పత్రికలు.. చైతన్య దీపికలు ( తెలంగాణ హిస్టరీ)
– హితబోధిని పత్రిక మహబూబ్నగర్లో సరోజిని విలాస్ ముద్రాక్షరశాలలో మాసపత్రికగా వెలువడింది. సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, వ్యవసాయక విషయాలపై హితబోధినిలో అనేక వ్యాసాలు వెలువడినాయి. అంతేకాకుండా వైద్యం, పారిశ్రామిక, వైజ్ఞానిక అంశాల్ని ప్రచురించి నూతన చైతన్యానికి నాంది పలికింది. దివ్యజ్ఞాన సమాజం తరఫున స్వామి వెంకటరావు సంపాదకత్వంలో 1917లో ‘ఆంధ్రమాత’ ప్రచురితమైంది. ఆ తరువాత 1920లో ఖమ్మం కేంద్రంగా ‘ములాగ్ వర్తమాన’ అనే కైస్తవ పత్రిక, సువార్త మణి అనే మరో పత్రిక 1921లో మహబూబ్నగర్ నుంచి వెలువడినాయి. ఈ మూడు పత్రికలు మత, ఆధ్యాత్మిక అంశాలకు ప్రాధాన్యతనిచ్చాయి.
1) నీలగిరి పత్రికను షబ్నవీసు వెంటక రామనరసింహారావు 1922, ఆగస్ట్ 24న స్థాపించారు. దీనిలో రచనలు చేసిన కొందరు ప్రముఖులు.. కే రాములు, గంగుల శాయిరెడ్డి, గవ్వా అమృతారెడ్డి, శేషభట్టర్ రామానుజాచార్యులు, కంభంపాటి సత్యనారాయణ, ముదిగొండ బుచ్చిలింగయ్య శాస్త్రి, కోదాటి రామకృష్ణారావు, ముదిగొండ శంకర శాస్త్రి, ఆదిరాజు వీరభద్రరావు. ఇది సంపాదకీయం రాసిన తొలి తెలంగాణ పత్రిక. సంస్కారిణి అనే గ్రంథమాలను షబ్నవీసు స్థాపించారు. ఆయన బాలికా విలాపం అనే కావ్యాన్ని రచించారు. నీలగిరి పత్రిక 1922-27 సంవత్సరాల మధ్యకాలంలో వారపత్రికగా వెలువడింది.
2) తొలిదశ తెలంగాణ పత్రికా రంగంలో వరంగల్ జిల్లా, మహబూబాబాద్ తాలూకా ఇనుగుర్తి గ్రామం నుంచి 1922లో వెలువడిన ‘తెనుగు’ పత్రిక చెప్పుకోదగినది. దానికి ఒద్దిరాజు రంగారావు, ఒద్దిరాజు సీతారామచంద్రరావు సోదరులు సంపాదకులు. 1922, ఆగస్ట్ 27 దీని తొలి ప్రచురణ. ఇది వారపత్రిక. ప్రతి ఆదివారం వెలువడింది. సంపాదకులు విజ్ఞాన ప్రచారిణి గ్రంథమాలను స్థాపించారు. తొలుత మహిళల రచనలు ప్రచురించిన పత్రిక ఇది. చట్రాది లక్ష్మీనరసమాంబ, పందిటి సత్యవతీబాయి, పాపమ్మ వంటి కవయిత్రులు, రచయిత్రుల రచనల్ని ప్రచురించింది.
-ఈ పత్రిక ఆంధ్రజన సంఘం కార్యక్రమాలు, వార్తలను విస్తృతంగా ప్రచారం చేసింది. రాజకీయ, సామాజిక, సాహితీ, సాంస్కృతిక, భాషా విజ్ఞానాలకు సంబంధించిన వ్యాసాలు కూడా ప్రచురించింది. 1920 దశకంలో సామాజిక, సాంస్కృతిక, రాజకీయ చైతన్యాన్ని పెంపొందించడంలో నీలగిరి, తెనుగు పత్రికలు విశేష కృషి చేశాయి.
3) తెలంగాణలో అత్యంత ఆదరణ పొందిన గోలకొండ పత్రికను 1926లో స్థాపించారు. తొలి సంచిక 1926, మే 10న వెలువడింది. ఇది ద్వైవారపత్రిక (బుధ, ఆదివారాలు)గా ప్రారంభమైంది. రాజబహదూర్ వెంకట రామిరెడ్డి ఈ పత్రిక స్థాపనకు సహాయపడినారు. పత్రిక నిర్వాహక సంపాదకుడిగా సురవరం ప్రతాపరెడ్డి పనిచేశారు. గద్వాల, జటప్రోలు, వనపర్తి, దోమకొండ సంస్థానాధీశులు ప్రచురణకు సహకరించారు.
-బొంగులూరి నరసింహశర్మ, వేంకట రాజన్న అవధాని, కోదాటి నారాయణరావు, వట్టి ఆళ్వారుస్వామి, భాస్కరభట్ల కృష్ణారావు, దేవులపల్లి రామానుజారావు, వెల్దుర్తి మాణిక్యరావు లాంటివారు వివిధ సందర్భాల్లో సహాయ సంపాదకులుగా పనిచేశారు. గోలకొండ పత్రిక తెలంగాణ సాహితీవేత్తలకు ప్రోత్సాహం ఇచ్చింది. అంతేకాక సమకాలీన రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక అంశాలను ప్రచురించి అనేక ఉద్యమాలకు ప్రోత్సాహాన్నిచ్చింది. 1947, ఆగస్ట్ 11 నుంచి ఇది దినపత్రికగా మారింది.
4) నీలగిరి, తెనుగు పత్రికలు నిలిపివేసిన తరువాత 1927లో హైదరాబాద్ నుంచి సుజాత అనే మాసపత్రిక వెలువడింది. పసుమాముల నరసింహశర్మ, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి లాంటి ప్రముఖుల ప్రోత్సాహంతో ఈ పత్రికను స్థాపించారు. ఈ పత్రికలో ప్రధానంగా చారిత్రక, వాజ్ఞయ, సాహిత్య వ్యాసాలు ప్రచురితమయ్యాయి. ఆ నాటి ప్రముఖ సాహితీవేత్తలైన ఆదిరాజు వీరభద్రరావు, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి రాసిన వ్యాసాలను ఈ పత్రికలో ప్రచురించారు.
5) తెలంగాణ ప్రాంతంలో 20వ శతాబ్దం మొదటి దశకంలో ప్రారంభమైన ఆదిహిందూ ఉద్యమం దళితుల అభ్యున్నతికి పాటుపడింది. ఆనాటి ప్రముఖ దళిత నాయకుడు భాగ్యరెడ్డి వర్మ భాగ్యనగర్ పత్రికను స్థాపించారు. ఇది 1931లో పక్షపత్రికగా వెలువడింది. ఈ పత్రికలో ప్రధానంగా అణగారిన దళితవర్గాల సమస్యలు, వారి విముక్తికి సంబంధించిన వార్తలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. దీంతో పాటు ఆదిహిందూ అనే మాసపత్రికను 1934లో ప్రారంభించారు.
lతెలంగాణలో తొలితరం దళిత ఉద్యమకారులు, నాయకులు ఈ పత్రిక వ్యాసాల ద్వారా ఉత్తేజం పొంది సంఘ సంస్కరణ ఉద్యమాల్లో చురుకైన పాత్ర నిర్వహించారు. భాగ్యరెడ్డి వర్మ స్థాపించిన మన్య సంఘం కార్యదర్శి జేఎస్ ముత్తయ్య ఇంగ్లిష్లో ‘ది పంచమ’ అనే మాసపత్రికను ప్రారంభించారు. ఇది దళితుల సమస్యల్ని విశ్లేషించి, వారిలో నూతన చైతన్యం, అస్థిత్వం, ఆత్మగౌరవం పెంపొందడానికి కృషిచేసింది.
6) తెలుగువాడైన మందుముల నర్సింగరావు ‘రయ్యత్’ అనే ఉర్దూ పత్రికను స్థాపించారు. హైదరాబాద్ రాజ్యంలో సాంఘిక, ఆర్థిక, రాజకీయ, పాలనా అంశాల్ని బయటి ప్రపంచానికి తెలియజేయడంలో ఈ పత్రిక పోషించిన పాత్ర చెప్పుకోదగింది. నిజాం రాజ్యంలో పౌర హక్కులు, ప్రజాస్వామ్య, బాధ్యతాయుత ప్రభుత్వ స్థాపన జరగాలని ప్రచారం చేసింది. అంతేకాకుండా ప్రభుత్వ విధానాలను విమర్శనాత్మకంగా వివరించింది.
-రయ్యత్ హైదరాబాద్ రాజ్యంలో మతవైషమ్యాలను పోషిస్తున్న మత సంస్థల కార్యకలాపాలను కూడా విమర్శించింది. 1947లో షోయబుల్లాఖాన్ సంపాదకత్వం వహించిన ‘ఇమ్రోజ్’ పత్రిక కూడా రజాకార్ల కార్యకలాపాలు, దురాగతాలను విమర్శించింది. దీంతో ఆయనను రజాకార్లు హత్య చేశారు.
-బూర్గుల రామకృష్ణారావు సంఘ సంస్కర్త, రాజకీయవేత్త, సాహితీవేత్తగా పేరొందారు. బభాషా పండితుడు అయిన బూర్గుల ‘సారస్వత వ్యాస ముక్తావళి’ పేరుతో రచించిన వ్యాసాలు ఎంతో గుర్తింపు పొందాయి. శంకరాచార్యుల కనకధారాస్తవంతో పాటు పండితరాజ పంచామృతం, కృష్ణ శతకం తదితర రచనలు చేశారు. దాశరథి వంటి మహాకవుల కావ్యాలకు పీఠికలు రాశారు బూర్గుల.
– ఆ తరువాత ‘అభినవ పోతన’గా పేరొందిన వానమామలై వరదాచార్య రచించిన ‘పోతన చరితము’ ప్రసిద్ధ కావ్యం. మాడపాటి హనుమంతరావు రచించిన ‘తెలంగాణ ఆంధ్రోద్యమము’ ఆనాటి సామాజిక, రాజకీయ ఉద్యమాలను తెలియజేస్తుంది. 1930 దశకంలో ఏర్పడిన సాహిత్య సంస్థల్లో చెప్పుకోదగినది అంబటిపూడి వెంకటరత్నం నల్లగొండలో స్థాపించిన ‘సాహితీ మేఖల’. 1939లో సాధన సమితి అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ స్థాపకుల్లో బూర్గుల రంగనాథరావు, వెల్దుర్తి మాణిక్యరావు, జమ్మలమడక సూర్యప్రకాశరావు, ఎంఎన్ రాజలింగం ముఖ్యులు. ఈ సంస్థ అనేకమంది యువ రచయితలను ప్రోత్సహించడంతో వివిధ సాహితీ ప్రక్రియల్లో అంటే కథలు, గేయాలు, నవలలు రచించారు. ఈ సంస్థ దేవులపల్లి రామానుజారావు రచించిన ‘నవ్య కవితా నీరాజనం’, బూర్గుల రంగనాథరావు రచించిన కథానికల్ని ప్రచురించింది.
– 1930-40 దశకంలో అభ్యుదయ సామ్యవాద వామపక్ష భావాల ద్వారా ప్రభావితమైన అనేకమంది యువ రచయితలు తెలంగాణలో నూతన సాహిత్యోద్యమానికి అంకురార్పణ చేశారు.
– తెలంగాణ సామాజిక నేపథ్యం, రాచరిక నిరంకుశత్వంపై నిరసన, భూస్వామ్య దౌర్జన్యాల్ని రూపుమాపాలన్న ఆశయం తెలంగాణ ఆధునిక సాహిత్యానికి స్ఫూర్తినిచ్చాయి. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో రైతుల స్థితిగతులు, భూస్వామ్య దోపిడీ, కౌలు పద్ధతి, వెట్టి చాకిరీ లాంటి సామాజిక అంశాల్ని స్పృశిస్తూ అనేక రచనలు చేశారు.
-ఆర్యసమాజ్ ఉద్యమం, గ్రంథాలయ ఉద్యమం, ఆంధ్రమహాసభ ఉద్యమం నేపథ్యంలో వామపక్ష సాహిత్యం వెలువడిందని చెప్పవచ్చు. తెలంగాణ రైతాంగ పోరాటం నేపథ్యంలో దాశరథి సోదరుల రచనలు ప్రసిద్ధిచెందాయి. వాటిలో దాశరథి రంగాచార్య రచించిన ‘చిల్లరదేవుళ్లు’, దాశరథి కృష్ణమాచార్య రచించిన ‘అగ్నిధార, రుద్రవీణ’ ముఖ్యమైనవి.
– తెలంగాణ ‘గోర్కి’గా ప్రసిద్ధిచెందిన వట్టికోట ఆళ్వారుస్వామి రచించిన ‘గంగు, ప్రజల మనిషి’ తెలంగాణ అభ్యుదయ సాహిత్యానికి ప్రతీకలుగా చెప్పవచ్చు. 1940లో కాళోజీ నారాయణరావు, రావెళ్ల వెంకటరామారావు లాంటి వారి రచనలు తెలంగాణ సాహిత్య నూతన పోకడలను తెలియజేస్తాయి.
– తెలంగాణ భాషా సాహిత్యాల అభివృద్ధి కోసం ఆంధ్ర మహాభాషోద్యమంలో పాల్గొన్న పలువురు నాయకులు 1943లో నిజాం ఆంధ్ర సారస్వత పరిషత్ అనే రాజకీయేతర సంస్థను స్థాపించారు. ఇది 1949 నుంచి ఆంధ్ర సారస్వత పరిషత్గా మారింది. ఈ సంస్థ స్థాపనకు లోకానంది శంకరనారాయణ రావు, బూర్గుల రంగనాథరావు, భాస్కరభట్ల కృష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు, దేవులపల్లి రామానుజారావు ముఖ్యులు.
– సారస్వత్ పరిషత్ కార్యక్రమాల్ని విస్తరింపజేయడానికి దేవులపల్లి రామానుజారావు విశేష కృషిచేశారు. ప్రముఖ తెలుగు భాషా పండితులు దివాకర్ల వెంకటావధాని, నేలటూరి వెంకట రమణయ్య, బూర్గుల రామకృష్ణారావు, రాళ్లపల్లి అనంత కృష్ణశాస్త్రి, గడియారం రామకృష్ణశర్మ రచనలను సారస్వత పరిషత్ ప్రచురించింది. ఈ సంస్థతో పాటు రావి నారాయణ రెడ్డి స్థాపించిన ‘నవ్యసాహితీ సమితి’ కాళోజీ నారాయణరావు స్థాపించిన ‘వైతాళిక సమితి’ తెలంగాణలో తెలుగు భాషా సాహిత్యాభివృద్ధికి కృషిచేశాయి.
– 1922లో ప్రారంభమైన నిజాం రాష్ట్రాంధ్ర జనసంఘం 1930లో ఆంధ్ర మహాసభగా రూపాంతరం చెందింది. దీని మొదటి సమావేశం 1930లో జోగిపేటలో జరిగింది. ఈ సభకు సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షత వహించారు. భావప్రకటన, వాక్స్వాతంత్య్రాన్ని నిషేధించిన 53వ గస్తీ నిషానే ఫర్మానా ప్రకారం, ఈ సభ జరుపుకోవడానికి ప్రభుత్వానుమతి తీసుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వ షరతుల్లో మూడు ముఖ్యమైన అంశాలు..
1) సభాధ్యక్షుడు గైర్ ముల్కీ అంటే నిజాం రాషే్ట్రతరుడు కాకూడదు, 2) ఇతర మతస్తుల మనోభావాల్ని గాయపరచకూడదు, 3) రాజకీయాలు ప్రస్తావించకూడదు.
-మొదటి ఆంధ్ర మహాసభలో మొత్తం 32 తీర్మానాలు ఆమోదించారు. వాటిలో ముఖ్యమైనవి.. వాక్ స్వాతంత్య్రాన్ని హరించే గస్తీ నిషాన్ను రద్దుచేయడం, నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయడం, ప్రభుత్వేతర పాఠశాలలు స్థాపించడంలో నిర్బంధాలు తొలగించడం, స్టేట్ లైబ్రరీలో ప్రాంతీయ భాషల్ని ప్రోత్సహించడం, లోకల్ ఫండ్ సంఘాల్లో ప్రజాప్రతినిధుల ఎన్నిక పద్ధతి అమలు చేయడం.
– 1930లో ప్రారంభమైన ఆంధ్రమహాసభ తెలంగాణ ప్రాంతంలోని రైతుల స్థితిగతుల్ని మెరుగుపరచడం, విద్యావ్యాప్తి, హరిజనోద్ధరణ కార్యక్రమాలు చేపట్టడం, సాంఘిక దురాచారాలను వ్యతిరేకించి, మహిళాభివృద్ధికి కృషిచేయడం లాంటి అంశాలపై అనేక కార్యక్రమాలను చేపట్టింది.
– రాజకీయేతర సంస్థగా ప్రారంభమైన ఆంధ్ర మహాసభ కాలక్రమంగా రాజకీయాంశాలను కూడా ప్రస్తావించింది. మొదటి ఐదు సమావేశాలు ప్రధానంగా సామాజిక, సాంస్కృతిక అంశాలకే ప్రాధాన్యం ఇచ్చాయి. ఉదాహరణకు వెట్టిచాకిరీ విధానాన్ని రద్దుచేయడం. దేవదాసి, జోగిని వ్యవస్థను నిర్మూలించడం, తెలుగును బోధనా భాషగా ప్రవేశపెట్టడం, వ్యసాయాభివృద్ధికి ప్రభుత్వ సాయాన్నందించడం, ఖద్దరు వ్యాప్తి, స్వదేశీ ఉద్యమాన్ని వ్యాప్తి చేశారు. నిజామాబాద్లో జరిగిన ఆరో మహాసభలో మొదటిసారిగా హైదరాబాద్ రాజ్యంలో బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, రాజ్యాంగ సంస్కరణలు చేపట్టి ప్రజా ప్రాతినిథ్యాన్ని పెంపొందించాలని తీర్మానించడమైంది. అదేవిధంగా పౌరహక్కులను సాధించడం కోసం ప్రజా ఉద్యమాల్ని నిర్మించాలని కూడా నిశ్చయించారు. 1930వ దశకం చివరిలో ఆంధ్ర మహాసభల్లో వామపక్షవాదుల ప్రాబల్యం క్రమంగా పెరిగింది. 1941లో చిలుకూరు ఆంధ్ర మహాసభకు రావి నారాయణరెడ్డి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
-తెలంగాణ గ్రామాల్లో భూస్వామ్య వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టడంలో ఆంధ్ర మహాసభ కొన్ని నిర్దిష్ట కార్యక్రమాల్ని రూపొందించింది. నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో వామపక్ష వాదులు గ్రామస్థాయిలో సంఘాల్ని స్థాపించి, రైతుల్ని చైతన్యవంతుల్ని చేశారు. దీనికి పరాకాష్ట 1944లో భువనగిరిలో జరిగిన ఆంధ్ర మహాసభకు రావి నారాయణరెడ్డి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం. ఈ సందర్భంలోనే ఆంధ్రమహాసభ రెండు వర్గాలుగా అంటే మితవాద, అతివాద వర్గాలుగా చీలిపోయింది. మితవాద వర్గానికి బూర్గుల రామకృష్ణారావు, కేవీ రంగారెడ్డి, మందుముల నర్సింగరావు, అతివాద పక్షానికి రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, దేవులపల్లి రామానుజారావు నాయకత్వం వహించారు. ఆంధ్ర మహాసభ మితవాద వర్గం 1945లో జాతీయ ఆంధ్ర మహాసభను ఏర్పరచి మడికొండలో మందుముల నర్సింగరావు అధ్యక్షతన సభ నిర్వహించారు. 1946లో కందిలో జరిగిన జాతీయ ఆంధ్ర మహాసభకు జమలాపురం కేశవరావు అధ్యక్షత వహించారు. ఆ తరువాత ఈ సభ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లో విలీనమైంది.
ఆంధ్రమహాసభ సమావేశాల వివరాలు
ఆంధ్ర మహాసభ సంవత్సరం స్థలం అధ్యక్షుడు
మొదటి ఆంధ్ర మహాసభ 1930 జోగిపేట సురవరం ప్రతాపరెడ్డి
రెండో ఆంధ్ర మహాసభ 1931 దేవరకొండ బూర్గుల రామకృష్ణారావు
మూడో ఆంధ్ర మహాసభ 1934 ఖమ్మంమెట్ పులిజాల రంగారావు
నాలుగో ఆంధ్ర మహాసభ 1935 సిరిసిల్ల మాడపాటి హనుమంతరావు
ఐదో ఆంధ్ర మహాసభ 1936 షాద్నగర్ కొండా వెంకట రంగారెడ్డి
ఆరో ఆంధ్ర మహాసభ 1937 నిజామాబాద్ మందుముల నర్సింగరావు
ఏడో ఆంధ్ర మహాసభ 1940 మల్కాపూర్ మందుముల రామచంద్రరావు
ఎనిమిదో ఆంధ్ర మహాసభ 1941 చిలుకూరు రావి నారాయణరెడ్డి
తొమ్మిదో ఆంధ్ర మహాసభ 1942 ధర్మవరం కామ కోటేశ్వరరావు
పదో ఆంధ్ర మహాసభ 1943 హైదరాబాద్ కొండా వెంకట రంగారెడ్డి
పదకొండో ఆంధ్ర మహాసభ 1944 భువనగిరి రావి నారాయణరెడ్డి
అడపా సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు