తెలంగాణ ఉద్యమంలో ప్రజాసంఘాల పోరుబాట

తెలంగాణ ఉద్యమంలో రాజకీయ, విద్యార్థి, ఉద్యోగ సంఘాలు ఉధృత పోరాటం చేశాయి. కానీ ఉద్యమ సంధికాలంలో భావజాలవ్యాప్తి చేసింది మాత్రం ప్రముఖంగా ప్రజా, విప్లవ సంఘాలే. పలు ప్రజాసంఘాల పోరాటాల వివరాలు నిపుణ పాఠకుల కోసం..
పీపుల్స్‌వార్ ప్రకటన – ప్రత్యేక తెలంగాణ
-1997 జూన్ 1న సీపీఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ కేంద్రకమిటీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం – తెలంగాణ అభివృద్ధి – మా కార్యక్రమం పేరుతో (43 పేజీల బుక్లెట్), విధాన ప్రకటనను విడుదల చేసింది.
-ఇందులో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రాంతీయ అసమానతల వల్లనే ముందుకు వచ్చిందని అభిప్రాయపడింది.
-అంతేకాకుండా 1920 నుంచి కోస్తాంధ్ర నుంచి తెలంగాణకు పెరిగిన వలసల గురించి, మన ఉద్యోగాలను కోస్తా జిల్లాలవారు కొల్లగొట్టడం, పెద్దమనుషుల ఒప్పందం ఉల్లంఘనలు, ఆరుసూత్రాల పథకం ఉల్లంఘనలు, సీమాంధ్ర పారిశ్రామికవేత్తల దోపిడీ, నీటిపారుదలరంగంలో తెలంగాణ పట్ల నిర్లక్ష్యం, విద్యుచ్ఛక్తి, విద్యారంగంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ఇందులో కళ్లకు కట్టినట్లు వివరించారు.
తెలంగాణ ప్రగతి వేదిక
-ప్రముఖ జర్నలిస్టు రాపోలు ఆనందభాస్కర్ నేతృత్వంలో హైదరాబాద్‌లో 1997, జూలై 12, 13 తేదీల్లో తెలంగాణ సదస్సు జరిగింది.
-ఈ సమావేశం దాశరథి రంగాచార్య, ప్రొ. జయశంకర్, తెలంగాణ తత్వవేత్త బీఎస్ రాములు, సుంకిరెడ్డి నారాయణరెడ్డి ప్రసగించారు.
-అనంతరం రాపోలు ఆనందభాస్కర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రగతి వేదిక 1997, జూలై 13న ఆవిర్భవించింది.
-ఈ వేదిక బతుకమ్మ పండగ కాలాన్ని తెలంగాణ సంస్కృతి పరిరక్షణ దినోత్సవాలుగా ప్రకటించి పలుచోట్ల అవగాహన కార్యక్రమాలను నిర్వహించి తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని పెంపొందించింది.
-తెలంగాణ ఐక్యవేదిక ఆవిర్భావంతో తెలంగాణ ప్రగతి వేదిక అందులోని ఒక భాగస్వామ్య సంస్థగా పనిచేసింది.
మహాసభ లక్ష్యాలు – ఆశయాలు
1) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించడం
2) భావ సారూప్యం కలిగిన ప్రజాసంఘాలు, నాయకులతో పనిచేయడం
3) 1/70 చట్టం అమలుకోసం కృషిచేయడం
4) తెలంగాణ ప్రాంతంలోని పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించారు.
5) పెండింగ్‌లో ఉన్న తెలంగాణ ప్రాజెక్టులను నిర్మించడం కోసం కృషిచేయడం
6) 610 జీవో అమలుకోసం ఉద్యమించడం
తెలంగాణ స్టడీస్ ఫోరం
-ప్రత్యేక రాష్ట్రమే లక్ష్యంగా ఈ ఫోరం ఏర్పడింది.
-ఈ ఫోరం గాదె ఇన్నయ్య, నిర్మల, పిట్టల శ్రీశైలం మొదలైనవారి ఆధ్వర్యంలో 1998లో ఏర్పాటయ్యింది.
-అధ్యక్షుడిగా గాదె ఇన్నయ్య, ఉపాధ్యక్షుడిగా పిట్టల శ్రీశైలం వ్యవహరించారు.
-ఈ ఫోరం తెలంగాణకు సంబంధించిన వివిధ సమస్యల గూర్చి కరపత్రాలు, పుస్తకాలు ప్రచురించింది. తెలంగాణ వ్యాప్తంగా సదస్సులు, సమావేశాలు నిర్వహించింది.
తెలంగాణ ఐక్య వేదిక
-తెలంగాణ కోసం పనిచేసే 28 సంస్థలు 1997, అక్టోబర్ 14న ఉస్మానియా లైబ్రెరీ భవనంలో తెలంగాణ ఐక్యవేదికను ఏర్పాటు చేశాయి.
-1997, అక్టోబర్ 16న ఐక్యవేదిక ఆవిర్భావాన్ని ప్రకటిస్తూ ఒక పత్రికా ప్రకటనను ప్రొ. జయశంకర్, ప్రొ. కేశవరావ్ జాదవ్‌లు మీడియాకు విడుదల చేశారు.
-ఈ ప్రకటనలో సమష్టి నాయకత్వం ప్రాధాన్యతను వివరిస్తూ తెలంగాణ రాష్ట్రమే తెలంగాణ సమస్యలకు పరిష్కారం అని పేర్కొన్నారు.
-రెండంచెల కమిటీ నిర్మాణంతో ఐక్యవేదిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది.
-1) ఆర్గనైజింగ్ కమిటీ 2) స్టీరింగ్ కమిటీ
-ఆర్గనైజింగ్ కమిటీ : దీనిలో వేదిక భాగస్వామ్య సంస్థలన్నింటికి స్థానం కల్పించబడింది. ఆయా సంస్థలు తమ ప్రతినిధులను ఆర్గనైజింగ్ కమిటీకి నామినేట్ చేశాయి.
-స్టీరింగ్ కమిటీ: విధాన నిర్ణయాలు చేస్తూ ఉద్యమానికి మార్గదర్శకత్వాన్ని కల్పించేందుకు స్టీరింగ్ కమిటీ రూపొందించబడింది. ఈ స్టీరింగ్ కమిటీలో సభ్యులుగా ప్రొ. జయశంకర్, ప్రొ. కేశవరావుజాదవ్, రాపోలు ఆనందభాస్కర్, వీ ప్రకాశ్, ఎస్ విజయప్రశాంత్, బీ రాజ్యవర్ధన్రెడ్డి, సీ సతీష్‌కుమార్, భూపతి కృష్ణమూర్తి, నాగారం అంజయ్య, ఎల్ మురళీధర్ దేశ్‌పాండే, తేజావత్ బెల్లయ్యనాయక్‌లు వ్యవహరించారు.
-పారదర్శకంగా ఎటువంటి అరమరికలులేకుండా ఉద్యమ సంస్థల ద్వారా తెలంగాణ ప్రజలను చైతన్యపర్చదలచిన తెలంగాణ ఐక్యవేదికలో వివిధ జిల్లాల్లో మిగిలి ఉన్న సంస్థలకు భాగస్వామ్యం కల్పించబడింది. ఆయా సంస్థల ఆసక్తిని బట్టి వాటి పనితీరును గమనించి, వాటిని ఐక్యవేదికలో చేర్చుకునే అంశాన్ని స్టీరింగ్ కమిటీ పరిశీలించింది. తెలంగాణ ఐక్యవేదికలో భాగస్వామ్యం కలిగిన 28 ప్రజాసంఘాలు ఇలా ఉన్నాయి.
1) తెలంగాణ మహాసభ
2) తెలంగాణ ప్రగతి వేదిక
3) తెలంగాణ లాయర్స్ ఫోరం
4) తెలంగాణ ప్రజాసమితి
5) తెలంగాణ ప్రజాపరిషత్
6) తెలంగాణ ముక్తిమోర్చా
7) తెలంగాణ పట్టుభద్రుల సంఘం
8) తెలంగాణ రాష్ట్ర సాధన సమితి
9) తెలంగాణ ఫోరం
10) తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్
11) తెలంగాణ దళిత రచయితల సంఘం
12) తెలంగాణ యూత్ ఫోరం
13) తెలంగాణ జన పరిషత్
14) ఉస్మానియా యూనివర్సిటీ ఫోరం ఫర్ తెలంగాణ
15) తెలంగాణ విచార్‌మంచ్
16) లోహియా విచార్‌మంచ్
17) తెలంగాణ బహుజన పోరాట సమితి
18) తెలంగాణ ఫోర్త్‌క్లాస్ ఎంప్లాయీస్ ఫోరం
19) తెలంగాణ లెక్చరర్స్ ఫోరం
20) తెలంగాణ విద్యార్థి యువజన మహాసభ
21) తెలంగాణ దళిత సేవాసంఘం
22) సమతా వేదిక
23) గిరిజన విద్యార్థి యువజన సంఘం
24) తెలంగాణ గ్రామీణ వికాస్ మంచ్
25) తెలంగాణ విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్
26) హిందీభాషా ముక్తి మోర్చా ఫర్ సపరేట్ తెలంగాణ
27) తెలంగాణ విశ్వ బ్రాహ్మణ సంఘం
28) తెలంగాణ టీచర్స్ ఫోరం
-1997 నవంబర్ 1న తెలంగాణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిజాం కాలేజీ మైదానం నుంచి సికింద్రాబాద్‌లోని క్లాక్ టవర్ పార్కు వరకు హిమాయత్‌నగర్, నారాయణగూడ, ముషీరాబాద్ మీదుగా జై తెలంగాణ నినాదాలతో సుమారు 3 వేల మందితో 7 కి.మీ. భారీ ర్యాలీ జరిగింది. 1969 ఉద్యమం తరువాత రాజధానిలో జరిగిన తెలంగాణ ఉద్యమ ర్యాలీ ఇదే అని చెప్పవచ్చు.
-ఈ ర్యాలీ క్లాక్‌టవర్ పార్కులోని అమరవీరుల స్థూపం వద్దకు చేరిన తరువాత జరిగిన బహిరంగ సభలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు, కొండా లక్ష్మణ్‌బాపూజీ, ప్రొ. జయశంకర్, ప్రొ. కేశవరావు జాదవ్, వీ ప్రకాశ్, డా. చెరకు సుధాకర్, భరత్‌కుమార్, బెల్లయ్య నాయక్ తదితరులు ప్రసంగించారు.
తెలంగాణ ఉద్యమ కమిటీ జై తెలంగాణ పార్టీ
-ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి పీ ఇంద్రారెడ్డి చైర్మన్‌గా తెలంగాణ ఉద్యమ కమిటీ 1997 జూన్ 18న ఏర్పడింది. ప్రొ. జయశంకర్, ప్రొ. కేశవరావు జాదవ్, మాజీమంత్రి మేచినేని కిషన్‌రావు, జస్టిస్ కొండా మాధవరెడ్డి, పండిట్ నారాయణరెడ్డి, టీ ప్రభాకర్, చుంచు లక్ష్మయ్య తదితర నాయకులు ఇంద్రారెడ్డిని ప్రోత్సహించారు.
-తెలంగాణ ఉద్యమ కమిటీ ఏర్పడిన తరువాత తెలంగాణ నినాదం రాజకీయ ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది.
-వివిధ రాజకీయ పార్టీలు (పీపుల్స్‌వార్, బీజేపీ), సంస్థలు తెలంగాణ పోరాటానికి మద్దతు ప్రకటించాయి. ఇది తెలంగాణ ప్రజల తొలి విజయంగా ఉద్యమ కమిటీ 1997 సెప్టెంబర్‌లో ప్రచురించిన కరపత్రంలో పేర్కొంది.
-దాదాపు అన్ని జిల్లాల్లో ఉద్యమ కమిటీలను ప్రకటించి ప్రణాళిక, ఉద్యమ నిర్మాణం కోసం ఇంద్రారెడ్డి సన్నాహాలు ప్రారంభించారు.
-దీనిలో భాగంగా సెప్టెంబర్ 13, 14 తేదీల్లో హైదరాబాద్ చంపాపేటలోని సామ నర్సింహారెడ్డి గార్డెన్లో తెలంగాణ ఉద్యమ ప్రతినిధుల సదస్సును నిర్వహించింది.
-ఈ సదస్సుకు శిబూసోరెన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 2 వేల మంది జనం ఈ సదస్సుకు హాజరయ్యారు.
-చంపాపేటలో నిర్వహించిన సదస్సు తరువాత ఇంద్రారెడ్డి జై తెలంగాణ పార్టీని ప్రారంభించారు. హైదరాబాద్‌లోని కాచిగూడలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని ఉద్యమ పునర్నిర్మాణం గురించి ఆయన చేయగలిగినంతా చేశారు.
-అయితే ఇంద్రారెడ్డి హోంమంత్రిగా ఉన్నకాలంలో తెలంగాణలో ఎన్కౌంటర్లు జరగడం, గతంలో చెన్నారెడ్డి తెలంగాణకు ద్రోహం చేశాడనే అపవాదు ప్రచారం కావడం కారణాల వల్ల ఇంద్రారెడ్డి పట్ల సానుకూలత రాలేదు.
తెలంగాణ మహాసభ (1997)
-మలిదశ ఉద్యమ చరిత్రలో తెలంగాణ మహాసభ ఆవిర్భావం ఒక మలుపుగా చెప్పవచ్చు. భువనగిరి సభ తరువాత గద్దర్‌పై కాల్పులు జరగడంతో తెలంగాణ గురించి ఇక ఎవరూ గొంతెత్తలేరు, గజ్జెకట్టి ఆడలేరని భావించిన చంద్రబాబు ప్రభుత్వాన్ని సవాలుచేస్తూ వేలాది గొంతులతో గర్జించింది సూర్యాపేట తెలంగాణ మహాసభ.
-ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగుతున్న ప్రజాఉద్యమంలో భాగంగా అణగారిన కులాలను, తెగలను ఐక్యంచేస్తూ మారోజు వీరన్న దళిత బహుజన మహాసభను స్థాపించారు.
-చిన్న రాష్ర్టాల స్థాపన ద్వారానే దళిత, బహుజనులకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని భావించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషిచేశారు.
-భౌగోళిక తెలంగాణలో బహుజన రాజ్యం కావాలనే లక్ష్యంతో తెలంగాణ మహాసభను స్థాపించారు.
-అయితే అప్పటి ప్రభుత్వ నిర్బంధాల వల్ల వీరన్న తెర వెనుక 1997, ఆగస్టు 11న సూర్యాపేట సదస్సును నిర్వహించారు.
-ఈ సదస్సుకు చెరకు సుధాకర్ అధ్యక్షుడిగా వీ ప్రకాశ్ కార్యదర్శిగా కొనసాగారు.
-ఈ సదస్సుకు కాళోజీ, జయశంకర్, నారం కృష్ణారావు, హరగోపాల్, బెల్లి లలిత, రాపోలు ఆనందభాస్కర్ తదితరులు హాజరయ్యారు.
-బహుజన కులాల నుంచి వచ్చిన నాయకత్వమే తెలంగాణ ఉద్యమంలో నిజాయితీగా పోరాడగలదని ఈ సంస్థ విశ్వసించింది.
-సదస్సు అనంతరం జరిగిన బహిరంగ సభకు ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు, అధ్యాపకులు, వివిధ జిల్లా కేంద్రాల నుంచి మేధావులు, పాత్రికేయులు, వేలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా హాజరై సభను విజయవంతం చేశారు.
-తెలంగాణ మహాసభలో లంబాడి పోరాట హక్కుల సమితి, చాకలి దెబ్బ, తుడుం దెబ్బ, డోలు దెబ్బ మొదలైనవాటితో పాటు అనేక కులాసంఘాలు కలిశాయి.
-ఈ సభను ఏర్పర్చిన మారోజు వీరన్న తరువాత కాలంలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు.
RELATED ARTICLES
-
Biology – JL / DL Special | ఆశ్రయం పొందుతాయి.. హాని తలపెడతాయి
-
Telangana Socio Economic Survey | ఆయిల్‌పామ్ పండించే రాష్ర్టాల్లో తెలంగాణ స్థానం?
-
Indian festivals and culture | భారతదేశంలో పండుగలు – ఉత్సవాలు
-
Geography – Groups Special | విన్సన్ మాసిఫ్ పర్వతాన్ని అధిరోహించినది ఎవరు?
-
Economy | డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫాం.. పాత కొత్తల మేలు కలయిక
-
Biology | విటమిన్ల లోపం వల్ల చర్మానికి వచ్చే వ్యాధి?
Latest Updates
DSC Special – Social Studies | బ్యాంకులు పూచీకత్తులు లేకుండా రుణాలు ఎవరికి ఇస్తాయి?
General Studies | బ్రిటిషర్లు ‘కైజర్-ఇ-హింద్’ అనే బిరుదు ఎవరికి ఇచ్చారు?
Women’s Reservation Bill | చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు
CLAT 2024 | Common Law Admission Test Latest Updates
Current Affairs | కెంటకీ నగరం ఏ రోజు ‘సనాతన ధర్మ’ రోజుగా ప్రకటించింది?
SBI PO Preparation Plan | బ్యాంక్ కొలువు.. సాధించడం సులువు
IDBI JAM Recruitment | డిగ్రీ అర్హతతో ఐడీబీఐలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. పరీక్ష ఎలా ఉంటుంది? ఎంపిక విధానం ఎలా జరుగుతుంది?
Society QNS & ANSWERS | తెలంగాణలో పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి నోడల్ ఏజెన్సీ ఏది?
Physics – IIT/NEET Foundation | Vector Subtraction is Useful to?
RBI Recruitment | ఆర్బీఐలో 450 అసిస్టెంట్ పోస్టులు