దాష్టీకాలకు ఎదురునిలిచి..
ఆంధ్రా వలస ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుదీర్ఘకాలంపాటు సాగిన తెలంగాణ ఉద్యమంలో ప్రతి మలుపూ ఎంతో చారిత్రక ప్రాధాన్యం కలిగి ఉంది. 1969 ఉద్యమాన్ని ప్రభుత్వం పాశవికంగా అణచివేసిన తర్వాత కూడా తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర కాంక్షను బతికించేందుకు మేధో, ప్రజా సంఘాలు నిరంతరం కృషిచేశాయి. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ఆధారాలతో సహా ప్రజలముందు ఉంచటంతో వాటిని సరిదిద్దేందుకంటూ రకరకాల కమిషన్లు వేసిన వలస పాలకులు ఆ కమిషన్ల సిఫారసులను అగుడగునా బుట్టదాఖలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడేవరకూ పరిస్థితి ఇలాగే కొనసాగింది.
గిర్గ్లానీ కమిషన్:
కమిషన్ తన తొలి నివేదికను 2001 అక్టోబర్‌లో ప్రభుత్వానికి సమర్చించింది. కొన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగాల్లో జోనల్ ఉల్లంఘనకు పాల్పడినట్లు కమిషన్ గుర్తించింది. అక్రమంగా నియామకమైన ఉద్యోగులను వెనక్కి పంపించాలని సిఫారసు చేసింది.
-గిర్గ్లానీ తన నివేదికను 2004, సెప్టెంబర్ 30న అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమర్పింది. ఈ నివేదిక 3 వాల్యూమ్‌లతో 705 పేజీలు ఉంది. మొదటి వాల్యూమ్‌లో 1975 నుంచి అమల్లోకి వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వుల తీరుతెన్నులను పరిశీలించి ఉద్యోగరంగంలో తెలంగాణ స్థానికులకు జరిగిన నష్టాన్ని పరిశీలించింది.
-రెండో వాల్యూమ్‌లో కమిషన్ సేకరించిన సమాచారాన్నంతా అనెక్సర్ రూపంలో పొందుపర్చారు. మూడో వాల్యూమ్‌లో 1975 నుంచి 2004 వరకు రాష్ట్రపతి ఉత్తర్వుల అమలును పరిశీలించి వీటిపై తన పరిశీలనాంశాలను తెలిపారు.
-ఈ నివేదికలో రాష్ట్రపతి ఉత్తర్వులు 126 పద్ధతుల్లో ఉల్లంఘించబడ్డాయని, వాటిని 18 రకాలుగా వర్గీకరించి 35 పరిష్కార మార్గాలను సూచించారు.
-గిర్గ్లానీ నివేదికలోని ముఖ్యాంశాలు: ఉద్యోగ నియామకాల్లో విధిగా పాటించాల్సిన రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘనలు ఏ విధంగా జరిగాయో తన నివేదికలో పేర్కొన్నారు.
1) ఓపెన్ కేటగిరీలోని పోస్టులను నాన్ లోకల్ కోటాగా వక్రీకరించడం, ముందుగా ఓపెన్ కేటగిరీకి సంబంధించిన ఖాళీలకు బదులు రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన ఖాళీలను నింపడంతో స్థానికులకు నష్టం, స్థానికేతరులకు లాభం.
2) కొన్ని పోస్టుల పే స్కేళ్లను పెంచి లోకల్ క్యాండిడేట్లకున్న కోటాను తగ్గించడం. (ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించినంతటి అపచారం అని పేర్కొంది)
3) ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ జోనల్ బదిలీల్లో జరిగిన అక్రమాలు, ఏకపక్ష ధోరణులు.
4) బోగస్ సర్టిఫికెట్ల ద్వారా అంతిమంగా ఉద్యోగాలు సంపాదించిన నాన్‌లోకల్స్ సంఖ్యను నిర్ధారించడంలో అశ్రద్ధ.
5) లోకల్ అభ్యర్థులకు సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టులను ఓపెన్ కేటగిరీకి మార్చి నాన్‌లోకల్స్‌కు అందించడం.
6) న్యాయశాఖలో బాహాటంగా జరిగిన ఉల్లంఘనలు, అన్యాయపు నియామకాలు, సెక్రటేరియట్ వంటి రాష్ట్రస్థాయి కార్యాలయాల్లోని ఖాళీలను భర్తీచేసినప్పుడు అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగకపోవడం.
జలదృశ్యంపై పోలీసుల దాడి:
2002, ఫిబ్రవరి రెండో వారంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు తెలంగాణలోని వివిధ అంశాలపై శిక్షణ తరగతులు శ్రీరాంసాగర్ వద్దగల గెస్టహౌస్ ఆవరణలో రెండు రోజులు నిర్వహించింది. కేసీఆర్ ప్రధాన ప్రసంగం చేయడంతో పాటు ఈ తరగతులను సమన్వయపర్చారు. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు జయశంకర్, బీ జనార్దనరావు, వీ ప్రకాష్ ఈ శిక్షణా తరగతుల్లో ప్రసంగించారు.
-ముఖ్య నేతలంతా శ్రీరాంసాగర్ వద్ద ఉన్న విషయం తెలుసుకున్న చంద్రబాబు టీఆర్ఎస్ కార్యాలయం ఉన్న జలదృశ్యంపై రెవెన్యూ, పోలీసు అధికారులను పంపి దాడి చేయించి తన అక్కసును వెళ్లగక్కాడు. అంతకు పూర్వం జలదృశ్యం స్థలం తమదని ప్రభుత్వం కోర్టులో కేసు వేసింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందే జలదృశ్యం స్థలాన్ని కొనుక్కొని మున్సిపల్ నిబంధనల ప్రకారం ఇల్లు కట్టుకున్న కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంటిని, విశాలమైన స్థలాన్ని తప్పుడు రికార్డులు సృష్టించి ప్రభుత్వ స్థలమని ఉన్నత న్యాయస్థానాన్ని నమ్మించి తీర్పు అనుకూలంగా తెచ్చుకుంది చంద్రబాబు ప్రభుత్వం. కేసీఆర్, పార్టీ నేతలంతా శ్రీరాంసాగర్ గెస్ట్‌హౌస్‌లో ఉండగా సెలవురోజు అకస్మాత్తుగా దాడిచేసి ఆఫీసు సామానంతా గోషామహల్ స్టేడియానికి తరలించారు.
కేసీఆర్ కార్యక్రమాలు:
టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోచంపల్లి, దుబ్బాక, సిరిసిల్లలోని చేనేత కార్మికులకు ఆర్థిక సహాయం అందించడానికి కేసీఆర్‌తో సహా పార్టీ కార్యకర్తలు భిక్షాటన చేసి మరీ ఆర్థిక సహాయం అందించారు.
-తెలంగాణ వాదులందరినీ కలుపుకొనిపోవాలనే ఉద్దేశంతో ఆలె నరేంద్ర ఆధ్వర్యంలోని తెలంగాణ సాధన సమితి టీఆర్ఎస్లో విలీనం చేస్తానంటే దానికి ఒప్పుకొని ఆలె నరేంద్రను ఆహ్వానించారు. దానితో తెలంగాణ సాధన సమితి 2002, ఆగస్టు 11న టీఆర్ఎస్లో విలీనం అయింది.
భూపాలపల్లిలో బొగ్గు సమృద్ధిగా లభిస్తున్నా విద్యుత్ ఉత్పత్తి చేయకుండా ఆ బొగ్గును ఆంధ్ర ప్రాంతంలోని ప్లాంట్లకు కేటాయిస్తుంటే దానికి వ్యతిరేకంగా భూపాలపల్లిలో వెంటనే విద్యుత్పాదన కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో 2002, అక్టోబర్ 28న బహిరంగ సభను నిర్వహించారు. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం 500 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని స్థాపించింది.
తెలంగాణవాదాన్ని గ్రామాలు, పట్టణాల్లో పటిష్టపర్చడానికి 2002, సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 7 వరకు టీఆర్ఎస్ పార్టీ పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం అన్ని జిల్లాల్లో విజయవంతమైంది.
-సాగునీటి విషయంలో తెలంగాణను ఎలా మోసం చేస్తున్నారో తెలపడానికి ఊరూరా సామూహిక నిరాహార దీక్షలు చేపట్టింది.
-ఈ జలసాధన కార్యక్రమంలో కేంద్ర జలసంఘం రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ ఆర్ విద్యాసాగర్‌రావు, రిటైర్డ్ ఇంజినీర్లు జావరుప్పల భీమయ్య, ప్రభాకర్, శ్యాంప్రసాద్‌రెడ్డిలు చురుకుగా పాల్గొన్నారు.
-2003, జనవరి 6న జలసాధన ఉద్యమం ముగింపు సభ లక్షలమందితో సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో జరిగింది.
-తెలంగాణ గర్జన పేరుతో జరిగిన ఈ సభకు కేంద్రమంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్, శిబూ సోరెన్, నేషనల్ అలయన్స్ ఫర్ పీపుల్స్ మూవ్మెంట్ నాయకురాలు మేధాపాట్కర్లు హాజరయ్యారు.
-ఈ సభ విజయవంతమైన తరువాతనే తెలంగాణ ప్రాజెక్టులకు కొద్దిగానైనా నిధులు కేటాయించడం మొదలుపెట్టారు ఆంధ్ర పాలకులు.
-ఢిల్లీలోని రాంలీలా మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతలను దేశవ్యాప్తంగా ప్రజ్వరిల్లంపజేయాలనే ఉద్దేశంతో 1000 కార్లతో 10 జిల్లాల్లోని ముఖ్యనేతలు, కార్యకర్తలతో ఫలక్‌నుమా ప్యాలస్ నుంచి రోడ్డుమార్గంలో 2003, మార్చి 27న ర్యాలీగా బయలుదేరి ఢిల్లీ వెళ్లారు కేసీఆర్. ఈ సభాస్థలిలో వారికి రాంవిలాస్ పాశ్వాన్ ఆహ్వానం పలికారు.
వరంగల్ జైత్రయాత్ర:
2003, ఏప్రిల్ 27న టీఆర్ఎస్ రెండో వార్షికోత్సవ సభ వరంగల్ జైత్రయాత్ర పేరుతో హన్మకొండ పట్టణంలో జరిగింది. సుమారు 15 లక్షల మంది హాజరయ్యారు. దేశంలో ఇంతపెద్ద సభను మునుపెన్నడూ తాను చూడలేదని మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు. ఈ సభకు దేవెగౌడతో పాటు అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అజిత్‌సింగ్, విదర్భ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నాయకులు భన్వర్‌లాల్ పురోహిత్, బుందేల్‌ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నాయకులు ప్రొ. బాబులాల్ తివారీ హాజరయ్యారు.
-సిద్దిపేట నుంచి కేసీఆర్, అన్ని జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు సైకిళ్లపై వెళ్లడం ఈ సభ ప్రత్యేకత.
-2004 ఎన్నికలు, పొత్తులు: కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ పార్టీ బలం పుంజుకోవడం గమనించిన కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీతో పొత్తుపెట్టుకొని టీడీపీ ఓట్లను కొల్లగొట్టి అధికారంలోకి రావచ్చని ఎత్తుగడ వేసి 2004 ఎన్నికలకు పొత్తు కుదిర్చే బాధ్యతను అప్పటి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్‌కు అప్పగించింది.
-అదే విధంగా అప్పటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గులాంనబీ ఆజాద్ కేసీఆర్ ఇంటికి వెళ్లి పొత్తు విషయంపై చర్చించారు. ఆ తరువాత కూడా ఢిల్లీలోని వెస్ట్ బెంగాల్ గెస్ట్‌హౌస్‌లో ప్రణబ్‌ముఖర్జీ, కేసీఆర్‌లు పొత్తు విషయమై చర్చించారు. తాము అధికారంలోకి రాగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కేసీఆర్‌కు కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
-కేసీఆర్ కూడా ఎన్డీఏ అధికారంలోకి వచ్చేటట్లు కనిపించడం లేదని భావించి కాంగ్రెస్‌తో పొత్తుకు ఒప్పుకొని 2004, ఫిబ్రవరి 25న ఒక ఒడంబడికకు వచ్చారు.
-అయితే ఎన్నికల ప్రణాళికలో అస్పష్టంగానే తెలంగాణ విషయంలో మొదటి ఎస్సార్సీ నివేదికలో వెల్లడించిన అభిప్రాయాలను గౌరవిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. దీనిపై కేసీఆర్ అభ్యంతరం తెలిపి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని స్పష్టంగా ప్రకటించాలని కోరారు.
-దీనిపై అప్పటి పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ స్పందిస్తూ ఎస్సార్సీ తెలంగాణపై వెల్లడించిన అభిప్రాయాలను గౌరవించడం అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సముఖంగా ఉన్నట్లే అని అర్థం అన్నారు.
-తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో 42 స్థానాలకు, మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో 6 స్థానాలకు టీఆర్ఎస్ పార్టీ పోటీ చేసేటట్లు ఒప్పందం కుదిరింది.
-టీఆర్ఎస్తో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రీజినల్ కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేసింది. అదే విధంగా 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో తెలంగాణ అంశాన్ని చేర్చింది.
-ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్, ఉభయ కమ్యూనిస్టులు ఒక కూటమిగా, టీడీపీ, బీజేపీలు ఒక కూటమిగా పోటీ పడ్డాయి.
-ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ 26 అసెంబ్లీ స్థానాలను, 6 ఎంపీ సీట్లలో ఐదింటిని గెలుచుకుంది.
రాష్ట్ర ప్రభుత్వంలో టీఆర్ఎస్:
రాష్ట్ర ప్రభుత్వంలో చేరాలని సోనియాగాంధీ కేసీఆర్‌ను కోరింది. పథకాల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడటంతో పాటు రాష్ట్ర విభజనకు సంబంధించిన పంపకాల్లో తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాలంటే ప్రభుత్వంలో ఉంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వంలో చేరడానికి అంగీకరించింది. 2004, జూన్ 23న టీఆర్ఎస్కు చెందిన 6గురు క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో జీ విజయరామారావు (పౌరసరఫరాల శాఖ), ఏ చంద్రశేఖర్ (చిన్న నీటిపారుదల శాఖ), టీ హరీష్‌రావు (యువజన సర్వీసులు, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ), కెప్టెన్ లక్ష్మీకాంతరావు (వెనుకబడిన తరగతుల సంక్షేమం), నాయిని నర్సింహారెడ్డి (సాంకేతిక విద్య, ఐటీఐ), సంతోష్‌రెడ్డి (రవాణా శాఖ)లు ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో చేరడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినట్లయింది.
-తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ: టీఆర్ఎస్ ఆవిర్భావం తరువాత తెలంగాణ ప్రాంతంలోని రాజకీయ సమీకరణాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. టీఆర్ఎస్కు భవిష్యత్ లేదని మఘలో పుట్టి పుబ్బలో కనుమరుగయ్యే పార్టీ అని చంద్రబాబు అంటే ఆరు నెలలు కూడా ఈ పార్టీ ఉండదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. కేసీఆర్‌కు సిద్దిపేటలో లభించిన భారీ మెజారిటీ ఈ నాయకులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
-టీఆర్ఎస్ ఏర్పడిన వందరోజుల్లోపే జరిగిన స్థానిక ఎన్నికల్లో 87 జడ్పీటీసీలు, 2 జిల్లా పరిషత్తుల్లో జయకేతనం ఎగురవేసినా పార్టీ కేవలం రెండు జిల్లాలకే పరిమితమైందని ఆంధ్రపత్రికలు, టీడీపీ నేతలు ప్రచారం చేశారు. 2003లో వరంగల్‌లో టీఆర్ఎస్ ద్వితీయ వార్షికోత్సవాలకు చరిత్రలో ముందెన్నడూలేని విధంగా సుమారు 15 లక్షల మంది హాజరుకావడంతో వివిధ పార్టీల కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, నాయకులు పునరాలోచనలో పడ్డారు. ఈ సభ తరువాత 2004 ఎన్నికల మధ్యకాలంలో టీఆర్ఎస్లోకి చేరికలు పెరిగాయి. పార్టీ ఆవిర్భావంతో తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారింది ఈ కాలంలోనే.
యూపీఏలో టీఆర్ఎస్:
టీఆర్ఎస్ మద్దతు కావాలంటే యూపీఏ ప్రకటించిన కనీస ఉమ్మడి కార్యక్రమంలో తెలంగాణ అంశాన్ని చేర్చాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. దానికి కాంగ్రెస్ ఒప్పుకోవడంతో కేంద్రమంత్రివర్గంలో చేరడానికి కేసీఆర్ అంగీకరించారు. దీంతో కేసీఆర్ ఓడరేవుల మంత్రిగా, ఆలె నరేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయమంత్రిగా కేంద్రంలో ప్రమాణస్వీకారం చేశారు.
-కానీ యూపీఏ భాగస్వామ్య పార్టీల్లో ఒకటైన డీఎంకే షిప్పింగ్ తమకే కావాలని పట్టుబట్టడంతో కాంగ్రెస్ పార్టీ సందిగ్ధంలో పడింది. పరిస్థితులను అర్థం చేసుకున్న కేసీఆర్ మాకు కావాల్సింది తెలంగాణ మాత్రమేనని మంత్రి పదవులు కాదని స్పష్టం చేస్తూ బాధ్యతలు స్వీకరించిన 24 గంటల్లోపే సోనియా అడగకముందే స్వచ్ఛందంగా తన పదవిని వదులుకున్నారు.
-దానితో దాదాపు 6 నెలలకు పైగా ఏ మంత్రిత్వ శాఖలేని మంత్రిగా కొనసాగారు. ఆ తరువాత కార్మిక శాఖను కేటాయించారు.
-పార్లమెంటులో తెలంగాణ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇచ్చిన మాట ప్రకారం 2004, మే 26న యూపీఏ ప్రభుత్వం కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయానని ప్రస్తావించారు. ఇందులో భాగంగా తెలంగాణ అంశాన్ని ప్రాంతీయాభివృద్ధి/కేంద్ర, రాష్ట్ర సంబంధాలు అనే శీర్షిక కింద చేర్చారు.
-2004, జూన్ 7న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ తన ప్రసంగంలో కామన్ మినిమమ్ ప్రోగ్రాంలోని అంశాలను ప్రస్తావిస్తూ అవసరమైన సంప్రదింపుల ద్వారా విస్తృత అంగీకారాన్ని కుదిర్చి సరైన సమయంలో యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చేపడుతుందని అన్నారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు