ఇడ్లీ సాంబార్ గో బ్యాక్!
మిలిటరీ, సివిల్ పాలనాకాలంలో ఉపాధి, ఉద్యోగ రంగాల్లో చోటుచేసుకున్న పరిణామాలు 1952 ముల్కీ ఉద్యమానికి తక్షణ కారణమయ్యాయి. పోలీసు చర్య తరువాత ముస్లిం అధికారులను ఉద్యోగాల నుంచి తొలగించడం, ఉర్దూ భాష ప్రాధాన్యాన్ని తగ్గించడం, తెలుగు, ఇంగ్లిష్ భాషలకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి అంశాలు తెలంగాణ ప్రాంత ప్రజల్లో అసంతృప్తిని పెంచాయి. బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ స్థానికేతరులు ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతీయుల ఆధిక్యత, ప్రాంతీయాభిమానం విద్యావంతులైన తెలంగాణ వారికి అనేక నష్టాలను కలిగించాయి. రెవెన్యూ, విద్య, పోలీసు శాఖల్లో స్థానికేతరుల ప్రాబల్యం వల్ల స్థానిక ఉద్యోగుల ప్రమోషన్లకు ఆటంకం కలిగింది. అందుకే కోస్తాంధ్ర వారిపై స్థానికంగా వ్యతిరేకత పెరిగింది. ఆ వ్యతిరేకతే క్రమంగా ఉద్యమ రూపం దాల్చింది.
ప్రముఖ తెలంగాణ రాజకీయ నాయకుడు, హైదరాబాద్ శాసనసభ్యుడైన రామాచారి 1952 ఆగస్టు నెల చివరివారంలో ‘హైదరాబాద్ రక్షణ సమితి’ని స్థాపించి నాన్ ముల్కీలు వెనక్కి వెళ్లాలని నినాదమిచ్చారు. అందువల్లనే 1952లో ఆంధ్రప్రాంతం నుంచి ‘మిడతల దండులా’ వచ్చిన వారికి వ్యతిరేకంగా ‘ఇడ్లీ సాంబార్ గో బ్యాక్’, ‘గైర్ ముల్కీ గో బ్యాక్’ ఉద్యమం ప్రారంభమైంది. ఇది మొదట వరంగల్‌లో ప్రముఖ రాజకీయ నాయకుడు హయగ్రీవాచారి నాయకత్వంలో ప్రారంభమైంది. ఈ ఉద్యమానికి బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలోని సభ్యులు కొంతమంది పరోక్షంగా సహకరించడం గమనార్హం. జస్టిస్ జగన్మోహన్రెడ్డి నివేదికలో 1952 ముల్కీ ఉద్యమ పూర్వాపరాలు పొందుపరిచారు. దీనిలో వరంగల్ ఉద్యమానికి చెందిన అంశాలను గమనించాల్సిన అవసరముంది. వరంగల్‌లో పార్థసారథి అనే నాన్ ముల్కీ డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్థానిక టీచర్లను వేదిస్తున్నాడని పై అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానిక రాజకీయ నాయకుడు హయగ్రీవాచారి ఆయనకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించాడు. పార్థసారధి ఉదంతం స్థానికేతరుల ఆధిపత్యానికి ఒక నిదర్శనం. ఎందుకంటే ఆయన తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని స్థానికేతరులకు ప్రయోజనాలు చేకూర్చాడు. ఉద్యోగ రంగంలో స్థానికేతరుల పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు పెద్దఎత్తున ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. మొదటగా 5 రోజులు కొనసాగిన ఆందోళనలో విద్యార్థులు సమావేశమై ఒక తీర్మానాన్ని ఆమోదించారు. దీని ప్రకారం ‘పోలీసు చర్య తరువాత ప్రభుత్వ ఉద్యోగాల్లో దొంగ ముల్కీ సర్టిఫికెట్ల ద్వారా ప్రవేశించిన సంస్థానేతరులపై విచారణ జరిపి అలాంటి వారిని ప్రభుత్వం తొలగించి సంస్థానవాసుల నిరుద్యోగ సమస్య తీర్చాలని, ఇక ముందు ఇలాంటి ముల్కీ సర్టిఫికెట్లు సరైన రుజువు లేనిదే ఇవ్వకూడదని తీర్మానించారు.
# వరంగల్‌లో విద్యార్థులు ప్రారంభించిన ఈ ఉద్యమం నిజామాబాద్, ఖమ్మం జిల్లాలకు వ్యాపించింది. ఈ ఉద్యమంలో విద్యార్థులు, యువకులు చురుకైన పాత్ర పోషించారు. ప్రభుత్వ రిపోర్టుల ప్రకారం కొంతమంది స్థానిక రాజకీయ నాయకుల ప్రభావం కూడా ఈ ఉద్యమాలపై ఉన్నట్లు తెలుస్తుంది. జిల్లా కేంద్రాల్లో ముల్కీ, నాన్‌ముల్కీ ఉద్యోగుల మధ్య పెరుగుతున్న వైషమ్యాలు, స్థానికేతర ఉన్నతోద్యోగుల విధానాలు, నిర్ణయాలు ముల్కీ ఉద్యమాన్ని ప్రోత్సహించాయని చెప్పవచ్చు. మొదటగా వరంగల్ జిల్లాలో ప్రారంభమైన ఈ ఉద్యమం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు వ్యాపించటంతో మరింత ఉధృతంగా మారింది. హైదరాబాద్ నగరంలో విద్య, ఉద్యోగ రంగాల్లో స్థానికేతరులకు అవకాశాలు ఇవ్వడం పట్ల స్థానిక విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. అడ్మిషన్లలో, ఉద్యోగాల్లో ప్రమోషన్లలో స్థానికులకు ప్రాధాన్యత కల్పించాలనేది 1952 ముల్కీ ఉద్యమం ముఖ్య లక్ష్యం.
# తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో వేల సంఖ్యలో విద్యార్థులు పాఠశాలలను బహిష్కరించి ప్రదర్శనలు చేస్తూ ముల్కీయేతరులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సమ్మెకు దిగారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో విద్యార్థి ఉద్యమాలు ఉధృతమయ్యాయి. ఆనాటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఈ ఉద్యమానికి స్పందిస్తూ ముల్కీ సర్టిఫికెట్ల జారీ విషయంలో, స్థానికులకు ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యత గురించి హామీలిచ్చినప్పటకీ విద్యార్థులు సంతృప్తి చెందలేదు. ఉద్యమాన్ని కొనసాగించే ఉద్దేశంతో విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి పలురకాల ఆందోళనలు చేపట్టింది. విద్యార్థి ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని వినియోగించింది.
# పోలీసుల దమనకాండ ప్రభుత్వ నిర్లక్ష వైఖరిని నిరసిస్తూ హైదరాబాద్ నగరంలోని అనేక పాఠశాలల, కాలేజీల విద్యార్థులు ఊరేగింపులు నిర్వహించి సమ్మెలు చేశారు. నిజాం కాలేజీ, సైఫాబాద్ కాలేజీ, సిటీ కాలేజీ విద్యార్థులు ఈ ఉద్యమంలో కీలక పాత్ర వహించారు. విద్యార్థులు స్థానికేతరులకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమానికి అనేకమంది మేధావులు, రాజకీయ పార్టీలు పౌరసంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు. 1952 సెప్టెంబర్ 3న హైదరాబాద్ పాతనగరంలోని సిటీ కాలేజీ విద్యార్థులు ముల్కీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో ప్రాధాన్యత కల్పించాలని, నాన్‌ముల్కీలు వెనక్కిపోవాలని నినాదాలు చేశారు. సిటీ కాలేజీ పరిసరాల్లో దాదాపు 7-8 వేలమంది విద్యార్థులు, ప్రజలు నినాదాలు చేస్తూ సిటీ కాలేజీ నుంచి ఊరేగింపు నిర్వహించాలని ప్రయత్నించారు. అయితే పోలీసులు అందుకు నిరాకరించారు. దాంతో పోలీసులకు ఉద్యమకారులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో గుమికూడిన జనాన్ని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జీ చేసి భాష్పవాయువు ప్రయోగించారు. దానికి జవాబుగా పోలీసులపై జనం రాళ్లు రువ్వటం, ప్రభుత్వ వాహనాలకు నిప్పు పెట్టడంతో పరిస్థితి విషమించింది. వేలసంఖ్యలో ఉన్న జనాన్ని అదుపు చేయడానికి పోలీసులు తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పులు జరిపారని, ఆ కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించాడని జస్టిస్ జగన్మోహన్రెడ్డి కమిటీ రిపోర్టులో పేర్కొన్నారు.
#సిటీ కాలేజీలో పోలీసు కాల్పులకు నిరసనగా పెద్ద సంఖ్యలో ప్రజలు గుమికూడారు. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిస్తూ సిటీ కాలేజీ నుంచి పత్తర్‌గట్టీ-మదీనా వైపు ఊరేగింపుగా బయలుదేరారు. ఆ ఊరేగింపులో తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఐక్యవేదిక సభ్యుడు కేశవరావ్ జాదవ్ కూడా పాల్గొన్నారు. విద్యార్థులు, జనరల్ పబ్లిక్ ఊరేగింపుగా మదీన హోటల్ సమీపంలోకి రాగానే ఎలాంటి హెచ్చరికలు లేకుండా పోలీసులు ఆందోళనకారులపై విచక్షణారహితంగా కాల్పులు జరపడం వల్ల ఒక విద్యార్థి, ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని ఉస్మానియా జనరల్ హాస్పటల్‌కు తరలించారు. జస్టిస్ జగన్మోహన్రెడ్డి రిపోర్టు ప్రకారం 1952 సెప్టెంబర్ 3న దాదాపు 30 వేల నుంచి 40 వేల మంది పత్తర్‌గట్టి-మదీనా పరిసరాల్లో సిటీ కాలేజీ కాల్పుల ఘటనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ, పలు హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. అందువల్ల పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో మహ్మద్ ఖాసిం (22), అనే ఫ్యాక్టరీ కార్మికుడు అక్కడికక్కడే మరణించాడు. మిగతా ఇద్దరు జమాలుద్దీన్ (40) ప్రైవేటు కార్మికుడు, రాములు (18) ప్రైవేటు కార్మికుడు ఆ తర్వాత మరణించారు. ఈ కాల్పులకు నిరసనగా ఉద్యమకారులు ముఖ్యమంత్రి కారుకు నిప్పంటించారు. సిటీ కాలేజీ కాల్పుల ఉదంతం హైదరాబాద్ నగరంలో అలజడి సృష్టించింది. విద్యార్థుల ఆందోళనలు, మరణాల పట్ల పౌరసమాజంలోని అనేకమంది ప్రముఖులు స్పందించారు. సిటీ కాలేజీ కాల్పుల తరువాత హోం శాఖ మంత్రి దిగంబర్రావుతో సహా మిగతా రాజకీయ నాయకులు విద్యార్థులను శాంతింపజేయడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ విద్యార్థులు స్వచ్ఛందంగా ఉద్యమాన్ని కొనసాగించారు.
# హైదరాబాద్ నగరంలో పలు కళాశాలల విద్యార్థులు నిరసన ఉద్యమాల్లో పాల్గొన్నారు. విద్యార్థుల ఆవేశం పలు హింసాత్మక సంఘటనలకు దారితీసింది. మరోపక్క ప్రభుత్వం కర్ఫ్యూ విధించి దమనకాండను కొనసాగించింది. తత్ఫలితంగా జరిగిన అనేక సంఘటనల్లో పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. సిటీ కాలేజీ ఉద్యమ ప్రభావం తెలంగాణాలోని అనేక ప్రాంతాల్లోకి విస్తరించింది. ముఖ్యంగా వరంగల్, హనుమకొండలో వేలాదిమంది విద్యార్థులు, సంఘాల నాయకులు, బహిరంగ సభలు నిర్వహించారు. ఆనాటి ఉద్యమంలో కాలోజీ నారాయణరావు, ప్రొఫెసర్ జయశంకర్ పాల్గొన్నారు.
# ముల్కీ ఉద్యమం తీవ్రతను గమనించిన హైదరాబాద్ ప్రభుత్వం 1952 సెప్టెంబర్ 7న ముల్కీ నిబంధనలను పరిశీలించి అమలు చేయడం కోసం నలుగురు మంత్రులతో ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ముల్కీ నిబంధనలకు సంబంధించిన అంశాలను పరిశీలించి అమలవుతున్న తీరుపై ప్రజాభిప్రాయ సేకరణ చేసి నివేదిక సమర్పించడం ఈ ఉపసంఘం ప్రధాన విధి. అంతేకాకుండా హైదరాబాద్‌లో పోలీసుల కాల్పులపై విచారణ కోసం ప్రభుత్వం హైకోర్టు సిట్టింగ్ జడ్జి పింగళి జగన్మోహన్రెడ్డి కమిటీని నియమించింది. ఈ నివేదికతో సిటీ కాలేజీ ఉదంతానికి సంబంధించిన అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. 1952 ముల్కీ ఉద్యమంలో 18 మంది చనిపోయారని, వందలాది మంది గాయపడ్డారని తెలిసింది. అంతేకాకుండా సుమారు 350 మంది విద్యార్థులను, పత్రికా విలేకరులను, యువకులను అరెస్టు చేసి వేధించారని తెలిసింది. ఉద్యమం విరమించిన తర్వాత సెప్టెంబర్ 13న సయ్యద్ అక్తర్ స్సేన్, ఎం.ఎల్.ఏను ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం కింద అరెస్టు చేశారు. ఈయన ‘అవామ్’అనే ఉర్దూ పత్రిక సంపాదకుడు. మరో ఉర్దూ పత్రికా సంపాదకురాలు బేగం సాదిక్ జహాన్‌ను కూడా పీడీ చట్టం కింద అరెస్టు చేశారు. కానీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడం వల్ల ఆమెను ఆ తర్వాత విడుదల చేశారు. ఉద్యమానికి సంబంధించిన వార్తలు ప్రచురించినందుకు ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకుంది. ముల్కీ ఉద్యమంలో పోలీసు కాల్పుల్లో చనిపోయిన వారిలో అరుణ, రిక్షా కార్మికుడైన మహ్మద్‌ఖాన్, షేక్ ముక్తార్ అన్సారీ అనే ఒక హకీం ఉన్నారు. దీన్నిబట్టి చూస్తే ముల్కీ ఉద్యమంలో విద్యార్థులే కాకుండా సామాన్య ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోయారు.
ప్రాక్టీస్ బిట్స్
1. హైదరాబాద్‌లో నాన్ ముల్కీలకు వ్యతిరేకంగా ఏర్పడిన సంస్థ ఏది?
1) హైదరాబాద్ హిత రక్షణ సమితి
2) తెలంగాణ హిత రక్షణ సమితి
3) హైదరాబాద్ సంరక్షణ సమితి
4) తెలంగాణ సంరక్షణ సమితి
2. కింది వారిలో ముల్కీ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి ఎవరు?
1) సోషలిస్టు పార్టీ సభ్యుడు మహదేవ్ సింగ్
2) వి.డి. దేశ్‌పాండే 3) శ్రీకాంతాచారి
4) హయగ్రీవాచారి
3. ఇతర ప్రాంతాలకు చెందిన వారిని ఏ పేరుతో కూడా పిలిచేవారు?
1) ముల్కీ 2) గైర్ ముల్కీ
3) ఇతర మతస్థులు 4) ఇతర కులస్థులు
4. హైదరాబాద్ హిత రక్షణ సమితిని ఏర్పాటు చేసింది ఎవరు?
1) రామాచారి 2) కృష్ణమాచారి
3) హయగ్రీవాచారి 4) మరి చెన్నారెడ్డి
5. ముల్కీ నిబంధనలు ఎప్పుడు సవరించారు?
1) 1929, 1930 2) 1935, 1944
3) 1939, 1945 4) 1937, 1947
6. ది నిజామ్స్ సబ్జెక్ట్ లీగ్ అధ్యక్షుడు ఎవరు?
1) నవాబ్ సర్ నిజామత్ జంగ్
2) సాలార్ జంగ్
3) మీర్ ఉస్మాన్ అలీఖాన్
4) కులీ కుతుబ్‌షా
7. ది నిజామ్స్ సబ్జెక్ట్స్ లీగ్‌కు తెలుగులో గల పేరు?
1) నిజాం ప్రజల తీర్పు
2) నిజాం సంస్థానం తీర్పు
3) నిజాం రాజుల శాసనం
4) నిజాం ప్రజల సంఘం
8. సవరించిన ముల్కీ నిబంధనల ప్రకారం తెలంగాణలో ఎన్ని సంవత్సరాలు నివాసముంటే ముల్కీగా పరిగణిస్తారు?
1) 13 సంవత్సరాలు 2) 14 సంవత్సరాలు
3) 12 సంవత్సరాలు 4) 11 సంవత్సరాలు
9. వరంగల్‌లో స్థానిక ఉపాధ్యాయులను వేధింపులకు గురిచేసిన నాన్‌ముల్కీ అధికారి ఎవరు?
1) కవి సారథి 2) పార్థసారథి
3) మల్లికార్జున్ 4) సత్యనారాయణ
10. 1952 సెప్టెంబర్ 3న నాన్‌ముల్కీలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులు ఏ కళాశాలకు చెందినవారు?
1) సిటీ కాలేజీ 2) నిజాం కాలేజీ
3) సైఫాబాద్ కాలేజీ 4) ఏవీ కాలేజీ
సమాధానాలు
1. 1 2. 3 3. 2 4. 1 5. 3 6. 1 7. 4 8. 3 9. 2 10. 1
అడపా సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు