ఆరో నిజాం పరిపాలన సంస్కరణలు
పరిపాలనా సంస్కరణలు.. కానుంచా-ఇ-ముబారక్
#ఈ ఫర్మానాను 1893లో ప్రవేశపెట్టారు. దీని ప్రకా రం శాసన, కార్యనిర్వాహక విభాగాల మధ్య అధికార వికేంద్రీకరణ జరిగింది. రాజ్య కౌన్సిల్ సంస్థ రద్దయి దాని స్థానంలో కార్యనిర్వాహక, శాసన నిర్మాణాల్ని పరిశీలించడానికి ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటయ్యాయి.
కార్యనిర్వాహక కౌన్సిల్
#ఈ కౌన్సిల్లో దివాను, పేష్కార్, ఇతర మంత్రులు సభ్యులు. ప్రధానమంత్రి దీనికి అధ్యక్షుడు. ఈ మంత్రులకు సహాయం చేయడానికి సెక్రటరీలుండేవారు.
శాసనసభ
# దీనికి ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తాడు. శాసనసభలో ఏ మంత్రి ఉంటే (చర్చలో) ఆ శాఖామంత్రి ఉపాధ్యక్షుడిగా ఉంటాడు. ముగ్గురు ఎక్స్-అఫీషియో సభ్యులు అంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సంబంధ కార్యదర్శి, నిజాం సలహాదారులతో పాటు మరో 12 మంది నామినేటెడ్ సభ్యులుండేవారు. శాసన నిర్మాణ సభ మే 6, 1894లో మొదటిసారిగా సమావేశం జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది సర్ వికార్-ఉల్-ఉమ్రా.
దివానుల మార్పిడి-హైదరాబాద్ రాజ్య అభివృద్ధి
#రెండో సాలార్జంగ్ (క్రీ.శ. 1887)
# సర్ ఆస్మాన్ జా (క్రీ.శ. 1893)
#వికార్ ఉల్ ఉమ్రా (క్రీ.శ. 1901)
#మహరాజా కిషన్ ప్రసాద్ (క్రీ.శ. 1901-1912)
ఈ విధంగా వివిధ కారణాల వల్ల ప్రధానమంత్రుల మార్పిడి జరిగింది. మొదటి సాలార్జంగ్తో పాటు పై నలుగురు మీర్ మహబూబ్ అలీఖాన్ కాలంలో ప్రధానమంత్రులుగా పనిచేశారు.
బీరారు
# కీ.శ. 1902 నవంబర్ 5న భారత ప్రభుత్వ రాజప్రతినిధి లార్డ్ కర్జన్‌తో దివాన్ బీరారు విషయంపై చర్చ జరిగింది. దీని ప్రకారం నిజాం ప్రభుత్వం బీరారును సంవత్సరానికి రూ. 25 లక్షలకు లీజుకిచ్చింది. నిజాం తన జన్మదినోత్సవం నాడు జెండా ఎగురవేయడానికి, బీరారుపైన నిజాం సార్వభౌమాధికారం అంగీకరించబడ్డాయి. దీంతో హైదరాబాద్ రాజ్య ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడింది.
పత్తి మిల్లుల ఏర్పాటు
#పత్తి పంట ప్రోత్సాహం కోసం హైదరాబాద్, గుల్బర్గా, ఔరంగాబాద్‌ల్లో నూలు మిల్లులు స్థాపించారు.
వ్యవసాయానికి ప్రోత్సాహం
# పాత చెరువుల్ని బాగుచేయించాడు. కొత్త పంటకాల్వల్ని తవ్వించాడు. దీని ఫలితంగా అధిక భూమి సాగులోకి వచ్చి ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది.
ఖజానాలో మిగులు సాధించడం
#న్యాయ, పోలీసు, ఆబ్కారీ విభాగాల్కి ఆధునీకరించ డంతో ఆదాయం పెరిగి, ప్రభుత్వ ఖజానాలో మిగు లు జమ అయింది.
విద్యావ్యాప్తి
# మీర్ మహబూబ్ అలీఖాన్ విద్యావ్యాప్తికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. ఎన్నో పాఠశాలలు స్థాపించబడ్డాయి. పాఠశాలలపై అజమాయిషీ విద్యాశాఖ చేపట్టింది.
మహబూబియా బాలికల పాఠశాల
#దీన్ని హైదరాబాద్‌లో స్థాపించాడు. ఇది నిజాం రాజ్యంలోనే మొట్టమొదటి బాలికల పాఠశాల, ఆరో నిజాం కాలంలో విద్యాభ్యాసం చేసిన స్త్రీల సంఖ్య 25,000.
స్కాలర్షిప్లు
# ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే హైదరాబాద్ రాజ్యానికి చెందిన విద్యార్థులకు ప్రతి ఏటా ఉపకార వేతనాలు ఇచ్చే ఏర్పాట్లు చేశాడు.
ఎడిత్ బార్డ్ మెన్
#నిజాం రాజ్యం నుంచి ఎడిత్ బార్డ్ మెన్ ఆర్థిక సాయం పొందాడు. ఇతడు నిజాం రాజ్యం నుంచి ఆర్థిక సాయం పొందినవారిలో మొదటివాడు. ఇతడు ఆంగ్లో-ఇండియన్, విదేశాల్లో మెడిసిన్ చదువుకొని హైదరాబాద్‌కు తిరిగి వచ్చి రాష్ట్ర మెడికల్ సర్వీస్‌లో చేరాడు.
విక్టోరియా జననాసుపత్రి
# క్రీ.శ. 1905లో వేల్స్ రాకుమారుడు హైదరాబాద్ సందర్శనకు వచ్చినప్పుడు స్థాపించారు. విక్టోరియా మహారాణి జ్ఞాపకార్థం అనాథ శరణాలయం కోసం తన సరూర్‌నగర్ రాజభవనం ఇచ్చాడు. మోటరుకార్ల వాడకం ప్రారం భమైంది. ఫలక్‌నుమా ప్యాలెస్ నుంచి ఇతర ప్యాలెస్‌లను సందర్శించడానికి వేల్స్ రాజకుమారుని మోటరుకార్లను వినియోగించడం ప్రారంభించారు.
షేర్వాని ప్రారంభం
#మొగలాయిల పద్ధతి నీమాజామా స్థానే పొడువాటి కోటు ధరించే పద్ధతి షేర్వానిని ప్రవేశపెట్టారు.
అధికార భాషగా ఉర్దూ
#అధికార భాష అయిన పర్షియన్ భాషను రద్దుచేసి దానిస్థానంలో ఉర్దూను ప్రవేశపెట్టారు. అధిక ప్రజలు మాట్లాడే భాష ఉర్దూ.
నిజాం కళాశాల స్థాపన
# బ్రిటీష్ రెసిడెన్సీ అధికారుల ప్రభావం, ప్రోత్సాహంతో క్రీ.శ. 1887లో హైదరాబాద్‌లో నిజాం కళాశాల స్థాపితమైంది. తత్ఫలితంగా విద్యాధికులైన మేధావి వర్గం ఆవిర్భవించింది.
హైదరాబాద్‌కు నిపుణుల రాక
#మొదటి సాలార్జంగ్ సంస్కరణల ఫలితంగా పరిపాలనలో భాగస్వాములు కావడానికి వివిధ ప్రాంతాల నుంచి నిపుణులు హైదరాబాద్‌కు తరలివచ్చారు.
# డా. అఘోరనాథ ఛటోపాధ్యాయ (విద్యాధికుడు, బెంగాల్)
#ముల్లా అబ్దుల్ ఖయ్యూం (బాంబే)
# రామచంద్రపిళ్లే (న్యాయవాది, మద్రాసు)
#సయ్యద్ అఖీల్ (జర్నలిస్టు, ఢిల్లీ)
#మోహిబ్ హుస్సేన్ (సంఘ సంస్కర్త, ఇటావా)
# కేశవరావు కొరాట్కర్, వామననాయక్లు
అసఫియా రాజ్య గ్రంథాలయం
# క్రీ.శ. 1891 సంవత్సరంలో హైదరాబాద్‌లో స్థాపించబడింది. అరబిక్, పర్షియన్, ఇంగ్లీషు భాషల్లోని శాస్త్ర సాంకేతిక గ్రంథాల్ని వివిధ దేశాల నుంచి తెప్పించి ఈ గ్రంథాలయంలో పెట్టారు.
డేరియత్-ఉల్-మారిఫ్
# క్రీ.శ. 1892లో ఏర్పాటయింది. ఇది పర్షియన్, అరబిక్, ఉర్దూ భాషల ప్రచురణ సంస్థ. దీని ఏర్పాటులో కీలక పాత్ర పోషించాడు ఇమాద్-ఉల్-ముల్క్
భారత్ గుణవర్థక సంస్థ
#ఈ గ్రంథాలయాన్ని శాలిబండలో స్థాపించారు. క్రీ.శ. 1895లో మరాఠీవారు స్థాపించారు.
శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయం
# ఇది తెలుగు భాషా గ్రంథాలయం. దీ న్ని క్రీ.శ 1901 లో ఏర్పాటు చేశా రు. దీన్ని సుల్తాన్ బజా ర్ దగ్గర కోఠీలో నెలకొల్పారు. దీని ఏర్పాటుకు కృషి చేసినవారు కొమరాజు లక్ష్మణరావు, రావిచెట్టురంగారావు.
రాజరాజ నరేంద్ర ఆంధ్రభాషా నిలయం
# తెలుగ భాషా వికాసానికి విస్తృత సేవ లు చేసిన రాజరాజ నరేంద్రుని పేరు మీదుగా దీన్ని 1906లో హనుమకొండ (వరంగల్)లో స్థాపించారు.
ఆంధ్ర సంవర్థినీ సంస్థ
# దీన్ని 1905లో సికింద్రాబాద్‌లో స్థాపించారు.
పత్రికలు, వివిధ సంస్థలు
# ఉర్దూ, ఆంగ్ల, మరాఠీ, తెలుగు పత్రికలు ప్రజా సమస్యల గురించి రాశాయి. అదేవిధంగా దివ్యజ్ఞాన సమాజం, ఆర్య సమాజం, గణేష్ ఉత్సవాలు మొదలైనవి చేపట్టాయి. ఇలాంటి కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం వచ్చింది.
పరమత సహనం
# మీర్ మహబూబ్ అలీఖాన్ హిందువులకు ఉద్యోగాలిచ్చి పరమత సహనాన్ని పాటించాడు. నాటి సమాజంపై ఇస్లాం మత ప్రభావం ఉండేది. పండుగలు, ఉత్సవాల్లో హిందూముస్లింలు పాల్గొనేవారు. మక్కా, కాశీ యాత్రలకు వెళ్లేవారికి సహాయం చేసేవాడు.
బాబా షర్ఫొద్దీన్
# మీర్ మహబూబ్ అలీఖాన్ బాబా షర్ఫొద్దీన్ భక్తుడు. బాబా షర్ఫొద్దీన్ ఖాజా నిజాముద్దీన్ భక్తుడు. ఇతడు హైదరాబాద్‌లోని పహాడీషరీఫ్ అనే పర్వతంపై స్థిరపడ్డాడు. చుట్టుపక్కల ప్రజల శారీరక, మానసిక బాధల్ని ఉపశమనం చేసేవాడు. చివరకు పహాడీషరీఫ్ వద్ద మరణించడంతో అక్కడే ఇతనికి సమాధి నిర్మించారు. బాబా షర్ఫొద్దీన్ జ్ఞాపకార్థం ఏడాదికోసారి వారం పాటు బస చేసేవాడు నిజాం.
మూసీ నదికి వరదలు
8 క్రీ.శ. 1906-07లో మూసీ నది పరివాహక ప్రాంతం, హైదరాబాద్ పట్టణం పెద్ద తుపాను ప్రభావానికి గురైంది. రెండు రోజుల పాటు కురిసిన వర్షాలతో మూ సీనది ఉప్పొంగి వరద లు వచ్చాయి. తత్ఫలితంగా వేలసంఖ్యలో ప్రాణనష్టం, ఆస్తినష్టం వాటిల్లింది. అఫ్జల్‌గంజ్, పురానాపూల్, ముస్లింజంగ్‌పూల్ మొదలైన ప్రాంతాలు జలమయమయ్యాయి. సర్వం కోల్పయి నిరాశ్రయులైనవారి రోదనలతో హైదరాబాద్ పట్టణ వీధులు మార్మోగాయి. ఈ దారు ణ సంఘటనకు చలించిన మీర్ మహబూబ్ అలీఖాన్, ప్రధానమంత్రి మహరాజా కిషన్‌ప్రసాద్, ఇతర ప్రముఖులు తమ భవన ద్వారాల్ని తెరిచి ప్రజలకు ఆశ్రయం కల్పించారు. అంతేగాకుండా వారం రోజుల పాటు ప్రభుత్వ సెలవుదినాలుగా ప్రకటించారు. మహబూబ్ అలీఖాన్ బంగారుయజ్ఞోపవీతాన్ని (జంజం) ధరించడమేకాకుండా, బాలికలకు ప్రభుత్వ ఖర్చుతో వివాహం జరిపించాడు.
లంగర్ ఉత్సవం
#ఈ ఉత్సవంలో హిందూ, ముస్లింలు పాల్గొనేవారు. ఈ ఊరేగింపులో రకరకాల దుస్తులు, బంగారు గొలుసులు ధరించిన ఏనుగు, దాని వెనుక నిజాం సైనిక పటాలం వెళ్తూ కిషన్ ప్రసాద్‌కు నమస్కరిస్తుండేవి.
చాందా రైల్వే పథకం
# క్రీ.శ. 1870 సంవత్సరంలో నిజాం, భారత ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం మద్రాసు-బొంబాయి మార్గంలో వాడి నుంచి హైదరాబాద్ వరకు రైల్వే లైను వేయాలి. తర్వాత సింగరేణిలో బొగ్గు కనుక్కోవడంతో రైల్వేలైన్‌ను విజయవాడకు విస్తరించాలని నిర్ణయించారు. ఆ తర్వాత చాందా (నేటి చంద్రాపూర్)లో బొగ్గు నిక్షేపాల గురించి తెలియడంతో రైల్వేలైన్ చాందా వరకు పొడిగించడానికి నిర్ణంయిచారు.
నిజాం గ్యారెంటీ రాష్ట్ర రైల్వే కంపెనీ
# ఈ రైల్వేలైన్ నిర్మాణానికి 3,00,000 పౌండ్ల పెట్టుబడిని బ్రిటీష్ రైల్వే కంపెనీ సమకూర్చగా, ఈ పెట్టుబడిపై కంపెనీ నష్టపోకుండా నిజాం ప్రభుత్వం కంపెనీకి 6 శాతం వడ్డీ రేటు గ్యారెంటీ ఇచ్చింది. దీన్నే నిజాం గ్యారెంటీ రాష్ట్ర రైల్వే కంపెనీ అని పిలిచారు. గోప్యంగా ఉంచిన ఈ చాందా రైల్వే పథకం మొదటి సాలార్జంగ్ కాలంలో ఆమోదించబడింది.
మేధావి వర్గం కమిటీ
# ప్రజల్లో ఏర్పడిన ఆందోళనను, ఈ స్కీమ్ వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందన్న వదంతుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ పథకం పూర్వాపరాల్ని పరిశీలించడానికి మేధావి వర్గం కమిటీ ఏర్పాటు చేసింది.
కమిటీలో ముఖ్య సభ్యులు
#డాక్టర్ అఘోరనాథ ఛటోపాధ్యాయ, ముల్లా అబ్దుల్ ఖయ్యూం. దీనికి ప్రతిస్పందనగా ప్రభుత్వం అఘోరనాథ ఛటోపాధ్యాయను ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా హైదరాబాద్ రాష్ట్రం నుంచి బహిష్కరించింది. ముల్లా అబ్దుల్ ఖయ్యూం హైదరాబాద్ వదిలి మద్రాసు వెళ్లాడు. దీంతో ఉద్యమం నీరుగారిపోయింది. ఈ విషయానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రచారం కల్పించిన ప్రముఖ పత్రికలు టైమ్స్ ఆఫ్ ఇండియా, బాంబే గెజిట్లు. క్రీ.శ 1885లో అఘోరనాథ్ ఛటోపాధ్యాయ హైదరాబాద్‌కు వచ్చి నిజాం కాలేజీ ప్రిన్సిపాల్‌గా పదవీ బాధ్యతలు చేపట్టడానికి నిజాం ప్రభుత్వం అంగీకరించింది.
# చాందారైల్వే ఆందోళన పెద్దగా ఏమీ సాధించకపోయినా నిజాం రాజ్యంలో ప్రజల చైతన్యానికి కారణమైంది.
నిజాం వ్యక్తిగత జీవితం
#గుర్రపు స్వారీ చేయడం, స్త్రీలతో విలాస జీవితం గడిపేవాడు. పెగ్గింట్ ఆట, రైఫిల్ షూటింగ్లో నిష్ణాతుడు. పాకాల అడవుల్లో ఎన్నో పులుల్ని వేటాడాడు. ఖరీదైన చేతి రుమాళ్లు, కళ్లజోళ్లు దేశవిదేశాల నుంచి తెప్పించేవాడు. ఒక్కసారి తొడిగిన వస్త్రాల్ని తొడగకుండా, ఆ వస్త్రాల్ని, ఇతర వస్తువులను తన పుట్టినరోజునాడు పేదవారికి పంచే అలవాటు మహబూబ్ అలీఖాన్‌కు ఉంది. ఈ నిజాంకు 100 మంది భార్యలుండేవారు. వీరికి రాజాంతపురంలో ప్రత్యేక గదులుండేవి. వారికి వ్యక్తిగత ఖర్చుల కోసం నెలకు రూ. 2000 ఇచ్చేవాడు. సర్దార్ బేగం నిజాంకు అత్యంత ప్రియమైన భార్య. ఈమెకోసం ప్రత్యేకంగా ‘మహబూబ్ మ్యా న్షన్’ అనే ప్రత్యేక భవనం కట్టించాడు.
మహబూబ్ అలీఖాన్ ఘనత
#సహనశీలిగా, భగవత్స్వరూపుడిగా, పరమత సహనశీలిగా పేరుగాంచాడు. మీర్ మహబూబ్ అలీఖాన్ గుర్రంపై వెళ్తున్నప్పుడు శవం అడ్డు వస్తే గుర్రంమీద నుంచి దిగి ఆ శవాన్ని కొంత దూరం మోసేవాడు. ‘మహబూబ్ అలీపాషా’గా సార్వజనీక ప్రేమికుడిగా హైదరాబాద్ రాజ్య చరిత్రలో ప్రసిద్ధిగాంచాడు. మహబూబ్ అలీఖాన్ ప్రపంచంలోనే అతిపెద్ద వార్డ్ రోబ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాకుండా సుమారు రూ. 200 కోట్ల విలువైన ‘జాకబ్ డైమండ్’ను పేపర్ వెయిట్‌గా తన టేబుల్‌పై పెట్టుకునేవాడు.
# మరణం: ఒకవైపు ఆరోగ్యం క్షీణించడం, మరోవైపు కాలేయవ్యాధి రావడంతో క్రీ.శ. 1911 ఆగస్టులో మరణించాడు.
మధుసూదన్ బోయిన
నారాయణ ఐఏఎస్ అకాడమీ
హైదరాబాద్.
9440082663
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు