తెలంగాణ జానపద కళారూపాలు

కోటి ఆశలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి గ్రూప్-1, 2, 3 ఉద్యోగ నియామకాల కోసం ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షల్లో తెలంగాణ చరిత్ర- సంస్కృతికి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చినది. ఈ నేపథ్యంలోనే సంస్కృతికి సంబంధించిన అంశంలో ప్రత్యేకంగా జానపద కళారూపాల గురించి అభ్యర్థులు లోతుగా అధ్యయనం చేయాలి. ముఖ్యంగా ఒక ప్రాంతానికి సంబంధించిన కళారూపాలు ఆ ప్రాంతంలోని జాతిని, సంస్కృతిని ప్రతిబింబింపజేస్తాయి. ఈ జానపదకళారూపాల నుంచి గ్రూప్-1లో పది మార్కుల ప్రశ్నలు, గ్రూప్2,3లలో నాలుగైదు మార్కుల వరకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రతీ పోటీ పరీక్షలలో కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
యక్షగానం
-ఈ కళారూపం గురించి క్రీ.శ 13వ శతాబ్దం నాటికే ఎంతో వైభవంగా వెలుగొందిన పాల్కురికి సోమనాథుడు రచించిన పండితారాధ్యచరిత్రలోని పర్వత ప్రకరణలో చెప్పబడింది. అందులో నాదట గంధర్వ యక్ష విద్యాధరాదులై పాడెడు నాడెడు వారని వివరించాడు. ఈ కళారూపం కురవంజి లేదా కొరవంజికి అనుసరణగా వచ్చిందని సాహిత్య చరిత్రకారుల అభిప్రాయం. ఇది మొదట గానరూపంగా ఉండి క్రమక్రమంగా సంవాదరూపం పొందింది. యక్షగానం అంటే యక్షవేషం వేసిన స్త్రీ చే గానం చేయబడిందని అర్థం. తెలుగులో రాయబడిన తొలి యక్షగానం ప్రోలుగంటి చెన్నశౌరి రచించిన సౌభరిచరిత్రం. ఇది అలభ్యం. లభిస్తున్న యక్షగానాల్లో మొదటిది కందుకూరి రుద్రకవి రచించిన సుగ్రీవ విజయం.
యక్షగాన ప్రదర్శనలో ప్రత్యేకత
-యక్షగాన ప్రదర్శనలో విశేషమేమిటంటే ప్రదర్శనలో వచ్చే ప్రతి పాత్ర తనను గురించి తాను చెప్పుకోవడంతో కథ నడుస్తుంది. ఇది సంగీత, సాహిత్య, నాట్యకళలతో మేళవించిన సమాహారకళ. దీన్ని తెలంగాణలో వీధిబాగోతం లేదా వీధి భాగవతం అంటారు. తెలంగాణ యక్షగాన పితామహుడిగా ప్రసిద్ధి చెందిన కవి చెర్విరాల భాగయ్యకవి. ఈయన 50కి పైగా యక్షగానాలు రాసినప్పటికీ లభిస్తున్నవి మాత్రం 32 మాత్రమే. భాగయ్య రాసిన యక్షగానాల్లో సుగ్రీవ విజయం లక్షకు పైగా ప్రతులు అమ్ముడు పోయాయంటే, దానికున్న ప్రశస్తి ఎటువంటిదో ఇట్టే అర్థమవుతుంది. ఈయన రచనల్లో ముఖ్యమైనవి కనకతార, కాంతామతి చరిత్ర, అల్లీరాణి, రంభరంపాల చరిత్ర, మాయాసుభద్ర మొదలైనవి. తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో సుద్దాల హనుమంతు, సుద్దాల అశోక్తేజలు రచించిన యక్షగానం వీరతెలంగాణ. తెలంగాణలో వివిధ కవులచే రాసిన యక్షగానాల సంఖ్య దాదాపు నాలుగు వందలకు పైగా ఉంటాయి. యక్షగాన సాహిత్యంపై మొదటిసారి పరిశోధన చేసిన వాళ్లలో డా॥ ఎస్.వి జోగారావు ముఖ్యులు. అనంతరం డా॥ పొద్దుటూరి యల్లారెడ్డి, డా ॥ తండు కృష్ణకౌండిన్య, డా॥ ఎం.శ్రీకాంత్కుమార్లు యక్షగాన వాజ్మయంపై పరిశోధన చేశారు.
చిందు యక్షగానం
– యక్షగానంలో ఒక విధమైన పరిశోధనా వైవిధ్యం గల కళారూపం చిందు యక్షగానం. చిందు అనే కులం వారిచే ప్రదర్శింబడేదే చిందు యక్షగానం అనే అభిప్రాయం కూడా ఉంది. చిందు అంటే అడుగు. అడుగులు వేసే పద్ధతిలో ప్రత్యేక వైవిధ్యం గల యక్షగానమే చిందుయక్షగానం అంటారు. చిందు యక్షగానంలో సామాన్యంగా చెప్పే కథలు ఎల్లమ్మ చరిత్ర, లవకుశ. విప్రనారాయణ మొదలైనవి. ఒక ఎల్లమ్మ పాత్ర తప్ప మిగతా స్త్రీ పాత్రలన్నింటినీ పురుషులే ధరిస్తారు. చిందు యక్షగానంలో ఎల్లమ్మ పాత్ర ధరించి ఆ పాత్రకు వన్నెతెచ్చిన కళాకారిణి చిందు ఎల్లమ్మ.
బతుకమ్మ
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి మహర్నవమి వరకు తొమ్మిది రోజులు ఈ పండుగ జరుగుతుంది. గ్రామ సీమల్లో ఉండే రకరకాల పువ్వులతో బతుకమ్మను పేర్చి దానిపైన పసుపుతో తయారుచేసిన గౌరమ్మను నిలుపుతారు. ముతైదువలందరూ పగటిపూటనే బతుకమ్మలను పీటలపై ప్రతిష్ఠించి సాయంకాలం పిన్నలు, పెద్దలు వారికున్నటువంటి వస్ర్తాలను ధరించి అందరూ బతుకమ్మలను తీసుకుని ఊరి మధ్యనగల విశాలమైన ప్రదేశంలో నిలిపి అందరూ చుట్టూచేరి వలయాకారంగా తిరుగుతూ చప్పట్లు చరుస్తూ, పాటలు పాడుతూ, వంగిలేస్తూ, లయబద్దంగా పాట పాడుతుంటారు. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి గ్రామంలో ఉన్న పిల్లలు, పెద్దలు అందరూ వస్తారు. బతుకమ్మ పాటల్లో లక్ష్మీపార్వతుల స్తోత్రములేకాక పౌరాణిక గాథలు కూడా అనేకం ఉన్నాయి. ప్రతి రోజూ బతుకమ్మను పేర్చి, ఆడిన తర్వాత వాటిని తీసుకెళ్లి చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. తెలంగాణ బతుకమ్మ పాటల మీద పరిశోధన చేసినవారు డా. బండారు సుజాతశేఖర్.
ఫకీరువేషం
ఫకీర్లు ముస్లిం కులంలో ఒక తెగ. వీరు ముస్లింలనే యాచిస్తారు. అల్లాను స్మరిస్తూ అల్లాకేనాం జపిస్తూ ఇంటింటికి తిరుగుతూ ముస్లింలను ఆశీర్వదిస్తారు. వీరు ఒక పెద్ద కంజీరను చేతిలో ధరించి తలకు పెద్ద పాగా చుట్టి మెడలో పూసలను ధరించి మొలకు లుంగీని ధరిస్తారు. ప్రతి జట్టుకు ఇద్దరు, ముగ్గురు ఉంటారు. మధ్యలో గాయకుడు పాట పాడుతూ ఉంటే మిగిలిన ఇద్దరు అల్లాకేనా అని వంతు పలుకుతారు.
ఉదాహరణకు పాడిపంటల్సల్గుండాలి, అల్లాకేనాం, తల్లీపిల్లలు సల్గుండాలి అల్లాకేనాం, తండ్రీకొడుకుల్ సల్గుండాలి అల్లాకేనాం, హిందూ ముస్లింలంతా హేకం కావాలి అల్లాకేనాం అంటూ వంత పాడుతూ మధ్య మధ్య రక్తి కట్టించేందుకు కర్రతో చేసిన ఒక విధమైన కిర్రు శబ్దం వచ్చేదానిని చేతిలో ధరిస్తారు. ఈ కళారూపాన్ని ఆంధ్రప్రజానాట్యమండలి వారు హిందూమత సామరస్యం కోసం ఉపయోగించి తెలుగు ప్రజలలో విశేషంగా ప్రచారం చేశారు.
జంగం కథలు
-జంగం కథలను ఎక్కువగా జంగాలే చెప్పడంతో వీటికి జంగం కథలనే పేరు వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో బుడిగెజంగాలు ఈ కథలను చెబుతుంటారు. జంగాలందరూ శైవభక్తులు కావడంతో శైవ, వైష్ణవ మతాల మధ్య వచ్చిన సంఘర్షణ కాలంలో శైవమత ప్రచారానికి ఈ కథలను విరివిగా ఉపయోగించారు. క్రీ.శ. 1150 నాటికే ఈ కథలను జంగాలు పాడుతుండేవారు. బుడిగె జంగాలకు ఆ పేరు రావడానికి గల కారణం వారు కథలో ఉపయోగించే వాయిద్యానికి బుడిగె అని పేరు. బుడిగే వాయిద్యంతోనే వారికి ఈ బుడిగె జంగాల వచ్చింది. ఈ బుడిగెకే డక్కీ, డిక్కీ, గుమ్మెట అనే పేర్లులున్నాయి. బుడిగెలు సాధారణంగా ఇత్తడితో లేదా కంచుతో చేయబడి ఉంటాయి. బుడిగె జంగాలు ప్రారంభంలో శైవకథలనే ప్రచారం చేసినప్పటికీ తరువాత శైవమత సంబంధం కానీ ఇతర కథలను దేశింగురాజు, భల్లాణ, సిరియాళ, వామన విజయం మైదలైన కథలు ప్రచారంలోకి తెచ్చారు. బుడిగె జంగాలు వీరశైవమత ప్రచారాకులవడంతో వారి కథలన్నీ వీరావేశంతో చెప్పబడుతుంటాయి.
ప్రదర్శన విధానం
-జంగం కథల ప్రదర్శనలకు రంగస్థలమంటూ ఏమి ఉండదు. విశాలమైన ఒక వీధిలో పందిరి వేసి చుట్టూ కిరసనాయిల్ దీపాలను పెట్టేవారు. ఇవి లేని రోజుల్లో ఆముదపు దీపాలను లేదా నూనె కాగడాలను వెలిగించేవారు. కథకునికి ఒక తంబుర, మూడు అందెలు, రెండు కాళ్ళకు గజ్జెలు, వంతలకు రెండు గుమ్మెట్లు, ముగ్గురికి మూడు గౌన్లు, మూడు తలగుడ్డలు ఉంటే కథ విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది.
ఒకసారి ఈ సామగ్రిని ఏర్పాటు చేసుకోగలిగితే రోజువారీగా వీరికి కావాల్సిన సామగ్రి ఏమి ఉండదు. ముగ్గురు వ్యక్తులు వందలాది ప్రజలకు తెల్లవార్లు కథ వినిపించి వారిని కూర్చోబెట్టగలరు. వీరి బృందం ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి వెళ్ళాలంటే ఎవరి సామాను వారి భుజాలకు తగిలించుకొని సునాయాసంగా ప్రయాణం చేస్తారు. ఈ జంగం కథలకే తంబూరకథ, గుమ్మెట్ల కథ అని ప్రాంతాల వారీగా పేర్లున్నాయి. కాకతీయుల నాటికే ఈ జంగం కథలు బహుళ ప్రచారంలో ఉన్నట్లు వినుకొండ వల్లభరాయుడు రచించిన క్రీడాభిరామం ద్వారా తెలుస్తోంది.
దేవరపెట్టె
-దేవరపెట్టె ప్రదర్శనకు ప్రజలు అధికంగా హాజరయ్యేవారు. ఈ ప్రదర్శనలో మంత్రతంత్రాలను మహాజోరుగా వేసేవారు. ప్రదర్శనాన్ని ఈ కింది విధంగా ప్రదర్శించేవారు. అమ్మసత్తెం చూడం డీ, మల్లేలా మల్లేలా, దేవిసత్తెం చూడండీ, సందులు గొందులు తిరిగేతల్లీ సన్నపుకోకలు కట్టిందోయ్, మాయమ్మా మాయమ్మా – అంటూ నెత్తిన ఉన్న దేవరపెట్టెను కిందికి దింపి కుడిచేతిలో వీరభద్రతాడును పట్టి ఫళఫళ అంటూ నాదం చేస్తూ, చూడండి బాబయ్య మా అమ్మోరుసత్తెం. అమ్మోరును ఎక్కడ నుంచి తీసువచ్చామనుకున్నారు ? సీమకొండ, బెల్లంకొండ, గోల్కొండ, కోరుకొండ, తిరుపతికొండ, తిరుచానాపల్లి కొండ, తిరువళ్ళూరు కొండ, ఆకొండ ఈకొండి అనేక కొండలు తిరిగి తీసుకువచ్చిన తల్లి బాబయ్యా. అమ్మోరు నామకరణాలు అనేకం ఉన్నయి బాబయ్యా.
కంచికామాక్షమ్మ, గంటాలమ్మా, గంగానమ్మా, పెద్దింటమ్మా, పోలెరమ్మా, నలజారమ్మా, నాంచారమ్మా, కలకత్తా మహాకాళి తల్లండి- అంటూ వీరభద్ర కొరడాతో గిర్రునతిరుగుతూ భీకరాకారంగా నృత్యం చేస్తూ కళకళమని కొరడా నాదములను భయంకరంగా మ్రోగిస్తూ, గిర్రుగిర్రున తిరిగి మోదుకుంటూ పాతగాయాలను పగులగొట్టి రక్తాన్ని చిందించేవాడు. అదృశ్యాన్ని చూసిన ప్రేక్షకులు భయపడి ఇది అచ్చం అమ్మవారి సత్యం అనుకొని తోచిన ధర్మం చేసేవారు.
తోలుబొమ్మలాట
-తొంభై ఆమడబోయి తోలుబొమ్మలాట చూడాలి, అరవై ఆమడబోయి హరికథ వినాలి అనేది తెలంగాణలో ప్రసిద్ధి గాంచిన నానుడి. దీన్ని బట్టి ఆ రోజుల్లో తోలుబొమ్మలాటకు ఎంత ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, శిల్పం, నాట్యం అనే లలితకళల సమాహారం. ప్రదర్శనకు అనుగుణమైన తోలుబొమ్మలను తెల్లటి తెరపై వెనుకనుంచి దారంతో సన్నివేశానికి అనుగుణంగా సూత్రధారుడు వాటిని నా ట్యం చేయిస్తాడు. నాటక ప్రదర్శనకు ఎన్ని హంగులుండాలో అన్ని హంగులు తోలుబొమ్మలాటకు ఉండాలి. దాదాపు ఒక కుటుంబంలోని సభ్యులే ఆయా పాత్రలకు వాచికం చెప్పి అభినయింపజేస్తారు. ఆయా పాత్రల బొమ్మలను పుచ్చుకొని కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుపుతారు. తెరమీద బొమ్మలు ఎంత ఉధృతంగా నాట్యం చేస్తూ ఉంటాయో లోపలి భాగంలో ఉన్న వ్యక్తులు కూడా దాదాపు అంతటి అభినయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు.
-శ్రీశైలం శివరాత్రి మహోత్సవాల్లో తోలుబొమ్మలాటలను ప్రదర్శించినట్టు పండితారాధ్య చరిత్ర, పర్వత ప్రకరణంలో పాల్కురికి సోమనాథుడు ఈ విధంగా వివరించాడు. కడునద్భుతంబుగా గంబసూత్రంబు లడరంగ బొమ్మల నాడించువారు దీన్ని బట్టి పాల్కురికి సోమనాథుని కాలంనుంచే తోలుబొమ్మలాటలు తెలంగాణలో ప్రాంతంలో ప్రదర్శించారని అతని రచనల ద్వారా తెలుస్తుంది. శ్రీనాథుని పల్నాటి వీరచరిత్రలో, మారద వెంకయ్య రచించిన భాస్కర శతకంలో కూడా తోలుబొమ్మలాట ప్రస్తావన ఉంది. అంతేకాకుండా కాకతీయులకు సంబంధించిన వరంగల్ జిల్లా గూడూరు, పానగల్లు తెలంగాణ శాసనాల్లో తోలుబొమ్మలాట కళారూపం ప్రస్తావన ఉంది.
ప్రదర్శన విధానం
-తోలుబొమ్మలాట ద్వారా ప్రదర్శింపబడేవి రామాయణ మహాభారతాలకు సంబంధించినవి. అవి. లంకాదహనం, మైరావణ చరిత్ర, కీచకవధ, ప్రహ్లాదచరిత్ర మొదలైనవి. తోలుబొమ్మలాటల కోసం ప్రత్యేక సాహిత్యమంటూ ఏమీ ఉండదు. యక్షగానాలనే తోలుబొమ్మలాట సాహిత్యంగా ఉపయోగించుకుంటారు. ఈ బొమ్మలను మేక, జింక చర్మాలతో తయారుచేస్తారు. మంచిపాత్రలకు జింక చర్మాన్ని, దుష్టపాత్రలకు మేక చర్మాన్ని ఉపయోగిస్తారు. ఈ బొమ్మలన్నింటిని సక్రమంగా అమర్చుకొని కథానుగుణంగా బొమ్మల్ని తెరలమీదికి ఎక్కించి ఆడిస్తుంటారు. ముందుగా గణపతిపూజతో ఆట ప్రారంభమవుతుంది.
పాట పాడేవారు, హార్మోనియం వాయించేవారు, తాళం వేసేవారు, మద్దెలకొట్టువారు, వంతలుపాడేవారు అందరూ తెర లోపలే కూర్చుంటారు. నాటకానికి దర్శకుడు ఎంత అవసరమో అలాగే ఈ బొమ్మలాటకు సూత్రధారుడు అంత అవసరం. ఇందులో జుట్టుపోలిగాడు, బంగారక్క, కేతిగాడు ప్రధాన హాస్యపాత్రలు.
శారద కథలు
-తెలంగాణలో జానపద గాయకులుగా, భిక్షకులుగా జీవనాన్ని కొనసాగించేవారు శారదకాండ్రు. వీళ్లు ఎక్కువగా మున్నూరు, ముత్తరాశి మొదలైన కులాల నుంచి ఉద్భవించిన జాతుల్లో శారదకాండ్ర జాతి ఒకటని జానపద వాజ్మయంలో బిరుదురాజు రామరాజుగా ఉదాహరించాడు. ఓ భారతీ, కరుణామతీ, భళి శారదకరుణానిధీ అను వంతపాట పాడటంతో వీరికి శారదకాండ్రు అనే పేరు వచ్చి ఉండవచ్చు.
అంతేకాకుండా వీళ్లు ఉపయోగించే వాయిద్యంలో భుజం మీద ధరించే తంబురాకు శారద అని పేరు. బుర్రకథలు ఉపయోగించే తంబురాకు, దీనికి ఏమాత్రం తేడా ఉండదు. శారదను ఒక భుజం మీద ధరించి దాని తీగలను మీటుతూ మరొక చేతిలో వేళ్ళమధ్యన అందెలను మోగిస్తూ కథకుడు కథ చెబుతుంటాడు. వీళ్ల కథ శారదాదేవి ప్రోత్సాహంతో ప్రారంభమవుతుంది. ముఖ్యంగా వీళ్ల జట్టులో పురుషుడు కథ చెబితే అతని ఇద్దరు భార్యలు వంతపాడుతారు. ఒక భార్యను కలిగిఉన్న కథకుడు కథ చెబితే అతని భార్య డక్కీ కొడుతుంది. వీళ్లు పాడే పాటల్లో శారదవరుసలనే కాక చరిత్రాత్మకమైన వీరరసగేయాలను వీరావేశంతో పాడుతారు.
తెలంగాణలో ప్రచారంలో ఉన్న ప్రసిద్ధ వీరకథలైన సదాశివరెడ్డి కథ, సర్వాయిపాపన్న కథలను అద్భుతంగా పాడి వినిపిస్తారు. అదే విధంగా పల్నాటి వీరచరిత్ర, బాలనాగమ్మ, బొబ్బిలియుద్ధం తదితర కథలను చెబుతుంటారు. ఈ కథలను చెప్పేవారు ఎక్కువగా వరంగల్, నల్లగొండ జిల్లాల్లోని గ్రామాల్లో ఉన్నారు. శారదకాండ్రు అందరూ శైవ మతానికి చెందినవారు. వీరు ఎల్లమ్మ, పోచమ్మ మొదలైన దేవతలను పూజిస్తారు. వీళ్లు ఎంతమంది భార్యలనైనా చేసుకోవచ్చు. వీరందరూ శైవమతస్థులైనప్పటికీ లింగాధారణలో మాత్రం కొంతమందికి పట్టింపు ఉండదు.
ఒగ్గు కథ
-ఒగ్గు అనే వాయిద్యంతో కథ చెప్పే కళారూపమే ఒగ్గుకథ. తెలంగాణ ప్రాంతానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన కళారూపం ఒగ్గుకథ. ఒగ్గు అనే వాయిద్యం శివుని డమరుకాన్ని పోలి ఉంటుంది. ఒగ్గు కథ చెప్పే జట్టులో దాదాపు ఐదుగురు ఉంటారు. ఇందులో ముగ్గురు వివిధ వాయిద్యాలు వాయిస్తారు. ఒక పెద్ద డోలు, తాళాలు, ఒగ్గు ప్రధాన వాయిద్యాలుగా ఉంటాయి. తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో ఒగ్గుకథ చెప్పేవారున్నారు. ఒగ్గుకథలు సామాన్యంగా గొల్ల, కురమలే కాకుండా ఇతర బీసీ కులాల వారు కూడా చెబుతుంటారు.
వీరు ఎక్కువగా చెప్పే కథల్లో ముఖ్యమైనవి బీరప్పకథ, మల్లన్నకథ, నల్లపోచమ్మ కథ, మాంధాతకథ, కాటమరాజు కథ, ఎల్లమ్మకథ మొదలైనవి. సాధారణంగా కథకుడు తలకు రుమాలు చుట్టుకొని, గజ్జెలు కట్టుకొని కథ చెబుతుంటే పక్కనున్న వాయిద్యకారులు లయబద్ధంగా వాయిద్యాలను వాయిస్తూ వంతపాడుతుంటారు. జాతీయస్థాయిలో ఒగ్గుకథకు ప్రాచుర్యం తెచ్చినవారిలో ప్రముఖులు చుక్క సత్తయ్య, మిద్దె రాములు.
జముకుల కథలు
– జముకుల కథను జక్కుల కథ అంటారు. ఈ కథలు శృంగార, కరుణరసాలను ప్రతిబింబించేవిగా ఉంటాయి. ఈ కథల్లో అనేక రకాలైన సంగీతపు రీతులుంటాయి. ఈ ప్రదర్శన సుమారు మూడుగంటల కాలం ఉంటుంది. వీరి ప్రదర్శనకు ఏ విధమైన రంగస్థలం అవసరం లేదు. గ్రామం మధ్యలో చిన్నపందిరి వేసి రెండు దీపాలు కడితే సరిపోతుంది. ప్రదర్శనకారులు ముగ్గురు, అందులో మధ్యవ్యక్తి కథకుడైతే, వంతదారుల్లో ఒకరు హాస్యం, ఇంకొకరు వ్యాఖ్యానం చేస్తారు.
-వేషధారణలో కథకుడు నల్లకోటు తెల్లకట్టు పంచె, తలగుడ్డ చుట్టి చక్కగా నృత్యం చేస్తూ కలియతిరుగుతాడు. స్త్రీ పాత్రలు వచ్చినప్పుడు అక్షరాలా స్త్రీ అభినయాన్ని కథకుడు చేస్తాడు. వంతదారులు రెండు జముకలను కథకు అనుగుణంగా శ్రావ్యంగా వాయిస్తూ ఉంటారు. జముకు అనే వాయిద్యానికి జమిలిక, జమిడిక అని పేర్లు. ఈ వాయిద్యం కుంచం ఆకారంలో ఉంటుంది. దీనిని ఒక పక్క భాగం బక్కీ చర్మంతో మూస్తారు. మధ్యభాగంలో చిన్న రంధ్రం చేసి నరాన్ని కట్టి లోపలి భాగం నుంచి రెండో భాగం నుంచి రెండో పక్క ఒక కర్ర ముక్కు కట్టి దానిని లాగి పట్టి లోపలి భాగంలో ఆనరాన్ని మోగించినట్లయితే శ్రావ్యమైన మోత వస్తుంది. ఈ జముకుల కథలు కాకతీయుల కాలం నుంచి ఉన్నట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి.
విప్రవినోదులు
వీరి వృత్తి విప్రులను యాచించడం. వీరు ఇంద్రజాల ప్రదర్శన చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తారు. వీరు విప్రుల ఇండ్లలోనూ, బహిరంగ స్థలాలోలనూ ప్రదర్శనలు ఇస్తారు. వీరి ప్రదర్శన సామగ్రి 5, 6 శాలువాలు ఒక కొయ్య అలమరా, ఒక తాళపత్ర గ్రంథం, రెండు జతల తాళాలు. వీరి ప్రదర్శన విశాల ప్రదేశంలో ఒక చిన్న పందిరిలో జరుగుతుంది. పందిరి చుట్టూ శాలువాలు కడతారు. ఆ తెరల మధ్య ఖాళీ అలమరా ఉంచుతారు. ఇద్దరు వ్యక్తులు చెరో పక్కన చేరి తాళాలు వాయిస్తారు. ఇంతలో ప్రేక్షకులు గుమికూడుతారు.
తెరలన్నీ ఎత్తి ఖాళీ అలమరా చూపిస్తారు. ఆ తర్వాత దళ ముఖ్యుడు ప్రాచీన తాటాకుల గ్రంథంతో తెరల మధ్యకు వెళ్తాడు. పావుగంట వరకు ఆయన బయటకు రాడు. ఈలోగా భజన జరుగుతుంది. తర్వాత తెరను తొలగిస్తారు. అదివరకు ఖాళీగా ఉన్న అలమరాలో దేవతల విగ్రహాలు, దీపారాధన కుందులు, పుష్పాలు, ఫలాలు, పిండివంటలు వివిధ పూజాపాత్రలు కనబడతాయి. ఇది ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. ప్రదర్శనకు ముందే అలమరాను పరీక్షించవచ్చు. అంతేగాక వీరు ఇంటింటికి తిరుగునప్పుడు విగ్రహాలను, చిలుకలను, విభూతిని అరచేతిలో సృష్టించి ఇంద్రజాల విద్యను ప్రదర్శిస్తారు.
గొల్లసుద్దులు
– గొల్లసుద్దులను చెప్పేవారు ప్రధానంగా గొల్లలనే యాచిస్తారు. యాదవ చరిత్రకు సంబంధించిన కృష్ణలీలలు, కాటమరాజు కథ మొదలైన వాటిని గొల్లసుద్దులవారు ప్రచారం చేస్తూ ఉంటారు. అయ్యలరాజు నారాయణామాత్యుడు హంసవింశతిలో గొల్లసుద్దులను గూర్చి వివరించాడు. గొల్లసుద్దుల వారి కథా వివరాన్ని పెద్దపెద్ద వస్ర్తాలపై చిత్రించి బొమ్మల సహాయంతో కథలు చెబుతారు. గొల్లలలో అనేక తెగలవారు ఉన్నప్పటికీ అధిక సంఖ్యలో ఉన్నవారు ఎర్రగొల్లలే. వీరి ప్రధాన వృత్తి ఆవుల మందలను, గొర్రెల మందలను పెంచడం, యాదవులకు ప్రధాన దేవత అయిన గంగమ్మకు జాతరలు మొదలైన ఉత్సవాలు చేస్తుంటారు.
ఆధునిక కాలంలో గొల్లసుద్దుల కళారూపం కొద్దిగా మార్పునకు లోనైంది. ప్రత్యేకంగా గొల్లలే కాకుండా ఇతర కులాలవారు కూడా ఈ కళను ప్రదర్శిస్తారు. ముఖ్యంగా చేతిలో ఒక కర్రను పట్టుకుని భుజాన ఒక గొంగడి వేసుకుని సమాజంలోని అనాచారాలను, అన్యాయాలను వ్యంగ్యంగా ఎత్తిపొడుపు ధోరణిలో ఈ ప్రదర్శన ఇస్తుంటారు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ప్రజలను ఈ గొల్లసుద్దుల ద్వారా చైతన్యపరిచిన ప్రజాకవి, గాయకుడు సుద్దాల హనుమంతు. అదేవిధంగా కమ్యూనిస్టు పోరాటయోధుడు, మాజీ ఎమ్మెల్యే కీ.శే. నర్రా రాఘవరెడ్డి గొల్లసుద్దుల ద్వారా ప్రజలను ఎంతగానో చైతన్యపరిచారు.
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు