భాషా రాష్ర్టాల ఏర్పాటు
ఏ, బీ, సీ, డీ అని నాలుగు తరగతులుగా విభజించబడిన రాష్ర్టాల విభజన అశాస్త్రీయంగా ఉంది. 1857 సిపాయిల తిరుగుబాటు తరువాత ఏర్పడ్డ బ్రిటిష్ పాలితప్రాంతాలు, స్వదేశీరాజుల సంస్థానాలు దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం రద్దయినా, ఏ, బీ, సీ, డీ అని నాలుగు తరగతులుగా విభజించబడిన రాష్ర్టాల విభజనతో స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్‌వాళ్ల ప్రత్యక్షపాలన కింద ఉన్న రాష్ర్టాలన్నింటిని పార్ట్ ఏ జాబితాలో చేర్చి స్వదేశీ సంస్థాలన్నింటిని పార్ట్ బీ, సీ రాష్ర్టాల జాబితాలో చేర్చారు. 1857-1947 మధ్యకాలంలో బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో ఓ మేరకు ఆధునిక విద్య, వైద్య సదుపాయాలతోపాటు రవాణ, విద్యుత్, సాగునీరు, తంతి తపాళశాఖ సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. దీంతోపాటు ప్రజలను పరిపాలనా వ్యవహారాల్లో భాగస్వాములను చేసే ప్రజాస్వామ్య ప్రక్రియ కొనసాగడంతో ప్రజలు చైతన్యవంతులయ్యారు. దీనికి భిన్నంగా స్వదేశీ సంస్థానాల్లోని ప్రజలు రాచరిక వ్యవస్థలో కొట్టుమిట్టాడుతూ ఆధునిక సదుపాయాలు లభించక అన్ని రంగాల్లో వెనుకబడి పోయారు. స్వదేశీ సంస్థానాలతో పోలిస్తే బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అన్ని రంగాల్లో కొంతవరకు అభివృద్ధి చెందాయి. ఇలా అభివృద్ధి చెందిన ప్రాంతాలను పార్ట్ ఏ జాబితాలో చేర్చి, వెనుకబడ్డ స్వదేశీ సంస్థాలన్నింటిని పార్ట్ బీ, సీ రాష్ర్టాల జాబితాలో ఉంచారు. దీంతో వీటి మధ్య అభివృద్ధిలో వ్యత్యాసాలు అదేవిధంగా కొనసాగాయి. ఏ, బీ, సీ, డీ అని నాలుగు తరగతులుగా విభజింపబడ్డ రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి మొత్తం 28 వరకు ఉండేవి. అశాస్త్రీయంగా విభజించిన ఈ రాష్ర్టాల పరిపాలన వ్యయప్రయాసలతో కూడుకున్నది కాబట్టి వీటిని శాస్త్రీయంగా విభజించి రాష్ర్టాల సంఖ్యను తగ్గించాల్సి వచ్చింది.
అప్పటికే దేశంలో భాషా ప్రయుక్త రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ చేయాలని ప్రజా ఉద్యమాలు ఊపందుకున్నయి. భాషా ప్రాతిపదికన రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న ఆంధ్రుల డిమాండ్‌తో 1953, అక్టోబర్ 1న కేంద్ర ప్రభుత్వం కర్నూల్ రాజధానిగా ఆంధ్రరాష్ర్టాన్ని ఏర్పాటు చేసింది. ఆంధ్రులు సాధించిన విజయంతో దేశంలో ప్రత్యేక రాష్ర్టాలు ఏర్పాటు చేయాలని కోరుతున్న మలయాళీలకు, మహారాష్ట్రులు, గుజరాతీలు, కన్నడిగులకు స్ఫూర్తినిచ్చింది. దీంతో తమ ఉద్యమాన్ని తీవ్రం చేశారు. దేశంలో తలెత్తిన ఈ ఉద్యమాలను దృష్టిలో ఉంచుకొని అన్ని ప్రాంతాలకూ ఆమోదకరమైన సూత్రాలపై భాషారాష్ట్ర విభజన చేసే ఉద్దేశంతో ప్రభుత్వం జస్టీస్ ఫజల్ అలీ నేతృత్వంలో 1953లో ఉన్నతస్థాయి కమిషన్‌ను నియమించింది. పండిట్ హృదయ్నాద్ కుంజ్రూ, సర్దార్ కేఎం ఫణిక్కర్ ఈ కమిటీలో సభ్యులు. భారతరాష్ట్ర విభజన కేవలం భాషాప్రాతిపదికపైన మాత్రమే ఉండరాదని గుర్తించి, దానివల్ల ఉత్పన్నమయ్యే సమస్యను కమిషన్ సూచించింది. ఒకే భాషతో పాటు పరిపాలనా సౌలభ్యం, ఆర్థికస్థోమత ఉండే విధంగా రాష్ర్టాల ఏర్పాటు ఉండాలని సూచించారు. రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో పర్యటించినప్పుడు రెండు ప్రాంతాల వారు భిన్నమైన వాదనలు వినిపించారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగానే కొనసాగించాలని తెలంగాణ వారు కోరితే, తెలంగాణను ఆంధ్రతో కలిపి విశాలాంధ్రను ఏర్పరచాలని ఆంధ్రా ప్రాం తంవారు కోరారు. దీంతో రెండు ప్రాంతాల వాదాలను మదింపు చేసిన కమిషన్ తన నివేదికను ఇచ్చింది. తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల సమస్యలను అర్థం చేసుకొనేందుకు ఈ నివేదిక ఎంతో ఉపయోగపడుతుంది. ఆనాటి వాదాలు పరిశీలిస్తే అప్పటికే వాల్లకు వివిధ రంగాలలో వచ్చే సమస్యల గురించి స్పష్టమైన అవగాహన ఉన్నట్లు అర్థమవుతుంది.
విశాలాంధ్రవాదం
369. మేమాలోచించే విషయం ఇప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు భాషా ప్రాంతాల భవిష్యత్తు గురించి, ఈ భవిష్యత్తు నిర్ణయించే విశాలాంధ్ర ఏర్పాటు గురించి కూడా విచారించాలి.
370. ఆంధ్రోదయ చరిత్రను సవివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రరాష్ట్రం 1953 అక్టోబర్ 1న ఏర్పడింది. కానీ వాస్తవానికి 1953లో చేసిన ఏర్పాట్లు ఆఖరి నిర్ణయాలుగా, ముఖ్యంగా సర్కారు ఆంధ్రులచే భావించబడలేదు. విశాలాంధ్రను ఏర్పాటు చేయాలన్న వాదం ఇప్పటి వరకు సక్రమంగా పరీక్షించలేదు.
371. తెలంగాణతో కలిపిన పెద్ద ఆంధ్రరాష్ట్రం వల్ల కలిగే లాభాలు విస్తారమైన భూభాగం, అధికమైన విద్యుచ్ఛక్తి సాధకాలను, తగిన ఖనిజ సంపద, విలువైన ముడిపదార్థాలను కలిగి మూడు కోట్ల ఇరవై లక్షల జనాభాతో పెద్ద రాష్ట్రం ఏర్పడుతుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు విశాలాంధ్ర రాజధానిగా అనువుగా ఉండటంతో, విసిగెత్తిస్తున్న ఆంధ్రరాష్ట్ర శాశ్వత రాజధాని సమస్య కూడా పరిష్కారమవు తుంది.
372. కృష్ణా, గోదావరి నదులకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఒక్క ప్రభుత్వం అధికారం కిందకే రావటం విశాలాంధ్ర ఏర్పాటుతో కలిగే లాభాల్లో మరోటి. దేశంలో ఎంచుకుంటున్న ప్రాజెక్టులు ఇందులో చేరుతాయి. ఎంతోకాలం తర్వాత అవి సూత్రప్రాయంగా అంగీకారమయ్యా యి. ఈ సమయంలో వివిధ సాంకేతిక, పరిపాలనా కారణాలవల్ల డెల్టా ప్రాంతంలో ఆనకట్టలే నిర్మించారు. అయితే కృష్ణానది లోయనుగాని, గోదావరి నది లోయనుగాని పూర్తిగా ఒక్కరి అధికారం కిందకు తెచ్చేందుకు వీలుకాదు. ఇంకో స్వతంత్ర రాజకీయాధికారం అంటే తెలంగాణ అధికారం లేకుండా చేస్తే ఈ నదుల ప్రవాహంలో తూర్పు భాగాలకు సంబంధించిన పథకాలను రూపొందించే పని, వాటిని కార్యరూపంలోకి తీసుకొచ్చే పని తొందరగా జరుగదు. విశాలాంధ్రలో భాగంగా తెలంగాణ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ అభివృద్ధివల్ల లాభం పొందుతుంది. అందువల్ల అది ఆంధ్రలో కలవడం లాభమని చెప్పవచ్చు.
373. ఇప్పుడున్న ఆంధ్రరాష్ట్రంతో తెలంగాణకున్న ఆర్థిక సంబంధాలు ముఖ్యమైనవి కావు. కరువు కాలంలో తెలంగాణలో ఆహార ధాన్యాల కొరత అధికం. ఆంధ్రాలో ఆహార ధాన్యాలు దాని అవసరాలకంటే ఎక్కువగానే ఉంటాయి. ఆంధ్రరాష్ట్రంలో బొగ్గులేకపోవడంతో, దానిని సింగరేణి బొగ్గు గనుల నుంచి తెప్పించుకోవచ్చు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడనట్లయితే దాని పరిపాలనా వ్యవహారాలకయ్యే ఖర్చులోనుంచి చాలా భాగం తెలంగాణ మిగుల్చుకోవచ్చు. ఆ మిగులును తెలంగాణ అభివృద్ధికి ఉపయోగించవచ్చు.
374. ఆంధ్రలో, తెలంగాణలో అనేక ప్రజాసంఘాలు, సంస్థలు చాలా కాలం నుంచి విశాలాంధ్ర ఏర్పాటే ఆదర్శంగా పెట్టుకున్నాయి. అందువల్ల బలవత్తరమైన కారణం లేనట్లయితే వారి భావాలను గౌరవించాలి.
ఎస్ఆర్సీ సూచనలు
381. విశాలాంధ్ర ఏర్పాటుతో కలిగే లాభాలు స్పష్టంగానే ఉన్నాయి. కృష్ణా గోదావరీ నదుల ప్రవాహ క్షేత్రాన్ని ఒకే అధికారంలోకి తేవడంలోని ఆవశ్యకత, ఆంధ్ర, తెలంగాణల మధ్యఉన్న వర్తక వ్యాపార సంబంధాలు, ప్రాంతం మొత్తానికీ రాజధానిగా ఉండటానికి హైదరాబాద్ నగరం ఉండటం సంగ్రహంగా ఇవే పెద్ద రాష్ట్రం ఏర్పడాలని అనడానికి ప్రధాన కారణాలు.
382. అందువల్ల పెద్ద రాష్ట్రం ఏర్పడటంలో చాలా లాభముందనీ, ఆదర్శ సాధనకు అడ్డువచ్చే విధంగా ఏదీ చేయరాదని మాకనిపిస్తున్నది. కానీ ఆంధ్రలో ప్రజాభిప్రాయం అధికంగ పెద్ద రాష్ర్టానికి అనుకూలంగా ఉందని, తెలంగాణ ఆంధ్రతో కలవడం వాంఛనీయమైన ఆ కలయిక ప్రజల స్వేచ్ఛ పూర్వకమైన అంగీకారంపై ఆధారపడి ఉండాలని, తెలంగాణ ప్రజలు వారి భవిష్యత్తుపై వారే నిర్ణయించుకోవాలని ఆంధ్రాలోని ముఖ్య నాయకులే అంగీకరించేలా ఉన్నారు.
383. ఇప్పటి ఆంధ్ర నాయకులు తెలంగాణ విశాలాంధ్రలో కలిసినా దాని ప్రయోజనాలకు తగిన రక్షణలను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తున్నది. ఈ రక్షణలు కొత్త రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలంగాణకు కనీసం మూడోవంతు అంటే దాని జనసంఖ్య ప్రకారం సముచిత స్థానం లభించేలా అవకాశం ఇవ్వడం, తెలంగాణ ప్రాంత అభివృద్ధి పథకాలపై ప్రత్యేక శ్రద్ధవహించడం, రాయలసీమ సర్కారు ఆంధ్రుల మధ్య జరిగిన ఒడంబడిక పద్ధతిని హామీల రూపం దాల్చవచ్చు.
384. ఈ పద్ధతిలో చేసే ఏర్పాట్ల వివరాలను మేము జాగ్రత్తగా పరిశీలించాం. కానీ శ్రీబాగ్ ఒడంబడిక పద్ధతిలో హామీలుగానీ, బ్రిటిషు రాజ్యంలో స్కాటిష్ డివొల్యూషన్ లాంటి విధానపరమైన ఏర్పాట్లు కూడా సంధికాలంలో సరిగ్గా పనిచేయవు. లేదా తెలంగాణ అవసరాలను పూర్తిచేయవు. తెలంగాణ ప్రత్యేక అవసరాలను తీర్చడానికి ఉద్దేశించిన ఏర్పాట్లపై కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ తప్ప మిగిలినదేదీ ప్రయోజనం కాదు. తెలంగాణ విషయంలో ఆ పర్యవేక్షణ ఏర్పాటును సూచించడానికి మేము అనుకూలంగా లేము.
385. జ్ఞాపకముంచుకొనవలసిన మరో విషయం, ఆంధ్ర రాష్ట్రం మొన్న మొన్ననే నిర్ణయింపబడింది. మిశ్రమ రాష్ట్రమైన మద్రాసు నుంచి విడిపోవుడం వల్ల సంధికాలపు బాధలనుంచి అది ఇంకా బయటపడలేదు. ఉదాహరణకు భూసంస్కరణల విషయమై విధానాన్ని ఏర్పర్చుకోవాలి, తమ సమస్యలను ఇంకా పరిష్కరించుకోలేదు. అందువల్ల తెలంగాణ ఆంధ్రలో కలపడంవల్ల రెండూ పరిపాలనా సంబంధమైన కష్టాలకు లోనవచ్చు.
386. ఈ విషయాలన్నీ ఆలోచనలోనికి తీసుకొన్న తర్వాత తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా చేయడం తెలంగాణకు, ఆంధ్రకు లాభమనీ, దానికి హైదరాబాద్ రాష్ట్రమని పేరుండాలనీ, 1961 ప్రాంతంలో జరిగే సాధారణ ఎన్నికల తర్వాత ఈ కొత్త హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ మూడింట రెండు వంతుల ఆధిక్యతతో ఆంధ్రరాష్ట్రంలో కలవడానికి తీర్మానిస్తే అది దానిలో కలపడానికి వీలుండాలని నిర్ణయానికి వచ్చాము.
387. ఈ ఏర్పాటు వల్ల లాభం ఏమంటే, ఆంధ్రులందరు ఒకే రాష్ట్రంలో ఉండాలన్న ఆదర్శం ఈ ఐదారు ఏండ్లలో చెదరిపోవడంకానీ, కుంటుబడటంగానీ జరగదు. ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు రెండూ పరిపాలనా యంత్రాంగాన్ని సక్రమ పద్ధతిలో పెట్టుకోవడమేగాక వీలైతే రెండు రాష్ర్టాల్లోనూ ఒకే విధంగా ఉండేలా భూమిపన్ను మొదలైన వాటిని సరిచేయవచ్చు. తెలంగాణ ప్రజల భయ్నా పోగొట్టడానికి రెండు రాష్ర్టాల మధ్య నిజమైన ఐక్యత, అవసరమైన సర్వజనాంగీకారాన్ని సాధించడానికి ఈ మధ్యకాలం తగిన అవకాశాలను కలిగించవచ్చు.
388. ఆంధ్రకు, తెలంగాణకు మధ్య సామాన్య ప్రయోజనాలున్నాయి. ఇవి రెండు రాష్ర్టాల ప్రజలను ఒకరికొకరు సన్నిహితులుగా చేయగలదని ఆశిస్తున్నాం. కానీ మేము ఆశించిన విధంగా రెండు రాష్ర్టాల ఐక్యత కోసం అనుకూలమైన పరిస్థితులు, వాతావరణం లేక తెలంగాణ ప్రజాభిప్రాయం రెండు రాష్ర్టాలు ఏకమవడానికి వ్యతిరేకంగా ఘనీభవించినట్లయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండిపోవాలి.
389. తాత్కాలికంగా ఏర్పరిచే హైదరాబాద్ రాష్ర్టాన్ని అదేవిధంగా పిలువడానికి బాగున్నది. ఇందులో నల్లగొండ, వరంగల్, ఖమ్మంతో సహా కరీంనగరం, ఆదిలాబాద్, హైదరాబాద్, మెదక్, బీదర్ జిల్లాలు ఉండాలి. ఇప్పటి ఆంధ్రరాష్ర్టానికి చెందిన కృష్ణాజిల్లాలోని మునగాల నల్లగొండ జిల్లాలో ఉండాలి.
-దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన కమిషన్, ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించి, వాటిని మదింపు చేసి అంతిమంగా 1. మద్రాసు 2. కేరళ 3. కర్ణాటక 4. హైదరాబాద్ 5. ఆంధ్ర 6. బొంబాయి 7. విదర్భ 8. మధ్యప్రదేశ్ 9. రాజస్థాన్ 10. పంజాబ్ 11. ఉత్తరప్రదేశ్ 12. బీహార్ 13. వెస్ట్‌బెంగాల్ 14. అస్సాం 15. ఒరిస్సా 16. జమ్ముకశ్మీర్ రాష్ర్టాలను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది.
-ఈ 16 రాష్ర్టాల్లో విదర్భ, హైదరాబాద్‌లను మినహాయించి మిగతా 14 రాష్ర్టాలను నాటి కేంద్ర ప్రభుత్వం యథాతథంగా ఏర్పాటు చేసింది. విదర్భను బొంబాయి రాష్ట్రంలో విలీనం చేశారు. ఒకే భాష, ఒకే రాష్ట్రం వాదంతో తెలంగాణ ఆంధ్రలను కలిపి విశాలాంధ్ర రాష్ర్టాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన ఆంధ్రనాయకత్వం, తెలంగాణ ప్రజలకు ఆంధ్రుల పట్ల ఉన్న అనుమానాలు భయాల నివృత్తికి, ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల విలీనానికి కొన్ని హామీలను, రక్షణలను తెలంగాణకు కల్పించేందుకు సిద్ధపడి పెద్ద మనుషుల ఒప్పందం కుదుర్చుకున్నారు. తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రలో కలిపేందుకు ఒక ఎత్తుగడ, ఎరగా రూపొందించిన పథకమే ఈ పెద్దమనుషుల ఒప్పందం.
ఎస్ఆర్సి నివేదిక – తెలంగాణవాదం
375. విశాలాంధ్ర వాదం మనస్సుకు పట్టే కారణాలపై ఆధారపడి ఉన్నది. కాని, తెలంగాణ రాష్ట్ర స్థాపనకు అనుకూలంగా చెప్పిన కారణాలు కూడా సులభంగా తోసిపుచ్చేవి కావు.
376. ఇప్పుడున్న ఆంధ్రరాష్ట్రం దాని స్థాపనప్పటి నుండి చెప్పుకోదగిన ఆర్థిక సమస్య ఎదుర్కొంది. తెలంగాణతో పోలిస్తే దానికి తల ఒక్కంటికి తక్కువ ఆదాయం వస్తుంది. తెలంగాణకు ఆర్థిక విషయమై చిక్కులు ఉండకపోవచ్చు. తెలంగాణలో భూమిపన్ను ఎక్కువగా ఉండుటం, కల్లు సారాయి మొదలైన వాటినుంచి ఏడాదికి రూ. 5 కోట్లు ఆదాయం రావడం రెండింటి మధ్య బేధానికి ముఖ్య కారణం. ఏదైనా కొందరు తెలంగాణ నాయకులు, ఆంధ్రలో ఐక్యత చెందడంవల్ల అభివృద్ధి పథకాలను కొనసాగించడానికి అవకాశమిచ్చే స్థిరమైన ఆదాయ స్థాపనలకు బదులు, ఇప్పుడు ఆంధ్రరాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక అనిశ్చితిని తెచ్చి పెట్టుకోవడమే అని కొందరు తెలంగాణ నాయకులు భయపడుతున్నారు. తెలంగాణ తాను పురోగామినని చెప్పుకొంటున్నది. పరిపాలనా దృష్టితో చూస్తే ఐక్యతవల్ల తెలంగాణ ప్రాంతానికి ఎలాంటి లాభం ఉండదని వాదింపబడింది.
377. రాబోయే అభివృద్ధి పథకాల విషయంలో కూడా విశాలాంధ్రలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన పథకాల విషయమై తగినంత ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు అని తెలంగాణ వాదులు భయపడుతున్నారు. ఉదాహరణకు నందికొండ, కుష్ఠాపురం గోదావరి ప్రాజెక్టులు తెలంగాణే కాదు భారతదేశం తలపెట్టిన ముఖ్యమైన ప్రాజెక్టుల్లో చేరాయి. కోస్తా డెల్టాలో ఈ రెండు నదులకు సంబంధించిన నీటిపారుదల పథకాలు రూపొందిస్తున్నారు. అందువల్ల తెలంగాణ కృష్ణా, గోదావరి నదుల జలాలను ఉపయోగించడానికి దానికున్న స్వతంత్రాధికారాలను వదలుకోవడానికి ఇష్టపడటంలేదు.
378. విద్యలో వెనుకబడి ఉన్న తెలంగాణ ప్రజలు ఎక్కువ అభివృద్ధి చెందిన కోస్తా ప్రాంతం వారితో కష్టాలు వస్తాయనీ, స్వార్థానికి ఉపయోగింపబడవచ్చునని తెలంగాణ వాదుల మనస్సులలో ఉన్న భయమే విశాలాంధ్రకు ప్రతికూలతకు గల ముఖ్యకారణాల్లో ఒకటి. హైదరాబాద్ నగరం వెలుపల ఉన్న తెలంగాణ జిల్లాలు విద్యావిషయంలో చాలా వెనుకబడి ఉన్నాయి. అందువల్ల ప్రభుత్వోద్యోగాల నియామకాలు ఆంధ్రలో కంటే తక్కువ. విద్యార్హతగలవారు తీసుకోబడుతున్నారు. ఆంధ్రలో చేరితే తాము ఆంధ్రులతోసమాన స్థాయిలో ఉండలేమని, ఈ భాగస్వామ్యంలో పెద్దభాగస్తుడే అన్ని లాభాలను తక్షణం పొందగలడని ఇక తెలంగాణ ప్రాంతమే సాహసవంతులైన కోస్తా ఆంధ్రులతో వలస ప్రాంతంగా మారుతుందని తెలంగాణ ప్రజల నిజమైన భయం.
379. తెలంగాణ స్థిరత్వం కలిగి దానంతట అది బతికి పెంపొందగల రాష్ట్రంగా ఉంటుందని గట్టిగా చెప్పబడెను. ఈ ప్రాంత ఆదాయం దాదాపు 17 కోట్లు అని అంచనా వేయబడింది. కృష్ణా గోదావరి ప్రాజెక్టులు కొనసాగడానికి అవసరమైన ధనం సంపాదించడం, దానిపై చెల్లించాల్సిన వడ్డీరూపమైన భారం అప్పుతీరేవరకు చెల్లించాల్సినప్పటికీ బడ్జెట్లో లోటు ఉండదు. ఒక వేళ ఉన్నప్పటికీ అది అంత ఎక్కువగా ఉండదు. అనుకూల పరిస్థితుల్లో ఆదాయ వ్యయాలు సరిపోవడమేగాక కొంచెం మిగులు కూడా ఉంటుంది. ఆశాభరితమైన ఈ జోస్యంను అనేక విధాలైన కారణాలతో వివరింపవచ్చు లేదా సమర్థించవచ్చు.
380. ఫైనాన్స్ కమిషన్ సిఫారసులను అమలులో పెట్టడం వల్ల 1952 ఏప్రిల్ నుంచి ఇప్పటి హైదరాబాద్ రాష్ట్రం, అందులో అంతర్భాగంగా తెలంగాణ చాలా లాభం పొందడం ఒక ముఖ్య కారణం. పంపకం కావలసిన ఆదాయపు పన్ను నిధి నుంచి సెంట్రల్ ఎక్సైజ్ నిధి నుంచి హైదరాబాద్‌కు రావలసిన భాగాన్ని కేంద్రం ఎక్కువ చేయడంవల్ల లభించిన ధనాన్ని తెలంగాణలో పరిస్థితులు అదుపులోకి వచ్చేకొద్ది పోలీసు వ్యయం తగ్గిపోవడంవల్ల మిగిలిన ధనాన్ని అంతరంగిక సుంకాలను తీసివేయడం వల్ల ఇంటర్నల్ కస్టవ్‌సు డ్యూటీకలిగిన నష్టాన్ని పూర్తి చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. ఆదాయ ఖర్చు కొన్ని పద్ధతులనుంచి ఎక్కువ ఆదాయాన్ని సంపాదించడానికి ఉన్న అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకొంటే తెలంగాణ ఆర్థికస్థితి బాగా ఉంటుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు