Telangana History | హక్కుల రణ నినాదాలు.. గిరిజన తిరుగుబాట్లు
దేశంలో వ్యవసాయాధారిత మైదాన ప్రాంత ప్రజల జీవన విధానం, అటవీ వనరుల-పోడు వ్యవసాయాధారిత గిరిజన ప్రజల జీవన విధానంలో కొంతమేరకు వైరుధ్యమున్నప్పటికీ, భూస్వాములకు, వడ్డీవ్యాపారులకు రెవెన్యూ, అటవీ అధికారుల ఆగడాలకు, పోలీసులకు, చివరికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పై రెండు వర్గాల ప్రజలు లేవనెత్తిన తిరుగుబాట్లు మాత్రం చాలా దగ్గర పోలికను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా 1778 నుంచి 1971 వరకు దేశం మొత్తంలో దాదాపు 200 గిరిజన, రైతాంగ పోరాటాలు జరిగాయి. ఇందులో గిరిజనుల స్వపరిపాలనకు జీవన విధానాలకు, అస్తిత్వానికి ఆటంకాలు కల్పించిన బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని జరిగితే, నిరంకుశ భూస్వామ్య విధానానికి, సంస్థనాధీశుల ఆగడాలకు, వెట్టిచాకిరీ, హద్దు మీరిన దోపిడీ అణచివేతలకు వ్యతిరేకంగా మరికొన్ని జరిగాయి.
తెలంగాణ చరిత్ర
- ప్రధానంగా దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ సంస్థానంలో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన గిరిజన రైతాంగ సాయుధ పోరాటాలు చెప్పుకోదగినవి.
రామ్‌జీ గోండు ఉద్యమం -1857-60
కుమ్రంభీం ప్రతిఘటనోద్యమం-1938-40
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం – 1946-51 - 1857-60 సంవత్సరాల మధ్య ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ ప్రాంతంలో రామ్‌జీ గోండు, హాజీరోహిల్లా నాయకత్వంలో దాదాపు 300 మంది గిరిజన గోండు ప్రజలు, 200 మంది రోహిల్లా ముస్లింలు, మరికొంత మంది మరాఠా, తెలుగు ప్రజలు తమ ప్రాంత విముక్తి కోసం బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాన్ని లేవనెత్తారు.
- 1879-80 సంవత్సరాల మధ్య భద్రాచలం-రేకపల్లి అటవీప్రాంతంలో నాయక్‌పోడు -కోలాం, ఇతర గిరిజనుల ఉమ్మడి నాయకత్వంలో అటవీ చట్టాలకు విరుద్ధంగా పోడు వ్యవసాయంపై మూడు రెట్లు అధిక పన్నులు విధించి వసూలు చేస్తున్న ప్రభుత్వానికి, అటవీ అధికారులకు వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది.
- 1915-16లో భద్రాచలం-పశ్చిమగోదావరి సరిహద్దున గల పాపికొండల అడవిప్రాంతంలో కొండారెడ్లు అనే గిరిజనులు, గిరిజనేతర షావుకార్ల దోపిడీకి అటవీ అధికారులకు, వారికి సహకరించిన పోలీసులకు, వాళ్లందరినీ పురమాయించిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం చేశారు.
- 1938-40 మధ్య ఆదిలాబాద్ జిల్లా- ఆసిఫాబాద్, జోడేఘాట్, బాబేఝరీ అటవీ ప్రాంతంలో దాదాపుగా 1000 మంది గోండు, కొలాం తదితర గిరిజన ప్రజల సహాయ సహకారంతో కుమ్రంభీం ‘జల్- జంగల్-జమీన్’ అనే నినాదంతో తమ హక్కుల కోసం 12 గిరిజన గ్రామాల్లో ‘మావెనాట్-మావెరాజ్’ అనే స్వతంత్ర అధికారం కోసం నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాన్ని సాగించాడు. 1946-51 మధ్య హైదారాబాద్ నిజాం రాజ్యంలోని తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టుల నాయకత్వంలో ‘భూమి-భుక్తి-విముక్తి’ అనే నినాదంతో నిరంకుశమైన నిజాం ప్రభుత్వ భూస్వామ్య దోపిడీ అణచివేత విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల సారథ్యంలో చరిత్రాత్మకమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది.
గిరిజనులు – అటవీ చట్టాలు
- గిరిజనులు ఎక్కడ జీవించినా అడవులతో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉండటమే గాకుండా చారిత్రక కారణాల వల్ల కూడా వారి మొత్తం మనుగడ అడవితో ముడిపడి ఉంటుంది. అడవుల ఆర్థిక విధానమంటే గిరిజనుల ఆర్థిక విధానమనే ఏకాభిప్రాయం ఉండేది. కానీ నిజానికి అది భిన్నమైంది. గిరిజనుల మతపరమైన విషయాలు కూడా అడవితోనే ముడిపడి ఉంటాయి. ప్రకృతి ఆరాధనలో భాగంగా జంతువులను, చెట్లను పూజించేవారు. గిరిజన ప్రజలు గొప్ప ఐకమత్యాన్ని కలిగి ఉంటారు. అయితే ప్రభుత్వం 19వ శతాబ్దం మధ్య కాలంలో జంతుజీవనం, వృక్షసంపద ప్రాముఖ్యతతోపాటు నేల, తేమ, వర్షపాతం తదితర అంశాలను గుర్తించింది. అప్పటి వరకు నిర్లక్ష్యానికి గురైన రాజ్యభాగాలకు ప్రభుత్వాధికారాలను విస్తరించింది. అడవులను సంరక్షించడానికి ప్రభుత్వం ఎంచుకున్న వివిధ పద్ధతులతోపాటు కొన్ని అటవీ చట్టాలు కూడా తీసుకువచ్చింది.
బ్రిటిష్ ఇండియా – అటవీ చట్టాలు
- 1865 మొదటి అటవీ చట్టం
- స్థానిక గిరిజనులు అటవీ ఉత్పత్తులను ఇతరులు సేకరించడాన్ని నియంత్రించే దిశగా ఈ చట్టం మొదటి ప్రయత్నం చేసింది. ఈ పద్ధతిలో సమాజ ఆమోదంతో గిరిజనుల సంపదను దోచుకుంటున్న మైదాన ప్రాంత ప్రజల ఆగడాలకు ఈ చట్టం ద్వారా అడ్డుకట్ట వేశారు.
1878 అటవీ చట్టం - అడవులపై రాజ్యం తన అధికారాన్ని విస్తరింపజేసే దిశగా జరిగిన రెండో ప్రభుత్వమే 1870 చట్టం అడవుల్లోకి చొరబడటం, పశువులను మేపడం వంటి చర్యలను నిషేధించి అడవులపై ప్రభుత్వ నియంత్రణను మరింత కఠినం చేయడంతోపాటు పై రెండు చర్యలను 1878 అటవీ చట్టం ద్వారా ప్రభుత్వం నేరాలుగా ప్రకటించింది.
1894 మొదటి అటవీ విధానం
- దీని వల్ల మొదటిసారి అడవి నుంచి ప్రయోజనాలను పొందేవారి విశేషాధికారాలపై నిబంధనలు విధించడం. అడవిపై హక్కులను నియంత్రించడం వంటి విషయాలకు ఒక రూపం తీసుకువచ్చింది. ఈ నియమ నిబంధనలు సాధారణ ప్రజలు అడవుల నుంచి పొందుతున్న ప్రయోజనాలను నియంత్రించగలిగాయి. కేవలం 1894లో మాత్రమే అటవీ అధికారులు ప్రత్యక్ష కార్య చరణలోకి దిగి అప్పటివరకు అడవులపై గిరిజనులకున్న సంప్రదాయక హక్కులపై పరిమితి విధించే నియంత్రణ చేసే అధికారాన్ని పొందారు.
1917 భూమి బదలయింపు చట్టం
- ముఖ్యంగా మద్రాస్ రాష్ట్ర ఆంధ్ర ఏజెన్సీ ప్రాంతాల్లో చెలరేగిన తిరుగుబాట్లకు ప్రతిస్పందనగా బ్రిటిష్ ప్రభుత్వం 1917లో ఏజెన్సీ ప్రాంత భూమి బదలాయింపు చట్టాన్ని తీసుకువచ్చింది. ప్రధానంగా ప్రభుత్వ ఏజెంటు లేదా నిర్ణీత అధికారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా గిరిజన తెగలకు, గిరిజనేతరులకు మధ్య జరిగే భూ బదలాయింపులను ఈచట్టం నిషేధించింది. అయితే పొరుగున ఉన్న ఆంధ్రప్రాంతాల్లో మినహా గిరిజనుల భూమి హక్కుల కోసం అప్పటి నిజాం ప్రభుత్వం ఎటువంటి రక్షణ కల్పించలేదు. దీన్ని ఆసరాగ తీసుకొని వలస వచ్చిన గిరిజనేతరులు గిరిజనుల భూములను ఆక్రమించివాటికి పట్టాలు కూడా పొందారు. హద్దు లేర్పరిచే సమయానికి బీడుగా పడి ఉన్న భూములను, అంతకుముందు వాటికి ‘శివాయి జమా బందీ’ పద్ధతిలో గిరిజనులు సాగు చేస్తూ ఉన్నప్పటికీ రిజర్వ్ ఫారెస్ట్‌లో కలిపేశారు. విశాలమైన అటవీ భాగాల నుంచి జనావాసాలను, తరతరాలుగా స్థిరపడ్డ గ్రామాలను కూడా తొలగించడం సాయుధ పోరాటాలకు దారితీసింది.
1927- భారత అటవీ చట్టం - అప్పటి వరకు ఉన్న అటవీ చట్టాలు ఏర్పర్చిన పద్ధతుల కొనసాగింపులో భాగంగా ఈ చట్టం కూడా అటవీ భూములు, ఉత్పత్తులపైన మిగతా ప్రజల హక్కులను నియంత్రించడానికి ప్రయత్నించింది. ఈ చట్టం ద్వారా ఫారెస్ట్ రేంజర్లు, అటవీ అధికారులు, ఫారెస్ట్ గార్డుల అధికారాలు బలోపేతమయ్యాయి. ఇంకా ఈ చట్టం అధికారులకు అవసరమయ్యే నిబంధనలను తయారుచేసుకునే అధికారాన్ని ఇచ్చింది.
- దాంతో వారు భారత అటవీ చట్టంలోని సెక్షన్ 64-68-74, 1871 క్రిమినల్ట్రైబ్స్ యాక్ట్ ప్రకారం గిరిజనులను అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం, కఠినంగా శిక్షించడం చివరికి గిరిజనుల ఆస్తులను స్వాధీన పరచుకోవడం లాంటివి చేసేవారు.
- హైదరాబాద్ రాజ్యంలో మొదటి సారి సాలార్జంగ్ కాలంలో 1857లో అటవీశాఖను ప్రారంభించారు. ఆ తర్వాత 1890, 1900లలో అటవీ విధానం ప్రకటించారు. దీనివల్ల అటవీ సంపదపై ప్రభుత్వాధికారం పెరిగింది. కానీ వేలాది సంవత్సరాలుగా అడవిపై ఆధారపడిన గిరిజనుల సంప్రదాయక హక్కులు రద్దయ్యాయి. అటవీ ప్రాంతాలను ప్రభుత్వం రెండు భాగాలుగా విభజించింది. రిజర్వ్డ్, అన్ రిజర్వ్డ్.
- రిజర్వ్డ్ ఫారెస్ట్‌లో గిరిజనులు పోడు వ్యవసాయం చేసుకోవడం, అటవీ ఉత్పత్తులను సేకరించడం నిషేధించబడింది. తత్ఫలితంగా గిరిజనుల సామాజిక ఆర్థిక స్థితుల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి.
- ముఖ్యంగా ఈ చట్టాల వల్ల విసిగివేసారిన నిజాం రాజ్యంలోని ఆదిలాబాద్ గోండ్ గిరిజనులు గిరిజనేతరులు, అటవీ అధికారుల అనవసర ప్రమేయాన్ని ఆధిపత్యాన్ని ప్రభుత్వ ఆధిపత్యాన్ని, ప్రభుత్వ దమన నీతిని గట్టిగా వ్యతిరేకిస్తూనే పరిసర ప్రకృతిపై, వారు నివసించే ప్రాంతాలపై తమ స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవడానికి తమ నాయకులైన రామ్జీగోండు, కుమ్రం భీం నాయకత్వంలో గిరిజన పోరాటాలను సాగించారు.
గోండులు వారి స్థితిగతులు
- ప్రస్తుత ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని పూర్వపు బస్తర్ సంస్థానమే గోండు గిరిజనుల పుట్టినిల్లు. సంఖ్యా పరంగా గోండులు దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతి. సాత్పూరా పర్వతాల నుంచి గోదావరి ప్రాంతం ఉత్తరప్రదేశ్‌లోని గోండు జిల్లాల నుంచి ఉత్తర బీహార్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రం వరకు ఈ జాతి వ్యాపించి ఉందని ఆంత్రోపాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1994లో ప్రచురించిన ‘షెడ్యూల్డ్ తెగలు’ అనే పుస్తకంలో పేర్కొన్నారు.
- గోండులు ఎక్కువ మంది మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలతోపాటు తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా కనిపిస్తారు. గోండుల్లో మూడు రకాలు ఉంటారు.
1) మరియా గోండులు
2) కొండమరియాలు
3) భిషోహార్ మరియాలు. - ప్రధానంగా ఆదిలాబాద్‌ల్లో గోండు సామాజిక వ్యవస్థ అంటే గోండు-పరధాన్ కోలాం, తోటీలను కలిపి అర్థం చేసుకోవాలి. గోండులు సామాజిక, ఆర్థిక, రాజకీయ తరతరాలుగా అభివృద్ధి చెందారనడానికి, వారు వాడిన రాజగోండ్, కోయారాజాల్, దొరసట్టం, కోయదొరలు, రాజకోయల్లాంటి పదాలు వారి పూర్వ రాచరిక వైభవాన్ని తెలియజేస్తాయి. గోండు గిరిజనుల సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవవస్థలు చాలా విశిష్టమైనవి. దీనికి కారణం మహారాష్ట్రలోని చాందాను పరిపాలించిన శక్తిమంతమైన గోండు రాజుల ఆస్థానం ఆదిలాబాద్ జిల్లా వరకు వ్యాపించి ఉండేది. ఛత్తీస్‌గఢ్‌లోని చాలా ఆస్థానాలు 1947 వరకు గోండు రాజుల పాలనలో ఉండేవి. కొంత కాలం వరకు కూడా ఆదిలాబాద్ జిల్లాలో గోండుల వీర గాథలు, గాథలు జనపదుల్లో విరివిగా రాచరికపు చాయలు ప్రచారంలో ఉండేవి. గోండులు ఆనాటికే స్థిరపడ్డ వ్యవసాయాధార సముదాయంగా నాగలి, ఎద్దులతో వ్యవసాయం చేసేవారు. వ్యక్తులు ఒక స్థిర నివాసం నుంచి మరో స్థిర నివాసానికి సులభంగా స్వేచ్ఛగా వెళ్లగలిగే వెసులుబాటు గోండుల్లో ఉండేది. రానురాను భూమి తగ్గిపోవడంతో ఈ స్వేచ్ఛ వెసులుబాటు సన్నగిల్లుతూ వచ్చింది. దానితో గోండుల జీవన విధానం రూపురేఖలు లేకుండా మారిపోయింది.
- ఈ క్రమంలోనే గోండుల రాజ్యం పతనమై మరాఠాల పాలనలో అంతర్భాగమై గోండు రాజులు జమీందారులుగా గుర్తించబడ్డప్పటికీ, తర్వాత వచ్చిన నిజాం ప్రభువులు మాత్రం వారి పాలననే కొనసాగించారు. దాంతో దేశ్‌ముఖ్‌లు, దేశ్‌పాండేలు బలవంతులై ఏదో సాకుతో గోండుల భూములు అన్యాక్రాంతం చేసేవారు. మరోపక్కన అటవీచట్టాల అమలు వల్ల గోండుల భూములు అటవీ పాలయ్యాయి. అటవీ అధికారులు, ఆబ్కారీ అధికారులు, రెవెన్యూ అధికారులతోపాటు ఆదివాసీయేతరుల ఆగడాలు మితిమీరిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో గిరిజన గోండులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.
ప్రాక్టీస్ బిట్స్
1. స్థానిక గిరిజనులు అటవీ ఉత్పత్తులను ఇతరులు సేకరించడాన్ని నియంత్రించే దిశగా ఏ చట్టం మొదటి ప్రయత్నం చేసింది? (సి)
ఎ) 1894 మొదటి అటవీ విధానం
బి) 1878 అటవీ చట్టం
సి) 1865 మొదటి అటవీ చట్టం
డి) 1917 భూమి బదలాయింపు చట్టం
2. బ్రిటిష్ ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంత భూమి బదలాయింపు చట్టాన్ని ఎప్పుడు తీసుకువచ్చింది? (ఎ)
ఎ) 1917 బి) 1927
సి) 1894 డి) 1878
3. అటవీ అధికారుల, ఫారెస్ట్ అధికారులు, ఇండియన్ ఫారెస్ట్ రేంజర్ల అధికారులను బలోపేతం చేసిన చట్టం ఏది? (బి)
ఎ) 1894 మొదటి అటవీ విధానం
బి) 1927 భారత అటవీ చట్టం
సి) 1865 మొదటి అటవీ చట్టం
డి) 1917 భూమి బదలాయింపు చట్టం
తెలుగు అకాడమీ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు