బహమనీలు దక్షిణాదిన తొలి ముస్లిం రాజ్యం
కాకతీయ రాజ్య పతనానంతరం క్రీ.శ. 1325లో ఢిల్లీ సింహాసనమెక్కిన మహ్మద్‌బిన్ తుగ్లక్ ఆధీనంలోకి దక్షిణా పథమంతా వచ్చింది. తుగ్లక్ మీద అనేక మంది సర్దారులు తిరుగుబాటు చేశారు. తెలంగాణకు పశ్చిమోత్తర ప్రాంతంలో బహమనీ వంశీయుడైన హసన్గంగు ఢిల్లీ చక్రవర్తి అయిన మహ్మద్‌బిన్ తుగ్లక్ మీద తిరుగుబాటు చేసి 1341లో దౌలతాబాద్ రాజధానిగా బహమనీ రాజ్యాన్ని స్థాపించాడు. 1347లో స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాడు. బహమనీలు అనేకసార్లు తెలంగాణ మీద దండయాత్ర చేసి నిజామాబాద్ దుర్గాన్ని, పానగల్లు కోట, నీలికోట మొదలైన కోటలను ఆక్రమించారు.
అల్లాఉద్దీన్ బహమనీషా (1347-1358)
14వ శతాబ్ది ద్వితీయార్ధంలో ఢిల్లీని పరిపాలిస్తున్న మహమ్మద్ బిన్ తుగ్లక్ సామ్రాజ్యంలో చెలరేగిన అనేక తిరుగుబాట్ల నుంచి బహమనీ రాజ్యం ఉద్భవించింది. మహ్మద్‌బిన్ తుగ్లక్ గుజరాత్లో వచ్చిన తిరుగుబాటును అణచడానికి సైన్యంతో వెళ్లగా, దక్కన్లో తిరుగుబాటు చేస్తున్న అల్లాఉద్దీన్ హసన్ గంగూ 1347లో స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాడు. ఆ సందర్భంలో ఆయనకు వరంగల్లు కాపయ నాయకుడు పెద్ద సైన్యంతో సాయపడ్డాడు. ఆ విధంగా బహమనీ రాజవంశపాలన మొదలైంది. ఆ వంశస్థాపకుడు అల్లా ఉద్దీన్ హసన్ గంగూ బహమనీగా ప్రసిద్ధి చెందాడు. అది స్వతంత్ర రాజ్యం. షా అంటే స్వతంత్ర రాజు అని అర్థం.
స్వతంత్రాన్ని ప్రకటించుకొని, తన రాజ్యాన్ని సుస్థిర పరుచుకునే క్రమంలో తనలాగే స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్న ఇతర పాలకులతో ఒకవైపు, ఢిల్లీలోని తుగ్లక్ ప్రభుత్వానికి విథేయులుగా ఉన్న పాలకులతో మరోవైపు యుద్ధాలు చేశాడు. తనకు లొంగిపోయిన వారితో కప్పం కట్టించుకొని, లొంగనివారిని చంపి వారి ప్రాంతాలు, ఆస్తులను ఆక్రమించుకున్నాడు. రాజపుత్ర నాయకుడైన దిలీప్‌సింగ్‌తో స్నేహం చేసి, వారిద్దరు కలిసి హిందువైన జంఖండి పాలకుడు నారాయుణ్ణి, ఢిల్లీ సుల్తాన్‌కు విథేయుడిగా ఉన్న కారణంగా లొంగదీసుకున్నారు. స్థానిక తిరుగుబాటుదార్లను అణచివేయడానికి కాపయ నాయకుడికి సికిందర్‌ఖాన్ సహాయం చేశాడు. ఆ పని పూర్తయ్యాక, సికిందర్ ఖానే కాపయ నాయకుడిని ఓడించి, కౌలాస్ కోటను ఆక్రమించాడు. అదే సమయంలో తమ రాజ్యాధికారాన్ని స్థిరపరుచుకొంటున్న హరిహర, బుక్కరాయలు బహమనీరాజుతో సర్దుబాటు చేసుకొని ఆయన అడిగినవన్నీ ఇచ్చేశారు.
1356లో రెండోసారి దండయాత్ర చేసి భువనగిరి దుర్గాన్ని ఆక్రమించుకున్నాడు. హసన్గంగు తన రాజ్యాన్ని గుల్బర్గా, దౌలతాబాద్, బీదర్, బీరార్ అనే నాలుగు రాష్ర్టాలుగా విభజించాడు. అల్లాఉద్దీన్ బహమన్ షా తర్వాత ఆయన కొడుకు రాజయ్యాడు.
ఒకటో మహమ్మద్‌షా (1358-1375)
ఈయన అధికారానికి రాగానే వరంగల్, విజయనగర ప్రభువులు బహమన్‌షా ఆక్రమించుకున్న తమ ప్రాంతాలైన కౌలాస్‌కోట, దో-ఆబ్లను రాబట్టుకోవడానికి చేసిన యుద్ధంలో ఇద్దరూ ఓడిపోయారు. వరంగల్ కాపయ నాయకుడు పెద్ద మొత్తంలో నష్టపరిహారం చెల్లించి, అదనంగా గోల్కొండను ఇచ్చేసి సంధి చేసుకున్నాడు. ఆ తరువాత విజయనగర బుక్కరాయలు రాయచూర్ దో-ఆబ్లో ఉన్న మద్గల్కోటను స్వాధీనం చేసుకొని, కోటలో ఉన్న వారిని చంపి, ఆ వార్తలను గుల్బర్గాకు అందజేయడానికి ఒక్క మనిషిని మాత్రం వదిలేశాడని పెరిస్టా రాశాడు. అలా మతాల పేర దారుణమైన జనహత్య జరిగింది. ఈయన కాలంలోనే కరీంనగర్ జిల్లా ధర్మపురిలోని దేవాలయాలు కూడా ధ్వంసమయ్యాయి. అంతకు పూర్వం 1303లో ఢిల్లీ సుల్తాన్ ఖిల్జీ సేనాని మాలిక్ కాఫర్ కూడా ఓరుగల్లు కోటను కొల్లగొట్టించి తర్వాత మార్గమధ్యలో ఉన్న ధర్మపురి దేవాలయాలను ధ్వంసం చేశాడు. ఈయన తర్వాత ముజాహిద్ షా రాజయ్యాడు.
ముజాహిద్ షా (1375-1378)
ఈయన రాయచూర్ దో-ఆబ్ కోసం బుక్కరాయలతో యుద్ధానికి తలపడ్డాడు. ఆదోనిపైకి సేనలను పంపాడు. విజయనగరంపై దాడి చేశాడు. ముజాహిద్ షాను అతడి పినతండ్రి దావూద్‌ఖాన్ చంపి రాజయ్యాడు. దావూద్‌ఖాన్ కూడా హత్య చేయబడి రెండో మహమ్మద్‌షా రాజయ్యాడు.
రెండో మహమ్మద్ షా (1378-1395)
మంచి విద్యావంతుడు. ఈయన కాలంలో దేశం మహా క్షామానికి గురికాగా గుజరాత్, మాల్వాల నుంచి ధాన్యం తెప్పించి తక్కువ ధరలకు సరఫరా చేయించాడు. అయితే ఆ ధాన్యాన్ని ముస్లింలకే పంచాడు. దేశ సంపదను సృష్టిస్తున్న రైతులకు, హిందువులకు పంచలేదు. గొప్ప విద్యావంతుడిగా పేరొందిన సుల్తాన్ హిందూ, ముస్లింల మధ్య తేడా చూపాడు. ఇతడు 1395లో మరణించాడు. తర్వాత ఆయన ఇద్దరు కొడుకులు 1395-1397 వరుసగా గద్దెనెక్కారు. చంపివేయబడ్డారు. అప్పుడు బహమనీ వంశ స్థాపకుడైన అల్లాఉద్దీన్ బహమన్‌షా మనుమల్లో ఒకడైన ఫిరోజ్ షా రాజయ్యాడు.
ఫిరోజ్ షా (1397-1422)
గొప్ప పండితుడు, రాజనీతి కుశలుడు, గణిత, వృక్షశాస్త్రం, తర్కం, అలంకార, న్యాయ, భాషాశాస్ర్తాల్లో నిపుణుడైన ఫిరోజ్ షా దక్షిణ భారత భాషలను నేర్చుకున్నాడు. ఫిరోజ్‌షా విజయనగర రాజులతో చేసిన యుద్ధంలో ఇరుపక్షాలవారు గ్రామాలను దోచుకోవడం, ఇళ్లను తగులపెట్టడం, జనాన్ని హింసించడం, చంపడంలో ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. తుదకు దేవరాయలు తన కూతురును ఇచ్చి, పెండ్లి కానుకగా బంకీపూర్, యుద్ధ నష్టపరిహారంగా 10 లక్షల హెన్నులు, 5 మణుగుల ముత్యాలు, 50 ఏనుగులు, 2 వేల మంది బానిసలనిచ్చాడు. అంతకుముందు పట్టుబడ్డ వారిని విడిపించుకోవడానికి 11 లక్షల హెన్నులు చెల్లించాడు. 1417లో నల్లగొండ జిల్లాలో పానగల్ కోటపై సుల్తాన్ దాడి చేశాడు. రెండేండ్ల పాటు జరిగిన ఈ యుద్ధంలో సుల్తాన్‌కు విజయం లభించలేదు, దానికితోడు సైన్యంలో అంటురోగం వ్యాపించడంతో తిరిగి వెళ్లిపోతుండగా విజయనగరం, వరంగల్ సైన్యాలు దాడిచేశాయి. తర్వాత ఆయన తమ్ముడు రాజయ్యాడు.
ఒకటో అహమ్మద్షా (1422-1436)
ఈయన ప్రధాని ఖలఫ్ హసన్బస్రీ అఫాకీ. అఫాకీలకు మాత్రమే ఉన్నత పదవులు ఇచ్చాడు. దాంతో అఫాకీలకు, స్థానికులకు మధ్య వైరం పెరిగింది. రాజధానిని గుల్బార్గా నుంచి బీదర్‌కు మార్చి దాన్ని సుందరమైన నగరంగా దిద్దాడు. కానీ అవన్నీ అఫాకీలకే ఎక్కువ చెందినవి. ఈయన పక్షపాత చర్యలకు నిరసనగా స్థానిక సైనికులు సహాయ నిరాకరణ చేయడంతో గుజరాత్‌తో చేసిన యుద్ధంలో ఓడిపోయాడు. ఆయన శత్రు రాజ్యాలపై బాల, వృద్ధ, స్త్రీ, పురుష విచక్షణ లేకుండా చంపి హతుల సంఖ్య 20 వేలకు చేరినప్పుడల్లా మూడు రోజులు విందారగించే వాడని పెరిస్టా రాశాడు. ఆయన తర్వాత ఆయన కొడుకు రాజయ్యాడు.
రెండో అల్లాఉద్దీన్ అహమ్మద్ షా (1436-58)
ఈయన కాలంలో ప్రధాని ఖలఫ్ హసన్బస్రీయే. ఈయన పక్షపాత పాలనతో అఫాకీలకు, స్థానికులకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. గుజరాత్లో జరిగిన యుద్ధానంతరం స్థానిక సైనికులు ఆయన విడిదికి చాలా దూరంగా విడిది చేసుకోగా, అదే అదనుగా దాడి చేసి ప్రధానిని, మిగిలిన అఫాకీ సైనికులను చంపేశారు.
హుమాయూన్ (1458-1461)
ఈయన మహాక్రూరుడు. రెండు వేలమందిని చిత్రవధ చేసి వారి మాంసం ముక్కలను వారికే తినిపించాడు. తిరుగుబాటు చేసిన తమ్ముడు హసన్ ఖాన్‌ను పెద్దపులికి ఎరగావేశాడు. అతనికి సహాయం చేసినవారి భార్యలపై అత్యాచారం చేయించాడు. ఈ తిరుగుబాటుతో ఏ సంబంధం లేని 7 వేల మందిని కత్తులతో పొడిచి గొడ్డళ్లతో నరికి, వేడి నీళ్లలో, నూనెలో వేసి చంపాడు. ఇతడిని సేవకుడే చంపాడు. తర్వాత అతని కొడుకులు రాజులయ్యారు.
నిజాం షా (1461-63)
ఎనిమిదేండ్ల వయస్సులో గద్దెనెక్కాడు. ఆయన తర్వాత ఆయన తమ్ముడు సుల్తాన్ అయ్యాడు.
మూడో మహమ్మద్ షా (1463-1482)
ఈయన కాలంలో స్థానికులు, స్థానికేతరుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ప్రధాని మహమ్మద్ గవాన్ స్థానికేతరుడు (అఫాకీ). రాజధాని బీదర్‌లోని విశ్వవిద్యాలయం ఆచార్యులు, విద్యార్థులంతా అఫాకీలు. దీంతో నాటి సంస్కరణలన్నీ వారికోసమే అమలు చేశారు. కొలువులన్నీ వారికే దక్కాయి. ఈయన దక్కనీలు చేసిన అసత్య ఆరోపణలను నమ్మి మిక్కిలి సమర్థుడు. ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టిన ప్రధాని మహమ్మద్ గవాన్‌ను చంపించాడు. తర్వాత తప్పు తెలుసుకొని, పశ్చాత్తాపంతో 1482లో మరణించాడు.
మహమ్మద్ షా (1482-1518)
ఈయన కాలంలో దక్కనీ అఫాకీల మధ్య తగవులు ఎక్కువకాగా, వాటితో వేగలేక మకాంను బీజాపూర్‌కు మార్చుకున్నాడు. ఆయన తర్వాత పదేండ్ల పాటు నలుగురు వరుసగా నామమాత్ర పాలన సాగించారు. అందులో మూడేండ్లు పాలించిన అహమ్మద్ తన దుర్వ్యసనాల ఖర్చు కోసం సింహాసనంలోని బంగారం, రత్నాలు మొదలైన విలువైన వాటిని అమ్ముకున్నాడు. తర్వాత అల్లాఉద్దీన్ విరక్తి చెంది మక్కాకు వెళ్లాడు. తర్వాత వలీయుల్లా విషప్రయోగంతో చనిపోయాడు. చివరివాడు కరంఉల్లా అహ్మద్‌నగర్ పారిపోయి అక్కడే 1537లో మరణించాడు. దీంతో బహమనీ వంశం అంతరించింది.
బహమనీ సుల్తానులు (1347-1518)
అల్లాఉద్దీన్ బహమనీషా (1347-1358)
ఒకటో మహమ్మద్ షా (1358-1375)
ముజాహిద్ షా (1375-1378)
రెండో మహమ్మద్ షా (1378-1397)
తర్వాత ఇతని ఇద్దరు కొడుకులు (1395-1397)
ఫిరోజ్ షా (1397-1422)
అహమ్మద్ షా (1422-1436)
రెండో అల్లాఉద్దీన్ అహమ్మద్షా (1436-1458)
హుమాయూన్ (1458-1461)
నిజాం షా (1461-1463)
మూడో మహమ్మద్ షా (1463-1482)
మహమూద్ షా (1482-1518)
ప్రాక్టీస్ బిట్స్
-బహమనీ రాజ్య స్థాపకుడు? – అల్లా ఉద్దీన్ బహమన్ షా
-బహమనీ రాజ్యానికి రాజధాని? – గుల్బర్గా
-1356-57 బహమన్ షా ఎవరిని ఓడించాడు? – కాప నాయకుడిని
-1366లో తెలంగాణ ప్రాంతాన్నంతటినీ ధ్వంసం చేసిన బహమన్ షా వారసుడు? – ఒకటో మహమ్మద్ షా
-ఒకటో మహహ్మద్ షాకు గోల్కొండ కోటను, 300 ఏనుగులు, 2 వేల గుర్రాలు, రూ. 3 లక్షల నగదు, రత్న సింహాసనాన్ని ఇచ్చి రాజీ కుదుర్చుకున్నది ఎవరు? – కాపయ నాయకుడు
-ముజాహిద్ షాను చంపించి, రాజ్యానికి వచ్చిన ఆయన పినతండ్రి? – దావూద్ ఖాన్
-ముజాహిద్ షా, రెండో మహమ్మద్ షాల సమకాలికుడైన విజయ నగర రాజు? – రెండో హరిహరరాయలు
-విజయనగర, బహమనీ రాజ్యాల మధ్య ఘర్షణకు కారణమైన ప్రాంతం? – రాయచూర్ దో-ఆబ్ (కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య ప్రాంతం)
-రెండో మహమ్మద్ షా ఎప్పుడు మరణించాడు? – 1397
-1397లో బహమనీ రాజ్యంలో అధికారం చేపట్టింది? – ఫిరోజ్‌షా
-ఫిరోజ్ షా కాలంలో రాయచూర్ దో-ఆబ్ కోసం బహమనీ, విజయనగర రాజుల మధ్య ఎన్ని యుద్ధాలు జరిగాయి? – మూడు
-విజయనగర రాజులకు వ్యతిరేకంగా బహమనీ సుల్తానులకు అండగా నిలిచింది? – కొండవీటి రెడ్లు
-బహమనీ, విజయనగర రాజులకు జరిగిన మొదటి యుద్ధ కాలంలో విజయనగర రాజు? – రెండో హరిహరరాయలు
-బహమనీ, విజయనగర రాజులకు రెండో యుద్ధం ఎప్పుడు జరిగింది? – 1406
-ఫిరోజ్‌షాకు తన కూతుర్ని ఇచ్చి వివాహం చేసిన విజయనగర రాజు? – మొదటి దేవరాయలు
-మహమ్మద్ షాతో సంధి చేసుకున్న విజయనగర రాజు? – రెండో దేవరాయలు
-బహమనీ రాజ్యంలో దేశీయ ముస్లింలను ఏమని పిలిచేవారు? – దక్కనీలు
-బహమనీ రాజ్యంలో విదేశీ ముస్లింలను ఏమనేవారు? – అఫాకీలు
-బహమనీ రాజ్యాన్ని ఎన్ని తరఫ్ (రాష్ర్టాలు)లుగా విభజించారు? – గుల్బర్గా, దౌలతాబాద్, బీరార్, ఇందూర్-కౌలాస్ (తెలంగాణ)
-సుల్తానులకు సైన్యాలను సమకూర్చే షరతు మీద ఇచ్చే గ్రామాలను ఏమంటారు? – ఇక్తాలు
-ఇక్తాలుపై అధికారి? – ఇక్తేదార్
-తన ప్రార్థనలతో వర్షాలు కురిపించేవాడని, ప్రజలతో రుషి లేదా వలీగా గుర్తింపు పొందిన బహమనీ సుల్తాన్? – ఒకటో అహమ్మద్ షా
-1396-97 నుంచి 12 ఏండ్ల పాటు దక్షిణ దేశంలో ఏర్పడిన మహాక్షామాన్ని ఏమని పిలిచేవారు? – దుర్గాదేవి కరువు
-శత్రు దేశాన్ని దోచుకున్న సొత్తులో ఐదింటా నాలుగు వంతులను సైనికులకు, సైన్యాధికారులకు పంచే సంప్రదాయాన్ని అనుసరించిన వారు? – బహమనీ సుల్తానులు
-హిందువులు ఆలమ్ ప్రభుగా కొనియాడిన బహమనీ సుల్తాన్? – ఒకటో అహమ్మద్ షా
-గోవాను బహమనీ రాజుల నుంచి లాక్కున్న పోర్చుగీసు గవర్నర్? – ఆల్ఫాంజో ఆల్బుకర్క్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు