జలచక్రం-జగతికి ప్రాణాధారం
వర్షం – నీరు – నదులు
# భూమిపైన ప్రాణికోటి జీవించడానికి నీరు మూలాధారం. భూగోళంపై 71 శాతం నీరు ఆవరించి ఉన్నది.
# నీరు వేడెక్కి నీటి ఆవిరిగాను, నీటి ఆవిరి చల్లబడి నీరుగాను మారుతుంది.
# నీరు నిరంతరం సముద్రాలు, నదులు, సరస్సులు, చెరువులు, కుంటలు, కాలువలు, తేమ నేలల నుంచి ఆవిరి అవుతుంది.
# వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగే కొద్ది నీరు ఆవిరయ్యే వేగం పెరుగుతుంది.
మేఘాలు – వర్షాలు
#వేడి గాలులకు నీరు ఆవిరై ఆకాశంలోకి చేరుతుంది. భూ ఉపరితలం నుంచి పైకి వెళ్లే కొద్ది వాతావరణం చల్లగా ఉంటుంది. కాబట్టి పైకి వెళ్లిన నీరు చల్లబడి చిన్నచిన్న నీటి బిందువులు ఏర్పడుతాయి.
# చిన్నచిన్న నీటి బిందువులు ఒకదానికొకటి కలిసి పెద్ద నీటి బిందువులు ఏర్పడుతాయి. ఈ చిన్నాపెద్ద నీటి బిందువుల సమూహమే మేఘాలుగా మారుతుంది. మేఘాల్లోని నీరు బరువెక్కి వర్షం రూపంలో కురుస్తుంది. వర్షపాతాన్ని కొలిచే పరికరాన్ని వర్షమాపకం అంటారు.
# ఇలా భూమి పై నుంచి నీరు ఆవిరై ఆకాశంలో మేఘాలుగా ఏర్పడి, మేఘాలు వర్షించినప్పుడు నీరు తిరిగి భూమిని చేరడాన్ని జలచక్రం అంటారు.
#గాల్లోని తేమ మంచు, వర్షం, పొగమంచు, తుషారం, వడగండ్లు మొదలైన రూపాల్లో భూమిపై పడుతుంది. దీన్నే అవపాతం అంటారు.
#వాతావరణంలో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరిని ఆర్ధత లేదా తేమ అంటారు. తేమవల్ల ఉక్కగా ఉంటుంది. చర్మం జిగటగా ఉండి అసౌకర్యం అనిపిస్తుంది.
# సముద్రాలు అధిక విస్తీర్ణంలో వ్యాపించి ఉండటంవల్ల వాటి నుంచే నీరు ఎక్కువగా ఆవిరి అవుతుంది. అదేవిధంగా సముద్రాల్లోనే వర్షాలు కూడా ఎక్కువగా కురుస్తాయి.
# అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వైపు వీచే పవనాలను రుతుపవనాలు అంటారు. ఇవి వర్షాన్నిచ్చే మేఘాలను రవాణా చేస్తాయి కాబట్టి, ఆ పవనాలు వీచే ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఇవి నైరుతి నుంచి వీస్తాయి కాబట్టి నైరుతి రుతుపవనాలు అంటారు.
# రుతుపవనాలు రెండు రకాలు. మొదటిది అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వైపు వీచే నైరుతి రుతుపవనాలు. ఈ రుతు పవనాలు కేరళలో ప్రవేశించి.. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల మీదుగా వీచి ఆయా రాష్ట్రాలకు వర్షాలనిస్తాయి. రెండోది బంగాళాఖాతం నుంచి ఆరేబియా సముద్రం వైపు వీచే ఈశాన్య రుతుపవనాలు. ఈ రుతు పవనాలనే తిరోగమన రుతుపవనాలు అని కూడా అంటారు. వీటి ప్రభావంతో అక్టోబర్, నవంబర్ నెలల్లో తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలతోపాటు, ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. అయితే నైరుతి రుతుపవనాలతో పోల్చితే ఈ ఈశాన్య రుతు పవనాల వర్షపాతం తక్కువగా ఉంటుంది.
తెలంగాణలో వర్షపాతం
# తెలంగాణలో మార్చి నుంచి జూన్ వరకు అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. జూన్ రెండో వారం నాటికి నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురిసి వాతావరణం చల్లబడుతుంది. కానీ, నైరుతి రుతుపవనాలవల్ల తెలంగాణకు సాధారణ వర్షపాతం మాత్రమే ఉంటుంది.
# రాష్ట్రంలో ఎక్కువగా ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో మాత్రమే అధిక వర్షపాతం నమోదవుతుంది. పీఠభూమి ప్రాంతాలు తక్కువ వర్షపాతాన్ని పొందుతున్నాయి. ముఖ్యంగా మహబూబ్నగర్, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో చాలా తక్కువ వర్షపాతం నమోదవుతున్నది.
#మే నుంచి అక్టోబర్ నెలల మధ్య బంగాళాఖాతంలో తుఫాన్లు సంభవిస్తాయి. తుఫాన్ల దిశను బట్టి తెలంగాణపై వాటి ప్రభావం ఉంటుంది. ఒక్కోసారి తుఫాన్లు, రుతు పవనాలు కలిసి అత్యధిక వర్షపాతాన్ని కలుగజేస్తాయి.
నదీ ప్రవాహాలు
#దేశంలో పశ్చిమ కనుమలు కేరళ, కర్ణాటక, మహారాష్ట్రల్లో, తూర్పు కనుమలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. ఇవి రెండూ తమిళనాడులోని గుడలూరు దగ్గర కలుసుకుంటాయి.
# వర్షాలు పడినప్పుడు పర్వతాల వాలు తలాల నుంచి వర్షపు నీరు కిందకు ప్రవహిస్తుంది. ఇలా కిందకు వచ్చిన నీరు ఎటు వంపు ఉంటే అటుగా ప్రవహిస్తుంది. ఆ ప్రవాహ మార్గం లో నేల కోతకు గురవుతుంది. మళ్లీ వర్షాలు కురిసినప్పుడు అవే మార్గాల్లో నీరు ప్రవహిస్తుంది. ఈ విధంగా నదీ మార్గాలు, నదీ లోయలు ఏర్పడుతాయి.
# అదేవిధంగా వర్షపు నీరు కాలువలు, వాగులు, వంకలు, సెలయేళ్లలో ప్రయాణించి నదుల్లో కలుస్తుంది. ఇలా నదుల్లో కలిసే వాగులు, సెలయేళ్లను ఉప నదులు అంటారు.
# సముద్రాల్లో కలిసేచోట నది వెడల్పు ఎక్కువగా ఉండి నీటి ప్రవాహం నెమ్మదిస్తుంది. దాంతో నీటితోపాటు కొట్టుకువచ్చిన ఇసుక, ఒండ్రుమట్టి అడుగుకు చేరి మేట వేస్తాయి. దానివల్ల నదులు సముద్రాల్లో కలిసేచోట డెల్టాలు ఏర్పడుతాయి.
#తూర్పు కోస్తాలో కృష్ణా, గోదావరి నదులు విశాలమైన డెల్టాలను ఏర్పరిచాయి. గోదావరి ఉపనదులు మంజీర, ప్రాణహిత, మానేరు, కడెం. కృష్ణా ఉపనదులు మూసీ, డిండి, తుంగభద్ర.
#అధిక వర్షపాతం నమోదయ్యే పడమర కనుమల్లో ప్రారంభమయ్యే కృష్ణా, గోదావరి నదులు సంవత్సరమంతా ప్రవహిస్తాయి. అందుకే వీటిని జీవనదులు అంటారు. సాధారణ వర్షపాతం కలిగిన తూర్పు కనుమల్లో ప్రారంభమయ్యే నదులు వేసవిలో ఎండిపోతాయి. అదేవిధంగా దిండి, మంజీర, మూసీ నదులు వర్షాభావ ప్రాంతాల్లో ప్రారంభమవుతున్నాయి. వర్షాకాలం తర్వాత ఇవి ఎండిపోతాయి.
వరదలు – ఇబ్బందులు – జాగ్రత్తలు
# ఏ నదిలోనూ సంవత్సరం పొడవునా నీరు ఒకేలా ప్రవహించదు. వర్షాకాలంలో నిండుగా ప్రవహిస్తే, ఎండాకాలంలో నీరు తగ్గుతుంది. వరదలు సంభవించినప్పుడు నది మొత్తం నీటితో నిండి ఉండే లోతైన ప్రాంతాన్ని వరద మైదానం అంటారు.
#నదీ పరీవాహక ప్రాంతాల్లో మొక్కలను పెంచడం వల్ల నీటి ప్రవాహ వేగం తగ్గుతుంది. పైగా భూమిలోకి నీరు ఎక్కువగా ఇంకే అవకాశం ఉన్నది. అంతేగాక ఆకస్మిక వరదల ప్రభావం కూడా తగ్గుతుంది.
#జూన్-డిసెంబర్ మధ్య బంగాళాఖాతంలో వినాశకరమైన తుఫాన్లు ఏర్పడుతాయి. ఈ తుఫాన్లు, వరదలు కాలానుగుణంగా సంభవిస్తాయి.
# వీటి ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆవాసాలు, పంటలు నీట మునుగుతాయి. దాంతో తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. మత్స్యకారులు తాత్కాలికంగా జీవనోపాధిని కోల్పోతారు.
#తుఫాన్ల సమయంలో ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి ఇంట్లో ఒక ఎమర్జెన్సీ కిట్ ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
#ప్రజలు టీవీలు, రేడియోల ద్వారా ప్రసారమయ్యే ప్రభుత్వ హెచ్చరికలను గమనించాలి. తుఫాన్ గాలులు తగ్గినా ప్రభుత్వం ప్రకటన చేసే వరకు సురక్షిత ప్రాంతాల నుంచి బయటికి రాకూడదు.
# తుఫాన్ వేళ ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తే దుస్తులు, ఔషధాలు, విలువైన వస్తువులు మొదలైన వాటిని తడువని బ్యాగుల్లో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలి.
#ఇల్లు ఖాళీ చేసే ముందు ఇంట్లోని వంట పాత్రలు, స్టీలు, ఇత్తడి వస్తువులు, ఫర్నీచర్ మొదలైన వాటిని భద్రపర్చుకోవాలి. వరద నీరు వెనక్కి తన్నకుండా టాయిలెట్స్ పై భాగాలను ఇసుక బస్తాలతో మూసివేయాలి.
వరదలు-ఆరోగ్యం
# వరదలు సంభవించినప్పుడు తాగునీరు, మురుగునీరు కలిసిపోవడం.. పరిసరాల్లో భారీగా వరద నీరు నిలువడం వల్ల అనారోగ్యాలు ప్రబలే ప్రమాదం ఉన్నది. కాబట్టి వరదల సమయంలో కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించడం చాలా అవసరం.
# వరదల వేళ తప్పనిసరిగా మరిగించిన నీటిని తాగాలి.
# ఆహార పదార్థాలపైన మూతలు ఉంచాలి.
# ఆహారం మితంగా తీసుకోవాలి.
#డయేరియా ప్రబలితే డికాషన్, గంజి, లేత కొబ్బరి నీళ్లు తీసుకోవాలి.
# చిన్న పిల్లలను ఖాళీ కడుపుతో ఉంచకూడదు.
# వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఇంటి పరిసరాల్లో నిలిచిన నీటిపై బ్లీచింగ్ పౌడర్, సున్నం చల్లాలి.
#వరద నీటిలో తడిసిన ఆహార పదార్థాలను వినియోగించకూడదు.
నీరు ముఖ్యమైన విషయాలు
– బాష్పీభవనం- నీరు ఆవిరిగా మారడం
– ద్రవీభవనం -నీటి ఆవిరి నీరుగా మారడం
– అవపాతం- నీటి ఆవిరి నీరుగా మారి భూమిని చేరడం
– ఆర్ధత -వాతావరణంలో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరి
– వర్ష మాపకం- వర్షపాతాన్ని కొలిచే పరికరం
– జలచక్రం- నీరు ఆవిరై ఆకాశంలో మేఘాలుగా ఏర్పడి,మేఘాలు వర్షించినప్పుడు నీరు తిరిగి భూమిని చేరడం
– వరద మైదానం -వరదలు సంభవించినప్పుడు నదిలో నిండుగానీటితో ఉండే లోతైన ప్రాంతం
ప్రాక్టీస్ బిట్స్
1. భూగోళంపై నీటి శాతం ఎంత?
1) 29 శాతం 2) 71 శాతం
3) 61 శాతం 4) 39 శాతం
2. నీరు ఆవిరై వాతావరణంలో కలువడాన్ని ఏమంటారు?
1) బాష్పీభవనం 2) ద్రవీభవనం
3) అవపాతం 4) జలచక్రం
3. కింది వేటి నుంచి గరిష్ఠ స్థాయిలో బాష్పీభవనం జరుగుతుంది?
1) మొక్కలు 2) నదులు
3) సముద్రాలు 4) మానవ శరీరాలు
4. బాష్పీభవనం, అవపాతాలు నిరంతరం కొన సాగడాన్ని ఎలా వ్యవహరిస్తారు?
1) వాయుచక్రం 2) జలచక్రం
3) జీవచక్రం 4) ఏవీకావు
5. గాల్లోని తేమ భూమిని చేరడాన్ని ఏమంటారు?
1) బాష్పీభవనం 2) ద్రవీభవనం
3) అవపాతం 4) బాష్పోత్సేకం
6. అవపాతం ఏ రూపంలో జరుగుతుంది?
1) మంచు 2) వర్షం
3) పొగమంచు 4) పైవన్నీ
7. వాతావరణంలోని నీటి ఆవిరికి గల పేరు?
1) అవపాతం 2) ఆర్ధత
3) బాష్పీభవనం 4) మంచు
8. వాతావరణంలో ఏది ఎక్కువగా ఉంటే చెమట, ఉక్కపోతలతో అసౌకర్యంగా ఉంటుంది?
1) ఆర్ధత, అవపాతం
2) ఆర్ధత, ఉష్ణోగ్రత
3) ఆర్ధత, జడవాయువులు
4) ఆర్ధత, మేఘాలు
9. వర్షాలు అధికంగా ఎక్కడ కురుస్తాయి?
1) ధ్రువాలు 2) భూభాగాలు
3) సముద్రాలు 4) ఎడారులు
10. అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వైపు వీచే పవనాలు?
1) ఈశాన్య 2) ఆగ్నేయ
3) నైరుతి 4) వాయవ్య
11. తెలంగాణ జిల్లాల్లో తక్కువ వర్షపాతం పొందుతున్న జిల్లా?
1) నల్లగొండ 2) కరీంనగర్
3) జోగులాంబ 4) రంగారెడ్డి
సమాధానాలు
1-2 2-1 3-3 4-2 5-3 6-4 7-2 8-2 9-3 10-3 11-3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు