బతుకు చిత్రాలు పండుగలు నృత్యాలు
ఒక ప్రాంత ప్రత్యేకతను, అక్కడి ప్రజల జీవన విధానాన్ని పండుగలు చాటిచెబుతాయి. వారి సంస్కృతి, చారిత్రక నేపథ్యం, వారసత్వాలకు సంప్రదాయ, జానపద నృత్యాలు ప్రతీకలుగా నిలుస్తాయి. ఇలా ప్రత్యేకమైన ఆహార్యం, కళలు తమ పూర్వీకులు ఇచ్చిన ఆస్తిగా భావిస్తూ అవి అంతరించిపోకుండా చూసుకుంటున్నారు గిరిజన, ఆదివాసీలు. సంస్కృతులు, కళలకు నిలయమైన మనదేశంలో వివిధ ప్రాంతాల్లోని పండుగలు, నృత్య రీతులు, గిరిజన జాతులు వంటి విషయాలను తెలుసుకుందాం..
తెలంగాణ
-తెలంగాణ గొప్పతనాన్ని, సంఘటిత జీవన విధానాన్ని చాటే బతుకమ్మ, బోనాలు, పీర్ల పండుగలు రాష్ట్రంలో ముఖ్యమైనవి.
-కాకతీయుల కాలం నుంచి పేరిణి శివతాండవం, బోనాల సందర్భంగా పోతరాజు శివసత్తుల నృత్యాలు, లంబాడీ నృత్యం వారసత్వంగా వస్తున్నాయి. వీటితోపాటు డప్పు నృత్యం కూడా రాష్ట్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది.
-గిరిజన జాతులైన కోయలు, చెంచులు ఇక్కడ ప్రధానంగా ఉన్నారు.
అసోం
-సత్రియా, బిహు వంటి నృత్యాలు సంప్రదాయంగా వస్తున్నాయి. దీంతోపాటు ఓజపాలి, బొహువా, బగురుంబా, ఝుముర్ నృత్యాలు జనాదరణ పొందాయి.
-ముఖ్యమైన పండుగ బోహగ్ బిహు. ఇది రంగాలి బిహు, కటి బిహు, భోగలి బిహు అనే మూడు పండుగల సమాహారం. దీంతో అక్కడ కొత్త ఏడాది ప్రారంభమవుతుంది.
-గిరిజనతెగలు: ఛక్మా, ఛుటియా, దిమాసా, హజోంగ్, గారోలు, ఖాసీలు, గంగ్టే.
ఆంధ్రప్రదేశ్
-కూచిపూడి ఇక్కడి సంప్రదాయ నృత్యం. బుర్రకథ, వీరనాట్యం, బుట్టబొమ్మలు, థింసా, కోలాటం, తప్పెట గుళ్లు వంటి జానపద నృత్యాలు ఉన్నాయి.
-ఇక్కడ సంక్రాంతి, ఉగాది ముఖ్యమైన పండుగలు.
-చెంచులు, భిల్లులు, గోండులు, సవరలు, మన్నెదొర వంటి గిరిజన తెగలు ప్రధానమైనవి.
అరుణాచల్‌ప్రదేశ్
-పులి-నెమలి, బర్డో ఛం, ఛాలో, పోపిర్, అజిలాము వంటి గిరిజన జానపద నృత్యాలు ఉన్నాయి.
-జనవరి, ఫిబ్రవరి మధ్యకాలంలో నిర్వహించే లోసార్ పండుగ ఇక్కడ ప్రధానమైనది. ఇది టిబెటన్ల నూతన సంవత్సర వేడుక.
-అపటానిస్, అబోర్, దఫ్లా, గలోంగ్, మాంబా, షెర్దుక్‌పెన్, సింగ్ఫో గిరిజన జాతులు ఇక్కడ కన్పిస్తాయి.
బీహార్
-సంప్రదాయ నృత్యం ఛౌ. బిడేసియా, జాట్-జతిన్, జిజియా, జుమారి, సోహార్-ఖిలౌనా, ఫగువా, డోమ్కచ్లు ప్రధాన జానపద, గిరిజన నృత్యాలు.
-ఛాత్ పూజ ఈ రాష్ట్రంలో ముఖ్యమైన పండుగ. దాల్ పూజ అని పిలిచే ఈ పండుగను అక్టోబర్-నవంబర్ నెలల్లో జరుపుతారు. ఈ సందర్భంగా సూర్యుడు, అతని భార్య ఉషలను పూజిస్తారు.
-రాష్ట్రంలో అసుర్, బైగా, బిహోర్, బిర్జియా, చెరో, గోండ్, పర్హైయా, సంతాల్, సవరలు వంటి ఆదిమ తెగలు ఉన్నాయి.
ఛత్తీస్‌గఢ్
-ఇక్కడ ఛౌ సంప్రదాయ నృత్యం. పడ్వాని, సువానాచా, పంతి, కర్మా, రౌత్ నాఛా వంటి జానపద కళలు ఉన్నాయి.
-రాష్ట్రంలో ముఖ్యమైన పండుగ బస్తర్ దసరా. ఆగస్టులో ప్రారంభమయ్యే ఈ ఉత్సవం అక్టోబర్ నెల దాకా సుమారు 75 రోజులపాటు జరుగుతుంది. అందువల్ల దీన్ని ప్రపంచంలోనే ఎక్కువ రోజులు జరుపుకునే దసరా పండుగ అని పిలుస్తారు.
-అగరియా, భైనా, భత్రా, బియార్, ఖోండ్, మవసీ, నాగసియా వంటి గిరిజన జాతులు ఇక్కడ ఉన్నాయి.
గుజరాత్
-కృష్ణాష్టమి, దీపావళి ప్రధాన పండుగలు.
-సంప్రదాయ నృత్యం గార్బా. దాండియా రాస్, రాస్, తిప్పని, భావై, డాంగీ, హుడో వంటి జానపద, గిరిజన సంప్రదాయ నృత్యాలు ఉన్నాయి.
-బిర్దా, బమ్చా, భిల్, చరాన్, ధోడియా, గమ్టా, పరాధి, పటేలియా ఆదిమ తెగలు ఇక్కడ ప్రధానమైనవి.
గోవా
-పర్యాటకుల స్వర్గధామమైన గోవాలో ప్రధానమైన ఉత్సవం కార్నివాల్. ఫిబ్రవరి నెలలో జరిగే ఈ ఉత్సవం 18వ శతాబ్దం నుంచి ఆనవాయితీగా వస్తున్నది.
-దాలో, దివ్లీ నాచ్, ఘోడే మోడ్నీ, తాల్గాడి, గఫ్, మండో, కుంబీ ఇక్కడ జానపద నృత్యాలు. ప్రత్యేకంగా సంప్రదాయ నృత్యం లేదు.
-ధోడియా, దుబియా, నైక్డా, సిద్ది, వర్లీ అనే గిరిజన తెగలు ఇక్కడ కన్పిస్తాయి.
హర్యానా
-రాస్లీలా, ధమాల్, మంజీరా, ఘూమర్, ఫగ్ గిరిజన, జానపద నృత్యాలు ఉన్నాయి.
-రాష్ట్రంలో బైసాఖీ పండుగ ప్రధానమైనది. రబీ పంటకాలంలో ఏప్రిల్ 13 లేదా 14న ఈ పండుగ నిర్వహిస్తారు.
హిమాచల్‌ప్రదేశ్
-హిమాలయాల్లో శివాలయాలకు నెలవైన హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రధాన పండుగ మహాశివరాత్రి.
-ఇక్కడి జానపద, గిరిజన నృత్యాలు.. కుల్లు నాటి, థోడా డ్యాన్స్, దండ్రాస్, ఘురేహి
-గడ్డిస్, గుజ్జర్లు, ఖాస్, లంబా, లాహౌలాలు, పంగ్వాలా, స్వంగ్లా అనే గిరిజన జాతులు నివసిస్తాయి.
జమ్ముకశ్మీర్
-కుద్, దుమ్హాల్, రౌఫ్, భంద్ పతర్, హపిజా, భంద్జాషన్, బఛ్చా నగ్మా అనే జానపద కళారూపాలు ప్రముఖమైనవి.
-జమ్ములోని లఢక్ ప్రాంతంలో హెమ్సీ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. రాష్ట్రంలో ప్రధాన పండుగల్లో రంజాన్ ఒకటి.
-ఆదిమ జాతులైన బకర్వల్, బల్టీ, బేడా, గర్రా, మోన్, పురిగ్పా, సిప్పి ఇక్కడ ప్రధానమైనవి.
తమిళనాడు
-ఇక్కడ పొంగల్ ప్రధానమైన పండుగ. దీన్ని తమిళనాడు క్యాలెండర్ చివరి రోజు (జనవరి నెలలో)న నిర్వహిస్తారు. జనవరి/ఫిబ్రవరి నెలల్లో వచ్చే ఈ పండుగ పంట కోతలకు సంబంధించినది.
-భరతనాట్యం ఇక్కడి సంప్రదాయ నృత్యం. దీంతోపాటు మయిల్ అట్టమ్, బొమ్మలట్టమ్, కుమ్మి, సిలంబు అట్టం వంటి జానపద కళలు ఉన్నాయి.
-అడియన్, అరనాదన్, ఎరవల్లన్, ఇరులార్, కనికర్, కోటాలు, తోడాలు ప్రధాన గిరిజన జాతులు.
పశ్చిమబెంగాల్
-దుర్గా పూజ ఇక్కడ ప్రధానమైన పండుగ. రాష్ట్రంలోని నలుమూలల్లో ఘనంగా జరుపుకొనే ఈ పండుగను దుర్గోత్సవం అనికూడా పిలుస్తారు.
-ఛవౌ ఇక్కడి సంప్రదాయ నృత్యం. దీంతోపాటు జట్రా, కతి వంటి జానపద కళారూపాలు ఉన్నాయి.
-అసుర, ఖోండ్, హజోంగ్, హో, పర్హైయా, రభా, సంతాల్, సవర వంటి గిరిజన జాతులు ఉన్నాయి.
సిక్కిం
-డిసెంబర్ నెలలో వచ్చే బమ్చు, పంగ్ లబ్సాల్ ప్రధానమైన పండుగలు. పంగ్ లబ్సాల్ పండుగ సందర్భంగా కాంచనజంగ పర్వతాన్ని సిక్కింను రక్షించే దేవతగా కొలుస్తారు. వీటితోపాటు లసూంగ్ (డిసెంబర్), సగా దవా ప్రధానమైన ఉత్సవాలు.
-ఛు ఫాట్, సింఘీ ఛామ్, యక్ ఛామ్, తషి యంగ్కూ, మరుని వంటి గిరిజన, జానపద నృత్యాలు ఇక్కడ ప్రధానమైనవి.
-గిరిజన జాతులకు చెందిన భుటియా, ఖాస్, లెప్చాలు అధికంగా కన్పిస్తారు.
పంజాబ్
-లోహ్రీ పండుగ ప్రధానమైనది. జనవరి నెలలో వచ్చే ఈ పండుగను పంజాబీలు, సిక్కులు జరుపుకొంటారు.
-జానపద కళారూపాలైన భాంగ్రా, గిధా, ఝమర్, లుద్ది, దంకారా ప్రధానమైనవి.
జార్ఖండ్
-తుసు పండుగ ప్రధానమైనది. దీన్ని జనవరి నెలలో పంట కోతల సమయంలో నిర్వహిస్తారు. దీంతోపాటు హోలీ కూడా ఆడుతారు.
-జానపద నృత్యాలైన కర్మా, పైకా, హంటా డ్యాన్స్, ముండారి, బారౌ డ్యాన్స్, జెననా ఝుమర్ ప్రధానమైనవి.
-ఆదివాసీలైన బిర్హోస్, భుమిజ్, గోండ్లు, ఖరియా, ముండా, సంతాల్, సవరలు రాష్ట్రంలో ప్రధానంగా కన్పిస్తారు.
మణిపూర్
-రాష్ట్రంలో కుట్ పండుగ ప్రముఖమైనది. నవంబర్ నెలలో కుకి-చిన్ గిరిజన తెగలు ఈ పండుగను నవంబర్ నెలలో జరుపుకొంటాయి. దీంతోపాటు యోషంగ్ పండుగ కూడా ముఖ్యమైనది.
-మణిపురి డ్యాన్స్ లేదా జగోయ్ ఇక్కడి సంప్రదాయ నృత్యం. దీంతోపాటు థంగ్ టా, ధోల్ చోలమ్, లాయ్ హరౌబా వంటి జానపద నృత్యాలు ఉన్నాయి.
-ఐమోల్, అంగామి, చిరు, కుకి, మొసంగ్, పురుమ్, థడౌ వంటి గిరిజన జాతులు ప్రధానమైనవి.
ఒడిశా
-పంట కోతల సమయంలో జరుపుకొనే నౌఖాయ్, రాజ ప్రభ పండుగలు ఇక్కడ ప్రధానమైనవి. రాజ ప్రభ పండుగ సాంస్కృతిక వారసత్వంగా వస్తున్నది.
-ఒడిస్సీ ఇక్కడి సాంస్కృతిక నృత్యం. ఛౌ, దండ నట, చంగు, కర్మా ప్రధానమైన జానపద నృత్యాలు.
-గిరిజన తెగలైన గడాబా, ఘార, ఖరియా, ఖోండ్, మట్యా, ఓరాన్లు, సంతాళ్లు, రాజౌర్ ఇక్కడ ఉన్నాయి.
నాగాలాండ్
-ఇక్కడ హార్న్‌బిల్ ప్రధాన పండుగ. తమ సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్ తరాలవారికి అందించేలా డిసెంబర్ 1 నుంచి 10 వరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా నిర్వహిస్తుంది.
-అంగామి, గారో, కచారి, కుకి, మికిర్, నాగాలు, సెమా వంటి గిరిజన జాతులు కన్పిస్తాయి.
రాజస్థాన్
-ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్‌లో గాంగౌర్ పండుగ ప్రధానమైనది. దీంతోపాటు పుష్కర్ ఫెయిర్ (పుష్కర్ ఒంటెల ప్రదర్శన) కూడా ప్రముఖమైనది.
-ఘూమర్, కాల్బెలియా, కత్పులి, భోపా, ఛంగ్ వంటి జానపద నృత్యాలు ప్రముఖమైనవి.
-ఆదిమ జాతులైన భిల్లులు, దమారియా, ధన్కా, మీనాలు, పటేలియా, సహరియా ఇక్కడ కన్పిస్తాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు