి సమయం 4) అడుగు జాడలు
4. మంజీర నాదాలు గేయ కావ్యం రచయిత?
1) ముకురాల రామారెడ్డి
2) వేముగంటి నర్సింహాచార్యులు
3) లింగంపల్లి రామచంద్ర
4) దాశరథి కృష్ణమాచార్యులు
5. వేయి నదుల వెలుగు పద్యకావ్యం రచయిత?
1) పేర్వారం జగన్నాథం
2) కోవెల సుప్రసన్నాచార్య
3) అనుమాండ్ల భూమయ్య
4) వేణు సంకోజు
6. వేణు సంకోజు రచించిన కథా సంపుటి?
1) స్పర్శ 2) నేల కల
3) ప్రాణపదమైన 4) మనం
జవాబులు: 1-4, 2-1, 3-3, 4-2, 5-3, 6-1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు