పర్యావరణ సంరక్షణ.. ప్రతి ఒక్కరి బాధ్యత
స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, సుస్థిర వాతావరణం పొందడం ఒక వ్యక్తికి కల్పించిన జీవించే హక్కులో భాగం అని సుభాష్ కుమార్ vs స్టేట్ ఆఫ్ బీహార్ కేసు (1991) లో సుప్రీంకోర్టు తెలిపింది. వాతావరణంలో కనీవినీ ఎరుగని ఎన్నో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భూగోళం ఎన్నడూ లేనంతగా వేడెక్కు తుంది. అంతర్జాతీయ ఒప్పందాలు కాగితాలకే పరిమితమైపోతున్నాయి. వెరసి ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల కాలుష్యాలు కలిపి ఒక సంవత్సరంలోనే సగటున 90 లక్షల అకాల మరణాలు, కేవలం నీటి కాలుష్యం వల్లనే 13.6 లక్షల మరణాలు సంభవిస్తున్నాయని ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్ తాజాగా వెల్లడిం చింది. ఇది ఇలాగే కొనసాగితే కనీవినీ ఎరుగని నష్టాలను చవిచూడటం ఖాయమని ఆ రోజు కూడా ఎంతో దూరంలో లేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇలా పర్యావరణం ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుం టుంది. ఈ సంక్షోభ సమయంలో ఈ ఒక్క భూమిని అందరమూ ఒక్కటై కాపాకునే సమయం ఆసన్నమైంది.
– భూగ్రహం మొత్తం ఎంతైతే వేడెక్కుతుందో దానికి నాలుగు రెట్లు ఆర్కిటిక్ వేడెక్కుతుంది. గత కొన్నేళ్లుగా గ్రీన్ ల్యాండ్ ఐస్ షీట్ కూడా దారుణంగా కరుగుతూ వస్తుంది. దీనికి కారణం గ్లోబల్ వార్మింగ్. ఇలా ప్రపంచ వ్యాప్తంగా మంచు కరగడం వల్ల సముద్ర మట్టం దాదాపు ఆరు మీటర్ల ఎత్తు పెరుగుతుంది, దీనివల్ల దాదాపు 375 మిలియన్ల ప్రజలు తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటారని, సగటున ఒక దశాబ్దంలో 0.75 డిగ్రీ సెల్సియస్ చొప్పున భూమి వేడెక్కుతుందని ప్రపంచ ప్రముఖ సంస్థల పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి. సూర్యకిరణాలు భూమిపై పడి పరావర్తనం చెందుతాయి. వీటిని వాతావరణంలో అధిక మొత్తంలో ఉన్న CO2, CH4, N2O, SF6, HFC, CFC, నీటి ఆవిరి తదితరాలు గ్రహించి భూమి పైన వాతావరణాన్ని వేడెక్కింపజేసే ప్రక్రియను గ్లోబల్ వార్మింగ్ (భూమి వేడెక్కడం) అంటారు. ఇందుకు ప్రధాన కారణం చెట్లను నరికి వేయడం అని చెప్పవచ్చు. ఒక వ్యక్తి లేదా పరిశ్రమ లేదా గృహం నుంచి విదలయ్యే CO2, ఇతర గ్రీన్హౌస్ వాయువుల మోతాదును ‘కార్బన్ ఫూట్ ప్రింట్’ అంటారు.
-ధృవాల్లోని మంచు కరిగి సముద్రమట్టం పెరగడం వల్ల లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతాయి.
-వర్షపు చినుకులు మధ్యలోనే ఆవిరి కావడం వల్ల సరస్సులు, నదులు ఎండిపోతాయి. తక్కువ వర్షపాతం
నమోదవుతుంది.
– ఉష్ణమండల ప్రాంతాల్లో వ్యవసాయ దిగుబడి తగ్గి సమశీతోష్ణ ప్రాంతాల్లో పెరుగుతుంది.
– ప్రకృతి మానవ జీవనానికి కావలసిన వనరులన్నింటినీ సమకూర్చుతుంది. అన్ని సహజ వనరులను మనం ఉపయోగించుకుంటున్నాం. మనం వాటిని ఎలా వాతున్నాం. ఎలా మన అవసరాలను తీర్చుకుంటున్నాం అనే దానిపైనే మన భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది. అభివృద్ధి పేరుతో మనం ఎన్నో దుశ్చర్యలకు పాల్పతున్నాం. అడవులను నరికివేయడం, పరిశ్రమలు నెలకొల్పి కాలుష్యాన్ని మరింతగా పెంచడం, గ్రీన్ హౌస్ వాయువులతో వాతావరణాన్ని, భూగోళాన్ని వేడెక్కించడం అభివృద్ధి అనిపించుకోదు. భూమి వేడెక్కడం వల్ల చాలా నష్టాలను మనం చూడబోతున్నాం. భూ ఉపరితలం వేడెక్కడం వల్ల ధ్రువాల్లో ఉన్న మంచు కరుగుతుంది. దానివల్ల సముద్ర మట్టాలు ఆరు అగుల ఎత్తు వరకు పెరిగి కోస్తా తీరాల్లో లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి. వాతావరణ మార్పు కారణంగా సముద్ర మట్టాలు 24 నుండి 38 సెంటీమీటర్లు పెరిగి జకార్తా, బ్యాంకాక్, మనీలా వంటి నగరాలు నీట మునిగిపోయే ప్రమాదం ఉంది. సముద్రమట్టం పెరగడం వల్ల మునిగిపోయే ప్రమాదంలో ఉన్న జకార్తా రాజధానిగా ఉన్న ఇండోనేషియా రాజధానినే మార్చే పరిస్థితి వచ్చిందంటే ఎంతటి ప్రమాదపుటంచున మనం ఉన్నామో అర్ధమవుతుంది. వాతావరణంలో మార్పులు జరిగి క్లౌడ బరస్ట్ వల్ల అకాల వర్షాలు కురుస్తాయి. నదుల్లో సముద్రపు నీరు చేరి ఉప్పు నీటిగా మారుతాయి. ఫలితంగా క్రిమికీటకాలు, దోమలు విజృంభిస్తాయి. మలేరియా, డయేరియా, డెంగీ లాంటి అంటువ్యాధులు వ్యాపిస్తాయి. కొన్ని దేశాల్లో అనావృష్టి, కరవు కాటకాలే కాకుండా నీటి కొరత విపరీతంగా ఉంటుంది.
వాతావరణ మార్పుపై (UNFCCC (United Nations Framework Convention Climate Change) ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ వాతావరణంలో గ్రీన్హౌస్ వాయువు సాంద్రతలను స్థిరీకరించడం ద్వారా ‘వాతావరణ వ్యవస్థతో ప్రమాదకరమైన మానవ జోక్యాన్ని‘ ఎదుర్కోవడానికి అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాన్ని ఏర్పాటు చేసింది. బ్రెజిల్ లోని రియోలో జరిగిన ఒప్పందాల్లో ఇదీ ఒకటి (1992). 1994 మార్చి 21న అమల్లోకి వచ్చిన ఈ ఒప్పందంపై సంతకాలు చేసిన సభ్యదేశాలను 3 రకాలుగా విభజించారు.
– Anex-1 దేశాలు- పారిశ్రామిక, పరివర్తన చెందే దశలో ఉన్న దేశాలు.
– Anex-2 దేశాలు- అభివృద్ధి చెందిన దేశాలు
– Anex-3 దేశాలు- అభివృద్ధి చెందుతున్న దేశాలు
-UNFCCC ఏటా నిర్వహించే సదస్సును ’కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (COP)’ అంటారు. పర్యావరణ సంరక్షణ కోసం 2021లో గ్లాస్గో వేదికగా ప్రధాని మోదీ చెప్పిన పంచామృత సిద్ధాంతాలను ప్రజల్లో అవగాహన కల్పించాలి.
పంచామృత సిద్ధాంతాలు
1. శిలాజ ఇంధనాల వినియోగానికి క్రమంగా స్వస్తి. సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2030 నాటికి 500 గిగావాట్లకు పెంచాలి.
2. పునరుత్పాదక ఇంధన వనరులకు పెద్ద పీట. 2030 నాటికి దేశ ఇంధన అవసరాల్లో 50 శాతం ఇంధనం పునరుత్పాదక వనరుల ద్వారా సమకూర్చుకోవడం.
3. ఇప్పటి నుంచి 2030 దాకా ఒక బిలియన్ (100 కోట్ల) టన్నుల కర్బన ఉద్గారాల తగ్గింపు.
4. కర్బన ఉద్గారాల వల్ల ఆర్థిక వ్యవస్థపై పడే ప్రతికూల ప్రభావాన్ని 2030 నాటికి 45 శాతం కంటే తక్కువకు పరిమితం చేయాలి.
5. నెట్ జీరో కర్బన ఉద్గారాలు అనే లక్ష్యాన్ని 2070 నాటికి భారత్ సాధించాలి.
– పర్యావరణాన్ని పరిరక్షించే విషయంలో ప్రభుత్వం, ప్రజలు బాధ్యత వహించాలని రాజ్యాంగం నిర్దేశించింది. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 48(A), 51(A)(g) నిబంధనల కింద పర్యావరణ పరిరక్షణను పొందుపరిచారు. ఇలా జీవవైవిధ్యాన్ని కాపాడటానికి ప్రభుత్వానికి సర్వ హక్కులను ఇచ్చిన దేశంగా భారత్ నిలిచింది. పర్యావరణ సంరక్షణకు భారత ప్రభుత్వం చాలా చట్టాలను ముందుకు తెచ్చింది. వీటిపట్ల ప్రజల్లో అవగాహన కల్పించే బాధ్యతను ప్రతి పౌరు తీసుకోవాలి. అందులో ముఖ్యంగా కర్మాగారాల చట్టం-1948, క్రిమి సంహారక మందుల చట్టం-1968, వన్యప్రాణి సంరక్షణ చట్టం- 1972, నీటి కాలుష్య నివారణ, నియంత్రణ చట్టం- 1974, వాయు కాలుష్య నివారణ, నియంత్రణ చట్టం-1981, పర్యావరణ సంరక్షణ చట్టం-1986, హానికర వ్యర్థాల నియంత్రణ చట్టం- 1989, జీవవైవిధ్య చట్టం-2002, జాతీయ హరిత ట్రిబ్యునల్ చట్టం- 2010, జాతీయ కార్యాచరణ ప్రణాళిక– 2016 ఇలా ఎన్నో చట్టాలు దేశంలో అమల్లో ఉన్నాయి. చట్టాల రూపకల్పన మాత్రమే కాకుండా వాటి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించినపుడే వాటి అద్భుత ఫలితాలు దక్కుతాయి.
-సామాజిక వనాలు, చెట్లను బాగా పెంచాలి. రాలిన చెట్ల ఆకులను నేలలో గొయ్యితీసి వూడ్చి కంపోస్టుగా మార్చాలి.
– సముద్ర జలాల్లో ఫైటో ప్లాంక్టన్ వృక్షజాలాలు విపరీతంగా అభివృద్ధి చెందేలా చూడాలి. ఇవి వాతావరణంలో CO2ను తగ్గిస్తాయి. ఫలితంగా భూమి వేడి తగ్గుతుంది.
-ఓజోన్ పొరను నాశనం చేసే క్లోరో ఫ్లోరో కార్బన్లను తగ్గించాలి. CFC లేని ఫ్రిజ్‌లు, ఎయిర్ కండిషనర్లనే ఉపయోగించాలి.
-పరిశ్రమల వ్యర్థ వాయువులను నియంత్రించాలి.
– వాహనాల నుంచి వెలువడే NO2ను నియంత్రించడానికి, వాహనాలకు కెటలిటిక్ కన్వర్టర్లు ఉపయోగించాలి. దీనివల్ల NO2 విడిపోయి నైట్రోజన్, నీరుగా మారుతుంది.
– వ్యవసాయంలో సేంద్రియ ఎరువులు వాడాలి.
– ఇలా ప్రతి ఒక్కరం పర్యావరణ సంరక్షణ కోసం నం బిగించే సమయం ఆసన్నమైంది. ఈ ఒక్క భూమిని అందరమూ ఒక్కటై కాపాకోకపోతే మన వినాశనాన్ని మనం కోరుకున్నట్టే.
మల్లవరపు బాలలత
సివిల్స్ ఫ్యాకల్టీ
సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ,
హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు