తెలంగాణలో బౌద్ధమతం వ్యాప్తి
ప్రపంచంలోని మత స్థాపకులు, బోధకులు కనిపించే మనిషికన్నా, కనిపించని దేవునికీ, ఇహలోక సులభజీవనం కన్నా, లేని పరలోక సౌఖ్యాలకు ఎక్కువ ప్రాధానమిచ్చారు. ఒక్క గౌతమ బుద్ధుడు మాత్రమే మనిషిని కేంద్రంగా చేసుకొని తన ధర్మాన్ని బోధించాడు. మానవత్వానికి ప్రధాన పీట వేశాడు.సకల జీవకోటి సుఖంగా జీవించుగాక, సర్వ ప్రాణులూ నిర్భీతితో మనుగడ సాగించుగాక, సమస్త ప్రజలూ అన్ని రకాల కష్టాలు, దుఃఖాల నుంచి విముక్తులై ప్రశాంతంగా, ఆనందంగా జీవించుగాక అని కోరింది బౌద్ధం.
సుమారు 2560 ఏండ్ల కిందటి ఈ సామ్యవాద భావజాలం, భారతదేశంలో కన్నా విదేశాల్లో బాగా ఉంది. శాంతి, అహింస, ప్రజ్ఞ, కరుణ, శీల, సమత, మైత్రి, సానుభూతులకు వేదిక బౌద్ధం. క్రీ.పూ. 6వ శతాబ్దంలోనే కుల వ్యవస్థని, అస్పృశ్యతని నిరసించి, సమసమాజ నిర్మాణానికి శాశ్వతమైన పునాదులు వేసిన విప్లవకారుడు బుద్ధుడు. విశ్వంలో ప్రతి ఒక్కరి హృదయంలో ప్రజ్వలించే ధర్మజ్యోతి, ఆసియా జ్యోతి గౌతమ బుద్ధుడు.
క్రీ.పూ. 8వ శతాబ్దంలో జన్మించి సుమారు 1000 ఏండ్లపాటు భారతదేశంలో ఒక వెలుగు వెలిగిన బౌద్ధమతం నేటికీ జపాన్, థాయ్‌లాండ్, శ్రీలంక, మయన్మార్ దేశాల్లో ప్రభుత్వమతంగా ఉంది.
2030 మైళ్లు కాలి నడకన నడుస్తూ వాగ్వివాదాలు చేస్తూ సమానత్వాన్ని, మానవత్వాన్ని బోధించే గౌతమ బుద్ధుని బోధనలు శాంతి, అహింస, విశ్వమానవ సమానత్వాన్ని, సంక్షేమాన్ని కోరాయి. బౌద్ధం మతం కాదు భౌతికవాదం.
ప్రపంచంలోనే అతి పవిత్రమైన, పరిశుద్ధమైన అహింసామూర్తి బుద్ధుడు. బుద్ధుని సమతాదృష్టి, మానవతా దృక్పథం అనన్య సామాన్యమైంది.
బౌద్ధంలోని ప్రధాన లక్షణాలు:
శాంతి, అహింస, కరుణ, శీలం, సమత, మైత్రి, సానుభూతి మొదలైనవి.
సాంఘిక సమానత్వం: 1) సునీత: పాకీపనిచేసే వ్యక్తి. ఆ రోజుల్లో (మగధ) అంటరాని కులానికి చెందినవాడు. ఇతడికి బుద్ధుడు బౌద్ధదీక్ష చేయించాడు. 2) ఉపాలి: తన అంతఃపురం మంగలి. ఇతనికి ధర్మదీక్ష చేయించాడు. 3) స్వపాకుడు: శ్రావస్తిలో స్మశానంలో పెరిగిన ఇతనికీ దీక్ష ఇచ్చాడు. 4) సుమంగళుడు: వ్యవసాయదారుడు. 5) చెన్నుడనే బానిస 6) ధరణీయుడనే రాజగృహ నివాసియైన కుమ్మరి, 7) సుప్రతియ అనే అనాథ 8) సత్తి శ్రావస్తిలోని బెస్త కులానికి చెందినవాడు 9) పశువుల కాపరియైన నందకు 10) అనాథయైన కుమారి, కాశ్యప 11) కిరాతకుడైన అంగుళీమూలుడు 12) తన బంధువర్గం: తల్లి గౌతమి, భార్య యశోధర, కుమారుడు రాహులుడు 13) రాజగృహ దగ్గరలోని కొండప్రాంతాల్లో నివసించే జంతువులను వేటాడే ఆటవికుల భార్యలు 120 మందికి ధర్మదీక్ష చేయించి వారి ద్వారా వారి భర్తల్లో పరివర్తన తీసుకువచ్చాడు.
ఇంకా విశాఖ, మల్లిక, ధనంజనాని మొదలైనవారు కూడా ఉన్నారు. అంతేగాక చండాలియైన ప్రాకృతిక, బానిస బాలిక ఎన్నా, పున్ని, లేళ్ల వేటగాని కుమార్తె కాపకి, స్వర్ణకారుని కుమార్తె శుభ, గని కార్మికుని కూతురు సుమంగళమాత, ఆమ్రపాలి మొదలైనవారిని బౌద్ధసంఘంలో చేర్చుకున్నాడు.
స్త్రీలను బౌద్ధసంఘంలో చేర్చుకొని విద్య, ధార్మిక జీవనానికి, స్వేచ్ఛకు, సమతకు ద్వారాలు తెరిచాడు.
తెలంగాణలో బౌద్ధం: తెలంగాణలో అశోకుని కన్నా ముందే బౌద్ధమతం ఉందనటానికి ఎన్నో ఆధారాలున్నాయి. బుద్ధుడు జీవించి ఉండగానే బౌద్ధం తెలంగాణలో ప్రవేశించింది.
బావరి: బుద్ధుని సమకాలికుడు, బ్రాహ్మణుడు. ములక ప్రాంత నివాసి. కరీంనగర్ జిల్లా అని, పోతన్ (బోధన్) ప్రాంత నివాసి అని (నిజామాబాద్ జిల్లాలోని బోధన్) అభిప్రాయం. సుత్తనిపాత గ్రంథం ప్రకారం బోధన్ అని, బుద్ధఘోషుని పరమార్థ జ్యోతిక ప్రకారం కవిటవన ద్వీప నివాసి అని తెలుస్తుంది. ఈ ద్వీపం గోదావరి మధ్యస్థ బాధనకుర్తి ద్వీపం.
బావరి తన 16 మంది శిష్యులను బుద్ధుని వద్దకు పంపగా పింగేయుడు మొదలైనవారు బౌద్ధమత సిద్ధాంతాలను నేర్చుకొనిరాగా వారిద్వారా విని బౌద్ధం స్వీకరించాడు. తెలంగాణలో ఇంకా కొండన, శరభాంగపాలుడు అనేవారున్నారు. విమానవత్తు గ్రంథం ప్రకారం పోతన్ (బోధన్) రాజధానిగా ఉన్న అస్సక (కరీంనగర్-నిజామాబాద్) రాజు బౌద్ధాన్ని తీసుకున్నాడు. లలిత విస్తార ప్రకారం హర్యాంక వంశస్తుడు బింబిసారుని సమక్షంలో మహాబాధి నాటకాన్ని తెలంగాణవారు ప్రదర్శించినట్లు తెలుస్తుంది.
శాతవాహన యుగం :
30 మంది రాజులు (మత్స్యపురాణం) క్రీ.పూ. 220 నుంచి 202 వరకు 450 ఏండ్లు పరిపాలించారు. వీరిలో శ్రీముఖుడు, శ్రీశాతకర్ణి, రెండో శాతకర్ణి, కుంతల శాతకర్ణి, పులోమావి, హాలుడు, గౌతమీపుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి, వాసిష్టపుత్ర పులోమావి ముఖ్యులు. వీరికాలంలో వైదిక మతంతోపాటు బౌద్ధ మతం కూడా బాగా వ్యాపించింది. ఒకవిధంగా బౌద్ధమతానికి స్వర్ణయుగం అని అనవచ్చు. వీరు బౌద్ధులకు అనేక దానధర్మాలు చేశారు. అశోకుని కాలంనాటికే ఇక్కడివారు బౌద్ధాన్ని అనుసరిస్తున్నారని అశోకుని శాసనాల వలన తెలుస్తుంది. వీరికాలంలో బౌద్ధంలో చైత్యకవాదం బయలుదేరింది. దీనిలో చైత్యాన్ని పూజించడం ప్రధాన లక్షణం. తెలంగాణలో నాగార్జునకొండ, కొండాపూర్, గాజులబండ, కోటిలింగాల, ఫాసిగాం, ఫణిగిరి, ధూళికట్ట, తిరుమలగిరి మొదలైన విహారాలు, ఆరామాలు, స్థూపాలు నిర్మాణమయ్యాయి.
శాతవాహనుల కాలంలో బౌద్ధం సామ్రాజ్యమంతటా వెల్లివెరిసింది. రాజులు, రాణులు బౌద్ధానికి దానధర్మాలు చేశారు. ముఖ్యంగా కన్హ లేదా కృష్ణుడు నాసిక్ శాసనం ప్రకారం బౌద్ధమతాభిమాని.
ఇక్ష్వాకులు: వీరికి శ్రీపర్వతీయులని మరొక పేరు ఉంది. నలుగురు రాజుల పేర్లు కనిపిస్తున్నాయి. 1) వాసిష్టీపుత్ర శాంతమూలుడు 2) మొదటి వీరపురుషదత్తుడు 3) రెండో ఎహూబల శాంతమూలుడు 4) రెండో వీరరుద్ర పురుషదత్తుడు. క్రీ.శ. 180 నుంచి 248 వరకు 68 ఏండ్లు పాలించిన వీరికాలం బౌద్ధమతానికి స్వర్ణయుగం.
ఇక్ష్వాకు రాజైన శ్రీశాంతమూలుని శాసనం తెలంగాణలోని ఫణిగిరి (నల్లగొండ జిల్లా) బౌద్ధక్షేత్రంలో లభించింది. ఇంకా ఖమ్మం జిల్లాలో పురావస్తు తవ్వకాల్లో నేలకొండపల్లి బౌద్ధక్షేత్రం బయల్పడింది.
నాగార్జునకొండలో నివసించే బౌద్ధశాఖ మహా సాంఘికవాదులు. బోధి వృక్షాన్ని ఆరాధించే ఆచారం ఈ కాలంలో ఉందనడానికి బోధిశ్య సింహళ విహారమున బోధి వృక్షమునకొక ఆలయం నిర్మించినట్లు నాగార్జునకొండలో లభించిన నంబర్ F శాసనం వలన తెలుస్తుంది. వృక్షారాధన అన్ని బౌద్ధ కేంద్రాల్లో ఉంది. వీరి కాలంలో బౌద్ధులు త్రిరత్నాలు, స్వస్తిక్, ధర్మచక్రం, మీనం లాంఛనాలతో ఉండే బుద్ధపాదాలను ఆరాధించారు. చైత్యాల నాలుగు దిశల్లో వేదికలు నిర్మించి వాటిపై ఆయుక స్తంభాలు నిలబెట్టారు. ఆ స్తంభాలపై బుద్ధుని జీవిత విశేషాలు చెక్కారు. వీరు చేసిన దానాలు బౌద్ధులకు, జీవకోటి సంక్షేమానికి ఉపయోగపడేది. బౌద్ధం సర్వాతిశయమై వర్థిల్లింది. వీరికాలంలో నాగార్జునకొండ బౌద్ధానికి ముఖ్య కేంద్రంగా ఉండటమేకాక బౌద్ధారామ విహారాలను, మండపాలను కలిగి ఇతర బౌద్ధ తీర్థాలకు ఆదర్శంగా ఉన్నాయి. ఇందుకు సన్యాసులు, సన్యాసినులు, ప్రజలు, విదేశీయులు నాగార్జునకొండను దర్శించడమే తార్కాణం.
అనేకమంది బౌద్ధ భిక్షవులు, పర్యాటకులు, విదేశీయులు ఇచ్చటి వింతలు, విశేషాలు, చైత్యాలు, విహారాలు వాటి నిర్వహణను చూసి తమతమ ప్రాంతాల్లో ఆయా విధానాలు అమలుపర్చారు.
ఎహూవల శాంతమూలుడు నాగార్జునకొండపై తన సోదరి కొడబలిసిరి ప్రోత్సాహంతో ఒక బౌద్ధవిహారాన్ని కట్టించాడు. వీరికాలంలో కృష్ణానది ఉభయ పార్శాలు బౌద్ధానికి నిలయం. నాగార్జునకొండ మహాయాన కేంద్రమైంది. అపరమహావినశైలియులు, బహుశుతీయులు, మహాశాసకులు మొదలైన శాఖలవారు ఇక్కడ నివసించారు. ఇక్ష్వాకుల రాజభాంఢాగారికుడైన బోధిశర్మ మేనకోడలు ఉపాసిక బోధిశ్రీ అనేక దానధర్మాలు చేసింది. వీరు తామ్రపర్ణి, కాశ్మీర్, గాంధార, చైనా, తోసలి, అపరాంత, వంగ, వనవాస, యవన, ద్రవిడ, పాలూర రాజ్యాల్లో బౌద్ధాన్ని ప్రచారం చేసేవారి కోసం నాగార్జునకొండలో చుళుధమ్మగిరి చైత్యగృహాన్ని, చతుశ్శాలలను నిర్మించారు. నాగార్జునకొండ అత్యున్నత విద్యాకేంద్రంగా విలసిల్లింది. శిల్పాల్లోని థియన్ (శక) వస్త్రధారణ, సింహళ శిల్పాల పోలికలున్నాయి.
ఇక్ష్వాకుల కాలంనాటి నాగార్జునకొండపై ఉన్న బుద్ధ ప్రతిమలు, స్మారకస్తంభం, పురుషదత్తుని బ్రాహ్మణ మత నిరసన, బౌద్ధ మతావలంబన, పురుషదత్తుని తిరుగుబాటు, మిధున శిల్పాలు విదేశీయులను ఆకర్షించాయి.
శాక్య రాజైన బుద్ధుడు ఇక్ష్వాక వంశస్థుడు. రామునివలే విజయపురిని రాజధానిగా పరిపాలించిన ఇక్ష్వాకులు తాము శ్రీరాముడు, గౌతమబుద్ధుని సంతతివారమని చెప్పుకున్నారు. నాగార్జునకొండ వద్దనున్న మహాచైత్యాన్ని వాసిష్టీపుత్ర శ్రీ శాంతమూలుని చెల్లెలు శాంతిశ్రీ నిర్మించింది. వీరికాలంలో రాజ కుటుంబానికి చెందినవారేకాక సామన్య స్త్రీలు కూడా విశేషంగా బౌద్ధానికి దానధర్మాలు చేశారు.
మొదటి శాంతమూలుని కుమారుడు వీరపురుష దత్తుడు మొదట వైదిక మతాభిమాని. రాజ్యానికి వచ్చాక బౌద్ధాన్ని ఆదరించి బౌద్ధమతాభిమాని అయ్యాడు. ఇతని మేనత్తలైన శాంతిశ్రీ, హమ్మశ్రీ, భార్యలైన బాపిశ్రీ, ఛటశ్రీ, ఖండసాగరమ్మల ప్రోత్సాహంతో బౌద్ధం స్వీకరించినట్లు నాగార్జునకొండలోని శిల్పాలను బట్టి తెలుస్తుంది. వీరపురుషదత్తుని కాలంలో నాగార్జునకొండలో బౌద్ధులు, బౌద్ధమత సంబంధమైన సంస్థలు విశేషాదరణ పొందాయి. ఇచ్చటగల మహాచైత్యం వీరపురుషదత్తుని 6వ రాజ్య సంవత్సరాన బదంత ఆనందునిచే పునరుద్ధరించబడింది. ఈ మహాచైత్యం సుందర శిల్పాలతో, శోభాయమానంగా నిర్మించారు. ఇతనికి రాణులు, రాజపుత్రికలు, బోధిశ్రీ ఈ విషయంలో తోడ్పాటునందించారు. బోధిశ్రీ వేయించిన శాసనాల ఆధారంగా కాశ్మీర్, గాంధార, అపరాంత, వంగ, వనవాసి, దమిలి, చిన, చిలాత, తామ్రపర్ణి, పాతార ప్రాంతాల్లో బౌద్ధమత ప్రచారం చేసి సింహళ భిక్షవులు నాగార్జునకొండలో నివసించారని తెలుస్తుంది.
ఇక్ష్వాకుల రెండో రాజు వీరపురుషదత్తుడు అతని మేనత్త శాంతిశ్రీ నాగార్జునకొండపై అనేక శాసనాలు వేయించారు. బ్రాహ్మణులు, శ్రమణులు, పేదప్రజలకు శాంతిశ్రీ విస్తారంగా దానాలు చేసింది. బౌద్ధ భిక్షవులకు ఒక ఆరామం కట్టించింది. విదేశాల్లో ప్రచారం నిమిత్తం బౌద్ధ భిక్షువులు ఇచ్చటినుంచే బయలుదేరేవారు. నాగార్జునకొండవద్ద ఉన్న సింహళ విహారంలో బోధివృక్షానికి ఒక ఆలయం ఉంది. బోధిశ్రీ, అడవి శాంతిశ్రీ, చులశాంతిసిరినిక, మహాదేవి రుద్రధర భట్టారిక, హమ్మసిరి కుమార్తెలైన మహాదేవి, శాంతిసిరినిక మొదలైనవారు బౌద్ధ సంఘాలకు దానధర్మాలు చేశారు. బౌద్ధం మనదేశంలో ప్రచారాన్ని ఆరంభించిన మొదటి మతం. భారతదేశంలో మతమార్పిడులకు శ్రీకారం చుట్టింది బౌద్ధం.
విష్ణుకుండినులు
క్రీ.శ. 358 నుంచి 624 వరకు 266 ఏండ్లు 12 మంది రాజులు పరిపాలించారు. తెలంగాణలో ఇక్ష్వాకుల అనంతరం బౌద్ధాన్ని ఆదరించినవారు విష్ణుకుండినులు. మహరాజేంద్ర వర్మ, మొదటి మాధవ వర్మ, గోవింద వర్మ బౌద్ధ మత అనుయాయులే. విక్రమేంద్ర వర్మ, విక్రమ భట్టారక వర్మ కూడా బౌద్ధమత అభిమానులే. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని బౌద్ధ క్షేత్రం వీరి కాలంనాటిదే. ఇక్కడ తవ్వకాల్లో సున్నపురాతి బుద్ధ విగ్రహాలు, నిలబడి ఉన్న బుద్ధుని కంచు విగ్రహం, విష్ణుకుండినుల నాణేలు దొరికాయి. ఒక మహాచైత్యం, తథాగతునికి సమర్పించినటువంటి స్థూపం విష్ణుకుండిన కాలంలో బౌద్ధమత ప్రభావాన్ని సూచిస్తున్నాయి. ఇక్కడ ఎక్కువగా బౌద్ధ శిల్పాలు, ఫలకాలు తయారుచేసే శిల్పశాల ఉండేదని తెలుస్తుంది. హైదరాబాద్‌లోని చైతన్యపురి శాసనం, నల్లగొండ జిల్లా తుమ్ములగూడెం తామ్రశాసనాలు విష్ణుకుండినుల బౌద్ధ సంఘారామాల సంరక్షణకుగాను విష్ణుకుండిన రాజులు రాణులు విరివిగా ఇచ్చిన దానాలను పేర్కొంటున్నాయి. ఈ తామ్ర శాసనాల్లో తొలిసారిగా స్తూప పద ప్రయోగం జరిగింది. మొదటి గోవింద వర్మ (398-435) ఇంద్రపాలనగర తామ్ర శాసనం వల్ల దశబలబరి అనే బౌద్ధ పండితుడు సర్వశాస్త్ర పారంగతుడని తెలుస్తున్నది. ఇతని చైతన్యపురి (హైదరాబాద్) ప్రాకృత శాసనం ప్రకారం మొదటి గోవింద వర్మ పేర వెలసిన గోవింద రాజవిహారాన్ని గురించి తెలుపుతున్నది.
రెండో మాధవవర్మ కాలంలో వజ్రయాన బౌద్ధం తెలంగాణలో ఉన్న బౌద్ధారామ విహారాలకు, సంఘారామాలకు పాకింది. ప్రాకృత భాషా ప్రభావం పోయి సంస్కృతం రాజ్యమేలుతున్న కాలంలో విష్ణుకుండినులు పరిపాలించారు. బౌద్ధక్షేత్రాలు రాజాధరణలేక పతనమవుతున్న కాలంలో విష్ణుకుండినులు వేల కొద్ది, బౌద్ధ భిక్షువులకు ఆచార్యులకు, బౌద్ధ అనుయాయులకు విద్యార్థులకు ఆశ్రయం ఇచ్చారు. శాలంకాయనులు, ఆనంద గోత్రాజులు వైదిక మతాన్ని ఉద్దరించే సమయాల్లో విష్ణుకుండినులు బౌద్ధంను ఆదరించారు. వీరివల్ల బౌద్ధం తెలంగాణలో మరి కొంతకాలం మనుగడ సాగించింది.
బృహతృలాయనులు
వీరికాలంలో విదేశాలకు వ్యాపారం కోసం వెళ్తూ బౌద్ధమత ప్రచారం చేయించేవారు. సామాన్య ప్రజలు బౌద్ధ మతాన్ని విడిచిపెట్టడానికి కారణం బౌద్ధ సన్యాసుల ప్రవర్తనే. బౌద్ధంలో నానాటికీ పెరుగుతున్న కర్మకాండ, అంతేగాక మహాయానంలో పూజాధికాలు వెర్రితలలు వేసి వజ్రయానం జనించగా, వజ్రయానంలో బౌద్ధసన్యాసులు, బౌద్ధ సన్యాసినులు చేసే ప్రవర్తనలే బౌద్ధం వెనకబడి పోవడానికి ప్రధానం కారణం. ప్రజలు బౌద్ధంను ఆదరించకపోవడంతో బౌద్ధం నాగార్జున కొండను వదిలి ఘంటసాల, కూడూరు, మైసోలియా దేశాలగుండా విదేశాల్లోకి పాకింది. బర్మా, సయాం, కాంబోడియా, సిలోన్లకు వ్యాపించింది.
శాలంకాయనులు
వీరు బర్మాదేశంలో బౌద్ధం వ్యాపించడానికి కారకులు. సాన్లన్క్రోమ అనే శాలంకాయన రాజు బర్మాలోని వెరాదతీ నదీ ప్రాంతాన్ని పరిపాలించినట్లు, బుద్ధఘోషుడు, బుద్ధ దత్తుడు, మొదలైన బౌద్ధ పండితులు బౌద్ధాన్ని వ్యాపింపచేసినట్లు శశవాలంకార అనే బౌద్ధగ్రంథం వల్ల తెలుస్తున్నది.
కాకతీయులు
వీరికాలంలో బౌద్ధం పూర్తిగా క్షీణించింది. వీరశైవం విజృంభించడమే దీనికి ప్రధాన కారణం. అద్వైతం ప్రచారం జరగడం, గణపతి దేవుని కాలంలో తిక్కన హరిహరాద్వైత ప్రచారం వల్ల బౌద్ధం పూర్తిగా క్షీణించింది. ఈ కాలంలో పాల్కురికి సోమనాథుడు రాసిన పండితారాధ్య చరిత్ర (తెలుగు గ్రంథం)లో బౌద్ధాన్ని గురించిన ప్రథమ ప్రస్తావన కన్పిస్తుంది. బౌద్ధంలో హీనయాన, మహాయానాలుగా చీలి మహాయానం, వజ్రయానం అనే తాంత్రిక వాదంగా రూపొంది ప్రజాధరణ, రాజుల ఆధరణ కరువై తెలంగాణలో 12వ శతాబ్దం నాటికి బౌద్ధం పూర్తిగా క్షీణించింది. బౌద్ధమతస్థులను వాటనలో ఓడించి శంకరాచార్యులు వారి ఆస్తులను స్వాధీనం చేసుకుని శంకరమఠం స్థాపించాడనడానికి నాగార్జున కొండయే ఆధారం.
నాగార్జునాచార్యుడు:
యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంవాడు. ఇతడు మహాయాన బౌద్ధాచార పరంపరలో 15వ వాడు. నాగార్జునుడు, రసవాది, వైద్యుడు. మహాయాన బౌద్ధుడు, కాయకల్ప చికిత్స, విష ఔషధం, నేత్రవైద్యంలో గొప్పవాడు. ఇతని శూన్యవాదం శంకరాచార్యుల మాయావాద సిద్ధాంతానికి మార్గం అయ్యింది.
నాగ పేరు కలిగిన ఇతడు అర్జున వృక్షం కింద తపమాచరించాడు. కావున నాగార్జునడయ్యాడు. ఇతన్ని రెండో బుద్ధుడు అంటారు. ఇతని గ్రంథాలు 1) ప్రజ్ఞపారమిత శాస్త్రం 2) ప్రజ్ఞామూల శాస్త్రటీక 3) ప్రజ్ఞావదీన కరదీపిక 4) మూలమాధ్యమిక శాస్త్రం 5) శూన్యసప్తతి 6) మద్వాంతానుగమన శాస్త్రం 7) దశభూమి విభాషా శాస్త్రం 8) ద్వాదశ నికాయ శాస్త్రం 9) వివాద సమాన శాస్త్రం 10) ప్రమాణ వివేచనం 11) ఉపాతు కౌశల్యహృదయ శాస్త్రం 12) విగ్రహ వ్యవహర్తిని 13) సుహృల్లేఖ 14) ద్వాదశ నికాయ 15) రసమంజరి 16) రాజవరి కథ 17) ప్రజ్ఞాప్రదీప్తి శాస్త్రం 18) కక్ష్యపుట తంత్రం 19) ఆరోగ్యమంజరి 20) శుశ్రుత సంహితపై వ్యాఖ్యానం 21) వైఫల్య సూత్రం 22) రత్నావళితో పాటు మొత్తం 24 గ్రంథాలు రాశాడు.
తన తరువాత 600 ఏండ్లకు నాగాహ్వయుడను పేరుతో జన్మిస్తానని బుద్ధుడు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇతన్ని అందుకే రెండో బుద్ధుడు అంటారు. ఇందుకు లంకావతార సూత్రం అనే గ్రంథం ఆధారం. బౌద్ధ స్వీకారం అనంతరం కంచికి వెళ్లి తపస్సు చేసి తారాదేవిని ఉపాసించి సిద్ధిని పొంది తంత్ర శాస్త్రం, మయూర విద్య, స్వర్ణమయూర విద్య, రసవాద విద్యలను, మహాబోధి సత్వ, వజ్రసత్వ, బుద్ధ అమితాదుల వలన తత్వోపదేశం పొంది సిలోన్ వెళ్లి ప్రజ్ఞాపారమిత సూత్ర, వైఫల్య సూత్ర గ్రంథాలను, ధాతువుతో కూడిన కరండికను సంపాదించి యజ్ఞశ్రీ శాతకర్ణి నిర్మించి ఇచ్చిన పారావత విహారంలో ఉంటూ మత ప్రచారం చేశాడు. ఇతడు మహాయానం అనే బౌద్ధమత శాఖను ప్రచారం చేశాడు. నాగార్జునకొండలో నాగార్జున విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు.
ఈ పారావత విహారం 5 అంతస్థులతో నిర్మించింది. 1వ అంతస్థు 500 గదులతో గజాకారంలో, 2వ అంతస్థు 400 గదులతో సింహ ఆకారంలో, 3వ అంతస్థు 300 గదులతో హయ ఆకారంలో, 4వ అంతస్థు 200 గదులతో వృషభ ఆకారంలో, 5వ అంతస్థు 100 గదులతో కపోత ఆకారంలో ఉన్నాయి. ఈ 5వ అంతస్థుపై జలాశయం ఉంది.
ఈ పారావత విహారాన్ని ఫాహియాన్ (చైనా యాత్రికుడు) పోలోయా అన్నాడు. హుయాన్‌త్సాంగ్ పోలోమోలకేలలో అని అన్నాడు. ప్రతి అంతస్థులో బంగారు బుద్ధ విగ్రహాలున్నాయని రాశారు. 5వ అంతస్థులో గ్రంథాలయం ఉంది. నాగార్జునుడు పాదరసం, వజ్రం శుద్ధిచేసి ఔషధాలు తయారుచేసి రోగాలను నయం చేసేవాడు. మూలకాలపై పరిశోధన చేసి కాయకల్ప చికిత్సతో మనిషి ఎక్కువ కాలం జీవించేటట్లు చేశాడు. చెట్ల రసాయనాలతో బంగారాన్ని తయారుచేసేవాడు.
ప్రాచీన వాజ్ఞ్మయమంతా పాళీ భాషలో, ప్రాకృతంలో ఉండగా నాగార్జునుడు సంస్కృతంలో రాశాడు. వీరి నాగార్జున విశ్వవిద్యాలయానికి సింహళం (తామ్రపల్లి), కాస్మార (కశ్మీర్), గాంధార, చీనా, తోసలి, అపరాంత, వంగ, వనవాస, యవన దేశపు విద్యార్థులు, బౌద్ధులు వచ్చారు. నాగార్జునుడు శ్రీపర్వతం వద్ద శైలమండపం నిర్మించినట్లు తెలుస్తుంది.
బౌద్ధం విదేశాలకు వ్యాపించడానికి తోడ్పడినది నాగార్జునుడు. ఈ విషయంలో నల్లగొండ జిల్లా చరిత్ర అద్వితీయమైంది. బుద్ధుడు పుట్టిన వేల ఏండ్ల తరువాత కూడా శ్రీలంక, జపాన్, వియత్నాం, టిబెట్ దేశాల్లో అధికార మతం అవడానికి మూలమైనవాడు నాగార్జునుడు.
నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కానున్న అమరావతిలోని స్థూపం కట్టించినవాడు నాగార్జునుడు. 1800 ఏండ్ల క్రితం జన్మించిన (విదర్భలో) ఇతడు బౌద్ధ సాహిత్యానికి అరిస్టాటిల్ వంటివాడు, మాధ్యమిక సిద్ధాంతానికి జీసస్ వంటివాడు. మహాయాన బౌద్ధానికి సెయింట్ పాల్ వంటివాడు. బౌద్ధాన్ని తిరిగి పునరుజ్జీవింపచేశాడు. కావున ఇతన్ని రెండో బుద్ధుడు అని అన్నారు.
ఇప్పటి వరకు భారతదేశంలో పుట్టిన మేధావులందరిలోనూ గొప్పవాడు నాగార్జునుడని జవహర్లాల్ నెహ్రూ అన్నాడు. బౌద్ధాన్ని సామాన్యునికి దగ్గరచేసింది ఇతని మహాయాన బౌద్ధ మతం. మహాయాన బౌద్ధ గ్రంథాలు 105 ఉన్నాయి. అందులోని 9 ముఖ్య గ్రంథాలను నేపాల్వారు పరమ పవిత్రంగా పూజిస్తారు. అవి.. 1) అష్టసాహస్రిక ప్రజ్ఞాపారమిత శాస్త్రం, 2) సద్ధర్మపుండరీక శాస్త్రం, 3) లలిత విస్తారం, 4) లంకావతార సూత్రం, 5) సువర్ణ ప్రభాసూత్రం, 6) గండవ్యూహ సూత్రం, 7) తథాగత గుహ్యక సూత్రం, 8) సమాధి రాజ సూత్రం, 9) దశభూమీశ్వర సూత్రం. వీటినే నవధర్మాలు, ధర్మపర్యాయాలు, వైఫల్యసూత్రాలని కూడా అంటారు.
నాగార్జునుని జీవిత చరిత్రను క్రీ.శ. 405లో కుమార జీవుడనే బౌద్ధుడు చైనా భాషలోకి అనువదించాడు. నాగార్జుడు విజయపురిలో నాగార్జున విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. ఇక్కడ 1944లో పురావస్తు మ్యూజియం ఏర్పాటయ్యింది. 1955లో నెహ్రూ సూచనల మేరకు నాగార్జునకొండపై ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. సాగర్ డ్యాంకు కొండకు మధ్యగల దూరం 14 కి.మీ.
అల్బర్ట్ ఐన్‌స్టీన్ కనుగొన్న సాపేక్ష సిద్ధాంతాన్ని నాగార్జునుడు ముందే ఊహించినట్లుగా కొందరు రచయితలు అభిప్రాయపడ్డారు. ఈ ప్రపంచం పూర్తిగా యదార్థమూ కాదు.. అయదార్థామూ కాదు, అది నిత్యం కాదు.. అనిత్యం కాదు అని అన్నాడు నాగార్జునుడు. ఇతనిది ఆత్మప్రత్యయ భావన అనవచ్చు. ఇతని ఈ శూన్యవాదమే శంకరాచార్యుల మాయావాదానికి మూలం.
శాతవాహన విజయ శాతకర్ణి పేర వెలసిన విజయపురి గొప్ప బౌద్ధ కేంద్రం. బౌద్ధంలో శిరోవేష్టనం (తలపాగా) అనేది మహాయాన బౌద్ధంతోనే వచ్చింది. ప్రపంచ చరిత్రలో తొలిసారిగా న్యాయస్థానాల్లో మరణశిక్షను తొలగించాలని నాగార్జునాచార్యుడు ప్రతిపాదించాడు. నాగార్జునుడి గురించి తెలుసుకోవాలంటే చైనా గ్రంథాలు చదవాలి.
బౌద్ధ మత పతనానికి కారణాలు
1.బౌద్ధమతంతోపాటు బౌద్ధ సంస్కృతికి మూలమైన సమానత్వ భావం వెనుకబడిపోయింది. కులమత విభేదాలకు అతీతమైన మానవత్వం ఒకటుందన్న ధోరణి నశించింది.
2. బౌద్ధంలో అనేక శిథిల లక్షణాలు ప్రారంభమయ్యాయి. శూన్యవాదం ఆ శిథిల ధోరణులకు మార్గాన్ని తేలిక చేసింది. అలాపుట్టిందే వజ్రయానం. ఇదొక తాంత్రికవాదం. దయ్యాలు, చేతబడుల ప్రయోగాలు మొదలైనవాటి ద్వారా శత్రువులను సాధించాలని, పంచమకారాదులు (మధు, మాంస, మైధునం) సాధనకు సులభమార్గమనీ బోధించారు. శైవంలోని కాపాలిక, భైవర తంత్రాలకు వజ్రయానమే పునాది.
నోట్: రెండో బౌద్ధ సంగీతి నాటికి బౌద్ధం చీలిపోయింది. మొదట 18, తరువాత 32 శాఖలు ఏర్పడ్డాయి)
3.బౌద్ధుల స్థూపాలు, విహారాలు హిందువుల దేవాలయాల నిర్మాణానికి దారి తీశాయి. బౌద్ధస్థూపాలు మొదట శివాలయాలు, ఆ తరువాత వైష్ణవాలయాలు, ఆ తర్వాత మసీదులయ్యాయి.
4. తెలంగాణాలోనే కాదు భారతదేశంలోని సంస్కృతిపై బౌద్ధమతం శాశ్వతమైన ముద్ర లిఖించి నేడు కాలగర్భంలో కలిసిపోయింది. దాని ప్రభావం నేడు అన్ని రంగాల్లోనూ స్పష్టంగా కన్పిస్తుంది. 1000 ఏండ్లపాటు ఎదురులేదనిపించుకున్న బౌద్ధం, ఎంతో సాహిత్యానికి, కళలకూ, శాస్త్ర శాఖలకూ ఉత్పత్తి స్థానమై ఉంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు