గోదావరిపై ప్రాజెక్టులకు ప్రణాళికలు.. (తెలంగాణ ఉద్యమ చరిత్ర)
తుంగభద్ర ప్రాజెక్టు
# 20వ శతాబ్దం ప్రారంభంలో హైదరాబాద్ ప్రభుత్వ చీఫ్ ఇంజినీర్ రోజ్ అలెన్ , 1930లో నవాబ్ అలీ నవాజ్ జంగ్ మద్రాసు ప్రభుత్వంతో జరిపిన చర్చల ఫలితంగా తుంగభద్ర, కృష్ణా నదులపై జాయింట్ ప్రాజెక్టుల నిర్మాణాలకు సర్వే జరపాలని నిర్ణయించారు. మద్రాసు ప్రభుత్వం తుంగభద్ర ప్రాజెక్టు, కృష్ణానదిపై పులిచింతల (భారీ స్థాయిలో) ప్రాజెక్టులను నిర్మించాలని, నీటిని సమాన నిష్పత్తిలో పంచుకోవాలని ప్రతిపాదించింది. నిజాం ప్రభుత్వం ఇప్పటికే కృష్ణానదిపై తాము ఏలేశ్వరం (నాగార్జున సాగర్ ముంపునకు గురైన గ్రామం) ఎగువన ప్రాజెక్టు కోసం సర్వే పూర్తయిందని పులిచింతలకు అభ్యంతరం తెలిపింది. కృష్ణానది దిగువన, ఎగువన ప్రాజెక్టుల కోసం సర్వే చేయాలని 1930, అక్టోబర్ 27న జరిగిన చర్చల్లో నిర్ణయించారు.
# 1933, ఫిబ్రవరిలో మల్లాపురం వద్ద తుంగభద్ర డ్యాం నిర్మాణానికి బొంబాయి, మైసూరు, మద్రాసు, హైదరాబాద్ (కృష్ణానది ప్రవహించే రాష్ట్రాలు) ప్రభుత్వాలు ఒక స్థూలమైన అవగాహనకు వచ్చాయి. 1944, జూన్ 24-26 వరకు ఆయా ప్రభుత్వాల ప్రతినిధుల మధ్య కుదిరిన అవగాహన ప్రకారం 1944, ఫిబ్రవరి 28న తుంగభద్ర బరాజ్ పునాదిరాయి పడింది. 1946, అక్టోబర్ 16న మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మద్రాసు-మైసూరు, మద్రాసు-హైదరాబాద్ ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందాలను ఆమోదించింది. దానికి పూర్వం 1938లోనే రాజోలిబండ ప్రాజెక్టు గురించి మద్రాసు, హైదరాబాద్ ప్రభుత్వాల మధ్య స్థూలంగా అంగీకారం కుదిరింది. కడప, కర్నూలు కాలువ (మద్రాసు రాష్ట్రంలోనిది) స్థాయిహోదా రాజోలిబండకు ఇవ్వాలని హైదరాబాద్ ప్రభుత్వం మద్రాసు సర్కార్ ను డిమాండ్ చేసింది. నదిలో 336 టీఎంసీల నీరు లభ్యమవుతున్నదని అంచనా వేసి ఈ రెండు ప్రాజెక్టులకు 65 టీఎంసీల చొప్పున వాడుకోవడానికి మద్రాసు ప్రభుత్వం అంగీకరించింది.
# తుంగభద్ర డ్యాం 1955-56లో పూర్తికాగా, కాల్వల నిర్మాణం 1958లో పూర్తయ్యాయి. హైదరాబాద్ సంస్థానంలోని రాయచూర్ , మహబూబ్ నగర్ జిల్లాలో తుంగభద్ర ప్రాజెక్టు కాలువల కింద 1958 నుంచి ఆయకట్టుకు సాగునీరు అందుబాటులోకి వచ్చింది. రాజోలిబండ ప్రాజెక్టుకు కేటాయించిన సాగునీటి విషయంలో కర్నూలు, మహబూబ్ నరగ్ రైతుల మధ్య ఘర్షణలు 21వ శతాబ్దంలో కూడా కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ భారత యూనియన్ లో కలిసిన తర్వాత 1956 నవంబర్ 1న జరిగిన విభజన ఫలితంగా పూర్వపు హైదరాబాద్ సంస్థానంలోని రాయచూర్ జిల్లా కర్ణాటకలో, మద్రాసు రాష్ట్రంలోని రాయలసీమ జిల్లాలు ఆంధప్రదేశ్ లో భాగంగా మారాయి. రాజోలిబండ డైవర్షన్ ఆనకట్ట, తూములు కర్ణాటకలో భాగమయ్యాయి. ఈ కాలువ ప్రారంభంలో ఏడు గ్రామాలు కర్ణాటకలో ఉన్నాయి. కడప, కర్నూలు కాలువకు అధిక నీటిని మళ్లించుకుపోతున్న కర్నూలు రైతులు మహబూబ్ నగర్ కు ఈ కాల్వ ద్వారా రావలసిన నీటిని తరచూ అడ్డుకుంటూనే ఉన్నారు.
అప్పర్ మానేరు
# నవాబ్ అలీ నవాజ్ జంగ్ సలహాపై ఖాజా అజీముద్దీన్ అనే ఇంజినీర్ మానేరు నదిపై ప్రాజెక్టు నిర్మాణానికి సర్వే చేసి 1923లో అప్పర్ మానేరు ప్రాజెక్టు నివేదికను తయారు చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం 1945లో మొదలై 1952లో పూర్తయ్యింది. ఈ ప్రాజెక్టు ద్వారా 17,680 ఎకరాలకు సాగునీరివ్వాలని ప్రణాళిక రూపొందించింది. అదేవిధంగా 1400 హెచ్ పీ విద్యుదుత్పత్తికి కూడా అవకాశం ఉందని భావించినా తర్వాత ఆ ప్రతిపాదన ఆచరణలోకి రాలేదు. కడలేరు వాగు మానేరులో కలిసే స్థలం కామారెడ్డికి 18 మైళ్లదూరంలోని నర్మాల గ్రామం వద్ద సిరిసిల్ల తాలూకా, కరీంనగర్ జిల్లాలో ఈ ప్రాజెక్టును నిర్మించారు. దీని ప్రధాన కాలువ 17 మైళ్లు ప్రవహిస్తే దారిలో ఉన్న అనేక చెరువులతో అనుసంధానం చేశారు.
గోదావరి పారిశ్రామిక, వ్యవసాయ అభివృద్ధి ప్రణాళిక
# తెలంగాణలో గోదావరి నదీ జలాలతో వ్యవసాయాన్ని, విద్యుచ్ఛక్తిని అభివృద్ధి చేసే ప్రణాళికను ఈడబ్ల్యూ స్లాటర్ కమిటీ 1944లో నిజాం ప్రభుత్వానికి సమర్పించింది. ఈ ప్రణాళిక గోదావరి నదిపై రెండు అతిపెద్ద ప్రాజెక్టులను నిర్మించాలని సూచించింది.
ఇచ్చంపల్లి ప్రాజెక్టు
# 1858లోనే గోదావరిపై ఇచ్చంపల్లి నిర్మాణానికి పునాదులు పడ్డాయి. అనారోగ్యంతో వైద్య సదుపాయం అందక ఇంజినీర్లు మరణించడంతో ప్రాజెక్టు పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఇంద్రావతి నది గోదావరిలో కలిసే సంగమ స్థానానికి 10 మైళ్ల దిగువన ఇచ్చంపల్లి ప్రాజెక్టు స్థలాన్ని ఎంపిక చేశారు. ఐదో నిజాం పాలనలో మొదటి సాలార్ జంగ్ సముద్ర మట్టానికి 136 మీటర్ల ఎత్తుతో ఇచ్చంపల్లిని నిర్మించాలని 1858లో నిర్ణయించారు. సుమారు రెండువందల టీఎంసీల నీటిని నిల్వచేసి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని సాలార్ జంగ్ భావించారు. ఏడో నిజాం 1947లో ఇచ్చంపల్లి నిర్మాణాన్ని చేపట్టే అంశాన్ని తన ప్రభుత్వంలోని ఇంజినీర్లతో చర్చించారు. ఈడబ్ల్యూ స్లాటర్ నివేదిక ప్రకారం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలని మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిర్ణయించారు. 1947లో ఏడో నిజాం ఇచ్చంపల్లి ప్రాజెక్టును సముద్ర మట్టానికి 370 అడుగుల ఎత్తులో 295 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించాలనుకున్నారు. దీనివల్ల ముంపునకు గురయ్యే ప్రాంతం 350 చ.మైళ్లుగా అంచనా వేశారు. ఈ ముంపు ప్రాంతం 120 చ.మైళ్లు సెంట్రల్ ప్రావిన్స్‌లో, 60 చ.మై. బస్తర్ సంస్థానంలో, 170 చ.మై. హైదరాబాద్ సంస్థానంలో ఉన్నది. పొరుగు రాష్ట్రాల పాలకులతో ఇచ్చంపల్లి ముంపు గురించి చర్చించాలని నిజాం నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 1,50,000 నుంచి 2 లక్షల కిలోవాట్ల విద్యుచ్ఛక్తి ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా సంప్రదింపులు జరుగుతుండగానే నిజాం పాలన అంతమైంది.
వెల్లోడి కృషి
# కేంద్ర ప్రభుత్వం 1951, జూలై 27, 28 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించిన కృష్ణా, గోదావరి పరీవాహక రాష్ట్రాల సమావేశానికి హైదరాబాద్ ముఖ్యమంత్రి వెల్లోడి హాజరై ఇతర ప్రాజెక్టులతోపాటు ఇచ్చంపల్లికి కూడా అనుమతి సాధించారు. 350 టీఎంసీల నీటిని ఇచ్చంపల్లి ద్వారా వినియోగించుకోవచ్చని సమావేశంలో పాల్గొన్న సంబంధిత రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం అంగీకరించి అధికారికంగా నీటి కేటాయింపులు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత 1958లో అప్పటి ప్రభుత్వం ఇచ్చంపల్లి ప్రాజెక్టును 118.87 మీ. ఎత్తులో 550 టీఎంసీల నీటి సామర్థ్యంతో రిజర్వాయర్ ను నిర్మించాలని అంతకుముందున్న ప్రతిపాదనలను సవరించింది. కానీ ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు.
గోదావరి బళార్థసాధక ప్రాజెక్టు
# 1942లో అలీ నవాజ్ జంగ్ మార్గదర్శకత్వంలో సూపరింటెండెంట్ ఇంజినీర్ అబ్దుల్ ఖయ్యూంఖాన్ గోదావరి ప్రాజెక్టు ప్రణాళికను రూపొందించారు.
# నాందేడ్ కు 40 మైళ్ల దిగువన కవాల్ గూడ వద్ద గోదావరిపై 94 టీఎంసీల రిజర్వాయర్ నిర్మాణం.
# ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లోని కృష్ణాపురం వద్ద ఈ రిజర్వాయర్ కు 50 మైళ్ల దిగువన గోదావరిపై 55 టీఎంసీల రిజర్వాయర్
# కృష్ణాపురం డ్యాంకు కుడి పక్కన 166 మైళ్ల పొడవైన ఉత్తర కాలువ ద్వారా హన్మకొండ, ఆ తర్వాత కృష్ణా, గోదావరి లోయలో మొత్తం 21.5 లక్షల ఎకరాల సాగు
# కృష్ణాపురం ఎడమకాలువ పెద్దూరు రిజర్వాయర్ (కడెం నది గోదావరిలో కలిసే చోట) వరకు 84 వేల ఎకరాల సాగుకు, విద్యుచ్ఛక్తి ఉత్పాదన
# పెద్దూరు రిజర్వాయర్ నుంచి గోదావరికి ఉత్తరం వైపు చెన్నూరు (ఆదిలాబాద్ ) వరకు కాలువ నిర్మాణం. దీని ద్వారా 5,60,000ల ఎకరాల సాగు.
# నాందేడ్ జిల్లాలో కవాల్ గూడ రిజర్వాయర్ నుంచి ఎడమ కాలువ ద్వారా లక్ష ఎకరాలు (ఈ ఆయకట్లు ప్రాంతం 1956 తర్వాత మహారాష్ట్రలో కలిసింది).
# ఈ గోదావరి బళార్థసాధక ప్రాజెక్టు ద్వారా సుమారు 28 లక్షల ఎకరాలకు తెలంగాణలోని నిజామాబాద్ , ఆదిలాబాద్ , కరింనగర్ , వరంగల్ , ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో సాగునీరందించాలని నిజాం ప్రభుత్వం సంకల్పించింది. ఈ ప్రాజెక్టుకు 350 టీఎంసీల నీరు అవసరమవుతుందని భావించారు.
కడెం ప్రాజెక్టు
# ప్రతిపాదిత గోదావరి బళార్థసాధక ప్రాజెక్టు ఉత్తర కాలువ నిర్మాణంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ , లక్సెట్టిపేట తాలూకాలోని 135 గ్రామాలకు చెందిన 26,325 హెక్టార్ల ఆయకట్టుకు (ముందుగా అనుకున్నది 91,935 హెక్టార్లు) సాగునీరందించాలనే సంకల్పంతో కడెం నది (గోదావరి ఉపనది) పెద్దూరు (ఖానాపూర్ తాలూకా) వద్ద ప్రాజెక్టు నిర్మించాలని నిజాం ప్రభుత్వం భావించగా పోలీసు చర్య తర్వాత 1949లో నిర్మాణం మొదలై 1955లో పూర్తయ్యింది. 26,325 హెక్టార్లకు సాగునీరు అందించాలనే లక్ష్యం కాగా, ప్రాజెక్టు నిర్మాణంలో లోపాల వల్ల 1958లో ఉదృతంగా వచ్చిన వరదల వల్ల డ్యాం ధ్వంసమైంది. పునర్నిర్మాణం తర్వాత కడెం ఆయకట్టు బాగా తగ్గింది. 1942లో నిజాం ప్రభుత్వం గోదావరి జలాలతో తెలంగాణ ప్రాంతాన్ని బహుముఖాలుగా అభివృద్ధి చేయాలని భావించి ఈడబ్ల్యూ స్లాటర్ చైర్మన్ గా ఒక కమిటీని నియమించింది.
,
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కోరుట్ల
9492 575 006
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు