Quit India Movement | క్విట్ ఇండియా ఉద్యమం
-రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్‌కు వ్యతిరేకంగా భారత రక్షణను ప్రజాప్రభుత్వానికి అప్పజెప్పాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. దీనికిగాను గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని రూపొందించారు. 1942, జూలైలో వార్ధాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ బ్రిటిష్‌వారిని భారతదేశం వదిలివెళ్లమని ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీన్నే ఆంగ్లంలో క్విట్ ఇండియా అంటారు.
-దీన్ని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ 1942, ఆగస్టు 8న ఆమోదించడంతో జాతీయోద్యమం తుది దశ బొంబాయిలో ప్రారంభమైంది. అదే రోజు బొంబాయిలోని గోవాలియా చెరువు మైదానంలో గాంధీజీ అశేషజనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఐక్య రాజ్యాల విజయం కోసం, భారతదేశం కోసం భారతదేశంలో బ్రిటిష్ పాలన వెంటనే ముగియడం అత్యవసరం. కావున ప్రజాపోరాటమే ఏకైక మార్గమని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తీర్మానించింది.
-ఈ ఉద్యమానికి ఆధారం అహింస అన్న విషయం ప్రజలు గుర్తుంచుకోవాలని కూడా ఆ తీర్మానం పేర్కొంది. 1942, ఆగస్టు 9న గాంధీని, ప్రముఖ నాయకులందరినీ ప్రభుత్వం నిర్బంధించడమే కాకుండా కాంగ్రెస్ సంస్థను నిషేధించింది. పోలీసులు ఉద్యమాన్ని అణచివేసేందుకు క్రూరమైన చర్యలకు దిగారు. డూ ఆర్ డై (ఉద్యమించండి లేదా మరణించండి) అని ప్రజలకు గాంధీజీ పిలుపునిచ్చారు.
-అంతేకాక మనం భారతదేశాన్ని విముక్తి అయినా చేద్దాం లేదా ఆ ప్రయత్నంలోనైనా మరణిద్దాం అని ఆయన అన్నారు. అందుకు కేవలం అహింసాత్మక ప్రజా ఉద్యమమే మార్గమని కూడా గాంధీజీ చెప్పారు.
-జాతీయ నాయకులందరూ అరెస్టయినప్పు డు అరుణా అసఫ్ అలీ, జయప్రకాష్ నారాయణ్ లాంటి రెండో తరం నాయకులు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఉషామెహతా కాంగ్రెస్ రేడియోను నిర్వహించారు.
సీ రాజగోపాలచారి సూత్రం (1944)
-గాంధీజీ ఆమోదంతో కాంగ్రెస్ తరఫున ముస్లింలీగ్ సహకారం కోసం, మత సమస్యల పరిష్కారం కోసం సీ రాజగోపాలచారి ఒక సూత్రాన్ని 1944, మార్చిలో ప్రతిపాదించారు. ఈ సూత్రాన్ని రాజగోపాలచారి తన ది వే ఔట్ పాంప్లెట్ అనే కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారంలోకి తెచ్చారు.
-స్వయం నిర్ణయాధికార హక్కు కోసం పాకిస్థాన్‌ను ఏర్పాటు చేయాలనే ముస్లింలీగ్ కోరికను ఆయన అంగీకరించారు. కాంగ్రెస్‌కు కావల్సింది స్వాతంత్య్ర సాధన, దానికోసం ముస్లింల సహకారాన్ని పొందడానికి ఎంత నష్టాన్నయినా భరించడానికి కాంగ్రెస్ సిద్ధమైంది. కానీ ముస్లింలీగ్ ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రచారంలోకి తీసుకువచ్చి ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా దేశవిభజనను అంగీకరించాలని కాంగ్రెస్‌ను కోరింది.
-భారతదేశం స్వాతంత్య్రాన్ని కోరడాన్ని ముస్లింలీగ్ ఆమోదించి తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్‌కు సహకరించాలని, యుద్ధం ముగిసిన తర్వాత ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్న జిల్లాల సరిహద్దులను గుర్తించేందుకు ఒక కమిషన్ ఏర్పాటవుతుందని, ఆ జిల్లాల్లో ముస్లింలతో పాటు ముస్లిమేతరులను కూడా కలపుపుకొని వయోజన విధానంలో అందరి నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతుందని రాజగోపాలచారి ప్రతిపాదించారు.
-విభజన కారణంగా ప్రజలు తరలిపోవల్సి వస్తే వారి అభీష్టం మేరకే జరగాలి, భారత ప్రభుత్వానికి కావల్సిన సంపూర్ణ బాధ్యతను, అధికారాన్ని బ్రిటిష్ ప్రభుత్వం పూర్తిగా బదిలీచేసే పక్షంలో మాత్రమే బ్రిటిష్ ప్రభుత్వం విధించే నిబంధనలకు కట్టుబడాలని సీఆర్ ప్రతిపాదించారు.
అమేరి-వేవెల్ ప్రణాళిక (1945)
-భారత వ్యవహారాల మంత్రి అమేరి, భారత వైశ్రాయ్, గవర్నర్ జనరల్ లార్డ్ వేవెల్ బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్తో చర్చించి కొన్ని ప్రతిపాదనలు చేశారు. కావున దీన్ని అమేరి-వేవెల్ ప్రణాళిక అంటారు.
-భారతదేశంలోని ప్రధాన మతాలకు సంబంధించినవారికి సముచిత ప్రాతినిధ్యం కల్పించడం కోసం వైశ్రాయ్ కార్యనిర్వహణ మండలిని విస్తరించాలని, భారత్‌లో బ్రిటిష్‌వారి ప్రయోజనాలు కాపాడేందుకు ఒక హైకమిషనర్‌ను నియమించాని, వైశ్రాయ్ కార్యనిర్వహణ మండలిలో విదేశీ వ్యవహారాలను భారతీయ సభ్యుడికి అప్పగించాలని, ముఖ్య సైనికాధికారి పదవిని భారతీయునితో భర్తీ చేయాలని ప్రతిపాదించారు.
సిమ్లా సమావేశం (1945)
-వేవెల్ ప్రణాళికలోని అంశాలను చర్చించేందుకు వైశ్రాయ్ వేవెల్ 1945, జూలైలో సిమ్లాలో ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ యునైటెడ్ ఇండియా కోసం, ముస్లింలీగ్ దేశ విభజనకు పట్టుబట్టారు. భారత ముస్లింలకు ఒకే ఒక ప్రతినిధిగా ముస్లింలీగ్‌ను మాత్రమే పరిగణించాలని, లీగ్ సభ్యులు కాని ముస్లింలను రాజప్రతినిధి కార్యనిర్వహణ మండలిలో చేర్చుకోరాదని జిన్నా పట్టుబట్టాడు. దీంతో సమావేశం విఫలమైంది.
కేబినెట్ మిషన్ (1946)
-1945లో బ్రిటన్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించింది. లార్డ్ క్లెమెంట్ అట్లీ ప్రధాని అయ్యాడు. బ్రిటన్ ప్రధాని అట్లీ 1946, మార్చిలో పార్లమెంట్లో ఒక ప్రకటన చేశారు. అల్ప సంఖ్యాకుల హక్కుల పట్ల మాకు గుర్తింపు ఉంది. అల్పసంఖ్యాకులు నిర్భయంగా జీవించాలి. అయితే అధిక సంఖ్యాకుల పురోగతిని కాదనే అల్పసంఖ్యాక వర్గాన్ని కూడా మనం అనుమతించలేమని పేర్కొన్నారు. అందులో భాగంగా బ్రిటన్‌లో కేబినెట్ మం త్రులైన సర్ స్టాఫర్డ్ క్రిప్స్, ఏవీ అలెగ్జాండర్, లార్డ్ పెథిక్ లారెన్స్ సభ్యులుగాగల మంత్రిత్రయ బృందం భారత్‌లో పర్యటించింది. ఈ రాయబారానికి సర్ పెథిక్ లారెన్స్ చైర్మన్‌గా వ్యవహరించారు. 1946, మే 16న వీరు తమ ప్రణాళికను వెల్లడించారు.
-ఈ ప్రణాళిలో రాజ్యాంగాన్ని రూపొందించుకుంటే స్వాతంత్య్రం ఇవ్వడానికి బ్రిటిష్ ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదని ప్రకటించింది. బ్రిటిష్ పాలిత భారతదేశం, స్వదేశీ సంస్థానాలను కలిపి ఇండియన్ యూనియన్ అనే రాజకీయ వ్యవస్థ ఏర్పడుతుందని, ఆ యూనియన్ విదేశీ వ్యవహారాలు, రక్షణ, కమ్యూనికేషన్ వంటి జాతీయ ప్రాముఖ్యత గల అంశాలను నిర్వహిస్తుంది.
-రాజ్యాంగాన్ని రూపొందించేందుకు ప్రత్యేక రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటవుతుంది. 1946, జూలైలో రాజ్యాంగ సభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 205, ముస్లింలీగ్‌కు 73 సీట్లు వచ్చాయి. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని బ్రిటిష్ ప్రభుత్వం ఆగస్టు 24న ప్రకటించింది. సెప్టెంబర్ 2న తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటయ్యింది.
-కాంగ్రెస్ తరఫున వల్లభాయ్ పటేల్, రాజేంద్రప్రసాద్, అరుణా అసఫ్ అలీ, రాజగోపాలచారి, జగ్జీవన్‌రాం, ఈ తాత్కాలిక ప్రభుత్వంలో అక్టోబర్ 29న చేరిన ముస్లింలీగ్ తరఫున లియాఖత్ అలీఖాన్, జేఎన్ మండల్, గజ్నేఫర్ అలీఖాన్, అబ్దుర్ రబ్ నిష్టార్లు ముంత్రులుగా జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా వ్యవహరించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు