– దేశంలో పంట కాలాన్ని మూడు రకాలుగా వర్గీకరించారు.
1) ఖరీఫ్ పంటకాలం: జూన్ నుంచి అక్టోబర్ వరకు.
ఉదా: వరి, మొక్కజొన్న, జొన్న, పత్తి, చెరకు, జనుము, నువ్వులు, సోయాబీన్, వేరుశనగ మొదలైనవి.
2) రబీ పంటకాలం: అక్టోబర్ నుంచి మార్చి వరకు.
ఉదా: గోధుమ, బార్లీ, మినుములు, పొద్దుతిరుగుడు, దనియాలు, ఆవాలు.
3) జైద్ పంటకాలం: ఏప్రిల్ నుంచి జూన్ వరకు.
ఉదా: పుచ్చకాయలు, దోసకాయలు, కూరగాయలు.
మొదటి హరితవిప్లవం
– దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు ఆహార ధాన్యాల లోటు తీవ్రంగా ఉండి దిగుమతులపై ఆధారపడి ఉండేది.
– 3వ పంచవర్ష ప్రణాళిక కాలంలో వ్యవసాయ రంగంలో ఉత్పత్తులు తగ్గి ఆహార కొరత ఏర్పడటంవల్ల విదేశాల నుంచి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకున్నాం.
– ఉత్పత్తిని పెంచేందుకు ఫోర్డ్ ఫౌండేషన్ నిపుణుల సంఘం చేసిన సూచనల ప్రకారం భారత ప్రభుత్వం 1960లో దేశంలోని ఏడు జిల్లాల్లో సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకం (ఇంటెన్సివ్ అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్) ప్రవేశపెట్టింది. ఆ ఏడు జిల్లాలు.. పశ్చిమగోదావరి (ఏపీ), షాహబాద్ (బీహార్), రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్), తంజావూరు (తమిళనాడు), లూథియానా (పంజాబ్), అలీగఢ్ (ఉత్తరప్రదేశ్), పాలి (రాజస్థాన్).
– ఈ జిల్లాల్లో వనరులను కేంద్రీకరించి పరపతి, ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులు రైతులకు అందించే ప్యాకేజీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకంలో లోపాలు సవరించి 1965లో సాంద్ర వ్యవసాయ ప్రాంతాల పథకాన్ని 114 జిల్లాల్లో ప్రవేశపెట్టారు.
నూతన వ్యవసాయక వ్యూహం
– ఆహారం విషయంలో స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో 1966 ఖరీఫ్ పంటకాలంలో నూతన వ్యవసాయిక వ్యూహం ప్రవేశపెట్టారు. దీన్నే అధిక దిగుబడి వంగడాల కార్యక్రమం అంటారు.
ముఖ్యాంశాలు
1) అధిక దిగుబడి వంగడాలు ప్రవేశపెట్టడం: 1960లో మెక్సికోలోని రాక్ఫెల్లర్ ఫౌండేషన్‌కు చెందిన నార్మన్ బోర్లాగ్ అధిక దిగుబడినిచ్చే గోధుమ వంగడాలను అభివృద్ధి చేశారు.
ఉదా: మిరాకిల్ వీట్, లెర్మారోజా-64, సోనారా-64, కల్యాణ్, పీవీ-18.
– తైవాన్‌లో అభివృద్ధి చేసిన వరివంగడం తైచుంగ్ నేటివ్.
– అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (మనీలా) అభివృద్ధి చేసిన వరి వంగడాలు.
ఉదా: ఐఆర్-8, ఐఆర్-3, ఐఆర్-67.
– ఇండియన్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన వరి వంగడాలు. ఉదా: జయ, పద్మ, 1001
– 1965లో భారతదేశం సోనారా 64, లెర్మారోజా 64, గోధుమ విత్తనాలను దిగుమతి చేసుకుని ఈ వ్యూహాన్ని అనుసరించింది.
– వరి పంట విషయంలో ఐఆర్-8 ఫలితాన్నిచ్చింది.
2) అల్ప ఫలనకాలపు పంటలను ప్రవేశపెట్టడం: ఈ పద్ధతిలో ఒక ఏడాదిలో ఒక పంట మాత్రమే పండించే భూముల్లో రెండు, మూడు పంటలు పండే అవకాశం ఉంటుంది.
– అంతకుముందు 5-6 నెలల ఫలనకాలంగల వంగడాలకు బదులు ఐఆర్-3, జయ, పద్మ వంటి వంగడాలు ప్రవేశపెట్టడంవల్ల నాలుగు నెలలకే వరి పంట చేతికొస్తుంది.
3) ఆధునిక సాంకేతిక పద్ధతులు:
– పంటమార్పిడి, బహుళ పంటలు: అల్ప ఫలనకాల వంగడాలవల్ల ఒక ఏడాదిలో ఒక సాగునెలలో పంటల మార్పిడి పద్ధతి ప్రవేశపెట్టడానికి వీలు కలిగింది. ఈ పద్ధతివల్ల భూసారం కాపాడుకుంటూ ఉత్పాదకత పెంచవచ్చు.
– నీటిపారుదల రసాయనిక ఎరువులు: కృత్రిమ ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం పెరిగింది. వీటి వాడకం 1950-51లో 0.70 మి.టన్నుల నుంచి 1995-96లో 13.90 మి.టన్నులకు పెరిగింది. రసాయనిక ఎరువుల వాడకంవల్ల ఎక్కువ నీటి వసతి అవసరం. కాబట్టి గొట్టపు బావుల ద్వారా భూగర్భ జలాల వాడకం పెరిగింది.
– యంత్రాలు, పనిముట్లు: కాలం వృథాకాకుండా, బహుళ పంటల ఉత్పత్తికి వీలుగా ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, పంపుసెట్లు మొదలైన ఆధునిక యంత్ర పరికరాలు ప్రవేశపెట్టారు.
– పంటల రక్షణ: పంటల రక్షణ కోసం క్రిమిసంహారక మం దులు వినియోగించడం, విత్తనాల శుద్ధి వంటి పద్ధతులు ప్రవేశపెట్టారు.
4) పరపతి పెంచడం: ఈ వ్యూహాన్ని అనుసరించడానికి అధిక పెట్టుబడి అవసరం. సహకార, వాణిజ్య బ్యాంకులు పరపతి సమకూర్చడంలో ప్రధాన పాత్ర పోషించా యి.
5) మద్దతు ధరలు ప్రకటించడం: 1964 నుంచి దేశవ్యాప్తంగా ఆహారధాన్యాలకు మద్దతు ధరల విధానం ప్రకటించారు.
– ఆహారధాన్యాల ధరల విధానంలో సలహాలివ్వడం కోసం వ్యవసాయ ధరల కమిషన్ (1965) ఏర్పాటు చేశారు.
– ఆహార ధాన్యాల కొనుగోలు కోసం 1965లో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)ను స్థాపించారు.
– 1985లో వ్యవసాయ ధరల కమిషన్ స్థానంలో వ్యవసా య వ్యయాలు, ధరల కమిషన్ ఏర్పాటైంది. ఈ కమిషన్ సిఫారసులు, రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత మంత్రిత్వ శాఖల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలు ప్రకటిస్తుంది.
6) ప్రభుత్వ సంస్థల ఏర్పాటు: 1963లో జాతీయ విత్తన సంస్థ ఏర్పడింది.
– 1965లో వ్యవసాయాధార పరిశ్రమల సంస్థలు ఏర్పడ్డాయి.
– 1963లో వ్యవసాయక రీఫైనాన్స్ సంస్థ వ్యవసాయ రీఫైనాన్స్ అభివృద్ధి సంస్థగా మారింది. తర్వాత నాబార్డ్గా అవతరించింది.
– 1965లో ఆహారధాన్యాల సేకరణ, నిల్వ, పంపిణీ కోసం భారత ఆహార సంస్థను ఏర్పాటు చేశారు.
రెండో హరిత విప్లవం
– 11వ పంచవర్ష ప్రణాళికలో చెప్పినవిధంగా వ్యవసాయ రంగంలో 4 శాతం వృద్ధిరేటు సాధించాలంటే రెండో హరి త విప్లవం అవశ్యకత ఏమిటో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ 2006లో వెల్లడించారు. 12వ ప్రణాళికలో వ్యవసా య రంగ వృద్ధిరేటును 4 శాతం లక్ష్యంగా నిర్ణయించారు.
– తూర్పు భారత్‌లో పంటల ఉత్పాదకతను పెంచడానికి ప్రాధాన్యమిస్తూ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకంలో భాగంగా 2010-11లో బీజీఆర్ఈఐ (బీజింగ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఈస్టర్న్ ఇండియా)ని ప్రారంభించారు.
ప్రధాన లక్ష్యం
– సుస్థిర అభివృద్ధి: రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలి. సేంద్రీయ వ్యవసాయ పద్ధతులకు పెద్దపీట వేయాలి. ప్రకృతి వనరుల వాడకపు నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. బయోటెక్నాలజీ జన్యు పరివర్తిత పంటలకు విశేష ప్రాధన్యమివ్వాలి.
– సామాజిక న్యాయం: మొదటి హరిత విప్లవం కారణంగా ఆర్థిక వ్యత్యాసాలు, ప్రాంతీయ వ్యత్యాసాలు పెరిగినందున రెండో సస్య విప్లవ దశలు సామాజిక న్యాయానికి తగిన ప్రాధాన్యమియ్యాలి.
– నూతన వ్యవసాయక వ్యూహం ద్వారా వ్యవసాయ రంగం లో వృద్ధి నమోదైంది. కానీ 1991 సంస్కరణల కాలంలో వృద్ధి (ఉత్పత్తి, ఉత్పాదకత) తగ్గింది. నీటిపారుదల వసతి లోపం, వ్యవసాయరంగంలో ప్రభుత్వ పెట్టుబడి తక్కువ, పరపతి సౌకర్యాల కొరత, ఆధునిక సాంకేతిక విజ్ఞానం అల్ప వినియోగం వంటివి దీనికి కారణం.
– పశుసంపద రంగంలో సుస్థిర, నిరంతర వృద్ధి కోసం 2014-15లో జాతీయ పశుసంపద (నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్) పథకాన్ని ప్రారంభించారు. ఈ మిషన్‌కు 12వ పంచవర్ష ప్రణాళికలో రూ.2,800 కోట్లు కేటాయించారు.
– తక్కువ దిగుబడినిచ్చే భూముల్లో తోటల పెంపకానికి ప్రాధాన్యమిచ్చి పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు ఎక్కువ పండించాలని నిర్ణయించారు.
– పశుగణాభివృద్ధి, పాడిపరిశ్రమ, చేపల పెంపకం, పట్టు పరిశ్రమ అభివృద్ధికి చర్యలు చేపట్టారు.
హరిత విప్లవం
– మెక్సికోలో 1960 దశకంలో హరిత విప్లవం ప్రారంభమైంది. నార్మన్ బోర్లాగ్ మెక్సికోలో గోధుమ వంగడాలపై పరిశోధన జరిపి అధికంగా దిగుబడినిచ్చే గోధుమ వంగడాలు రూపొందించారు. ఈయనను హరిత విప్లవ పితామహుడు అంటారు.
– భారత్‌లో వ్యవసాయ శాస్త్రవేత్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నార్మన్ బోర్లాగ్, భారతీయ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్లు హరిత విప్లవంలో కీలక పాత్ర పోషించారు. అమెరికా శాస్త్రవేత్త విలియం ఎస్ గాండే దీనికి హరిత విప్లవం అని నామకరణం చేశారు.
– భారత్‌లో హరితవిప్లవ పిత అని ఎంఎస్ స్వామినాథన్‌ను పిలుస్తారు.
– హరిత విప్లవం అనే పదాన్ని 1968, మార్చిలో జర్మనీలోని అంతర్జాతీయ అభివృద్ధి సమావేశంలో విలియం ఎస్ గాండే ఉపయోగించారు.
– వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని పెంచేందుకు అధిక దిగుబడినిచ్చే వంగడాలను ఇతర వ్యవసాయ ఉత్పాదకాలను ఉపయోగించి, రైతుల్లో నవ చైతన్యాన్ని కల్పించి జీవనాధార వ్యవసాయాన్ని పరిశ్రమగా మార్చే మార్పుల సమాహారమే హరిత విప్లవం.
– దీనిలో మూడు ప్రధానాంశాలున్నాయి.. 1) అధిక దిగుబడినిచ్చే సంకరజాతి వంగడాలు 2) సరిపడినంత నీటిపారుదల సౌకర్యాలు 3) రసాయనిక ఎరువులు, పురుగు మందుల వినియోగం.
– పై వాటిని ఉపయోగించి అధిక ఉత్పాదకతలను సాధించడమే హరిత విప్లవం. 1965-67లో అధిక ఉత్పత్తి విత్తనాల కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రయోజనాలు: హరిత విప్లవంవల్ల గోధుమ దిగుమతి ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. వరి, మక్కజొన్న, జొన్న, సజ్జ వంటి పంటల్లో ఉత్పాదకత కూడా గణనీయంగా పెరిగింది. ఫలితంగా ఆహారధాన్యాల ఉత్పత్తి బాగా పెరిగి దేశం స్వయం సమృద్ధమైంది. 1950-51లో 50.8 మిలియన్ టన్నులుగా ఉన్న ఆహార ధాన్యాల ఉత్పత్తి 2001-02 నాటికి 212 మిలియన్ టన్నులకు పెరిగింది.
– హరిత విప్లవం ప్రభావంవల్ల గోధుమ ఉత్పత్తి 11 మిలియన్ టన్నుల నుంచి 78 మిలియన్ టన్నులకు పెరిగింది. వరి ఉత్పత్తి 35 మిలియన్ టన్నుల నుంచి 96 మిలియన్ టన్నులకు పెరిగింది.
దుష్పరిణామాలు: ఈ విప్లవ ఫలితాలు గోధుమ, వరి, జొన్న వంటి పంటలకే పరిమితం కాగా పప్పుధాన్యాల వంటివి ఎటువంటి లబ్ధిపొందలేదు. ఈ హరిత విప్లవంవల్ల పంజా బ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ రాష్ర్టాలు అత్యధిక లబ్ధిని పొందగా, ఒడిశా, మధ్యప్రదేశ్ వంటి రాష్ర్టాలు పూర్తిగా వెనుకబడిపోవడంతో ప్రాంతీయ అసమానతలు తలెత్తాయి.
– భూస్వాములు మరింత ధనవంతులు కాగా పేద రైతులు మరింత పేదలయ్యారు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వినియోగం విచ్చలవిడిగా పెరిగి భూమి, నీరు కలుషితమయ్యాయి.
– 1980 నుంచి 1967 మధ్యకాలంలో 3.2% ఉన్న వ్యవసాయరంగ వృద్ధిరేటు ఆ తర్వాత 2% పడిపోయింది.