తెలంగాణ ఉద్యమంలో కవులు, రచయితలు
సురవరం ప్రతాపరెడ్డి
తెలంగాణ వైతాళికునిగా 1900 నుంచి మొదలైన తెలంగాణ సాంస్కృతిక, సామాజిక ఉద్యమ వికాసంలో కీలక పాత్ర వహించిన సురవరం ప్రతాపరెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా ఇటికాలపాడు గ్రామంలో1888లో జన్మించారు. తెలంగాణ సామాజిక, సాంస్కృతిక, సాహిత్య రంగాలకు సంబంధించి అనేక పరిశోధనాత్మక వ్యాసాలు వెలువరించారు. చిన్నప్పటి నుంచే స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని 1952లో జరిగిన ఎన్నికల్లో వనపర్తి నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1924లో ప్రారంభమైన గోల్కొండ పత్రికకు 25 ఏండ్ల పాటు సంపాదకునిగా వ్యవహరించారు. సాహిత్యానికి సంబంధించిన అన్ని ప్రక్రియల్లో రచనలు చేశారు. తెలుగు భాష సాహిత్య రంగాలకు ఆయన చేసిన సేవకు 1954లో కేంద్ర సాహిత్య అకాడమీ బమతి లభించింది. దీంతో ఈ బమతిని అందుకున్న తొలి తెలుగు రచయితగా ఈయన గుర్తింపు పొందారు.
దాశరథి కృష్ణమాచార్య
నిజాం పాలకులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ నినదించిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య. ఈయన 1938లో ఖమ్మం జిల్లా చినగూడూరు గ్రామంలో జన్మించారు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని జైలుకెళ్లారు. రజాకార్ల వ్యతిరేక పోరాటంలో పాల్గొంటూ అనేక సార్లు పోలీసు దాడులను ఎదుర్కొన్నారు. ఆనాటి హైదరాబాద్ రాష్ట్ర పాలనలో తెలంగాణ తల్లి భావనను విస్తృతంగా తన కవిత్వంతో ప్రచారం చేశారు. 1952లో మహాకవి కాళోజీ, సి. నారాయణరెడ్డిలతో కలిసి తెలంగాణ రచయితల సంఘాన్ని హైదరాబాద్‌లో స్థాపించారు.
బిరుదురాజు రామరాజు
ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షునిగా, ప్రొఫెసర్‌గా దేశంలోనే జానపద సాహిత్యం పరిశోధకుల్లో ఒకరికిగా వెలుగొందారు. ఈయన వరంగల్ జిల్లా మడికొండలో జన్మించారు. కాళోజీ కుటుంబానికి సన్నిహితులు. సురవరం ప్రతాపరెడ్డి శిష్యునిగా గర్వంగా చెప్పుకొని జీవితాంతం తెలంగాణ సమాజంపై రచనలు చేశారు. 17వ శతాబ్దంలో మెదక్ జిల్లా రైతాంగ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన రాజా సదాశివరెడ్డిపై 1950లో గొప్ప చారిత్రక నవల రాశారు. ఆ రోజుల్లో కాళోజి, సినారె, దాశరథిలతోపాటు తెలంగాణ రచయితల సంఘ ఉద్యమంలో పాల్గొన్నారు. మలిదశ ఉద్యమం ఆరంభంలో తెలంగాణ సాంస్కృతిక వేదిక సభలు, సమావేశాల్లో పాల్గొని ఉద్యమానికి నైతిక మద్దతు ఇచ్చారు.
సామల సదాశివ
ఉర్దూ సాహిత్యరంగం సొగసులను తెలంగాణకు పరిచయం చేసిన గొప్ప పండితుడు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఈయన బహుభాషావేత్త. చిన్నప్పుడు కుమ్రం భీం సంఘటనను చూసి చలించిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కుమ్రం భీంపై పాఠ్యపుస్తకాల్లో పాఠం పెట్టించడానికి పోరాటం చేశారు. దీంతో కుమ్రం భీం పాఠం పాఠశాల పుస్తకాల్లో చేరింది. ‘యాది’ పేరుతో తన ఆత్మకథను తెలంగాణ సమాజంలోని సామాన్యుల జీవితపు ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియజెప్పారు. మలిదశ ఉద్యమంలో ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన అనేక సభలు, సమావేశాల్లో పాల్గొని ఉద్యమించారు. కథలు, నవలలు, కవితలు వెలువరించారు.
సి నారాయణ రెడ్డి
తెలంగాణ నుంచి జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్న తొలి కవి. చిన్న రాష్ట్రం అన్న భావనతో స్ఫూర్తి పొంది తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 1950ల్లో కాళోజీ, దాశరథిలతోపాటు అభ్యుదయ కవితలు రాసి ‘తెలంగాణ అభ్యుదయ కవిత్రయం’లో ఒకరని ప్రఖ్యాత విమర్శకుడు కేవీ రమణారెడ్డితో ప్రశంసలు అందుకున్నారు. అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షునిగా పనిచేశారు. మానేరు రచయితల సంఘం, తెలంగాణ రచయితల వేదికల్లో పాల్గొన్నారు. పోతన కడప జిల్లాకు చెందిన కవి అన్నప్పుడు తెలంగాణ రచయితల వేదిక ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన ధర్నాకు నాయకత్వం వహించారు. తెలంగాణ గ్రామీణాన్ని చిత్రించిన కావ్యంగా ఆయన 1960ల్లో వెలువరించిన ‘ఋతుచక్రం’ పేరుగాంచింది. అనేకమంది ఉర్దూ కవుల కవితలు, సరోజినీ నాయడు ఆంగ్ల కవితలను తెలుగులోకి అనువాదం చేశారు. ఆయన రచనలన్నింటికీ మనిషి, తెలంగాణ సమాజం కేంద్ర భూమికగా ఉంటాయి. ఆంధ్ర సారస్వత పరిషత్తు పేరును తెలంగాణ సాహిత్య పరిషత్తుగా మార్చి సంచలనం సృష్టించారు.
కాళోజీ నారాయణ రావు
తెలంగాణ వారికి పరిచయం చేయాల్సిన అవసరం లేని గొప్ప కవి, ప్రజాకవి కాళోజి. జనం గొడవనే తన గొడవగా మార్చుకున్నారు. మలిదశ ఉద్యమానికి అనేక రకాలుగా చేయూతనిచ్చి అండగా నిలిచిన మహాకవి కాళోజీ నారాయణ రావు. 1989 నుంచి 2002లో ఆఖరి శ్వాస దాకా తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక ఉద్యమాలకు నైతిక మద్దతునిచ్చి అనేక సభల్లో పాల్గొని ప్రజలను చైతన్యపరచిన మహనీయుడు. 1914, సెప్టెంబర్ 9న కర్ణాటకలోని బీజాపూర్ జిల్లా రట్టిహళ్లి గ్రామంలో జన్మించారు. జీవితమంతా తెలంగాణ ప్రజల సాహిత్య, సాంస్కృతిక వికాసం కోసం పనిచేశారు. 2002, నవంబర్ 13న మరణించారు. తెలంగాణ ఆధునిక కవితా రచనకు కాళోజీ ఆద్యునిగా పేరుగాంచారు. 1953లో ఆయన వెలువరించిన ‘నా గొడవ’ సంకలనం విశిష్ట సంకలనంగా పేరుగాంచింది. 1969లో తెలంగాణపై విషం కక్కుతూ ఆంధ్ర కవులు రాసిన కవితలకు దీటైన జవాబును కవితల ద్వారానే వెల్లడించారు. సెప్టెంబర్ 9న ఈయన జన్మదినం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ మాండలిక దినోత్సవంగా నిర్వహిస్తుంది. 1992లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్‌తో సత్కరించింది.
దేశపతి శ్రీనివాస్
మెదక్ జిల్లా సిద్దిపేట కేంద్రంగా 1980ల మధ్యలో మొదలైన మంజీర రచయితల సంఘం (మరసం) నడిపిన కవితా ఉద్యమంలో పాల్గొని మలిదశ ఉద్యమంలో ఎదిగివచ్చిన గాయకుడు, గొప్ప వ్యక్తి, వాగ్గేయకారుడు దేశపతి. ఉద్యమం ఆరంభం నుంచే సిద్దిపేటతో సహా తెలంగాణలోని అన్ని పట్టణాల్లో జరిగిన సభలు, సమావేశాల్లో పాల్గొని ప్రచారం చేశారు. తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక రంగాల గురించి వివరించారు. ఉద్యమకాలంలో దేశపతి ప్రసంగాలను కేసీఆర్, జయశంకర్ సార్ బాగా ఇష్టపడేవారు.
ముదిగంటి సుజాత రెడ్డి
సంస్కృత పండితురాలైన ఈమె ప్రొఫెసర్‌గా, కథా నవలా రచయితగా ప్రసిద్ధురాలు. తెలంగాణ సాస్కృతిక వేదిక, ఇతర సంస్థలు నిర్వహించిన సభల్లో క్రియాశీలంగా పాల్గొన్నారు. 1997 తర్వాత తెలంగాణ సాంస్కృతిక వేదిక మొదలుపెట్టారు. తెలంగాణ ఆత్మగౌరవ ఉద్యమంలో భాగంగా తెలంగాణలో సాహిత్యం లేదు అన్న ఆంధ్ర అహంకారులకు జవాబుగా 1900 నుంచి 1956 వరకు వెలుగు చూసిన గొప్ప గొప్ప కథలను కూర్చి వాటిని సేకరించి, పరిశోధించి ‘తెలంగాణ తొలి తరం కథలు, మలితరం కథలు’ పేరుతో రెండు సంపుటాలను వెలువరించి తెలంగాణ ఆధునిక వికాసపు చరిత్రకు దోహదపడ్డారు. ఆ తర్వాత ఆళ్వార్ స్వామి కథల సంపుటి ‘జైలు’ను సేకరించి ప్రచురించారు. ఇంతేకాకుండా తెలంగాణకు సరైన ప్రాతినిథ్యమిస్తూ తెలంగాణ సాహితీ చరిత్రను తిరగ రాశారు.
అందెశ్రీ
‘మాయమై పోతున్నడమ్మా.. మనిషన్నవాడు మచ్చుకైనా లేడు సూడు మానవత్వమున్నవాడు’ అనే గీతాన్ని రచించిన అందెశ్రీ జయ జయహే తెలంగాణ అంటూ గీతాన్ని రాశారు. నిరక్షర జీవనరీతిలో పుట్టి అక్షరాలను ఆయుధంగా మలిచిన తెలంగాణ మహాకవి అందెశ్రీ. సమకాలీన చరిత్ర మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని కవిగా నడిపించారు. కాకతీయ యూనివర్సిటీ ఈయనకు డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.
గద్దర్
మలిదశ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలికిన గద్దర్. అమ్మా తెలంగాణమా.. ఆకలికేకల గానమా అంటూ ఈ నేల విశిష్టతను కవిత్వీకరించి తెలంగాణ సమాజాన్ని సానుకూల దృష్టితో చూసిన గద్దర్, తెలంగాణ భాషను, సంస్కృతిని, విప్లవ సంప్రదాయాలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేసి తెలంగాణకు గుర్తింపు తెచ్చారు. 2010, అక్టోబర్ 9న వేదకుమార్, ఆకుల భూమయ్యతో కలిసి తెలంగాణ ప్రజాఫ్రంట్‌ను స్థాపించారు. తన కళ, కవితా రచనతో, గానంతో ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా.. పోరు తెలంగాణమా’ అని పాడుతూ మలిదశ ఉద్యమాన్ని తెలంగాణ ఏర్పడేవరకు అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా నిలబెట్టారు. తెలంగాణ జన జీవితాన్ని తన పాటలతో, ఆటతో ప్రభావితం చేసిన గొప్ప తెలంగాణ బిడ్డ గద్దర్.
యశోదారెడ్డి
జీవితాంతం తెలంగాణ భాష సొగసుల కోసం తపించి అనేక కథలు రాసిన గొప్ప రచయిత్రి యశోదారెడ్డి. తెలంగాణ సంస్కృతి విశిష్టమైనదనే ఎరుకతో జీవితాంతం దాని ప్రచారానికి కట్టుబడ్డ మహనీయురాలు. 1997లో తెలంగాణ సాంస్కృతిక వేదికను ప్రారంభించి స్థానిక సాహిత్య రంగాల మలుపునకు స్ఫూర్తిగా నిలిచారు. తెలంగాణ భాషలో ఈమె రచించిన ‘ఎచ్చమ్మ ముచ్చట్లు, మా ఊరి కథలు’ తెలుగు భాష విశిష్టతకు గీటురాయిగా నిలుస్తాయి. 1952లో ఏర్పడ్డ తెలంగాణ రచయితల సంఘంలో చేరిన యశోదారెడ్డి ‘భావిక, ఉగాదుల ఊయల’ పేరుతో రెండు కవితా సంపుటాలు ప్రచురించారు. జీవితాంతం పేదల పక్షం వహించి ప్రగతిశీల భావాలకు పట్టుకట్టి సమకాలీన పురుష ప్రపంచంపై తిరుగుబాటు ప్రకటించిన వీరనారి యశోదారెడ్డి.
సుద్దాల హనుమంతు
19వ శతాబ్దపు మధ్యకాలంలో పేరొందిన రచయితల్లో ఒకరు. ఈయన రచనలు మొత్తం వెట్టిచాకిరీ, భూస్వాములు, స్వేచ్ఛ, సమానత్వం, కమ్యూనిజాలకు సంబంధించినవి. ఈయన పాటల్లో ఎక్కువ ప్రాచుర్యం పొందిన పాట ‘పల్లెటూరి పిల్లగాడ పసుల కాసే మొనగాడ’. ఈ పాట మా భూమి సినిమాలో కూడా పెట్టారు. వీరి రచనలు.. గొల్ల సుద్దులు, రాజకీయ సాధు వేశాలు, వీర తెలంగాణ యక్షగానం.
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కోరుట్ల
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు