వలసపాలనపై ఎక్కుపెట్టిన ధిక్కార స్వరం – కాళోజి..
ఒకసారి ఓ పోలీసు అధికారి కాళోజిని పట్టుకుని పోచమ్మ దగ్గర నీవే ఉంటావు, గణపతి దగ్గర నీవే ఉంటావు, ఆర్యసమాజంలో ఉంటావు, ఆంధ్రమహాసభల్లో పాల్గొంటావు. ఏంది నీ కథ అని ప్రశ్నించాడు. దీనికి కాళోజి గట్టిగానే సమాధానమిస్తూ పౌర సమాజానికి ఎక్కడ అన్యా యం జరిగినా, ప్రజలపై ఎక్కడ దౌర్జన్యం జరిగినా ప్రతిఘటిస్తాను, ప్రజల పక్షాన పోరాడుతానన్నాడు. ఆయన పూర్తి పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాస రావు రాంరాజా కాళోజి నారాయణ రావు.
కాళోజి జన్మదినం సెప్టెంబర్ 9వ తేదీని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించడం అభినందనీయం. అయితే కొన్ని ఏండ్లుగా వరంగల్‌లోని కాళోజి ఫౌండేషన్ ఆయన జన్మదినాన్ని తెలంగాణ మాండలిక భాషా దినోత్సవంగా జరుపుతోంది. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటిన అతి తక్కువ మంది కవుల్లో కాళోజి అగ్రగణ్యుడు. వేమన తర్వాత ప్రజాకవిగా పేరొందినది కాళోజి మాత్రమే. అందుకే పద్మవిభూషణ్ బిరుదు కన్నా ప్రజాకవి అన్న బిరుదే గొప్పదని తెగేసి చెప్పిన ప్రజామిత్రుడు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం గురించి పోరాడిన రూసో, మాంటెస్యూ, వాల్టేర్ల తర్వాత అంతటి గొప్ప వ్యక్తి కాళోజి. రాజకీయాల్ని ప్రజాకీయం చేయాలని, రాజకీయాలు ప్రజాకీయాలుగా మారితేనే ప్రభుత్వాలు ప్రజల్లో భాగమవుతాయని ఆయన దృఢంగా విశ్వసించారు. లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ దివంగతులైనప్పుడు కాళోజి ఈ విధంగా అన్నాడు.
పుట్టక నీది, చావు నీది, బ్రతుకు దేశానిది. ఇదే వాక్యం ఆయన జీవితానికి వర్తిస్తుంది. ఇక్కడ బతుకు తెలంగాణది. 1914లో మొదటి ప్రపంచ యుద్ధంతో పాటే కాళోజి పుట్టాడు. రెండు ప్రపంచ యుద్ధాల నడుమ ఆయన ఉద్యమ జీవితం కొనసాగింది. హైదరాబాద్ సంస్థానంలో నివసించే కన్నడ-మరాఠి భాషల కలయికలో కాళోజి జన్మించాడు. తల్లి కన్నడ, తండ్రి మహారాష్ట్రీయులు తెలంగాణలో స్థిరపడ్డారు. దీంతో కాళోజికి కన్నడం, మరాఠి, తెలుగు, హిందీ, ఉర్దూ భాషల్లో ప్రావీణ్యం ఉంది. ఆయనకు భాషా సంకుచిత్వం లేదు. నేనింకా నా నుంచి మా వరకే రాలేదు. మనం అన్నప్పుడు కదా ముందడుగు అంటాడు కాళోజి. ఉద్యమమే ఆయన ఊపిరి. చాలా ఉద్యమాలతో కాళోజికి అనుబంధం ఉంది. గణపతి ఉత్సవాలు, ఆర్యసమాజ ఉద్యమం, గ్రంథాలయోద్యమం, ఆంధ్రమహాసభలు, రజాకార్ల వ్యతిరేక ఉద్యమం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, విశాలాంధ్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, పౌర హక్కుల ఉద్యమం.. ఇలా ప్రతీ ఉద్యమంలో పాలుపంచుకున్నాడు.
ఒకసారి ఓ పోలీసు అధికారి కాళోజిని పట్టుకుని పోచమ్మ దగ్గర నీవే ఉంటావు, గణపతి దగ్గర నీవే ఉంటావు, ఆర్యసమాజంలో ఉంటావు, ఆంధ్రమహాసభలో పాల్గొంటావు. ఏంది నీ కథ అని ప్రశ్నించాడు. దీనికి కాళోజి గట్టిగానే జవాబిచ్చాడు. పౌర సమాజానికి ఎక్కడ అన్యాయం జరిగినా, ప్రజలపై ఎక్కడ దౌర్జన్యం జరిగినా ప్రతిఘటిస్తాను, ప్రజల పక్షాన పోరాడుతానన్నాడు. ఆయన పూర్తి పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాస రావు రాంరాజా కాళోజి నారాయణ రావు. ఉదార ప్రజాస్వామ్యవాది, ఆశావాది. ఉదయం కానే కాదనుకోవడం నిరాశ, ఉదయించి అట్లానే ఉండాలనుకోవడం దురాశ అని సందేశమిచ్చాడు. కాళోజి వరంగల్‌లో కాజీపేట్ స్కూల్లో చదివేటప్పుడు గణపతి నవరాత్రి ఉత్సవాలకు నాటి నిజాం ప్రభుత్వం సెలవు నిరాకరించిన సందర్భంలో 1200 మంది విద్యార్థులతో సెలవుచీటీలు రాయించి తరగతులను బహిష్కరించాడు.
1944 ఆంధ్రసారస్వత పరిషత్ ప్రథమ వార్షికోత్సవం వరంగల్‌లో జరుగుతున్న సందర్భంలో కవి సమ్మేళనం కోసం ఏర్పాటు చేసిన చలువ పందిళ్లను రజాకార్లు తగులబెట్టినప్పుడు మళ్లీ పందిళ్లు వేయించి అక్కడే కవి సమ్మేళనం నిర్వహించాడు. 1946లో బత్తిని మొగిలయ్యను ఒంటరిగా చూసి రజాకార్లు కత్తులతో పొడిచి చంపినప్పుడు కాళోజి బహిరంగ నిరసన ప్రకటించిన కుట్ర కేసులో బహిష్కరణకు గురయ్యాడు. దీనిపై విచారణ జరపాలని నిజాంరాజు తన ప్రధాని మీర్జా ఇస్మాయిల్‌ను పంపిన సందర్భంలో తనను బహిష్కరించి జరిపే విచారణ బూటకమని ప్రకటించాడు. 1947, ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు హన్మకొండలోని బ్రాహ్మణవాడలో జాతీయ పతాకం ఎగురవేసి నిర్బంధానికి గురయ్యాడు. రావి నారాయణరెడ్డి రాసిన ఉత్తరాన్ని రాజరాజ నరేంద్ర భాషా నిలయంలో పోలీసులు స్వాధీనం చేసుకుని కాళోజిపై దేశ ద్రోహం కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.
9వ ఆంధ్రమహాసభ హన్మకొండ సమీప గ్రామంలో నిర్వహించినప్పుడు ఖమ్మంలోని హరిజన బాలికల పాఠశాల నుంచి విద్యార్థులను పిలిపించి వారితోనే సభకు వచ్చిన వారికి మంచినీళ్లు ఇప్పించాడు.
నిజాం వ్యతిరేక పోరాటంలో కాళోజి మొత్తం మూడుసార్లు జైలు శిక్ష అనుభవించాడు. 1938లో నాలుగు రోజులు, 1943 లో రెండున్నర ఏండ్లు, 1947 సెప్టెంబర్ 3 నుంచి 1948 సెప్టెంబర్ 26 వరకు జైల్లో ఉన్నాడు. 1930 జనవరి 3న క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో హయగ్రీవాచారితో కలిసి వరంగల్ చౌరస్తాలో సత్యాగ్రహం చేసి అరెస్టయ్యాడు. 1948లో కాంగ్రెస్‌తో సంబంధమున్నదన్న నెపంతో కాళోజి ఇల్లుసోదా చేసి పోలీసులకు ఏమీ దొరక్కాపోయినా అరెస్ట్ చేశారు.
తెలంగాణ సాయుధ పోరాట కాలంలో వరంగల్ జిల్లా బైరాన్‌పల్లిలో రజాకార్లు ఒకే రోజు 90 మందిని కాల్పి చంపారు. ఈ ఘటన కాళోజిని తీవ్రంగా కలవరపెట్టింది. ఈ సందర్భంలో కాళోజి ఇలా అన్నాడు. మన కొంపలార్చిన మన స్త్రీలను చెరిచిన/ మన పిల్లలను చంపి మనల బంధించిన/ మానవాధములను మండలాధీశులను/ మరిచిపోకుండా గుర్తంచుకోవాలి/ కసి ఆరిపోకుండా బుస కొట్టుచుండాలె/ కాలంబు రాగానే కాటేసి తీరాలె నిజాం నవాబును కలంతో ప్రతిఘటించాడు. ఓ రాజా కవితలో రాణివాసంలోన రంజిల్లు రాజా/ రైతు బాధలు తీర్చి రక్షింపలేవా/ పట్టణపు సొగసుకై పోటీ పడు రాజా/ పల్లెకందము గూర్చు ప్రతిభమే లేదా/ పోషించువాడవని పూజించు జనులు/ పీఠమెక్కినవాది పీడించుడేనా/ అని ప్రశ్నించాడు. తెలంగాణ భాషను చులకనగా చూసిన వారికి చురకలంటించే వారు కాళోజి. రెండున్నర జిల్లాలవాళ్లు మాట్లాడేదే అసలైన భాషనుకోవడం పొరపాటన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ తెలుగుశాఖ మొదటి అధ్యక్షుడు రాయప్రోలు సుబ్బారావు తెలంగాణ భాషను తరచూ కించపరుస్తూ మాట్లాడేవారు. అతడు ఆంధ్రవలసవాది. తెలంగాణ రైతాంగ పోరాటాన్ని వ్యతిరేకించి నిజాం రాజును పొగుడుతుండేవాడు. అతడిని ఉద్దేశించి కాళోజి ఇలా అన్నాడు. లేమావి చివురులను లెస్సగా మేసేవు/ రుతురాజు వచ్చెనని అతి సంభ్రముతోడ/ మావి కొమ్మల మీద మైమరచి పాడేవు/ తిన్న తిండేవ్వానిదే కోకిలా, పాడు పాటెవ్వానిదే కోకిలా అని ఉగాది కవి సమ్మేళనంలో వినిపించాడు. తెలుగు భాషను కాదని పరభాషల పట్ల మోజు చూపే వారిని 1942లో ఒక కవితలో హెచ్చరించాడు. తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు/ సంకోచపడిదవు సంగతేమిటిరా/ అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు/సకలించు ఆంధ్రుడా..? చావవెందుకురా.
కాళోజిని శ్రీశ్రీ తెలంగాణ లూయి అరగాన్ అని స్తుతించాడు. 1956లో తెలుగు ప్రజలందరూ ఒకే రాష్ట్రంగా అవతరించాలని నిండు మనస్సుతో విశాలాంధ్రకు మద్దతిచ్చాడు. తర్వాత కాలంలో ఆంధ్ర పెత్తందారీ వ్యవస్థను, ప్రాంతాల మధ్య అసమానతలను తీవ్రంగా ఖండించాడు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్నాడు. వానా కాలంలోనూ చేనులెండిపోతాయని/ మండే వేసవిలో వలే ఎండలు కాస్తుంటాయని ఎవరనుకున్నారు ? అట్లౌనని ఎవరనుకున్నారు ? అని ఆంధ్ర పాలకుల దోపిడీని తిరస్కరించాడు.
1952లో జవహర్లాల్ నెహ్రూ పిలుపు మేరకు రాజకీయాల్లో చేరి మొదటిసారి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేసి పీడీఎఫ్ అభ్యర్థి పెండ్యాల రాఘవరావు చేతిలో ఓటమిపాలయ్యాడు. 1958-60 మధ్య ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఉన్నాడు. రాష్ట్రం, దేశస్థాయిలో జరిగే ప్రజావ్యతిరేక విధానాలను ఖండించేవాడు. నా గొడవ పేరుతో 12 సంపుటాలు వచ్చాయి. ప్రజల గొడవను తన గొడవగా భావించాడు. 1959లో ఆగష్టులో పదిహేను పేరుతో దేశంలో జరిగే అన్యాయాలపై ఎనిమిది పేజీల కరపత్రం విడుదల చేశాడు. భారతదేశంలో స్వాతంత్య్రం అనే శవానికి అంత్యక్రియలు జరపక తప్పలేదన్నాడు. 1969 నుంచి ప్రజాసమితి తరఫున ఊరూరా కన్వెన్షన్లు పెట్టి తెలంగాణ భావజాలాన్ని ప్రచారం చేశాడు. అదే ఏడాది హన్మకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో పెద్ద ఎత్తున సదస్సు నిర్వహించాడు.
ఫలితంగా కాళోజి జైలు పాలయ్యాడు. జీవితాంతం తెలంగాణ విముక్తి ఉద్యమాలు చేపట్టాడు. 1997 డిసెంబర్లో ప్రజా సంఘాలు నిర్వహించిన బహిరంగ సభలో రెండు లక్షల మంది సమక్షంలో వరంగల్ డిక్లరేషన్‌ను ప్రకటించాడు. వృత్తిరీత్యా కాళోజి న్యాయవాది. కానీ ఎంతోకాలం ఆ వత్తిలో కొనసాగలేదు. కాళోజి అన్న కాళోజి రామేశ్వర రావు ప్రముఖ ఉర్దూకవి, న్యాయవాది. కాళోజి ఏ పార్టీకో, ఏ సంఘానికో కట్టుబడి ఉండే వ్యక్తి కాదు. ఒక పార్టీకి కట్టుబడి ఉండటమంటే ప్రాతివత్యం లాంటి పార్టీవ్రత్యం అని అన్నాడు. అన్ని ప్రజా ఉద్యమాలతో మమేకమయ్యాడు. ప్రజాస్వామ్యం అంటే ఏమిటో ? సౌజన్యాలకు రక్ష/ సామాన్యులకు రక్ష/ సహజీవనానికి రక్ష అంటాడు. అందుకే ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ఓటును సద్వినియోగం చేసుకోవాలన్నాడు.
ఓటిచ్చునప్పుడే ఉండాలె బుద్ధి/ అనుచుంటె ఈ మాట అనుభం కొద్ది అన్నాడు. 1975-77 ఎమర్జెన్సీ రోజుల్లో పౌరునిగ పలుకలేనప్పుడు బతుకెందుకని ఆత్మవిమర్శ చేసుకున్నాడు. కాళోజి కవిత్వమంటే అన్యాయంపై అక్షరాయుధం. అందుకే అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి, అన్యాయాన్ని ఎదిరించునోడు నాకు ఆరాధ్యుడు అంటాడు. ఆంధ్రవలస వాదాన్ని వ్యతిరేకిస్తూనే తెలంగాణ నాయకులను కూడా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేస్తే సహించేది లేదని బెదిరించాడు. ప్రాంతేతరులు దోపిడీ చేస్తే పొలిమెరదాక తన్ని తరుముతం – ప్రాంతం వాడు దోపిడీ చేస్తే ప్రాణంతోనే పాతరవేస్తం అన్నాడు. అసమానత్వాన్ని భరించలేడు కాళోజి అందుకే అన్నపురాశులు ఒకచోట/ ఆకలి మంటలు ఒకచోట/ హంసతూలికలు ఒకచోట/ అలసినదేహాలు ఒకచోట అని అన్నాడు.
-1992లో కాళోజికి పద్మవిభూషణ్ వచ్చింది.
-2015 కాళోజి స్మారక పురస్కారం – అమ్మంగి వేణుగోపాల్‌కి ఇచ్చారు.
-వరంగల్‌లో కాళోజి హెల్త్ యూనివర్సిటీ స్థాపించనున్నారు.
-సాగిపోవుటే జీవితం… ఆగిపోవుటే మరణం అన్నాడు.
కాళోజి పర్సనల్ బయోగ్రఫీ:
-జననం: సెప్టెంబర్ 9, 1914
-గ్రామం: మడికొండ (వరంగల్)
-తండ్రి: కాళోజి రంగారావు (మరాఠి)
-తల్లి : రమాబాయి (కన్నడ)
-పూర్తి పేరు : రఘువీర్ నారాయణ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రామ్ రాజా కాళోజి నారాయణరావు
రచనలు
-ఆనకతలు 1941
-నా భారతదేశ యాత్ర -1941
-కాళోజి కథలు – 1943
-పార్థీవ న్యాయం – 1946
-నా గొడవ – 1953
-తుదివిజయం మనది : 1962
-జీవనగీత – 1968(ఖలీల్ జిబ్రాన్ ది ప్రొఫెట్ తర్జుమా)
-తెలంగాణ ఉద్యమ కవితలు -1969
-ఇది నా గొడవ : 1995
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు