Indian History | భారతదేశంలో గాంధీజీ తొలి అనుభవాలు
- దక్షిణాఫ్రికాలో జాతి దురహంకారానికి, జాతి వివక్ష విధానానికి వ్యతిరేకంగా పోరాటం నిర్వహించి విజయం సాధించిన గాంధీ 1915, జనవరిలో స్వదేశం తిరిగి వచ్చాడు.
- స్వదేశానికి తిరిగి వచ్చిన వెంటనే తన రాజకీయ గురువుగా భావించిన గోపాలకృష్ణ గోఖలేను కలిశాడు.
- ఆయన సలహా మేరకు ఒక సంవత్సరం దేశమంతా తిరిగి దేశంలోని పరిస్థితులను తెలుసుకున్నాడు.
- 1916లో లక్నో పట్టణంలో జరిగిన 31వ కాంగ్రెస్ వార్షిక సమావేశానికి హాజరయ్యాడు.
- ఆ సమావేశంలో భారతదేశం నుంచి దక్షిణాఫ్రికాకు ఒప్పందంపై కూలీలను పంపే పద్ధతిని రద్దు చేయడానికి కృషి చేయాలని డిమాండ్ చేశాడు.
- అదే ఏడాది జరిగిన ముస్లిం లీగ్ వార్షిక సమావేశంలో కూడా గాంధీ పాల్గొన్నాడు.
- తన సొంత రాష్ట్రమైన గుజరాత్లో గుజరాతీలు నెలకొల్పిన సభకు నాయకుడయ్యాడు.
- నాయకుడి హోదాలో ఆ సభ కార్యక్రమాలు, చర్యలు అన్నీ ఆంగ్లంలో కాకుండా గుజరాతీ భాషలో నిర్వహించేటట్లు ఏర్పాట్లు చేశాడు.
- అదేవిధంగా ప్రజల అవసరాల గురించి చర్యలు జరిపి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా సభ్యులు పల్లె ప్రాంతాల్లో పర్యటనను జరిపి ప్రజలను విద్యావంతులను చేసే కార్యక్రమాన్ని ప్రారంభించాడు.
- 1916లో గోఖలే నెలకొల్పిన భారతదేశ సేవక సమితిలో సభ్యుడిగా చేరడానికి సిద్ధపడగా, గోఖలే సలహాతో మరో ఏడాదితో పాటు వేచి ఉండటానికి అంగీకరించాడు.
- దురదృష్టవశాత్తు 1915లో గోఖలే మరణించగా ఆ సంస్థకు కొత్త అధిపతిగా వచ్చిన శ్రీనివాస శాస్త్రి ఇతర సభ్యులు గాంధీ కోరికను తిరస్కరించారు.
- ఇలాంటి పరిస్థితుల్లో గాంధీ మూడు స్థానిక సమస్యలను పరిష్కరించడానికి సిద్ధపడ్డాడు. అవి 1) చంపారన్ నీలిమందు రైతుల సమస్య 2) ఖేడా జిల్లా రైతుల సమస్య 3) అహ్మదాబాద్ బట్టల మిల్లు కార్మికుల సమస్య.
చంపారన్ నీలిమందు రైతుల సత్యాగ్రహ ఉద్యమం (1916-17)
- దేశంలో గాంధీ సత్యం, అహింస ఆధారంగా రూపొందించిన సత్యాగ్రహం అనే ఆయుధంతో నడిపిన తొలి ఉద్యమమిది.
- బీహార్ రాష్ట్రంలో చంపారన్ వెనుకబడిన జిల్లా అందులో అత్యధిక జనాభా వ్యవసాయ కూలీలు.
- వీరిలో అత్యధికులు చంపారన్ నీలిమందు తోటలో పనిచేసేవారు.
- ఈ నీలిమందు తోటలు బ్రిటిష్ అండలో ఉన్న కాంట్రాక్టర్ల ఆధీనంలో ఉండేవి.
- ఇక్కడి రైతులు తమ భూముల్లో తప్పనిసరిగా నీలిమందు పంటను పండించాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్బంధించింది.
- అదేవిధంగా నీలిమందు తోటల్లో పని చేసే భారతీయ వ్యవసాయ కూలీలు అన్ని రకాల దోపిడీకి, దౌర్జన్యానికి గురయ్యారు.
- ఈ నీలిమందు బ్రిటిష్ కాంట్రాక్టర్లకే అమ్మాలి. కానీ వారు నీలిమందుకు సరైన ధర చెల్లించేవారు కాదు.
- తూకం విషయంలో కూడా అనేక అవకతవకలకు పాల్పడేవారు.
- ఇలాంటి పరిస్థితుల్లో రైతుల పరిస్థితి దీనస్థితికి చేరింది.
- ఈ పరిస్థితిని 1916లో లక్నోలో జరిగిన కాంగ్రెస్ వార్షిక సమావేశానికి హాజరైన గాంధీకి చంపారన్ నీలిమందు రైతుల బృందం తరఫున స్థానిక నాయకుడు రాజ్ కుమార్ శుక్లా గాంధీకి తెలిపాడు.
- ఒకసారి చంపారన్‌ను సందర్శించి పరిస్థితిని పరిశీలించి రైతులను ఆదుకోవాలని గాంధీని కోరాడు.
- శుక్లా ప్రార్థనను తిరస్కరించలేని గాంధీ 1917, ఏప్రిల్ నెలలో చంపారన్ జిల్లాలో అడుగుపెట్టాడు.
- అతడి వెంట కొందరు స్థానిక నాయకులు బాబు రాజేంద్రప్రసాద్, జేబీ కృపలాని, మహాదేవ్ దేశాయ్ మొదలైన వారు ఉన్నారు.
- ఈ పర్యటన క్రమంలో గాంధీ పట్ల ప్రజలు చూపిన అభిమానాన్ని చూసిన ప్రభుత్వం అతని పర్యటనలపై నిషేధాజ్ఞలు విధించింది.
- కానీ బ్రిటిష్ ఉన్నతాధికారులు కల్పించుకొని, జిల్లా అధికారుల ఆజ్ఞలను ఉపసంహరింపజేశారు.
- చివరకు గాంధీ ప్రార్థనను అర్థం చేసుకున్న ప్రభుత్వం నీలిమందు రైతుల స్థితిని అధ్యయనం చేయడానికి ఒక కమిటీని రూపొందించింది.
- ఆ కమిటీలో గాంధీ కూడా సభ్యుడిగా ఉన్నాడు.
- చివరకు కమిటీ నివేదిక ఆధారంగా చంపారన్ ‘గ్రేరియన్ యాక్ట్’ చట్టం రూపొందించారు.
- నీలిమందు రైతుల కష్టాలు కడతేర్చడంలో గాంధీ అహింసా సిద్ధాంతం విజయం సాధించింది.
ఖేడా జిల్లా రైతుల సత్యాగ్రహ ఉద్యమం (1917)
- గాంధీ నిర్వహించిన రెండో రైతు ఉద్యమం గుజరాత్‌లోని ఖేడా జిల్లా రైతులకు సంబంధించింది. చంపారన్ ప్రజలతో పోలిస్తే ఖేడా ప్రజల కొంత అక్షరజ్ఞానం, కొద్దిపాటి ఆదాయం కలిగినవారు.
- వారి ముఖ్య వృత్తి అయిన వ్యవసాయం కూడా చంపారన్ కంటే లాభసాటిగా ఉంది.
- వీరికి తూర్పు ఆఫ్రికాతో వ్యాపార సంబంధాలుండేవి. రాజకీయ పరిజ్ఞానం అంతగా లేనివారు.
- 1917లో ఇక్కడ వర్షాలు కురవలేదు. ప్రపంచ యుద్ధం మూడేళ్లుగా కొనసాగుతున్నందన అన్ని వస్తువుల ధరలు ఆకాశన్నంటాయి.
- ఖేడా జిల్లాలోని 559 గ్రామాల్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు.
- 1917 నవంబర్‌లో ఖేడా జిల్లా కపద్పంజ్ తాలూకాకు చెందిన మోహన్‌లాల్ పాండ్యా అనే రైతు గాంధీని కలిసి ఖేడా రైతులను అనావృష్టి బాధ నుంచి, రెవెన్యూ అధికారుల బారి నుంచి, పెంచిన భూమి శిస్తు రేటు బారి నుంచి రక్షించాలని కోరాడు.
- 1918, మార్చి 22న గాంధీ ఖేడా సమస్యను పరిష్కరించడానికి సిద్ధపడ్డాడు.
- పన్ను చెల్లించే శక్తి ఉన్న రైతులు శిస్తు చెల్లించేవారు. ఆర్థికస్థోమత లేనివారు పశువులు, చరాస్తులను అమ్మేవారు. గాంధీ కొంతమంది సేవాదళ సభ్యులతో ఖేడా జిల్లాలోని సుమారు 70 గ్రామాలు పర్యటించి రైతుల స్థితిని గమనించారు.
- భూమి శిస్తు రేటును తగ్గించాల్సిందిగా జిల్లా అధికారులకు రాష్ట్ర అధికారులకు విజ్ఞప్తులు పంపాడు.
- కానీ ప్రయోజనం లేకపోయింది. కేంద్ర ప్రభుత్వం కూడా గాంధీ విజ్ఞప్తిని తిరస్కరించింది.
- చివరకు గాంధీ ముందు ప్రమాణం చేసిన ఖేడా ప్రజలు శాంతియుత పోరాటాన్ని ఆరంభించారు. రెండు నెలలు రైతులు ఏ మాత్రం భయపడక పోరాటం సాగించారు.
- చివరకు అధికారులు మనస్సు మార్చుకొని భూమి శిస్తు రేటును తగ్గించారు. గాంధీ కృషి ఫలించింది. ఉద్యమం సఫలమైంది.
అహ్మదాబాద్ బట్టల మిల్లుల కార్మికుల సత్యాగ్రహ ఉద్యమం (1918)
- గాంధీజీ పూనుకొన్న మూడో సత్యాగ్రహ ఉద్యమం ఇది. అహ్మదాబాద్ ఆయన పుట్టి పెరిగిన గుజరాత్ రాష్ట్రంలోనిది.
- అక్కడి ప్రజలను అతడు ఆత్మీయంగా అభిమానించడం సహజమే. దేశ సేవలో ఆయన చేసిన మొదటి పని అహ్మదాబాద్‌లోని సబర్మతి తీరాన ఒక ఆశ్రమం ఏర్పాటు చేయడం.
- అనేక సంవత్సరాలుగా ఈ నగరం వ్యాపార కేంద్రంగా ఉంది.
- 1860 నుంచి అది వస్త్ర పరిశ్రమ కేంద్రాల్లో ఒకటిగా ఉంది.
- ఇక్కడ అనేక వస్త్ర పరిశ్రమలను స్థాపించారు. ఇక్కడ 1917లో ప్లేగు వ్యాధి వ్యాపించింది.
- అప్పుడు వస్ర్తాల మిల్లుల యజమానులు తమవారు ప్లేగు భయం వల్ల పనులు మానుకొని వెళ్లిపోకుండా నెలకు రూ.2, రూ.3లకు మించకుండా భత్యం ఇవ్వడానికి అంగీకరించారు.
- కొన్ని నెలల తర్వాత ప్లేగు వ్యాధి తగ్గిపోయింది. మిల్లు యజమానులు భత్యం ఇవ్వడం ఆపివేశారు. కానీ మొదటి ప్రపంచ యుద్ధం ప్రభావం వల్ల ఆ రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి.
- అందువల్ల మిల్లు కార్మికుల జీతాలనో, భత్యాలనో యజమానులు పెంచితేకాని జీవించడం కష్టసాధ్యమైంది. కానీ యజమానులు మాత్రం జీతభత్యాలను పెంచడం నిరాకరించారు.
- మిల్లు కార్మికులకు తమ తరఫున గాంధీని మిల్లు యజమానులతో చర్చించి న్యాయం చేకూర్చమని కోరారు.
- ఈ మిల్లు యజమానుల్లో ప్రముఖులైన అంబాలాల్ సారాభాయ్, అతని చెల్లెలైన అనసూయ గాంధీకి మంచి పరిచయస్తులు.
- మిల్లు కార్మికులు, యజమానులకు మధ్య సామరస్య పూర్వక రాజీసూత్రాన్ని గాంధీ తయారు చేయడానికి సిద్ధపడ్డాడు.
- కార్మికులు తమ జీతాల్లో 50 శాతం పెరుగుదలను కోరడానికి గాంధీ సూచన మేరకు యజమానులు 35 శాతం పెంచడానికి అంగీకరించి 20 శాతం మాత్రమే చెల్లించసాగారు.
- చివరికి గాంధీ మిల్లు యజమానుల విధానానికి వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్ష 1918, మార్చి 15న ప్రారంభించాడు.
- మిల్లు కార్మికులు అనేక మంది పాల్గొన్నారు. పూర్తి స్థాయిలో సత్యాగ్రహ ఉద్యమం శాంతియుతంగా కొనసాగింది.
- మిల్లు యజమానుల్లో చాలామంది జైన సంప్రదాయవాదులు. కాబట్టి అహింసలో విశ్వాసం ఉన్నవారైనందున వారు న్యాయమైన పోరాటాన్ని గుర్తించి 35 శాతం పెంచిన జీతాలు ఇవ్వడానికి సుముఖతను వ్యక్తం చేశారు. ఈ విధంగా మిల్లు కార్మికుల సమస్య పరిష్కారమైంది.
- ఈ విధంగా గాంధీ దేశంలో ఈ మూడు ఉద్యమాల్లో విజయం సాధించడంలో అతని పేరు ప్రతిష్ఠలు ఇనుమడించాయి.
మాదిరి ప్రశ్నలు
1. చంపారన్ నీలిమందు రైతుల దుస్థితిని గాంధీకి తెలియజేసినవారు?
1) బాబు రాజేంద్రప్రసాద్
2) రాజ్‌కుమార్ శుక్లా
3) మహాదేవ్ దేశాయ్
4) జేబీ కృపలాని
2. కింది వారిలో మహాత్మాగాంధీ తన రాజకీయ గురువుగా భావించింది?
1) గోపాలకృష్ణ గోఖలే
2) దాదాభాయ్ నౌరోజీ
3) బాబు రాజేంద్రప్రసాద్
4) ఫిరోజ్ షా మెహతా
3. కింది వాటిలో సరైనవి?
1) గాంధీ 1915, జనవరిలో దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చారు
2) గాంధీ తొలిసారి హాజరైన కాంగ్రెస్ సమావేశం- లక్నో (1916)
3) 1 మాత్రమే సరైనది
4) 1, 2 రెండూ సరైనవి
4. గాంధీ స్థానికంగా చేపట్టిన ఉద్యమాల వరుస క్రమం?
1) చంపారన్ – అహ్మదాబాద్ ఖేడా సత్యాగ్రహం
2) ఖేడా సత్యాగ్రహం- చంపారన్ – అహ్మదాబాద్ బట్టల మిల్లు కార్మికుల సమస్య
3) చంపారన్ – ఖేడా సత్యాగ్రహం – అహ్మదాబాద్ బట్టల మిల్లు కార్మికుల సమస్య
4) అహ్మదాబాద్- చంపారన్ – ఖేడా
5. చంపారన్ నీలిమందు రైతుల సత్యాగ్రహ పోరాటంలో గాంధీ వెంట నిలిచిన స్థానిక నాయకులు?
1) బాబు రాజేంద్ర ప్రసాద్
2) మహాదేవ్ దేశాయ్
3) జేబీ కృపలాని
4) పై అందరూ
6. ఖేడా రైతుల సాధక బాధలను గాంధీ దృష్టికి తీసుకొచ్చింది?
1) మోహన్ లాల్ పాండ్య
2) రాజ్‌కుమార్ శుక్లా
3) సర్దార్ వల్లభాయ్ పటేల్
4) ఫిరోజ్ షా మెహతా
7. ‘గ్రేరియన్ యాక్ట్’ అనే చట్టం ఏ పోరాటం వల్ల వచ్చింది?
1) అహ్మదాబాద్ బట్టల మిల్లుల కార్మికుల సత్యాగ్రహం
2) చంపారన్ నీలిమందు రైతుల సత్యాగ్రహ ఉద్యమం
3) ఖేడా జిల్లా రైతుల సత్యాగ్రహ ఉద్యమం
4) రౌలట్ సత్యాగ్రహ ఉద్యమం
8. భారత జాతీయ కాంగ్రెస్ నుంచి విడిపోయి లిబరల్ ఫెడరేషన్‌ను స్థాపించింది?
1) సురేంద్రనాథ్ బెనర్జీ
2) సీవై చింతామణి
3) శ్రీనివాస శాస్త్రి 4) పై అందరూ
9. ‘మాంటేగ్’ రిపోర్టును మోసపూరితమైందిగా వర్ణించింది?
1) గాంధీ 2) నెహ్రూ
3) బాలగంగాధర్ తిలక్
4) అనీబీసెంట్
10. రౌలట్ సత్యాగ్రహ సమయంలో ఢిల్లీలో జరిగిన ఉద్యమానికి నాయకత్వం వహించింది?
1) స్వామి శ్రద్ధానంద 2) గాంధీ
3) సుభాష్ చంద్రబోస్ 4) అనీ బీసెంట్
జవాబులు
1-2, 2-1, 3-4, 4-3,
5-4, 6-1, 7-2, 8-4,
9-3, 10-1.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు