సంస్కరణలతో పెరిగిన సంపద ( తెలంగాణ హిస్టరీ )
గ్రూప్స్ ప్రత్యేకం
-గత తరువాయి..
– నసీరుద్దౌలా ప్రధానమంత్రిగా ఉన్న సిరాజ్ ఉల్ ముల్క్ మరణించిన తర్వాత, అతడి మేనల్లుడు సాలార్జంగ్ 1853లో ప్రధానమంత్రిగా నియమితులయ్యాడు. 1853-83 మధ్యకాలంలో అంటే మూడు దశాబ్దాలపాటు సాలార్జంగ్ ముగ్గురు నిజాం (నసీరుద్దౌలా, అఫ్జల్ ఉద్దౌలా, మీర్ మహబూబ్ అలీఖాన్)ల కొలువులో ప్రధానమంత్రిగా పనిచేశాడు.
– బ్రిటిష్ అధికారి డైటన్ వద్ద అపార పరిపాలనానుభవం గడించాడు. ఉన్నతమైన పాలనా విధానం ఎంత అవసరమో గ్రహించి, సంస్కరణలతో, ప్రతిభావిశేషాలతో మంచి పరిపాలనాదక్షుడిగా కీర్తి గడించాడు. అతడి అసలు పేరు నవాబ్ తురబ్ అలీఖాన్. సాలార్జంగ్ అతడి బిరుదు.
– సాలార్జంగ్ తన సంస్కరణలను మూడు దశలుగా ప్రవేశపెట్టాడు. 1) 1857 నుంచి 1864 వరకు ప్రథమ దశ- ఈ కాలంలో సంస్కరణలు మందకొడిగా సాగాయి.
2) 1864 నుంచ 1880 వరకు రెండో దశ- ఈ దశలో సంస్కరణలు కట్టుదిట్టంగా అమలుపరిచాడు.
3) 1881 నుంచి 1882 వరకు మూడో దశ- ఈ దశలో సంస్కరణలు పూర్తిచేశాడు.
సంస్కరణలు.. 1) పరిపాలన 2) ఆర్థిక 3) రెవెన్యూ 4) వ్యవసాయ 5) న్యాయ 6) పోలీస్ 7) కరెన్సీ 8) విద్య 9) రవాణా 10) ఇతర సంస్కరణలు.
-సాలార్‌జంగ్‌కు ముందు ప్రధాని పదవిని నిర్వర్తించిన చందూలాల్ ఆర్థిక విధానాలు ఖజానాను దివాళా తీయించాయి. దీంతో సాలార్జంగ్ ప్రభుత్వ ఆదాయం పెంచే మార్గాలను వెతికాడు.
– పనిలేకుండా ఉన్న 1000 మంది ఉద్యోగులను తొలగించాడు. నిజాం సైన్యాన్ని కొంత తగ్గించాడు. దీనివల్ల ప్రభుత్వ నిర్వహణలో దుబారా ఖర్చు తగ్గి రెండేండ్లలో ఆర్థికలోటు తీరి నిజాం కుదువపెట్టిన ఆభరణాలు, వజ్రాలు, భూములను విడిపించాడు.
– 1857లో సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైన వారం రోజులకు నసీరుద్దౌలా మరణించాడు. అతడి కుమారుడు నిజాం అయ్యాడు. తిరుగుబాటులో హైదరాబాద్ చేరాలని ప్రజల నుంచి సాలార్జంగ్పై ఒత్తిడి పెరిగింది. కానీ సాలార్జంగ్ తనకు అవసరం ఉన్నందున ఇంగ్లిష్ వారికి మద్దతు ఇచ్చాడు. దీంతో ఇంగ్లిష్‌వారు నవాబుకు ‘స్టార్ ఆఫ్ ఇండియా’ బిరుదును ఇచ్చారు.
– 1853లో బకాయి కింద ఆక్రమించిన రాయచూర్, ఉస్మానాబాద్‌లను తిరిగి పొంది, నిజాం బకాయి పడిన రూ.50 లక్షలను రద్దు చేయించాడు. వీటివల్ల నిజాం రాజ్య లోటు బడ్జెట్ రెండేండ్లలో మిగులు బడ్జెట్‌గా మారింది.
– సాలార్జంగ్ పరిపాలనలో క్రమబద్ధమైన సంస్కరణలు ప్రవేశపెట్టాడు. సంప్రదాయ పద్ధతులను తొలగించాడు. నిజాంకు బ్రిటిష్‌వారు పునరుద్ధరించిన జిల్లాల్లో సమర్థవంతమైన పరిపాలన చేపట్టాడు. దివానీ భూభాగం పరిపాలనను క్రమబద్ధం చేశాడు. దివానీ చేతిలో అధికార కేంద్రీకరణ జరిగింది.
-దివానీ భూభాగంలో తాలూకాలు ఉండేవి. కానీ తాలూకాదారుల సంఖ్య ప్రతి సంవత్సరం మారేది. దీనిని తొలగించడానికి సాలార్జంగ్ ఎంతో కృషిచేశాడు. నిజాం రాజ్యాన్ని మూడు సుబాలుగా, 17 జిల్లాలుగా, జిల్లాలను తాలూకాలుగా విభజించాడు. ఈ విధంగా యూనిఫామ్ సివిల్ డివిజన్లను సృష్టించాడు. ప్రతి సుబాకు సుబేదార్, ప్రతి జిల్లాకు ఒక కలెక్టర్, ప్రతి తాలూకాకు ఒక తహసీల్దార్‌ను నియమించాడు. అతడి ప్రధాన విధి రెవెన్యూ సేకరణ, క్రిమినల్ కేసులు పరిష్కరించడం. అసిస్టెంట్ తాలూకాదురుడిని కూడా నియమించాడు. ఎస్టాబ్లిష్మెంట్ క్లర్కులు వీరికి సహాయం అందించేవారు.
– మజ్లిస్ ఇంతిజామ్-ఇ-మల్‌గుజారి బోర్డును ఏర్పాటు చేసి ప్రధాన సంస్కరణలను ప్రవేశపెట్టాడు. పరిపాలనలో 14 శాఖలు ఉండేవి. 1) జ్యుడీషియల్ 2) రెవెన్యూ 3) పోలీస్ 4) ప్రజాపనులు 5) విద్య 6) మెడికల్ 7) మున్సిపాలిటీలు 8) మిలిటరీ 9) ఫైనాన్స్ 10) పోస్టల్ 11) రైల్వే అండ్ టెలిగ్రాఫ్, ప్రైవీపర్స్ 12) ఎస్టేట్ 13) రాజకీయ 14) లీగల్.
– కేంద్ర ప్రభుత్వ విధులను నాలుగు శాఖలుగా విభజించి ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క మంత్రిని నియమించాడు. వారిని సదర్ ఉల్ మహమ్ అని పిలిచేవారు. మంత్రులు ప్రధానమంత్రికి లోబడి ఉండేవారు. మొదటి ముగ్గురు మంత్రులు పోలీస్, న్యాయ, రెవెన్యూ శాఖలు, నాలుగో మంత్రి విద్య, ఆరోగ్య, స్థానిక సంస్థలు, ప్రజాసంక్షేమం కలిపి ఒక శాఖగా నిర్వహించేవాడు.
-ప్రతి శాఖ నిర్వహణకు కార్యదర్శులను నియమించేవాడు. జ్యుడీషియల్, పోలీసుకు ఒక కార్యదర్శి, రెవెన్యూకు ఒక కార్యదర్శి, ఒక అసిస్టెంట్, సైనిక వ్యవస్థకు ఒక కార్యదర్శి, ఒక సహాయ కార్యదర్శి, పబ్లిక్ వర్క్‌కు ఒక కార్యదర్శి, ముగ్గురు అసిస్టెంట్లు, సైనిక దళాల సంస్కరణలకు ఒక కార్యదర్శి, ఒక సహాయ కార్యదర్శి, ఇతరత్రాకు ఒక కార్యదర్శి, ఒక సహాయ కార్యదర్శి, ఆంగ్ల కార్యాలయంలో సైనిక కార్యదర్శి, ప్రైవేట్ కార్యదర్శి, అసిస్టెంట్, సర్ఫ్-ఎ-ఖాస్కు ఒక కార్యదర్శి, ఒక సహాయ కార్యదర్శి, రాజకీయ కార్యాలయానికి మీర్ మున్షీ, లీగల్‌కు ఒక కార్యదర్శి. ఫైనాన్స్, సెంట్రల్, ట్రెజరీ, పోస్టాఫీస్ ప్రధానమంత్రి కింద ఉండేవి.
– రైతులను అవినీతి అధికారుల నుంచి రక్షించడానికి తాలూకాదారులకు జీతాలు ఇచ్చేవాడు. రైతులపై అధికారులు భారం వేయకుండా జాగ్రత్తపడ్డాడు. అందుకు పరిష్కార మార్గంగా జిలాబందీ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. తహసీల్దార్ కీలకమైన పాత్ర పోషించేవాడు. గ్రామ నిర్వహణ ఖాతాలతోపాటు సరిహద్దు సమస్యల నిర్వహణ బాధ్యత అతడిదే. గ్రామ అధికారులు సరిగ్గా పనిచేసేలా అతడు తనిఖీలు నిర్వహించేవాడు. ధాన్యం కొలత, ప్రభుత్వ వాటా ఖమామ్ష్ చూసేవాడు. కానీ ఆ ఉద్యోగులకు తక్కువ జీతం ఉండటం వల్ల అవినీతి పెరిగింది. అందుకు ఖమామ్ష్ సేవలు నిలిపివేసి తిరిగి సంప్రదాయ గ్రామ అధికారులైన పట్వారీ, పటేల్‌లకు రెవెన్యూ వ్యవహారాలు నిర్వహించడానికి అధికారం ఇచ్చాడు.
– ప్రతి గ్రామానికి ఇద్దరు పటేల్‌లు ఉండేవారు. ఒకరు రెవెన్యూ వ్యవహారాలు చూడగా, మరొకరు పోలీస్ వ్యవహారాలు చూసేవారు. గ్రామ గుమస్తా, తలారీ, ప్యూన్ ప్రతి 50 ఇండ్లకు ఉండేవారు. పన్నులు చెల్లించేవారి పేర్లను రసీదుల పుస్తకంలో రాసేవారు. దానినే పాస్త్రీ అనేవారు. దీని లావాదేవీలు తహసీల్దార్, తాలూకాదార్ చూసుకునేవారు. 1864-65లో రెవెన్యూ కార్యదర్శిని ప్రధానమంత్రి నియమించాడు. రాజ్యాన్ని 17 రెవెన్యూ జిల్లాలుగా విభజించాడు. ఈ జిల్లాలను 3 ప్రాంతీయ మండలాలుగా చేశాడు.
– వేలం పద్ధతి ద్వారా భూమి శిస్తు వసూలు చేసే పద్ధతికి స్వస్తి చెప్పి రైతులకు భూములపై హక్కులను కల్పించాడు. భూమిని కొలతలు వేయించి, దిగుబడిని బట్టి భూమిశిస్తు నిర్ణయించే పద్ధతి అనుసరించాడు. దీనికోసం సర్వేశాఖ, సెటిల్మెంట్ శాఖ ఏర్పాటయ్యాయి. 1864లో రెవెన్యూ బోర్డు ఏర్పడింది. అందులో నలుగురు సభ్యులు ఉన్నారు. రెవెన్యూ కార్యదర్శి అన్ని పనులు చూసుకునేవాడు. కానీ జాగీరులు, ఇనామ్‌లు ఇవ్వడం, తాలూకాదారు నియామకం, లీజు మంజూరు చేయడం, ఆదాయ సంస్కరణలు ప్రధానమంత్రి నిర్వహించేవాడు. దీనిలో ఒక అధ్యక్షుడు, నలుగురు సభ్యులు ఉండేవారు. వారికి వ్యవసాయం, వర్తక వ్యాపారాలు, ఎగుమతి, దిగుమతి సుంకాలు, స్టాంప్ డ్యూటీ, రహదారులు, స్థానిక సంస్థలకు సంబంధించిన పన్నులన్నింటిపై అజమాయిషీ అధికారం ఇచ్చాడు.
– 1867-68లో రెవెన్యూ బోర్డును తొలగించారు. రెవెన్యూ బోర్డు స్థానంలో సదర్ మహకీ-ఇ-మల్గుజారీ అనే కేంద్ర రెవెన్యూ శాఖ ఏర్పాటయ్యింది. ఈ శాఖ ప్రధానాధికారులను ముహతమీమ్, రుకున్ అని అంటారు. వీరు వ్యవసాయం, నీటి సాగు, గ్రామ రక్షణ దళం, స్టాంపుల మంజూరీ చూసేవారు. యువకులనే మంత్రులుగా నియమించాడు. 14 కార్యాలయాలు ఏర్పాటు చేశాడు. పరిపాలనను ప్రభుత్వ నియంత్రణలోకి తెచ్చాడు. ఇతడి వ్యక్తిగత కార్యదర్శి సయ్యద్ స్సేన్ బిల్‌గ్రామీ.
-1855లో హైదరాబాద్ నగరంలో కేంద్ర కోశాగారాన్ని, జిల్లా, తాలూకాల్లో స్థానిక కోశాగారాన్ని ఏర్పాటు చేశాడు. 1857 తిరుగుబాటు తరువాత ఇక్కడ ముద్రించిన నాణేలపై మొగల్ పాదుషా పేరు తొలగించారు. 1880-81 ఆదాయ సంస్థలో ఒక రెవెన్యూ మంత్రి, ఐదుగురు సదర్ తాలూకాదారులు, 16 గ్రేడ్-1 తాలూకాదారులు, ఒక అమల్దార్, 21 రెండో (గ్రేడ్-1) తాలూకాదారులు, 17 మూడో తరగతి అధికారులు, 105 మంది తహసీల్దార్లు, నయిబ్ తహసీల్దార్లు ఉండేవారు.
-1882-83లో తిరిగి రెవెన్యూ బోర్డ్‌ను ముగ్గురు సభ్యులతో నియమించాడు. రెవెన్యూ కార్యదర్శి పదవిని నిర్మూలించాడు. సదర్-ఉల్-మోహమ్ కార్యాలయం, మోదర్-ఉల్-మోహమ్ ప్రధానమంత్రితో విలీనమయ్యాయి. సదర్-ఉల్-మోహమ్ ప్రధానమంత్రికి సహాయకుడిగా ఉండేవాడు. 1884-85లో మరొక పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఆ ముగ్గురు సభ్యులను సుబేదారులుగా నియమించాడు. ఏజే డన్లప్ నజీమ్‌గా 1884-85లో నియమితులయ్యారు. నజీమ్, పరిష్కార కమిషనర్ కార్యాలయం విలీనమయ్యాయి.
– రెవెన్యూ మండలాలు 5. 1) ఉత్తర మండలం- నిజామాబాద్, కరీంనగర్ 2) దక్షిణ మండలం- గుల్బర్గా, షోలాపూర్, రాయ్‌చూర్ 3) పశ్చిమ- బీదర్, నాందేడ్ 4) తూర్పు మండలం- వరంగల్, ఖమ్మం, నల్లగొండ 5) వాయవ్య మండలం- ఔరంగాబాద్. ప్రతి మండలానికి ఒక సుబేదార్ ఉండేవాడు. జిల్లాకు తహసీల్దార్ ఉండేవాడు. రైతు బాగుపడితే రెవెన్యూ పెరుగుతుందని భావించి వ్యవసాయాభివృద్ధికి కృషిచేశాడు. ఎన్నో చెరువులకు మరమ్మతు చేయించాడు, నూతన చెరువులు, కాలువలను తవ్వించాడు. దళారీ విధానాన్ని తొలగించి రైతుకు ప్రభుత్వానికి ప్రత్యక్ష సంబంధం ఏర్పరచి వారికి తమ భూములపై హక్కులు కల్పించాడు. భూమి సాగు విస్తీర్ణాన్ని బట్టి శిస్తు నిర్ణయించాడు. శిస్తు ధర ధన రూపంలో గాని, ధాన్య రూపంలో గాని చెల్లించవచ్చునని నిర్ణయించాడు. 1873లో సర్వే సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేశాడు. ఉద్యోగులకు ఇనాములు ఇచ్చాడు. అసమర్థులు, లంచగొండి ఉద్యోగులను, బలవంత పన్నులు, జరిమానాలు విధించడం, శిక్షలు వేయడం చేసినవారిని తొలగించాడు.
అడపా సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు