నిజాం రాజ్యంలో భూ యాజమాన్యం ఎలా ఉండేది?
అసఫ్జాహీల కాలంలో హైదరాబాద్ సంస్థానం ప్రధానంగా వ్యవసాయక రాజ్యం. రాజ్యంలోని మొత్తం జనాభాలో 75 శాతం మందికి (పరోక్షంగా వ్యవసాయంపైన ఆధారపడిన వారితో కలిపి 84 శాతం మందికి) ప్రధాన జీవనాధారం వ్యవసాయం. 1933-34లో హైదరాబాద్ సంస్థానం మొత్తం ఆదాయంలో 50.29 శాతం భూమిశిస్తు వసూలు రూపంలోనే వచ్చింది. సంస్థానంలో ఆర్థిక పరిస్థితులు పూర్తిగా వ్యవసాయం రంగంపైనే ఆధారపడి ఉండేవి అనడానికి ఇదే నిదర్శనం.
– మొదటి ఐదుగురు నిజాంల కాలంలో తెలంగాణలో ఒక ప్రత్యేకమైన భూకమతాల పద్ధతి రూపుదిద్దుకున్నది. ఆ రోజుల్లో అతి విశాలమైన భూక్షేత్రాలను పెత్తందార్లకు, భూస్వాములకు అప్పగించారు. ఈ పెత్తందార్లు, భూస్వాములు తమ కింది రైతుల నుంచి నిర్దాక్షిణ్యంగా పెద్ద మొత్తాల్లో పన్నులు వసూలు చేసేవారు. ఈ వసూళ్లను నిజాం నవాబులు ఏమాత్రం పట్టించుకునేవారు కాదు. ప్రతి ఏటా తమకు రావాల్సిన కప్పం వస్తే చాలనుకునేవారు. దీంతో సంస్థానంలో తీవ్ర అసమానతలు చోటుచేసుకున్నాయి. దున్నే రైతులకు భూములు లేని పరిస్థితి ఒకవైపు ఉంటే, భూస్వాములు అంచనాకు అందనంత (వేలు, లక్షల ఎకరాలు) భూమి కలిగి ఉన్న పరిస్థితి మరోవైపు ఉండేది.
– సాలార్జంగ్ ప్రధానిగా ఉన్న కాలంలో సంస్థానంలోని కొన్ని ప్రాంతాల్లో రైత్వారీ పద్ధతి ప్రవేశపెట్టి భూకమతాల్లో అసమానతలు తగ్గించడానికి ప్రయత్నించారు. ఆ రోజుల్లో
ఐదు రకాల కమతాలు ఉండేవి. అవి..
1. పాయగాలు
2. సంస్థానాలు
3. రాజ కుటుంబపు భూములు (వీటినే సర్ఫ్-ఏ-ఖాస్ అనేవారు),
4. తాహుద్ లేదా సర్బస్తా, పేష్కస్ అనే శిస్తుకు వేలం పాడే భూములు
5. ఇనాం భూములు
అనే వీటితోపాటు దివానీ భూములు అనే కొత్త కమతాలు వచ్చాయి. ఈ కమతాలకు శిస్తును నిర్ణయించి వసూలు చేయడానికి జిల్లాస్థాయిలో తాలూక్దార్లను, గ్రామస్థాయిలో నాయబ్లు, వతన్దార్లను నియమించేవారు.
– హైదరాబాద్ సంస్థానం మొత్తం విస్తీర్ణం 82,698 చదరపు మైళ్లు. వ్యవసాయానికి అనువైన భూమి 5.30 కోట్ల ఎకరాలు. అందులో మూడు కోట్ల ఎకరాలు ప్రభుత్వ భూమి శిస్తు వ్యవస్థ కింద ఉండేది. దీన్నే దివానీ లేదా ఖల్సా అనేవారు. ఇది మొత్తం వ్యవసాయ భూమిలో 60 శాతం వరకు ఉండేది. దివానీ భూములు పోగా సుమారు 30 శాతం భూములు జాగీర్దారీ వ్యవస్థ కింద ఉండేవి. మిగిలిన 10 శాతం భూములు నిజాం సొంత ఆస్తి (సర్ఫ్-ఏ-ఖాస్)గా ఉండేవి. సర్ఫ్-ఏ-ఖాస్ అనే అరబిక్ పదానికి వ్యక్తిగత ఆదాయం, సొంత ఖర్చులు లేదా ప్రత్యేక ఖర్చులు అని అర్థం. నిజాం తన సొంత ఖర్చుల కోసం ఉంచుకున్న వ్యవసాయ భూమి దాదాపు 55 లక్షల ఎకరాలు. ఈ భూములు 18 తాలూకాల్లోని 1443 గ్రామాల్లో 7,113 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉండేవి. వీటిని 15 లక్షల మంది రైతులు సాగుచేసేవారు. తెలంగాణ ప్రాంతంలో సర్ఫ్ ఎ ఖాస్ గ్రామాల సంఖ్య 508 ఎకరాలు. ఈ గ్రామాలు అత్రాఫ్బల్దా (ప్రస్తుత ఉమ్మడి రంగారెడ్డి జిల్లా) జిల్లాలో ఉండేవి. సర్ఫ్ ఎ ఖాస్ భూములపై వచ్చే ఆదాయాన్ని నిజాం తన కుటుంబ ఖర్చులకు వాడుకునేవాడు. ఈ భూములు సదర్-ఉల్-మహం అనే ఆధికారి పర్యవేక్షణలో ఉండేవి. నిజాం పాలకులు సర్ఫ్-ఏ-ఖాస్ జాగీర్పై సంపూర్ణ పాలనాధికారాలు కలిగి ఉండేవారు. రెండో నిజాం నవాబు నిజాం అలీ కాలంలో ఈ సర్ఫ్-ఏ-ఖాస్ భూములు ఉనికిలోకి వచ్చాయి. ఆ రోజుల్లో ఈ భూముల పాలనా విభాగం పేరు దార్-ఉల్-షిఫా. హైదరాబాద్ సంస్థానం 1948 సెప్టెంబర్ 17న భారత యూనియన్లో విలీనమైంది. దాంతో 1949 ఫిబ్రవరి 6న నిజాం సర్ఫ్-ఏ-ఖాస్ భూములను దివానీ భూముల్లో కలిపారు.
– జాగీర్లతో పాటు హైదరాబాద్లో ఇనాం భూములు ఉండేవి.
ఇనాం భూములు
– ఇనాం భూములకు మరోపేరు ఖరీజ్ జమా. హైదరాబాద్ సంస్థానంలోని అనేక గ్రామాల్లో ఆ రోజుల్లో ఇనాం భూములు ఉండేవి. ఇనాం అనేది అరబ్బీ పదం. ఇనాం అంటే ఉపకారం చేయడం లేదా బహుమానం ఇవ్వడం అని అర్థం. తాను పొందిన సేవలకు బదులుగా నిజాం నవాబు ఇచ్చే భూములను ఇనాం భూములు అనేవారు.
ఇనాం భూములను పొందేవారు..
1. పరగణా మాజీ ముఖ్య అధికారులు,
2. రెవెన్యూ, పోలీస్, ప్రజాపనుల శాఖల్లో సేవలు అందించినవారు,
3. మతపరమైన సేవలు అందించినవారు. ఇనాం భూములు పొందినవాళ్లు పన్నులు కట్టాల్సిన అవసరం లేదు. నాటి నిజాం సంస్థానంలో ఇనాందార్ల సంఖ్య 83 వేలు. ఇందులో దివానీ ప్రాంతంలో 57 వేలు. జాగీర్ ప్రాంతంలో 26 వేలు. సాలార్జంగ్ సంస్కరణలతో ఉద్యోగుల జీతాలు ద్రవ్యరూపంలో ఇవ్వడం ప్రారంభం కావడంతో ఈ వ్యవస్థ క్రమంగా తగ్గుతూ వచ్చింది.
– భూమిశిస్తు ఆధారంగా హైదరాబాద్ రాజ్యంలోని భూములను రెండు విధాలుగా వర్గీకరించవచ్చు. అవి..
1. జాగీర్ ప్రాంతం
2. దివానీ ప్రాంతం.
– 1948 నాటికి జాగీర్దారీ విధానం కింద 1.50 కోట్ల ఎకరాల భూమి ఉండేది. హైదరాబాద్ సంస్థానం 1948లో భారత యూనియన్లో విలీనం అయిన తర్వాత 1949 ఆగస్టులో హైదరాబాద్ జాగీర్ల రద్దు రెగ్యులేషన్ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ద్వారా జాగీర్దార్లకు 18 కోట్ల రూపాయలను నష్టపరిహారంగా చెల్లించి ఆ భూములను దివానీ లేదా ఖల్సా భూముల్లో కలిపేశారు.
జాగీరు భూములు
– నిజాం నవాబుకు, అతని ప్రభుత్వానికి సేవలు అందించిన వారి గౌరవాన్ని నిలబెట్టడం కోసం దారాదత్తం చేసిన భూములనే జాగీరు భూములు అంటారు. జాగీర్లపై అధికారంగల వ్యక్తులే జాగీర్దార్లు. జాగీర్ అనే పదం రెండు పర్షియన్ పదాలైన జా-గిర్ ల నుంచి వచ్చింది. జా-గిర్ అంటే ఆధీనంలో ఉంచుకున్న ప్రాంతం అని అర్థం. పర్షియన్ నిఘంటువు ప్రకారం జాగీరు భూమికి సంబంధించినది. ఈ జాగీర్దారీ విధానాన్ని ఢిల్లీ సుల్తానులు మధ్య ఆసియా ప్రాంతం నుంచి తీసుకొచ్చి మనదేశంలో ప్రవేశపెట్టారు.
– తైమూర్ దండయాత్రతో జాగీర్దారీ విధానం మనదేశంలో ఆవిర్భవించింది. జాగీర్దారీ విధానానికి మాతృకగా కాకతీయుల కాలంలో నాయంకర విధానం, విజయనగర రాజుల కాలంలో అమర నాయంకర విధానం ఉండేవి. మొఘలుల కాలంలో మున్సబ్దారీ విధానం ఉండేది. మొఘలుల పరిపాలనలో జాగీర్ అనే పదం మొదటిసారిగా 1559లో అక్బర్ జారీచేసిన ఫర్మానాలో కనిపిస్తుంది. హైదరాబాద్ సంస్థానంలో మొదటి జాగీర్ను 1726లో నిజాం ఉల్ ముల్క్ ఇవ్వగా.. చివరి జాగీర్ను 1889-90లో ఆరో నిజాం మహబూబ్ అలీ ఇచ్చారు. హైదరాబాద్ సంస్థానంలో జాగీర్ భూములు 11,109 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉండేవి. మొత్తం 5.30 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమిలో 30 శాతం.. అంటే 1.50 కోట్ల ఎకరాలు జాగీరు భూములు ఉండేవి. మొత్తం జాగీరు గ్రామాలు, పట్టణాల సంఖ్య 6,848. జనాభా 31,63,705.
– పెద్ద జాగీరు ప్రాంతాల్లో కొన్నింటికి రెవెన్యూ, పోలీస్, న్యాయ అధికారాలుండేవి. ఈ జాగీరు ప్రాంతాల్లో నిజాం ప్రభుత్వం ప్రత్యక్షంగా పన్నులు వసూలు చేసేది కాదు. జాగీర్దార్లే అనేక రకాల పన్నులు వసూలు చేసి అందులో నుంచి నిజాంకు కొంత చెల్లించేవారు. కొంతమంది అది కూడా చెల్లించేవారు కాదు. హైదరాబాద్ సంస్థానంలో వివిధ రకాల జాగీర్లు ఉండేవి. అవి.. 1. అల్-తంగా జాగీర్, 2. జాత్ జాగీర్, 3. పాయగా జాగీర్, 4. తనఖా-ఇ-మహలత్, 5. ఇలాకా జాగీర్.
అల్ తంగా జాగీర్
– నిజాం నవాబుకు శిస్తు చెల్లించకుండా వంశపారంపర్యంగా అనుభవించే హక్కుగల జాగీరు. నిజాం తన రాజముద్ర ద్వారా ఈ జాగీర్లను కేటాయించేవారు.
జాత్ జాగీర్
– ఇది వ్యక్తిగతమైన జాగీరు. నిజాం కోసం జీవితాంతం సేవచేసిన వారికి ఇచ్చే జాగీర్. ఇవి అతి విశాలమైన భూభాగంగల జాగీర్లు. ఈ జాగీర్ను పొందిన వారు సమాజంలో గౌరవప్రదమైన హక్కును కలిగి ఉండేవారు.
తనఖా-ఇ-మహలత్ జాగీర్
– నిజాం సైన్యంలో పనిచేసిన ముఖ్య సైనికాధికారులు కొందరు నిజాం నవాబుకు కీలక సమయంలో ఆర్థిక సాయం అందించేవారు. వారికి నిజాం జాగీర్ల మాదిరిగానే కొన్ని గ్రామాలను దత్తత చేసేవాడు. వాటినే తనఖా-ఇ-మహలత్ జాగీరులు అనేవారు.
– ఇవేగాక నిజాం సంస్థానంలో ఇలాకా జాగీర్లు, మశ్రూతి జాగీర్లు, మదద్-ఇ-మష్ జాగీర్లు ఉండేవి.
పాయగా జాగీర్- దీన్ని నిగేదస్త్ జమియత్ జాగీర్ అని కూడా అంటారు. ఈ జాగీర్లను ముస్లిం ప్రభువులకు, నిజాం నవాబు రక్తసంబంధీకులకు ఇచ్చేవారు. వీరు సైన్యాన్ని పోషించి యుద్ధ సమయంలో నిజాంకు తోడ్పడేవారు. నిజాం పాలకుల వ్యక్తిగత సైన్యాన్ని పోషించేవారికి కూడా పాయగా జాగీర్లు ఇచ్చేవారు. పాయగా అంటే స్థిరమైన అని అర్థం. పాయగా జాగీర్దార్లంతా నిజాం నవాబుకు సమీప బంధువులు. పాయగా జాగీర్ను నిజాం అలీఖాన్ తొలిసారి మొదటి షంషుల్ ఉమ్రా అబ్దుల్ ఖైరుఖాన్కు ఇచ్చాడు. ఐదో నిజాం అఫ్జలుద్దౌలా రెండో షంషుల్ ఉమ్రా ఫక్రుద్దీన్ఖాన్కు 2,373 చదరపు మైళ్ల పాయగా జాగీర్ను ఇచ్చాడు. దీనిలో 1007 గ్రామాలుండేవి. 5,29,098 మంది జనాభా ఉండేది.
మశ్రూతి జాగీర్లు
– ఈ జాగీర్లను మూడు రకాల వ్యక్తులకు అనేక షరతులతో కేటాయించేవారు. 1. ప్రజాసేవ చేసేవారికి, 2. మతవ్యాప్తి కోసం కృషిచేసే వారికి, 3. సైనిక రంగానికి విశిష్ట సేవలందించే వారికి. ఈ మూడు రంగాల్లో సేవలందించిన వ్యక్తులు షరతులతో కూడిన మశ్రూతి జాగీర్లను అనుభవించేవారు.
ఇలాకా జాగీర్లు
– నిజాం ఇలాకా జాగీర్లనే ఉమ్రా-ఇ-ఆజమ్ జాగీర్లు అంటారు. సంస్థానంలో పనిచేసే ముఖ్య అధికారులు పొందిన జాగీర్లనే ఇలాకా జాగీర్లు అనేవారు. ఈ జాగీర్లను పొందినవారు ప్రభుత్వంలో పెద్ద హోదాల్లో ఉండేవారు. పాయగా జాగీర్ల తర్వాత స్థాయి ఇలాకా జాగీర్లదే. నిజాం సంస్థానంలో తొమ్మిది ఇలాకా జాగీర్లు ఉండేవి. అందులో నాలుగు ముఖ్యమైనవి. అవి..
1. నవాబ్ సాలార్జంగ్ ఇలాకా జాగీర్
2. మహరాజా కిషన్ పెర్షాద్ ఇలాకా జాగీర్
3. నవాబ్ ఖానీ ఖానస్ ఇలాకా జాగీర్
4. నవాబ్ ఫకూర్-ఉల్-ముల్క్ ఇలాకా జాగీర్
– పై నాలుగు ఇలాకా జాగీర్లు 1919 చదరపు మైళ్లలో విస్తరించి 769 గ్రామాల్లో ఉండేవి. ఈ నాలుగు ఇలాకా జాగీర్లలో సాలార్జంగ్ ఇలాకా జాగీర్ పెద్దది. ఇది 1126 చదరపు మైళ్లలో విస్తరించి 359 గ్రామాల్లో ఉండేది. దీని వార్షిక ఆదాయం రూ.20 లక్షలు. మహరాజా కిషన్ పెర్షాద్ ఇలాకా జాగీర్ కేంద్రస్థానం షాద్నగర్.
మదద్-ఇ-మష్ జాగీర్
– సమాజసేవ కోసం జీవిస్తూ ఆత్మపరిత్యాగం చేసే వ్యక్తులు పొందే జాగీర్ను మదద్-ఇ-మష్ జాగీర్ అంటారు. తమ జీవిత పోషణ కోసం తమ ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయానికి తోడుగా ఇచ్చే జాగీరు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు