పల్లె పాలనకు మహర్దశ
![](https://s3.ap-south-1.amazonaws.com/media.nipuna.com/wp-content/uploads/2022/03/TS-pr.jpg)
తెలంగాణ 2014, జూన్ 2 నుంచి తన అస్థిత్వాన్ని వెతుక్కుంటూ, కాపాడుకుంటూ పరిపాలన వికేంద్రీకరణ ద్వారా మారుమూల ప్రాంతాలకు, అణగారిన వర్గాలకు అభివృద్ధి ఫలాలను అందించాలన్న ఉద్దేశంతో జిల్లాలు, మండలాలు, గ్రామాల విభజనకు శ్రీకారం చుట్టారు. అభివృద్ధికి మూలబిందువైన గ్రామాలను మరింత బలోపేతం చేసేందుకు గ్రామస్థాయి పరిపాలనకు ప్రధాన ఆధారమైన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం – 2018ని రూపొందించి అమలు చేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలతో కలుపుకుని సుమారు 12 వేలకు పైగా గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో పాలన కోసం 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో అభ్యర్థి అంతిమ విజయాన్ని నిర్ణయించే పేపర్ -2 ప్రిపరేషన్ విధానంపై సమగ్ర సమాచారం అందిస్తున్నాం…
పేపర్ – 2
-తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం – 2018
-గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు
-భారతదేశం గ్రామాల్లో నివసిస్తున్నది. మన దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు. దేశ అభివృద్ధి గ్రామీణాభి వృద్ధిపై ఆధారపడి ఉన్నది. గ్రామస్వరాజ్యం ద్వారానే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందన్న మహాత్మాగాంధీ వ్యాఖ్యలు అక్షర సత్యాలు. భారతదేశం తన 70 ఏండ్ల స్వతంత్ర పాలనలో గ్రామీణాభివృద్ధి, గ్రామ స్వరాజ్యం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేసింది. 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలను రాజ్యాంగబద్ధ సంస్థలుగా తీర్చిదిద్ది గ్రామస్థాయి ప్రజాస్వామ్య వికేంద్రీకరణ పరిపాలనకు నాంది పలికింది.
-సిలబస్‌లో పేర్కొన్న అంశాలు ప్రస్తుతం గ్రామీణ తెలంగాణ సమాజ వికాసానికి, అభివృద్ధికి ప్రత్యక్షంగా సంబంధించినవిగా ఉన్నాయి. సిలబస్‌ను రూపొందించిన విధానం ప్రధాన ఉద్దేశం.. ఈ అంశాలపై ఎక్కువ పరిజ్ఞానాన్ని కలిగి ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసుకుంటే గ్రామస్థాయి పరిపాలన, అభివృద్ధి సమర్థవంతంగా ఉండే అవకాశం ఉంది. గ్రామస్థాయిలో పాలన, పారిశుద్ధ్యం మొదలు గ్రామ ఆదాయ వ్యయాల నిర్వహణలో కీలక పాత్ర, బాధ్యతాయుత పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాల ఎంపికలో ప్రశ్నలు ఎక్కువ శాతం వాస్తవాలకు దగ్గరగా (Practical) ఉండే అవకాశం ఉంది.
తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం – 2018
-29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణలో గత నాలుగున్నరేండ్లలో పరిపాలన వికేంద్రీకరణకు అధిక ప్రాధాన్యతనివ్వడమే కాకుండా నూతన పంచాయతీరాజ్ చట్టం ద్వారా కొత్తగా పరిపాలన కేంద్రాలను (కొత్త జిల్లాలు, మండలాలు, గ్రామపంచాయతీలను) ఏర్పాటు చేశారు.
-297 సెక్షన్లు, 9 భాగాలు, 8 షెడ్యూళ్లతో కూడిన నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని 2018, మార్చి 29న గవర్నర్ ఆమోదించగా 2018, మార్చి 30న తెలంగాణ గెజిట్‌లో ప్రచురించారు. ఈ చట్టం 2018, ఏప్రిల్ 18 నుంచి అమలులోకి (సెక్షన్ 6 (10), 34, 37(6), 43 (10), 47(4), 70(4), 113(4), 114(2), 141 మినహా) వచ్చింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం -1994 తెలంగాణలో వినియోగంలో ఉండదు.
-కొత్త చట్టం తెలంగాణ గ్రామీణ సమాజం మౌలిక అవసరాలను తీర్చడానికి, వేగంగా అభివృద్ధి చెందుతున్న గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి దోహదపడనున్నది.
-చట్టంలో అనేక అంశాలను విస్తృతంగా చర్చించారు. అయితే, పరీక్ష కోణంలో చదివేటప్పుడు ముఖ్యమైన అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలి.
సెక్షన్ -6: గ్రామసభ
-గ్రామ పంచాయతీ ఏర్పడిన రెండు నెలలకు (తప్పనిసరైతే 10 రోజులు పొడిగింపు) తప్పకుండా గ్రామసభ జరగాలి.
-గ్రామసభలో ఓటర్లందరూ సభ్యులు. గ్రామస్థాయి అధికారులందరూ పాల్గొనాలి.
-కనీసం రెండు గ్రామసభలకు ప్రత్యేకంగా మహిళలు, వృద్ధులు ఇతర నిస్సహాయ, అచేతన/ అణగారిన వర్గాల సమస్యలను చర్చించడానికి నిర్వహించాలి.
-ఎజెండా అంశాలను పంచాయతీ కార్యదర్శి తయారు చేయాలి.
-సర్పంచ్/ ఉపసర్పంచ్ అధ్యక్షత వహిస్తారు
-సెక్షన్ – 43: పంచాయతీ కార్యదర్శి విధులు
-సెక్షన్ – 46 : గ్రామ పంచాయతీ సమావేశం
-సెక్షన్ 47(1) – పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ సమావేశ తీర్మానాలను రికార్డు చేయాలి.
-సెక్షన్ 47(2) – తీర్మానాలు పంచాయతీ కార్యదర్శి ఆధీనంలో ఉండాలి. సమావేశం జరిగిన మూడు రోజుల్లోపు మినిట్స్ కాపీలను విస్తీర్ణాధికారికి పంపాలి.
-సెక్షన్ 52(1) – గ్రామ పంచాయతీ విధులు – బాధ్యతలు
సెక్షన్ 52(2)
-A. పారిశుద్ధ్యం
-పారిశుద్ధ్య నిర్వహణ
-100 శాతం మరుగుదొడ్ల నిర్మాణం
-సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం
-తడిపొడి చెత్త నిర్వహణ
-విధులు, రోడ్లు, మురుగు కాలువల్లో చెత్త వేసిన వారి మీద రూ.500 జరిమానా
B. సామాజిక అడవులు మొక్కలు నాటడం
C. గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించడం
D. జనన, మరణాల నమోదు
E. లే-అవుట్లు, భవనాల నిర్మాణ అనుమతులు
F. అన్ని రకాల గ్రామ పంచాయతీ రికార్డుల నిర్వహణ. ఆదాయ వ్యయాల లెక్కల నిర్వహణ
G. గ్రామ పంచాయతీ ఆస్తులు
H. ప్రజారోగ్యం, జాతరలు, సంతల నిర్వహణ
I. సామాజిక చైతన్యం
J. వీధి దీపాలు
K. ప్రభుత్వ నిబంధనల మేరకు పన్నులు, పని సామగ్రి కొనుగోలు
L. కొత్త, పాత భవనాలు/ ఇండ్లకు పన్నుల నిర్ధారణ వసూళ్లు
సెక్షన్ 52(3)
-ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త విధులు, బాధ్యతలను అప్పజెప్పవచ్చు.
సెక్షన్ 52(4)
-గ్రామ పంచాయతీ తన విధులను నిర్వహించడంలో విఫలమైతే చివరకు మొత్తం పాలకవర్గాన్ని రద్దు చేయవచ్చు.
సెక్షన్ 52(5)
-గ్రామ పంచాయతీ తన విధుల నిర్వహణలో విఫలమైనప్పుడు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కోర్టుల్లో కేసులు వేయరాదు.
బాధ్యతలు
-సెక్షన్ 64: వివిధ రకాల పన్నులను విధించడం. వాటిని 100 శాతం వసూలు చేయడం.
-సెక్షన్ 113: లేఅవుట్లకు అనుమతి
-సెక్షన్ 114: నిర్మాణాలకు అనుమతి. అక్రమ నిర్మాణాలను తొలిగించడం.
-నూతన పంచాయతీరాజ్ చట్టం తెలంగాణ గ్రామీణ సమాజంలో మౌలిక వసతుల కల్పనకు, బాధ్యతాయుతమైన గ్రామీణ సమాజాన్ని నిర్మించేందుకు దోహదపడుతున్నది.
-సంపూర్ణ పారిశుద్ధ్య, అక్షరాస్యత, పన్నుల వసూళ్ల ద్వారా ఆదర్శ గ్రామ పంచాయతీల ఏర్పాటు
-గ్రామ పంచాయతీ అన్ని రికార్డులను కంప్యూటరీకరించడం, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా పౌరసేవలను అందించి పారదర్శక ఇ-పంచాయతీ వ్యవస్థ ఏర్పాటు, వాటి విప్లవాత్మకమైన మార్పులకు ఆధారమైన నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని పరీక్ష కోణంలో అర్థం చేసుకోగలిగితే పరీక్షలో ఎక్కువ మార్కులు పొందవచ్చు.
పంచాయతీరాజ్ వ్యవస్థ పరిణామక్రమం
-ప్రాచీన భారతదేశంలోని గ్రామాలు చిన్న చిన్న రిపబ్లిక్ (గణతంత్ర) రాజ్యాలుగా ఉండేవి. చోళులు గ్రామ స్వరాజ్యానికి పునాదులు వేశారు. కౌటిల్యుడి అర్థశాస్త్రంలో గ్రామపరిపాలన , గ్రామ సంఘాల విధుల గురించి ప్రస్తావన ఉండగా మెగస్తనీస్ ఇండికాలో స్థానిక సంస్థల గురించి ప్రత్యేకంగా పేర్కొన్నారు.
-బ్రిటిష్ వలస పాలన కాలంలో 1870లో లార్డ్ మేయో తీర్మానం భారతదేశంలో స్థానిక స్వపరిపాలనకు నాంది పలికింది.
-1882లో లార్డ్ రిప్పన్ చేసిన తీర్మానం స్థానిక సంస్థల చరిత్రలో ఒక మైలురాయి(స్థానిక సంస్థల మాగ్నాకార్టా)
-1884లో రూపొందించిన స్థానిక సంస్థల తీర్మానం ఆధారంగా జిల్లా, తాలుకా బోర్డులు, గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి.
-1907లో చార్లెస్ వెబ్హౌస్ నాయకత్వంలో వికేంద్రీకరణ కమిషన్ ఏర్పాటైంది.
-రాయల్ కమిషన్ 1909: స్థానిక సంస్థల్లో ప్రజాప్రాతినిధ్యం.
-మాంటేగ్-ఛేమ్స్‌ఫర్డ్ సంస్కరణలు: స్థానిక సంస్థల పాలనను రాష్ట్ర జాబితాలో చేర్చారు.
-భారత ప్రభుత్వ చట్టం – 1935: స్థానిక సంస్థలను ప్రజాస్వామ్య పద్ధతిలో సంస్కరించడం. 1959లో ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ విధానానికి ఈ చట్టమే ఆధారం.
-రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్లో రాష్ట్ర జాబితాలో ఐదో అంశంగా స్థానిక ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి.
-ఆదేశ సూత్రాల్లో 40వ నిబంధన ప్రకారం గ్రామ పంచాయతీల ఏర్పాటుకు ప్రభుత్వాలు కృషి చేయాలి.
-73వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో కొత్తగా 11వ షెడ్యూల్‌ను, IXవ భాగాన్ని చేర్చి పంచాయతీలు అనే కొత్త అధ్యాయాన్ని నిబంధన 243 నుంచి 243O వరకు పొందుపరిచి పంచాయతీరాజ్ వ్యవస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించారు.
గ్రామీణ స్వరాజ్యం అవసరం
-గ్రామీణ సామాజిక ఆర్థిక వ్యవస్థను సమగ్ర కోణంలో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. గ్రామీణ సముదాయాల నిర్మాణం, జీవన విధానం, ఆచార సంప్రదాయాలు, సంస్కృతి తదితర అంశాలను తెలుసుకోవాల్సి ఉంటుంది.
-ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త టీఎల్ స్మిత్ తన గ్రంథం గ్రామీణ జీవన సమాజశాస్త్రంలో 1. వృత్తి, 2. సముదాయం పరిమాణం, 3. జనసాంద్రత, 4. వాతావరణం, 5. సామాజిక విభిన్నత, 6. సామాజిక స్థరీకరణ, 7. సామాజిక గమనశీలత, 8. సామాజిక పరస్పర చర్య, 9. సామాజిక సంఘీభావం వంటి అంశాలను వివరించాడు.
-గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహించే ప్రభుత్వ అధికారులకు గ్రామ సమాజం మౌలిక నిర్మాణం ప్రజల జీవన స్థితిగతులు తప్పనిసరిగా తెలిసి ఉండాలి కాబట్టి సిలబస్‌లో ఈ అంశాన్ని చేర్చారు.
గ్రామీణాభివృద్ధి
-గ్రామీణ పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం, అసమానతలను తగ్గించడానికి స్వాతంత్య్రానంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలను రూపొందించి అమలు చేశాయి. సాముదాయక అభివృద్ధి కార్యక్రమం-1952 మొదలు నేటి ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం వరకు కొన్ని వందల కార్యక్రమాలను ప్రభుత్వాలు అమలు చేశాయి. ముఖ్యంగా భారత్ నిర్మాణ్, జాతీయ ఆరోగ్య కార్యక్రమం, సర్వశిక్ష అభియాన్, గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటివి ప్రతిష్ఠాత్మకంగా కొనసాగతున్నాయి.
-అయితే కాలానుగుణంగా కొన్ని కార్యక్రమాలను విలీనం చేసి, నూతన కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తున్నారు. ఉదాహరణకు 1969లో ఆర్ఎల్ఈజీపీ, ఎన్ఆర్ఈజీపీలను విలీనం చేసి ఎన్ఆర్ఈజీపీని రూపొందించారు. అదేవిధంగా ఐఆర్‌డీపీ, ట్రైసమ్, డ్వాక్రా, సిట్రా, జీకేవై, మిలియన్ బావుల కార్యక్రమాలను విలీనం చేసి 1999లో స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్‌గార్ యోజనను రూపొందించారు. పరీక్షలో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఎక్కువ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ కార్యక్రమాల గురించి మరింత ఎక్కువ దృష్టి సారించాలి. ముఖ్యంగా మహిళా సాధికారితలో భాగంగా మహిళా ఆర్థిక సాధికారిత కోసం ప్రవేశపెట్టిన సూక్ష్మ విత్త భావన అయిన స్వయం సహాయక బృందాలకు సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి.
-గ్రామీణ సమాజంలో వ్యవసాయం, చేతివృత్తులు, కుల వృత్తులు, ఇతర ఆదాయ మార్గాలు ప్రపంచీకరణ ప్రభావం వంటి పునరుద్ధరణ కోసం చేపడుతున్న అంశాలను లోతుగా అధ్యయనం చేయాలి.
గ్రామ పంచాయతీ ఆదాయ, వ్యయాల నిర్వహణ
-గ్రామీణాభివృద్ధికి ఆదాయం తప్పనిసరి. సొంత వనరులు, ప్రభుత్వ గ్రాంట్ల రూపంలో అందిన ఆదాయాలను వివిధ కార్యక్రమాల అమలు కోసం ఖర్చు చేసే సందర్భంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఖర్చు చేయాల్సి ఉంటుంది. క్యాష్బుక్, చిట్టా ఇర్సాల్ నామా, బిల్‌బుక్స్, స్టాక్ రిజిష్టర్ల నిర్వహణకు సంబంధించి నియమ నిబంధనల గురించి పంచాయతీ కార్యదర్శి కి అవగాహన ఉండాలి.
-మొత్తంగా పరిశీలిస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో పంచాయతీ కార్యదర్వి ఉద్యోగాల ప్రకటన నిరుద్యోగులకు మంచి అవకాశాన్ని కల్పించింది. పేపర్-1లో జనరల్ స్టడీస్‌పై చాలా మందికి అవగాహన ఉండవచ్చు. కానీ, పేపర్-2లోని అంశాలు విభిన్నంగా ఉన్నందున దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. అంతిమంగా ఈ పేపర్లో వచ్చే మార్కులే డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ఉండవచ్చు.
పేపర్ – 2 సిలబస్
1. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం – 2018 Telangana PanchayatRaj Act, 2018
2. భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ పరిణామం, రాజ్యాంగ సవరణలు, వివిధ కమిటీల నివేదికలు
-Evolution of PanchayatRaj system in india including constitutional amendments and reports of various committies
3. పంచాయతీ కార్యదర్శి విధులు, బాధ్యతలు
-Rules and Responsibilities of Panchayat Secretary
4. గ్రామీణ సమాజశాస్త్రం: గ్రామీణ పేదల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న కార్యక్రమాల చరిత్ర, పరిణామం
-Rural Sociology: History and Evolution of schemes catering to upliftment of Rural poor
5. తెలంగాణ, భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి విభాగం ప్రవేశపెట్టిన ప్రతిష్ఠాత్మకమైన గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు
-Flagship Rural Development schemes of Rural Development Department of Government of india and Telangana
6. తెలంగాణ గ్రామీణ ఆర్థికవ్యవస్థ: వ్యవసాయం, చిన్నతరహా పరిశ్రమలు, గ్రామీణ చేతివృత్తులు
-Rural Economy of Telangana: Agriculture, Small scale Industries Rural artisans
7. సముదాయ ఆధారిత సంఘాలు, సంక్షేమ కార్యక్రమాల విలీనీకరణ
-Community Based organiszations and convergence of welfare schemes
8. మహిళా సాధికారత, స్వయం సహాయక బృందాల ద్వారా ఆర్థికాభివృద్ధి
-Women Empowerment and Economic development through self help Groups
9. స్థానిక సంస్థల్లో ఆదాయం, ఖర్చుల నిర్వహణ
-Revenue and Expenditure Management of Local Bodies
10. వివిధ కార్యక్రమాల కోసం వచ్చిన నిధుల గణాంకాలు, పరిపాలనపరంగా నిర్వహణ
పంచాయతీ కార్యదర్శి విధులు
-గ్రామస్థాయిలో ప్రభుత్వం తరఫున కార్యనిర్వహణ అధికారిగా పంచాయతీ కార్యదర్శి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం – 2018లో పేర్కొన్న విధులను, బాధ్యతలను, అదేవిధంగా ప్రభుత్వం పంచాయతీరాజ్ కమిషనర్, జిల్లా కలెక్టర్ అప్పగించిన విధులను, బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది.
-నూతన పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 43లో పంచాయతీ కార్యదర్శి విధుల గురించి స్పష్టంగా పేర్కొన్నారు.
1. గ్రామ పంచాయతీ పాలకవర్గం గ్రామ పంచాయతీ సమావేశం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి.
2. చర్చల్లో పాల్గొనవచ్చు కానీ ఓటుహక్కు ఉండదు.
3. తీర్మానాలను అమలు చేయాలి.
4. పారిశుద్ధ్య నిర్వహణ
5. తాగునీటి సరఫరాపై నివేదికను తయారుచేయాలి.
6. ఆదాయ, వ్యయాల రికార్డుల నిర్వహణ
7. విద్యుత్ దీపాల నిర్వహణ
8. ఘన వ్యర్థాల నిర్వహణ
9. హరితహారంలో పాల్గొనడం
10. పన్నుల వసూలు
-మొత్తంగా గ్రామ పంచాయతీ విధులన్నింటిని గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రత్యక్షంగా నిర్వహిస్తారు. కాబట్టి గ్రామంలోనే నివసించాల్సి ఉంటుంది.
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు