సహజ సిద్ధమైన విపత్తులు అంటే..?
విపత్తులు రెండు రకాలు. అవి.. 1. సహజ సిద్ధమైన విపత్తులు, 2. మానవ ప్రేరిత విపత్తులు
సహజ సిద్ధమైన విపత్తులు
భారత ఉపఖండం భూకంపాలకు అత్యంత అనువుగా ఉండే రెండు ఖండాంతర పలకాల సరిహద్దుల్లో ఉంది. హిమాలయ పర్వతశ్రేణి ఇండియన్ పలకం యురేషియస్ పలకం కిందకు వెళ్లే ప్రాంతం దగ్గర ఉంది. హిమాలయాలు ప్రపంచంలోనే అతితరుణ ముడత పర్వతశ్రేణులు. అందువల్ల హిమాలయాల అంతర్భౌమ ప్రాంతం భౌగోళికంగా చురుకుగా ఉండి, భూకంపాలు సంభవించే సంభావ్యత పెరుగడానికి అనువుగా ఉంటుంది. కాబట్టి హిమాలయాల చుట్టూ ఉండే ప్రాంతం అత్యంత భూకంప ముప్పు ఉన్న జోన్‌గా గుర్తించబడింది.
ప్రపంచంలో భూకంప మండలాలు
భూకంప మేఖలలు
ప్రపంచంలో భూకంప ప్రమాదం లేనిది ఒక ఆస్ట్రేలియా ఖండంలో మాత్రమే. అగ్నిపర్వత ప్రాంతాల్లోనూ, కొత్తగా ఏర్పడుతున్న ఆరావళి పర్వత ప్రాంతాల్లోనూ సాధారణంగా భూకంపాలు విరివిగా సంభవిస్తాయి. అయితే ఇటీవల కాలంలో ఆస్ట్రేలియాలో కూడా భూకంపాలు ఏర్పడ్డాయి.
పసిఫిక్ పరివేష్టిత భూకంప మేఖలు
దీనిలో ప్రపంచంలో సంభవించే భూకంపాల్లో 68శాతం సంభవిస్తున్నాయి. ఉత్తర, దక్షిణ అమెరికా పశ్చిమ తీరాల్లోని అలూషియన్ దీవుల్లో, ఆసియా ఖండం తూర్పు తీరం, జపాన్, ఫిలిప్పీన్స్ దీవులు ఈ ప్రాంతం పరిధిలో ఉండి, ఎక్కువ భూకంపాలకు గురవుతున్నాయి. ఈ ప్రాంతాన్ని అగ్ని వలయం లేదా రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా అంటారు. ఈ మండలంలో అగ్ని పర్వతాల మేఖలలు, ద్వీప వక్రతలు అగాధ కందకాలు ఉన్నాయి. అలస్కా నుంచి న్యూజిలాండ్ వరకు విస్తరించి ఉన్న ఈ మేఖలల్లో ఇండోనేషియా ఆర్చ్పెలాగో కూడా ఉంది.
ట్రాన్స్ ఆసియాటిక్ మధ్యధరా మండలం
ఈ మండలంలో భూప్రకంపనల క్రియాత్మకత కొద్దిగా తక్కువ. ఈ మండలం చైనా నుంచి ఫిలిప్పీన్స్ తీరం వరకు వ్యాపించి ఉంది. ఈ మండలం దక్షిణ ఆసియా, ఆసియా మైనర్, మధ్యధరా ప్రాంతం గుండా విస్తరిస్తుంది. ఇది ఐరోపాలోని ఏజోరిస్, ఉత్తర అమెరికాలోని ఆల్పైన్ పర్వతాల నుంచి ఆసియా మైనర్ల మీదుగా హిమాలయాలు, టిబెట్, చైనా వరకు విస్తరిస్తుంది.
ప్రపంచంలో రెండో భూకంప ప్రాంతం ఆల్ఫ్స్ పర్వత ప్రాంతం నుంచి కాకసన్ పర్వతాల మీదుగా హిమాలయాలు, దీని మీదుగా పశ్చిమ ఇండియా దీవుల వరకు విస్తరించి ఉన్న ప్రాంతం. ప్రపంచంలో సంభవించే భూకంపాల్లో 20 శాతం ఈ ప్రాంతాల్లోనే వస్తాయి.
భారతదేశ భూకంప మండలాలు
భారతదేశ భూభాగాన్ని..భూకంప వైపరీత్యాలకు గురయ్యే తీవ్రత దృష్ట్యా సెస్మిక్ జోన్ మ్యాపింగ్‌లో జోన్ 2 నుంచి 5 వరకు వర్గీకరించారు.
జోన్ -5
ఇది అత్యంత తీవ్రమైన భూకంప మండలం. చాలా తీవ్రమైన ముప్పు జోన్‌గా ప్రస్తావించారు. MKS (1964) స్కేల్‌పై భూకంప తీవ్రత 9 ఉన్న ప్రాంతాలు ఈ మండలం పరిధిలోకి వస్తాయి. అవి.
ఈశాన్య రాష్ర్టాలు మొత్తం
గుజరాత్‌లోని ప్రాంతాలు
అండమాన్, నికోబార్ దీవులు
జోన్-4
MKS (1964) తీవ్రత స్కేలుపై భూకంప తీవ్రత 8 ఉన్న ప్రాంతాలు ఈ జోన్ పరిధిలో ఉంటాయి. దీన్ని భూకంప తీవ్రత అధికంగా ఉండే రెండో జోన్‌గా పరిగణించారు. జమ్ముకశ్మీర్ నుంచి హిమాచల్‌ప్రదేశ్ వరకు ఉన్న ఉత్తర మేఖలాల్లో భాగాలు. అవి.
ఢిల్లీ
హర్యానాలోని కొన్ని భాగాలు
మహారాష్ట్రలోని కోయ్నా ప్రాంతం
( ఈ మండలం పరిధిలో ఉన్నాయి)
జోన్-3
MKS (1964) తీవ్రత స్కేల్‌పై భూకంప తీవ్రత 7శాతంగా నమోదయ్యే ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తాయి. దీన్ని మితమైన నష్టం ముప్పు కలిగిన జోన్‌గా పరిగణిస్తారు.
రాజస్థాన్‌లోని కొన్ని భాగాలతో కలిపి ఉత్తర భారత్ నుంచి దక్షిణ భారతదేశంలోని కొంకణ్ తీరం, తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు ఈ జోన్ పరిధిలోకి వస్తాయి.
జోన్-2
దీని పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో భూకంప తీవ్రత MKS స్కేల్‌పై 6 శాతం కంటే తక్కువగా ఉంటుంది. ఇక్కడ అత్యల్ప నష్టం ఉంటుంది.
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలు ఈ జోన్ పరిధిలో ఉన్నాయి.
జోన్-1
భూకంప మండలం జోన్ 1ని రెండో జోన్లో విలీనం చేశారు. ఎందుకంటే జోన్ 1లోని ప్రాంతాలు అత్యల్ప ప్రమాదం కలవి
భారత్‌లో భూకంప నమోదు కేంద్రాలు
భారత్‌లోని మొట్టమొదటి భూకంప నమోదు కేంద్రాన్ని 1898లో పశ్చిమ బెంగాల్‌లోని కోల్కత్తా, తరువాత మహారాష్ట్రలోని ముంబై, తమిళనాడులోని కొడైకెనాల్లో ఏర్పాటు చేశారు. 1961లో హైదరాబాద్‌లో జాతీయ భూభౌతిక పరిశోధనా కేంద్రాన్ని (ఎన్జీఆర్ఐ) ఏర్పాటు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని రూర్కీలో భూకంపాలను తట్టుకునే విధంగా ఇండ్ల నిర్మాణం చేయడానికి సంబంధించిన పరిశోధనా కేంద్రం ఉంది.
ప్రజలపై భూకంప ప్రభావం
భూకంప ప్రభావాలు వైరుధ్యంగా ఉంటాయి. భూకంపం కారణంగా మరణించే వారిలో 95శాతం మంది కట్టడాలు కూలిపోవడం వల్లే మరణిస్తున్నారు. భూకంపాలు రాత్రివేళ వస్తే అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే, తొలి కంపనలు వచ్చినప్పుడు ప్రజలు నిద్రిస్తూ ఉంటారు. అందువల్ల తేరుకొని బయటపడడానికి వారికి తగిన వ్యవధి ఉండదు. అంతేకాకుండా నిల్చున్న వారి మీద కంటే పడుకొని ఉన్న వారి మీద వస్తువులు ఎక్కువగా పడతాయి. భూకంప ప్రభావాలు దాని అధికేంద్రానికి చుట్టూ ఉండే ప్రాంతాలపై చాలా ఎక్కువగా ఉంటాయి.
కొందరు ప్రజలు వారు నివసించే ప్రాంతాన్ని బట్టి ఎక్కువ ముప్పు కలిగి ఉంటారు. మరికొందరు వారి సామాజిక, ఆర్థిక పరిస్థితిని బట్టి ఎక్కువ ముప్పు కలిగి ఉండే అవకాశం ఉంది.
భూకంప ప్రకంపనలు, వదులు నేలలు లేదా నదీ నిక్షేపాలు వంటి పటిష్టంగా లేని ఉపరితలాలు ఉన్న చోట ఎక్కువ సమయం ఉండి, తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తాయి. శిలాస్తరాల ప్రాంతాలపై తక్కువ ప్రభావం కలిగిస్తాయి. అందువల్ల మెత్తటి నేలపై కట్టిన ధృఢమైన కట్టడాల కంటే శిలాస్తరాలపై కట్టిన సాధారణ కట్టడాలు కూడా భూకంప విధ్వంసాన్ని సమర్థవంతంగా తట్టుకోగలుగుతాయి.
భూకంపాల వల్ల నేరుగా సంభవించే నష్టాలతోపాటు పర్యవసాన ప్రభావాలు సైతం ఉంటాయి. అగ్ని ప్రమాదాలు జరగడం, ఆనకట్టలు తెగిపోవడం, భూతాపాలు, ఉపరితల పగుళ్లు సంభవించడం, జలమార్గాలు స్తంభించిపోవడం, వరదలు రావడం వం టివి జరుగుతాయి. రసాయన విస్ఫోటనాలు జరగడం వల్ల ప్రమాదకరమైన పదార్థాలు తయారుచేసే పరిశ్రమల్లో కూడా విధ్వంసం సంభవించవచ్చు. కమ్యూనికేషన్ సౌకర్యాలు దెబ్బతింటాయి. బలహీనమైన కట్టడాల కారణంగా పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరుగుతుంది. ప్రజారోగ్య వ్యవస్థకు, కమ్యూనికేషన్, నీటి సరఫరా వ్యవస్థలకు భారీ నష్టం వాటిల్లుతుంది.
భూకంపాలకు కారణాలు
ఉపరితల కారణాలు
ఇవి భూమి ఉపరితలంపై ఏర్పడతాయి. పెద్ద పెద్ద కొండ పార్శాలు జారడం వల్లగాని, హిమానీ నదాలు ప్రవహించే చోట హిమపాతాలు సంభవించడం వల్ల, గనులున్న ప్రదేశాల్లో సొరంగాల పైకప్పు కూలడం వల్ల, పర్వత ప్రాంతాల్లో భూపాతం జరగడం వల్ల గాని భూకంపాలు ఏర్పడుతాయి.
భూ అంతర్భుజాలం ప్రభావంతో గృహాల పై కప్పులు కూలిపోవడం వల్ల కూడా భూకంపాలు ఏర్పడతాయి. భూగర్భంలో అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించడం వల్ల, పెద్ద పెద్ద కృత్రిమ జలాశయాల వల్ల, భూమిలోని ఖనిజాల కోసం తవ్విన సొరంగలాపై కప్పులు కూలడం వల్ల భూకంపాలు ఏర్పడవచ్చు. ఇవన్నీ ఉపరితల కారణాలతో ఏర్పడతాయి. ఇవి అంత తీవ్రమైనవి కావు. వీటివల్ల ఏర్పడిన భూకంపాలు అతి తక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. ఇలాంటి భూకంపాలు ఏర్పడడానికి మానవ ప్రమేయం ఎక్కువగా ఉంటుంది.
అగ్నిపర్వత సంబంధ కారణాలు
అగ్ని పర్వతాలు పేలడంవల్ల భూకంపాలు సంభవిస్తాయి. అగ్నిపర్వత ప్రదేశాల్లో భూ అంతర్భాగంలోని శిలాద్రవం కదలడం వల్ల అగ్నిపర్వతాల నుంచి శిలాద్రవం పైకి వచ్చినప్పుడు భూగర్భంలో శూన్య ప్రదేశాల మీద ఉండే శిలల బరువుకు భూమి కిందకు కుంగి భూకంపాలు ఏర్పడతాయి.
స్థితి స్థాపక నిరోధక సిద్ధాంతం
హెచ్ఎఫ్ రీడ్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. పలకలు సాపేక్ష చలనాలు కలిగి ఉన్నప్పుడు శిలలు తట్టుకోలేనంతగా వికృతి బలం వృద్ధి చెందుతుంది. ఈ బలం శిలల ప్రతిఘటన శక్తిని మించినప్పుడు శిలల విచ్ఛేదనం చెంది అల్ప వికృతి బలం స్థానానికి చేరుకుంటాయి. ఈ సిద్ధాంతానికి స్థితిస్థాపక నిరోధక సిద్ధాంతం అని పేరు.
పాతాళ సంబంధ కారణాలు
వీటివల్ల భూకంపాలు చాలా అరుదుగా వస్తాయి. భూమి అంతర్భాగంలో కలిగే రేడియో ధార్మిక విచ్ఛిత్తి రసాయనిక చర్యల వల్ల జరిగే మార్పులు దీనికి కారణాలు. ఇవి భూ ఉపరితలానికి 24కి.మీ నుంచి 640 కి.మీ లోతు వరకు సంభవిస్తాయి.
పలక విరూప కారకాల సిద్ధాంతం
ప్రపంచంలోని శక్తిమంతమైన భూకంపాలు విరూపకారక బలాల వల్లనే వస్తున్నాయి. విరూపకారక బలాల్లో తన్యత, సంపీడన బలాలు భూపటలంపై పనిచేస్తాయి. భూపటలంలోని రాతిపొరల్లో చాలా కాలంగా ఉన్న బలాల వ్యత్యాసాల మూలంగా కొన్ని ప్రదేశాల్లో భ్రంశాలు ఏర్పడి శిలా పొరల్లోని శక్తి వ్యత్యాసాలు సర్దుకొని ప్రతిబలం సడలి భూకంపం వస్తుంది. తర్వాత భూమి స్థిరత్వాన్ని పొందుతుంది. ఈ సిద్ధాంతం ప్రకారం పలకాలు చలనంలో ఉండే భూప్రావారంపై కదులుతూ, ఉష్ణసంవహన ప్రవహాలుగా భావిస్తున్న కొన్ని అనిర్దారిత యంత్రాలతో నడుస్తుంటాయి. ఈ పలకాలు ఒకదానికొకటి తాకినప్పుడు భూపటలంలో ఒత్తిడి కలుగుతుంది. ఈ ఒత్తిళ్లను పలకాల హద్దుల వెంట జరిగే చలనాలను బట్టి వర్గీకరించవచ్చు.
ఒకదానికొకటి దూరంగా లాగబడటం, ఒక దానికి ఎదురుగా మరొకటి నెట్టుకొనడం ఒక దాని అంచుపై మరొక దాని అంచు జారడం
భూకంప తరంగాలు
భూకంపాల్లో వెలువడే శక్తి తరంగాల రూపంలో వెలువడుతుంది. భూకంపాలు ఏర్పడినప్పుడు మూడు రకాలైన తరంగాలు వెలువడుతాయి.
P- తరంగాలు లేదా ప్రాథమిక తరంగాలు
S- తరంగాలు లేదా ద్వితీయ తరంగాలు
L- తరంగాలు లేదా దీర్ఘ తరంగాలు
P- తరంగాలు లేదా ప్రాథమిక తరంగాలు
ఇవి శబ్ద తరంగాలను పోలి ఉంటాయి. వీటినే పుష్ తరంగాలు అని అంటారు. ఈ తరంగాలు వాయు, ద్రవ, ఘన పదార్థాల గుండా ప్రయాణిస్తాయి. వీటి వేగం శిలలను బట్టి 5 నుంచి 13.8 కి.మీ/సెకను వరకు ఉంటుంది. ఈ తరంగాలు భూకంపాలను నమోదు చేసే కేంద్రాలను ముందుగా చేరుతాయి. కాబట్టి ఈ తరంగాలను ప్రాథమిక తరంగాలు అంటారు.
S- తరంగాలు లేదా ద్వితీయ తరంగాలు
ఇవి ద్రవ పదార్థాల గుండా ప్రయాణించవు. కాంతి తరంగాలను పోలి లంబంగా పయనించడం వల్ల భూమిపై విపరీతమైన నష్టం వాటిల్లుతుంది. అంతర్భౌమ జలాలను విపరీతంగా వినియోగించడం వల్ల ఈ తరంగాలు చాలా దూరం ప్రయాణించి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి.
వీటిని తిర్యక్ తరంగాలు అని కూడా పిలుస్తారు. ఈ తరంగాలు భూమి ఉపరితలం నుంచి ప్రసరిస్తాయి. తరంగాలు భూ ఉపరితలానికి చేరేసరికి దీర్ఘతరంగాలుగా మారిపోతాయి. వీటిన గౌణ తరంగాలు అని కూడా అంటారు.
L- తరంగాలు లేదా దీర్ఘ తరంగాలు
ఇవి ఘన, ద్రవ, వాయు పదార్థాల గుండా ప్రయాణిస్తాయి. ఇవి భూపటలం ద్వారా వర్తులాకారంగా ప్రయాణిస్తాయి. వీటిని భూతల తరంగాలు అంటారు. వీటి వేగం సెకనుకు 4 నుంచి 4.3 కి.మీ వరకు ఉంటుంది. p, s తరంగాల మార్గాలు కాంతి కిరణాల పరావర్తన వక్రీభవన సూత్రాలకు అనుగుణంగా ఉంటాయి. ఈ తరంగాల సహాయంతో భూ అంతర్భాగ విశేషాలను తెలుసుకోవచ్చు.
L తరంగాలు కేవలం ఖండ ప్రాంతాల పటలం గుండా ప్రయాణిస్తూ భూకంపాలకు కారణమయ్యే విధ్వంసక శక్తులకు తోడ్పడుతూ ఉంటాయి.
P, S, L తరంగాలు ప్రారంభమైన ప్రదేశాని నాభి అంటారు. ఈ నాభి నుంచి అన్ని వైపులా భూ అంతర్భాగంలోకి చొచ్చుకొని పోయి పరావర్తనం చెంది, వక్రీభవించి తిరిగి భూ ఉపరితలాన్ని చేరుతాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు