Groups Special – Polity | ఎలక్టోరల్ కాలేజీతో ఎంపిక.. మహాభియోగంతో తొలగింపు
రాష్ట్రపతి
- ప్రకరణ 57 ప్రకారం రాష్ట్రపతి పదవిని నిర్వర్తించినా లేదా నిర్వహిస్తున్న వ్యక్తి తిరిగి రాష్ట్రపతిగా ఎన్నిక కావచ్చు.
- 1961 ఏప్రిల్‌లో సీపీఐ సభ్యుడు భూపేష్ గుప్తా అనే సభ్యుడు రాష్ట్రపతిగా ఒక వ్యక్తి 2 సార్లు కంటే ఎక్కువ సార్లు పోటీ చేయకుండా పరిమితి విధించాలని రాజ్యసభలో రాజ్యంగ సవరణ బిల్లును ప్రతిపాదించాడు. ఈ బిల్లు చర్చ సందర్భంగా అప్పటి ప్రధాని నెహ్రూ ఒక వ్యక్తి 3వ సారి కూడా రాష్ట్రపతి పదవికి పోటీ చేయడాన్ని నేను కూడా అంగీకరించను. రెండు పర్యాయాలకు మించి ఎక్కువ కాలం రాష్ట్రపతి పదవిలో ఒక వ్యక్తి ఉండరాదు. అనటం మంచి సంప్రదాయం. దాన్ని మనం తప్పక పాటించాలి. దానికి రాజ్యాంగ సవరణ అవసరం లేదు అని పేర్కొన్నారు.
- రాజ్యాంగ పరంగా ఒక వ్యక్తి రాష్ట్రపతి పదవికి ఎన్నిసార్లయినా పోటీ చేయవచ్చు. ఎన్ని సార్లయినా రాష్ట్రపతిగా పదవిని నిర్వర్తించవచ్చు.
- డా. బాబు రాజేంద్ర ప్రసాద్ తప్ప మరెవరూ 2వసారి రాష్ట్రపతి పదవిని నిర్వహించలేదు.
అర్హతలు
- ప్రకరణ 58 రాష్ట్రపతిగా ఎన్నికయేందుకు అవసరమైన అర్హతలను తెలియజేస్తుంది.
- 58(1) ప్రకారం ఎవరైనా వ్యక్తి కేంద్ర ప్రభుత్వంలో గాని లేదా రాష్ట్ర ప్రభుత్వంలో గాని లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణలో ఉండే ఏదైనా అథారిటీలో గాని లేదా స్థానిక సంస్థల్లో గాని ఆదాయాన్నిచ్చే పదవి (ఉద్యోగం) కలిగి ఉంటే ఆ వ్యక్తి రాష్ట్రపతిగా ఎన్నిక అవడానికి అనర్హుడు.
- రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన వ్యక్తి ప్రధానమంత్రి పదవికి గాని, లోక్‌సభ సభ్యుడిగా గాని పోటీ చేయవచ్చనిగాని పోటీ చేయరాదని గాని రాజ్యాంగం పేర్కొనడం లేదు. అదే విధంగా ప్రధాన మంత్రి పదవిని నిర్వర్తించినవారు రాష్ట్రపతి పదవికి పోటీ చేయవచ్చని గాని, పోటీ చేయరాదని గాని రాజ్యాంగం పేర్కొనలేదు. కాబట్టి రెండు సందర్భాల్లోను పోటీ చేయవచ్చు. దీనికి సంబంధించి పార్లమెంటు ఎలాంటి చట్టం చేయలేదు.
- విదేశీ మూలాలు ఉన్న భారత పౌరులు రాష్ట్రపతి / ఉపరాష్ట్రపతి / ప్రధానమంత్రి పదవులకు పోటీ చేయవచ్చని గాని, పోటీ చేయరాదని గానీ, రాజ్యాంగం గానీ, ప్రజాప్రాతినిధ్య చట్టం గాని పేర్కొనలేదు. రాజకీయ ఉన్నత పదవులకు విదేశీ మూలాలు ఉన్న భారతీయ పౌరులు పోటీ చేయవచ్చు. దీనికి సంబంధించి పార్లమెంటు ఎలాటి చట్టం చేయలేదు.
షరతులు: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల సవరణ చట్టం (1997) ప్రకారం రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి కింది షరతులను పూర్తి చేయవలసి ఉంటుంది. - ఆషామాషీ అభ్యర్థులను నివారించేందుకు 50 మంది ఎలక్ట్రోరల్ కాలేజీ సభ్యులు ప్రతిపాదించాలి. మరొక 50 మంది బలపరచాలి. 15000 రూపాయలు రిజర్వు బ్యాంకు పేరిట గాని లేదా రాష్ట్ర ప్రభుత్వ ట్రెజరీలో గాని డిపాజిట్ జమ చేయాలి.
- రాష్ట్రపతి ఎన్నికను సవాలు చేయాలనుకుంటే ఎన్నిక ముగిసిన 30 రోజుల్లోపు సుప్రీంకోర్టును ఆశ్రయించాలి.
- పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులుగాని లేదా ఎలక్ట్రోరల్ కాలేజీ సభ్యులుగాని సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చు.
- పిటిషన్ వేయాలంటే 20 మంది ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు పిటిషన్‌పై సంతకాలు చేయాలి.
- అభ్యర్థి గెలిచినా, ఓడినా, చెల్లిన ఓట్లలో 1/6 ఓట్లు ఓటమి చెందిన అభ్యర్థికి వచ్చినా, డిపాజిట్ చేసిన సొమ్ము తిరిగి పొందడానికి వీలులేదు.
- రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రిగా కొనసాగుతున్న వ్యక్తుల ఆదాయాన్నిచ్చే పదవిలో ఉన్నట్లు భావించరు.
- శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు తమ పదవికి రాజీనామా చేయకుండానే రాష్ట్రపతి పదవికి రాజీనామా చేయవచ్చు.
- కానీ ఎవరైనా ప్రభుత్వోద్యోగి రాష్ట్రపతిగా పోటీ చేయాలంటే తన ఉద్యోగానికి రాజీనామా చేయాలి.
- రాష్ట్రపతిగా పోటీ చేయడానికి కనీస విద్యార్హత అంటూ ఏదీ రాజ్యాంగం పేర్కొనలేదు.
- ప్రకరణ 59 – రాష్ట్రపతి మరొక పదవిలో కొనసాగరాదని, అతని జీతభత్యాల గురించి తెలియజేస్తుంది.
- ప్రకరణ 59(1) ప్రకారం రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి పార్లమెంట్ సభ్యునిగా గాని, లేదా శాసనసభ్యునిగా గాని ఉండరాదు. ఒకవేళ రాష్ట్రపతిగా ఎన్నికైనప్పటికీ ఆ వ్యక్తి పార్లమెంట్ సభ్యుడు లేదా రాష్ట్ర శాసన సభ్యుడు అయినట్లయితే అతను రాష్ట్రపతిగా పదవిని చేపట్టిన రోజు నుంచి అతని పార్లమెంట్ సభ్యత్వం లేదా శాసన సభ్యత్వం రద్దు అయినట్లు పరిగణించబడుతుంది.
- ప్రకరణ 59 (2) ప్రకారం రాష్ట్రపతి మరే ఇతర లాభార్జన పదవిలోనూ ఉండరాదు.
- ప్రకరణ 59(3) ప్రకారం రాష్ట్రపతికి ఒక అధికార నివాసం ఏర్పాటు చేస్తారు. అధికార నివాసానికి అతడు అద్దె చెల్లించాల్సిన అవసరం లేదు. అంతేకాదు అతనికి చెల్లించే జీతభత్యాలు, సౌకర్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది. అంతవరకు 11వ షెడ్యూల్లో చెప్పిన విధంగా చెల్లిస్తారు.
- రాజ్యాంగంలోని 58, 59 ప్రకరణలు రెండూ భారత రాష్ట్రపతికి కావలసిన అర్హతలను పేర్కొంటున్నాయి.
రాష్ట్రపతి జీతభత్యాలు ప్రత్యేక సదుపాయాలు
- ప్రకరణ 59 ప్రకారం రాష్ట్రపతి జీతభత్యాలను పార్లమెంట్ ఎప్పటికప్పుడు ఒక చట్టం ద్వారా నిర్ణయిస్తుంది. వీటిని భారత సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.
- రెండో షెడ్యూల్ ప్రకారం ఉపరాష్ట్రపతి లేదా మరెవరైనా రాష్ట్రపతి విధులను నిర్వహిస్తున్నప్పుడు రాష్ట్రపతి ఏ విధమైన పారితోషకం(వేతనాలు), భత్యాలు, ప్రత్యేక సదుపాయాలు పొందుతున్నాడో అవన్నీ రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించేవారికి వర్తిస్తాయి.
- ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌తోపాటు శీతాకాలంలో ఉండటానికి హైదరాబాద్‌లోని బొల్లారంలో వేసవికాలంలో ఉండేందుకు సిమ్లాలో విశ్రాంతి భవనాలు ఉన్నాయి.
- పదవీ విరమణ చేసిన రాష్ట్రపతికి జీవితాంతం పెన్షన్ లభిస్తుంది.
- ఉచిత నివాస స్థల సౌకర్యం, ఉచిత వైద్య వసతి, ఉచిత ప్రయాణ సౌకర్యం వ్యక్తిగత సిబ్బంది కార్యాలయ వసతి కూడా కల్పిస్తారు. కార్యాలయ ఖర్చులను ఇస్తారు. మరణించిన రాష్ట్రపతుల భార్యలు/ భర్తలకు పెన్షన్ కూడా ఇస్తారు.
- రాష్ట్రపతి భారతదేశ ప్రథమ పౌరుడిగా దేశ, విదేశాల్లో ఎక్కడికి వెళ్లినా ‘రాజ్యగౌరవం పొందుతారు.
- ప్రకరణ 361 ప్రకారం రాష్ట్రపతి పదవిలో ఉండగా తన విధి నిర్వహణలో ఉన్నప్పుడు తీసుకునే చర్యలను, నిర్ణయాన్ని ఏ న్యాయస్థానంలోనూ ప్రశ్నించరాదు.
- అయితే రాష్ట్రపతి పదవిలోకి రాకముందుగాని, వచ్చిన తర్వాత గాని జరిగిన సివిల్ వివాదాలపై కేసు వేయవచ్చు. సివిల్ కేసు వేయాలంటే కనీసం 2 నెలల ముందు నోటీసు పంపాలి.
- అధికార పర్యటనకు రాష్ట్రపతి వినియోగించే బోయింగ్ విమానాన్ని ఇండియా వన్ (AIC001) అని వ్యవహరిస్తారు.
ప్రమాణ స్వీకారం
ప్రకరణ 60 రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం గురించి తెలియజేస్తుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేని పక్షంలో సీనియర్ న్యాయమూర్తి రాష్ట్రపతితో ప్రమాణం చేయిస్తారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లోని ప్రముఖులు, రాయబారులు, సైనికాధికారులు హాజరై రాష్ట్రపతిని అభినందిస్తారు.
రాష్ట్రపతి తొలగింపు విధానం
- ప్రకరణ 61 రాష్ట్రపతిని అభిశంసించే విధానాన్ని తెలియజేస్తుంది. దీనినే మహాభియోగ తీర్మానం అంటారు. ఇది క్వాసి జ్యుడీషియల్ పద్ధతి. దీన్ని అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు.
- 61(1) ప్రకారం రాజ్యాంగాన్ని ఉల్లంఘించినందుకుగాను రాష్ట్రపతి అభిశంసించవచ్చును.
- మహాభియోగ తీర్మానాన్ని పార్లమెంట్ ఉభయ సభల్లో ఏ సభలోనైనా ప్రవేశ పెట్టవచ్చు.
- 61(2) అభిశంసన ప్రక్రియ కింది విధంగా ఉండాలి.
- 61(2)(a) ప్రకారం రాష్ట్రపతి అభిశంసన లిఖిత పూర్వకంగా ఉండాలి.
- రాజ్యసభ/లోక్‌సభ మొత్తం సభ్యుల్లో కనీసం వంతు సభ్యులు ఆ తీర్మానంపై సంతకం చేయాలి.
- అట్టి తీర్మానాన్ని సభలో ప్రవేశ పెట్టే 14 రోజుల ముందుగా ఈ విషయాన్ని రాష్ట్రపతికి తెలియజేయాలి.
- 61(2)(b) ప్రకారం అభిశంసన తీర్మానాన్ని సభ మొత్తం సభ్యుల సంఖ్యలో 2/3వంతు సభ్యులు ఆమోదించాలి.
- 61(3) ప్రకారం రాష్ట్రపతిని అభిశంసిస్తూ ఒక సభ తీర్మానం చేసినపుడు రెండో సభ ఆ తీర్మానంపై న్యాయ విచారణ చేయాలి, లేదా అటువంటి ఆరోపణలపై దర్యాప్తు చేయించాలి. న్యాయ విచారణ జరిపించడానికి ఆ సభ ఒక న్యాయస్థానాన్ని గాని లేదా ట్రిబ్యునల్‌ను గాని లేదా స్వయంగానే తన సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి న్యాయ విచారణ జరుపుతుంది.
- అటువంటి ఆరోపణలపై విచారణ జరిపే కాలంలో రాష్ట్రపతి స్వయంగా గాని / ప్రతినిధి ద్వారా గాని లేదా అటార్ని జనరల్ లేదా ఎవరైనా ఇతర న్యాయవాది ద్వారా తన వాదనను వినిపించవచ్చు.
- 61(4) మొదటి సభ విచారణానంతరం అభిశంసన తీర్మానాన్ని రెండో సభ కూడా మొత్తం సభ్యుల్లో 2/3 వంతు మంది మెజారిటీతో అమోదించినట్లయితే అప్పటి నుంచి రాష్ట్రపతి పదవి నుంచి తొలగింపబడతాడు.
- మహాభియోగ తీర్మానం ద్వారా ఇప్పటి వరకు ఏ రాష్ట్రపతిని తొలగించలేదు.
మహాభియోగ తీర్మానం-విమర్శ
- రాష్ట్రపతి మీద అభియోగాలు విచారణ దశలో ఉన్నప్పుడు కూడా ఆయన ఆ పదవిలోనే కొనసాగటం విమర్శలకు దారి తీసింది. కనీసం విచారణలో ఉన్న సమయంలోనైనా ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరించేలా చట్టాన్ని సవరిస్తే బాగుండేది.
- రాజ్యాంగ ఉల్లంఘన అనే పదానికి సరైన అర్థాన్ని రాజ్యాంగం పేర్కొనలేదు.
- పార్లమెంట్ ఉభయ సభల్లోని నామినేటెడ్ సభ్యులకు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వకున్నా మహాభియోగ తీర్మానంలో పాల్గొనే అవకాశం కల్పించడం విమర్శలకు దారి తీసింది.
- రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనే రాష్ర్టాల శాసన సభల సభ్యులకు తొలగింపు ప్రక్రియలో పాల్గొనే అవకాశం లేదు.
- మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించిన వ్యక్తికి విధించే అనర్హతలు పేర్కొనలేదు.
- ప్రకరణ 62(1) ప్రస్తుత రాష్ట్రపతి పదవీకాలం ముగియక ముందే నూతన రాష్ట్రపతిని ఎన్నుకోవాలని తెలుపుతుంది.
- ప్రకరణ 62(2) ప్రకారం రాష్ట్రపతి మరణించడం లేదా రాజీనామా చేయడం లేదా తొలగించడం లేదా మరే ఇతర కారణాల వల్ల రాష్ట్రపతి పదవి ఖాళీ అయినపుడు ఆ రోజు నుంచి 6 నెలల లోపుగా నూతన రాష్ట్రపతిని ఎన్నుకోవాలి. ఎన్నుకొనే అభ్యర్థి ప్రకరణ 56 ప్రకారం ప్రమాణ స్వీకారం చేసినప్పటి తేది నుంచి 6 సంవత్సరాల పాటు రాష్ట్రపతిగా కొనసాగుతారు.
- ప్రకరణ 70 ప్రకారం కొన్ని ఊహించని ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రపతి అధికార విధుల నిర్వహణ గురించి ఆదేశాలు జారీచేసే అధికారం పార్లమెంట్‌కు ఉంటుంది.
వివాదాలు : - ప్రకరణ 71 రాష్ట్రపతి, రాష్ట్రపతి ఎన్నిక వివాదాలు గురించి తెలియజేస్తుంది.
- 71(1) రాష్ట్రపతి / ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన వివాదాలను సుప్రీంకోర్టు మాత్రమే విచారించి తీర్పు చెప్పాలి. ఈ విషయమై మరే ఇతర కోర్టును ఆశ్రయించడానికి వీలులేదు.
- 71(2) ఒక వేళ రాష్ట్రపతి/ ఉపరాష్ట్రపతి ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు చెబితే తీర్పు వెలువడటానికి ముందు రాష్ట్రపతి / ఉపరాష్ట్రపతి పనిచేస్తున్న వ్యక్తి తీసుకున్న చర్యలు చెల్లుబాటు అవుతాయి.
- 71(3) రాజ్యాంగ నిబంధనలకు లోబడి రాష్ట్రపతి/ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన శాసనాలను పార్లమెంట్ రూపొందించవచ్చు.
- 71(4) రాష్ట్రపతి / ఉపరాష్ట్రపతిలను ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీ (ఎన్నికల గణం) ఖాళీలు ఉన్నాయనే కారణంతో రాష్ట్రపతి ఎన్నికను ప్రశ్నించకూడదు.
న్యాయ సంబంధమైన అధికారాలు
- ప్రకరణ 72 ప్రకారం రాష్ట్రపతికి కొన్ని న్యాయసంబంధమైన అధికారాలున్నాయి.
- 72(1)- కింద పేర్కొన్న శిక్షల విషయంలో నేరస్థులకు విధించిన శిక్షలను రాష్ట్రపతి రద్దు చేయవచ్చు. లేదా తగ్గించవచ్చు. లేదా క్షమాభిక్ష ప్రసాధించవచ్చు.
- ప్రకరణ 72(1) (ఎ) ప్రకారం మార్షల్ కోర్టు విధించిన శిక్షలకు
- ప్రకరణ 72(1)(బి) ప్రకారం కేంద్ర ప్రభుత్వ అధికారం విస్తరించిన ప్రదేశాల్లో అమల్లో ఉన్న శాసనాల కింద శిక్ష విధించిన సందర్భాలు.
- ప్రకరణ 72(1)(సి) ప్రకారం మరణ శిక్ష విధించిన సందర్భాలు.
- 72(2) ప్రకారం సైనిక శిక్షల విషయంలో రాష్ట్రపతికి గల అధికారాలు సైనికాధికారులకు గల అధికారాల్ని ప్రభావితం చేయవు. అంతే కాదు ఈ అధికారాలు కేంద్ర జాబితాకు చెందిన ఏ అంశాలకు వ్యతిరేకంగా జరిగిన నేరాలకు మాత్రమే వర్తిస్తాయి. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పార్లమెంట్ చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మినహాయింపు ఇచ్చిన ఉమ్మడి జాబితా అంశాలకు కూడా వర్తిస్తాయి.
- 72(2) మరణ శిక్షను తగ్గించి తక్కువ శిక్షగా మార్చడం లేదా శిక్షను తాత్కాలికంగా నిలుపుదల చేయడానికి సంబంధించి రాష్ట్ర గవర్నర్లకు గల చట్టపరమైన అధికారాలను క్లాజ్ 72(1)(సి) ప్రభావితం చేయదు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు