తెలంగాణ సార్వభౌములు
కాకతీయులు తెలంగాణలో రాష్ట్రకూటులకు సేనలుగా, చాళుక్యులకు రాష్ట్రపాలకులుగా, దుర్గాధిపతులుగా సేవలందించారు. వారి పట్టుదల శౌర్యప్రతాపాలు, నిజాయితీ వల్ల స్వతంత్రు లయ్యారు. అనుమకొండ, ఓరుగల్లు రాజధానులుగా సుమారు మూడు శతాబ్దాలకుపైగా తెలుగు భాష మాట్లాడే తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రప్రాంతాలను పరిపాలించి శాశ్వత కీర్తిని గడించారు. నేటి తెలంగాణకు తొలి బీజాలు కాకతీయుల కాలంలోనే పడ్డాయి.
– కాకతీయుల చరిత్ర సంస్కృతి తెలుసుకోవడానికి ముఖ్యంగా రెండు రకాలైన ఆధారాలు లభిస్తున్నాయి.
1) పురావస్తు ఆధారాలు
2) వాజ్ఞ్మయ ఆధారాలు
– పురావస్తు ఆధారాల్లో శాసనాలు, నాణేలు, కట్టడాలు ప్రధానమైనవి.
–కాకతీయుల కాలంలో వెండి, రాగి, బంగారు లోహాలతో నాణేలను ముంద్రించేవారు. వీటిలో కేసరిగద్యానం, నిష్కాలు, మాడలు, కేసరి చిన్నము, పాటివరాహం మొదలైనవి ముఖ్యమైనవి.
– కాకతీయుల కాలంనాటి కట్టడాల్లో ప్రధానమైనవి ఓరుగల్లు కోట కాకతీయ తోరణం, అనుమకొండ వేయిస్తంభాల గుడి, పాలంపేట రామప్పగుడి, పిల్లలమరి, నాగులపాడు, గణపురం మొదలైనచోట్ల కట్టించిన దేవాలయాలు.
కాకతీయుల చరిత్ర అధ్యయనానికి ఉపకరిస్తున్న పురావస్తు ఆధారాలు
1. మాగల్లు శాసనం
2. అనుమకొండ వేయిస్తంభాల గుడి శాసనం
3. ద్రాక్షరామం శాసనం
4. బయ్యారం శాసనం
5. మోటుపల్లి అభయ శాసనం
6. చందుపట్ల శాసనం
7. త్రిపురాంతకం శాసనం
8. సకలవీడు శాసనం
9. మల్కాపురం శాసనం
10. కొలనుపల్లి శాసనం
కాకతీయుల చరిత అధ్యయనానికి ఉపకరిస్తున్న సాహిత్య రచనలు
–పండితారాధ్య చరిత్ర, బసవపురాణం – పాల్కురికి సోమనాథుడు
–నీతిసారం లేదా నీతిశాస్త్ర ముక్తావళి – బద్దెన
–శివయోగసారం – కొలను గణపతిదేవుడు
–క్రీడాభిరామం – వినుకొండ వల్లభరాయుడు
– ప్రతాపరుద్రీయం లేదా ప్రతాపరుద్ర యశోభూషణం – విద్యానాథుడు
– నృత్య రత్నావళి – జాయపసేనాని
– ఆంధ్ర మహాభారతం – తిక్కన సోమయాజి
– నిర్వచనోత్తర రామాయణం – తిక్కన సోమయాజి
– కాకతీయుల కాలాన్ని సామంతరాజులుగా, స్వతంత్రరాజులుగా రెండు దశలుగా చరిత్రకారులు విభజిస్తారు.
– సామంత రాజుల్లో మొదటివాడు కాకర్త్య గుండ్యన. ఇతని నుంచి రుద్రుడి వరకు అంటే క్రీ.శ. 956 నుంచి క్రీ.శ.1162 వరకు నేటి కరీంనగర్, వరంగల్, ఖమ్మం ప్రాంతాలను పరిపాలించిన కాకతీయులను సామంత కాకతీయ రాజులు అంటారు. రుద్రదేవుడి మొదటి దశను 1158-1162 సామంతరాజు దశగా క్రీ.శ. 1163-1195 వరకు పాలించిన దశను సార్వభౌమదశగా పేర్కొన్నారు.
సామంత కాకతీయులు
మొదటి బేతరాజు
మొదటి ప్రోలరాజు
రెండో బేతరాజు
రెండో ప్రోలరాజు
రుద్రదేవుడు
– రుద్రదేవుడు క్రీ.శ.1158-1162 వరకు మాత్రమే సామంత రాజుగా ఉన్నాడు. 1163 స్వాతంత్య్రం ప్రకటించుకున్నాడు.
స్వతంత్రరాజుల్లో ముఖ్యులు
రుద్రదేవుడు
మహాదేవుడు
గణపతిదేవుడు
రుద్రమదేవి
ప్రతాపరుద్రుడు
–మొదటి బేతరాజు కుమారుడు మొదటి ప్రోలరాజు కాజీపేట, పిల్లలమర్రి, పాలంపేట శాసనాలు ఇతని విజయాలను పేర్కొంటున్నాయి. ఇతని చర్యలకు మెచ్చి కళ్యాణిచాళుక్య సోమేశ్వరుడు అనుమకొండ విషయానికి ప్రోలరాజును వంశపారంపర్య హక్కులతో సామంత ప్రభువుగా గుర్తించాడు.
–రెండో బేతరాజు మొదటి ప్రోలరాజు కుమారుడు. ఆరో విక్రమాదిత్యుడు బేతరాజుకు 1000 సబ్బిసాయిర మండలం అప్పగించాడు.
–రెండో ప్రోలరాజు సామంత కాకతీయుల్లో రెండో శక్తిమంతమైన రాజు. తెలంగాణలో కళ్యాణి చాళుక్యులకు అడ్డుకట్ట వేసి కాకతీయులను బలోపేతమైన శక్తిగా తీర్చిదిద్దాడు.
– రెండో ప్రోలరాజు కుమారుడైన రుద్రదేవుడు క్రీ.శ. 1158లో రాజ్యానికి వచ్చాడు. క్రీ.శ. 1162 వరకు సామంతరాజుగానే రాజ్యాధికారం చెలాయించాడు. ఆ తర్వాత 1163లో స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాడని, తెలంగాణలో మొదటిసారిగా విశాల రాజ్యాన్ని స్థాపించాడని ఇతడి అనుమకొండ వేయిస్తంభాల గుడి శాసనం (క్రీ.శ.1163) తెలియజేస్తుంది.
– కాకతీయుల సార్వభౌమాధికారాన్ని వరంగల్ కేంద్రంగా నెలకొల్పిన రుద్రదేవుడు ప్రజాహితాన్నే పరమావధిగా భావించి పరిపాలించాడు.
– ఇతని అస్థానంలో పరిపాలనలో ఇతనికి నమ్మకస్తులు, సమర్ధులు అయిన అనేకమంది మంత్రులు అధికారులు సహకరించారు. వీరిలో అత్యంత సమర్ధుడు వెల్లంకి కుటుంబానికి చెందిన గంగాధరుడు. క్రీ.శ.1170 నాటి కరీంనగర్ శాసనం గంగాధరుని రాజకీయ చరిత్రను వివరిస్తుంది.
–రుద్రదేవుడు కళాభిమాని, కళాపోషకుడు అనేక ఆలయాలను నిర్మించాడు. వేయిస్తంభాల గుడి ఇతని నిర్మాణమే.
– పౌర, సైనిక సౌలభ్య, అవసరాల కోసం అనుమకొండకు సమీపంలో ఓరుగల్లు కోట నిర్మాణాన్ని పూర్తి చేశాడు. ఇదే కాకతీయుల కొత్త రాజధాని.
–రుద్రదేవుడు తన అధికారాన్ని ఉత్తరాన గోదావరి వరకు, దక్షిణాన శ్రీశైలం వరకు, పశ్చిమాన బీదర్ వరకు విస్తరించాడు. ఇతడు కవి, పోషకుడు విద్యావంతులకు కల్పతరువువంటివాడని 1196నాటి పిల్లలమర్రి నాయరెడ్డి శాసనం తెలియజేస్తుంది. రుద్రదేవుడికి పుత్రులు లేనందువల్ల అతని తమ్ముడు మహదేవుడు క్రీ.శ 1195లో అధికారాన్ని చేట్టాడు.
–మహదేవుడి పాలన కాలానికి సంబందించిన శాసనం పెద్దపల్లిలోని సుందిల్ల గ్రామ శాసనం. వరంగల్ కోటలో లభించిన విరిగిపోయిన శాసనం.
–మహదేవుడు తన పరిపాలనా కాలంలో చేసిన యుద్ధం ఒక్కటే. యూదవరాజ్యంపై దండెత్తి పరాజయం పొంది ప్రాణాలు కోల్పోయాడు.
– గణపతి దేవుడిని యాదవరాజుల చెర నుంచి విడిపించి ఓరుగల్లు రాజ్య సింహాసనంపై కూర్చోబెట్టినట్లు రామచంద్రదేవుడు వేయించిన పైఠాన్ తామ్ర పత్రాలు తెలియజేస్తున్నాయి.
ప్రాక్టీస్ బిట్స్
1. మొదటిసారిగా కాకర్త్య గండ్యన అతని మూడు తరాల పూర్వీకుల ప్రశస్తి తూర్పు చాళుక్య రాజైన దానార్ణవుడు వేయించిన ఏ శాసనంలో ఉంది?
1) మాగల్లు శాసనం (క్రీ.శ.956)
2) అనుమకొండ వేయిస్తంభాల గుడి శాసనం (క్రీ.శ.1163)
3) ద్రాక్షారామం శాసనం (క్రీ.శ.1158)
4) మోటుపల్లి అభయశాసనం(క్రీ.శ.1244)
2. కాకతీయుల చరిత్ర అధ్యయనానికి ఉపకరిస్తున్న సాహిత్య రచనలు ఏవి?
1) పండితారాధ్య చరితం
2) నీతిశాస్త్ర ముక్తావళి
3) క్రీడాభిరామం 4) పైవన్నీ
3. రుద్రదేవుడు క్రీ.శ. 1163లో స్వాతంత్య్రాన్ని ప్రకటించుకొన్నట్లు తెలియజేసిన శాసనం?
1) అనుమకొండ వేయిస్తంభాల గుడి శాసనం
2) కొలనుపల్లి శాసనం
3) సకలవీడు శాసనం
4) చందుపట్ల శాసనం
4. కాకతీయ రాజ్యం గురించి ఆనాటి రాజకీయ వ్యవస్థ స్వభావం, స్వరూపాలను గురించి వర్ణించే గ్రంథం ఏది?
1) పండితారాధ్య చరితం
2) నీతిశాస్త్ర ముక్తావళి
3) క్రీడాభిరామం 4) నృత్యరత్నావళి
5. ఏ గ్రంథంలో ఓరుగల్లుకోట లోపల నివసిస్తున్న అష్టదశ ప్రజల జీవన పరిస్థితిని వివరించారు?
1) క్రీడాభిరామం 2) నృత్యరత్నావళి
3) ప్రతాప చరిత్ర 4) బసవపురాణం
6. రుద్రమ దేవి అంబదేవుని తిరుగుబాటును అణిచే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిందని ఆమెకు పుణ్యం లభించాలని స్థానిక సోమనాథుడి గుడికి ఆమె బంటు భూదానం చేశాడని ఏ శాసనం తెలియజేస్తుంది?
1) మోటుపల్లి శాసనం
2) కొలనుపల్లి శాసనం
3) సకలవీడు శాసనం
4) చందుపట్ల శాసనం
7. కాకతీయుల కేంద్ర ప్రభుత్వ స్వభావం సైనిక వ్యవస్థ గురించి వివరించే సంస్కృత రచన అయిన ‘ప్రతాపరుద్ర యశోభూషణం’ ఎవరు రచించారు?
1) జాయపసేనాని
2) వినుకొండ వల్లభరాయుడు
3) విద్యానాథుడు
4) కొలను గణపతిదేవుడు
8. మార్కొపోలో యాత్ర వివరాలతోపాటు రుద్రమదేవి కాలంలో మోటుపల్లి ఓడరేవులో విదేశీ వ్యాపార వివరాలను తెలియజేసిన విదేశీ రచన ఏది?
1) ది ట్రావెల్స్ 2) రెహలా
3) తారీఖ్ -ఇ- ఫిరోజ్షా 4) పైవేవీకావు
9. మహాశూరుడైన మొదటి ప్రోలరాజు చక్రకూట విషయాన్ని చక్కదిద్దాడని, కొంకణ మండలాన్ని జయించాడని, భద్రంగపురాధీశ్వరుడిని తరిమాడని, పురుకూటాధీశుడైన గొన్నరాజును యుద్ధంలో సంహరించాడని ఏ శాసనాలు తెలియజేస్తున్నాయి?
1) పాలంపేట శాసనం
2) కాజీపేట శాసనం
3) పిల్లలమరి శాసనం 4) పైవన్నీ
10. ఆరో విక్రమాదిత్యుడు 1000 సబ్బిసాయిర మండలాన్ని ఎవరికి అప్పగించాడు?
ఎ) మొదటి ప్రోలరాజు 2) రెండో బేతరాజు
3) రెండో ప్రోలరాజు 4) ఎవరూకాదు
11. త్రిభువనమల్ల, విక్రమ చక్రీయ బిరుదులు ఎవరికి గలవు?
ఎ) మొదటి ప్రోలరాజు 2) బేతరాజు
3) రెండో ప్రోలరాజు 4) రెండోబేతరాజు
12. రుద్ర దేవుడిని మహాపరాక్రమశాలిగా, చాలుక్య చోళరాజైన రెండో రాజరాజుకు సమకాలికుడని రుద్రుని మంత్రి ఇనంగాల బ్రహ్మారెడ్డి వేయించిన ఏ శాసనం తెలియజేస్తుంది?
1) అనుమకొండ శాసనం
2) పిల్లలమరి శాసనం
3) ద్రాక్షారామం శాసనం
4) జమ్మలూరు శాసనం
13. విశాలమైన శ్రీశైలం అటవీ ప్రాంతాన్ని చెరకు నాయకులకు అప్పగించాడని పేర్కొంటున్న శాసనం?
1) కొలనుపల్లి శాసనం
2) పిల్లలమరి శాసనం
3) ద్రాక్షారామం శాసనం
4) జమ్మలూరు శాసనం
14. కాకతీయ రుద్రదేవుడు తన తండ్రి మరణానికి కారణమైన వెలనాటి రాజులపై చేసిన యుద్ధానికి గల పేరు?
1) పల్నాటి యుద్ధం 2) బొబ్బిలి యుద్ధం
3) కందూరి యుద్ధం 4) కలచురి యుద్ధం
15. కింది శాసనాలను అవి వేసిన వారితో జతచేయండి.
ఎ) మోటుపల్లి శాసనం
i) రెండోప్రతాపరుద్రుడు
బి) కొలనుపల్లి శాసనం
ii) పువ్వుల ముమ్మడి
సి) బయ్యారం శాసనం
iii) గణపతి దేవుడు
డి) చందుపట్ల శాసనం
iv) కాకతి మైలాంబ
1) ఎ-i, బి-ii, సి-iii, డి-iv
2) ఎ-ii, బి-iii, సి-iv, డి-i
3) ఎ-iii, బి-i, సి-iv, డి-ii
4) ఎ-iv, బి-ii, సి-iii, డి-i
16. అనుమకొండలో ఒక చెరువును, ప్రశన్న కేసవస్వామి గుడిని కట్టించిన వారు ఎవరు?
1) గంగాధరుడు 2) రుద్రదేవుడు
3) రెండోప్రోలరాజు 4) రెండోబేతరాజు
17. సమర్ధుడు విశ్వాస పాత్రుడైన మహదేవుడి సేనాదిపతి ఎవరు?
1) రేచర్ల రుద్రుడు 2) గంగాధరుడు
3) ఇనంగాల బ్రహ్మిరెడ్డి
4) ఎవరూకాదు
సమాధానాలు
1-1 2-4 3-1 4-2 5-1 6-4 7-3 8-1 9-4 10-2 11-4 12-3 13-4 14-1 15-3 16-1 17.1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు