ఆలయాల నిర్మాణానికి కృషిచేసిన కాకతీయ రాణులు? (TET Special)
ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం-కాకతీయులు
- క్రీ.శ. 1000 నుంచి 1350 మధ్యకాలంలో వరంగల్లు (ఓరుగల్లు) కేంద్రంగా కాకతీయులు రాజ్యపాలన చేశారు.
- ఇదే కాలంలో మొదటి తెలుగు పద్యకావ్యంగా శ్రీమదాంధ్ర మహాభారతాన్ని కవిత్రయం నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ రాశారు.
- కాకతీయ రాజుల చరిత్రకు బయ్యారం, వేయిస్తంభాల గుడి, నాగులపాడు, పాలంపేట, కొండపర్తి శాసనాలతోపాటు, సాహిత్యాధారాలైన ప్రతాపరుద్ర యశోభూషణం, క్రీడాభిరామం, ప్రతాపచరిత్ర ముఖ్యమైనవి.
- కాకతీయ వంశ మూల పురుషుడు దుర్జయ. వీరి వంశంలో ముఖ్యులు రెండో ప్రోలరాజు, రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు.
- వీరు మొదట రాష్ట్రకూటులు, చాళుక్యుల సామంతులుగా గ్రామపెద్ద (రట్టడి) నుంచి రాజకీయ ప్రస్థానం చేసి స్వతంత్రులుగా ఎదిగారు.
- 1158 నుంచి 1195 వరకు జరిగిన రుద్రదేవుని పాలనాకాలంలో మొదట అనుమకొండ రాజధానిగా పాలించాడు. అనంతరం రాజధానిని ఓరుగల్లుకు మార్చాడు. అనుమకొండలో వేయిస్తంభాల దేవాలయాన్ని నిర్మించాడు.
- ఓరుగల్లు కోట బయట మట్టి ప్రాకారం, కందకం, లోపల మట్టి ప్రాకారం, ఆ తర్వాత రాతిగోడ (కంచుకోట) నిర్మించారు. కోట మధ్యలో రాజధాని, నగర భవనాలు, నాలుగు వైపులా ద్వారాలు ఉండేవి. కోట మధ్యలో స్వయంభూ శివాలయాన్ని నాలుగు వైపులా కీర్తి తోరణాలను నిర్మించారు.
- రుద్రదేవుడి అనంతరం అతని సోదరుడు మహదేవుని కుమారుడైన గణపతిదేవుడు 1199లో పట్టాభిషిక్తుడైనాడు. ఆయన 1262 వరకు రాజ్యపాలన చేసి విశాల సామ్రాజ్యాన్ని విస్తరించాడు.
- రుద్రమదేవి 1262 నుంచి 1289 మధ్య కాలంలో సామంతుల తిరుగుబాట్లను విశ్వాసపాత్రులైన సామంతుల సాయంతో అణిచి వేసింది. ఆమెను రుద్రదేవ మహారాజుగా శాసనాల్లో కీర్తించారు.
- రుద్రమదేవి పాలనాకాలంలో ఇటాలియన్ యాత్రికుడైన మార్కోపోలో మోటుపల్లిని సందర్శించి ప్రశంసిం చాడు.
- రుద్రమ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సైనిక వ్యవస్థను పునరుద్ధరించి నాయంకర వ్యవస్థను ఏర్పాటు చేసింది.
- సామంత పాలకుడైన కాయస్థ అంబదేవుడు తిరుగుబాటు చేయగా నల్లగొండ జిల్లాలోని చందుపట్ల యుద్ధంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
- కాకతీయులు వ్యవసాయాభివృద్ధికి అనేక చెరువులను తవ్వించడమేగాక దేవాలయాల నిర్మాణానికి భూములను దానాలు చేశారు. రాణులైన ముప్పమాంబ, మైలమ వంటి వారు భారీగా విరాళాలు అందించారు.
- రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరులైన విదేశీ వాణిజ్యం, వర్తకుల ఓడరేవు సుంకాలు అధికంగా ఉండటంతో వర్తకులకు రక్షణ కల్పిస్తూ గణపతి దేవుడు మోటుపల్లి అభయ శాసనం వేయించారు.
- 1190లో తురుష్కులు టర్కిస్థాన్ నుంచి వచ్చి, ఢిల్లీ కేంద్రంగా రాజ్యస్థాపన చేసి, ఉత్తర భారతదేశంలోని అనేక రాజ్యాలపై ఆధిపత్యం సాధించారు. మహ్మద్‌బీన్ తుగ్లక్ దక్కన్‌పై దండయాత్ర చేసి, కాకతీయ రాజ్యంపై దండెత్తి ప్రతాపరుద్రున్ని ఓడించడంతో 1323లో కాకతీయ వంశ పాలన ముగిసింది.
విజయనగర రాజులు
- విద్యారణ్యస్వామి ఆశీస్సులతో 1336లో హరిహర రాయలు, బుక్క రాయలు కర్ణాటకలో తుంగభద్రానది ఒడ్డున విజయనగరాన్ని నిర్మించారు.
- విజయనగర రాజులు విరూపాక్ష దేవుడిని ఆరాధించేవారు.
- విజయనగర సామ్రాజ్యాన్ని సంగమ, సాళువ, తుళువ, అరవీటి వంశ పాలకులు వరుసగా పాలించారు.
- తుంగభద్రానదికి ఉత్తరంగా గుల్బర్గా కేంద్రంగా బహమనీ సామ్రాజ్యం ఆవిర్భవించింది.
- 1489 నుంచి 1520 మధ్య కాలంలో బహమనీ సామ్రాజ్యం విచ్ఛిన్నమై బీజాపూర్, గోల్కొండ, బీదర్, అహ్మద్‌నగర్, బీరార్ కేంద్రాలుగా ఐదు రాజ్యాలు ఏర్పడ్డాయి. వీటిలో బీజాపూర్, గోల్కొండ రాజ్యాలు పెద్దవి.
- ఈ రాజ్యాలను ఇరాన్, అరేబియా నుంచి వచ్చిన సుల్తాన్లు పాలించారు. వీరు నిరంతరం యుద్ధాలు చేస్తూ రాజ్యవిస్తరణకు ప్రయత్నించారు.
- విజయనగర రాజుల చరిత్రకు పలు దేశాల యాత్రికుల రచనలు దోహదపడుతున్నాయి. వాటిలో ఇటలీ యాత్రికుడైన నికోలో కాంటి 1420లో, పర్షియా యాత్రికుడైన అబ్దుల్ రజాక్ 1443లో, పోర్చుగీస్ యాత్రికులైన డొమింగో పేజ్ 1520లో, న్యూనిజ్ 1537లో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించి రాసిన రచనలు ముఖ్యమైనవి.
- విజయనగరం ఏడు వలయాలతో ఏర్పడి, కోటగోడలు నిర్మించి ఉన్నట్లు అబ్దుల్ రజాక్ తెలిపాడు.
పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం నగరం నాలుగు భాగాలుగా, మొదటి భాగం గుట్టలపైన ఆలయాలు, రెండో భాగంలో పంట భూములు, కాల్వలు, మూడో భాగంలో అంతఃపుర భవనాలు, రాజభవనాలు, ముఖ్యుల నివాసాలు, నాలుగో భాగంలో సామన్య ప్రజలు నివసించేవారని తెలిపారు. - అరేబియా, ఇరాన్‌ల నుంచి మేలిరకం గుర్రాలను దిగుమతి చేసుకునేవారు.
- రెండో దేవరాయలు ముస్లింలకు యుద్ధతంత్రాలు నేర్పించి, శిబిరంలో మసీదు నిర్మించి, తుపాకులు, ఫిరంగులు, ఆధునిక అశ్వదళం, శక్తిమంతమైన సైన్యాన్ని ఏర్పర్చాడు.
- డొమింగో పేజ్ శ్రీకృష్ణ దేవరాయల కాలంలో విజయనగరం సందర్శించాడు.
- సైనిక దళాధిపతులను అమర నాయకులుగా నియమించి అమరంపై వచ్చే రెవెన్యూ శిస్తు (గ్రామం, పట్టణం) వసూలు చేసుకుని, సైనిక దళాలను పోషించి, యుద్ధ సమయాల్లో సిద్ధ సైన్యంతోపాటు అమర నాయకుల అధీనంలోని సైన్యం, అమర నాయకులు పాల్గొనేవారు. వీరి ఆధీన ప్రాంతాల్లో పరిపాలన, న్యాయపాలన అధికారాలు ఉండేవి.
- చాలామంది అమర నాయకులు తెలుగు వీరులే. వీరు సైనికులను నియమించుకుని శిక్షణ ఇచ్చేవారు.
- సాళువ నర్సింహ లేదా నారస నాయకుడు విశాల భూభాగంపై అధికారాన్ని పొంది, విజయనగర రాజులకు సవాలుగా నిలిచాడు. రాజు చనిపోయిన సందర్భంలో శక్తిమంతమైన అమర నాయకులు రాజ్యాన్ని హస్తగతం చేసుకుని తమను తాము రాజుగా ప్రకటించుకునేవారు.
- శ్రీకృష్ణదేవరాయలు 1509 నుంచి 1529 వరకు పాలించాడు. బహమనీ సుల్తాన్లు, గజపతులపై విజయవంతంగా సైన్యాన్ని నడిపాడు. గోవా ఓడరేవుపై, పోర్చుగీసు వారిపై ఆధిపత్యం సాధించి సైన్యంలో పోర్చుగీసు దళాలను చేర్చుకున్నాడు.
- శ్రీకృష్ణదేవరాయలు తిరుపతి, శ్రీశైలం, అహోబిలం సందర్శించి విరాళాలు సమర్పించేవారు.
- దేవాలయాల్లో ఈయన గౌరవార్థం రాయగోపురం అనే ఎత్తయిన ఆలయ ముఖద్వారాలను నిర్మించారు.
శ్రీకృష్ణ దేవరాయలు తెలుగు సాహిత్యంలో కవి ఆండాళ్ అనే తమిళ భక్త కవయిత్రి జీవితం ఆధారంగా ఆముక్తమాల్యద గ్రంథం రాశాడు. - రాయల కొలువులో అష్టదిగ్గజాలుగా కీర్తి పొందిన అల్లసాని పెద్దన, ధూర్జటి, తెనాలి రామకృష్ణుడు, ముక్కు తిమ్మన, పింగళి సూరన, రామరాజ భూషణుడు, మాదయగారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు వంటివారు సాహిత్య సేవలో తరించారు.
- అచ్యుత దేవరాయ, అళియ రామరాయల పాలనాకాలంలో బహమనీ సుల్తాన్ల రాజ్య వ్యవహారంలో నిరంతరం జోక్యం వల్ల, ఐదుగురు సుల్తాన్లు ఏకమై క్రీ.శ. 1565లో రాక్షస తంగడి లేదా తళ్లికోట
- యుద్ధంలో రామరాయలను ఓడించి, విజయనగర పట్టణాన్ని దోచుకున్నారు.
- చివరి పాలకులు తిరుపతి సమీపంలోని చంద్రగిరి రాజధానిగా కొద్దికాలం పాలించారు.
- బహమనీ సుల్తాన్ల గవర్నర్ అయిన కులీకుతుబ్‌షా గోల్కొండ రాజధానిగా 1512లో స్వతంత్య్ర రాజ్యాన్ని స్థాపించాడు.
- కులీకుతుబ్‌షా వరంగల్, కొండపల్లి, ఏలూరు, రాజమండ్రి కోటలను ఆక్రమించి రాజ్యవిస్తరణ గావించాడు.
- ఇబ్రహీం కుతుబ్‌షా (1550-80) పాలనలో సింగరాచార్యులు, అద్దంకి గంగాధరుడు, కందుకూరు రుద్రకవి, పానుగంటి తెలగనార్యుడు వంటి కవులను, తెలుగు సాహిత్యాన్ని పోషించి మల్కిభరాముడుగా కీర్తిపొందాడు.
- ఇబ్రహీం కుతుబ్‌షా 1562లో హుస్సేన్‌సాగర్ చెరువును నిర్మించి దాని రేఖాచిత్ర తయారీలో సహకరించిన సూఫీ సంతు హజరత్ హుస్సేన్ షా వలీ పేరు మీద చెరువుకు ఆ పేరు పెట్టాడు.
మూసీనదిపై పురానాపూల్ వంతెన నిర్మించాడు. - మహ్మద్ కులీ హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికబద్దంగా నిర్మించాడు.
- హైదరాబాద్ నగర వాస్తుశిల్పి మీర్ మోమిన్ అస్త్రబాది చార్మినార్‌కు, నగర రేఖాపటాలు గీయడంలో ముఖ్యపాత్ర పోషించి వజీరుగా కూడా పని చేశాడు.
- మహ్మద్ అలీ మక్కా నుంచి తెచ్చిన మట్టితో ఇటుకలు చేయించి, మక్కా మసీదును నిర్మించి, ఒక గదిలో మహ్మద్ ప్రవక్త వెంట్రుకలు భద్రపర్చాడు.
- చార్మినార్, జామా మసీదు కూడా ఇతని నిర్మాణాలే.
- ఈయన పర్షియా, ఉర్దూ భాషల్లో మంచి కవి. ఈయన కృషి ఫలితంగానే దక్కనీ ఉర్దూ గ్రాంథిక భాష స్థాయికి చేరింది.
- మహ్మద్ కులీ కుతుబ్‌షా కుమార్తె హయత్ బక్షీ బేగం హయత్‌నగర్, హయత్‌నగర్ మసీదును నిర్మించింది.
- హయత్ బక్షీ పేరు మీద కానమ్ ఆగా అనే ఆవిడ తలాబ్ మా సాహిబా అనే చెరువును తవ్వించగా.. కాలక్రమంలో దాన్ని మాసాబ్ చెరువుగా (మాసాబ్ ట్యాంకుగా) పిలుస్తున్నారు.
- అబ్దుల్లా కుతుబ్‌షా (తానీషా)కు కవిత్వం, సంగీతం పట్ల ఆసక్తి మెండుగా ఉండటంతో పద కవితలు రాసే క్షేత్రయ్యను సత్కరించాడు.
- కంచర్ల గోపన్నను పాల్వంచ తహసీల్దార్‌గా నియమించగా.. ప్రజాధనంతో భద్రాచలంలో శ్రీరాముడికి దేవాలయాన్ని నిర్మించాడు. దాంతో తానీషా ఆగ్రహానికి గురై జైలుశిక్ష అనుభవించి రామదాసుగా కీర్తిపొందాడు.
- కుతుబ్‌షాహీల పాలనలో గోల్కొండ వజ్రాలకు ప్రఖ్యాతిగాంచినది. ప్రధాన ఓడరేవు మచిలీపట్నం ద్వారా ఆగ్నేయాసియా, చైనా, పర్షియా, అరేబియా, యూరప్‌లతో వ్యాపారం సాగేది. ఒంటెలు, బంగారం, వెండి దిగుమతి అయ్యేవి.
- గోల్కొండకు దగ్గరలోని ఇబ్రహీంబాగ్‌లో కుతుబ్‌షాహీ పాలకుల ఏడు సమాధులను పర్షియన్, హిందూ శైలిల మేళవింపుతో నిర్మించారు.
- 1687లో ఔరంగజేబ్ నాయకత్వంలో కుతుబ్షాహి కోట/రాజ్యం మొగలుల వశం అయ్యింది.
ప్రాక్టీస్ బిట్స్
1. మొదటి తెలుగు పద్య కావ్యం?
1) శ్రీమదాంధ్ర మహాభారతం
2) శ్రీమహా భాగవతం
3) మత్స్య పురాణం
4) రామాయణం
2. కింది వారిలో శ్రీమదాంధ్ర మహాభారత రచనలో పాల్గొనని కవి?
1) నన్నయ 2) సోమన
3) తిక్కన 4) ఎఱ్ఱాప్రగడ
3. కింది వాటిలో కాకతీయుల చరిత్రకు సంబంధం లేని శాసనం?
1) వేయిస్తంభాల గుడి 2) బయ్యారం
3) కొండపర్తి 4) నగునూరు
4. కాకతీయుల చరిత్రకు సంబంధించిన సాహిత్యగ్రంథాలు, వాటి రచయితలను జతపర్చండి.
ఎ. ప్రతాపరుద్ర యశోభూషణం 1. కాసె సర్వప్ప
బి. క్రీడాభిరామం 2. వినుకొండ వల్లభరాయుడు
సి. ప్రతాపరుద్ర చరిత్ర 3. విద్యానాథుడు
డి. సిద్ధేశ్వర చరిత్ర 4. ఏకామ్రనాథుడు
5. శివదేవయ్య
1) ఎ-3, బి-2, సి-4, డి-1
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-5, బి-1, సి-2, డి-3
4) ఎ-3, బి-2, సి-1, డి-5
5. కాకతీయ రాజులలో ముఖ్యమైన వారి వంశానుక్రమణికను పేర్కొనండి.
ఎ. రుద్రమదేవి
బి. గణపతి దేవుడు
సి. రుద్రదేవుడు
డి. ప్రోలరాజు
ఇ. ప్రతాపరుద్రుడు
6. ఎవరి సామంతులుగా స్వతంత్య్ర రాజ్యస్థాపన చేశారు?
1) పశ్చిమ చాళుక్యులు
2) తూర్పు చాళుక్యులు
3) రాష్ట్రకూటులు
4) ముదిగొండ చాళుక్యులు
7. కాకతీయుల రాజధానిని అనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చిన రాజు?
1) గణపతి దేవుడు 2) ప్రతాపరుద్రుడు
3) రుద్రదేవుడు 4) రుద్రమదేవి
8. అనుమకొండలోని వేయిస్తంభాల గుడి నిర్మాత ఎవరు?
1) రుద్రమదేవి 2) గణపతిదేవుడు
3) ప్రోలరాజు 4) రుద్రదేవుడు
9. రుద్రమదేవి పాలనా కాలంలో రాజ్యాన్ని సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు ఎవరు?
1) మార్కోపోలో 2) ఇబన్‌బటూట
3) నికోటిన్ 4) నికోలో కాంటి
10. రుద్రమదేవి కాయస్థ అంబదేవుడి చేతిలో ప్రాణాలు కోల్పోయిన యుద్ధం ఎక్కడ జరిగింది?
1) మహబూబ్‌నగర్ జిల్లా బూత్పూర్
2) కృష్ణా జిల్లా అవనిగడ్డ
3) నల్లగొండ జిల్లా చందుపట్ల
4) నెల్లూరు జిల్లా మైదుకూరు
11. నాయంకర విధానానికి సంబంధించి కింది విషయాలను పరిగణించండి?
ఎ. నాయక బిరుదుతో రాజభక్తిగల నాయకులను నియమించేవారు
బి. సేవలకు ప్రతిఫలంగా గ్రామాలపై శిస్తు వసూలు హక్కు కల్పించేవారు
సి. శిస్తు వసూలు చేసుకునే హక్కు వంశపారంపర్యంగా శాశ్వతంగా ఉండేది
డి. వసూలైన శిస్తు ఆదాయంలో నిర్దేశిత సైన్యాన్ని రాజు సేవకోసం పోషించేవారు
1) ఎ, బి, డి 2) బి, సి, డి
3) ఎ, సి 4) బి, డి
12. గణపతి దేవుడు వేయించిన మోటుపల్లి అభయశాసనం ప్రాధాన్యం?
1) విదేశీ దండయాత్రల నుంచి రక్షణార్థం
2) విదేశీ వ్యాపారాన్ని ప్రోత్సహించడం, పన్నుల వసూలు
3) నాయంకరులకు ఇచ్చే బహుమానాలు
4) సామంతుల తిరుగుబాట్ల అణచివేత
13. మోటుపల్లి ఓడరేవును సందర్శించిన మార్కోపోలో విదేశీయులు మోజుపడే ఏ వస్తువుల నాణ్యతను ప్రశంసించాడు?
1) బంగారం, దంతపు సామగ్రి
2) సుగంధ ద్రవ్యాలు
3) చందనపు చెక్క బొమ్మలు
4) వజ్రాలు, సన్నని నేత బట్టలు
14. కాకతీయ సామ్రాజ్య పతనానికి కారకుడైన ఢిల్లీ సుల్తాన్ ఎవరు?
1) ఫిరోజ్ షా 2) మహ్మద్ ఖిల్జీ
3) మహ్మద్‌బీన్ తుగ్లక్
4) అహ్మద్ షా అబ్దాలి
15. కాకతీయ సామ్రాజ్యపు చివరి పాలకుడు ఎవరు?
1) రుద్రమదేవి 2) రుద్రదేవుడు
3) మహదేవుడు 4) ప్రతాపరుద్రుడు
16. దేవాలయాల నిర్మాణానికి కృషి చేసిన కాకతీయ రాణులు?
1) ముప్పమాంబ, మైలమ
2) ముమ్మడమ్మ, రుయ్యమ
3) కామసాని, గణపాంబ
4) అన్నమ, జాయమ
17. కాకతీయులు వ్యవసాయాభివృద్ధికి తీసుకున్న చర్యల్లో చిరస్మరణీయమైనవి?
1) బావుల నిర్మాణం
2) కాలువల నిర్మాణం
3) గొలుసుకట్టు చెరువుల నిర్మాణం
4) మెట్ల బావుల నిర్మాణం
18. మధ్యయుగపు చరిత్రలో రాణి రుద్రమదేవి కంటే ముందుగా రాజ సింహాసనాన్ని అధిష్టించిన మహిళ?
1) రజియా సుల్తానా
2) జిజియా బాయి
3) ఝాన్సీ లక్ష్మీబాయి
4) రాణి దుర్గాబాయి
19. కాకతీయులు ఓరుగల్లు కోట నిర్మాణంలో అనుసరించిన విధానం.. బయటి నుంచి లోపలికి?
ఎ. కందకం బి. లోపలి ప్రాకారం
సి. బయటి ప్రాకారం
డి. రాతిగోడ (కంచుకోట)
1) డి, సి, బి, ఎ 2) సి, ఎ, బి, డి
3) ఎ, బి, సి, డి 4) బి, ఎ, డి, సి
20. స్వయంభూ శివాలయం ఎక్కడ ఉన్నది?
1) హనుమకొండ 2) ఓరుగల్లు కోట
3) పాలంపేట 4) కొలనుపాక
21. కాకతీయుల పాలన ఏ సంవత్సరంలో ముగిసింది?
1) 1323 2) 1321
3) 1326 4) 1289
22. కాకతీయ రాజుల ఆస్థాన భాష ఏది?
1) తెలుగు 2) సంస్కృతం
3) కన్నడం 4) ఒరియా
సమాధానాలు
1-1, 2-2, 3-4, 4-1, 5-2, 6-1, 7-3, 8-4, 9-1, 10-3, 11-1, 12-2, 13-4, 14-3, 15-4, 16-1, 17-3, 18-1, 19-2, 20-2, 21-1, 22-1.
డాక్టర్. రాచర్ల గణపతి
పాఠ్యపుస్తకాల రచయిత & విషయ నిపుణులు
హన్మకొండ – 9963221590
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు