కాకతీయ పాలన వ్యవస్థ (తెలంగాణ చరిత్ర)
కాకతీయులు
ఇటు తెలంగాణ ప్రాంతాన్ని అటు ఆంధ్రా ప్రాంతాన్ని కలిపి పరిపాలించిన వంశాల్లో కాకతీయులు ముఖ్యులు. కాకతీయ రాజుల్లో అత్యంత ఎక్కువ కాలం పరిపాలించిన గణపతి దేవుడు పాండ్యులు, హోయసాలులు, యాదవ రాజులతో చేసిన యుద్ధాల్లో ఘన విజయం సాధించి విశాల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. వీరి పాలన కాలంలో సగం సమయం రాజ్య రక్షణకే కేటాయించారు. దాదాపు మూడు శతాబ్దాలపాటు పాలించిన కాకతీయులు స్థానిక సంస్కృతి సంప్రదాయాలను గౌరవించి తెలుగు ప్రజలకు విశేష సేవలందించారు.
గణపతి దేవుడు
# కాకతీయుల్లో అత్యంత పరాక్రమశాలియైన గణపతిదేవుడు తెలుగు మాట్లాడే ప్రజలందరినీ సమైక్యం చేశాడు. సుదీర్ఘంగా 63 ఏండ్లపాటు పరిపాలించాడు. వరంగల్ రాజధానిగా నేటి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలను పరిపాలించాడు. ఇతని పరిపాలన కాలానికి సంబంధించిన తొలిశాసనం కరీంనగర్ జిల్లా మంథెనలో దొరికింది. రాజధానిని అనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చాడు. అతని తాత ప్రోలుడు, పెదతండ్రి రుద్రదేవుడు చేపట్టిన కొత్త రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేశాడు. ఇతని ప్రధాన సామంతులు, సేనాధిపతుల్లో ముఖ్యులు రేచర్ల రుద్రుడు, మల్యాల చోడుడు. రేచర్ల రుద్ర సేనాని విశ్వాసానికి, శౌర్యానికి ప్రతిరూపం కాకతీయ రాజ్యాన్ని విచ్ఛిన్నం కాకుండా కాపాడిన వీరుడు.
రుద్రమదేవి
# రుద్రమదేవి దక్షిణాపథంలో అత్యంత ప్రతి భావంతురాలైన పరిపాలనా వేత్తగా, వీరనారిగా పేరుగడించింది. ఈమె 1262 నుంచి 1289 వరకు రాజ్యపాలన చేసింది. ఆమెకు విశ్వాస పాత్రులైన సేనాధిపతులు, సామంతుల అండతో శత్రురాజుల దాడులను సాహసోపేతంగా తిప్పికొట్టింది. కేవలం అంబదేవుని తిరుగుబాటును అణచివేయడంలో మాత్రమే ఆమె విఫలమైంది. తన మొదటి కుమార్తె కొడుకైన రెండవ ప్రతాపరుద్రుడిని తన వారసుడిగా ప్రకటించింది.
రెండో ప్రతాప రుద్రుడు
# కాకతీయ వంశపాలకుల్లో చిట్టచివరి రాజు రెండో ప్రతాపరుద్రుడు. క్రీ.శ.1290లో కాకతీయ రాజ్యాన్ని చేపట్టాడు. అంబదేవుడి తిరుగుబాటు ఫలితంగా కాకతీయరాజ్యానికి, తన కుటుంబానికి ఏర్పడిన ప్రమాదాన్ని రూపుమాపడం, పరరాజుల దాడుల నుంచి కాకతీయ రాజ్యాన్ని సంరక్షించడం అనే రెండు లక్ష్యాలతో రాజ్యపాలన ప్రారంభించాడు. వీటి సాధనకు సైన్యం అవశ్యకతను గుర్తించి సైన్యాన్ని పునర్ వ్యవస్థీకరించాడు. ఇతని కాలంలోనే ఢిల్లీసుల్తాన్ సైన్యాలు ఓరుగల్లుపై దండయాత్ర చేశాయి. 1303 లో జరిగిన మొదటి దండయాత్రలో దిగ్విజయంగా కాకతీయ సేనలు ఢిల్లీ సుల్తాన్ సేనలను తరిమికొట్టాయి. రెండోసారి 1309లో జరిగిన భీకర యుద్ధంలో కాకతీయ చక్రవర్తి పరాజయం అంగీకరించి సంధి చేసుకున్నాడు. ప్రతి సంవత్సరం కప్పం కడుతుండేవాడు. 1316 తర్వాత ఢిల్లీలో మారిన పరిణామాల దృష్ట్యా ఢిల్లీ సుల్తాన్ సార్వభౌమత్వాన్ని ధిక్కరించాడు. తర్వాత కాలంలో 1320లో ఘియాజుద్దీన్ తుగ్లక్షా ఢిల్లీ సింహాసనం అధిష్ఠించాడు. 1323లో కాకతీయ రాజ్యంపై మళ్లీ దండెత్తాడు. ఆ యుద్ధంలో కాకతీయ సేనలను ఓడించి, రెండో ప్రతాపరుద్రుడిని ఢిల్లీకి బందీగా తీసుకువెళుతున్న సమయంలో తప్పించుకొని నర్మదనదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు దాంతో కాకతీయ వంశం అంతరించింది.
పరిపాలన వ్యవస్థ
# కాకతీయులు శూద్రులైనప్పటికీ రాజధర్మాన్ని, రాజరిక వ్యవస్థను ఆచరించారు. కాకతీయుల కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలో ఒక నూతన పద్ధతి. మాండలిక వ్యవస్థ. బలవంతులైన మాండలికులను కాకతీయులు ప్రోత్సహించారు. కాకతీయులది వికేంద్రీకృత రాచరికం.
#వీరు గ్రామ, జిల్లా, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలుగా రూపొందించారు. ఆయా స్థాయిల్లో అధికారాలు నిర్దేశించినా అజమాయిషీ మాత్రం కేంద్ర ప్రభుత్వానిదే. ఈ వివిధ స్థాయిల పాలనా వ్యవస్థలతోపాటు సామంతులు పాలనా వ్యవస్థలో కీలకపాత్ర నిర్వహించేవారు.
#కాకతీయులు సార్వభౌములమనే అహంకారం లేకుండా ఒక కొత్తరకమైన రాచరికాన్ని అమలు చేశారు. సామంతుల అంతర్గత పాలనా వ్యవహారాల్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. తాము నియమించిన రాజోద్యోగులను రాజ్యమంతటా వివిధ పదవుల్లో నియమించారు. కాకతీయులు తాము జయించిన ప్రాంతాల్లో స్థానిక సంప్రదాయాలను, గౌరవించి కొనసాగించారు.
# మంత్రి మండలిద్వారానే రాజు పరిపాలనా వ్యవహారాలు నిర్వహించినట్లు కాకతీయ కాలంనాటి శాసనాలు వెల్లడిస్తున్నాయి. మంత్రిమండలిలో ప్రధానులు, అమాత్యులు, ప్రెగ్గడులు, సామంతులు, దండనాయకులు మొదలైనవారు సభ్యులుగా ఉన్నారు.
రాష్ట్ర పరిపాలన
# రాజ వ్యవహారాలన్నింటినీ 72 నియోగాలుగా విభజించారు. వీటన్నింటిపై అధికారిని బృహత్తర నియోగాధిపతి అనేవారు.
# పరిపాలన సౌలభ్యం కోసం తమ విశాల సామ్రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించారు.
# స్థలం, సీమ, నాడు, భూములు మొదలైన విభాగాల పేర్లు శాసనాల్లో కనిపిస్తాయి.
# స్థలం అంటే 24 గ్రామాల సమూహం. రాజ్యంలో స్థలాల సంఖ్య అధికం. వరంగల్లు శాసనంలో అనుమకొండ, మట్యవాడ, ఓరుగల్లు ఒక స్థలంగా పేర్కొనబడ్డాయి.
గ్రామ పరిపాలన
# గ్రామమే పరిపాలనా యంత్రంగంలో చివరిస్థాయిది. గ్రామాధికారులందరినీ కలిపి అయగార్లని వ్యవహరించేవారు. కాకతీయులకు ముందే గ్రామాల్లో ఆయగార్ల వ్యవస్థ ఏర్పడింది. వీరి సంఖ్య పన్నెండు. గ్రామాధికారుల్లో కరణం, రెడ్డి, తలారి, పురోహితుడు, కమ్మరి, కంసాలి, వడ్రంగి, కుమ్మరి, చాకలి, మంగలి, వెట్టి, చర్మకారుడు, నీరుడువాడు మొదలైన పేర్లు శాసనాల్లో ఉన్నాయి. గ్రామ సేవ చేసేందుకు వీరందరికి పన్నులేని భూములను ఇచ్చేవారు. కరణం, రెడ్డి, తలారి ప్రభుత్వ సేవకులు. వీరికి పంటలో కొంతవాటా ఇచ్చేవారు.
సైనిక పాలన
#కాకతీయులు సురక్షితమైన భారీ సైన్యాన్ని పోషించారు. దేశ విదేశీయ శత్రువుల బారి నుంచి రాజ్యాన్ని రక్షించడం కోసమే కాకతీయులు తమ కాలంలో ఎక్కువ సమయం వెచ్చించారు. దేశ రక్షణలో కోటలు కీలపాత్ర పోషించాయి. రాజ్యం భద్రత కోటల సముదాయంపై ఆధారపడిన విషయమని ప్రతాపరుద్రుడి నీతిసారం చెప్పింది. కాకతీయ రాజ్యంలో నాలుగు రకాల స్థల, జల, గిరి, దుర్గాలు ఉన్నట్లు శాసనంలో ఉంది. కాకతీయులు నిర్మించిన ఓరుగల్లు, రాయచూరు, గోల్కొండ, భువనగిరి, రాచకొండ, దేవరకొండ, నల్లగొండ, పానుగల్లు కోటలు దుర్భేధ్యమైనవి.
నాయంకర పద్ధతి
# సైనిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాజ్యపరిపాలనా వ్యవస్థను తీర్చిదిద్దారు. కాకతీయుల రాజ్య భూములను నాయకులనే సైనికాధికారులకు పంచి పెట్టారు. నాయకుడికి ఇచ్చిన గ్రామం లేదా గ్రామాలను నాయకస్థల లేదా నాయకస్థల వృత్తి అనేవారు. చతురంగ బలాలను పోషించడానికి, కోశాగారం నింపడానికి ఆదాయాన్నిచ్చే పెద్ద ఊళ్లను ఉంచి సామంతులకు చిన్న ఊళ్లను మాత్రమే ఇవ్వాలని ప్రతాపరుద్రుడి నీతిసారం చెపుతుంది. ఇక్కడ నాయకులంటే సామంతులని అర్థం. వీరికాలంలో రెండు రకాల సైన్యం ఉండేది. స్థల సైన్యం లేదా మూలబలం, సామంత సైన్యం.
# మూలబలం పాలకుని పర్యవేక్షణ కింద లేదా పాలకుడు నియమించిన వారి ఆధీనంలో ఉండేది.
న్యాయవ్యవస్థ
# కాకతీయులు దక్షిణ భారతదేశంలో ఉన్న న్యాయస్మృతినే గౌరవించి అమలు చేశారు. కొన్ని శాసనాలు వివిధరకాల న్యాయ వివాదాలను వివరిస్తున్నాయి. మహాజనులు, కరణాలు ధర్మపరులుగా గుర్తించబడేవారు.
ప్రాక్టిస్ బిట్స్
1. మొదటి దక్షిణ దేశ విజయాలను వివరించే శాసనాలు ఏవి?
ఎ) చేబ్రోలు శాసనం
బి) గణపేశ్వరం శాసనం
సి) ఓరుగల్లు శాసనం
డి) బయ్యారం శాసనం
1) ఎ, బి 2) సి, డి
3) 2, 4 డి) 1, 2, 3
2. గణపతి దేవుడు ఎవరి కాలంలో కళింగ, వేంగి రాజ్యాలపై దండెత్తి పూర్తి విజయం సాధించాడు ?
1) అనియంక భీముడు
2) మొదటి నరసింహదేవుడు
3) పిన్న చోడుడు
4) పై ఎవరూ కాదు
3. గణపతి దేవుడు ఏ యుద్ధంలో పరాజయం పొందాడు?
1) దేవగిరి యుద్ధం
2) వేంగి యుద్ధం
3) ముత్తుకూర్ యుద్ధం
4) చందుపట్ల యుద్ధం
4. కాకతీయ రాజ్య స్థాపనాచార్య, రాయపితామహాంక వంటి బిరుదులు పొందినవారు?
1) రేచర్ల ప్రసాదిత్యుడు
2) కాయస్థజన్నిగదేవుడు
3) మల్యాల గుండియ నాయకుడు
4) కాయస్థ త్రిపురారి
5. రాయగజకేసరి బిరుదు ఎవరికి లభించింది?
1) గణపతిదేవుడు 2) రుద్రమదేవి
3) ప్రతాపరుద్రుడే
4) కాయస్థ జన్నిగదేవుడు
6. ప్రతాపరుద్రుడు 1291లో కొలని సోమన మంత్రి కుమారుడైన మననుమగన్నయ్య, ఇందులారి పెద్దగన్నయ మంత్రి కుమారుడైన అన్నయదేవుడి నేతృత్వంలో భారీ సైన్యాన్ని అంబదేవుడి కేంద్ర స్థానమైన త్రిపురాంతంపైకి దండెత్తి ఘన విజయం సాధించాడని ఎవరు వేయించిన శాసనం ద్వారా తెలుస్తున్నది?
1) ఇందులూరి అన్నయ్య
2) సోమనాయకుడు
3) మహాదేవుడు
4) ఎల్లణ దేవుడు
7. ఓరుగల్లుపై ఏ సంవత్సరంలో జరిగిన ఢిల్లీ సుల్తానుల దండయాత్రలో కాకతీయ సేనలు ఓడిపోయి ప్రతాపరుద్రుడు సంధికి అంగీకరించాడు?
1) క్రీ.శ. 1303 2) క్రీ.శ. 1307
3) క్రీ.శ. 1309 4) క్రీ.శ. 1316
8. కాకతీయుల కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలో ప్రత్యేకమైనది ఏది?
1) శ్రేణి వ్యవస్థ 2) మాండలిక వ్యవస్థ
3) బృహత్తర నియోగ విధానం
4) నాయంకర విధానం
9. కాకతీయుల రాజ్యం సప్తాంగ సమన్వితం. వారి మంత్రి మండలిలో ఎవరు సభ్యులుగా ఉండేవారు?
ఎ) ప్రధానులు బి) అమాత్యులు
సి) ప్రెగ్గడులు డి) దండనాయకులు
ఇ) సామంతులు
1) ఎ, బి,డి బి) సి. డి, ఇ 3) ఎ,బి,సి,డి 4) పై వారందరూ
10. కాకతీయులు పరిపాలన సౌలభ్యం కోసం తమ విశాల భూభాగాన్ని ఎన్ని రకాలుగా విభజించారు?
ఎ) సీమ బి) నాడు
సి) స్థలం డి) రాష్ట్రం
1) ఎ, బి 2) సి, డి
3) ఎ, బి, సి, డి 4) 2, 3, 4
11. కాకతీయుల కాలంలో ఎన్ని రకాల సైన్య వ్యవస్థలు ఉండేవి?
ఎ) స్థిర సైన్యం
బి) సామంత సైన్యం సి) కాకతీయ సైన్యం
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి 4) పైవేవీకాదు
12. కాకతీయుల కాలంలో ధర్మపరులుగా ఎవరిని గుర్తించేవారు?
1) మహాజనులు 2) కరణాలు
3) 1,2 4) పైవేవీకాదు
సమాధానాలు
1.1 2.2 3.3 4.1 5.2 6.1 7.3 8.2 9.4 10.3 11.1 12.3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు