తెలంగాణ రైతాంగ పోరాటం సామాజిక ఉద్యమాలు
రాజ్య వ్యవస్థ పట్ల సమాజంలో అసంతృప్తి రగిలినప్పుడు జరిగేవే సామాజిక ఉద్యమాలు. తమ సాంఘిక వ్యవస్థలో ఇతరుల జోక్యం, సంస్కృతిపై ఆధిపత్యం, ఆర్థిక దోపిడీ పెచ్చుమీరిపోయినప్పుడు ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఆ తిరుగుబాటే మహా ఉద్యమానికి దారితీస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో జరిగినదే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. జాగీరుదార్లు, వ్యాపారుల పీడనకు గురైన రైతులు, రైతు కూలీలు వెట్టిచాకిరీ నుంచి విముక్తి కోసం వీరోచిత పోరాటం సాగించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయే గ్రూప్-1, గ్రూప్-2 పోటీ పరీక్షల్లో సామాజిక అంశాలకు అధిక ప్రాధాన్యతనివ్వడంతో విద్యార్థులకు సామాజిక స్పృహ, బాధ్యత తప్పనిసరిగా ఉండాలన్న ఉద్దేశాన్ని తెలిపినట్లయింది.
సామాజిక ఉద్యమం అంటే: తమ సాంఘిక వ్యవస్థలో ఇతరుల జోక్యానికి, సంస్కృతిపై ఆధిపత్యానికి, ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా ఒక ప్రాంతానికి చెందిన ప్రజలు సంఘటితంగా పోరాడటాన్ని సామాజిక ఉద్యమం అని అంటారు. సాంఘిక ఉద్యమాలు ప్రధానంగా ప్రజల్లో వ్యవస్థ పట్ల గల అసంతృప్తిని దోపిడీని నిరసిస్తూ సామాజిక మార్పునుకోరే విధంగా ఉంటాయి. మరోవిధంగా చెప్పాలంటే సాంఘిక ఉద్యమాలు సమాజంలో రాజ్యవ్యవస్థ పట్లగల అసంతృప్తిని బహిర్గతం చేసేవిగా ఉంటాయి.
సామాజిక ఉద్యమాల అధ్యయనం
-సామాజిక ఉద్యమాల అధ్యయనం ప్రధానంగా సామాజిక మార్పు అధ్యయనమేనని చెప్పవచ్చు. సామాజిక ఉద్యమాల అధ్యయనం ద్వారా తెలిసే అంశాలు.
1) సామాజిక ఉద్యమ ప్రారంభ పూర్వకాలంలో సామాజిక సమస్యలు
2) ఉద్యమం లక్ష్యం, సిద్ధాంతం, నిర్దేశాత్మక భావజాలం
3) లక్ష్యసాధనకు అనుసరించిన మార్గాలు
4) ఉద్యమం పొందిన ప్రజాదరణ
5) వివిధ సంస్థలు నెలకొనడానికి అనుకూలించిన పరిస్థితులు
6) ఉద్యమానికి సంబంధించిన అనుకూల, ప్రతికూల అంశాలు
7) ఉద్యమ ఫలితాల సమీక్ష, సాధించిన విజయాలు, వైఫల్యాలు రైతాంగ ఉద్యమాలు
-వ్యవసాయిక సమాజం అయిన భారతదేశంలో నేటికీ 55 శాతం పైబడి జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రముఖ చరిత్రకారుడు ఏఆర్ దేశాయ్ వివరణ ప్రకారం 1920 నాటి భారతదేశ చరిత్రలో రైతాంగ ఉద్యమాల ప్రస్తావన ఎక్కువగా కన్పిస్తుంది. దేశాయ్ ఈ ఉద్యమాలను రైతాంగ పోరాటం (Peasant Struggle) అని పేర్కొనగా, కాథలిన్ గౌగ్ రైతుల తిరుగుబాటు (Peasant Uprising) అని, ఆచార్య ఎన్జీ రంగా రైతుల పోరాటం (Struggle of the Peasant) అని వివరించాడు. మార్క్సిజమ్ స్ఫూర్తితో పరిశీలించిన సమాజ శాస్త్రవేత్తలు భారతీయ రైతాంగ పోరాటాలను వర్గ పోరాటం (Class Struggle)గా చిత్రీకరించారు. అంతేకాకుండా వీరు వర్గ వైషమ్యం (Class Antagonism) దృక్కోణంలో రైతాంగ పోరాటాలను అధ్యయనం చేశారు. చరిత్రకారులు పేర్కొన్నట్లు 19వ శతాబ్దంలో సాధారణ స్థాయిలో ఉన్న రైతాంగ అసంతృప్తి 20వ శతాబ్దపు మొదటి 25 ఏండ్లు హింసాత్మకంగా మారింది.
జాతీయోద్యమంలో రైతు ఉద్యమాలు
-19వ శతాబ్దం మధ్యలో జరిగిన రైతుల తిరుగుబాట్లు చెదురుమదురుగా ఉండి జమీందారీ, రైత్వారీ ప్రాంతాల్లోని రైతు సమస్యలకు వ్యతిరేకంగా కొనసాగాయి. కానీ స్వాతంత్య్రోద్యమ కాలంలో జరిగిన రైతాంగ పోరాటాలు, తిరుగుబాట్లు జాతీయ భావంతో వలస విధానాన్ని నిర్మూలించేందుకు అనేక విధాలుగా దోహదపడ్డాయి. 1930లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం (Great Economic Depression) కారణంగా రైతు ఉద్యమాలు విప్లవాత్మకంగా పరిణమించిన విధానాన్ని పరిశీలిస్తే సామాన్య రైతాంగానికి ఆర్థిక విధానాలపై ఎంత అవగాహన ఉందో అర్థమవుతుంది.
-1896-97లో మహారాష్ట్రలో కరువు సంభవించినప్పుడు భారత జాతీయోద్యమ చరిత్రలో మొట్టమొదటిసారిగా బాలగంగాధర తిలక్ భూమి శిస్తు వసూలుకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్వహించాడు. అయితే రైతాంగాన్ని జాతీయోద్యమానికి మళ్లించిన ఘనత మాత్రం మహాత్మాగాంధీకే దక్కింది. చంపారన్ ఉద్యమంలో కైరా, బర్డోలి రైతు సత్యాగ్రహాల్లో గాంధీ పాల్గొని రైతులను సంఘటితం చేశాడు. జాతీయ కాంగ్రెస్‌కు, కర్షక వర్గానికి మధ్య మైత్రి అనేది అహింసా సాధనం ద్వారా ఏర్పడిందని ప్రముఖ చరిత్రకారుడు బారింగ్టన్ మూర్ పేర్కొనడాన్ని ప్రధానంగా గమనించవచ్చు.
అఖిల భారత కిసాన్ సభ: 1932-33లో శాసనోల్లంఘన ఉద్యమం ముగిసిన తరువాత కాంగ్రెస్‌లో ఒకవిధమైన నిరుత్సాహం పొడసూపింది. ఇందుకు ప్రధాన కారణం అప్పటివరకు క్రియాశీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో చేరడం ప్రారంభించారు. 1937లో కాంగ్రెస్ మంత్రివర్గాలు స్థాపించిన తరువాత రైతు ఉద్యమాలు కొంతవరకు తగ్గుముఖం పట్టాయి. బీహార్‌లో బక్షాత్ ఉద్యమం (Bakshath Movement), మహారాష్ట్రలో వార్లె రైతు ఉద్యమం వంటివి జాతీయ కాంగ్రెస్ సహకారాన్ని పొందలేదు. అదేవిధంగా బెంగాల్లో జరిగిన తేభాగ ఉద్యమాన్ని కాంగ్రెస్ సమర్థించలేదు. అఖిల భారత కిసాన్ సభ కృషి ఫలితంగా రైతాంగ పోరాటాల్లో అనేక గుణాత్మక మార్పులు సంభవించాయి.
-1936లో స్థాపించబడిన అఖిల భారత కిసాన్ సభ బ్రిటీష్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించి జమీందారీ విధానాన్ని రద్దు చేయడానికి చిన్నచిన్న కమతాలపై భూమి శిస్తు రద్దు చేయాలని, రైతు కూలీలకు కనీస వేతనాలను నిర్ణయించాలని తీర్మానించింది.
-1939లో గయలో జరిగిన కిసాన్ సభ సమావేశం కాంగ్రెస్‌తో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలని, రైతాంగ ఉద్యమాలను కాంగ్రెస్ జాతీయోద్యమంతో అనుసంధానం చేయాలని ప్రకటించడంతోపాటు దున్నే వారిదే భూమి అనే నినాదాన్ని కిసాన్ సభ ప్రచారం చేసింది.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం (1946-1951)
-అఖిల భారత కిసాన్ సభ ఆధ్వర్యంలో జరిగిన పోరాటాలు రైతాంగంలో చైతన్యాన్ని కల్పించినప్పటికీ ఈ పోరాటాలు నిరంతరం కొనసాగడానికి ప్రత్యక్షంగా దోహదపడలేకపోయాయి. అయితే ఈ సభ అందించిన ప్రేరణతో దున్నేవారిదే భూమి అన్న లక్ష్యాన్ని సాధించడానికి తెలంగాణ సాయుధ రైతాంగపోరాటం అనేక విధాలుగా ఉపయోగపడింది. ఒక చిన్న తిరుగుబాటుగా ప్రారంభమై రైతాంగ పోరాటంగా మారిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జాతీయ ప్రజా ఉద్యమంగా హైదరాబాద్ సంస్థానంలో నాటి నిజాం నిరంకుశ పాలనకు, భూస్వామ్య వ్యవస్థకు, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా పోరాడి చివరకు దాదాపు 10 లక్షల ఎకరాల భూమిని భూమిలేని నిరుపేదలకు పంచారు.
నేపథ్యం: 1930లో స్థాపించిన ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టు వశమైన తరువాత ప్రజాఉద్యమంగా మారింది. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆంధ్ర మహాసభ నాయకులుగా తెలంగాణ రైతాంగ పోరాటంలో క్రియాశీల పాత్ర పోషించారు. 1910 నుంచి 1940 వరకు నిజాం పాలనలో గిరిజనుల భూములన్నీ వడ్డీ వ్యాపారులు, వర్తకులు, ఇతర ధనికుల స్వాధీనమయ్యాయి. అత్యధికమంది గిరిజనులు తమ జీవనోపాధిని కోల్పోయారు. 1946 నాటికి రైతులకు నిజాం సైన్యానికి మధ్య నల్లగొండ, వరంగల్ జిల్లాల్లోని అనేక గ్రామాల్లో పోరాటాలు జరిగాయి. ఇవి క్రమంగా కమ్యూనిస్టుల ఆధీనంలోకి వెళ్లడంతో హింసాత్మకంగా మారాయి.
-రెండో ప్రపంచ యుద్ధానంతరం భారతదేశంలో చెలరేగిన రైతు ఉద్యమాల్లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చాలా పేరెన్నికగలది. అంతేకాకుండా ఇది యావత్ తెలంగాణ సమాజాన్ని కదిపిన సామాజిక ఉద్యమం కూడా. ఈ ఉద్యమం ఫలితంగా భూసంస్కరణలకు సంబంధించిన చట్టాలు రూపొందించడమేకాకుండా తెలంగాణ ప్రాంతపు సామాజిక, వ్యవసాయిక నిర్మితుల్లో స్పష్టమైన మార్పులు జరిగాయి.
నైజాం కాలంలో సామాజిక నిర్మితి: స్వాతంత్య్రానికి ముందు భారతదేశంలో ఉన్న రాజ ప్రముఖ రాజ్యాల్లో (Princely States) హైదరాబాద్ ఒకటి. ఇది భారత ఉపఖండంలోని దక్కన్ పీఠభూమిలో అధిక భాగంలో విస్తరించి ఉంది. దీని విస్తీర్ణం 82000 చదరపు మైళ్లు, జనాభా 18.6 మిలియన్లు (తెలంగాణలో 9 జిల్లాలు, మరఠ్వాడలో 5 జిల్లాలు, కన్నడ ప్రాంతంలో 3 జిల్లాలు ఉండేవి). హైదరాబాద్ సంస్థానంలోని మొత్తం భూభాగంలో 30% జాగీర్దారీ, 60% దివాన్ మిగిలిన 10% నిజాం సొంత ఆస్తి (సర్ఫ్-ఎ-ఖాస్)గా ఉండేది. ఇక్కడ వెట్టిచాకిరీ ఎక్కువగా కనపడేది.
-నిజాం పరిపాలనలోని వ్యవసాయిక సామాజిక వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థకు (Land Lords) చెందింది. ఈ వ్యవస్థలో రైత్వారీ, దివాన్, జాగీర్దారీ విధానాలు అమల్లో ఉండేవి. భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో రైత్వారీ వ్యవస్థగా చెలామణి అవుతున్న భూస్వామ్య విధానం వంటిదే దివాన్/ఖల్సా వ్యవస్థ. 1941 నాటికి నిజాం ప్రాంతంలోని మొత్తం భూమిలో 60% ఈ వ్యవస్థ పరిధిలో ఉండేది. జాగీర్దారీ భూ యాజమాన్యం హైదరాబాద్ రాజకీయ వ్యవస్థకు సంబంధించిన అతి ముఖ్యమైన లక్షణంగా కనిపిస్తుంది. ఈ వ్యవస్థ దాదాపు 6500 గ్రామాల్లో 25,000 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉండేది. జాగీర్దారీ వ్యవస్థలో రైతాంగం అధిక పీడనకు, దమనకాండకు గురయ్యింది. జాగీర్ భూములకు సంబంధించినంతవరకు సివిల్ న్యాయవ్యవస్థకు ఏవిధమైన అధికారం ఉండేదికాదు. జాగీర్దార్లు వారి ఏజెంట్లు అక్కడి రైతాంగాన్ని అధిక పన్నులతో దోపిడీకి గురిచేసేవారు. ముఖ్యంగా తెలంగాణ జిల్లాల్లోని రైతాంగం భూస్వామ్య దోపిడీ విధానానికి అధికంగా గురైంది. ఈ భూస్వామ్య వ్యవస్థలో జాగీర్దార్లు, దేశముఖ్లే అధిక శాతం భూమిని తమ ఆధీనంలో ఉంచుకునేవారు. ఇది నల్లగొండ, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో అధికంగా ఉండేది. కాబట్టి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఈ జిల్లాలు కేంద్ర బిందువులయ్యాయి.
-బలవంతులు, శక్తిమంతులైన జాగీర్దార్లు దేశ్‌ముఖ్‌లు, పటేల్, పట్వారీల పెత్తనం ఎక్కువగా ఉండేది. వీరినే దొర లేదా ఆసామిగా వ్యవహరించేవారు. ఈ దొరలే భూస్వాములుగా, రుణదాతలుగా (Money Lenders), గ్రామాధికారిగా చెలామణి అవుతూ సంప్రదాయిక ప్రత్యేక హక్కులను, సేవలను పొందేవారు. భూస్వాముల దౌర్జన్యానికి, దోపిడీకి వెట్టిచాకిరీ వ్యవస్థ ఒక ప్రతీకగా కనపడేది. వెట్టిచాకిరీలో అధిక సంఖ్యాకులు సమాజంలో అట్టడుగు వర్గాలకు చెందినవారు. అంటరానికులాలవారు ఉండేవారు. 1927లో రాష్ట్ర అధికారులకు, గ్రామాధికారులకు వెట్టి చాకిరీ చేయడానికిగాను నాటి నిజాం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని బట్టి నాటి నిరంకుశపాలనను అంచనావేయవచ్చు.
కారణాలు:
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సంభవించడానికి అనేక కారణాలు, కారకాలు దోహదపడ్డాయి.
1) జాగీర్దార్లు, వారి ఏజెంట్లు నిజాంకు, రైతులకు మధ్య మధ్యదళారులుగా వ్యవహరిస్తూ రైతుల నుంచి అధిక భూమి శిస్తు వసూలు చేసేవారు. ఈ వసూలు ఏకపక్షంగా జరిగేది. రైతుల పరిస్థితులతో సంబంధం లేకుండా బలవంతంగా శిస్తు వసూళ్లు జరిగేవి.
2) ఖల్సా భూములను సాగుచేసే రైతులను కూడా అనేక విధాలుగా పీడించేవారు. ఖల్సా గ్రామాల పరిపాలనకు సంబంధించి దేశ్‌ముఖ్‌లు, దేశ్‌పాండేలు మధ్యవర్తులుగా వ్యవహరించేవారు. వీరి వద్ద భూములకు సంబంధించిన లిఖిత పూర్వక రికార్డులు లేనందున భూమి తగాదాలు తలెత్తిన సందర్భాల్లో తమ ఇష్టానుసారం తరతరాలుగా భూమిని సాగుచేసుకుంటున్న రైతులను కౌలుదారులుగా లేదా భూమిలేని శ్రామికుల స్థాయికి దిగజార్చేవారు. ఇలాంటి తగాదాలున్న భూములను దేశముఖ్‌లు, దేశ్‌పాండేలు ఆక్రమించేవారు. ఇలా ఆక్రమించిన భూముల నుంచి అధిక మొత్తంలో శిస్తును వసూలు చేయడం, రైతుల నుంచి అనధికారికంగా నజరానాలను పొందడం వంటి దుశ్యర్యలకు పాల్పడేవారు. జాగీర్దారీ వ్యవస్థలో మధ్యదళారులే రాజకీయంగా బలంగా ఉంటూ రైతాంగాన్ని అనేక విధాలుగా పీడించేవారు.
3) దొరలు, బడా భూస్వాముల దౌర్జన్యం, దోపిడీలు పేద రైతుల అశాంతికి, అసంతృప్తికి ముఖ్య కారణాలయ్యాయి. కాలక్రమంలో ఈ దోపిడీ విధానమే పరోక్షంగా చట్టబద్ద వ్యవస్థగా చెలామణి అయ్యింది. పేద ప్రజలను పీడించడం అనేది ఈ బడా భూస్వాములు తమ జన్మహక్కుగా పరగణించారని ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త డీఎన్ దనాగర్ పేర్కొన్నాడు.
4) వెట్టిచాకిరీ నిజాం పరిపాలనా ప్రాంతమంతటా విస్తరించి ఉండేది. పెద్ద భూస్వాములు తమ ఆధీనంలో ఉన్న పేద రైతుకుటుంబాలను తమ భూములను సాగుచేయడానికి, మిగతా కుటుంబ సభ్యులను వివిధ రకాల పనులు చేయడానికి వినియోగించడం తప్పనిసరి చేశారు. నిజాం కాలంలో వెట్టిచాకిరీ దక్షిణ గుజరాత్లో కనపడే హోలి పద్ధతిని భగేలా అని పిలిచేవారు. భగేలాలు చాలావరకు అంటురాని వర్గాలకు చెందిన, ఆదిమ జాతికి చెందినవారై ఉండేవారు. రుణదాతలైన భూస్వాములకు సేవచేసి రుణవిముక్తులు కావడానికి భగేలాలు జీవితాంతం వెట్టి చేయాల్సి వచ్చేది. మరికొన్న సందర్భాల్లో ఇది కొన్ని తరాలపాటు కూడా కొనసాగేది.
5) నిజాం ప్రభుత్వం ఖల్సా, జాగీర్ గ్రామాలకు నీటిపారుదల సదుపాయాలను ఎక్కువగా కల్పించడంతో భూస్వాములే ఎక్కువగా లబ్ధి పొందారు. 1910-1940 మధ్య కాలంలో పట్టణ ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారులు, మార్వాడీలు, బ్రాహ్మణులు, ముస్లింలు గ్రామీణ ప్రాంతాల్లోని భూములను ఆక్రమించుకొని వాస్తవంగా భూమిని దున్నే రైతులను, గిరిజన రైతులను ఉపాంత రైతులుగా (Margina Farmers), భూమిలేని శ్రామికుల (Landless Labours) స్థాయికి దిగజార్చారు.
6) రెండో ప్రపంచ యుద్ధకాలంలో హైదరాబాద్ సంస్థానంలో ఆహార ధాన్యాల కొరత విపరీతంగా ఏర్పడింది. ధాన్య సేకరణ కోసం ప్రభుత్వం అనేక ఫర్మానాలను జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు రైతులు లెవీ ధాన్యాన్ని కొనాల్సి రావడం, ధాన్య సేకరణతో తెలంగాణలోని చిన్న, మధ్య తరగతి రైతాంగం, రైతు కూలీల్లో అసంతృప్తి ప్రబలింది.
-తెలంగాణలో నాగు అనే వడ్డీ వ్యాపారం రైతులను కూలీలుగా మార్చింది
సాయుధ పోరాటం ప్రధాన ఆశయాలు
1. నిజాం నిరంకుశ పాలనను, భూస్వామ్య వ్యవస్థను అంతం చేయడం
2. పన్నుల నిరాకరణ
3. మద్యపాన నిషేధం
4. వడ్డీ వ్యాపారాన్ని నిర్మూలించడం
5. కమ్యూనిస్టుల భావజాలాన్ని వ్యాప్తి చేయడం
-రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య వంటి ప్రముఖ నాయకులు కమ్యూనిస్టు భావజాల వ్యాప్తి కోసం కృష్ణా జిల్లా కంకిపాడులో రాజకీయ పాఠశాలను ఏర్పర్చుకున్నారు. ఈ పాఠశాలలో ఎన్జీ రంగా శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాడు
-జగిత్యాల రాజకీయ పాఠశాలలో దేవులపల్లి వేంకటేశ్వరరావు, చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, అళ్వార్‌స్వామి శిక్షణ అందించారు.
సామాజిక ఉద్యమం నిర్వచనం
-సామాజిక మార్పుకు సామాజికంగా, ఉద్దేశపూర్వకంగా తలపెట్టే ఉద్యమం. ఈ ఉద్యమానికి విధిగా కావలసినవి సువ్యవస్థితమైన వ్యవస్థాపన, నిర్దేశాత్మక నిబద్ధత (Normative Commitment), సభ్యులందరూ చురుగ్గా చిత్తశుద్ధితో ఉద్యమంలో పాలుపంచుకోవడం- పాల్ విల్కిన్సన్
-అధిక సంఖ్యాక ప్రజలు ప్రస్తుతమున్న మొత్తం సంస్కృతిని గాని అందులో కొంత భాగాన్ని గాని లేదా సామాజిక క్రమాన్ని గాని మార్చడానిక సంఘటితమై కృషి చేయడమే సామాజిక ఉద్యమం- బ్రూస్ కెమరన్
-సామాజికులు ఉమ్మడిగా క్రమంలో మార్పులు తేవడానికి చేసే ప్రయత్నమే సామాజిక ఉద్యమం- జోసెఫ్ గన్ఫీల్డ్
-వ్యవస్థేతర మార్గాల ద్వారా సామాజిక క్రమాన్ని ఎదుర్కోవడం గాని, సమూలమైన మార్పులు చేయడం గాని, సచేతనం (Conscious), సామాజిక సువ్యవస్థితమైన చర్యే సామాజిక ఉద్యమం- జాన్ విల్సన్
-ఈ నిర్వచనాలను నిశితంగా పరిశీలిస్తే సామాజిక ఉద్యమాలన్నీ సామాజిక పరివర్తనకు (Social Change) సాధనాలని అర్థమవుతుంది.
సుదీర్ఘ పోరాటం
-భారతదేశ రైతాంగ పోరాటాల్లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మహత్తర విముక్తి పోరాటం. చైనాలో తప్ప ఆసియాలో ఇంత పెద్ద రైతాంగ పోరాటం ఎక్కడా జరగలేదని ప్రముఖ చరిత్రకారుడు విల్ఫ్రెస్ కాంట్వెల్ స్మిత్ అభిప్రాయపడ్డాడు. ఈ పోరాటం ప్రపంచ పాత్రికేయులు, చరిత్రకారుల దృష్టిని ఆకర్షించడం మరో కీలక అంశం.
-తెలంగాణలో ఆంధ్రమహాసభ కృషితో పాలన, రాజ్యాగ సంస్కరణలు, పాఠశాలలు, పౌరహక్కులు, ఉద్యోగ నియామకాలు మొదలైన అంశాల్లో ప్రజల్లో చైతన్యం పెరిగింది. ఆంధ్రమహాసభ ప్రారంభించిన ఉద్యమం ప్రాంతీయ ఆర్థిక రాజకీయ ఆకాంక్షలు, మధ్య తరగతి, శిష్ట వర్గాల అభిమతాలను రాజకీయ అలజడులను ప్రతిబింబించింది.
-1936 నుంచి భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ ప్రాంతంలో తన కార్యక్రమాలను ప్రారంభించి కాలక్రమంలో తెలంగాణ రైతు ఉద్యమానికి నాయకత్వవ వహించింది ఇదే సమయంలో ఆచార్య ఎన్జీ రంగా అఖిల భారత కిసాన్ సభకు అనుబంధంగా తెలంగాణలో ప్రాంతీయ రైతు సంఘాన్ని నెలకొల్పారు.. 1944-46 మధ్యకాలంలో తెలంగాణ అంతటా కమూనిస్టు పార్టీ కార్యక్రమాలు విస్తరించి ఆంధ్రమహాసభ తీర్మానాలను చేజిక్కించుకొని పెద్ద ఎత్తున రైతు ఉద్యమం ప్రారంభం కావడానికి అనువైన వాతావరణాన్ని ఏర్పర్చారు.. 1946లో ఏర్పడిన తీవ్ర కరువు పరిస్థితులు, రాజకీయ సామాజిక పరిస్థితులు రైతాంగ పోరాటం ప్రారంభం కావడానికి దోహదపడ్డాయి.
-1946 జూలై 4న లాఠీలు, కొడవళ్లు పట్టుకొని వేలాదిమంది రైతులు పెద్ద ఎత్తున ఊరేగింపుగా వెళ్లి దేశముఖ్‌ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే దేశ్‌ముఖ్‌లు ఏర్పాటు చేసుకున్న కిరాయి గూండాలు జరిపిన కాల్పుల్లో దొడ్డి కొమరయ్య నేలకొరిగాడు. కమరయ్య వీర మరణంతో ఉద్యమం ఉధృతమై సాయుధ పోరాటానికి నాంది పలికింది.
-నిజాం ప్రభుత్వానికి దేశ్‌ముఖ్‌లు, బడా భూస్వాములకు వ్యతిరేకంగా సాగిన రైతాంగ పోరాటంలో వేలాదిమంది రైతులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. మొదట్లో తిరుగుబాటు ఆకస్మికంగా ప్రారంభమైంది. కమ్యూనిస్టులు, ఆంధ్రమహాసభ సంఘం, దళితులు రైతాంగ ఉద్యమానికి నైతిక మద్దతును అందించాయి. 1948లో జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ రెండో సమావేశంలో తెలంగాణ రైతాంగ పోరాటాన్ని ఒక విప్లవ పోరాటంగా కొనసాగించాలని తీర్మానించారు. రైతులందరినీ సైన్యంగా ఏర్పర్చి గెరిల్లా పోరాటం చేశారు.
-నిజాం ప్రభుత్వం ఎదుర్కొంటున్న కల్లోల పరిస్థితులను, ప్రజల భయాందోళనలను గుర్తించిన భారత ప్రభుత్వం 1948, సెప్టెంబర్ 13న భారత సైన్యాన్ని హైదారాబాద్‌కు పంపించింది. తెలంగాణ ప్రాంతంలో రజాకార్లు (కాశీం రజ్వీ) సృష్టించిన అరాచకం, దారుణ, మారుణకాండలకు అడ్డుకట్ట వేయడానికి, శాంతి భద్రతలను కాపాడటానికిగాను పోలీస్ చర్యను (అపరేషన్ పోలో) జరిపి హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసారు. ఈ చర్య అనంతరం కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సాయుధ రైతాంగ పోరాటాల్ని కొనసాగించాలని నిర్ణయించడం వివాదాస్పదంగా మారింది. నిజానికి పోలీస్ చర్య సర్వసమ్మతం కాకపోయినా అత్యావశ్యక చర్య అయ్యింది. రజాకార్లను అణిచివేసి నిజాం పాలనను అంతం చేసి సైనిక ప్రభుత్వాన్ని నెలకొల్పడంతో తెలంగాణ ప్రాంతంలో కొనసాగుతున్న రైతు ఉద్యమాన్ని అణిచివేయడంపై కేంద్రం దృష్టి కేంద్రీకరించినది.ఈ చర్యలో భాగంగాభారత సైన్యం కమ్యూనిస్టు
-దళాలలను అణిచివేయడానికి సకల ప్రయత్నాలు చేసింది. వీటన్నింటి ప్రభావంతో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని ఉపసహంరించుకోవాల్సి వచ్చింది.(భారత సైన్యంతో పోరాటంలో రెండువేలకు పైబడి రైతులు మరణించారు)
రైతాంగ పోరాట ఫలితం:
ఐదేండ్లపాటు కొనసాగిన రైతాంగ పోరాటంలో వివిధ స్థాయిలకు చెందిన రైతులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు.
1. ఈ ఉద్యమం మొట్టమొదటిసారిగా కౌలుదారు,భూమిలేని రైతు కూలీలను ఏకం చేసింది. పేదరైతులు బలం పుంజుకోగలిగారు. ముఖ్యంగా వెట్టిచాకిరికి గురవుతున్న గిరిజన రైతులు వెట్టి నుంచి విముక్తి పొందారు.
2. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రభావంతో సుమారు పదిలక్షల ఎకరాల భూమిని భూమిలేని నిరుపేదలకు పంచారు
3. తెలంగాణ రైతు ఉద్యమం కమ్యూనిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేసింది
4. భూస్వామ్య వ్యవస్థ బలహీనపడి రైతాంగంలో ఐక్యత బలపడింది
5. ఈ పోరాటం వల్ల ధనిక రైతులు కొంత లాభం పొందినప్పటికీ పేదరైతులు, కౌలుదార్లకు పూర్తిస్థాయి న్యాయం జరుగలేదు.
6. కమ్యూనిస్టులు బలపడ్డప్పటికీ అభిప్రాయ భేదాలతో అనేక చీలికలు ఏర్పడ్డాయి.
7. నాయకత్వ పరంగా ఉన్నత కులాలు ఉండటంతో ఉద్యమంలో కింది వర్గాలకు సరైన ప్రాధాన్యం లభించలేదన్న విమర్శ కూడా ఉంది.
-రజాకార్లకు వ్యతిరేకంగా రావి నారాయణరెడ్డి, పుచ్చపల్లి సుందరయ్య నాయకత్వంలో రైతాంగ పోరాటం తీవ్ర రూపం దాల్చింది.
-1947 సెప్టెంబర్ 11న నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు
-ఈ పోరాట కాలంలో గ్రామరక్షక దళాలు రక్షణ వ్యవస్థగా ఏర్పడ్డాయి
-సర్దార్ వల్లభ బాయ్ పటేల్ హైదరాబాద్‌లో జరుగుతున్న రైతాంగ పోరాటాన్ని పార్లమెంట్లో ప్రస్తావించాడు.
-సుమారు 4000 గ్రామాలను కమ్యూనిస్టులు తమ ఆధీనంలోకి తెచ్చుకొని భూస్వాముల భూములను భూమిలేని పేదలకు రైతుకూలీలక పంచారు.
-ఈ పోరాటాన్ని ప్రచారం చేయడానికి ప్రజానాట్యమండలి మా భూమి నాటికను ప్రదర్శించింది.
-స్థానిక వడ్డీ వ్యాపారులకు రైతులు చెల్లించాల్సిన రుణాలన్నింటినీ మాఫీ చేశారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు