Reservations | రిజర్వేషన్లు- విస్తరణ
భారతీయ సమాజంలోని ఆర్థిక, సామాజిక, విద్యాపరమైన వెనుకబాటు తనాన్ని రూపుమాపడానికి, బలహీన వర్గాలకు విద్య, ఉద్యోగ రంగాల్లో చేయూతనివ్వడానికి రాజ్యాంగ నిర్మాతలు కల్పించిన ప్రత్యేక సదుపాయం రిజర్వేషన్లు.
-రాజ్యాంగంలోని నాలుగో భాగంలో పొందుపర్చిన ఆదేశిక సూత్రాల్లోని 46వ ప్రకరణ రిజర్వేషన్ల గురించి పేర్కొంటుంది. ప్రాథమిక హక్కుల్లో రిజర్వేషన్లకు రక్షణ కల్పించే అంశాలున్నాయి. ఈ అధికరణలు సకారాత్మక భావనని కలిగి ఉంటాయి. అంటే ప్రభుత్వం చేయాల్సిన పనులని సూచిస్తాయి. రాజ్యాంగ ప్రాథమిక భావనలైన సామాజిక న్యాయం, సమానత్వం సాధించటానికి రిజర్వేషన్లు సాధనాలుగా ఉపకరిస్తాయన్నది రాజ్యాంగ నిర్మాతల అభిమతం. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తొలినాళ్లలో దళిత, గిరిజన వర్గాలకు మాత్రమే పరిమితమైన రిజర్వేషన్లు కాలక్రమంలో ఇతర వెనుకబడిన తరగతులకు కూడా విస్తరించాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో అగ్రవర్ణాల్లోని ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు కూడా 103వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రత్యేక కోటా కల్పించారు. అంటే రిజర్వేషన్ విధానం రోజురోజుకీ విస్తరిస్తోంది. తాజాగా మహారాష్ట్రలోని మరాఠాలకు ప్రత్యేక కోటా కల్పించడం, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ఓబీసీ కులాలని ఎస్సీ జాబితాలో చేర్చడం, కశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు ప్రాంత నివాసులకు కూడా రిజర్వేషన్ ఫలితాలని విస్తరించడంతో రిజర్వేషన్ విధానం మరోసారి చర్చలోకి వచ్చింది.
మరాఠా రిజర్వేషన్లు
-ముందుగా మరాఠా రిజర్వేషన్ల అంశాన్ని పరిశీలిస్తే.. మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠాలను సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులుగా గుర్తించి విద్య, ఉద్యోగ రంగాల్లో 16 శాతం రిజర్వేషన్లు కల్పించింది. అయితే బాంబే హైకోర్టు ఈ రిజర్వేషన్ల విధానాన్ని సమర్థిస్తూనే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన గైక్వాడ్ కమిషన్ సూచించినట్లుగా 12-13 శాతానికి పరిమితం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
నేపథ్యం
-మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ ఈ నాటిది కాదు. చాలా కాలంగా ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే రెండో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (మండల్ కమిషన్) మరాఠాలని అగ్రవర్ణాలుగా గుర్తిస్తూ వారిని ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) జాబితాలో చేర్చడానికి నిరాకరించింది. దీంతోపాటు మహారాష్ట్ర ప్రభుత్వం నియమించిన వెనుకబడిన తరగతుల కమిషన్లు ఖత్రి కమిషన్ 1995, బాపత్ కమిషన్ 2008 కూడా మరాఠాలని ఓబీసీల్లో చేర్చకూడదని స్పష్టం చేశాయి. అయితే మరాఠాల రిజర్వేషన్ల పోరాటం మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో 2015లో రాష్ట్ర ప్రభుత్వం నారాయణ్ రాణే కమిషన్ని నియమించింది.
-ఈ కమిషన్ మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలని సూచించడంతో ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించింది. అయితే బాంబే హైకోర్టు ఈ అంశాన్ని పరిశీలిస్తూ రాణే కమిషన్ చట్టబద్దతని ప్రశ్నించింది. అట్లాగే మరాఠాల సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనాన్ని నిర్ధారించేందుకు చట్టబద్దమైన కమిషన్ని ఏర్పాటు చేయాలని, ఆ కమిషన్ సిఫారసుల మేరకు మాత్రమే రిజర్వేషన్లని విస్తరించాలని సూచించింది. అలా ఏర్పాటు చేసిందే గైక్వాడ్ కమిషన్.
ఉత్తర్ ప్రదేశ్ – ఎస్సీ జాబితాలో మార్పులు
-బీసీ జాబితాలోని 17 కులాలని ఎస్సీలుగా పరిగణిస్తూ వారికి కులధృవీకరణ పత్రాలు జారీచేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులిచ్చింది. గతంలో వీరిని ఎస్సీలుగా పరిగణించాలని సూచించిన యూపీ సర్కార్ ప్రస్తుతం కులధృవీకరణ పత్రాలు కూడా జారీచేయాలని అధికారులని ఆదేశించింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులు అలహాబాద్ హైకోర్టు విచారణలో ఉండగానే తాజాగా ఇచ్చిన ఉత్తర్వులు వివాదాస్పదం అయ్యాయి. రాజ్యాంగంలోని 341(2) అధికరణ ప్రకారం ఏదైనా కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చాలన్నా, తొలగించాలన్నా రాజ్యాంగపరమైన ప్రక్రియ ఉంది. ముందుగా సంబంధింత రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని జాతీయ ఎస్సీ కమిషన్‌కు నివేదిస్తుంది.
ఈ కమిషన్ విచారణ జరిపి పార్లమెంట్ నివేదిస్తుంది. పార్లమెంట్ బిల్లు రూపంలో దాన్ని ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఆ కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చుతారు. ప్రస్తుతం యూపీ రాష్ట్ర ప్రభుత్వం చట్టపరమైన ప్రక్రియని అనుసరించలేదన్నది నిపుణుల వాదన.
-మరో ముఖ్య విషయం ఏమిటంటే ఎస్సీ కులంగా పరిగణించబడాలంటే ఆర్థిక, సామాజిక వెనుకబాటుతోపాటు సంబంధింత కులం చారిత్రకంగా అణచివేత, సామాజిక వెలి, అంటరానితనం వంటి అమానవీయమైన చర్యలని అనుభవించినదై ఉండాలి. కాని యూపీ ప్రభుత్వం ఇప్పటివరకూ ఓబీసీలుగా గుర్తించబడినవారిని ఎస్సీలుగా పరిగణించడంతో వివాదం రాజుకుంది.
జమ్ము కశ్మీర్- రిజర్వేషన్ల విస్తరణ
-ఇది నేరుగా రిజర్వేషన్ల విస్తరణకు సంబంధించిన అంశం కానప్పటికి జమ్ము కశ్మీర్ రాష్ట్ర రిజర్వేషన్ల చట్టాన్ని పార్లమెంట్ సవరించడం చర్చకు కారణమైంది. జమ్ము కశ్మీర్ రిజర్వేషన్ల చట్టం ( సవరణ) 2019 ప్రకారం ఇప్పటి వరకూ వాస్తవాధీనరేఖ (చైనాతో సరిహద్దు), అధీన రేఖ (పాక్‌తో సరిహద్దు) వెంబడి నివసించే కశ్మీరీలకు వర్తించే 3 శాతం రిజర్వేషన్లని ఇప్పుడు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి నివసించే వారికి కూడా వర్తింపజేశారు. దీంతోపాటు 103 వ రాజ్యాంగ సవరణ ద్వారా అమల్లోకి వచ్చిన 10 శాతం ఈడబ్ల్యూ ఎస్ కోటాని, ప్రమోషన్లలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లని కూడా జమ్మూ కశ్మీర్ కు విస్తరింపజేశారు.
-అయితే భారత రాజ్యంగంలోని అధికరణ 370 ప్రకారం జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి, ప్రత్యేక రాజ్యాంగం ఉన్నాయి. అట్లాగే భారత పార్లమెంట్ చేసే ఏ చట్టాలైనా నేరుగా జమ్మూ కశ్మీర్‌కు వర్తించవు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తప్పనిసరి. 1972లో సుప్రీం ఇచ్చిన తీర్పు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అనగా కేంద్రం నియమించిన గవర్నర్‌తోపాటు, రాష్ట్ర మంత్రి మండలి. కానీ గత ఏడాది కాలంగా అక్కడ ప్రజాప్రభుత్వం లేదు. ఫలితంగా ఈ చట్టానికి కావాల్సిన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం లభించలేదు. అయితే జమ్ము కశ్మీర్ కోసం ఉద్దేశించిన రాష్ట్రపతి ఉత్తర్వులు 1954ని సవరించడం ద్వారా కేంద్రం ఈ రిజర్వేషన్లని వర్తింపజేసింది. ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం ఉనికిలో లేనప్పుడు ఇలాంటి చర్యలు తీసుకోవడంతో నిపుణులు విభేదిస్తున్నారు.
ముగింపు
-సుప్రీంకోర్టు న్యాయమూర్తి చంద్రచూడ్ మాటల్లో రిజర్వేషన్లు అనేవి సమానత్వానికి విఘాతం కాదు. అవి సమానత్వ సాధనకు ఉద్దేశించిన అస్ర్తాలు. వాటిని వీలైనంత హేతుబద్ధంగా అమలు చేయడం, విస్తరించడం ప్రభుత్వాల చేతుల్లో ఉంది.
గైక్వాడ్ కమిషన్-నివేదిక
-గతంలో వెనుకబడిన తరగతులను నిర్ధారించడానికి మండల్ కమిషన్ 11 సూచికల ఆధారంగా చేసుకుంది. గైక్వాడ కమిషన్ వాటితోపాటు మరిన్ని సూచికలని పరిగణలోనికి తీసుకున్నారు. ఉదాహారణకు మొత్తం రైతు ఆత్మహత్యల్లో మరాఠాల సంఖ్య, ముంబైలో పనిచేస్తున్న డబ్బావాలాల్లో మరాఠాల శాతం వంటివి కూడా రిజర్వేషన్లు కల్పించడానికి ఆధారంగా తీసుకున్నారు. అయితే ఇలాంటి సూచికలన్నీ అసంబద్ధమైనవన్నది నిపుణుల వాదన.
-దీంతోపాటు అసాధారణ అంశం ఏమిటంటే, మరాఠాలను వెనుకబడిన వర్గాలుగా గుర్తించాలంటే ఓబీసీల జాబితాలో చేర్చి రిజర్వేషన్ల పరిమితిని విస్తరించవచ్చు. కానీ మరాఠా వర్గాన్నే ప్రత్యేక తరగతి (SEBC)గా పరిగణించి రిజర్వేషన్ కల్పించారు. దీన్నే రాజ్యాంగ పరిభాషలో వర్గ చట్టం
-(class legislation) అంటారు. రాజ్యాంగంలోని అధికరణ 14 వర్గ చట్టాన్ని నిషేధిస్తుంది. గత అనుభవాలను పరిశీలిస్తే మరాఠా రిజర్వేషన్ల విధానంలోనే రూపొందించిన గుజ్జర్ల రిజర్వేషన్లను గుర్విందర్ సింగ్ కేసులో సుప్రీం కోర్టు కొట్టేసింది. రామ్‌సింగ్ కేసులో జాట్ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం అని తేల్చింది.
-మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే గతేడాది జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు రాజ్యాంగ బద్ధత కల్పించారు. ఆర్టికల్ 342 (బి) ప్రకారం వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారం ఈ కమిషన్‌కు ఉంటుంది. మరాఠాల రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌తో సంప్రదింపులు జరపలేదు. కాగా బాంబే హైకోర్టు ఈ విషయాన్ని అంత తీవ్రంగా పరిగణించలేదు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు