కాకతీయ అనంతర రాజ్యాలు
1323లో జునాఖాన్ కాకతీయ సామ్రాజ్యాన్ని పతనం చేసి దానికి ‘సుల్తాన్పూర్’గా నామకరణం చేశాడు. తన ప్రతినిధిగా ‘మాలిక్నబీ’ని నియమించి వెళ్లాడు. కాకతీయ, మధురై రాజ్యాలను ఢిల్లీ సామ్రాజ్యంలో విలీనం చేశాడు. దీంతో ఆ రెండు రాజ్యాలు ఢిల్లీ సామ్రాజ్యంలో రెండు రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. ‘ఆంధ్రనగరి’గా పిలువబడే ఓరుగల్లు ‘సుల్తాన్పూర్’ అయ్యింది. దీనికి ‘మాలిక్ బర్వన్ ఉద్దిన్’ గవర్నర్‌గా నియమించబడ్డాడు. మధురై రాష్ట్రానికి జలాలుద్దిన్ హసన్‌షా రాజుగా నియమితుడయ్యాడు. ఓరుగల్లుకు ‘మాలిక్ మక్బూల్’ వజీరయ్యాడు. ప్రతాపరుద్రుని కాలంనాటి గన్నమ నాయుడు మతం మార్చుకొని మాలిక్ మక్బూల్గా మారాడు.
# దక్షిణ భారతదేశంలో మహ్మద్‌బిన్ తుగ్లక్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరిగాయి. వ్యతిరేక ఉద్యమాలు స్వతంత్య్ర రాజ్యాలకై జరిగాయి. ప్రతాపరుద్రుని కొలువులో సేనాని అయిన రేచెర్ల ‘సింగమనాయకుడు’ దక్షిణ తెలంగాణలో స్వతంత్రించి ‘పద్మనాయక’ లేదా ‘రేచర్ల వంశం’ స్థాపించాడు. ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి ముస్లింలను పారదోలి ‘రేఖపల్లి’ (ఖమ్మం) రాజధానిగా ప్రోలయ స్వతంత్య్ర రాజ్యం స్థాపించాడు.
# దక్షిణ తీరాంధ్రలో 1325 నాటికే ప్రోలయ వేమారెడ్డి రెడ్డి రాజ్యం స్థాపించాడు. ‘అద్దంకి’ రాజధానిగా చేసుకున్నాడు. రాయలసీమలో ‘అరవీటి’ సోమదేవరాజు స్వతంత్రించాడు. కంపిలిలో ‘1336’లో హరిహర బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యం స్థాపించారు. నస్రత్‌ఖాన్ ‘బీదర్’లో స్వతంత్ర రాజ్యం స్థాపించడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. 1347లో హసన్‌గంగూ గుల్బర్గాలో బహ్మని రాజ్యం స్థాపించాడు. మహ్మద్‌బిన్ తుగ్లక్ ఢిల్లీ ఢిల్తాన్గా ఉన్న సమయంలో ఏర్పడిన దక్షిణ భారతంలోని రాజ్యాలు..
1. 1324- రేచెర్ల వెల్మవంశం: సింగమనాయుడు
2. 1325- ముసునూరి వంశం: ప్రోలయ నాయకుడు
3. 1325- రెడ్డి రాజ్యం: ప్రోలయ వేమారెడ్డి
4. 1336- విజయనగర రాజ్యం : హరిహర + బుక్కరాయలు
5. 1347- బహ్మని రాజ్యం: హసన్ గంగూ
ముసునూరి నాయకులు
#ముసునూరు అనే గ్రామం కృష్ణా జిల్లా ఉయ్యూరు తాలూకాలో ఉంది. ఇప్పటికీ ఈ గ్రామంలో కోట శిథిలాలు ఉన్నాయి. దీనినిబట్టి వీరి జన్మస్థలం ఇదే కావచ్చు! వీరు కమ్మ కులస్థులు. కాకతీయ పతనానంతరం ముస్లింల వశమైన తెలంగాణ ప్రాంతంలో చెలరేగిన అసంతృప్తిని అవకాశంగా తీసుకొని ఈ వంశానికి చెందిన ప్రోలయ నాయకుడు భద్రాచలం ప్రాంతంలోని ‘రేఖపల్లి’ని రాజధానిగా చేసుకొని ముస్లింలతో పోరాడాడు. ఈ పోరాటంలో ప్రోలయ నాయకునికి పినతండ్రి కుమారుడు కాపయనాయకుడు, వేంగి పాలకుడు వేంగ భూపాలుడు, మొదలైన వారు సహాయం చేశారు. ఇలా ‘రేఖపల్లి’లో స్వతంత్ర రాజ్య స్థాపన చేశాడు. ఇతని మంత్రి కుమారునికి అన్నయ్య మంత్రి ‘విలాసా’ గ్రామం దానం చేస్తూ తామ్ర శాసనం వేయించాడు. అన్నయ్యమంత్రికి ‘ఆంధ్ర భూమండలాధ్యక్ష సింహాసన ప్రతిష్టాపనా చార్య’ అనే బిరుదు ఉంది.
# ప్రోలయ నాయకునికి సంతానం లేనందువల్ల ఇతని మరణం తర్వాత ‘కాపయ నాయకుడు’ రాజయ్యడు. 75 మంది నాయకుల సహాయంతో (సింగమనేడు, వేమారెడ్డి మొదలైనవారు……) ఓరుగల్లును ముట్టడించి ముస్లింలతో పోరాటం కొనసాగించి క్రీ.శ. 1336లో ఓరుగల్లును ఆక్రమించాడు. దీంతో ‘మాలిక్ మక్బూల్’ పారిపోయాడు. ఓరుగల్లు రాజధానిగా ఉత్తర తెలంగాణను కృష్ణా నది నుంచి గోదావరి వరకు గల ఉత్తర తీరాంధ్ర ప్రాంతాన్ని పరిపాలించాడు. విస్తరణ కాంక్షతో రేచెర్ల సింగమనేని రాజ్య భాగాలైన పిల్లలమర్రి, ఆమనగల్లు, వాడపల్లి ప్రాంతాలను ఆక్రమించి ఎర్రబోతు లెంకను నియమించాడు. తీరాంధ్ర ప్రాంతంలో తన ప్రతినిధులను నియమించాడు.
i. కోరుకొండ్ల ప్రాంతంలో కూననాయకుడిని నియమించాడు.
ii. సబ్బినాడు (కరీంనగర్) ముప్పు భూపాలుడిని నియమించాడు.
– కాపయనాయకునికి ‘ఆంధ్ర సురత్రణ’ ఆంధ్ర దేశాధీశ్వర అనే బిరుదులు ఉన్నాయి.
– అదే సమయంలో ‘అల్లా ఉద్దిన్ హసన్ గంగూ బహ్మనీ షా’ బిరుదు లేదా జాఫర్‌ఖాన్ పేరుతో 1347లో ‘గుల్బర్గా’లో బహ్మనీ రాజ్య స్థాపనలో కాపయనాయకుడు సహాయం చేశాడు. సహాయం మర్చి విశ్వాసఘాతానికి పాల్పడ్డ హసన్ గంగూ చివరికి 1350లో ఓరుగల్లుపై దాడి చేశాడు.
#ఈ దాడిలో కాపయనాయకుడు ‘కౌలాస్’ (నిజామాబాద్) దుర్గాన్ని వదులుకున్నాడు. 1356 లో మరోసారి హసన్ గంగూ దాడి చేసి ‘భువనగిరి’ దుర్గాన్ని ఆక్రమించుకున్నాడు. బహ్మనీలకు భువనగిరి తూర్పు సరిహద్దు అయ్యింది. కాపయనాకుడు హసన్‌గంగూ దాడులను అరికట్టాలని విజయనగర రాజు బుక్కరాయల సాయం కోరాడు. అయినప్పటికీ తన కుమారుడు ‘వినాయక దేవుణ్ణి’ యుద్ధంలో కోల్పోవాల్సి వచ్చింది. దీంతో మల్లీ హసన్‌గంగూ రెండు సేనల నాయకత్వాన ‘మాయున్’ సేనానిగా గోల్కొండపైకి, సప్దర్ ఖాన్’ నాయకత్వాన ఓరుగల్లు పైకి దండయాత్రలకు పంపించాడు. కాపయనాయకుడు అన్నీ కోల్పోయి చివరికి బహ్మనీ సుల్తాన్‌తో సంధి చేసుకున్నాడు. ఈ సంధి ప్రకారం….
– 1. గోల్కొండ
– 2. ఓరుగల్లు దుర్గాలను సమర్పించాడు.
-3. 300 ఏనుగులు, 2000 గుర్రాలు, 3 లక్షల రూపాయలు యుద్ధ పరిహారంగా చెల్లించాడు.
#ఈ వరుస పరాజయాలను ఆసరాగా తీసుకుని తీరాంధ్ర రాజులు స్వతంత్రించారు. ఉత్తర తీరాంధ్ర ‘రెడ్డి’రాజుల ఆధీనంలోకి వెళ్లింది. తీరాంధ్ర చేజారిపోయే సమయంలో దక్షిణ తెలంగాణలో ఆమనగల్లు, పిల్లలమర్రి ప్రాంతాలను పాలిస్తున్న ‘రేచెర్ల సింగమనాయుడు’ విజృంభించి కృష్ణానది వరకు తన రాజ్యాన్ని విస్తరించడమే కాకుండా, కృష్ణా, తుంగ భద్ర అంతర్వేది ప్రాంతాలను కూడా ఆక్రమించాడు.
# సింగమనాయకుని తర్వాత రాజైన అనపోతనాయుడు తన తండ్రి మరణానికి కారకుడైన ‘కాపయ నాయకుని’పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఓరుగల్లు మీద ‘దండయాత్ర’ చేసి 1366లో కాపయ నాయకుని చంపి భువనగిరి, ఓరుగల్లు మొదలైన దుర్గాలను స్వాధీనం చేసున్నాడు. దీంతో ‘ముసునూరి’ వంశం అంతరించింది. దాదాపు 30 ఏండ్లు ఉత్తర తెలంగాణ ప్రాంతాలు ముసునూరి పాలనలో ఉన్నాయి.
రేచెర్ల పద్మ నాయకులు
# పద్మనాయక వంశానికి మూలం రేచెర్ల రెడ్లు. రేచెర్ల నామిరెడ్డి మేనల్లుడైన చెవ్విరెడ్డి (బేతాళ/భేతాళ రెడ్డి, బేతాళనాయకుడు) పద్మనాయక వంశానికి మూల పురుశుడు. వీరి పూర్వులు భేతిరెడ్డి, చెవ్విరెడ్డి మున్నగు నామములు. వీరిని ‘రెడ్డి’ తెగవారిగా సూచిస్తుండగా మధ్యకాలంలో ‘సేనా’ నాయకత్వం సూచించు ‘నాయుడు’ బిరుదును బట్టి వీరిని వేర్వేరుగా భావించుచున్నది. చెవ్విరెడ్డి వంశస్థులే ‘వైష్ణవ మతాన్ని స్వీకరించి సంస్కరణ మార్గంలో పయనించి ‘వెల్మ’లై రేచెర్ల పద్మనాయకులయ్యారు. రేచర్ల పద్మనాయకులు నల్లగొండ జిల్లాలోని పిల్లలమర్రి, నాగులపాడు ప్రాంతాలను ‘మహాసామంతులు’గా పాలించారు.
# కాకతీయ సామ్రాజ్య పతనానంతరం, ఢిల్లీ సుల్తానులను, బహ్మనీ సుల్తానులను అరికట్టి తెలంగాణను పాలించిన వారు రేచెర్ల పద్మనాయకులు. వీరు కొన్ని సందర్భాల్లో తెలంగాణేతర ప్రాంతాలను జయించినా కొంతకాలం తర్వాత వాటిని కోల్పోయారు. ‘ఆమనగల్లు’ వీరి జన్మస్థలం. రేచెర్ల రెడ్లకు, కందూరి చోడులకు ఆమనగల్లు మొదట రాజధాని. చెవ్విరెడ్డిని గణపతి దేవుడు ఆమనగల్లు పాలకుడిగా నియమించాడు. చెవ్విరెడ్డికి నలుగురు కుమారులు. వారిలో..
– 1. దామానాయుడు
– 2. ప్రసాదిత్యనాయుడు.
# తండ్రి రాజ్యాన్ని పాలిస్తుంగా వీరు రుద్రమదేవికి సేనానులుగా కాకతీయ రాజ్యంలో ప్రముఖ స్థానాన్ని పొందారు. రుద్రమదేవి రాజ్యానికి రాగా నే ఒక ‘స్త్రీ’ రాజుగా రావడం సహించక ఒకవైపు బంధువర్గం, మరోవైపు యాదవ రాజులు ఓరుగల్లుపై దండెత్తారు. ఈ సమయంలో ‘ప్రసాదిత్య నాయుడు’ ఈ చిక్కులను తొలగించి ఆమె అధికారాన్ని నిలబెట్టడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. ‘కాకతీయ రాజ్య స్థాపనాచార్య’, ‘రాయ పితామహాంక’ అనే బిరుదులు పొందాడు. కాకతీయ సామ్రాజ్య పరిరక్షణలో భాగంగా ‘నాయంకర’ వ్యవస్థను ప్రవేశపెట్టిన ఘతన ఇతనిదే.
#ప్రసాదిత్య నాయుడి కుమారుడు ‘వెన్నమ నాయకుడు’ ప్రతాపరుద్రుడి సేనానిగా ప్రసిద్ధ్దుడు. క్రీ.శ. 1303లో అల్లాఉద్దీన్ ఖిల్జీ కాకతీయ రాజ్యం పై చేసిన దండయాత్రను తిప్పికొట్టిన వారిలో ఇతడు ప్రముఖుడు. వెన్నమ నాయకుడి కొడుకు ‘ఎరదాచానాయకుడు’, సబ్బినాయుడు కొడుకు నలదాచానాయకుడు కూడా ప్రతాపరుద్రుని సేనానులే.
# కాకతీయులకు,పాండ్యరాజులకు(1326),హోయసాల రాజులతో జరిగిన యుద్ధాల్లో మిగతా సేనానులతో పాటు ‘ఎరదాచానాయకుడు’ కీలక పాత్ర వహించాడు. ఇతని పరాక్రమానికి మెచ్చి ఇతనికి ప్రతాపరుద్రుడు.
– 1. పంచపాండ్యదళ విభాళ.
– 2. పాండ్యగజకేసరి. అనే బిరుదులు ఇచ్చాడు.
#ఎరదాచానాయకుడి తర్వాత సింగమనాయకుడు (1326-61) రాజ్యానికి వచ్చాడు. ఇతడు ప్రసిద్ధుడు. తండ్రితోపాటు పాండ్య యుద్ధంలో పాల్గొని చిన్నతనంలోనే పరాక్రమం చూపించి ‘కంపిలి’ రాజ్యంతో జరిగిన యుద్ధంలో కూడా విజయం సాధించాడు.
#కాకతీయ రాజ్య పతనానంతరం ‘సింగమనాయకుడు’ స్వతంత్ర రా జ్యాన్ని స్థాపించాడు. ఆమనగల్లును రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. సింగమనాయకుని తర్వాత అతని కుమారులు అనపోతానాయుడు, మాదానాయుడు రాజులై జల్లిపల్లి, ఇనుగుర్తి కోటలను మట్టడించి క్షత్రీయులను చంపి పగ తీర్చుకున్నారు. కొందరు క్షత్రీయులు హుజూరాబాద్, మొలంగూర్ కోటలలో దాచుకోగా వారందరినీ చంపివేశారు. శ్రీశైల ప్రాంతాన్ని జయించి తమ రాజ్యంలో కలుపుకున్నారు. రెడ్డి రాజ్యంలో భాగమైన ‘ధరణి కోట’ను ముట్టడించి అనపోతా రెడ్డిని ఓడించారు. వెల్మ, రెడ్డి రాజ్యాల వైరం ఈ రాజ్యాల పతనం దాకా కొనసాగింది.
#క్షత్రీయులలో కొందరు భువనగిరి ప్రాంతానికి చేరి అనపోతానాయుడి శత్రువులను కలుపుకొని యుద్ధానికి సిద్ధంకాగా అనపోతానాయుడి భువనగిరి సమీపంలో మూసీ తీరంలో ఇంద్య్రాల వద్ద ఎదుర్కొని జయించాడు.
# ఈ విజయాల అనంతరం రాజధానిని ఆమనగల్లు నుంచి ‘రాచకొండ’కు మార్చినాడు. అనేక పర్వత పంక్తుల మధ్య ఉన్న ఈ దుర్గం అభేద్యం. రాజధానిని పునఃనిర్మాణం చేసి 1368లో ఓరుగల్లుపై దాడి చేశాడు. ఈ యుద్ధానంతరం ఓరుగల్లు వెల్మరాజుల వశమైనది.
# అనపోతానాయుడి తర్వాత ‘2వ సింగభూపాలుడు’ 1384లో రాచకొండలో సింహాసనం అధిష్టించగా అదే ఏడాది దేవరకొండలో పెద వేదగిరి నాయుడు అధికారంలోకి వచ్చాడు. సింగభూపాలుడు రాజ్యారంభకాలంలో విజయనగర రాజు 2వ హరిహర రాయలు రాచకొండ రాజ్యంలోని కొత్త కొండపై దండెత్తాడు. సింగభూపాలుడు యువరాజుగా ఉన్నప్పుడే ‘కళ్యాణి’ (గుల్బర్గా) దుర్గాన్ని ఆక్రమించాడు. అనేక యుద్ధ విద్యలో ఆరితేరినాడు. కాబట్టి విజయనగర రాజులను సైతం ఓడించాడు.
#అనంతరం సింగమభూపాలుడు కళింగ దేశాన్ని జయించడానికి వెళ్ళి ‘గోదావరి’ జిల్లాలో ఉన్న బెండపూడి, వేములకొండ ప్రాంతాలను జయించి 1387 లో ‘సింహాచలం’ క్షేత్రంలో శాసనం చెక్కించాడు.
#సింగభూపాలుడి తర్వాత వచ్చినవారు అసమర్దులై రాజ్యాన్ని కోల్పోయారు. అనంతరం వీరి వంశం అంతమయ్యింది.
-i. కోస్తాంధ్ర ప్రాంతాన్ని – కళింగ గజపతులు
-ii. తెలంగాణ ప్రాంతాన్ని – బహ్మనీలు ఆక్రమించారు.
డా౹౹ మురళి,
అసిస్టెంట్ ప్రొఫెసర్ నిజాం కళాశాల, హైదరాబాద్.
9701674383
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు