ముల్కీ ఉద్యమం మూలాలు
తెలంగాణ ఉద్యమాన్ని ప్రభావితం చేసిన అంశాలు మూడు. అవి నీళ్లు, నిధులు, నియామకాలు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్ నేపథ్యంలోని నినాదాల్లో ఒక ప్రధానమైన నినాదం ‘మన ఉద్యోగాలు మనకు కావాలి’. బహమనీలు, కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీల పాలన కాలాల్లో స్థానికులైన తెలంగాణవారికి నామమాత్రంగానే ఉద్యోగాలు దక్కాయి. అంతేకాకుండా మొదటి సాలార్జంగ్ సంస్కరణల నుంచి 2009 తెలంగాణ ఉద్యమం వరకు కూడా అనేకాంశాలు ముల్కీ-నాన్ ముల్కీలతోనే ముడిపడి ఉన్నాయి. 1884, 1919, 1952, 1969 సంవత్సరాల్లో ఉద్యోగాల డిమాండ్‌తో ఉద్యమాలు జరిగాయి. మొదట్లో మాములుగానే ప్రారంభమైన ముల్కీ ఉద్యమాలు కాలక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మార్గాన్ని సుగుమం చేసి తెలంగాణ అస్థిత్వం కోసం, ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష కోసం పోరాడేటట్లు తెలంగాణ ప్రజల్ని పురికొల్పాయి.
ముల్కీకి మూలం
– బహమనీలు, కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీల కాలంలో ఉద్యోగాల విషయంలో స్థానికులకు ప్రాధాన్యం ఉండేది కాదు.
– బహమనీల కాలంలో ఇరాక్, ఇరాన్, టర్కీ, అరేబియా తదితర ప్రాంతాల నుంచి ముస్లింలు హైదరాబాద్‌కు వచ్చి స్థిర నివాసాలు ఏర్పాటుచేసుకున్నారు. వీరినే అఫాకీలు అనేవారు. వీరు తమ వ్యాపారాల ద్వారా ఆర్థికంగా స్థిరపడటమే కాకుండా మంత్రి పదవుల్ని, ఉన్నతోద్యోగాల్ని పొందారు.
ముఖ్య పదాలు – అర్థాలు
ముల్కీ – స్థానికుడు
గైర్ ముల్కీ – స్థానికేతరుడు
దక్కనీ – స్థానికుడు
అఫాకీ – స్థానికేతరుడు
– ఢిల్లీ సుల్తానులైన అల్లావుద్దీన్ ఖిల్జీ, ఘియాసుద్దీన్ తుగ్లక్, మహ్మద్ బీన్ తుగ్లక్‌ల కాలంలో దక్షిణాదిపై దండయాత్రలు జరిగాయి. వారిలో కొంతమంది దక్షిణాదిలో స్థిర నివాసం ఏర్పాటుచేసుకోవడమైంది. వీరిలో హిందువులు, ముస్లింలు కూడా ఉన్నారు. 15, 16 శతాబ్దాల్లో వీరు హైదరాబాద్‌కు చేరుకున్నారు. వీరినే ‘దక్కనీలు’ (స్థానికులు) అంటారు.
కుతుబ్‌షాహీల కాలంలో..
– కుతుబ్‌షాహీల పాలనాకాలంలో స్థానిక, స్థానికేతర వివాదం కొనసాగింది
– కుతుబ్‌షాహీలు ఇరాన్‌కు చెందిన షియాలు
– బహమనీ సామ్రాజ్య శిథిలాలపై ఏర్పడిన రాజ్యాన్ని కుతుబ్‌షాహీలు, నిజాంషాహీలు, బరీద్షాహీలు, ఇమ్మద్షాహీలు, ఆదిల్షాహీలు పాలించారు.
– కుతుబ్‌షాహీల స్థాపకుడైన సుల్తాన్‌కులీ ముల్కీలకే ఉద్యోగాల్లో ఎక్కువ అవకాశాలు కల్పించారు.
– హిందువులైన అక్కన్న (సర్లష్కర్ – సర్వసైన్యాధ్యక్షుడు), మాదన్న (మీర్‌జుమ్లా – ప్రధానమంత్రి) మొదలైనవారికి ఉన్నతమైన పదవులు ఇచ్చి గౌరవించారు అబుల్హసన్ తానీషా .
సాలార్జంగ్-I సంస్కరణల ప్రభావం
– అలీఘడ్ విశ్వవిద్యాలయం, ఇతర ఉత్తర భారతదేశ ప్రాంతాల నుంచి అనేక మందిని హైదరాబాద్‌కు ఆహ్వానించాడు మొదటి సాలార్జంగ్. వారికి పాలనలో ప్రాధాన్యం ఇచ్చాడు. మొదటి సాలార్జంగ్ నాసిర్-ఉద్-దౌలా, అఫ్జల్-ఉద్-దౌలా, మీర్‌మహబూబ్ అలీఖాన్‌ల కాలంలో 1853 నుంచి 1883 వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు. పరిపాలనను చక్కదిద్దే నిమిత్తమై విద్యావంతుల్ని నిపుణులైన ఉద్యోగాల్ని నియమించుకున్నాడు. ఇందులో దేశంలోని వివిధ ప్రాంతాల వారితో పాటు విదేశీయులు కూడా ఉన్నారు. బెంగాల్, తమిళనాడు నుంచి కాయస్థ కుటుంబాలవారు, బిల్గ్రామి వంశంవారు ఎక్కువగా హైదరాబాద్‌కు తరలివచ్చారు. ఫలితంగా ముల్కీ, నాన్‌ముల్కీ సమస్య ఏర్పడింది.
ముల్కీ-నాన్ ముల్కీ వివాదం
– ఆరో నిజాం కాలంలో 1884లో పర్షియన్ భాష స్థానంలో ఉర్దూ అధికార భాష అయింది. ఫలితంగా ఉర్దూతో పాటు ఇంగ్లిష్ భాషకు ప్రాధాన్యం పెరిగింది. ఫలితంగా స్థానికుల్లో అసంతృప్తి ఆరంభమైంది.
– నాటి దివాన్ రెండో సాలార్జంగ్ తన తండ్రి తలపెట్టిన సంస్కరణలు అమలుచేశాడు.
– రెండో సాలార్జంగ్ అధికార యంత్రాంగంలోని నాన్‌ముల్కీల (స్థానికేతరులు) పక్షం వహిస్తున్నాడని, ప్రభుత్వ ఉద్యోగాల్లో నాన్‌ముల్కీల సంఖ్య ఎక్కువ కావడంతో ముల్కీలు (స్థానికులు), ప్రభువర్గీయులు అతనికి వ్యతిరేకంగా ఉద్యమం లెవనెత్తారు.
– ఉద్యోగాలు, జీతభత్యాలు, పదోన్నత్తుల్లో ముల్కీలు (స్థానికులు) తీవ్రంగా నష్టపోతున్నారని ఆరో నిజాంకు తెలియజేసి, అతని తమవైపునకు తిప్పుకున్నారు.
– నిజాం ఆదేశాల మేరకు నాటి దివాన్ నిజాం రాష్ట్ర ప్రభుత్వాధికారుల లిస్టును విడుదల చేశారు. దీని ప్రకారం ముల్కీ ఉద్యోగులు 52 శాతం కాగా, వారి జీతం 42 శాతం మాత్రమే. నాన్ ముల్కీ (ఉత్తర భారతీయులు, మద్రాసీయులు, బొంబాయివారు, ఐరొపా మొదలైనవారు) ఉద్యోగులు 48 శాతం, కానీ వారి జీతాలు 58 శాతం. ఈ విధంగా ముల్కీలకు (స్థానికులకు), నాన్‌ముల్కీ (స్థానికేతరులు)లకు ఉద్యోగాల శాతంలో, జీతభత్యాల్లో వ్యత్యాసం ఉండేది. (దీనికి ఆధారం నిజాం ప్రభుత్వ సివిల్ అధికారుల లిస్టు 1886)
– ముల్కీ ఉద్యమం జోరు తగ్గించుటకు నిజాం ప్రభుత్వం కొన్ని చర్యల్ని చేపట్టింది. స్థానికులకు ఉన్నత విద్యావకాశాలు కల్పించే నిమిత్తమై విదేశీ స్కాలర్షిప్ విధానం ప్రవేశపెట్టింది.
– 15 రబ్బీ ఉల్సానీ 1301 హిజ్రీ (1888)లో జరీదా(గెజిట్) విడుదల చేశారు.
ముల్కీ నిబంధనలు
– ముల్కీ నిబంధనల్ని జారీ చేసినవారు మీర్ మహబూబ్ అలీఖాన్
– వీటిని 1888లో జారీ చేశారు. 7వ నిజాంకాలంలో కూడా ఫర్మానా జారీ అయింది.
– 15 సంవత్సరాలు హైదరాబాద్‌లో నివసించినవారు, 12 సంవత్సరాలు ప్రభుత్వోద్యోగిగా ఉన్నవారు.
– స్థానికేతరుల్ని పెళ్లాడిన స్త్రీలు స్థానికులుగానే పరిగణింపబడతారు.
– పెళ్లి అనంతరం వేరే ప్రాంతానికి వెళ్లి తిరిగి హైదరాబాద్ రాష్ట్రానికి వచ్చినవారు. ఏదైనా కారణంతో విడాకులు తీసుకొన్నా భర్త చనిపోయినవాళ్లు వెనక్కి వస్తే వాళ్లు స్థానికులుగా పరిగణింపబడుతారు.
– నిజాం రాజ్యంలోని ఉద్యోగాలు ముల్కీలు(స్థానికులు)తోనే భర్తీ చేస్తారు.
ఉర్దూభాష
– ఉర్దూ అధికార భాషా స్థానాన్ని ఆక్రమించింది. ఐతే ఉర్దూకు ముల్కీ, నాన్‌ముల్కీ రంగు పూశారు. ఇది దేశీయ భాషల్లో ఒకటి. కానీ సంస్థాన ప్రజల మాతృభాషల్లో ఒకటి కాదు.
-నాన్‌ముల్కీ ఉత్తరాది ఉర్దూను డాక్టర్ అబ్దుల్ హక్ పోషించగా, దక్కనీ ఉర్దూకు డాక్టర్ ఖాదర్ మొహియుద్దీన్ ఆచార్య పీఠం వహించారు. ఉత్తరాది ఉర్దూను ఇదారె అద్బియాత్ ఉర్దూ, దక్కనీ ఉర్దూను అంజుమనె తరక్కీ ఉర్దూ అనే సంస్థలు పోషించేవి. (గమనిక: ముల్క్ అనేది ఉర్దూపదం. అనగా దేశమని అర్థం. ముల్కీలు అంటే స్థానికులు).
ముల్కీలకు కిషన్ ప్రసాద్ అండ
– నాటి ప్రధానమంత్రి మహారాజా కిషన్‌ప్రసాద్ ముల్కీ ఉద్యమంలో స్థానికుల (ముల్కీల) పక్షాన నిలిచాడు. (ఆయన పదవీకాలం 1901-1912).
– ఐతే ఆర్థిక కార్యదర్శిగా, అనంతరం ఆర్థిక మంత్రిగా పనిచేసిన కాసన్వాకర్ స్థానికుల్ని చిన్నచూపు చూసేవాడు.
-ముల్కీల విషయంలో కాసన్వాకర్, కిషన్ప్రసాద్ల మధ్య పరోక్ష యుద్ధమే జరిగింది. కిషన్ ప్రసాద్ కృషివల్ల ముల్కీలు విజయం సాధించారు. గైర్ ముల్కీల (నాన్ ముల్కీల) ఉద్యోగాలన్నీ తాత్కాలికమైనవేనని ప్రకటన జారీ అయింది.
గమనిక: దివాన్ ఆస్మాన్ జా ముల్కీలను ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించాలి అనే వాగ్దానాన్ని అమలు చేయడంలో విఫలమయ్యాడు. (ఆధారం: హైదరాబాద్ రికార్డు).
-1885లో మద్రాసులో బీఏ పట్టా పొందిన హైదరాబాద్ విద్యార్థి రాయ్ బాలముకుంద్‌ను మద్రాసులో బీఏ పట్టా పొందిన తొలి హిందూ హైదరాబాద్ నాన్ ముల్కీగా పత్రికలు పేర్కొన్నాయి. ఇతడు 1908లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. (ఆధారం: ది దక్కన్ మెయిల్, 1896 అక్టోబర్ 2).
– ఇలాహిబక్ష్ 1899లో ‘గైర్ ముల్కీ (నాన్ ముల్కీ)ల పక్షాన హైదరాబాద్‌లో పరిపాలనా బాధ్యతలు అప్పగించాలంటే తెలివితేటలుగల ముల్కీ (స్థానికున్ని)ని ఎక్కడ వెదకాలి?’ అని ప్రశ్నించారు. (ఆధారం: 1899 డిసెంబర్ 6, ది హిందూ పత్రిక).
నిజాం ఫర్మానా క్రీ.శ.1919
– ముల్కీ, నాన్ ముల్కీ వివాదాల నేపథ్యంలో ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1919లో ఫర్మానా జారీచేశారు.
– నిజాం ఫర్మానాలోని అంశాలనే ముల్కీ నిబంధనలుగా పిలుస్తారు.
‘ఇస్తెహ కక అహల్ ముల్క్ బర్హల్ బిలా నదీగర్, బష్తర్-ఎ-లియాఖల్ మురజె అస్త్. ఖుదామీ బాషిందా, ముల్కీగైర్, బరాకుదామీ కిద్మత్ బిలావ, వబిలా మంజురీ-ఎ-ఖాస్ మదరుల్ మహం మకరర్ నషీనద్’’
‘‘ ఈ రాజ్యంలో ఉద్యోగాలన్నీ అర్హతల మేరకు విదేశీయుల జోక్యం లేకుండా స్థానికులకే ఇవ్వవలెను. స్థానికేతరులు (నాన్‌ముల్కీలు) అవసరమని అనుకుంటే దివాన్ ప్రధానమంత్రి అనుమతిని తీసుకోవాలి’’ అనేది దీని సారాంశం.
ముల్కీ నిబంధనలు
– ఎ. ముల్కీకి కలిగిన సంతానం.
– బి. హైదరాబాద్‌కు వచ్చి 15 ఏళ్లు స్థిరనివాసం ఏర్పర్చుకొన్నవారు. తమ సొంత ప్రాంతానికి వెళ్లబోమని ప్రమాణపత్రం ఇచ్చినవారు.
-సి. హైదరాబాద్ సంస్థానంలో 15 ఏళ్లు ఉద్యోగం చేసినవారి సంతానం.
– డి. తాలూక్దార్ (కలెక్టర్) స్థాయి అధికారి నుంచి గుర్తింపు పత్రం పొందితేనే ముల్కీలుగా గుర్తించాలనే నిబంధన ఉంది.
-ఇ. గైర్‌ముల్కీలను పెళ్లి చేసుకున్న స్థానిక మహిళలు నిజాం రాష్ట్రంలో ఉన్నంతవరకు ముల్కీలే (స్థానికులు). ఏ కారణంచేతనైనా వారు వెనక్కి వచ్చినా ముల్కీలుగానే గుర్తించబడుతారు.
పంజాబీలకు ఉద్యోగాలు-వివాదం
– 1930లో పంజాబ్‌కు చెందిన కొద్దిమందికి ఉన్నతోద్యాగాలిచ్చారు. తత్ఫలితంగా మళ్లీ వివాదం ప్రారంభమైంది. దాంతో ప్రభుత్వం మళ్లీ కట్టుదిట్టమైన నిబంధనలతో కూడిన ఫర్మానాను విడుదల చేసింది. ఆ ఫర్మానాలో ఎలాంటిస్థాయి ఉద్యోగానికైనా స్థానికేతరుల్ని తీసుకోరాదని ఉంది. దాంతో సంస్థాన ప్రజల ఉద్యోగాలకు గట్టి రక్షణ ఏర్పడినట్లెంది.
ముల్కీ నిబంధనల అమలు కోసం..
-ముల్కీ ఉద్యమం సాధించిన విజయం ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆ ఉత్సాహంతోనే సర్ నిజామత్ జంగ్ 1934లో ‘జమీయత్ రెపమయే నిజాం(నిజాం సబ్జెక్ట్ లీగ్)’ అనే సంస్థను స్థాపించారు. మాడపాటి హనుమంతరావు, రాజా బహదూర్ వెంకటరామారెడ్డి, వామనరాయ చంద్రనాయక్, కాశీనాథరావు వైద్య మొదలైనవారు ఆ సంస్థ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
ఉద్యోగుల జాబితా (1886)
స్థలం ఉద్యోగుల సంఖ్య శాతం వేతనశాతం
హైదరాబాదీయులు 246 52శాతం 42శాతం
స్థానికేతరులు (ఉత్తర భారతీయులు, 230 48శాతం 58శాతం
మద్రాసీయులు, బొంబాయి, ఐరోపా మొదలైనవారు)
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు