ఉష్ణమండల తూర్పు జెట్ ప్రవాహాలు అని వేటిని అంటారు?
భారత రుతుపవనాల యాంత్రికీకరణను (ఆవిర్భావం) వివరించండి?
- భారత రుతుపవనాలు అంటే నైరుతి రుతుపవనాలు భారత ఉపఖండం మీదకు రావడానికి ముఖ్యమైన కారణం భారత ఉపఖండంపై హిమాలయాలు, టిబెట్ పీఠభూమిపై ఏర్పడ్డ ఒక బలమైన అల్పపీడన వ్యవస్థ, దానితో పాటు ఎగువ ట్రోపోస్పియర్లో ఏర్పడ్డ అధిక పీడన వ్యవస్థ.
- ఈ అల్పపీడన వ్యవస్థ ఏర్పటడానికి వివిధ కారణాలను పరిశీలిస్తే..
1)భూమి త్వరగా వేడెక్కి, త్వరగా చల్లబడే లక్షణం ద్వారా తమ సమీప సముద్ర భాగాలతో పోల్చి చూసినప్పుడు పగటిపూట అలాగే వేసవికాలంలో అల్పపీడన లక్షణాన్ని కలిగి ఉంటుంది. సూర్యుడు ఉత్తరాయానం సమయంలో విస్తృతమైన ఉపఖండం భూభాగం, దాని సరిహద్దు భూపరివేష్టిత ఉత్తర హిందూ మహాసముద్రం మధ్యలో దీర్ఘకాలిక ఉష్ణోగ్రత వ్యత్యాసాలు ద్వీపకల్ప భాగంపై అల్పపీడనాన్ని ఏర్పరుస్తూ, రుతుపవనాలను ఆకర్షిస్తున్నాయి.
2) ఇంచుమించు జూన్ మొదటి వారం నాటికి అంతర అయనరేఖ అభిసరణ మండలం (అధిక ఉష్ణోగ్రత, అల్పపీడనం గల) ఉత్తర మైదాన ప్రాంతాల్లో ఉండటం ద్వారా అక్కడ కూడా అల్పపీడనం ఏర్పడుతుంది.
3) మధ్య ట్రోపోస్పియర్లోని పశ్చిమ జెట్ ప్రవాహాలు ట్రాన్స్ హిమాలయాలను తాకుతూ, రెండు శాఖలుగా విడిపోతూ హిమాలయాలకు ఎగువన, దిగువన కూడా భూపటలంపై అల్పపీడనాన్ని, ఎగువ ట్రోపోస్పియర్లో అధిక పీడనాన్ని కలుగజేస్తూ, భారత రుతుపవనాలను భారత ఉపఖండానికి పరిమితం చేస్తున్నాయి.
4) సగటున 4000 మీటర్ల ఎత్తులో ఉన్న టిబెట్ పీఠభూమి తన సరిహద్దు పర్వత వ్యవస్థలతో పోల్చినప్పుడు అధిక ఉష్ణోగ్రతలను, అల్పపీడనాన్ని కలిగి ఉంటుంది.
5) టిబెట్ పీఠభూమిపై ఏర్పడిన అల్పపీడనం వల్ల సంవహనం చెందుతున్న గాలి అక్కడ ట్రోపోస్పియర్లో 8-10 కి.మీ. ఎత్తువరకు ఎగబాకిన తర్వాత ద్వీపకల్ప పీఠభూమి మీదుగా ప్రయాణం చెందుతూ 30 డిగ్రీల దక్షిణ అక్షాంశం, 70 డిగ్రీల తూర్పు రేఖా ప్రాంతమైన ‘మాస్కరిన్’ దీవుల వద్ద దిగబాకుతూ అధిక పీడనాన్ని కలుగజేస్తూ, భారత రుతుపవనాల తీవ్రతను పెంచుతుంది. వీటినే ఉష్ణమండల తూర్పు జెట్ ప్రవాహాలు అంటారు. - పై అన్ని కారణాల వల్ల భారత ఉపఖండ భూభాగంపై ఏర్పడిన అల్పపీడనాన్ని ఆక్రమించడానికి, అదే సమయంలో భారత భూభాగంపై గల లేదా ఉత్తరార్ధగోళంలోని ‘అంతర అయనరేఖ అభిసరణ మండలం (ఐటీసీజడ్)’ను చేరుకోవడానికి భూమధ్య రేఖను దాటిన ఆగ్నేయ వ్యాపార పవనాలు భూభ్రమణ శక్తి వల్ల కుడివైపునకు వంగి, భారతదేశానికి నైరుతి దిక్కున తీరాన్ని దాటి నైరుతి రుతుపవనాలుగా ఆవిర్భవిస్తాయి.
- సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు సూర్యుడి దక్షిణాయానం కారణంగా అల్ప ఉష్ణోగ్రతలు కలిగిన భారత భూభాగంపై అధిక పీడనం ఏర్పడటం ద్వారా నైరుతి రుతుపవనాలు తిరోగమనం చెందుతాయి. వాటిలో ఒక భాగం బంగాళాఖాతాన్ని దాటుతున్న తరుణంలో కోరమండల్ తీరానాకి ఈశాన్య రుతుపవనంగా ప్రవేశించి కొంత వర్షపాతాన్ని ఇస్తుంది.
- పై విధంగా భారత ఉపఖండ లక్షణం, అంతర అయనరేఖ, అభిసరణ మండలం, పశ్చిమ జెట్ ప్రవాహాలు, టిబెట్ ఉష్ణోగ్రత, ఉష్ణమండల తూర్పు జెట్ ప్రవాహాలు మొదలైన వాటి వల్ల నైరుతి రుతుపవనాలు భారత్‌లో ప్రవేశిస్తే, సూర్యుడి దక్షిణాయానం వల్ల ఏర్పడిన అధిక పీడనం అవే నైరుతి రుతుపవనాలు ఈశాన్య రుతుపవనాలుగా తిరోగమిస్తాయి.
విశ్వనగరంగా హైదరాబాద్‌ను రూపొందించడంలో తెలంగాణ ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పన కోసం చేపడుతున్న ప్రాజెక్ట్ గురించి వివరించండి
- రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం ఇంచుమించు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులతో హైదరాబాద్ నగరానికి సంబంధించి మెట్రో, ఔటర్ రింగ్ రోడ్, ఎక్స్‌ప్రెస్ వేస్, వివిధ రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులు, శక్తి సంరక్షణ ప్రాజెక్టులు మొదలైనవి చేపడుతుంది.
- వివరాలు: సుమారు 17,300 కోట్ల రూపాయలతో మూడు కారిడార్లలో 72 కి.మీ. పొడవునా అత్యంత వేగవంతమైన, సురక్షితమైన, పర్యావరణ హితమైన ఎంఎంటీఎస్, మెట్రోను పూర్తిచేసింది. ప్రస్తుతం సగటున రోజుకు నాలుగు ప్రమాణాలను అందిస్తుంది
- ‘జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ’ పరిధిలోని రోడ్ల నిర్మాణం వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక నమూనా రోడ్ల కారిడార్లు, అనుసంధాన రోడ్లు, సమగ్ర రోడ్ల నిర్వహణ పథకం, బాహ్య వలయ రహదారి (ఔటర్ రింగ్ రోడ్) వీటి ద్వారా పదుల సంఖ్యలో అండర్ పాస్‌లు, ఫ్లై ఓవర్లు, లింక్ రోడ్లు మొదలైనవి రూ.14,738 కోట్లతో పూర్తి చేస్తూ ఒకవైపు ట్రాఫిక్ నిర్మూలనతో పాటు మరోవైపు ప్రజల ప్రయాణ సమయాన్ని తగ్గిస్తూ వస్తుంది. నగర తాగునీటి అవసరాన్ని తీర్చడానికి కృష్ణా-గోదావరి నీటిని నగరానికి తెప్పించడం కోసం నగర వ్యాప్తంగా 4700 కి.మీ. పైప్‌లైన్ నెట్వర్క్ నిర్మాణంతో పాటు మురుగునీటి శుద్ధి డిశ్చార్జ్ యూనిట్ల నిర్మాణం కోసం, అదేవిధంగా నగరంలో ప్రతి గృహానికి మంచినీటి సదుపాయం అందించడానికి రూ.14,175 కోట్లు ఖర్చు చేశారు
- పరిశ్రమలకు పవర్ హాలిడేస్ వంటి వాటిని నియంత్రించడానికి రూ.2,300 కోట్లతో నిరంతర విద్యుత్ సరఫరాకు అవసరమైన చర్యలు చేపట్టారు. అదేవిధంగా శక్తి సంరక్షణ కోసం రూ.564 కోట్లతో నగర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ స్తంభాలకు ఎల్ఈడీ బల్బులను అమర్చారు.
- ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం కోసం రూ.9,700 కోట్లు ఖర్చు పెడుతూ 111 ప్రదేశాల్లో లక్ష గృహాలు నిర్మించింది.
- హైదరాబాద్ పోలీస్ వ్యవస్థ ఆధునికీకరణ కోసం సీసీ టీవీల ఏర్పాటు, షీ టీమ్స్‌ను నియమించడం తదితరాల కోసం రూ.1940 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది.
- హైదరాబాద్‌ను స్వచ్ఛంగా ఉంచడం కోసం సుమారు రూ.1716 కోట్లు ఖర్చు చేశారు. దీనిలో భాగంగా మున్సిపల్ సాలిడ్ వేస్ట్ కోసం 125 ఎకరాల భూమిని సేకరించారు. 2500 స్వచ్ఛ ట్రాలీ ఆటోలను కొనుగోలు చేశారు. దేశంలోనే అతిపెద్ద వ్యర్థాల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను నిర్మించారు.
- విపత్తు నిర్వహణ కోసం రూ.15 కోట్లు, హరిత హైదరాబాద్, మియావాకి మోడల్‌తో అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ నిర్మించడానికి రూ.332 కోట్లు, పార్కుల నిర్మాణానికి రూ.250 కోట్లు, నగర సుందరీకరణకు రూ.150 కోట్లు, పాదచారుల మార్గాల కోసం రూ.100 కోట్లు, వైకుంఠధామాల కోసం రూ.67 కోట్లు, క్రీడా మౌలిక సదుపాయాల కోసం రూ.100 కోట్లు ఖర్చు చేశారు.
- ఇవే కాకుండా టీ హబ్, టీఎస్ఐసీ, టాస్క్, సాఫ్ట్‌నెట్, రిచ్, టీ వర్క్స్, వీ హబ్, మహిళా భద్రత, చెరువుల పునరుద్ధరణ, బస్తీ దవాఖానాలు, అన్నపూర్ణ క్యాంటీన్ వంటి సదుపాయాలను కల్పిస్తూ హైదరాబాద్‌ను విశ్వనగరంగా, బ్రాండ్ హైదరాబాద్‌గా తీర్చిదిద్దుతుంది.
భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం గురించి వ్యాఖ్యానించండి?
- ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 1972, జూన్ 5న ప్రకటించిన స్టాక్ హోం డిక్లరేషన్ లేదా పర్యావరణ సదస్సులో భాగస్వామిగా ఉన్న భారతదేశం వన్యప్రాణులను సంరక్షించడానికి ఇదివరకే ఉన్న కొన్ని చట్టబద్ధ అంశాలతో పాటు ఈ చట్టాన్ని 1972, సెప్టెంబర్‌లో చేసింది.
- ఈ చట్టంలో 7 చాప్టర్లు, 66 సెక్షన్లు, 6 షెడ్యూళ్లు ఉన్నాయి. షెడ్యూల్-1, షెడ్యూల్-2లో అత్యంత ప్రమాదపు అంచులో ఉన్న జీవులను చేర్చారు. వీటికి హాని కలిగిస్తే కఠిన శిక్షలు, జరిమానాలు విధిస్తారు.
- షెడ్యూల్-3, షెడ్యూల్-4లో చేర్చిన ప్రాణులకు హానికలిగిస్తే సాధారణ శిక్షలు, జరిమానాలు విధిస్తారు.
- షెడ్యూల్-5లో వెర్మిన్/వేటాడగల జంతువులను పేర్కొన్నారు. దీనిలో సాధారణ కాకి, గబ్బిలం, ఎలుక, అడవిపంది మొదలైన జంతువులు ఉన్నాయి.
- షెడ్యూల్-6లో కొన్ని సాధారణ సాగుకు అనుమతిలేని మొక్క జాతులను పేర్కొన్నారు.
- ఈ చట్టంలో చాప్టర్-3 వన్యప్రాణుల వేటను నిషేధిస్తుంది. ప్రభుత్వం అనుమతితో ప్రజాప్రయోజనార్థం వేటకు అనుమతి కూడా లభించవచ్చు. ఈ చట్టంలో అత్యంత ముఖ్యమైన భాగం చాప్టర్-4. ఇది భారత రక్షిత ప్రాంతాలైన బయోస్పియర్ రిజర్వ్‌లు. వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు మొదలైన వాటి ఏర్పాటు గురించి తెలుపుతుంది. అదే విధంగా ప్రధానమంత్రి ఆధ్వర్యంలో జాతీయ వన్యప్రాణి బోర్డు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్ర వన్యప్రాణి బోర్డు ఏర్పాటును తెలుపుతుంది.
- చాప్టర్-4 పర్యావరణ మంత్రి ఆధ్వర్యంలో కేంద్ర జంతు ప్రదర్శనశాల ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయమని చెబుతుంది.
- చాప్టర్-5 వన్యప్రాణి వాణిజ్య అనుమతులను, అవసరమైన వాటిపై వాణిజ్య నిషేధాన్ని తెలుపుతుంది.
- చాప్టర్-6 పర్యావరణ పరిరక్షణ అధికారుల పరిధిని, వారి అధికారాలను, అవసరమైన రక్షణలను, షెడ్యూల్‌కు అనుబంధంగా శిక్షల గురించి వివరిస్తుంది. చాప్టర్-7లో మిగతా అంశాల ప్రస్తావన ఉంది.
- ఈ చట్టం ప్రత్యక్షంగాను, కొన్ని జంతువుల ప్రత్యేక ప్రాజెక్టుల రూపంలో అమలవుతుంది. ఒకవైపు ఆవాసాంతర పరిరక్షణ కోసం, మరోవైపు ఆవాసేతర పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తారు.
నర్మద నది ప్రత్యేకతలను తెలుపుతూ ఆ నది ఎప్పుడూ వార్తల్లో ఉండటానికి గల కారణాలను చర్చించండి?
- దేశంలో అత్యధిక సంఖ్యలో జలపాతాలు, పగులు లోయ ఉపనదులను కలిగి ఉంది. ఇంచుమించు తన ప్రయాణం అంతా వింధ్య, సాత్పూర పగులు లోయ గుండా కొనసాగిస్తున్న నది నర్మద. ద్వీపకల్ప పీఠభూమి వాలు తూర్పు వైపునకు ఉన్నప్పటికీ ఈ నది పగులు లోయ గుండా ప్రయాణించడం ద్వారా ఇది పశ్చిమాన ప్రవహిస్తున్న నదుల్లో అతిపెద్దదిగా అవతరించింది.
- ద్వీపకల్ప పీఠభూమిలో వింధ్య, సాత్పూర వాటర్‌షెడ్/నీటి విభాగిని నుంచి జన్మించిన పదుల సంఖ్యలో ఉపనదులు ఈ నదికి ఉండటం, ఈ నది వింధ్య, సాత్పూర పర్వతాల మధ్యలో ఒక స్పష్టమైన పగులు లోయ గుండా ప్రయాణించడం వంటి లక్షణాల వల్ల దేశంలో అత్యధిక సంఖ్యలో ఆనకట్టలు కట్టడానికి అత్యంత అనుకూల నదిగా పేర్కొంటారు.
- మధ్యప్రదేశ్‌లో సాత్పూర పర్వతాల్లో భాగమైన మైకాల్ పర్వతశ్రేణిలో అమర్‌కంఠక్ వద్ద జన్మించిన ఈ నది ఎక్కువ దూరం మధ్యప్రదేశ్ గుండా ప్రయాణిస్తూ తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సరిహద్దుగా, మహారాష్ట్ర, గుజరాత్ సరిహద్దుగా, తర్వాత గుజరాత్లో నర్మద జిల్లాలో ప్రవేశించి, గుజరాత్లో బరుచ్ అనే ప్రాంతం వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. రాజస్థాన్ ప్రాంతం కూడా ఈ నదీ పరీవాహక ప్రాంతం కిందకు వస్తుంది.
- నదీ జలాల వివాదాల చట్టం 1956 అనుసరించి ఈ నదిపై కేంద్ర ప్రభుత్వం 1969 నర్మద ట్రిబ్యునల్‌ని నియమించింది. ఈ నదిపై 30 పెద్ద ఆనకట్టలు, 135 మధ్యస్త ఆనకట్టలు, 3000 వరకు చిన్న ఆనకట్టలను కట్టుకోవడానికి అనుమతి ఇచ్చింది. దీన్ని అనుసరించి ఆయా రాష్ర్టాలు ముఖ్యంగా మధ్యప్రదేశ్ అనేక ఆనకట్టలను నిర్మించింది, నిర్మిస్తూ ఉంది. అందులో ఇందిరాసాగర్, తావా, మహేశ్వర్, పరమేశ్వర్, ఓంకారేశ్వర్ వంటి ఆనకట్టలతో పాటు అతి ముఖ్యమైన అత్యంత వివాదాస్పదమైన సర్దార్ సరోవర్ ఆనకట్ట కూడా ఉంది.
- పై ఆనకట్టల నిర్మాణం ద్వారా విస్తృతంగా గిరిజనులకు పునరావాసం కల్పించాల్సి వచ్చింది. ఆ పునరావాస చర్యలు వాటి అమలుతీరు సరైన విధానంలో లేనందున వాటిని వ్యతిరేకిస్తూ మేధాపాట్కర్ నాయకత్వంలో అరుంధతీరాయ్, బాబా ఆమ్టే సహకారంతో వచ్చిన ప్రజా ఉద్యమమే ‘నర్మదా బచావో’ ఆందోళన. ఒకవైపు ఆందోళనలు ఎంతో అవసరమని, వివిధ స్థాయిలో రాజకీయవేత్తలు, చట్టసభలు చివరికి న్యాయ విభాగాలు కూడా ఆమోదం తెలిపాయి. అందులోనూ ప్రపంచ బ్యాంక్ సర్దార్ సరోవర్ ఆనకట్టకు నిధులు సమకూర్చడానికి కూడా ముందుకు వచ్చింది. ఈ ఆనకట్ట నిర్మాణంతో పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయనే నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్ విరమించుకున్నప్పటికీ ఆ బాధ్యతను ఆ నాలుగు రాష్ర్టాలు తీసుకొని డ్యామ్ నిర్మాణాన్ని మరింత ఎత్తుకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.
- నర్మద బచావో ఆందోళన ఈసారి తన లక్ష్యంగా పై డ్యామ్ ఎత్తు తగ్గించడానికి నిర్ణయం తీసుకొని ర్యాలీ ఫర్ వ్యాలీ అనే నినాదం ఇచ్చారు. చివరకు ఒకవైపు ఉద్యమాలు కొనసాగుతున్నప్పటికీ సుప్రీంకోర్టు అనుమతితో ఈ డ్యామ్‌ను 66 మీటర్ల నుంచి వివిధ దశల్లో 163 మీటర్ల ఎత్తుతో నిర్మాణాన్ని పూర్తిచేసిన దీన్ని ప్రధాని మోదీ 2017లో జాతికి అంకితం చేశారు.
జీ గిరిధర్ సివిల్స్ ఫ్యాకల్టీ, బీసీ స్టడీ సర్కిల్హైదరాబాద్: 9966330068
Previous article
కొలువుల ధమాకా!
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు