‘తెలంగాణ రక్షణకు గొడ్డలిపెట్టు’ అని అన్నది? (తెలంగాణ హిస్టరీ )
గ్రూప్స్ ప్రత్యేకం గత తరువాయి..
పంచసూత్ర పథకం (1972)
#నవంబర్ 27న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పంచసూత్ర పథకాన్ని పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రకటించారు.
1) ముల్కీ నియమాలు తెలంగాణ ప్రాంతంలో నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు, తహసీల్దార్, అసిస్టెంట్ సర్జన్, జూనియర్ ఇంజినీర్ పదవులకు వర్తిస్తాయి. సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, మిగతా ఉమ్మడి కార్యాలయాల్లో ప్రతి మూడు ఉద్యోగాల్లో ఒక ఉద్యోగానికి కూడా వర్తిస్తాయి.
2) ఈ రక్షణలు రాజధాని అయిన హైదరాబాద్ నగరంలో 1977 సంవత్సరం చివరి వరకు అమలవుతాయి.
3) ఉభయ ప్రాంతాల్లో ఉద్యోగులకు తగిన ప్రమోషన్ అవకాశాలు కల్పించేందుకు వివిధ ఉద్యోగాలను మొదటి లేక రెండో గెజిటెడ్ స్థాయి వరకు ప్రాంతీయీకరణ చేయడం జరుగుతుంది.
4) సాంకేతిక, వృత్తిపరమైన విద్యాలయాలతో సహా నగరంలోని అన్ని విద్యాలయాల్లో ప్రస్తుతం తెలంగాణ ప్రాంత విద్యార్థులకు లభించే స్థానాల కంటే అదనంగా కొన్ని స్థానాలు సృష్టించడం జరుగుతుంది. కొత్తగా సృష్టించిన స్థానాలు బేషరతుగా ఏ ప్రాంతం వారైనా పొందవచ్చు.
5) జంటనగరాల్లో ఆంధ్ర, తెలంగాణ రెండు ప్రాంతాలకు చెందిన ఉమ్మడి పోలీసు బలగాలు ఉంటాయి.
#పంచ సూత్ర పథకంపై గౌతు లచ్చన్న స్పందిస్తూ ‘మహారాజుకు మనవి చేసుకుంటే మరి రెండు దెబ్బలు వేయమన్న’ సామెతకు సరిపోయినట్లుగా ఈ పంచసూత్ర పథకం ఉందని పేర్కొన్నారు.
# ప్రధాని పంచసూత్ర పథకం ‘తెలంగాణ రక్షణలకు గొడ్డలిపెట్టు’ అని మరి చెన్నారెడ్డి వ్యాఖ్యానించారు. 1977, 1980 గడువులు పెట్టడం, ముల్కీ అమలుకు తహసీల్దార్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాల వరకు పరిమితులు పెట్టడం తెలంగాణ మంత్రులు కనీసం అభ్యంతరాలైనా పెట్టకపోవడం శోచనీయం అని అన్నారు.
రాష్ట్రపతి పాలన
#జై ఆంధ్ర ఉద్యమం ఎక్కువ కావడంతో 1973, జనవరి 18న పీవీ నర్సింహారావు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో జనవరి 18న రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్ర శాసనసభను రద్దు చేయడానికి బదులుగా అనిశ్చిత స్థితిలో ఉంచారు. ఈ సమయంలో రాష్ట్ర గవర్నర్ ఖండూభాయ్ దేశాయ్ కాగా సలహాదారులుగా హెచ్‌సీ శరిన్, వీకే రావు నియమితులయ్యారు.
తెలంగాణ సంఘర్షణ సమితి మహాసభ
# తెలంగాణ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ మహాసభను 1973, ఫిబ్రవరి 2న హైదరాబాద్‌లోని కేశవ మెమోరియల్ హైస్కూల్లో జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభలో వాజ్‌పేయి ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ విభజనను ప్రజలు కోరుతున్నదీ లేనిదీ కేంద్రం నిర్ధారించుకోదలిచే పక్షంలో ‘ఒపీనియన్ పోల్’ ద్వారా ప్రజాభిష్టాన్ని తెలుసుకొనవచ్చన్నారు.
#‘తెలంగాణ, ఆంధ్ర రాజీ క్యా కరేంగీ ఇందిరా జీ’ అంటూ తెలంగాణ-ఆంధ్ర ప్రజలు స్నేహపూర్వకంగా విడిపోవాలనుకున్నప్పుడు వారిని ఏ శక్తీ నిరోధించలేదు. లక్ష్యాన్ని సాధించుకోవచ్చని వాజ్‌పేయి పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలను ఏర్పర్చినంత మాత్రాన భూకంపం రాబోదని వాజ్‌పేయి అన్నారు.
తెలంగాణ, ఆంధ్ర నేతలకు ఢిల్లీ ఆహ్వానం
#సెప్టెంబర్ 8న ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ప్రత్యేక రాష్ట్రం, సమైక్య రాష్ట్రం కోరేతెలంగాణ, ఆంధ్ర ప్రాంత నాయకులకు ఢిల్లీకి రావాలని ఆహ్వానాలు అందినాయి.
#వీరిలో తెలంగాణ నాయకులు చెన్నారెడ్డి, ప్రాంతీయ సంఘం అధ్యక్షులు కోదాటి రాజమల్లు, వెంగళరావు, నరసారెడ్డి, టీ అంజయ్య, నూకల రామచంద్రారెడ్డి, వీ పురుషోత్తమ రెడ్డి, జైపాల్ రెడ్డి ఉన్నారు.
#సెప్టెంబర్ 3వ వారంలో ఇరుప్రాంతాల నాయకులతో కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు వరుసగా జరిపిన చర్చలు ప్రత్యేక రాష్ట్రవాదులకు సంతృప్తిని కలిగించలేదు. చర్చల పేరుతో ఢిల్లీకి పిలిచి నాయకులతో లాబీయింగ్ మొదలుపెట్టిన అధిష్ఠానం చివరికి వీరిలో చీలికలను తేవడం ద్వారా తన ఎత్తుగడలను విజయవంతంగా అమలు చేసింది.
ఆరు సూత్రాల పథకం
# సెప్టెంబర్ 21న ఆరు సూత్రాలతో ఒక పథకాన్ని ప్రకటించారు ప్రధాని ఇందిరాగాంధీ.
1) రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతం అభివృద్ధికి, రాజధాని అభివృద్ధికి ప్రత్యేకమైన నిధులు కేటాయించాలి. దీని కోసం ఒక రాష్ట్రస్థాయి ప్రణాళికా బోర్డును, వెనుకబడిన ప్రాంతాలకు ఉపసంఘాలు నియమించాలి.
2) రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని నగరంలో ఉన్నత విద్యావసతులను పెంచడానికి ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలి.
3) ఒక నిర్ణీత స్థాయి వరకు ప్రభుత్వ ఉద్యోగాల నియామకం విషయంలో స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వాలి.
4) ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ఒక అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను నియమించాలి. ఇటువంటి ట్రిబ్యునల్ ఇచ్చే నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం విధిగా అమలుపర్చాలి.
5) పైన వివరించిన సూత్రాలను అమలు చేయడంలో వచ్చే సమస్యలను అధిగమించడానికి భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారాన్ని రాష్ట్రపతికి కలిగించాలి.
6) పైన సూచించిన వాటిని అవలంబిస్తే ముల్కీ నిబంధనలు, తెలంగాణ ప్రాంతీయ కమిటీ కొనసాగింపు రద్దవుతాయి.
తెలంగాణకు జరిగిన అన్యాయాలు
1) ఈ ఆరు సూత్రాల పథకం వల్ల కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అవతరణ సందర్భంగా తెలంగాణ పొందిన అన్ని హామీలను రద్దు చేసింది.
2) ముల్కీ నిబంధనలు రద్దయ్యాయి.
3) 1958లో ఏర్పాటైన తెలంగాణ ప్రాంతీయ సంఘం రద్దయ్యింది.
4) తెలంగాణ, ఆంధ్ర ప్రాంత ఆదాయ వ్యయాలు బడ్జెట్లో విడివిడిగా చూడాలన్న నియమం కూడా రద్దయ్యింది.
5) తెలంగాణలో స్థానికులుగా గుర్తింపు పొందడానికి స్థిర నివాసం 15 సంవత్సరాల కాలం నుంచి 4 సంవత్సరాల కాలానికి తగ్గింది.
6) ఇప్పటి వరకు అక్రమంగా చేరిన ఆంధ్ర ఉద్యోగులను సక్రమమైనవిగానే గుర్తించాల్సి వచ్చింది.
7) ప్రాంతీయ సంఘం రద్దుతో తెలంగాణ భూములకు రక్షణ లేకుండా పోయింది.
8) ప్రాంతీయ సంఘం స్థానంలో ప్రాంతీయ అభివృద్ధి బోర్డు ఏర్పడింది. దీనివల్ల ఎటువంటి లాభం లేకుండా పోయింది.
l ఈ విధంగా 1969 ఉద్యమం వల్ల ఏ లాభాలైతే కలిగాయో వాటన్నింటినీ 1973 జై ఆంధ్ర ఉద్యమం వల్ల తెలంగాణ ప్రజలు కోల్పోయారు.
రాజ్యాంగ సవరణ-ప్రెసిడెన్షియల్ ఆర్డర్
# ఆరు సూత్రాల పథకానికి చట్టబద్ధత కల్పించే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని సవరించి (32వ రాజ్యాంగ సవరణ) రాష్ట్రపతికి ప్రత్యేక అధికారాలిచ్చారు. దీన్ని విపులీకరిస్తూ రాష్ట్రపతి 1975, అక్టోబర్ 18న జీఎస్ఆర్ 524(ఇ) సంఖ్యగల ఒక ఉత్తర్వును జారీ చేశారు. దీన్నే ‘ప్రెసిడెన్షియల్ ఆర్డర్’ అని అంటారు. దీని ప్రకారం సిబ్బంది నియామకాలకు సంబంధించి పాటించాల్సిన అంశాలను నిర్దేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 674ను 1975, అక్టోబర్ 20న జారీ చేసింది.
ముఖ్యాంశాలు
1) లోకల్ కేడర్లు, లోకల్ ఏరియాల నిర్ధారణ
ఎ) ఒక జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో ఉండే ఎల్డీసీ స్థాయి ఉద్యోగాలన్నీ జిల్లా స్థాయి కేడర్లవుతాయి. ఈ స్థాయి నియామకాలకు ప్రతి జిల్లా ఒక లోకల్ ఏరియా అవుతుంది.
బి) ఒక జోన్లో ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో ఉండే ఎల్డీసీ స్థాయి కంటే ఎక్కువ స్థాయి గల నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు, కొన్ని నిర్ణీత గెజిటెడ్ ఉద్యోగాలన్నీ జోన్ స్థాయి కేడర్లు అవుతాయి. ఈ నియామకాలకు ప్రతి జోన్ ఒక లోకల్ ఏరియా అవుతుంది.
సి) అవసరమైతే ఒక జిల్లా స్థాయి కేడర్‌ను ఒకటి కంటే ఎక్కువ జిల్లాలకు విస్తరింపజేయవచ్చు. అదేవిధంగా ఒక జోన్ స్థాయి కేడర్‌ను ఒకటి కంటే ఎక్కువ జోన్లకు విస్తరింపజేయవచ్చు. వీటిని మల్టీ జోనల్ కేడర్లు అంటారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌ను అనుసరించి రాష్ట్రంలోని 23 జిల్లాలను 6 జోన్లుగా వర్గీకరించారు.
ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వర్తించని కార్యాలయాలు, సంస్థలు
#రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, రాష్ట్రస్థాయి గల ఇతర కార్యాలయాలు, భారీ అభివృద్ధి ప్రాజెక్టులు, ప్రత్యేక కార్యాలయాలు, పోలీసు శాఖలోని కొన్ని ఉద్యోగాలు.
మరికొన్ని ముఖ్యాంశాలు
# l సాధారణంగా ఒక లోకల్ ఏరియాలో కనీసం 4 సంవత్సరాల నివాసం కలిగిన ప్రతి వ్యక్తి ఆ ఏరియాలో లోకల్ క్యాండిడేట్ అవుతాడు. జిల్లా స్థాయి కేడర్లు అయితే లోకల్ వారికి 80 శాతం, జోనల్ స్థాయి కేడర్లు అయితే లోకల్ వారికి నాన్ గెజిటెడ్ ఉద్యోగాల్లో 70 శాతం, నిర్ణీత గెజిటెడ్ స్థాయి ఉద్యోగాల్లో 60 శాతం రిజర్వ్ చేశారు.
మాదిరి ప్రశ్నలు
1. ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటించిన పంచసూత్ర పథకాన్ని విమర్శిస్తూ తెలంగాణ రక్షణకు గొడ్డలిపెట్టు అని అన్నది?
1) ఆమోస్ 2) చెన్నారెడ్డి
3) మదన్ మోహన్ 4) చొక్కారావు
2. ముఖ్యమంత్రిగా పీవీ నర్సింహారావు రాజీనామా చేసింది ఎప్పుడు?
1) 1973, జనవరి 18
2) 1972, జనవరి 18
3) 1973, ఫిబ్రవరి 18
4) 1973, మార్చి 18
3. రెండు తెలుగు రాష్ట్రాలను ఏర్పర్చినంత మాత్రాన భూకంపం రాదని అన్నది?
1) పీవీ నర్సింహారావు 2) సదాలక్ష్మి
3) ఏబీ వాజ్‌పేయి 4) శిబూసోరెన్
4. ఆరు సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం?
1) 1973, సెప్టెంబర్ 21
2) 1973, అక్టోబర్ 21
3) 1973, నవంబర్ 21
4) 1973, డిసెంబర్ 21
5. ఆరు సూత్రాల పథకాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించినవారు?
1) సెతల్వాడ్ 2) కేసీ పంత్
3) జలగం వెంగళరావు
4) కాసు బ్రహ్మానందరెడ్డి
6. ఏ పథకంలో భాగంగా 1976లో హైదరాబాద్‌లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పడింది?
1) ఐదు సూత్రాల పథకం
2) అష్ట సూత్ర పథకం
3) ఆరు సూత్రాల పథకం
4) పెద్దమనుషుల ఒప్పందం
7. కింది వాటిలో సరైనవి?
1) 1973, జనవరి 18న ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించారు
2) ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్- ఖండూభాయ్ దేశాయ్
3) గవర్నర్‌కు సలహాదారుగా హెచ్‌సీ శరిన్, వీకే రావులను నియమించారు
4) పైవన్నీ
8. షట్ సూత్ర పథకానికి చట్టబద్ధత కల్పించే ఉద్దేశంతో తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ?
1) 31వ రాజ్యాంగ సవరణ
2) 32వ రాజ్యాంగ సవరణ
3) 33వ రాజ్యాంగ సవరణ
4) 34వ రాజ్యాంగ సవరణ
9. తెలంగాణ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ మహాసభను హైదరాబాద్‌లో ఎవరి అధ్యక్షతన నిర్వహించారు?
1) జగన్మోహన్ రెడ్డి
2) మదన్ మోహన్
3) కొండా లక్ష్మణ్ బాపూజీ
4) మల్లికార్జున్
10. మహారాజుకు మనవి చేసుకుంటే మరి రెండు దెబ్బలు వేయమన్న సామెతకు సరిపోయినట్లుగా ఉందని పంచ సూత్ర పథకాన్ని విమర్శించింది?
1) మరి చెన్నారెడ్డి 2) వీబీ రాజు
3) గౌతు లచ్చన్న 4) ఎన్జీ రంగా
11. ఆరు సూత్రాల పథకం వల్ల తెలంగాణకు జరిగిన నష్టాలు?
1) ముల్కీ నిబంధనలు రద్దయ్యాయి
2) 1958లో ఏర్పాటైన తెలంగాణ ప్రాంతీ య సంఘం రద్దయ్యింది
3) అప్పటి వరకు అక్రమంగా చేరిన ఆంధ్ర ఉద్యోగులను సక్రమమైనవిగానే గుర్తించాల్సి వచ్చింది 4) పైవన్నీ
12. ఆరు సూత్రాల పథకం వల్ల తెలంగాణలో స్థానికులుగా గుర్తింపు పొందడానికి స్థిర నివాసం 15 సంవత్సరాల నుంచి ఎంతకు తగ్గించారు?
1) 4 సంవత్సరాలు
2) 6 సంవత్సరాలు
3) 8 సంవత్సరాలు
4) 9 సంవత్సరాలు
జవాబులు
1-2, 2-1, 3-3, 4-1, 5-2, 6-3, 7-4, 8-2, 9-1, 10-3, 11-4, 12-1.
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ,
కోరుట్ల
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు