మార్కెట్‌కా షేర్… స్టాక్ బ్రోకర్ షేర్
సెన్సెక్స్, నిఫ్టీ, ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా. మీకు ఆర్థిక వ్యవహారాల నిర్వహణపై పట్టు ఉందా. అయితే మీరు స్టాక్ బ్రోకర్‌గా బులియన్ మార్కెట్లో బేఫికర్‌గా అడుగుపెట్టవచ్చు. ఎందుకంటే స్టాక్ ఎక్సేంజ్, షేర్లు, బులియన్ మార్కెట్ గురించి చదువుతుంటాం, వింటుంటాం. వీటిలో పెట్టుబడులు పెట్టవచ్చని కూడా తెలుసు. కానీ చాలామందికి వీటిపై సరైన అవగాహన లేక చేతులు కాల్చుకుంటుంటారు. కాబట్టి షేర్ల ఫలాలు పొందడానికి స్టాక్ బ్రోకర్లను ఆశ్రయిస్తుంటారు. ఈ నేపథ్యంలో స్టాక్ బ్రోకర్ అంటే ఎవరు, ఇందుకు ఏం చదవాలో తెలుసుకుందాం.
స్టాక్ బ్రోకింగ్ అంటే ఏమిటి?
-స్టాక్స్ లేదా ఇతర సెక్యూరిటీల అమ్మకం, కొనుగోలు ప్రక్రియనే స్టాక్ బ్రోకింగ్ అని పిలుస్తారు. ఈ స్టాక్ బ్రోకింగ్‌లో నైపుణ్యంగల వారిని స్టాక్ బ్రోకర్లు అంటారు. తమ పెట్టుబడిదారుల తరఫున స్టాక్ వ్యాపారం నిర్వహించే ఏజెంట్‌గా స్టాక్ బ్రోకర్ వ్యవహరిస్తారు. వీరిని సెక్యూరిటీల విక్రయ ఏజెంట్ లేదా సెక్యూరిటీలు, వస్తువుల అమ్మకం ఏజెంట్‌గా పిలుస్తారు. వీరు తమ క్లయింట్లకు విలువైన సేవ, సమాచారాన్ని అందిస్తారు. షేర్లను ఏ రేట్లకు కొనాలో, అమ్మాలో వీరు నిర్ణయిస్తారు. ఇందుకు కమీషన్ తీసుకుంటారు.
-స్టాక్ మార్కెట్లో మూడు రకాల బ్రోకర్లు ఉన్నారు. వారు.. డిస్కౌంట్ బ్రోకర్లు, బ్యాంకు బ్రోకర్లు, ఫుల్ సర్వీస్ బ్రోకర్లు. స్టాక్ బ్రోకర్లు దీర్ఘకాలిక పరిశ్రమల నుంచి మంచి ప్రతిఫలాలు పొందుతారు. ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్ అభివృద్ధి పథంలో పయనిస్తుంది. దీంతో స్టాక్ బ్రోక్లరకు డిమాండ్ బాగా పెరిగింది. షేర్లు, బాండ్లు అమ్మకాలు, కొనుగోళ్ల ప్రక్రియల్లో స్టాక్ బ్రోకర్లదే కీలకపాత్ర. కాబట్టి షేర్ మార్కెట్లపై ఆసక్తి ఉన్నవారు దీనికి సంబంధించిన కోర్సులు చేయవచ్చు.
-స్టాక్ ఎక్సేంజ్ సభ్యులు మాత్రమే స్టాక్ మార్కెట్లో లావాదేవీలు నిర్వహిస్తారు. వ్యక్తులు గాని, సంస్థలు గాని షేర్ల వ్యాపారానికి స్టాక్ బ్రోకర్ల ద్వారానే వెళ్లాలి. వీరు వ్యక్తులు, సంస్థలకు చెందిన క్రయవిక్రయాల విషయంలో అడ్వయిజర్‌గా, అనలిస్ట్‌గా, డీలర్‌గా పనిచేస్తారు. ఇది సవాళ్లతో కూడుకుని ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చే కెరీర్.
-ప్రపంచంలో ధనం ఉన్నంతకాలం స్టాక్ మార్కెట్ కళకళలాడుతూ ఉంటుంది. కాబట్టి మార్కెట్ తీరు తెన్నులను ఎప్పటికప్పుడు గమనిస్తూ లాభాలు వచ్చే కంపెనీలపై పక్కాగా అంచనా వేస్తే స్టాక్ బ్రోకర్లకు ఆదాయంతోపాటు పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అందుకు తగ్గట్టుగా అవకాశాలూ విస్తృతమవుతాయి. స్టాక్ బ్రోకర్లు తమ క్లయింట్లకు సురక్షితమైన పెట్టుబడి పథకాలను సూచించాలి.
నైపుణ్యాలు
-స్టాక్ బ్రోకర్లకు సహనం, నమ్మకం, లాజికల్ థింకింగ్, మంచి వ్యాపార చతురత, సంక్లిష్ట సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, గణితంలో నైపుణ్యం, విశ్లేషణాత్మక ఆలోచన, బాధ్యతల గల వైఖరి ఉండాలి.
-ఇవి ఉంటేనే మార్కెట్ నాడిని సరిగ్గా గుర్తించగలిగే నేర్పు పొందుతారు. క్లయింట్ల మనోభావాలకు భంగం కలగకుండా, మార్కెట్లో కంపెనీ స్థానం దిగజారకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. స్టాక్‌బ్రోకర్లు పొరపాటు నిర్ణయాలు తీసుకుంటే క్లయింట్ల జీవితాలు తారుమారవుతాయి. కాబట్టి విధుల్లో నిర్లక్ష్యం చేయకుండా, ఒత్తిళ్లను అధిగమిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి.
అర్హతలు
-దేశంలో బ్రోకరేజీ సంస్థలు ఎంబీఏ (ఫైనాన్స్) కోర్సు చదివినవారిని అసిస్టెంట్ రిలేషన్షిప్ మేనేజర్, రిలేషన్షిప్ మేనేజర్‌గా నియమించుకుంటున్నాయి. కాబట్టి ఈ కోర్సు పూర్తిచేస్తే స్టాక్‌బ్రోకర్‌గా స్థిరపడవచ్చు. దీంతోపాటు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ ఆఫర్ చేస్తున్న ఫైనాన్షియల్ మార్కెట్స్ సర్టిఫికేషన్, బాంబే స్టాక్ ఎక్సేంజ్ ఆఫర్ చేస్తున్న డెరివేటివ్ ఎక్సేంజ్ సర్టిఫికేషన్ కూడా పూర్తిచేస్తే అర్హతలను పెంచుకుని, మంచి అవకాశాలను అందుకోవచ్చు.
కోర్సులు
-స్టాక్ బ్రోకింగ్ రంగంలో కనీసం రెండేండ్ల అనుభవంతో గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందవచ్చు. స్టాక్ బ్రోకర్‌గా మీ కెరీర్‌ను ప్రారంభించడానికి ముందు మీరు సబ్ బ్రోకర్‌గా పనిచేయవచ్చు. దేశంలో వివిధ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు ఇంటర్ తర్వాత సర్టిఫికెట్ స్థాయి కోర్సులను అందిస్తున్నాయి.
-ఇంటర్ కామర్స్‌తో పూర్తిచేసిన వారికి ఎన్ఎస్ఈ సర్టిఫికెట్ ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్స్, సర్టిఫైడ్ మార్కెట్ ప్రొఫెషనల్, సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఆన్ క్యాపిటల్ మార్కెట్స్, పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ క్యాపిటల్ మార్కెట్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫండమెంటల్స్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్ డెవలప్మెంట్ వంటి కోర్సులను అందిస్తుంది.
డిగ్రీ కోర్సులు
-బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫైనాన్స్/ మ్యాథమెటిక్స్/ అకౌంటింగ్/ ఎకనామిక్స్/బిజినెస్ మేనేజ్మెంట్
-బ్యాచిలర్ ఆఫ్ కామర్స్
పీజీ కోర్సులు
-మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) ఇన్ ఫైనాన్స్
-మాస్టర్ ఆఫ్ కామర్స్
-పెద్ద బ్రోకింగ్ సంస్థలు చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ), చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్స్ (సీఎఫ్ఏ)లను తీసుకోవడంలో ఇష్టపడుతున్నాయి.
-సబ్ బ్రోకర్‌గా చేయడానికి ఇంటర్ పూర్తిచేసి 21 ఏండ్లలోపు ఉండాలి. దీంతోపాటు ఎకనామిక్స్, కామర్స్, బిజినెస్,ఫైనాన్స్‌లో అవగాహన ఉండాలి.
-ఈ కోర్సులను పూర్తిచేసిన తర్వాత సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి)లో నమోదు చేసుకోవాలి. అంతేకాకుండా మీకు మీరే స్టాక్ ఎక్సేంజీలో సభ్యునిగా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు.
-రిజిస్టర్ చేసుకున్న తర్వాత స్టాక్ ఎక్సేంజీ నిర్వహించే రాతపరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. తర్వాత అకౌంటెన్సీ, క్యాపిటల్ మార్కెట్లు, సెక్యూరిటీలు, పోర్ట్‌ఫోలియో విశ్లేషణ వంటి విషయాల్లో శిక్షణ తీసుకోవాలి. శిక్షణ పూర్తయిన తర్వాత బ్రోకర్‌గా పనిచేయగలడు అని భరోసా వచ్చిన తర్వాతనే సభ్యత్వం ఇస్తారు.
-ఇవేకాకాకుండా బోర్డ్ ఆఫ్ స్టాక్ ఎక్సేంజ్ కూడా సర్టిఫికేషన్ ఆన్ సెంట్రల్ డిపాజిటరీ, సర్టిఫికేషన్ ఆన్ డెరివేటివ్స్ ఎక్సేంజ్, సర్టిఫికేషన్ ఆన్ కరెన్సీ ఫ్యూచర్స్, సర్టిఫికేషన్ ఆన్ సెక్యూరిటీస్ మార్కెట్స్లలో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తుంది.
వేతనం
-స్టాక్ బ్రోకర్లకు పనితీరును బట్టి ఆదాయం లభిస్తుంది. ఏడాదికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వేతనం లభిస్తుంది. అనుభవం పెరిగే కొద్ది రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఆదాయం వస్తుంది. కొన్ని బ్రోకింగ్ సంస్థలు పర్ఫామెన్స్ చూపే బ్రోకర్లకు బోనస్‌ను కూడా ఇస్తున్నాయి. నైపుణ్యం పెరిగితే రూ.కోట్లలోనూ సంపాదించవచ్చు.
కెరీర్
-స్టాక్ బ్రోకర్‌గా సభ్యత్వం వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ అడ్వయిజర్‌గా, ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్‌గా, క్యాపిటల్ మార్కెట్ స్పెషలిస్ట్‌గా, ఇండిపెండెంట్ ఏజెంట్‌గా, అకౌంటెంట్‌గా, సెక్యూరిటీ అనలిస్ట్‌గా, ఫైనాన్షియల్ మేనేజర్‌గా, సెక్యూరిటీ ట్రేడర్‌గా, సెక్యూరిటీ సేల్స్ రిప్రజెంటేటివ్‌గా, సెక్యూరిటీస్ బ్రోకర్‌గా కెరీర్‌ను ప్రారంభించవచ్చు.
-ఆర్థిక ప్రపంచీకరణ, సరళీకరణ నేపథ్యంలో స్టాక్ బ్రోకర్‌గా కెరీర్‌ను ఎంచుకునేవారికి బ్రోకింగ్ సంస్థలు, పెద్ద వ్యాపార సంస్థలు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్, పెన్షన్ ఫండ్స్, బ్రోకింగ్ సంస్థలతో డీలింగ్ చేసే ట్రెడిషనల్ బ్యాంకులు, మ్యాగజీన్స్, న్యూస్‌పేపర్లు, చారిటీ సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్ వంటివాటిలో అవకాశాలు లభిస్తాయి.
-అంతేకాకుండా ఇన్వెస్ట్మెంట్ కన్సల్టెన్సీలను పెట్టుకోవచ్చు. ఎంట్రప్రెన్యూర్‌గా రాణించవచ్చు. విదేశాల్లోనూ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
-ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్, రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ, జేపీ మోర్గాన్, ఐసీఐసీఐ డైరెక్ట్, ఇండియా ఇన్ఫోలైన్, ఇండియా బుల్స్, షేర్‌ఖాన్ లిమిటెడ్, కొటక్ సెక్యూరిటీస్ లిమిటెడ్, కార్వీ కన్సల్టెన్సీ వంటి సంస్థలు స్టాక్ బ్రోకర్లను రిక్రూట్ చేసుకుంటున్నాయి.
సంస్థలు
-ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్-ముంబై
-వెబ్సైట్: www.ifip.co.in
-బీఎస్ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్- ముంబై
-వెబ్సైట్: www.bseindia.com
-నేషనల్ స్టాక్ ఎక్సేంజ్-ముంబై
-వెబ్సైట్: www.nseindia.com
-ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా-న్యూఢిల్లీ
-వెబ్సైట్: www.icsi.edu
-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్
-వెబ్సైట్: www.nism.ac.in
-ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా-న్యూఢిల్లీ
-వెబ్సైట్: www.icai.org
-ఎస్సీఎఫ్ఎం అకాడమీ-హైదరాబాద్
-వెబ్సైట్: www.ascncfmacademy.com
-ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్స్ ఆఫ్ ఇండియా (ICFAI)- హైదరాబాద్
-వెబ్సైట్: www.icfai.org
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు