PHYSICS | మెగ్నీషియా.. మాగ్నటైట్.. మాగ్నటిజం
అయస్కాంతత్వం
- అయస్కాంతాన్ని మొదటగా ఉపయోగించిన వారు గ్రీకులు.
- అయస్కాంతత్వం అంటే ఆకర్షించే గుణం. వేదకాలంలో అయస్కాంతాన్ని చుంబకం అనేవారు.
- ఏదైనా ఒక పదార్థంలో పరమాణు ఎలక్ట్రాన్లు ఒక క్రమమైన పద్ధతిలో అమర్చబడి ఉంటే కలిగే ఆకర్షణ శక్తినే ‘అయస్కాంత తత్వం’ అంటారు.
ఉదాహరణ – ఇనుము, ఉక్కు, నికెల్ - అయస్కాంతత్వాన్ని మొదట మెగ్నీషియా అనే చోట కనుగొన్నారు. ఈ ప్రదేశం పేరు మీదగానే మాగ్నటైట్ పేరు వచ్చింది.
- అయస్కాంత తత్వంపై ‘విలియం గిల్బర్ట్’ అనే శాస్త్రవేత్త 16వ శతాబ్దంలో శాస్త్రీయ పరిశోధనలు జరిపారు.
- ఒక పదార్థం అయస్కాంతత్వాన్ని ప్రదర్శించడానికి కారణం దీనిలోని సూక్ష్మాతిసూక్ష్మ పదార్థం – వెబర్
- ఒక పదార్థంలోని ప్రతి బిందువు అయస్కాంతంలా ప్రవర్తిస్తుంది – ఈవింగ్
అయస్కాంతం రకాలు
1. సహజ అయస్కాంతం
2. కృత్రిమ అయస్కాంతం
1. సహజ అయస్కాంతాలు - ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే ఆకర్షణ ధర్మం ఉన్న రాళ్లను ఖనిజాలను సహజ అయస్కాంతాలు అంటారు.
2. కృత్రిమ అయస్కాంతాలు - సహజ అయస్కాంతాలతో ఇనుము (లేదా) ఉక్కు కడ్డీలను సరైన పద్ధతిలో రుద్దితే ఏర్పడే అయస్కాంతాలను కృత్రిమ అయస్కాంతాలు అంటారు.
కృత్రిమ అయస్కాంతాలు రెండు రకాలు
1. శాశ్వత అయస్కాంతాలు – వీటిలో అయస్కాంతత్వం శాశ్వతంగా ఉంటుంది.
ఉదా : దండ అయస్కాంతం, గుర్రపునాడ అయస్కాంతం, స్థూపాకార అయస్కాంతం, సర్పిలాకార అయస్కాంతం.
2. తాత్కాలిక అయస్కాంతం – వీటిలో అయస్కాంతత్వం తీగచుట్టలో విద్యుత్ ప్రసరించినంతసేపు మాత్రమే ఉంటుంది.
ఉదా :విద్యుదయస్కాంతాలు - అయస్కాంతత్వం ప్రకారం రెండు రకాలుగా విభజిస్తారు.
(ఎ) అయస్కాంత పదార్థాలు – అయస్కాంతాలచేత ఆకర్షించబడే పదార్థాలను అయస్కాంత పదార్థాలు అంటారు.
ఉదా : ఇనుము, ఉక్కు, నికెల్, స్టీల్, కోబాల్ట్
(బి) అనయస్కాంత పదార్థాలు – అయస్కాంతం చేత ఆకర్షించబడని పదార్థాలను అనయస్కాంత పదార్థాలు అని అంటారు.
ఉదా : పేపర్, చెక్క, గాజు, రబ్బర్, ప్లాస్టిక్, అల్యూమినియం, ఇత్తడి, బంగారం, వెండి, వజ్రం
అయస్కాంత ధర్మాలు
1. అయస్కాంత ధ్రువాల సిద్ధాంతం
2. అయస్కాంత ధ్రువాల జంట నియమం
3. ఆకర్షణ ధర్మం
4. దిశా ధర్మం
5. ప్రేరణ ధర్మం
1. అయస్కాంత ధ్రువాల సిద్ధాంతం - అయస్కాంతానికి ఉత్తర, దక్షిణ ధ్రువాలుంటాయి
- సజాతి అయస్కాంత ధ్రువాలు వికర్షించుకుంటాయి. విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి.
- దీన్ని కృత్రిమ అయస్కాంతాలకు ధ్రువాలు నిర్ణయించడంలో ఉపయోగిస్తారు.
- వికర్షణ అయస్కాంత్వానికి అసలైన పరీక్ష
- అయస్కాంతంలోని ధ్రువాల మధ్య దూరాన్ని అయస్కాంత పొడవు అంటారు. ఇది దండాయస్కాంత భౌతిక పొడవులో 5/6వ వంతు ఉంటుంది.
2. అయస్కాంత ధ్రువాల జంట నియమం - అయస్కాంత ధ్రువాలు ఎప్పుడూ జంటగానే ఉంటాయి. వీటిని విడదీయలేము. అంటే ఒంటరిగా అయస్కాంత ధ్రువం ఉండదు.
3. ఆకర్షణ ధర్మం - ఒక అయస్కాంతం వద్ద ఇనుపరజను ఉంచితే కొనల వద్ద అధికంగా, మధ్యలో తక్కువగా ఆకర్షించుకుంటుంది.
- అయస్కాంత కొనల వద్ద ఆకర్షణ గుణం గరిష్ఠంగా ఉండటం వల్ల ఈ బిందువును ధ్రువాలు అంటారు. వీటిని దక్షిణ ధ్రువం, ఉత్తర ధ్రువం అనే పేర్లతో పిలుస్తారు.
4. దిశా ధర్మం - ఒక దండయస్కాంతాన్ని గాలిలో క్షితిజ సమాంతరంగా వేలాడదీస్తే అది ఎల్లప్పుడూ భూమి ఉత్తర, దక్షిణ దిశలను చూపిస్తుంది. దీన్నే అయస్కాంత దిశాత్మక ధర్మం అంటారు.
5. ప్రేరణ ధర్మం - ఒక అయస్కాంత ధ్రువాన్ని ఇనుము వంటి అయస్కాంత పదార్థానికి దగ్గరగా ఉంచినప్పుడు దానిలో వ్యతిరేక ధ్రువం ప్రేరణ ద్వారా ఏర్పడుతుంది.
అయస్కాంతీకరణం - అనయస్కాంత పదార్థాలను అయస్కాంతాలుగా మార్చే ప్రక్రియ అంటే అణువులను క్రమపద్ధతిలో అమర్చడం.
- అయాస్కాంతీకరణాన్ని కృత్రిమ అయస్కాంతాల తయారీలో ఉపయోగిస్తారు.
- అయస్కాంతం ఇనుము, కోబాల్ట్, నికెల్, ఉక్కు వంటి పదార్థాల్లో అయస్కాంతత్వాన్ని ప్రేరేపిస్తుంది. ఈ ధర్మాన్ని అయస్కాంత ప్రేరణం అంటారు.
- ఐదు రకాల అయస్కాంతీకరణ పద్ధతులు.
1. ఏక స్పర్శ పద్ధతి - దండ అయస్కాంతం ఒకేఒక ధ్రువాన్ని ఉపయోగించి కృత్రిమ అయస్కాంతాలను తయారుచేయటం.
- ఈ పద్ధతిలో దండ అయస్కాంత ధ్రువంతో ప్రారంభించే కొన సజాతి ధ్రువంగా మారుతుంది.
2. ద్విస్పర్శ పద్ధతి - దండ అయస్కాంతం రెండు విజాతి ధ్రువాలతో స్పర్శించడం వల్ల కృత్రిమ అయస్కాంతాలను తయారుచేయడం.
- ఈ పద్ధతిలో దండ అయస్కాంత ధ్రువాలు వదిలే అయస్కాంతంలో విజాతి ధ్రువాలుగా మారుతాయి.
3. విద్యుత్ పద్ధతి - సురక్షిత రాగి తీగలను అయస్కాంతీకరించవలసిన కడ్డీ చుట్టూ చుట్టి డీసీ విద్యుత్‌ను ప్రసారం చేస్తే అది అయస్కాంతంగా మారుతుంది.
- బలమైన అయాస్కాంతాలు ఈ పద్ధతిలో తయీరుచేస్తారు.
4. భూ అయస్కాంతీకరణ పద్ధతి - అయస్కాంతీకరణ చేయవలసిన కడ్డీని ఎర్రగా కాల్చి భూమి ఉత్తర, దక్షిణ దిక్కుల్లో ఉంచి సుత్తితో అనేక పర్యాయాలు కొట్టిన దానిలో స్వల్పంగా అయస్కాంతత్వం కలుగుతుంది.
5. అయస్కాంత ప్రేరణ పద్ధతి - ఇనుము ఉక్కు లాంటి వస్తువులు అయస్కాంతం వద్ద ఉంచినప్పుడు అయస్కాంతంగా మారటం
- ఈ పద్ధతిలో బలహీనమైన అయస్కాంతాలు తయారవుతాయి నిరయస్కాంతీకరణం
- అయస్కాంతాన్ని రబ్బరు సుత్తితో అనేకసార్లు కొట్టినా, వేడిచేసినా, పలుమార్లు కిందపడినా అయస్కాంత ధర్మం పోతుంది.
విద్యుత్ అయస్కాంతం - విద్యుత్ ప్రసరిస్తున్నంతసేపు అయస్కాంతం వలె ప్రవర్తించే దాన్ని విద్యుత్ అయస్కాంతం అంటారు. వీటిని మెత్తని ఇనుముతో తయారుచేస్తారు.
- ఇవి తాత్కాలిక అయస్కాంతాలు.
- ఈ తాత్కాలిక అయస్కాంతాలను ఎలక్ట్రిక్ ట్రైన్లు, వీడియో టేప్ రికార్డర్, డైనమో, టెలిఫోన్, టెలిగ్రాఫ్లలో ఉపయోగిస్తారు.
అయస్కాంత విరూపణ - ఒక ఇనుప కడ్డీని అయస్కాంతీరించినప్పుడు దాని పొడవు స్వల్పంగా పెరుగుతుంది. దీన్నే అయస్కాంత విరూపణ అంటారు. అయస్కాంత విరూపణ అతిధ్వనులు ఉత్పాదన.
అయస్కాంతక్షేత్రం - అయస్కాంతం చుట్టూ దాని ప్రభావం గల ప్రదేశాన్ని ‘అయస్కాంత క్షేత్రం’ అంటారు.
- అయస్కాంత క్షేత్రం త్రిమితీయం.
- అయస్కాంతక్షేత్రంలో ఒక బిందువు వద్ద ప్రమాణ ధ్రువంపై ఎంత బలం ఉంటుందో దాన్నే ఈ బిందువు వద్ద అయస్కాంత క్షేత్ర తీవ్రత అంటారు.
అయస్కాంత ప్రవేశశీల్యత - ఒక యానకం తన నుంచి అయస్కాంత బలరేఖలను ప్రవహింపజేసే స్వభావాన్ని ఈ యానకపు ప్రవేశశీల్యత అంటారు.
- = గాలి అయస్కాంత ప్రవేశశీల్యత ()0 = 4 x 10-7 Henry/meter
అయస్కాంత ధ్రువసత్వం - ఒక అయస్కాంత ధ్రువం మరో అయస్కాంత ధ్రువాన్ని ఎంత బలంగా ఆకర్షిస్తుందో/ వికర్షిస్తుందో తెలిపే కొలత. ఆకర్షించే (లేదా) వికర్షించే లక్షణం
- ప్రమాణాలు –
1) MKS పద్ధతిలో Weber
2) SI పద్ధతిలో ఆంపియర్ మీటర్
అయస్కాంత బలరేఖలు - అయస్కాంత క్షేత్రంలో ప్రమాణ ఉత్తర ధ్రువం అనుసరించే మార్గాన్ని అయస్కాంత బలరేఖ అంటారు.
- అయస్కాంత బలరేఖలు ఖండించుకోవు. ఉత్తర ధ్రువం వద్ద బలరేఖలు వికేంద్రీకరణం చెందగా, దక్షిణ ధ్రువం వద్ద బలరేఖలు కేంద్రీకరణం చెందుతాయి.
- దండయస్కాంతం బలరేఖలు
అయస్కాంతం బయట ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి వక్రరేఖలుగా, అయస్కాంతత లోపల దక్షిణ ధ్రువం నుంచి ఉత్తర ధ్రువానికి సమాంతర సరళరేఖలుగా ఉంటాయి.
అయస్కాంత భ్రామకం - దండ అయస్కాంతం ధ్రువసత్వం, పొడవుల లబ్దాన్ని అయస్కాంత భ్రామకం అంటారు.
- m=mx2I
- SI unit – ఆంపియర్- మీటర్2
తటస్థ బిందువు - దండయస్కాంత ప్రేరణ, భూ అయస్కాంత ప్రేరణ వల్ల రద్దయ్యే బిందువును తటస్థ బిందువు అంటారు. B=B0, ప్రతి అయస్కాంతం రెండు తటస్థ బిందువులను ఏర్పరుస్తుంది.
- భూఅయస్కాంత క్షేత్రంలో ఉంచిన దండాయస్కాంతం వల్ల దాని రెండు బిందువుల వద్ద ఫలిత అయస్కాంత క్షేత్రం సున్నా అవుతుంది. ఈ స్థానాలను తటస్థ బిందువులు అంటారు.
- తటస్థ బిందువు వద్ద దిక్సూచి ఉత్తర, దక్షిణ దిశలను సూచించదు. యాదృచ్ఛికంగా ఏదో ఒక దిశను సూచిస్తుంది.
అయస్కాంత పదార్థాలు – రకాలు - వీటిని మూడు రకాలుగా వర్గీకరించిన శాస్త్రవేత్త – మైఖేల్ ఫారడే
1. డయా అయస్కాంత పదార్థాలు - ఈ పదార్థాలు అయస్కాంత క్షేత్రాన్ని వికర్షిస్తాయి. వీటిలో ఉండే పరమాణువుల్లో బాహ్య ఎలక్ట్రాన్లు జతలుగా ఉండటం వల్ల వాటి ఫలిత అయస్కాంత భ్రామకం సున్నా అవుతుంది.
ఉదా : బిస్మత్, రాగి, నీరు, బంగారం, వెండి, సీసం.
2. పారా అయస్కాంత పదార్థాలు - అయస్కాంత క్షేత్రాన్ని స్వల్పంగా ఆకర్షించే పదార్థాలు, ఈ పదార్థాల పరమాణువుల్లో ఉండే ఎలక్ట్రాన్ల ఫలిత అయస్కాంత భ్రామకం శూన్యం కాదు.
ఉదా : క్రోమియం, అల్యూమినియం, మెగ్నీషియం, మాంగనీస్, ప్లాటినం.
3. ఫెర్రో అయస్కాంత పదార్థాలు - అయస్కాంత క్షేత్రం చేత బలంగా ఆకర్షించే పదార్థాలు. వీటి పరమాణువుల్లోని ఎలక్ట్రాన్లకు శాశ్వత అయస్కాంత భ్రామకం ఉంటుంది.
ఉదా : ఇనుము, నికెల్ మొదలైనవి. - ఫెర్రో అయస్కాంతత్వాన్ని వివరించే సిద్ధాంతం – ‘డొమైనో సిద్ధాంతం’
- శాశ్వత అయస్కాంత భ్రామకం కలిగిన సమూహాలు డొమైన్
- విద్యుదయస్కాంతాలను మెత్తని ఇనుముతో తయారుచేస్తారు.
- విద్యుదయస్కాంతాల్లోని విద్యుత్ ప్రవాహాన్ని ఆపినప్పటికీ స్వల్పస్థాయిలో అయస్కాంతత్వం మిగిలి ఉంటుంది. దీన్నే ‘రిటెంటివిటీ’ అంటారు.
విన్నర్స్ పబ్లికేషన్స్ సౌజన్యంతో
Previous article
IRCON Recruitment | ఇర్కాన్‌లో 34 పోస్టులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు