మన దేశ అత్యున్నత పురస్కారాలివీ!
భారతరత్న
-దేశంలో పౌరులకు ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. 1954లో ఈ అవార్డును ప్రారంభించారు. వివిధ రంగాల్లో అత్యున్నత కృషికిగాను ఈ అవార్డులను అందిస్తారు. ఇప్పటివరకు 45 మందికి ఈ పురస్కారం ప్రదానం చేశారు. ఇందులో ఇద్దరు విదేశీయులు (ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్- 1987, నెల్సన్ మండేలా- 1990) ఉన్నారు. 1977 జూలై 13 నుంచి 1980 జనవరి 26 వరకు జనతా పార్టీ కాలంలో నిలిపివేశారు. 1992లో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్‌కు ఇచ్చిన పురస్కారాన్ని సాంకేతిక కారణాలతో వెనక్కి తీసుకున్నారు. మొదటిసారి 1954లో సర్వేపల్లి రాధాకృష్ణన్, చక్రవర్తుల రాజగోపాలచారి, డాక్టర్ సీవీ రామన్ అందుకున్నారు. చివరగా 2015లో మదన్మోహన్ మాలవీయ (మరణానంతరం), అటల్ బిహారీ వాజ్‌పేయి భారతరత్న అందుకున్నారు.
పద్మవిభూషణ్
-భారతరత్న తర్వాత అతిపెద్ద పౌర పురస్కారంగా పద్మవిభూషణ్‌ను గుర్తిస్తారు. ఈ పురస్కారాన్ని 1954, జనవరి 2న నెలకొల్పారు. వివిధ రంగాల్లో విశిష్ఠ సేవలందించిన పౌరులకు ఈ పురస్కారం అందజేస్తారు. తొలిసారిగా 1954లో సత్యేంద్రనాథ్బోస్, జాకీర్ హుస్సేన్, బాలాసాహెబ్ గంగాధర్ ఖేర్, జిగ్మే డోర్జి వాంగ్‌ఛుక్, నందలాల్ బోస్, వీకే కృష్ణమీనన్ అందుకున్నారు. 2017కి గాను గులాం ముస్తఫాఖాన్, పీ పరమేశ్వరన్, ఇలయరాజా పద్మవిభూషణ్ అవార్డును అందుకున్నారు.
పద్మభూషణ్
-భారతరత్న, పద్మ విభూషణ్ తర్వాత పద్మ భూషణ్ పురస్కారం ప్రాముఖ్యంలో మూడో స్థానంలో ఉంది. 1954లో 23 మందికి పద్మ భూషణ్ పురస్కారాలను అందజేశారు. 2018లో పంకజ్ అద్వానీ, మహేంద్రసింగ్ ధోని, రామచంద్రనాగస్వామి, వేద్‌ప్రకాశ్ నంద, లక్ష్మణ్ పాయ్, అరవింద్ పారిఖ్, శారదా సిన్హా, ఫిలిపోస్ మార్ క్రిసోస్టమ్, అలెగ్జాండర్ కడకిన్ అందుకున్నారు.
పద్మశ్రీ
-కళలు, విద్య, పరిశ్రమలు, సాహిత్యం, శాస్త్రం, క్రీడలు, సామాజిక సే, ప్రజా జీవితాలు మొదలైన వాటిలో సేవ చేసిన వారికి ప్రాథమికంగా ఇచ్చే పౌర పురస్కారం పద్మశ్రీ. ఈ పురస్కారంపై దేవనాగరి లిపిలో పద్మ, శ్రీలు రాసి ఉంటాయి. ఈ పురస్కారాన్ని 1954లో స్థాపించారు. మొదటిసారి 18 మంది ఈ పురస్కారాలను అందుకున్నారు. 2018లో 73 మందికి పద్మశ్రీ అవార్డులు వరించాయి.
జ్ఞానపీఠ్ పురస్కారం
-దేశంలో అత్యున్నత సాహిత్య పురస్కారం జ్ఞానపీఠ్. ఈ అవార్డు టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా పత్రిక వ్యవస్థాపకులైన సాహు జైన్ కుటుంబం ఏర్పాటు చేసినా భారతీయ జ్ఞానపీఠం వారు ప్రదానం చేస్తున్నారు. భారతీయ అధికార భాషల్లో ఎందులోనైనా రాసే భారత పౌరులు ఈ బహుమతికి అర్హులు. 1961లో నెలకొల్పిన ఈ పురస్కారం మొదట 1965లో మలయాళ రచయిత జీ శంకర కురుపకు వచ్చింది. ఒక భాషా సాహిత్యానికి జ్ఞానపీఠ పురస్కారం లభించిన తర్వాత మూడేండ్లపాటు ఆ భాషా సాహిత్యాన్ని ఈ పురస్కారానికి పరిశీలించరు. 1982కు ముందు ఏదైనా ఒక రచనకుగాను సంబంధిత రచయితకు ఈ పురస్కారం ఇచ్చేవారు. తర్వాత నుంచి భారతీయ సారస్వతానికి చేసిన సేవకే ఈ బహుమతిని ఇస్తున్నారు. ఇప్పటి వరకు అత్యధికంగా ఎనిమిదిసార్లు కన్నడ రచయితలు, హిందీ రచయితలకు ఏడుసార్లు వచ్చాయి. 53వ జ్ఞానపీఠ అవార్డు కృష్ణ సోబతీ (హిందీ)కి వచ్చింది. కృష్ణ సోబతీ రాసిన జిందగినామాకు 1980లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, 1996లో సాహిత్య అకాడమీ ఫెలోషిప్ వరించాయి. తెలుగులో రామాయణ కల్పవృక్షం రచనకుగాను 1970లో విశ్వనాథ సత్యనారాయణకు, విశ్వంభర రచనకు గాను 1988లో సీ నారాయణరెడ్డికి, పాకుడురాళ్లు రచనకుగాను 2012లో రావూరి భరద్వాజకు అవార్డు వచ్చింది.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
-భారతీయ సాహిత్య అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని 1954లో ఏర్పాటు చేశారు. మొత్తం 22 భాషల సాహితీవేత్తలకు ఏటా ఈ పురస్కారాన్ని అందజేస్తారు. తొలి పురస్కారాన్ని 1955లో ప్రదానం చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ సంస్థ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతోపాటు కొన్ని ఇతర పురస్కారాలను కూడా ఏర్పాటు చేశారు. భాషా సమ్మాన్ పురస్కారం, సాహిత్య అకాడమీ అనువాద బహుమతి, సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం, సాహిత్య అకాడమీ యువ పురస్కారం. తొలి తెలుగు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సురవరం ప్రతాపరెడ్డి ఆంధ్రుల సాంఘిక చరిత్రము పుస్తకానికి వచ్చింది. చివరగా పాపినేని శివశంకర్ రచించిన రజనీగంధ కవితా సంకలనానికి సాహిత్య అకాడమీ అవార్డు వరించింది.
పరమ వీరచక్ర
-త్రివిధ దళాల్లో పనిచేసే సైనికులకు దేశంలో ఇచ్చే అత్యున్నత సైనిక పురస్కారం పరమ వీరచక్ర. పరమ వీరచక్రకు అర్థం అత్యున్నత ధైర్య చక్రం. ఈ పురస్కారం అమెరికాకు చెందిన మెడల్ ఆఫ్ ఆనర్, బ్రిటన్‌కు చెందిన విక్టోరియా క్రాస్‌కు సమానం. ఈ పురస్కారాన్ని 1950, జనవరి 26 (1947, ఆగస్టు 15 నుంచి అమల్లో ఉన్నట్టు పరిగణిస్తూ చట్టం చేశారు)న స్థాపించారు. ఈ పురస్కారాన్ని ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువసార్లు అందించే వెసులుబాటు ఉంది. సిక్కు రెజిమెంట్‌కు చెందిన సైన్యాధికారి విక్రమ్ ఖణోల్కర్ భార్య సావిత్రి ఖణోల్కర్ ఈ పురస్కారాన్ని తయారు చేశారు. ఈ పురస్కారం ఇప్పటి వరకు 21 సార్లు ప్రదానం చేశారు. వీటిలో 14 పతకాలు మరణానంతరం ఇచ్చారు. 21 మంది గ్రహీతల్లో 20 మంది సైన్యానికి చెందిన వారు కాగా, ఒకరు వాయుసేనకు చెందినవారు. 16 పతకాలు భారత్, పాకిస్థాన్ యుద్ధాల్లో పాల్గొన్న సైనికులకు ఇచ్చారు. సైన్యానికి చెందిన గ్రెనేడియర్ యూనిట్లకు ఈ పతకాన్ని ఎక్కువసార్లు ఇచ్చారు. గోర్ఖా రైఫిల్ రెజిమెంట్లకు మూడుస్లారు ఈ పతకం ఇచ్చారు. పాకిస్థాన్‌తో యుద్ధంలో ప్రదర్శించిన ధైర్య సాహసాలకు మేజర్ సోమనాథ్శర్మకు ఈ పురస్కారం మొదటిసారి ప్రదానం చేశారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు