ప్రజారంజక పాలనకు చిరునామా కాకతీయులు
దక్కన్ పీఠభూమిలో భాగమైన తెలంగాణ ప్రాంతంలో వేల ఏండ్లనుంచే అనేక సామ్రాజ్యాలు వెలిశాయి, అం తరించాయి. వాటన్నింటిలో అతిముఖ్యమైన సామ్రా జ్యం కాకతీయులది. నిజమైన ప్రజాసంక్షేమానికి, దూర దృష్టితో కూడిన అభివృద్ధికి, అసాధారణ పౌరుషానికి కాకతీయులు చిరునామాగా నిలిచారు. అలాంటి కాకతీయుల గురించి నిపుణ పాఠకుల కోసం ప్రత్యేకం..
కాకతీయులు కర్ణాటక నుంచి తెలంగాణలో తమకు ప్రత్యర్థులుగా ఉన్న ముదిగొండ చాళుక్యులను, వేములవాడ చాళుక్యులను, కందూరు చోడులను, పొలవాస రాజులను, నగునూరు రాజులను ఓడించి తెలంగాణను స్వాధీనం చేసుకొని ఆంధ్రను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.
-కాకతీయులు రాష్ట్రకూట వంశానికి చెందినవారు. రాష్ట్రకూటుల సేనలుగా తెలంగాణకు వచ్చారని, వారి పేరు చివర రాష్ట్రకూట నామాన్ని ధరించారని కాకతీయులు రాష్ట్రకూటుల రాజ చిహ్నమైన గరుడను తమ పతాకాలపై ఉంచుకున్నారని, రాష్ట్రకూట మతమైన జైనాన్ని కాకతీయులు అవలంబించారని, వారి వద్ద సైనికోద్యోగులుగా చేరి క్రమంగా సామంతులయ్యారనే అభిప్రాయం ఉంది.
-కాకతీయ వంశ స్థాపకుడు వెన్నరాజు రాష్ట్రకూట సేనాని సామంతుడు. వెన్నరాజు రాజ్యంలో ఆదిలాబాద్ పశ్చి మ ప్రాంతం, బాసర, ముథోల్, కుబేరు, భైంసా ప్రాంతాలు ఉండేవి.
కాకతీయ వంశ పాలన క్రమం
-వెన్న (కాకతీయ వంశ స్థాపకుడు- 800-815)
-మొదటి గుండన (815-825)
-రెండో గుండన
-మూడో గుండన
-ఎర్రయ (895-940)
-బేతయ
-నాలుగో గుండన (955-995)
-గరుడ బేతయ (996-1051)
-మొదటి ప్రోలరాజు (1052-76)
-రెండో బేతరాజు (1076-1108)
– రెండో బేతరాజు కొడుకులు : దుర్గరాజు (1108-16), రెండో ప్రోలరాజు (1116-57)
– రెండో ప్రోలరాజు కొడుకులు: రుద్రదేవుడు, మహాదేవుడు, గణపతి, దుర్గభూపతి
-మహాదేవుడి సంతానం : గణపతి దేవుడు (1199-1262), మైలాంబ, కుందమాంబ
– గణపతి దేవుడి కుమార్తెలు : గణపాంబ, రుద్రమదేవి (1262-89)
– రుద్రమదేవి కుమార్తెలు : ముమ్మడాంబ, రుద్రమ, రుయ్యమ
– ముమ్మడాంబ కుమారుడు : ప్రతాపరుద్రుడు (1289-1323)
-మొదటి గుండరాజు, రెండో గుండరాజు, మూడో గుండరాజులు రాష్ట్రకూటుల సేనానులుగా, సామంతులుగా ఉన్నారు. ఎర్రయ రాష్ట్రకూటుల సేనానిగా ఉంటూ కురవాడి సీమని పాలించాడు. కురవాడిసీమ ప్రాంతం అంటే ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని కురవి ప్రాంతం.
-ఎర్రయ కంటే ముందు కురవాడి సీమను ముదిగొండ చాళుక్యులు పాలించారు. వీరిని రాష్ట్రకూటులు తరిమి ఎర్రయని సామంతుడిగా నియమించారు. తిరిగి 934లో ముదిగొండ చాళుక్యులు కురవాడి సీమను ఆక్రమించారు.
-ఎర్రయ కొడుకు బేతయకు ప్రాధాన్యత లేదు. కానీ బేతయ కొడుకు నాలుగో గుండరాజు కురవాడి సీమను తిరిగి ఆక్రమించాడు. తూర్పు చాళుక్యుల కుటుంబ కలహంతో నాలుగో గుండరాజుకు ఈ అవకాశం దక్కింది.
-973లో కల్యాణి చాళుక్య రెండో తైలపుడు రాష్ట్రకూట రాజ్యాన్ని ఆక్రమించడంతో ముదిగొండ చాళుక్య బొట్టు బేతరాజు ఎర్ర సేనానిని ఆశ్రయించి కురవాడి సీమను స్వాధీనం చేసుకున్నాడు. ఆ తరువాత కాకతీయ వంశం నాశనమయ్యే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు గుండరాజు కొడుకు మొదటి బేతరాజును అతని మేనత్త కల్యాణి చాళుక్య చక్రవర్తిని ఒప్పించి అనుమకొండ విషయపాలకునిగా నియమింపజేసింది. అలా బేతరాజు కల్యాణి చాళుక్య సామంతుడయ్యాడు. బేతరాజు రాజ్యం కురవి సీమ (కురవాడి సీమ) నుంచి కరీంనగర్ మండలంలోని శనిగరం వరకు వ్యాపించి ఉండేది.
-బేతరాజు తరువాత ఇతని కొడుకు మొదటి ప్రోలరాజు రాజ్యానికొచ్చాడు. మొదటి ప్రోలరాజు, వేములవాడ చాళుక్య రాజు అయిన భద్రగుణ్ణి ఓడించి కరీంనగర్లోని కొన్ని ప్రాంతాలను జయించాడు.
-మొదటి ప్రోలరాజు శౌర్యప్రతాపాలకు గుర్తింపుగా కల్యాణి చాళుక్య చక్రవర్తి అనుమకొండను శాశ్వత మాన్యంగా ఇచ్చాడు.
-మొదటి ప్రోలరాజు కొడుకు రెండో బేతరాజు ఆరో విక్రమాదిత్యుడికి అండగా నిలిచాడు. అందుకుగాను విక్రమాదిత్యుడు బేతరాజుకు జగదేవుడి నుంచి సబ్బి-1000 మొత్తాన్ని తీసుకొని ఇతనికిచ్చాడు. అలా శనిగరం ప్రాంతం, సబ్బి సహస్రం కాకతీయ రాజ్యంలో చేరాయి.
-రెండో బేతరాజు తన తండ్రి పేరుమీద హనుమకొండలో ప్రోలేశ్వరాలయం, తన పేరుమీద బేతేశ్వరాలయం నిర్మించాడు. రెండో బేతరాజు తరువాత ఇతని పెద్ద కొడుకు దుర్గరాజు రాజయ్యాడు. దుర్గరాజు, రెండో ప్రోలరాజు అన్నదమ్ములు.
-దుర్గరాజు, జగదేవుని సహకారంతో స్వతంత్రించడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో కొలనుపాక రాజప్రతినిధిగా సోమేశ్వరుడు నియమితుడయ్యాడు. దుర్గరాజు తమ్ముడు రెండో ప్రోలరాజు సోమేశ్వరుడికి అండగా నిలబడి అన్న దుర్గరాజును పదవీచ్చుతుణ్ణి చేసి సింహాసనమధిష్టించాడు.
-ప్రోలరాజు ఉత్తర తెలంగాణ మీద ఆధిక్యత సాధించి కుమార తైలపుడిని ఓడించి వదిలేశాడు. తెలంగాణ మీద ఆధిక్యతను సాధించిన తరువాత తీరాంధ్ర దేశాన్ని జయించే ప్రయత్నంలో హతుడయ్యాడు. ఓరుగల్లు కోట నిర్మాణాన్ని ఇతడే ప్రారంభించాడు.
-ప్రోలరాజు భార్య ముప్పమాంబ. వీరికి ఐదుగురు కొడుకులు. వారు రుద్రదేవుడు, మహాదేవుడు, హరిహరుడు, గణపతి, రేపోల్ల దుర్గరాజు. తండ్రి ప్రోలరాజు మరణం తరువాత పెద్ద కొడుకు రుద్రదేవుడు రాజ్యానికొచ్చాడు.
-కాకతీయుల పరిసరాల్లో 3 సామంత రాజ్యాలుండేవి. అవి తూర్పున ఖమ్మం జిల్లాలో ముదిగొండ చాళుక్యులు, వాయవ్యంగా కరీంనగర్ జిల్లాలో పొలవాస నాయకులు, దక్షిణాన కందూరు చోడులు ఉండేవారు.
రుద్రదేవుడు
-తండ్రి రెండో ప్రోలరాజు మరణం తరువాత రుద్రదేవుడు సింహాసనమధిష్టించాడు. కందూరునాడును పాలిస్తున్న రెండో ఉదయన చోడుడు తన కొడుకు నాలుగో భీమచోడునితో కలిసి స్వతంత్రించాడు. తన రాజ్యం పక్కన మరో స్వతంత్ర రాజ్యం తలెత్తడాన్ని సహించని రుద్రదేవుడు కందూరునాడుపై దండెత్తి వారి రాజధానులైన వర్ధమానపురం (మహబూబ్నగర్), పానగల్లు (నల్లగొండ)ను ధ్వంసం చేశాడు. ఈయనకు భయపడి భీమచోడుడు అడవుల్లోకి పారిపోయాడు. ఉదయన చోడుడు తన కూతురు పద్మావతిని రుద్రదేవుడికిచ్చి సంధి చేసుకున్నాడు. అలా చోడులను సామంతులుగా చేసుకున్నాడు. దక్షిణ తెలంగాణను (మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాలను) కాకతీయ రాజ్యంలో భాగం చేశాడు.
-తెలంగాణలో బలపడుతున్న రుద్రదేవుడిని అణచడానికి బిజ్జలుడు, మైలిగి నాయకత్వంలో సైన్యాన్ని పంపాడు. అప్పటికే కాకతీయుల ప్రభావాన్ని సహించని రెండో మేడరాజు, ఇతని కొడుకు రెండో జగ్గదేవుడు, దొమ్మరాజు కూటమిగా ఏర్పడి రుద్రుడి మీద దండెత్తారు. ఈ కూటమి ప్రణాళికను రుద్రదేవుడు భగ్నం చేసి వారిని ఓడించి నగునూరు, పొలవాస రాజ్యాలను కాకతీయ రాజ్యంలో కలిపాడు. దీంతో కాకతీయ రాజ్యం గోదావరి దాకా విస్తరించింది. కాలచూరి రాజ్యంలో ఉన్న బీదర్, జహీరాబాద్ మొదలైన ప్రాంతాలను కాకతీయ సామ్రాజ్యంలో చేర్చాడు.
-రుద్రదేవుడు 1163లో సార్వభౌమత్వాన్ని ప్రకటించుకున్నాడు. రుద్రదేవుడు ధాన్యకటకం స్వాధీనం చేసుకున్నాడు. త్రిపురాంతకం జయించాడు. గొప్ప విజేతగా కాకతీయ సామ్రాజ్యానికి గట్టి పునాదులు వేశాడు.
-రుద్రదేవుడి విజయానికి సహాయపడిన రేచర్ల బేతిరెడ్డికి నల్లగొండలోని కొంతప్రాంతాన్ని, చెరుకురెడ్లకు జమ్ములూరు రాజ్యాన్ని ఇచ్చాడు. తనపేరు మీద రుద్రేశ్వర దేవాలయాన్ని కట్టించాడు. ఇదే వేయిస్తంభాల గుడి. ఓరుగల్లు కోట నిర్మాణం కొంతవరకు పూర్తిచేశాడు. రుద్రదేవుడి తరువాత ఇతడి తమ్ముడు మహాదేవుడు రాజ్యానికి వచ్చాడు. మహాదేవుడు యాదవ రాజ్యం మీద చేసిన యుద్ధంలో మరణించాడు. మహాదేవుడి భార్య బయ్యాంబ. వీరికి గణపతిదేవుడు, మైలాంబ, కుందమాంబ సంతానం.
గణపతి దేవుడు
-దక్షిణ భారతదేశం ఏలిన గొప్ప చక్రవర్తుల్లో ఒకడు గణపతిదేవుడు. కొలనివారు, చాగవారు, వెలనాట చోళులు, కోటవంశం, తెలుగు చోళులు మొదలైన సామంతరాజు వంశాలవారు స్వతంత్రలై తమలో తాము పొట్లాడుకుంటున్నారు. ఈ పరిస్థితిని గమనించిన గణపతిదేవుడు తీరాంధ్ర దండయాత్రను ప్రారంభించాడు. బెజవాడను ఆక్రమించాడు.
-గణపతి దేవుడు అయ్యవంశ రాజైన పినచోడుని కుమార్తెలైన నారాంబ, పేరాంబలను వివాహం చేసుకున్నాడు. గోదావరి నుంచి పెన్నానది వరకు వెలనాట చోళుల రాజ్యం కాకతీయుల హస్తగతమైంది. వరంగల్ కోటను పూర్తిచేసి రాజధానిని వరంగల్లుకు మార్చాడు. ఇతడికి ఇద్దరు కూతుళ్లు రుద్రమదేవి, గణపాంబ. గణపతి దేవుని భార్య సోమలిదేవి. కానీ రుద్రమదేవి గణపతిదేవుని భార్య అని చాలాకాలం చరిత్రకారులు పొరపడినారు. గణపతిదేవుడు రుద్రమదేవిని తూర్పు చాళుక్య వంశపు వీరభద్రునికిచ్చి వివాహం చేశాడు.
రుద్రమదేవి
-గణపతిదేవుడు 1259 నుంచి రాజ్యభారాన్ని రుద్రమదేవికి అప్పగించాడు. కానీ రుద్రమదేవి 1269 వరకు రాజ్య కిరీటాన్ని ధరించలేదు. రుద్రమ రాణి కావడం నచ్చని కొందరు సామంతరాజులు ఆమెపై తిరుగుబాటు చేశారు. రుద్రమ వారిని ఓడించి వెలమనాయకుడైన ప్రసాదిత్యుడు, మల్యాలగుండియ మొదలైనవారి మద్దతుతో సింహాసనం దక్కించుకుంది.
-వీరభానుదేవుడు వేంగిపై దండెత్తితే రుద్రమ.. పోతిమనాయకుడు, పోలినాయుడు అనే సేనానుల నాయకత్వంలో ఎదుర్కొంది. యాదవ మహాదేవుడు కాకతీయ రాజ్యంపై దండెత్తాడు. రుద్రమ అతడిని ఓడించడంతో కోటి సువర్ణాలను నష్టపరిహారంగా ఇచ్చి రుద్రమతో సంధిచేసుకున్నాడు.
-సారంగపాణి దేవుడు రుద్రమదేవికి సామంతుడు. రుద్రమదేవి మల్లికార్జున సేనాని నాయకత్వంలో సైన్యాన్ని నడిపింది. రుద్రమ 1289లో మరణించినట్లు నకిరేకల్ సమీపంలోని చందుపట్ల శాసనం వలన తెలుస్తుంది. రుద్రమదేవికి ముగ్గురు కుమార్తెలు ముమ్మడాంబ, రుద్రమ, రుయ్యమ.
ప్రతాపరుద్రుడు
-రుద్రమదేవి పెద్ద కుమార్తె ముమ్మడాంబ. ఈమె కుమారుడే ప్రతాపరుద్రుడు. ఈయన కాలంలో కాకతీయుల అధికారం ఉచ్ఛస్థితికి చేరుకొని ఒక వెలుగు వెలిగి అస్తమించింది.
-అంబదేవుడు, అతని కొడుకు రెండో త్రిపురారిని ప్రతాపరుద్రుడు సార్వభౌమునిగా అంగీకరించలేదు. ప్రతాపరుద్రుడు, మనుమగన్నయ, అన్నయదేవుల నాయకత్వంలో ప్రచండమైన సైన్యాన్ని అంబదేవుడి పైకి పంపి, అతన్ని ములికినాడు వరకు తరిమికొట్టి కాయస్థ రాజ్యాన్ని కాకతీయ రాజ్యంలో కలిపాడు.
-అంబదేవుడికి మద్దతుగా నిలిచిన దేవగిరి యాదవ రాజులపై దండయాత్ర చేసి కృష్ణా, తుంగభద్ర ప్రాంతాన్ని వశం చేసుకున్నాడు.
కాకతీయులపై ఢిల్లీ దండయాత్రలు ఖిల్జీ వంశం
-ఖిల్జీ వంశానికి చెందిన మాలిక్ ఫిరోజ్, ఇతని పూర్వీకులు ఢిల్లీ సుల్తానుల కొలువులో ఉన్నారు. మాలిక్ ఫిరోజ్ సుల్తానుల కొలువులో ఉన్నత పదవులు పొందాడు.
-1290లో జలాలుద్దీన్ సుల్తాన్ వారసుల్ని చంపి ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతడి అల్లుడు అల్లాఉద్దీన్ ఖిల్జీ ఇతడిని చంపి ఢిల్లీ సుల్తాన్గా ప్రకటించుకున్నాడు. తరువాత అల్లాఉద్దీన్ ఉత్తర భారతాన్నంతా జయించాడు. తరువాత దక్షిణ భారత్ జయించాలని సంకల్పించాడు. దక్షిణ భారత్లో దేవగిరి, హొయసాల, కాకతీయ రాజ్యాలు బలమైనవి.
కాకతీయుల కాలంలో దుర్గాలు
-1294లో దేవగిరిపై దండెత్తి అల్లాఉద్దీన్ విజయం సాధించాడు. 1303లో కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తాడు.
-అల్లాఉద్దీన్ మాలిక్ ఫక్రుద్దీన్ జునా, ఝాజా నాయకత్వంలో అల్లాఉద్దీన్ ఖిల్జీ సైన్యం కాకతీయ రాజ్యంపై దండెత్తింది. కాకతీయ సైన్యం ఖిల్జీ సైన్యాన్ని ఓడించింది. ప్రతీకారంతో అల్లాఉద్దీన్ ఖిల్జీ రెండోసారి దండయాత్ర చేస్తే ప్రతాపరుద్రుడు ధనరాశులు, ఏనుగులు ఇచ్చి సంధి చేసుకున్నాడు.
-1316లో అల్లాఉద్దీన్ ఖిల్జీ మరణిస్తే అతడి మూడో కుమారుడు ముబారక్ షా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించాడు. అల్లాఉద్దీన్ ఖిల్జీ మరణించడంతో ప్రతాపరుద్రుడు కప్పం చెల్లించడం మానేశాడు. దీంతో ముబారక్ షా ఖిల్జీ ప్రతాపరుద్రుడి నుంచి కప్పం వసూలు చేయమని ఖుస్రూఖాన్ను సైన్యంగా పంపాడు. ఖుస్రూ, ప్రతాపరుద్రుని నుంచి కప్పం వసూలుచేసి దండయాత్ర చేశాడు. ఇంతలో ముబారక్ షాను చంపి నాజీరుద్దీన్ ఖుస్రాన్షా ఢిల్లీ చక్రవర్తి అయ్యాడు. ఢిల్లీ సుల్తాన్ల అధికారి ఘజిమాలిక్, ఖుస్రాన్ను వధించి ఘియాజుద్దీన్ తుగ్లక్ పేరుతో ఢిల్లీ చక్రవర్తి అయ్యాడు. ఈయన ప్రతాపరుద్రుడిని లొంగదీసుకోడానికి తన పెద్ద కొడుకు ఫక్రుద్దీన్ మహ్మద్ను ఓరుగల్లుపై దండయాత్రకు పంపాడు. కోటను ముట్టడించాడు. కానీ స్వాధీనం కాలేదు. ఓడిపోయి దేవగిరికి చేరిన ఫక్రుద్దీన్ ఢిల్లీ నుంచి వచ్చిన కొత్త సైన్యంతో తిరిగి ఓరుగల్లుపై దండెత్తాడు. ఫక్రుద్దీన్ అంత త్వరగా దండెత్తుతాడని ఊహించని ప్రతాపరుద్రుడు తగిన యుద్ధ సన్నాహాలు చేయలేదు. ఆహారం లేని తన సైనికుల కష్టాలు చూడలేక స్వయంగా లొంగిపోయాడు. లొంగిపోయిన ప్రతాపరుద్రుడిని ఖాదిర్ ఖాన్, ఖ్వాజాహజీ అనే సేనానుల రక్షణలో ఢిల్లీకి పంపాడు. ముస్లిం సైనికుల అవమానాలను భరించలేక నర్మదానది ఒడ్డున ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రతాపరుద్రుడి మరణంతో కాకతీయ సామ్రాజ్యం అంతమైంది.
న్యాయపాలన
సాధారణంగా సామాన్య వివాదాలన్నీ గ్రామసభల్లో గ్రామ ప్రభుత్వం పరిష్కరించేది. గ్రామాల్లో దొంగతనాలు జరగకుండా చూసే బాధ్యత తలారి అనే గ్రామోద్యోగిది. అంతిమ న్యాయ నిర్ణేత రాజు. యాజ్ఞవల్క్య స్మృతి మొదలైన ప్రాచీన స్మృతి గ్రంథాల్లో చెప్పిన సూత్రాలననుసరించి ధర్మాసనాలు ఏర్పర్చేవారు. మహాజనులు అనే ఒకరిద్దరు రాజాధికారులతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సభల్లో న్యాయ సమస్యలు పరిష్కారమయ్యేవి. ఇవి పరిష్కారమైన వెంటనే సభ రద్దయ్యేది అంటే మొన్నమొన్నటిదాకా గ్రామాల్లో పెద్దమనుషులు చేసే పరిష్కారం వంటిది ఇది. ఈ మహాజనులు పెద్దమనుషుల్లాంటి వారన్నమాట. తెగల్లో వివాదాలను సమయాలే పరిష్కరించేవి.
సైనిక వ్యవస్థ
కాకతీయ సైన్యంలో చక్రవర్తి సైన్యం, నాయంకర సైన్యం అని రెండు దళాలుండేవి. కాకతీయ చక్రవర్తులు సైన్యానికి స్వయంగా నాయకత్వం వహించేవారు. కాకతీయ రాజ్యంలో స్థల, జల, వన, గిరి అనే నాలుగు రకాల కోటలు ఉన్నట్లు తెలుస్తుంది. కాకతీయుల కాలంలో ఓరుగల్లు, రాయచూరు, గోల్కొండ, భువనగిరి, రాచకొండ, దేవరకొండ, నల్లగొండ, పానగల్లు కోటలు శత్రు దుర్భేధ్యమైనవిగా పేరు పొందాయి.
ఆర్థిక పరిస్థితులు
కాకతీయుల కాలంలో ఆంధ్రదేశం సిరిసంపదలతో తులతూగుతున్నట్లు అమీర్ఖుస్రూ, అబ్దుల్ వాసఫ్, మార్కోపోలో వంటి విదేశీ యాత్రికుల రచనల వల్ల తెలుస్తుంది.
వ్యవసాయం
తెలంగాణలో సాగుభూమిని, నీటి వనరులను పెంచడంలో తగినంత కృషి జరిగింది కాకతీయుల కాలం నుంచే. కాకతీయులు చెరువులు తవ్వించి నీటిపారుదలమీద శ్రద్ధ వహించారు. రెండో బేతరాజు సెట్టి సముద్రం, కెరె సముద్రం, కేసరి సముద్రాలను తవ్వించాడు. గణపతి దేవుడు నలుమూలలా ఎన్నో చెరువులను తవ్వించాడు. గణపతి సేనాని రేచర్ల రుద్రుడు మానేరు మీద 12 చ.మీ. విస్తీర్ణం కలిగి 17,258 ఎకరాలు సాగుచేయగల పాకాల చెరువును తవ్వించాడు. రేచర్ల రెడ్లు 35 నీటి వనరులను ఏర్పాటు చేశారు. కాటచమూపతి కాట సముద్రాన్ని, చౌడచమూపతి చౌడ సముద్రాన్ని, నామిరెడ్డి సబ్బి సముద్రం, గౌరసముద్రం, కోమటి చెరువులను, ఎరకసాని ఎరకసముద్రాన్ని తవ్వించారు. ఇంకా చింతల సముద్రం, నామా సముద్రం కూడా ఉండేవి. చెరువుల నిర్మాణంలో పాల్గొన్న శ్రామికులకు రోజువారి వేతనాలు చెల్లించేవారు.
చెరువులతోపాటు ఊట కాలువల తవ్వకం కూడా జరిగింది. మూసీ నది నుంచి సాగే మూసేటి కాలువ, ఆలేరు నది నుంచి ఆలేటి కాలువ, కూచినేని కాలువ, రావిపాలు కాలువ, బొమ్మకంటి కాలువ, ఉటుం కాలువ, చింతల కాలువల గురించి పిల్లలమర్రి శాసనాలు చెబుతున్నాయి. ఏతం మోటలతో కూడా వ్యవసాయం చేసేవారు. కొత్త పొలాలను సాగుచేయడానికి కాకతీయ రాజులు కృషిచేశారు. ప్రతాపరుద్రుని కాలంలో అడవులను నరికించి విశాల భూభాగాలను సాగులోకి తెచ్చారు. నేటి రాయలసీమ, పల్నాడు ప్రాంతాల్లోని ఎక్కువ గ్రామాలు ప్రతాపరుద్రుని కాలంలో రూపొందినవేనని ఆ గ్రామ కైఫీయత్తులు చెబుతున్నాయి. తెలంగాణలోని మంథెన, కాళేశ్వరం, చెన్నూరు, నర్సంపేట, అచ్చంపేట, ఖమ్మం మెట్టు, కొత్తగూడెం అటవీ ప్రాంతాల్లోని గ్రామాల్లో ఎక్కువ భాగం కాకతీయుల కాలంలోనే ఏర్పడినట్లు శాసనాలు చెబుతున్నాయి. గణపవరం, ఘన్పూర్, మహదేవపురం, రుద్రవరం, బయ్యారం, ముప్పవరం, కుందవరం మొదలైన అనేక గ్రామాలు కాకతీయ రాజులు, రాణులు, బీడు భూములను అటవీ భూములను వ్యవసాయ యోగ్యం చేయగా వారి పేరుమీదనే ఏర్పడినవి గ్రామాలు. గ్రామం నిర్మించడం, చెరువు నిర్మించడం ఆనాడు పుణ్యకార్యం. గ్రామాలను ఏర్పర్చడానికి అన్ని వృత్తులవారికి ప్రోత్సాహకాలు ఇచ్చేవారు.
భూమి మీద ప్రాథమిక స్వామ్యం రాజుది కాగా, ద్వితీయ స్వామ్యం వ్యక్తిదిగా ఉండేది. రైతులు వరి, గోధుమలు, కొర్రలు, జొన్నలు, మొక్కజొన్నలు, నీలిమందు, ఆముదాలు, నువ్వులు, పెసలు, కందులు, చెరకు, నూనెగింజలు, ఆవాలు, సజ్జలు, మినుములు, ఉలవలు, పత్తి, అల్లం, పసుపు, ఉల్లి వంటి పంటలను పండించేవారు. ఓరుగల్లు ప్రాంతంలో సువాసనలు వెదజల్లే బియ్యం పండించినట్లు సాహిత్యం వల్ల తెలుస్తుంది. కొబ్బరి, చెరకు, మామిడి, జామ, అరటి తోటలు విస్తారంగా ఉండేవి. బెల్లం గానుగలు సాధారణంగా ప్రతి గ్రామంలో ఉండేవి.
పరిశ్రమలు
నాడు వ్యవసాయంతో పాటు అనేక పరిశ్రమలు కూడా ఉండేవి. పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో ఇరవైకి మించిన రకరకాల వస్ర్తాలను పేర్కొన్నాడు. ఓరుగల్లులో రత్నకంబళ్లు, మఖ్మల్ వస్ర్తాలు నేసేవారు. ఓరుగల్లులో చిత్తరువులు రాసే ఇండ్లు 1500 ఉన్నాయని ఏకామ్రనాథుడు రాసినదాన్ని బట్టి ఆనాడు చిత్రకళకు మంచి ఆదరణ ఉన్నట్లు తెలుస్తుంది. పాల్కురికి బసవపురాణంలో యాభై రకాల బట్టల పేర్లను పేర్కొనడాన్ని బట్టి, కాకతీయుల రాజ్యంలో శ్రేష్టమైన సన్నని వస్ర్తాలు నేసేవారని ఆ బట్టలు సాలెపురుగు జాలెవలే ఉండేవని మార్కోపోలో ప్రశంసించడాన్ని బట్టి ఆనాటి పద్మశాలీలు గొప్ప నైపుణ్యం గలవారని తెలుస్తుంది. పల్లకీల మీద చెక్కిన నగిషీల వర్ణను బట్టి ఆ నాటి వడ్రంగులు మంచి నైపుణ్యంగలవారని తెలుస్తుంది. పంచలోహాలతో పలు రకాల వస్తువులు తయారుచేసేవారు. నిర్మల్లో తయారైన కత్తులకు డెమాస్కస్లో కూడా మంచి పేరుండేది. గోల్కొండ ప్రాంతంలో వజ్రపు గనులున్నట్లు మార్కోపోలో రాశాడు. వ్యవసాయానికి అవసరమైన పరికరాలు గ్రామాల్లోనే తయారయ్యేవి. దేవాలయాల్లో ఉపయోగించే కంచుగంటలు, పళ్లాలు, పాత్రలు పానగల్లు, చండూరుల్లో తయారయ్యేవి.
కాకతీయుల పాలనా విధానం
-కాకతీయుల ప్రభుత్వం సంప్రదాయ రాజరికం. సాధారణంగా రాజ్యం తండ్రి నుంచి కుమారునికి వారసత్వంగా సంక్రమిస్తుంది. కుమార్తెకు కూడా ఆ హక్కు కల్పించడం కాకతీయ వంశంలోనే జరిగింది. సిద్ధాంతరీత్యా అధికారం అంతా రాజుదే. రాజ్య పాలనలో రాజుకు సహకరించేందుకు మంత్రి పరిషత్తు ఉండేది. వర్ణ ధర్మం, కుల ధర్మం, ఆచారం, సంప్రదాయం, శాస్త్ర నియమాలు ఎంతటి ప్రభువైనా ఆచరించాల్సిందే. నాటి శాసనాల్లో చాతుర్వర్ణ సముద్ధరణ అనే బిరుదు తరచుగా కనిపిస్తుంది. నిర్ణీత సమయంలో రాజు ప్రజలకు దర్శనం ఇవ్వాలని రుద్రదేవుని నీతిసారం తెలుపుతుంది. కాకతీయులు ఆరోగ్యశాలలు, పురుళ్ల ఆస్పత్రులు, కళాశాలలు, మఠాలు, సత్రాలు, చలివేంద్రాలను నెలకొల్పారు.
-కాకతీయుల మంత్రుల్లో అన్ని కులాలవారు ఉండేవారు. కాకతీయులు కులాన్ని బట్టికాక వ్యక్తుల అర్హతలను బట్టి మంత్రి పదవులు ఇచ్చినట్లు కనిపిస్తుంది. గణపతిదేవ చక్రవర్తికి రేచర్ల రుద్రారెడ్డి, మల్యాల హేమాద్రిరెడ్డి ప్రధానులు. ప్రతాపరుద్రునికి ముప్పడి నాయకుడు మహా ప్రధాని. ప్రతాపరుద్రుని కాలంలో నాయంకర విధానం అమలు చేయబడింది. ఇది ఒకవిధమైన జాగీర్దారీ విధానం. రాజ్యాన్ని అనేక మండలాలుగా విభజించి వాటికి పరిపాలనాధికారులుగా సైన్యాధ్యక్షులను నియమించేవారు. ఈ పాలకులనే నాయంకరులు అనేవారు.
నాయంకరులు దుర్గాధ్యక్షులు వారి మండలంలో వచ్చే ఆదాయంతో నిర్ణీతమైన సైన్యాన్ని పోషించి, యుద్ధ సమయంలో చక్రవర్తికి తోడ్పడేవారు. ప్రతాపరుద్రుడు తన రాజ్యంలో నాలుగో వంతు భూమిని నాయంకరుల ఆధీనంలో ఉంచాడు. ప్రతాపరుద్రుని కాలంలో 75 మంది నాయంకరులు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నాయంకర విధానం కాకతీయ రాజ్యపతనం తరువాత విజయనగర రాజులచేత అనుసరించబడి, ఆంగ్లేయ రాజ్యనిర్మాణం వరకూ కొనసాగింది. కాకతీయులకు ముందున్న చోళ, చాళుక్యులు కేంద్రీకృత పాలనావిధానాన్ని అనుసరించారు. అందుకు భిన్నంగా కాకతీయులు వికేంద్రీకృత పాలనా వ్యవస్థను అమలు పర్చారు. అందుకే మాండలికులకు, నాయంకరులకు సైనిక విషయాల్లో తప్ప సర్వ స్వాతంత్య్రమిచ్చారు. వారిపైన అధికారాన్ని రుద్దలేదు.
అణచి ఉంచే పద్ధతిని విడిచిపెట్టారు. వీరు తమను మహామండలేశ్వరులుగానే భావించారు తప్ప రాజాధిరాజుగా చక్రవర్తిగా భావించలేదు. ఒకరకంగా ఇది ప్రజాస్వామిక భావన. ఈ నాయంకరుల్లో తెలంగాణకు సంబంధించిన కొందరి పేర్లు.. యాదవ విశ్వనాథదేవుడు, గణపతి దేవుడి కాలంలో యుద్ధాల్లో పాల్గొన్నాడు. నల్లగొండ జిల్లాలో ఒక ప్రాంతాన్ని పరిపాలించాడు. అక్షయ చంద్రదేవుడు కరీంనగర్ జిల్లా ప్రాంతాన్ని పాలించాడు.
-పరిపాలనా సౌలభ్యం కోసం కాకతీయ సామ్రాజ్యం స్థలం, సీమ, వాడి, నాడు, పాడి, భూమి అనే ప్రాంతీయ భాగాలుగా విభజించబడింది. 10 నుంచి 60 గ్రామాల సముదాయాన్ని స్థలంగా వ్యవహరించేవారు. కొన్ని స్థలాల సముదాయమే నాడు. అనుకొండనాడు, కందూరునాడు, సబ్బినాడు, అయిజనాడు మొదలైనవి అటువంటి నాడులు.
-1) గ్రామ పాలనను ఆయంగార్లు నిర్వహించేవారు. గ్రామసేవ, రాజ్యసేవ చేసినందుకు పన్నులేకుండా భూమిని పొందినవారే ఆయంగార్లు. ఆయం అంటే పొలం వైశాల్యం. సాధారణంగా ఆయంగార్ల సంఖ్య పన్నెండు. వారు 1) కరణం 2) రెడ్డి 3) తలారి 4) పురోహితుడు 5) కమ్మరి 6) కంసాలి 7) వడ్రంగి 8) కుమ్మరి 9) చాకలి 10) మంగలి 11) వెట్టి 12) చర్మకారుడు. వీరిలో మొదటి ముగ్గురు ప్రభుత్వ సేవకులు. మిగిలినవారు గ్రామ సేవకులు. గ్రామ విస్తీర్ణం, ఆయకట్టు, పోరంబోకు, తోటభూమి, గడ్డిభూముల విస్తీర్ణం, వ్యక్తుల ఆస్తుల లెక్కలు, దేవాలయ ఆస్తుల లెక్కలు మొదలైన వాటి నిర్వహణ కరణం బాధ్యత. కరణం ఇచ్చే లెక్కల ఆధారంగా రాజ్యభాగం (పన్ను)ను వసూలు చేసి ప్రభుత్వానికి అందజేసే బాధ్యత రెడ్డి లేక పెదకాపుది. గ్రామ రక్షణ బాధ్యత తలారిది. దొంగతనాలు జరిగినప్పుడు నేరస్థులను పట్టుకోవడం, అపహరించిన సొత్తుని తెచ్చి ఇవ్వటం అతని విధి. అష్టాదశవర్ణాలవారికి సంఘాలుండేవి. వీటిని సమయాలనేవారు.
పన్నులు
స్థూలంగా ఐదు రకాల పన్నులుండేవి. అవి. 1) భూమి పన్ను 2) పారిశ్రామిక ఆస్తి పన్ను 3) వృత్తిపన్ను 4) వ్యాపార పన్నులు. భూమిశిస్తు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ మార్గం. వర్తకం, పరిశ్రమలు, వృత్తులపై విధించే పన్నులు రెండో ఆదాయమార్గం. పశుగ్రాసానికి పనికివచ్చే పచ్చిక బయళ్లపై వసూలు చేసే పన్ను, అడవుల కలపపై వేసే పన్ను మూడో ఆదాయ మార్గం. వర్తక సరుకుల మీద, ఎగుమతి, దిగుమతులపై, తయారైన వస్తువు మీద వేసే పన్నును సుంకం అనేవారు. సుంకాలు వసూలుచేసే అధికారం సాధారణంగా వర్తక శ్రేణులకు ఇచ్చేవారు.
వర్తక వాణిజ్యాలు
శాతవాహనుల తరువాత క్రమంగా క్షీణించిన దేశీయ, విదేశీయ వాణిజ్యాలను కాకతీయులు పునరుద్ధరించారు. కాకతీయుల కాలంలో దేశీయ వాణిజ్యానికి ప్రధాన కేంద్రం ఓరుగల్లు. ఓరుగల్లు తరువాత తెలంగాణలో మంథెన, అలంపురం, జడ్చర్ల, మగతల, పేరూరు ఆ నాడు ప్రధాన వాణిజ్యకేంద్రాలుగా ఉండేవి. పల్నాటి సీమ నుంచి వాడపల్లి, నకిరేకల్, పిల్లలమర్రి మీదుగా వ్యాపారులు వరంగల్ చేరేవారు. ఇదేకాక బళ్లారి-చిత్తూరు, రాయచూరు-కొలనుపాక, బీదర్-కొలనుపాక, కల్యాణి-కొలనుపాక-అనుమకొండ, బీదర్- పటాన్చెరువు- వరంగల్ మార్గాలు ముఖ్యమైన వాణిజ్య మార్గాలు.
-కాకతీయుల పాలనలో తెలంగాణలో వర్తక శ్రేణుల నిర్మాణంలో ఒక మార్పు వచ్చింది. వ్యాపారం బలిజలకు, వైశ్యులకే పరిమితం కాలేదు. రెడ్లు, నాయళ్లు, బోయలు, దాసర్లు, తెలికలు, పద్మశాలీలు, వ్యవసాయదార్ల వంటి ఉత్పత్తిదార్లు, కమ్మరి, కంసాలి, మేదరి వంటి వృత్తి కులాలవారు వ్యాపారంలోకి వచ్చారు. వివిధ వృత్తికారులు, ఉత్పత్తిదారులు సొంత సమయాలను ఏర్పరచుకొని తమ కులవృత్తులనేకాక వ్యాపారాలను కూడా నిర్వహించుకొనేవారు. వీళ్లలో కొందరు తమ ఉత్పత్తులనే అమ్ముకునేవారు. అందువల్ల ఇంతమంది వ్యాపారంలోకి వచ్చినప్పటికీ వ్యాపారం ప్రధానంగా కోమట్ల చేతుల్లోనే ఉండేది. గోధుమ, పెసలు, జొన్నలు, ఉప్పు, నూనె, నెయ్యి, మిరియాలు, ఆవాలు, తేనె, తుత్తునాగం, తగరం, పట్టు, రత్నాలు, ముత్యాలు, పూసలు, పసుపు, ఉల్లిగడ్డలు, అల్లం, నూలు, దుంపలు మొదలైనవాటి వ్యాపారం జరిగేది.
విదేశీ వాణిజ్యం
కాకతీయుల కాలంలో మోటుపల్లి విదేశీ వాణిజ్యానికి ప్రసిద్ధమైన రేవు పట్టణం. చాళుక్య, చోళ రాజుల కారణంగా దెబ్బతిన్న విదేశీ వ్యాపారాన్ని ఈ రేవు పట్టణం ద్వారా గణపతి దేవుడు పునరుద్ధరించాడు. మార్కోపోలో ఈ రేవు పట్టణాన్ని సందర్శించి ఇక్కడి నుంచి ఎగుమతయ్యే వస్తువుల్లో వజ్రాలు, పట్టుతో తయారయ్యే సన్న వస్ర్తాలు ముఖ్యమైనవని చెప్పాడు. ఈ మార్గంలో ఇండోనేషియా, జావా, సుమత్రా, జపాన్, మలయా, బర్మాలతో వ్యాపారం చేసేవారు. కాకతీయుల నాణేలు ఎక్కువగా లభించలేదు. కానీ శాసనాల్లో, సాహిత్యంలో నాణేల ప్రస్తావన ఉండేది.
సాంఘిక పరిస్థితులు
కాకతీయుల కాలం నాటి సంఘంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కులాలు ప్రధానంగా ఉండేవి. ప్రతి కులంలోనూ అనేక ఉప కులాలు ఏర్పడ్డాయి. ఏకామ్రనాథుని ప్రతాపచరిత్ర, వినుకొండ వల్లభరాయుని క్రీడాభిరామం కాకతీయుల కాలంలో ఉన్న వివిధ వృత్తులవారిని పేర్కొన్నాయి. కోమట్లు, ఈదురవారు, గొల్లవారు, సాలెవారు, మంగలివారు, కుమ్మరివారు, బోయవారు, రుంజలు, పిచ్చుకుంట్లు, పంబల, బవని, మేదర, గాండ్ల మొదలైన కులాల పేర్లు శాసనాల్లో కూడా పేర్కొన్నారు. హిందూ మతాన్ని సంస్కరించే ఉద్దేశంతో శైవ, వైష్ణవ మతాలు వచ్చాయి. కాకతీయుల కాలంలో బాల్యవివాహాలు జరిగేవి. వెలమలు సంఘసంస్కారులు కావటం, రెడ్లు పూర్వాచార పరాయణులు కావటం కనిపిస్తుంది. నాడు రాజకీయంగా ప్రాబల్యం వహించిన రెడ్లు, వెలమల మధ్య అధికారం కోసం పోటీ ప్రారంభమైంది. ఈ కాలంలో అష్టాదశ వర్ణాల్లో అగ్రవర్ణమైన బ్రాహ్మణులు రాజకీయ ప్రాబల్యాన్ని కోల్పోయారు. రాజకీయాధికారం చతుర్థ వర్ణ పరమైంది. క్షత్రియ వంశాలు నామమాత్రంగా అధికారంలో ఉండేవి. కాకతీయ సాంఘిక జీవితానికి ఒక ప్రధాన లక్షణం కుల సంఘాలు. కుల సంఘాలను సమయములు అనేవారు. నగరాలు, గ్రామాలు, పేటలుగా విభజించబడి ఉండేవి. అక్కలవాడ, భోగం వీధి, వెలిపాళె, మేదరవాడ, మోహరినాడు అలాంటివి. పూటకూళ్ల ఇళ్లు ఉండేవి. స్త్రీలు పేరిణి, కోలాటం, గొబ్బిళ్లు, గుర్రం, భంజలి మొదలైన క్రీడలతో వినోదం పొందేవారు.
మత పరిస్థితులు
కాకతీయుల కాలం నాటికి తెలంగాణలో బౌద్ధమతం నామమాత్రమైంది. కానీ జైనమతం ప్రబలంగా ఉండేది. ఆంధ్ర, కర్ణాటక రాష్ర్టాల్లో జైనమతాన్ని ధ్వంసం చేసినవారు వీరశైవులే. జైనమతంలోని వర్ణ రాహిత్యాన్ని శైవులు తమ ముఖ్య సిద్ధాంతంగా తీసుకున్నారు. రాజులను వశపరచుకొని, వారికి శైవ దీక్ష ఇచ్చి వారి గురువులై, మంత్రులై, దండనాథులై, జైనమత నిర్మూలనలో వీరవిహారం చేసినవారు వీరశైవులు. వీరశైవానికి ప్రతిగా వీర వైష్ణవం వీరావేశంతో విజృంభించింది. కాకతీయుల కాలంలో జైన, శైవ, వైష్ణవ మతాలు పరస్పర ప్రాబల్యం కోసం పోరాడుతూ ఉండేవి. 1200 నాటికి జైనం క్షీణించింది. దాని స్థానాన్ని శైవం ఆక్రమించింది. చివరకు శైవ వైష్ణవ మతాలు రెండే మిగిలాయి.
-బౌద్ధం: 10, 11 శతాబ్దాల్లోనే ఆంధ్రదేశంలో కనుమరుగైన బౌద్ధం కాకతీయుల కాలంలో మరింతగా కనుమరుగైంది. ఈ కాలపు శాసనాల్లో చాలా అరుదుగా ఈ మత ప్రసక్తి కనిపిస్తుంది. బుద్ధుడు విష్ణువు అవతారాల్లో ఒకడు కావడంతో బౌద్ధం హిందూ మతంలో కలిసిపోయింది.
జైనమతం
ఇంచుమించు ఒకేసారి ఆవిర్భవించిన బౌద్ధ, జైనమతాల్లో బౌద్ధం క్షీణించినా జైన మతం తన వ్యక్తిత్వాన్ని విడనాడలేదు. మొదటి బేతరాజు జైన మతావలంబి. రెండో బేతరాజు జాల్నాబసదిని దానం చేశాడు. మొదటి ప్రోలరాజు జైనమతాభిమాని అని హనుమకొండలో ఉన్న పద్మాక్షి దేవాలయం ముందున్న శాసనం తెలుపుతుంది. ఇతని మంత్రి బేతకు ప్రగ్గడ జైనుడు. ఇతడి భార్య మైలమదేవి జైన మతావలంబి. మెదక్ జిల్లాలోని జోగిపేట జైనమత కేంద్రంగా ఉండేది. హనుమకొండలో సిద్దేశ్వరాలయం అనే మరో జైన దేవాలయం ఉంది. వీటిని బట్టి తొలి కాకతీయులు జైనమతస్థులని తెలుస్తుంది. ప్రతాపరుద్రని కాలంలో ఓరుగల్లుకు చెందిన జైన అప్పయాచార్య జినేంద్ర కల్యాణాభ్యుదయం అనే గ్రంథాన్ని రచించడాన్ని బట్టి కాకతీయుల చివరి కాలం దాకా తెలంగాణలో జైనం కొనసాగిందని తెలుస్తుంది. క్రమంగా జైనం క్షీణించటానికి ప్రధాన కారణం క్రమక్రమంగా జైనానికి రాజుల పోషణ, ప్రజల ఆదరణ లభించకపోవడమే.
శైవం:
శైవంలో పాశుపతం, కాలాముఖం, కాపాలికం, ఆరాధ్యశైవం, వీరశైవం అనే శాఖలు ఉండేవి. వీటిలో రాజాదరణను, ప్రజాదరణను పొందిన శాఖ పాశుపతమే. రెండో బేతరాజు మొదట జైనాన్ని ఆచరించినప్పటికీ, కాలాముఖ శైవుడనే రామేశ్వర పండితునికి ఒక గ్రామాన్ని దానమివ్వడాన్ని బట్టి శైవుడిగా మారాడని చెప్పవచ్చు. ఈ రామేశ్వర పండితుడు రెండో బేతరాజు కుమారులైన దుర్గరాజు, రెండో ప్రోలరాజులకు కాలాముఖ శైవదీక్ష ఇచ్చాడు. దీన్ని బట్టి రెండో బేతరాజు నుంచి కాకతీయులు శైవమతాన్ని అవలంబించినట్టు తెలుస్తుంది. అలంపురం ఒక ముఖ్యమైన కాలాముఖ శైవకేంద్రంగా ప్రసిద్ధిచెందింది. అలా పన్నెండో శతాబ్దాంతం వరకు కాలాముఖ శైవం విస్తరించింది. గణపతి దేవుని కాలం నుంచి పాశుపత శైవం పాలకుల్లోనూ, ప్రజల్లోనూ ఆదరణ పొందింది. వీరశైవం ప్రభావం దాదాపు శూన్యమని పరబ్రహ్మశాస్త్రి అన్నాడు. కర్ణాటకలో ఉన్నంత ఉచ్ఛస్థితిలో ఆంధ్రదేశంలో ఉండకపోవచ్చు గాని పాల్కురికి బసవపురాణాన్ని బట్టి తెలంగాణలో తగినంత ఆదరణ పొందిందని చెప్పవచ్చు. అంతేగాక గద్వాల్లో పూడూరు గ్రామంలో గుడి బయట నగ్నజైన విగ్రహాలు ఉండటాన్ని బట్టి, వేములవాడలో జైనాలయాన్ని శివాలయంగా మార్చి జైన విగ్రహాలు బయట వేయడాన్ని బట్టి జైనాన్ని ధ్వంసం చేసిన వీరశైవం ఉనికి తెలుస్తుంది. గోళకి మఠాల స్థాపన కూడా ఈ విషయాన్ని సూచిస్తుంది. ఈ కాలంలో కాకతీయ రాజులు, రేచర్ల రెడ్లు మొదలైనవారు నిర్మించిన అనేక శివాలయాలను బట్టి ఆ నాడు శైవం విస్తృతమైన ఆదరణ పొందినట్లు తెలుసుకోవచ్చు.
వైష్ణవం:
కాకతీయుల కాలంలో ప్రజల ఆదరణ పొందిన మరో మతం వైష్ణవం. కాకతీయులు శైవులయినప్పటికీ వారి సామంతులు చాలామంది వైష్ణవులు. కాకతీయులు కూడా కొంతవరకు వైష్ణవాన్ని ఆరాధించారు. రుద్రదేవుడు రుద్రేశ్వరాలయంలో వాసుదేవుడిని ప్రతిష్టించడం, అతని మంత్రి గంగాధరుడు కేశవస్వామికి గుడికట్టించడం గణపతి దేవుని సోదరి మైలాంబ గోపాలకృష్ణుడికి గుడి కట్టించడం, ప్రతాపరుద్రుడు చెన్నకేశవస్వామి దానాలివ్వడం, అతడి భార్య లక్ష్మీదేవి రామనాథ దేవునికి కానుకలివ్వడం అందుకు నిదర్శనం. ఈ కాలంలో ధర్మపురి ప్రసిద్ధ వైష్ణవ కేంద్రం. శైవ మత ప్రచారానికి పాల్కురికి మొదలైనవారి రచనలు వచ్చినట్టే వైష్ణవ మత ప్రచారానికి గోన బుద్దారెడ్డి రంగనాథ రామాయణం వచ్చింది.
-గ్రామదేవతారాధన: వైదిక మతాలైన వైష్ణవ, శైవ దేవతల ఆరాధనతోపాటు చరిత్ర పూర్వయుగం నుంచి సంప్రదాయంగా వస్తున్న గ్రామదేవతలు, గ్రామ శక్తుల ఆరాధన కూడా ఉంది. ఏకవీర (రేణు/ఎల్లమ్మ) మైలారు దేవుడు, భైరవుడు, వీరభద్రుడు, మూసానమ్మ, కాకతమ్మ పోలేరమ్మ, గంగమ్మ, పోతరాజు మొదలైన గ్రామదేవతలను పూజించేవారు.
వాస్తు:
కాకతీయ రాజులు, వారి సామంతులు అనేక జైన, శైవ, వైష్ణవాలయాలను నిర్మించారు. దేవాలయ నిర్మాణంలో కాకతీయులు పశ్చిమ చాళుక్యుల వాస్తు విధానాన్ని అనుసరించి త్రికూటాలయాలను నిర్మించారు. బేతిరెడ్డి భార్య ఎరకేశ్వరాలయం నిర్మించింది. నామిరెడ్డి పిల్లలమర్రిలో కాటేశ్వర, కాచేశ్వర, నామేశ్వరాలయాలను నిర్మించాడు. ఓరుగల్లు కోట నిర్మాణంలో కాకతీయుల కాలంనాటి వాస్తు శిల్పకౌశలం ప్రతిఫలిస్తుంది. ఓరుగల్లు కోట ఏకశిల చుట్టూ నిర్మింపబడింది. కాకతీయ శిల్పం చాళుక్యుల శిల్పం కంటే నిగ్గు తేలినది. కొంత ప్రాంతీయ లక్షణాలను సంతరించుకుంది.
ప్రాక్టీస్ బిట్స్
1. కాకతీయుల పాలన మొదలైన సంవత్సరం?
1) 1000 2) 1050
3) 2000 4) 3000
2. కాకతీయులు క్రీ.శ. 1000వ సంవత్సరంలో వారి పాలన ఎక్కడ నెలకొల్పారు?
1) రాచకొండ 2) వేములవాడ
3) ఓరుగల్లు 4) త్రిపుర
3. కాకతీయుల గురించి మొదటిసారిగా పేర్కొన్న శాసనం?
1) మాగల్లు శాసనం 2) ఓరుగల్లు శాసనం
3) ఆమనగల్లు 4) 1, 3
4. కాకతీయుల జన్మస్థానం?
1) మధ్యప్రదేశ్ 2) మహారాష్ట్ర
3) కర్ణాటక 4) తెలంగాణ
5. బయ్యారం చెరువు శాసనం వేయించిందెవరు?
1) మైలాంబ 2) ప్రోలరాజు
3) దానర్గవుడు 4) రుద్రమదేవుడు
6. మాగల్లు శాసనం వేయించింది ఎవరు?
1) రుద్రమ దేవుడు 2) దానార్ణవుడు
3) ప్రోలరాజు 4) జానాఖాన్
7. కాకతీయులు రాష్ట్రకూటుల ఆధీనంలో ఉన్నప్పుడు వీరి రాజ లాంచనం?
1) గరుడం 2) వరాహం
3) హంస 4) పులి
8. కాకతీయులు పశ్చిమ చాళుక్యుల సామంతులుగా ఉన్నప్పుడు వీరి రాజ లాంచనం?
1) వరాహం 2) పంది
3) 1, 2 4) సింహం
9. కేసరి తటాకాన్ని నిర్మించిన రాజు ఎవరు?
1) రెండో ప్రతాపరుద్రుడు 2) ప్రోలరాజు
3) అరిగజకేసరి 4) రుద్రుడు
10. మా గల్లు శాసనం ప్రకారం కాకతీయుల మూల పురుషుడు?
1) కాకర్త్య గుండన 2) బేతరాజు
3) రుద్రదేవుడు 4) వెన్న భూపతి
11. బయ్యారం చెరువు శాసనం ప్రకారం కాకతీయుల మూలపురుషుడు?
1) బేతరాజు 2) వెన్న భూపతి
3) కాకర్త్య గుండన 4) ప్రతాపరుద్రుడు
12. కాకతీయ రాజ్య స్వతంత్య్ర స్థాపకుడు?
1) రుద్రమదేవుడు 2) ప్రోలరాజు
3) మైలాంబ 4) గణపతిదేవుడు
13. కాకతీయుల రాజధాని నగరం?
1) ఓరుగల్లు 2) వంగపల్లి
3) భువనగిరి 4) రాచకొండ
14. కాకతీయ రాజుల రాచ భాష?
1) తెలుగు 2) ఉర్దూ 3) సంస్కృతం 4) లిపి
15. కాకతీయులు అవలంబించిన మతాలు వరుసగా?
1) శైవం, జైనం 2) జైనం, శైవం
3) హిందు, శైవం 4) శైవం మాత్రమే
సమాధానాలు
1-1, 2-3, 3-1, 4-4, 5-1, 6-2,7-1, 8-3, 9-3, 10-1, 11-2, 12-1, 13-1, 14-3, 15-2
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు