-సింధూ నాగరికత ఒక దశానుక్రమంగా అభివృద్ధి చెందినది కాగా, ఈ దశానుక్రమ పద్ధతి వేద నాగరికతలో కనబడదు. అంటే సింధూ నాగరికత రాగి యుగంతో ప్రారంభమై కంచు యుగంలో అత్యున్నత దశకు చేరుకోగా, వేద నాగరికత ఇనుప యుగంలో ఉన్నత స్థితికి చేరుకున్నది.
-భౌగోళిక పరంగా హరప్పా నాగరికత ప్రపంచ నాగరికతల్లోనే అతి పెద్దది. సప్తసింధు ప్రాంతంలో వర్థిల్లింది. వేదనాగరికత గంగా, యమున అంతర్వేదిలో గణనీయంగా అభివృద్ధి చెందింది.
-సింధూ నాగరికతకు ప్రధానం పురావస్తు ఆధారాలు కాగా, వేద నాగరికతలకు గ్రంథపరమైన ఆధారాలు ప్రధానమైనవి. సింధూ నాగరికతకు లిపి ఉండి భాషా పరిపక్వత కనబడదు. వేద నాగరికతకు భాష, లిపి ఉన్నాయి.
-ఇరు నాగరికతలకు చెందిన స్పష్టమైన తేడాలు సామాజిక, రాజకీయ, మత, సాంస్కృతిక వ్యవహారాల్లో కనబడతా యి. సామాజికపరంగా సింధూ నాగరికత మాతృస్వామ్యానికి చెందింది కాగా వేద నాగరికత పితృస్వామ్యానికి చెందినది. సింధూ నాగరికత సమాజంలో వర్గాలు ఏర్పడగా, వేద నాగరికత సమాజంలో వర్ణాలు, కులాలు ఏర్పడ్డాయి. స్వేచ్ఛా, సమానత్వాన్ని ఇచ్చిన సమాజం సింధూ నాగరికతది కాగా, వేదసమాజం వర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించినది.
-సింధూ నాగరికత పట్టణ నాగరికత కాగా, వేద నాగరికత ప్రధానంగా గ్రామీణ సంస్కృతి. సింధూ నాగరికతలోని మురుగుకాలువల నిర్మాణం, ధాన్యాగారాలు వేద నాగరికతలో కనబడవు. అదే విధంగా విస్తృతమైన అలంకరణ పద్ధతులు, ఖనన పద్ధతులు వేద నాగరికతలో కనబడవు. అభిరుచుల పరంగాను సింధూనాగరికతలోని వైవిధ్యం వేదనాగరికతలో లేదు.
-ఆర్థిక రంగంలో సింధూ నాగరికత వ్యవసాయానికి, వ్యాపారానికి ప్రాధాన్యం ఇవ్వగా వేదనాగరికత పశుపోషణకు ప్రాధాన్యం ఇచ్చింది. సింధూ నాగరికత ఖండాంతర వ్యాపారాన్ని నిర్వహించగా వేదనాగరికత పరిమితమైన వ్యాపారాన్నే నిర్వహించింది. సింధూనాగరికతలో స్పష్టమైన తూనికలు, కొలతలు కనబడతాయి. వేద నాగరికతలో ఇవేవి లేవు.
-సింధూ నాగరికత పట్టణాలను ఐశ్వర్యవంతులైన వ్యాపారులు పరిపాలించగా, వేద నాగరికతలో వంశపారంపర్యం, రాజరికం ప్రధానంగా కనబడుతుంది. సింధూ నాగరికత ప్రజలు కొన్ని విశ్వాసాలను పాటించారు. వేదనాగరితలో మత స్వరూపం స్పష్టంగా కనబడుతుంది. సింధూ నాగరకతలో పశుపతి ఒకే ఒక పురుష దేవుడు కాగా, వేద మతంలో సరస్వతి అనే ఒక స్త్రీ దేవత ఉన్నది. సింధూ ప్రజలకు ఎద్దు పవిత్రం కాగా వేద నాగరికతలో ఆవు పవిత్రమైనది. అమ్మ దేవతల ఆరాధన సింధూ మతంలో ప్రధానాంశం కాగా వేద మతంలో ప్రకృతి శక్తుల ఆరాధన ప్రధానమైనది.
-కళా స్వరూపాలలోనూ తేడాలు స్పష్టంగా కనబడుతాయి. సింధూ ప్రజలు అత్యంత నాణ్యమైన నల్లని కుండలు తయారు చేయగా వేదయుగం నాటి ఆర్యులు బూడిద రంగు కుండలు చేశారు. సింధూ నాగరికతలోని కళా స్వరూపాల్లో ఉన్న పరిపూర్ణత వేద నాగరికతలో కనబడదు. ముఖ్యంగా ముద్రికలు, విగ్రహాలు తయారుచేయడం, బంకమట్టి బొమ్మల వంటి వైవిధ్యమున్న కళాస్వరూపాలు వేదనాగరికతలో లేవు.
-సింధూ ప్రజలు అస్ట్రలాయిడ్, ప్రోటో అస్ట్రలాయిడ్ జాతులు కాగా ఆర్యులు కాకసాయిడ్ వంటి ఐరోపా మధ్య ఆసియా తెగలకు చెందినవారు.
-భాషాపరంగా సింధుప్రజలు ద్రావిడ భాషా కుటుంబానికి చెంది ఉంటారని భావించబడ్డది. ఆర్యులు ఇండో యూరోపియన్ భాషా కుటుంబానికి చెందినవారు.
-రెండు నాగరికతల మధ్యగల తేడాలు భారతదేశ చరిత్రలో ముఖ్యాంశమైన భిన్నత్వంలో ఏకత్వానికి తోడ్పడ్డాయి.
బౌద్ధమతం, జైనమతాలు భారతదేశానికి చేసిన సేవలను తెలపండి?
-ఇరు మతాలు భారతదేశ చరిత్రలో ప్రతి అంశాన్ని ప్రభావితం చేసేలా తమ సేవలను అందించాయి. ముఖ్యంగా సాంస్కృతిక రంగంలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా తమ సేవలను అందించాయి.
-భారతీయ వాస్తు శాస్ర్తానికి బౌద్ధం-జైనం దశ, దిశ నిర్దేశించాయి. తమ వాస్తు సంప్రదాయంలో భాగంగా బౌద్ధులు స్థూపం, చైత్యం, విహారాలు నిర్మించి హిందూ వాస్తు శైలిలోని ఆలయాల నిర్మాణానికి పరోక్షంగా కారకులయ్యారు. జైనులు తమవైన దేవాలయాలు బసదిలు నిర్మించారు. మౌంట్ అబూలోని దిల్వారా ఆలయం జైనవాస్తు శైలిలోని ఘనతను చాటుతుంది.
-శిల్పం ఒక కళగా అభివృద్ధి చెందడానికి ఇరుమతాలు దోహదపడ్డాయి. బౌద్ధం తన శిల్ప సంప్రదాయంలో గాంధార, మధుర, అమరావతి శిల్ప శైలులను ప్రవేశపెట్టినది. జైనం ఏకశిలా నిర్మితాలైన విగ్రహాలను రూపొందించడాన్ని ఒక కళగా తీర్చిదిద్దినది. శ్రావణబెళగోళలోని గోమఠేశ్వరుని విగ్రహం జైన శిల్పకళకు ప్రధాన నిదర్శనంగా చెప్పవచ్చు.
-చరిత్రలో తొలి గుహాలయాలను జైనులు నిర్మించారు. ఒరిస్సాలోని స్కందగిరి, కుమారగిరి గుహాలయాలు శ్రావణ బెళగొళలోని ఇంద్రగిరి, చంద్రగిరి ఆలయాలు, బాదామి, సిత్తన్నవాసల్ గుహాలయాలు జైనులు రూపొందించారు.
-సాహిత్యపరంగానూ ఇరు మతాలు గొప్ప సేవలందించాయి. ముఖ్యంగా బౌద్ధం.. పాళీ, సంస్కృతం అభివృద్ధి చెందడానికి తోడ్పడింది. సంస్కృతంలో తొలి కావ్యమైన బుద్ధచరిత్రను అశ్వఘోషుడు రచించాడు. ఆచార్య నాగార్జునుడు తన విస్తృతమైన రచనలతో సంస్కృత భాషాభివృద్ధికి తోడ్పడ్డాడు. వసుబంధుడు సంస్కృతంలో బౌద్ధతత్వంపై మొట్టమొదటి నిఘంటువు అభిదమ్మ కోశంను రచించాడు. దిగ్నాగుడు, ధర్మకీర్తి బౌద్ధ సాహిత్యంలో తర్కాన్ని ప్రవేశపెట్టారు. అదేవిధంగా జైనం ప్రాంతీయ భాషలైన అర్ధమాగధి, కానరాసి, సౌరసేని అభివృద్ధికి తోడ్పడినది జైన గ్రంథాలన్నీ ప్రాకృతంలోనే లిఖించబడ్డాయి.
-విద్యారంగ వ్యాప్తికి ఇరుమతాలు గొప్ప కృషిచేశాయి. ముఖ్యంగా బౌద్ధం శ్రీపర్వత, నలంద, విక్రమశిల, ఉద్ధండపుర, జగదల విశ్వవిద్యాలయాల స్థాపనకు కారణమైనది. అదేవిధంగా జైనం ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తొలి విద్యాలయాల స్థాపనకు కృషి చేసింది.
-సాంస్కృతిక పరంగా భారతీయ సంస్కృతి ఆగ్నేయ ఆసియా దేశాలకు విస్తరించడంలో ఇరు మతాలు కృషిచేశాయి. కుమారదేవుడు చైనాలో, విజయ సింఘన సింహళంలో మొదటిసారిగా బౌద్ధాన్ని ప్రవేశపెట్టారు. అశ్వఘోషుడు, కనిష్కుడు, బౌద్ధ్దాన్ని మధ్యఆసియాలో వ్యాప్తిచేసి భారతదేశ సాంస్కృతిక సంబంధాలను పటిష్టపరిచారు.
-రాజకీయ రంగంలోనూ బౌద్ధ జైనాలు తమ సేవల ద్వారా ఉనికిని చాటుకున్నాయి. శ్రేయోరాజ్యం అనే భావన బౌద్ధతత్వం నుంచి వచ్చింది. గొప్ప పాలకులైన అశోక, హర్షవర్ధనుడు బౌద్ధంతో ప్రభావితులయ్యారు.
-ఆర్థికరంగంలో వ్యాపార, వాణిజ్యాలు విస్తరించడానికి కూడా ఇరు మతాలు కారణమయ్యాయి. ముఖ్యంగా జైనులు వృత్తిపరంగా వ్యాపారాన్నే ఎంచుకున్నారు. బౌద్ధం చొరవతో తీరప్రాంతాల్లో, పట్టణాలు వ్యాపార కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి.
-తత్వచింతన మరింతగా అభివృద్ధి చెందడానికి ఇరు మతాలు దోహదపడ్డాయి. కర్మమార్గం ప్రాధాన్యాన్ని చాటిచెప్పాయి. హేతువాదానికి గట్టి పునాదులు వేశాయి. బౌద్ధంలో ఆచార్య నాగార్జునుడు శూన్యవాదాన్ని ప్రవేశపెట్టాడు. చివరకు ఇది తత్వచింతనలో గొప్ప వాదమైన శంకరాచార్యుని అద్వైత సిద్ధాంతానికి మూలం.
బౌద్ధ- జైనులకు బ్రాహ్మణ మతంతో ఉన్న పోలికలు, తేడాలు వివరించండి.
-ఈ మతాల మధ్య తులనాత్మకమైన అధ్యయనం చేయడానికి ముందు ఇరుమతాలు బ్రాహ్మణ మతం నుంచే ఆవిర్భవించాయని గుర్తించాలి. అయితే తేడాల పరంగా మతం, తత్వచింతనలో ఇవి బ్రాహ్మణమతంలో కొన్ని విషయాల్లో విభేదించాయి.
-బ్రాహ్మణ మతానికి ఆధారమైన వేదాలను బౌద్ధ, జైన మతాలు వ్యతిరేకించాయి.
-వేదమతంలోని యజ్ఞయాగాలు, కర్మకాండలను ఇరుమతాలు నిరసించాయి.
-వేదమతంపై బ్రాహ్మణాధిక్యతను ఇరుమతాలు ప్రశ్నించాయి.
-మోక్షాన్ని బ్రాహ్మణ మతం కేవలం అగ్రవర్ణాలకే పరిమితం చేయగా బౌద్ధ, జైనాలు అందరికి అందుబాటులోకి తెచ్చాయి.
-తత్వపరంగా బ్రాహ్మణమతం జ్ఞానమార్గానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వగా బౌద్ధ, జైనులు కర్మమార్గానికి ప్రాధాన్యం ఇచ్చాయి.
-బ్రాహ్మణ మతంలోని మార్మికవాదాన్ని వ్యతిరేకించి ఇరు మతాలు హేతువాదానికి ప్రాధాన్యం ఇచ్చాయి.
-సామాజిక పరంగా బ్రాహ్మణమతం అధిపత్య ధోరణికి కారణమయ్యే కులవ్యవస్థను పాటించగా, బౌద్ధ, జైనాలు కులవ్యవస్థలోని లోపాలను సరిదిద్దడానికి పూనుకున్నాయి.
-బ్రాహ్మణమతం పుట్టుకకు ప్రాధాన్యమివ్వగా, బౌద్ధ, జైనా లు ప్రతిభను బట్టి వ్యక్తిస్థాయిని గుర్తించాయి.
-ఇరుమతాల మధ్య తేడాలు ఆర్థిక రంగంపై వీటి ఆలోచనా ధోరణిలోనూ కనబడతాయి. బ్రాహ్మణ మతం తిరోగమనవాదంతో కూడిన నియమ నిబంధనలు అంటే సముద్ర వ్యాపార నిషేధం, లాభాపేక్షను నిరసించడం వంటి నియమాలను పాటించింది. ఇందుకు వ్యతిరేకంగా బౌద్ధ, జైనాలు సముద్ర వ్యాపారాన్ని, లాభాపేక్షను సమర్థించాయి. బ్రాహ్మణ మతం వృత్తిపరంగా అసమానతలు సృష్టించగా బౌద్ధ, జైనాలు ప్రతివృత్తి పట్ల సమానత్వాన్ని కనబరిచాయి. అంటే నీచవృత్తులు అనే భావనను తొలగించాయి.
-అయితే పరిశీలనాత్మకమైన దృష్టితో గమనిస్తే వీటి మధ్య పోలికలు కూడా కనబడుతాయి.
-తత్వచింతనలో బ్రాహ్మణ మతంలోని ఉపనిషత్తుల వాదాన్ని ఇరు మతాలు అంగీకరించాయి.
-కర్మమార్గం, పునర్జన్మవాదాలను ఇరుమతాలు అంగీకరించాయి.
-దైవం ఉనికిపై కూడా బౌద్ధం మౌనాన్ని పాటించిందే కాని వ్యతిరేకించలేదు. జైనం దేవుడు ఉన్నాడని ప్రకటించింది.
-మోక్షానికి మార్గాలు వేరయినప్పటికి మోక్షం అనే భావనను ఇరు మతాలు అంగీకరించాయి.
-సామాజికపరంగా కుల వ్యవస్థలోని లోపాలను వ్యతిరేకించాయే కాని వ్యవస్థను కాదు.