తెలంగాణలో జైనం..
క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో భారతదేశంలో ధర్మ సంస్కరణల్లో భాగంగా పుట్టుకొచ్చిన అనేక కొత్త ధర్మాల్లో (మతం) బౌద్దం, జైన ధర్మాలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపాయి. ఉత్తర భారతంలో ఉద్భవించిన ఈ ధర్మాలు వేగంగా దక్షిణానికి విస్తరించి నాటి సామాజిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి. తెలంగాణ ప్రాంతంలో ఈ రెండు ధర్మాలు ఓ వెలుగు వెలిగాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో అనేక చోట్ల ఆయా ధర్మాల ఆనవాళ్లు అనేకం ఉన్నాయి. సామాజిక వ్యవస్థలో నేటికీ జైన, బౌద్ద ఆచారాలు, పేర్లు కనిపిస్తుంటాయి. గ్రూప్స్ వంటి పోటీ పరీక్షల్లో ఈ ధర్మాలపై విరివిగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో జైనమతం ప్రవేశం, విస్తరణ, పతనానికి సంబంధించిన కీలక విషయాలు నిపుణ పాఠకుల కోసం అందిస్తున్నాం.
జైనమతం- పోషణ
24వ తీర్థ్ధంకరుడైన వర్ధమాన మహావీరుని జిన బిరుదు నుంచే జైనమతం ఉద్భవించింది. జైనులు జినునికి అనుచరులు. జిన అంటే జయించినవాడు. అంటే ఇంద్రియాలను జయించినవాడు జైనుడు. ఇంద్రియ ప్రకృతిని జయించి, ఉన్నత జీవితాన్ని గాంచిన వారందరికీ ఈ పేరు చెల్లుతుంది. జైనం ధర్మమార్గానికి అత్యధిక ప్రాముఖ్యం ఇచ్చింది. యజుర్వేదంలో రుషభనాథుడు, అజితనాథుడు, అరిష్టనేమి అనే ముగ్గురు తీర్థంకరుల (సర్వేపల్లి రాధాకృష్ణన్, భారతీయ తత్తశాస్త్రం) ప్రస్తావన కన్పిస్తుంది.
భాగవత, విష్ణుపురాణాల్లో రుషభనాథుడే జైనమత జనకుడు అని ఉంది. జైనమత గురువులను తీర్థంకరులు అంటారు. తీర్థంకరులుగా జీవన స్రవంతిని దాటడానికి వారధి వంటివారని అర్థం. జైనం శ్వేతంబరులు, దిగంబరులు అనే రెండు శాఖలుగా చీలింది. దిగంబరుల విశ్వాసం ప్రకారం సృష్టిలో జన్మమెత్తిన మనిషి ఇది నాది అని (శరీరంపై వస్త్రం కూడా) ఆశ ఉంటే నిర్యాణం లభించదని, స్త్రీలకు మోక్షం లభించదనీ చెప్తారు. తీర్థంకరుల లక్షణాలు- వస్త్రహీనుడు, నిరలంక్రుతుడు, అధోముఖుడుగా నుండుట.
నాగరికత పెరిగిన కొద్ది మానవుడు తన జీవితాన్ని, వైజ్ఞానికంగా, నైతికంగా మెరుగుపర్చుకొని ఆ విధానాలను తరతరాలుగా సంరక్షించుకొనుటకు తన కర్తవ్యంగా భావించాడు. జైన, బౌద్ధ మతాల వలె మూలగతమైన మార్పులు ఏమిలేవు. శ్వేతంబర, దిగంబర పదాల భేదం సిద్ధాంతాత్మకం కాదు. జైనులు ఏ దేవుడినో, ఏ దేవుళ్లనో ఆరాధించారు. వారి ఆరాధ్యుడు మానవుడే. అర్హతుడు, సర్వవిజేత జినుడు, జైనమత సిద్ధాంతాలు గొప్పవి, కఠినమైనవి. చివరికి ఈ జైనులు మహావ్యక్తులనదగిన తీర్థంకరులు విగ్రహాలు పెట్టి పూజించడం మొదలుపెట్టారు. బౌద్ధానికున్నంత ప్రచారం ఆర్భాటం, వ్యాప్తి జైనానికి లేదు. నేడు తెలుగు రాష్ర్టాల్లో జైనులు 0.2 శాతం ఉన్నారు. వర్ధమానుడే తెలుగు ప్రాంతంలో జైనమతాన్ని వ్యాపింపచేశాడనీ డాక్టర్ పీడీ దేశాయ్ అభిప్రాయం. జైనగ్రంథమైన హరిభద్రయ వృత్తి కూడా ఇదే విషయాన్ని బలపరుస్తుంది.
శాతవాహనుల కాలం
జైనం- కరీంనగర్ జిల్లాలో జైనుల స్థావరంమునులగుట్ట ఉంది. కాలకసూరి ప్రబంధం అనే (కాలకసూరి జైన సన్యాసి రాశాడు) గ్రంథం ఈ కాలం నాటిదే. శాతవాహన సిముఖుడు జైన ధర్మాన్ని అనుసరించినట్టుగా జైన అనుశ్రుతి. క్రీ.పూ 4వ శతాబ్దం నాటికే తెలంగాణలో కళింగ, మాళవ ప్రాంతాల నుంచి జైనమతం ప్రవేశించింది. అశోకుని మనుమడు సంప్రతి (జైన అశోకుడు) జైనమత వ్యాప్తికి ఎంతో కృషి చేశాడు. అవశ్యక సూత్రం ప్రతిష్ఠానపురాన్ని పాలించే శాతవాహన రాజు జైన మతాభిమాని అని తెలుపుతుంది.
ఈ శాతవాహనుల కాలంలో మన తెలుగు రాష్ర్టాల్లో జైనాన్ని ప్రచారం చేసింది కుండకుందాచార్యుడు (జైన ప్రచార తొలిగురువు) పద్మనంది మరోపేరు. చంద్రగుప్తుని కాలంలో 2 వేల మంది జైనులు దక్షిణదేశానికి తరలివచ్చారు. భాస్కరుడనే సన్యాసి అనేక దేవాలయాలు నిర్మించాడు. భద్రబాహు, స్థూలభద్ర ఇతనికి సమకాలికులు. భద్రబాహు సాంప్రదాయకులు కొండకుంద గుప్తగుప్తుడు, మాఘనంది, జినచంద్ర మొదలైనవారు. ఇతడు రచించిన సమయసారం, నియమసారం, పంచాష్టికాయం, ప్రవచనసారం, ఆయనసారం. క్రీ.శ 1వ శతాబ్దివాడు. జైనమత గురువులైన తీర్థంకరులు అంతా సమానంగా ఆరాధీయులే. ఒక దేవాలయంలో ఒకరికన్నా ఎక్కువ తీర్థంకరులుంటే వారందరికీ పూజా పునఃస్కారాలు సమానం.
గౌతమీపుత్ర శాతకర్ణి కాలానికి జైన, బౌద్ధ మతాల ప్రభావంతో వైదికమతం వెనుకబడి పోయింది. శాతవాహనులు వైదిక మతోద్దారకులైన, అవైదిక మతాలైన జైన, బౌద్ధాలను నిరసించలేదు. కానీ వీరికాలంలో జైనం కన్నడ, కళింగ దేశాల్లో జరిగిన వ్యాప్తి తెలంగాణలో వీరి కాలంలో జరగలేదు. ఉత్తరభారతం నుంచి కన్నడ, కళింగ ద్వారా జైనం ఆంధ్ర, తెలంగాణలోకి వ్యాపించింది.
జైనసాహిత్య భాగమైన పట్టావళిలో మొదటి తీర్థంకరుడు, రుషభనాథుని ఇద్దరు కుమారుల్లో ఒకరైన భరతుడు పేరుతోనే భారతదేశం అనేపేరు వచ్చినట్టు తెలుస్తుంది. చిన్నవాడైన బాహుబలి నిజామాబాద్ జిల్లాలోని బోధన్ కేంద్రంగా పరిపాలించాడు. బాహుబలినే గోమఠేశ్వరుడు అని అంటారు. బోధన్‌లో అతిపెద్ద బాహుబలి విగ్రహాన్ని చూసే, పశ్చిమ గాంగరాజు రాచమల్లుని మంత్రి చాముండ రాయుడు, కర్నాటకలోని శ్రావణ బెలగోళ ఇంద్రగిరిపై గోమఠేశ్వర విగ్రహం కట్టించాడు.
వేములవాడ చాళుక్యులు
నిజామాబాద్, కరీంనగర్ ప్రాంతాలను రెండు వందల ఏండ్లు పాలించిన వేములవాడ చాళుక్యులు, రెండో యుద్ధమల్లుడు, రెండో అరికేసరి, వీరి తర్వాత రాజ్యానికి వచ్చిన రాజులు జైనులు. వీరి రాజధానులు వరుసగా బోధన్, వేములవాడల్లో జైనాలయాలు కట్టించారు. శనిగరంలో యుద్ధమల్లుని జినాలయం, వేములవాడలో బద్దెగ(రీ) సుభధామ కట్టించిన జినాలయం. బోధన్‌లో రేపాకలో అరికేసరిజినాలయాలు ఉన్నాయి. బోధన్‌లో అతిపెద్ద గోమఠేశ్వర విగ్రహం ఉంది. కన్నడ కవిత్రయంలో ఆదికవి అయిన పంపకవి అరికేసరికి జైనాచార్యుడు. ఇతడు క్రీ.శ 942లో ఆదిపురాణం అనే గ్రంథం రచించాడు. వీరి కాలంలో పంప, పొన్న కవిభద్రాచార్య, పుష్పదంత, భూతబలి జైనులు. జైన ప్రచార గురువుల్లో పద్మనంది (కొండకుందా) తర్వాత, అకళంకచార్య వీరసేన, జినసేనాచార్యులున్నారు. చంద్రప్రభ, రవిచంద్ర, కమలభద్రాచార్యులు, రవినంది, అప్పయాచార్యులనే వారు ముఖ్య జైనాచార్యులు జినేంద్ర కల్యాణాభ్యుదయం రాసింది అప్పయాచార్యుడే.
రాష్ట్రకూటులు
హరిభద్రుడు, అకళంక దేవుడు, పంపన మొదలైన జైన కవులు ఉన్నారు. పంపన ఆదిపురాణంంతో పాటు, విక్రమార్కవిజయం, అరికేసరి విజయం రచించాడు.
జినసేనుడు
హరివంశం, ఆదిపురాణం, పార్శాభ్యుదయం, పార్శాభ్యుదయంలో జినసేనుడు, కాళిదాసు రచించిన మేఘసందేశంలోని ప్రతిశ్లోక పాదాన్ని జైనమత పార్శనాథుని జీవితంతో పోల్చి, అద్భుతంగా, అర్ధసమన్వయం చేశాడు. రాష్ట్రకూట రాజుల్లో ఎక్కువ మంది జైన మతాభిమానులు.
కల్యాణి చాళుక్యులు (క్రీ.శ 973- 1189)
-రాష్ట్రకూటుల సామంతులైన కల్యాణి చాళుక్యుల్లో రెండో జయసింహుని (1015-1042) కాలంలో సోమదేవసూరి శిష్యుడు వాదిరాజు రాసిన పార్శనాథచరిత్ర
-మొదటి సోమేశ్వరుని కాలంనాటి శాసనం (1066) జైన తార్కికుడైన శాంతినాథుడు ఇతడు వర్ధమాన ప్రశిష్యుడు. ఇతడు సహజకవి, ఇతని రచన సుకుమార చరిత్ర
-కన్నడ కవిత్రయంలో ఒకరైన రన్నకవి 973లో ముదువాళన గ్రామంలో జన్మించాడు. ఇతని రచన అజితపురాణం రెండో జైన తీర్థంకరు(అజితనాధుడి) న్ని చరిత్ర. ఇది 12 భాగాల పద్యకావ్యం రన్నకవికి కవిచక్రవర్తి బిరుదు కలదు.
-బ్రాహ్మణ, జైన కవియైన శ్రీధరాచార్యుడు, మొదటి సోమేశ్వరుడి (1042-1068) సమకాలికుడు. శ్రీధరాచార్యుడు గద్యపద్య విద్యాధర బిరుదాంకితుడు. క్రీ.శ 1049లో ఇతడు జ్యోతిషతిలకం రచించాడు. మొదటి సోమేశ్వరుని సామంతులైన, కాకతీయ మొదటిప్రోలరాజు, కుమారుడు బేతరాజు జైనులు.
-నాగచంద్రుడనే కవి 14 అశ్వాసాల మల్లినాథపురాణం అనే చంపూకావ్యాన్ని రచించాడు. ఇది 19వ తీర్థంకరుని జీవితచరిత్ర. ఇతని బిరుదు అభినవపంప. ఈ కవి విజయపురాణంలో (నేటి బీజాపూర్ జిల్లా) మల్లినాథ జినాలయాన్ని నిర్మించాడు.
నయసేనుడు
-ధర్మామృత గ్రంథ రచయిత క్రీ.శ 1112లో జైనమత సారం దీని ఇతివృత్తం.
-జగద్దల సోమదేవుడు అనే జైన రచయిత పూజ్యపాదుడు రాసిన జైనమత గ్రంథాన్ని (సంస్కృతం) కర్ణాటక కల్యాణ కారకం అనే పేర కన్నడంలోకి అనువదించిన వైద్యగ్రంథం.
కన్నడజైన గ్రంథం
-నృపతుంగుని- కవిరాజమార్గం (814-77)
-పంపకవి (ఆదికవి) కన్నడంలో ఆదిపురాణం. వేములవాడ రాజైన చాళుక్య అరికేసరి ఆస్థాన కవి. ఇందులో ప్రథమ తీర్థంకరుడైన వృషభనాథుని జీవితం వర్ణించబడింది.
పశ్చిమ చాళుక్యులు
-త్రిభువన మల్ల ఆరో విక్రమాదిత్యుని కాలంలో క్రీ.శ 1108లో ఇతని సామంతుడు బీరమరెడ్డి, బెక్కెల్లు కరణాలు ఖైరోనిపల్లిలో జైన దేవాలయం నిర్మించి, పోషణకు మామిడితోట 20 ఎకరాల భూమి కానుకగా ఇచ్చాడని కన్నడ భాషలో శాసనం ఉంది. నగునూర్ పున్నిరెడ్డి, వెల్లమయ పట్లకు చెందిన రేవరెడ్డిలు ఆలయానికి దానం చేసినట్టుగా ఉంది. ప్రస్తుతం ఈ గుడిని అంగడివీరన్న గుడి అంటారు. ఆరో విక్రమాదిత్యుని కొలనుపాక స్తంభశాసనం అంబికాదేవికి దానం ఇచ్చినట్టు ఇక్కడి శ్వేతంబర జైనాలయంలో ఉంది. చాళుక్యరాజు వద్ద ప్రగ్గడ కాశిరాజు ధర్మాదాయాధికారి, జైనభక్తుడు 23వ తీర్థంకరుడైన పార్శనాథుని విగ్రహం కామోత్సర్గ స్థితిలో ఉంది. అంటే ఎలాంటి వంపు లేకుండా నిటారుగా నిల్చున్న స్థితి. 24వ తీర్థంకరుడైన మహావీరుని విగ్రహం పద్మాసనుడై ఉంది. కల్యాణిచాళుక్య త్రిభువన మల్లదేవుడు (1015-1042) ఇచ్చిన దాన శాసనాలు లభించాయి. వీరు జైన దేవాలయ మతాచార్యుడైన చంద్రసేన చార్యునికి కొంత భూమిని దానంగా ఇచ్చినట్టు కూడా అదే శాసనంలో ఉంది.
పశ్చిమచాళుక్యులకాలంలో జైనం మహోన్నత స్థితిని అందుకుంది. ఓరుగల్లులో త్రిభువనమల్ల కాలంలో సామంత కాకతీయ బేతరాజు కాలం నాటికే ఈ ప్రాంతంపై అభిమానం గల దండనాయకులు మంత్రులుండేవారు. అటువంటి వారిలో వైజదండ నాయకుని కుమారుడు బేతన ప్రగ్గడ, ఇతని భార్య మైలమదేశి ముఖ్యులు. వీరు హన్మకొండలోని పద్మాక్షి కొండపై కడలాలయ బసదిని నిర్మించినట్టు తెలుస్తుంది. చాళుక్య ఆరో విక్రమాదిత్యుని కాలంలో క్రీ.శ 1117లో వేసిన కన్నడ శాసనం దీనికి ఆధారం.
కందూరునాడు చోడులు
వీరికాలంలో తెలంగాణలో జినాలయాలు నేటికీ శిథిల రూపంలో కనిపిస్తున్నాయి. కల్యాణి చాళుక్యుల సామంతులైన వీరు జైనమతాన్ని కూడా పోషించారు. వీరి కాలంలో కాకతీయ రెండో ప్రోలరాజు పరిపాలనలో జైనం విశేషంగా వ్యాపించింది. జైన శాసనాలన్నీ కన్నడ భాషలో ఉన్నాయి. కొలనుపాక వీరి కాలంలోని గొప్ప జైన మతకేంద్రం.
-ఇక్కడి జినాలయం చాలా ప్రసిద్ధమైంది. సిరికొండ శాసనం ప్రకారం మహామాండలిక కేతయ జినదేవరకు రెండు మక్తర్ల భూమిని దానం ఇచ్చినట్లు ఉంది.
-కాకతీయులు: తెలంగాణలో అధిక భాగం కాకతీయుల పరమైనది. రుద్రమదేవుని కాలంలో రాజ్యం ప్రాచ్యం లవణ జలధిస్తే పర్యంతమస్య శిలాంతం అంటే తూర్పు సముద్రం నుంచి శ్రీశైలం వరకు విస్తరించిందని అర్థం. అసలు కాకతీ అనే పదమే జైనం నుంచి ఉద్భవించింది. 22వ జైన తీర్థంకరుని (నేమినాథుని) శాసనాధికారిణి కూష్మాండిని ఆరాధ్య దేవత. కాకతీయుల్లో మొదటి ముగ్గురు రాజులు జైనులు. చాళుక్యుల సామంతుల కాలంలో వేములవాడ జైనమత కేంద్రం. కల్యాణి చాళుక్య బిజ్జలుడు జైన మతాభిమాని. జైన మరలూదేవి వేములవాడ భద్రిగా ఉంది వరంగల్ భద్రకాళి జైనాలయంలో కొత్తగా కూర్చోబెట్టిన విగ్రహమే.
కాకతీయుల తొలి రాజధానియైన కొరవి వీరభద్రాలయం పురాతనమైనది. అది ఒకప్పటి జైనాలయం. విగ్రహం మాత్రమే మార్చారు. హన్మకొండ సిద్దేశ్వరాలయం కూడా అటువంటిదే. వీరికాలంలో విశ్వబ్రాహ్మణులు మొదట కరణీకం చేస్తుండేవారు. గణపతిదేవ చక్రవర్తి వీరు జైనులని వీరిని కరణీకం నుంచి తీసివేశారు. వరంగల్‌లో జైన మత ఛాయలు భైరోనిపల్లి, అశోక్‌నగర్, హన్మకొండ, ఇనుగుర్తి, చేర్యాల, ఆకునూరు, జనగామ, తాటికొండ, శనిగరం, ఐనవోలు, పెద్దాపురం, నగునూరు, వరంగల్ కోట, పాలంపేటల్లో ఉన్నాయి. మొరిపిరాలలో ఉన్న కాకతీయ రుద్రమ్మ శాసనాలు కొలనుపాక జైనాలయానికి దానమిచ్చినట్లుగా ఉంది.
సిద్దేశ్వర చరిత్ర ప్రకారం హన్మకొండ పట్టణంలో జైన అనుయాయులను గురువు విశ్వేశ్వర శివదేశికుల ఆజ్ఞపై గణపతి దేవ చక్రవర్తి జైనులను హింసించాడని తెలుస్తుంది. 36 జైన గ్రామాలు నాశనమయ్యాయి. పొట్లచెర్వు, కొల్చెల్మ (మెదక్) ప్రాంతంలోని జైనమత కేంద్రాలు ప్రసిద్ధాలు. తవ్వకాల్లో జైన విగ్రహాలు, జైనబసదులు, జైనాలయాలు బయల్పడ్డాయి. కొల్చెల్మలో బయల్పడిన పార్శనాథుని విగ్రహం ఎత్తు 6 అడుగులు ఉంది. ఇది 1984లో తవ్వకాల్లో బయల్పడింది. ఇది 10వ శతాబ్దంలోని కల్యాణి చాళుక్యుల కాలంనాటిది. ఈ విగ్రహం 2 టన్నుల బరువు ఉంది. తలపై 7 సర్పాలు పడగ కప్పి ఉంది. విగ్రహం పాదాల వద్ద కన్నడ భాషలో 23వ తీర్థంకరుడు పార్శనాథుడని ఉంది.
మెదక్ జిల్లా జోగిపేటలో క్రీ.శ. 11-12వ శతాబ్దాల్లో జైనం బాగా వ్యాప్తిలో ఉంది. జైన వసతి, జైన తీర్థంకరుల విగ్రహాలు కనిపిస్తాయి. సురవరం ఆంధ్రుల సాంఘిక చరిత్రలో ఈ గ్రామం జైన జోగుల వసతిగా ఉండటం వల్ల జోగిపేట అయిందని రాశారు. అల్లాదుర్గంలో కల్యాణి చాళుక్య త్రిభువన మల్ల 6వ విక్రమాదిత్యుని కాలంలో వేయించిన శాసనం కన్నడ భాషలో ఉంది. ఇతని సామంతుడి పరమ నందిరాజు జైనాలయాన్ని నడపటానికి కొంత భూమిని దానం చేసినట్లుగా ఇందులో ఉంది. ఇది 10-11 శతాబ్దంలోనిది. తెలుగు కవిత్రయంలోనివాడైన తిక్కన ఎంతోమంది జైనుల పతనానికి కారకుడయ్యాడు.
-కొలనుపాక : నల్లగొండ జిల్లాలోని ప్రపంచ ప్రసిద్ధి గాంచిన దేవాలయం ఇది. మహావీరుని విగ్రహం ఫిరోజ్ రత్నాలతో తీర్చిదిద్దారు. దీని ఖరీదు రూ. కోట్లల్లో ఉంటుంది. మాణిక్యదేవుని విగ్రహం వజ్రాలతో కూడుకుని ఉంది. క్రీ.శ. 680లో శంకరాజు అనే చక్రవర్తి ప్రతిష్ఠించాడు. ఈ ఆలయ ముఖద్వారాలు ఔరంగజేబు కుమారుడు బహదూర్షా సుబేదార్ యూసఫ్ ఖాన్ నిర్మించాడు. ఇదే దేవాలయంలో 13 జైన విగ్రహాలున్నాయి. ఇక్కడ ఒక మ్యూజియం ఉంది.
రెండో ప్రతాపరుద్రుడు పుష్పసేనుడనే ఉపాధ్యాయుని వద్ద విద్యనభ్యసించాడు. ఇతడు జైన మతాభిమాని. ఈ చక్రవర్తి వాహనంపై ఎప్పుడూ 16వ తీర్థంకరుడైన శాంతినాథుని గరుడ చిహ్నం ధరించేవాడు. జైన తీర్థంకరులు ప్రతిష్ఠించిన దేవాలయాలు సిరికొండ, పానగల్లు, భువనగిరి, బోధన్, కొలనుపాక, ఇంద్రపురి ప్రాంతాల్లో నేటికీ కనిపిస్తున్నాయి. తెలంగాణలో వ్యాప్తిలో ఉన్న జైనం శ్వేతంబర జైనమతం. దిగంబర జైన బసదులు ఇచ్చట ఉన్నాయి. ఆల్వాన్‌పల్లిలో దుందుబి నదీ తీరాన గంగాపురం వద్ద జైన దేవాలయంలో విగ్రహాలు శిథిలరూపంలో ఉన్నాయి. రాష్ట్రకూట అమోఘవర్షుని శాసనం హన్మకొండలో దొరికింది. రాయగండరస సామంతుడు కొలిపాక బసదికి దానం ఇచ్చినట్లుగా ఉంది.
జైన సాహిత్యం-కులం:
వర్ధమాన మహావీరుడు పుట్టిన వర్గానికి, జన్మకు ప్రాధాన్యం ఇవ్వకుండా వ్యక్తి సద్గుణాకే ప్రాధాన్యతనిచ్చి చండాలురను కూడా మతంలో చేర్చుకున్నాడు. వారు సన్యాసులయ్యే అవకాశం కల్పించారు. జైనంలో అతి ప్రాచీన గ్రంథమైన ఉత్తరాధ్యయన సూత్ర హరికేశ బలుడనే శ్వపాకుని (చండాలుని) కథను వివరిస్తుంది. సూత్రకృతాంగ సూత్రం అనే గ్రంథంలో చండాలురను నీచులుగా పేర్కొంది. చండాలురు క్షుద్ర విద్యల్లో ఆరితేరిన వారని ఈ గ్రంథం చెబుతుంది. ఫణులు అనే జాతివారు కూడా శవాలను మోయడం, దహనం చేయడం మొదలైన పనులు చేసేవారని జైనగ్రంథాల వల్ల తెలుస్తుంది. చచ్చినవారికి గోతులు తీయడం, శవాలపై కప్పే వస్ర్తాలను తయారుచేయడం వీరి పని. కుల కట్టుబాట్లను ఎక్కువగా గౌరవించి వాటినే అంటుకొని ఉన్న మతస్థుల్లో జైన మతస్థులను మించిన మరే ఇతర మతస్థులు భారతదేశంలో లేరని, సింక్లియర్ స్టివన్సన్ The Head of Jainism (Oxford-1915)లో తెలిపాడు. శబరులు ద్రావిడులు, కళింగులు, గాంధారులు అనే ఆదిమజాతి తెగలు వారి జన్మ నేపథ్యాన్ని జైన గ్రంథాలు తెలుపుతున్నాయి.
జైనం -2 నియమాలు
I)పరివ్రాజకులకు-పంచమహావ్రతాలు
1) అహింస 2) సత్యం 3) బ్రహ్మచర్యం 4) అస్తేయం 5) అనాసక్తి
II) సామాన్య గృహస్థులు – నియమాలు
1) జీవ జంతువులకు తెలిసి హాని చేయరాదు. ఇతరులను బాధ కలిగించే అసత్యాలు పలుకరాదు. దొంగతనం, మోసం, నమ్మకద్రోహం చేయరాదు. ఆస్తి సంపాదనలో సంతృప్తి ఉండాలి.
-జైనంలో ఏర్పడిన కాపాలిక శాఖవారు మధు, మాంస భక్షణ, కాపాలిక స్త్రీలతో విహారం ప్రజల్లో సంచలనం బయలుదేరింది. ప్రజల్లో గౌరవం తగ్గి పతమైనది.
-శైవశాఖలైన పాశుపత, కాలాముఖ, వీరశైవ అనే తీవ్రవాద శాఖలు ఏర్పడి జైనాలయాలను ధ్వంసం చేశాయి. జైనులను సంఘ బహిష్కరణ చేసేవారు. శివాలయంలేని గ్రామాల్లో నివసించకూడదని ప్రచారం చేసేవారు. 12వ శాతాబ్దం నుంచే జైనుల పతనం ప్రారంభమై తమిళ ఆళ్వారుల ధాటికి తట్టుకోలేక జైనులు తెలుగు ప్రాంతానికి వచ్చారు. కవిబ్రహ్మ తిక్కనామాత్యుని రాయబారం ఫలితంగా జైనం కాకతీయుల కాలంలో క్షీణించేందుకు ఒక కారణమైంది. కొలనుపాకలో జైన-బౌద్ధులకు, జైన-శైవులకు మత యుద్ధాలు జరిగినట్లు తెలుస్తుంది. చాళుక్య రాజుల మాండలికులకు కాకతీయులకు ఘోర యుద్ధాలు జరిగాయి. ఫలితంగా జైనం పతనం సామాన్య జనానికి ఆధ్యాత్మిక సంతృప్తినివ్వకపోవటం వల్ల జైనం త్వరగా క్షీణించింది. ఫలితంగా అద్వైతం, బ్రహ్మవాదులు, కర్మవాదులు, ప్రకృతి వాదులు, చార్వాకులు, పురుషతైవాదులు మొదలైన వారు విజృంభించారు. బసవేశ్వరుల వారు వాదనలు విఫలమైతే కత్తి ప్రయోగించి చంపేవాడని, దేవాలయాల్ని నేలమట్టం చేశాడని కంభంపాటి సత్యనారాయణ రాశారు.
తెలంగాణలో జైనమతం పతనం
బౌద్ధానికున్నంత ప్రచారం ఆర్భాటం, వ్యాప్తి జైనానికి లేదు. మధ్యయుగ ప్రారంభదశలోని ప్రధాన లక్షణం జైన, బౌద్ధాలపై తీవ్ర ద్వేషప్రభావం ఉండటం. శైవ, వైష్ణవులు పాడే ప్రార్థనా గీతాల్లో మనం ఈ ద్వేషభావం చూస్తాం. కాకతీయుల కాలంలో దేవర దానయ్య అనే వీరశైవుడు పొట్లచెర్వు గ్రామంలో 7వ జైన స్థావరాల్ని ధ్వంసం చేశాడు. జైన సన్యాసుల్లో భేదాలు శ్వేతవటులు, యాపనీయులు, కూర్చకులు, నిర్గంధులు.
పాల్కురికి సోమనాథుని కథనాన్ని బట్టి అనేక సందర్భాల్లో శైవులుకు, జైనులకు వాదప్రతివాదాలు జరిగినట్లు, జైనులు ఓడి వారి బసదులు ధ్వంసం అయ్యాయి. బసవేశ్వరుని ప్రభావం వల్ల, పండిత త్రయం ప్రచారం వల్ల, నన్నెచోడుని కుమార సంభవం వల్ల, పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరిత్ర, వృషాధిప శతకం, బసవపురాణం వల్ల శైవ భక్తుల మహిమ వల్ల, జైనం నామరూపాలు లేకుండాపోయింది. బసవపురాణంలో జైన బౌద్ధ, చార్వాక దుష్పధ సమయాలు మూడును నిర్మూలంగా చేయాలని వసుధలో జినులను వారలందరునూ నేలపాలుగ చేయాలని ఉంది. ఇంకా జిన సమయస్థులు హతోబుపర్చినట్లు, ముప్పదారైనట్టి ముని జైనుల నటజంపి చెండి చిందర వందర చేసి చక్కాడెనట్లు సీమవెళ్లడజేసినట్లు, కాసె సిద్దప్ప సిద్దేశ్వర చరిత్రలో ఉంది.
జైనమత ప్రభావం
1) విద్యాభ్యాసం సమయంలో ఓం నమః సిద్దం నమః అనేది జైన మతంలోనిదే. దీనినే నేడు ఓనమాలు అని వాడుతున్నాం.
2) గ్రామ నామాలు : వడ్డెమాను-వర్ధమానుపురం, వర్ధమానుకోట, వర్ధన్నపేట
3) కరీంనగర్ వద్ద బొమ్మల గుట్ట, మునుల గుట్ట, జైనద్ ఆదిలాబాద్ జిల్లా, వరంగల్ జిల్లాలోని జైన మఠగావ్ జనగాం అయ్యింది, జినకొత్తకొండ మొదలైన గ్రామాలు జైన ప్రభావం గ్రామాలే.
4) సిద్ద సిద్దవైద్యం, రసవాదం జైనమత ప్రభావమే.
5) సిద్దిపేటను జైన సిద్దుడు నిర్మించడం వల్ల సిద్దిపేట అయ్యింది.
6) తెలుగువారి పేర్లు : జైన సన్యాసిని ముని అంటారు. మునెమ్మ, మునుస్వామి, ముని, కోణప్ప, మునిమాణిక్యం, మునిపల్లె, మునికొట్ల ఇళ్లపేర్లు, మునిపల్లె, మునిమాక ఊళ్ల పేర్లు జైనమత ప్రభావమే.
7) జైనులు ప్రపథమంగా అహింస సిద్ధాంతాన్ని బోధించారు. అంతేగాక విశ్వకర్మ కులస్థులు ఆచార్య అని పెట్టుకొని హిందూ మతస్థులైనారు. అప్పటి నుంచి గోవిందాచారి, రామాచారి, వెంకటాచారి అనే పేర్లు వచ్చాయి.
జైనక్షేత్రాలు
కొండపర్తి, ఖాణాజీపేట, గోవిందాపురం, పటంచెర్వు, కంకల్లు, పూడూరు, వర్ధమానపురం, భైరాన్‌పల్లి, గంగాపురం. ఇవి ఆనాటి జైన విద్యాకేంద్రాలు, జైనబసదులు, జైనాలయాలు ఉన్నట్లుగా ఉంది. పొట్లచెర్వు (పటాన్చెరువు) హైదరాబాద్ వద్ద, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కొలనుపాక (నల్లగొండ), సిరికొండ, పానగల్లు, వర్ధమానపురం మొదలైన జైన కేంద్రాలు. ఆరో విక్రమాదిత్యుడు (1076-1127) పటాన్‌చెర్వు, కొలనుపాకల్లో జైనులకు ధానధర్మాలు చేశాడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు