Indian Polity | సభ ఆమోదిస్తేనే అత్యవసరం.. లేదంటే రద్దు
రాష్ట్రపతి అధికారాలు
జాతీయ అత్యవసర పరిస్థితి- ప్రకరణ 352
జాతీయ అత్యవసర పరిస్థితిని 2 రకాలుగా విభజించవచ్చు.
ఎ) బాహ్య కారణాలు : విదేశీ దాడి యుద్ధం మొదలైన కారణాలు
బి) అంతర్గత కారణాలు : సాయుధ తిరుగుబాటు మొదలైన కారణాలు
ప్రకరణ 532 – రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని ప్రకటించడం
- 352 (1) ప్రకారం యుద్ధం వల్ల గాని లేదా విదేశీ దురాక్రమణ వల్ల గాని లేదా సాయుధ తిరుగుబాటు వల్ల గాని, దేశ భద్రతకు లేదా దేశంలోని ఏదైనా ప్రాంత భద్రతకు ప్రమాదం పొంచి ఉందని రాష్ట్రపతి భావిస్తే ఆ సంఘటన జరగకముందే జాతీయ
అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు. - జనతాపార్టీ 44వ రాజ్యాంగ సవరణ (1978) ద్వారా క్లాజు (1)లో ఉన్న అంతర్గత కల్లోల పరిస్థితి అనే పదాన్ని తొలగించి సాయుధ తిరుగుబాటు అనే పదాన్ని చేర్చడం జరిగింది. ఇది 1979 జూన్ 20 నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం అంతర్గత కారణాల వల్ల అత్యవసర పరిస్థితి విధించాలంటే సాయుధ తిరుగుబాటు అనే కారణాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకొని అత్యవసర పరిస్థితిని విధించాల్సి ఉంటుంది.
- జాతీయ అత్యవసర పరిస్థితిని దేశ వ్యాప్తంగా గాని, లేదా దేశంలో కొన్ని ప్రాంతాల్లో గాని లేదా ఒక రాష్ట్రంలో గాని లేదా ఒక రాష్ట్రంలోని కొంత భాగంలోగాని విధించవచ్చు.
- 352(2) ప్రకారం ప్రకరణ 352(1) కింద జారీ అయిన జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనను రాష్ట్రపతి మరొక ప్రకటన ద్వారా మార్పు చేయవచ్చు. లేదా రద్దు చేయవచ్చు.
- 352(3) ప్రకారం అత్యవసర పరిస్థితి విధించవలసినదిగా కేంద్ర కేబినెట్ నిర్ణయించి, దాన్ని రాష్ట్రపతికి లిఖితపూర్వకంగా
తెలియజేస్తే తప్ప రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి విధించరాదు. ‘కేబినెట్’ ‘లిఖిత పూర్వక’ అనే పదాలను 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రకరణ 352కు చేర్చారు. - 352(4) ప్రకారం అత్యవసర పరిస్థితిని విధిస్తూ ప్రకటన జారీ చేసిన వెంటనే దాన్ని పార్లమెంట్లో ప్రవేశ పెట్టాలి. నెలరోజుల్లో పార్లమెంట్ ఉభయ సభలు ఆ ప్రకటనను తీర్మానాల ద్వారా ఆమోదించాలి. లేకపోతే అత్యవసర పరిస్థితి రద్దవుతుంది.
- అత్యవసర పరిస్థితి ప్రకటించిన సమయం లో లేదా అత్యవసర పరిస్థితిపై చర్చ జరుగుతున్న సమయంలో లోక్‌సభ రద్దయితే అప్పటికే రాజ్యసభ అత్యవసర పరిస్థితి తీర్మానాన్ని అమోదించి ఉంటే, కొత్తగా ఏర్పడిన లోక్‌సభ 30 రోజుల్లో అత్యవసర పరిస్థితి తీర్మానాన్ని ఆమోదించాలి. లేకపోతే అత్యవసర పరిస్థితి రద్దవుతుంది.
- మౌలిక రాజ్యాంగంలో పార్లమెంట్
2 నెలల్లో ఆమోదించాలని ఉండేది. - 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని 1 నెలకు తగ్గించారు.
- 352(5) ప్రకారం అత్యవసర పరిస్థితి తీర్మానాన్ని పార్లమెంట్‌లోని 2వ సభ ఆమోదించిన తేదీ నుంచి 6 నెలలపాటు అత్యవసర పరిస్థితి ఉంటుంది. ఒకవేళ 6 నెలల్లోపు అత్యవసర పరిస్థితిని రద్దు చేస్తే ఈ నిబంధన వర్తించదు.
- అయితే అత్యవసర పరిస్థితి కొనసాగింపునకు సంబంధించిన తీర్మానాన్ని పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించినట్లయితే అత్యవసర పరిస్థితి మరొక 6 నెలలు కొనసాగుతుంది. అత్యవసర పరిస్థితిని ఎన్ని సార్లయిన పొడిగించవచ్చు. ప్రతి పొడిగింపు ఆరు నెలలు మాత్రమే ఉండాలి.
- ఒకవేళ అత్యవసర పరిస్థితి కొనసాగుతున్నప్పుడు ఆరునెలల్లోపు లోక్‌సభ రద్దయితే అత్యవసర పరిస్థితి పొడిగింపునకు సంబంధించిన తీర్మానాన్ని రాజ్యసభ ఆమోదిస్తే, అత్యవసర పరిస్థితి కొనసాగుతుంది. లేకపోతే అత్యవసర పరిస్థితి రద్దవుతుంది.
- 352(6) ప్రకారం అత్యవసర పరిస్థితి విధింపు, తొలగింపునకు సంబంధించిన తీర్మానాన్ని పార్లమెంట్ ఉభయ సభల్లో దేనికదే సభలో హాజరైన మొత్తం సభ్యుల్లో 2/3 వంతు మంది ఆ తీర్మానాన్ని ఓటింగ్ ద్వారా ఆమోదించాలి. ఆ విధంగా ఆమోదించినవారి సంఖ్య సభ మొత్తం సభ్యుల సంఖ్యలో సగం కంటే ఎక్కువగా ఉండాలి.
- రాజ్యసభలో కూడా హాజరైన సభ్యుల్లో 2/3 వంతు మంది ఈ తీర్మానాన్ని ఆమోదించాలి. జాతీయ అత్యవసర పరిస్థితి కాలపరిమితిని రాజ్యాంగం పేర్కొనలేదు.
- 352(7) ప్రకారం రాష్ట్రపతి జారీ చేసిన అత్యవసర పరిస్థితి ప్రకటనను లేదా అత్యవసర పరిస్థితిని మార్పు చేస్తూ చేసిన ప్రకటనను లోక్‌సభ ఆమోదించకపోయినా లేదా దానికి వ్యతిరేకంగా లోక్‌సభ తీర్మానించినా అప్పుడు అత్యవసర పరిస్థితి ప్రకటనను రాష్ట్రపతి రద్దు చేయాలి.
- 352(8) ప్రకారం లోక్‌సభ మొత్తం సభ్యుల్లో కనీసం 1/10వ వంతు సభ్యులు అత్యవసర పరిస్థితి విధించడాన్ని, కొనసాగించడాన్ని లేదా , అత్యవసర పరిస్థితిని సవరిస్తూ చేసిన ప్రకటనను వ్యతిరేకిస్తే వారు లోక్‌సభ స్పీకర్‌కు, లోక్‌సభ సమావేశంలో లేకుంటే రాష్ట్రపతికి లిఖితపూర్వకంగా ఒక నోటీసు ఇవ్వవచ్చు.
- ఆ నోటీసు అందిన 14 రోజుల్లో నోటీసుపై చర్చించడానికి లోక్‌సభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలి. లోక్‌సభ సమావేశంలో ఉంటే స్పీకర్, లోక్‌సభ సమావేశంలో లేకుంటే రాష్ట్రపతి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ఈ అంశాన్ని 44వ రాజ్యాంగ సవరణ(1978) ద్వారా చేర్చారు.
- 352(9) ప్రకారం అంతకుముందు విధించిన అత్యవసర పరిస్థితి కొనసాగుతున్నప్పుడు కూడా ఆ అంశంతో నిమిత్తం లేకుండా వేరే కారణాలపై మళ్లీ రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని విధించవచ్చు.
- 38వ రాజ్యాంగ సవరణ (1975 ఆగస్టు 1) ప్రకారం దేశంలో ఒక కారణం చేత జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉండగానే మరొక కారణం చేత మళ్లీ అత్యవసర పరిస్థితిని విధించేందుకు రాష్ట్రపతికి అధికారం కల్పించారు. దీన్ని 352 ప్రకరణలో క్లాజ్ (4)గా చేర్చారు. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 4వ క్లాజ్‌ను 9వ క్లాజుగా రిమెంబర్ చేశారు.
- దేశంలో 1971 నుంచి 1977 వరకు అత్యవసర పరిస్థితి కొనసాగింది. 1975కు పూర్వం అత్యవసర పరిస్థితి అమల్లో ఉండగా మరొక అత్యవసర పరిస్థితి విధించడానికి వీలులేదు. కానీ అంతర్గత కల్లోలాల కారణంతో మరొక అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
ప్రకరణ 353- అత్యవసర పరిస్థితి ప్రభావం
ఎ) అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నంత కాలం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయవచ్చు.
- కేంద్ర జాబితాలోని అంశాలపై కూడా పార్లమెంట్ శాసనాలు చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ అధికారులకు కేంద్ర జాబితాలోని అంశాలపై కూడా అధికారం బదలాయించవచ్చు.
- భారతదేశంలో ఏదైనా ఒక రాష్ట్రం/ భూభాగం/ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు క్లాజు (ఎ) కింద ఉన్న కేంద్ర ప్రభుత్వ అధికారాలు, క్లాజు (బి) కింద గల పార్లమెంట్ అధికారాలు కేవలం అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్న రాష్ర్టాలకు/ భూభాగాలకు/ ప్రాంతాలకు గాక ఇతర రాష్ర్టాలకు/ ప్రాంతాలకు/ భూభాగాలకు కూడా విస్తరిస్తాయి. అయితే ఆయా రాష్ర్టాల్లో, ప్రాంతాల్లో కార్యకలాపాలు దేశ భద్రతకు లేదా అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్న ప్రాంతాల భద్రతకు ఆటంకం కలిగినపుడు మాత్రమే కేంద్రప్రభుత్వ/ పార్లమెంట్ అధికారాలు విస్తరిస్తాయి.
ప్రకరణ 354: రాష్ర్టాల రెవెన్యూ పరిస్థితిపై అత్యవసర పరిస్థితి ప్రభావాన్ని తెలియజేస్తుంది. - దేశంలో ఇప్పటి వరకు మూడుసార్లు అత్యవసర పరిస్థితిని విధించారు.
- 1962లో చైనా యుద్ధం కారణంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఉన్న సమయంలో1962 అక్టోబర్ 26న దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. ఇది 1968 జనవరి 10 వరకు కొనసాగింది. 1965లో పాకిస్థాన్‌తో యుద్ధం జరిగినపుడు ప్రత్యేకంగా అత్యవసర పరిస్థితిని విధించవలసిన పరిస్థితి ఏర్పడలేదు. కారణం అప్పటికీ అత్యవసర పరిస్థితి కొనసాగుతూనే ఉంది.
- రెండోసారి వి.వి.గిరి రాష్ట్రపతిగా ఉన్న సమయంలో పాకిస్థాన్ బంగ్లాదేశ్‌పై దాడి చేసినపుడు 1971, డిసెంబర్ 3 నుంచి 1977 మార్చి 21 వరకు విధించారు.
- పై రెండుసార్లు బాహ్య కారణాలవల్ల జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తే మూడోసారి అంతర్గత కారణాల వల్ల విధించారు.
- రాయ్‌బరేలీ ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఎన్నికల అక్రమాలకు పాల్పడినట్లు కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఎమర్జెన్సీ విధించారు. 1975 జూన్ 26 నుంచి 1977 మార్చి 21 వరకు కొనసాగింది.
- ప్రకరణ 355 ప్రకారం బాహ్య దురాక్రమణల నుంచి, అంతర్గత అల్లకల్లోలాల నుంచి ప్రతి రాష్ర్టాన్ని రక్షించడం, రాజ్యాంగ బద్ధంగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం పనిచేసేలా చూడటం కేంద్ర ప్రభుత్వ విధి
- 44వ రాజ్యాంగ సవరణ (1978)కు పూర్వం అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నంత కాలం ప్రాథమిక హక్కులన్నీ సస్పెండ్ అవుతాయని 359వ ప్రకరణలో పేర్కొన్నారు.
- అయితే ఎమర్జెన్సీ తర్వాత అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం 20, 21 ప్రకరణలో ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించడానికి వీలులేని విధంగా 44వ రాజ్యాంగ సవరణ చేసింది.
- అత్యవసర పరిస్థితిని విధించడం వల్ల ప్రాథమిక హక్కులపై పడే ప్రభావాన్ని గురించి 358, 359 ప్రకరణల్లో పేర్కొన్నారు.
అత్యవసర పరిస్థితి ప్రాథమిక హక్కులపై ప్రభావం
- ప్రకరణ 358 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నంత కాలం 19వ ప్రకరణలోని నిబంధనలు సస్పెన్షన్ చేయడం.
- 358(1) ప్రకారం యుద్ధం లేదా విదేశీ దురాక్రమణ వంటి కారణాల వల్ల భారతదేశానికి ప్రమాదం వాటిల్లిన కారణంగా అత్యవసరపరిస్థితి ప్రకటించి అది అమల్లో ఉన్నంత కాలం 19వ ప్రకరణలో పేర్కొన్న వాక్ స్వేచ్ఛా స్వాతంత్య్రాలపై పరిమితులు విధిస్తూ రాజ్యాంగంలోని 3వ భాగంలో పేర్కొన్న రాజ్యం శాసనాలు రూపొందించవచ్చు లేదా ఎటువంటి కార్యనిర్వాహక చర్యనైనా తీసుకోవచ్చు. అయితే అత్యవసర పరిస్థితి తొలగించిన వెంటనే ఆ శాసనాలు రద్దవుతాయి.
- భారతదేశంలోని ఏదైనా ఒక రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి విధించినపుడు అవసరాన్ని బట్టి అత్యవసర పరిస్థితి అమల్లో లేని రాష్టంలో లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో కూడా ప్రజల వాక్, స్వేచ్ఛా స్వాతంత్య్రాలపై పరిమితులు విధిస్తూ శాసనాలు రూపొందించవచ్చు.
- కేవలం రూపొందించన శాసనాల్లో పేర్కొన్న అంశాలపై మాత్రమే ఆంక్షలు విధించబడతాయి. శాసనాల్లో లేని అంశాలు అమల్లోనే ఉంటాయి.
- 358(2) ప్రకారం యుద్ధం లేదా విదేశీ దురాక్రమణల వల్ల ప్రకటించిన అత్యవసర పరిస్థితి సందర్భంలో మాత్రమే స్వేచ్ఛలపై పరిమితులు విధించాలని పేర్కొన్నారు. కానీ సాయుధ తిరుగుబాటు (ఆంతరంగిక కల్లోలాలు) గురించి పేర్కొనలేదు.
- ప్రకరణ 359 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నంత కాలం రాజ్యాంగంలోని IIIవ భాగం ద్వారా సంక్రమించిన హక్కులు అమల్లో సస్పెన్షన్ చేయడం.
- 359(1) ప్రకారం అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నంత కాలం ప్రాథమిక హక్కులను అమలు చేయాలని కోరుతూ న్యాయస్థానాలను ఆశ్రయించే హక్కు ప్రజలకు లేకుండా పోతుందని రాష్ట్రపతి ఒక ఆదేశం ద్వారా ప్రకటించవచ్చు .
- అయితే 20, 21 ప్రకరణల కింద ప్రజలకిచ్చిన నేరం, శిక్ష నుంచి రక్షణ పొందే హక్కు, జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛలకు రాష్ట్రపతి నోటీసు వర్తించదు.
- 351(ఎ) ప్రకారం ప్రకరణ 20, 21 తప్ప మిగిలిన ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేస్తూ రాష్ట్రపతి జారీ చేసిన ఆదేశం అమల్లో ఉన్నంత కాలం ప్రాథమిక హక్కులను నియంత్రిస్తూ ప్రభుత్వం ఏ శాసనాలనైనా రూపొందించవచ్చు.
- అత్యవసర పరిస్థితి రద్దయిన వెంటనే అటువంటి శాసనాలు, చర్యలు రద్దువుతాయి.
Previous article
Israel – Hamas war | రావణకాష్టం.. ఇజ్రాయోల్ – పాలస్తీనా వివాదం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు