TSPSC GROUP 1 Mains Special | మాంగ్రూవ్స్ – ఖనిజ వనరులు – మిషన్ కాకతీయ
మాంగ్రూవ్స్ అంటే ఏమిటి? వాటి ప్రాముఖ్యం, దేశంలో వాటి విస్తరణను గురించి పేర్కొనండి?
- మాంగ్రూవ్స్ (టైడల్) అరణ్యాలు ఆర్ధ్రత సతతహరిత రకానికి చెందినవి. ఉప్పునీటిలో పెరుగుతాయి.
- ఈ అరణ్యాల్లో పెరిగే వృక్షాలు గాలిలోని ఆక్సిజన్‌ను గ్రహించేందుకు ‘న్యుమటోఫోర్స్’ అనే నేల నుంచి గాలిలోకి పెరిగే ప్రత్యేకమైన వేర్లను కలిగి ఉంటాయి. ఇవి భౌమ ఆవరణ వ్యవస్థలు, జలావరణ వ్యవస్థలు కలుసుకునే సంధి ప్రాంతమైన ‘ఎకోటోన్స్’లో విస్తరించి ఉంటాయి. అంటే మంచినీరు ఉప్పునీరు కలుసుకునే ప్రాంతాల్లో సమృద్ధిగా పెరుగుతాయి.
- ఇవి సముద్ర తీర ప్రాంత చీలికలు, ఎస్టురీస్, చిత్తడి నేలలు, నదీ ముఖద్వారాల వద్ద 40-200 సెం.మీ. వర్షపాతం గల ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. వీటినే మాంగ్రూవ్ అని, మడ అరణ్యాలు అని పిలుస్తారు. పశ్చిమ బెంగాల్‌లోని ఈ అరణ్యాల్లో సుంద్రి అనే వృక్షజాతి ఎక్కువగా విస్తరించి ఉండటంతో వీటిని అక్కడ ‘సుందర్బన్ అరణ్యాలు’ అని పిలుస్తారు. ప్రపంచంలోని మొత్తం మాంగ్రూవ్స్లో ఇవి 7 శాతం ఉన్నాయి.
ప్రాముఖ్యం - పర్యావరణపరంగా ఇవి అత్యంత ప్రాముఖ్యంగల అరణ్యాలు. తీర ప్రాంత స్థిరీకరణలో, విలక్షణమైన జీవజాతులకు ఆవాసాన్ని కలిగించడంలో, సముద్ర ఉప్పునీరు తీర ప్రాంత డెల్టా నేలలోకి ప్రవేశించకుండా నియంత్రించడంలోను, సైక్లోన్స్, సూపర్ సైక్లోన్స్ సమయాల్లో తీరాన్ని తాకే ఎత్తయిన కెరటాల నుంచి తీర ప్రాంత భూభాగాలను పరిరక్షించడంలో, తీర ప్రాంతాల నుంచి వచ్చే ఎత్తయిన అలల నుంచి క్రమక్షయం చెందకుండా నిరోధించడంలో ఇవి కీలక పాత్ర వహిస్తాయి. మత్స్య సంపద అభివృద్ధికి ఇవి అత్యంత అనుకూలమైన ఆవాసాలు.
మాంగ్రూవ్స్ ఎదుర్కొంటున్న సమస్యలు - ఇటీవల కాలంలో ఆక్వాకల్చర్, సెజ్లుగా ఈ ప్రాంతాలను ప్రకటించడం, టూరిజం లాంటి అభివృద్ధి కార్యక్రమాల వల్ల టైడల్ అరణ్యాలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. వీటి పరిరక్షణ కోసం 1971లో రామ్సర్ ఒప్పందం అమల్లోకి వచ్చింది. భారత్‌లో కూడా వీటి పరిరక్షణకు చర్యలు చేపట్టారు. కొన్ని మాంగ్రూవ్సను రక్షిత ప్రాంతాలుగా ప్రకటించారు.
- ప్రస్తుతం దేశంలో 38 మాంగ్రూవ్స్ అటవీ ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి..
1) సుందర్బన్స్ (పశ్చిమ బెంగాల్) - ఇవి ప్రపంచంలోనే అతిపెద్ద మాంగ్రూవ్స్. ఇది రాయల్ బెంగాల్ టైగర్స్‌కు ప్రసిద్ధి చెందింది.
2) బితర్కనిక (ఒడిశా) - ఇది మొసళ్లు, ఆలివ్ రిడ్లే తాబేళ్లకు ప్రసిద్ధి చెందింది.
3) కోరింగా (తూర్పుగోదావరి, ఏపీ) - ఇది మొసళ్ల సంరక్షణ ప్రాంతం
4) పాయింట్ కెలిమెరి (తమిళనాడు)
5) పిచ్చవరం (తమిళనాడు) - ఇది దేశంలో అతిపెద్ద మాంగ్రూవ్స్
6) వెంబనాడ్ (కేరళ)
7) కొండాపూర్ (షోలా అడవులు-కర్ణాటక)
8) రత్నగిరి (మహారాష్ట్ర)
9) గల్ఫ్ ఆఫ్ కచ్ (గుజరాత్)
10) గల్ఫ్ ఆఫ్ ఖంభాట్ (గుజరాత్)
11) నికోబార్ (నికోబార్ దీవులు)
2.ఖనిజాలు/ఖనిజ వనరులు అంటే ఏమిటి? భారతదేశంలోని ప్రధాన ఖనిజ వనరుల ప్రాంతాలను వివరించండి?
- ఖనిజం అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు భూ పటలంలో రసాయనికంగా సంయోగం చెందగా ఘనస్థితిలో ఏర్పడే కర్బన, అకర్బన సమ్మేళనాలు.
- ఖనిజ వనరులు అనేవి భూ ఉపరితలంపై, భూపటలంలో లభించే పునరుత్పత్తి చెందని, పరిమితంగా లభ్యమయ్యే ముఖ్యమైన సహజ వనరులు. మానవ ప్రగతికి ఒక దేశ లేదా ఒక ప్రాంత పారిశ్రామికాభివృద్ధిలో కీలక పాత్ర వహించే ముడిపదార్థాలు. అందువల్ల ఖనిజాల సర్వే, వెలికితీ, వినియోగం, ఎగుమతులు ఒక దేశ ప్రగతిని నిర్దేశిస్తాయి.
- 2020-21 మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ రిపోర్ట్ ప్రకారం దేశంలో 95 రకాల ఖనిజాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో 10 లోహ, 23 అలోహ, 4 ఇంధన, 3 అణు ఇంధన, 55 మైనర్ ఖనిజాలు ఉత్పత్తి అవుతున్నాయి.
- దేశంలో ఖనిజాల లభ్యతను బట్టి దేశాన్ని మొత్తం 7 ఖనిజ వనరుల ప్రాంతాలుగా విభజించారు. అవి..
1) ఈశాన్య పీఠభూమి (చోటానాగపూర్ పీఠభూమి) - దీన్నే రుర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, బీహార్లలో ఈ ఖనిజ
మేఖల విస్తరించి ఉంది. - ఇక్కడ లభమయ్యే ఖనిజాలు బొగ్గు, అబ్రకం, మాంగనీస్, యురేనియం, ఐరన్, సున్నపురాయి, డోలమైట్ మొదలైనవి.
2) మధ్యమేఖల ప్రాంతం - వింధ్యా పర్వతాలు, బస్తర్ పీఠభూమి, అమర్‌కంఠక్ పీఠభూమి, మాళ్వాపీఠభూమిలో ఈ ఖనిజ మేఖల విస్తరించి ఉంది.
- ఇక్కడ లభ్యమయ్యే ముఖ్యమైన ఖనిజాలు మాంగనీస్, రాగి, సున్నపురాయి, పాలరాయి, అబ్రకం మొదలైనవి.
3) పశ్చిమ మేఖల ప్రాంతం - గుజరాత్, రాజస్థాన్‌లలో ఈ ఖనిజ మేఖల విస్తరించి ఉంది.
- ఇక్కడ లభ్యమయ్యే ముఖ్యమైన ఖనిజాలు రాగి, జింక్, రాతి ఉప్పు, ముడి చమురు, యురేనియం మొదలైనవి.
4) దక్షిణ మేఖల ప్రాంతం - తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో ఈ ఖనిజ మేఖల విస్తరించి ఉంది.
- ఇక్కడ లభ్యమయ్యే ముఖ్యమైన ఖనిజాలు ఇనుము, యురేనియం, బంగారం, జిప్సం, సున్నపురాయి
మొదలైనవి.
5) నైరుతి మేఖల ప్రాంతం - కెనరీ తీరానికి సమాంతరంగా మహారాష్ట్ర, గోవా, కొంకణ్, కర్ణాటకల్లో ఈ మేఖల విస్తరించి ఉంది.
- ఇక్కడ లభ్యమయ్యే ఖనిజాలు ఇల్మనైట్, జిక్రాన్, మోనోజైట్, సోప్స్టోన్, ఇనుము మొదలైనవి.
6) హిమాలయ మేఖల ప్రాంతం - హిమాలయ పర్వత ప్రాంతంలో విస్తరించి ఉంది.
- ఇక్కడ లభ్యమయ్యే ముఖ్యమైన ఖనిజాలు సీసం, రాగి, జింక్, సున్నపురాయి, బిస్మత్, డోలమైట్ మొదలైనవి.
7) హిందూ మహాసముద్రపు ఖండ తీరపు అంచు ప్రాంతం - 6100 కి.మీ. పొడవున గల సముద్ర తీరంలో విస్తరించి ఉంది.
- ఇక్కడ లభించే ముఖ్యమైన ఖనిజాలు ముడి చమురు, పాస్ఫేట్, సిలికాన్, సహజ వాయువు, మాంగనీస్,
ఇల్మనైట్, గార్నెట్ మొదలైనవి. - భారతదేశంలోని వివిధ భౌగోళిక ప్రాంతాలు, స్వరూపాలు వివిధ రకాల ఖనిజ వనరులకు ప్రసిద్ధి.
- ఇక్కడ లభించే ఖనిజాలు ప్రపంచంలో లభించే ఖనిజ వనరులతో సరిసమానంగా నాణ్యమైనవిగా గుర్తింపు పొందాయి.
3.భారతదేశ నగరీకరణ ప్రక్రియ ముఖ్య లక్షణాలను క్లుప్తంగా వివరించండి?
- భారతదేశపు సగటు నగరం ఆ ప్రాంతం చారిత్రక నేపథ్యాన్ని, సామాజిక సాంస్కృతిక అంశాలను ప్రతిబింబించే అనేక కట్టడాల సమ్మేళనం. ఇప్పటికీ దేశంలోని నగరాల్లో మధ్య యుగాల కాలానికి, వలసవాద కాలానికి సంబంధించిన అనేక కట్టడాలు నిలిచి ఉన్నాయి. దేశ నగరాల అంతర్నిర్మాణాన్ని ప్రధానంగా కింది అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
1) రైలు, రోడ్డు మార్గాల నిర్మాణం
2) చారిత్రక, సాంస్కృతిక అంశాలు. ఉదాహరణకు బ్రిటిష్ రాజ ప్రతినిధి భవనం/రాజప్రాసాదం లేదా ప్రధాన దేవాలయం మొదలైన ముఖ్యమైన కట్టడాలు.
3) నివాస జనాభా ఆర్థిక, సామాజిక స్థితిగతులు
4) ప్రభుత్వ విధానాలు. - దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల అంతర్నిర్మాణాన్ని పరిశీలిస్తే కింది లక్షణాలు కనిపిస్తాయి.
1) స్వాతంత్య్రానంతరం నగరాలు.. వాటి గుండా వెళ్లే ప్రధాన రైలు మార్గాలు లేదా జాతీయ రహదారుల వెంట విస్తరిస్తున్నాయి.
2) ప్రధాన వాణిజ్య మండలాల్లో నివాస గృహాలు కూడా కనిపిస్తాయి. పెద్ద పెద్ద నగరాలు, పట్టణాలు మరింతగా విస్తరిస్తూ ఉంటే చిన్న సైజు పట్టణాలు జనాభా పరంగా, సంఖ్యా పరంగా రాను రాను కుచించుకుపోతున్నాయి.
3) ఇటీవల కాలంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు వాటి ప్రత్యామ్నాయ వాణిజ్య మండలాలు వృద్ధి చెందుతున్నాయి. ఉదా: ఢిల్లీలో కరోల్ బాగ్, చాందినీ చౌక్, దరియా గంజ్ పోటీ వాణిజ్య మండలాలుగా అభివృద్ధి చెందాయి.
4) నగరాల నివాస మండలాలను సామాజిక, ఆర్థిక ప్రాతిపదికన విభజించవచ్చు. ఉదా: విశాఖ నగరంలో జగదాంబ సెంటర్, ఎంవీపీ కాలనీ వంటి ప్రాంతాలు ఆర్థికంగా ఉన్నత ఆదాయవర్గానికి చెందిన ప్రజల నివాస మండలాలుగా అభివృద్ధి చెందాయి. అదేవిధంగా పోర్ట్ ఏరియా, గాజువాక వంటి ప్రాంతాలు మధ్య ఆదాయ వర్గాల కుటుంబాలతో కూడి ఉన్నాయి.
5) నగర కేంద్ర మధ్య భాగాలు ఇటీవల ఆకాశహర్మ్యాలు, మొదటి నుంచి కొనసాగుతూ వస్తున్న బజార్లు లేక మార్కెట్ల ఉనికి వల్ల విపరీతమైన రద్దీతో కూడి ఉంటున్నాయి. ఉదా: హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఉప్పల్ రింగ్ రోడ్డు, విజయవాడ బెంజ్ సర్కిల్.
6) శివారు ప్రాంతాలు ప్రణాళికారహిత విస్తరణ, వృద్ధి వల్ల సమస్యాత్మకంగా తయారయ్యాయి.
7) దాదాపు అన్ని నగరాలు రెండు కేంద్రకాలను కలిగి ఉన్నాయి. ఇందులో ఒక కేంద్రకం చుట్టూ ఆధునిక నగర పెరుగుదలను గమనించవచ్చు.
ఉదా: కొత్త ఢిల్లీ – పాత ఢిల్లీ
4. ‘మిషన్ కాకతీయ’ లక్ష్యాలు దాని ప్రభావాన్ని విశ్లేషించండి?
- రాష్ట్రంలోని చిన్న నీటిపారుదల రంగ సామర్థ్యాన్ని పునరుద్ధరించడం కోసం ప్రవేశపెట్టిన పథకమే మిషన్ కాకతీయ. గతంలో కాకతీయుల కాలంలో తవ్విన చెరువులు, కుంటలు లాంటి చిన్న నీటిపారుదల రంగం ఉమ్మడి రాష్ట్రంలోని పాలకుల నిర్లక్ష్యం, స్వార్థపూరిత చర్యల వల్ల పూర్తిగా దెబ్బతిని రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది.
- రాష్ట్ర భూభాగం భౌగోళికంగా పీఠభూమి స్థలాకృతిలో ఉన్నందున రాష్ట్రం గుండా ప్రవహించే కృష్ణా, గోదావరి నదీ జలాలను పంట భూమికి వినియోగించుకోలేకపోతున్నాం. కారణం కృష్ణా, గోదావరి జలాలు రాష్ట్రంలో ఎక్కువ లోతులో ప్రవహిస్తుండటం వల్ల. అందువల్లనే రాష్ట్రంలో వంద సంవత్సరాల నుంచి వ్యవసాయానికి ప్రధాన ఆధారంగా చెరువులే కేంద్రంగా ఉన్నాయి.
మిషన్ కాకతీయ లక్ష్యాలు
1) గతంలో ఉన్న చెరువులను, వాటి వాస్తవ నీటి నిల్వ సామర్థ్యం మేరకు నిల్వచేసుకునే విధంగా
పునరుద్ధరించడం.
2) కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతంలో చిన్న నీటిపారుదల రంగానికి కేటాయించిన 225 టీఎంసీల నీటిని వినియోగంచుకోగలిగితే రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించవచ్చు. కానీ ప్రస్తుతం 10 లక్షల ఎకరాలకు మాత్రమే కొనసాగుతుంది.
3) మిషన్ కాకతీయ ప్రాజెక్టు పూర్తయితే అదనపు భూసేకరణ అవసరం లేకుండానే చిన్న నీటిపారుదల రంగం ద్వారా నీరు అందించవచ్చు.
ప్రభావం: ఈ పథకం వల్ల రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతుల ఆధారిత ఆదాయం పెరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నల్లగొండ జిల్లాల్లో పంట సాగు విస్తీర్ణత, దిగుబడి, రసాయనిక ఎరువుల వాడకం, చేపల పెంపకం, రైతుల ఆదాయం తదితర అంశాలపై నివేదికలో తెలిపింది.
ముఖ్యాంశాలు: 1) 2016 ఖరీఫ్‌లో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నల్లగొండ జిల్లాల పరిధిలో 51.5 శాతం సాగు విస్తీర్ణం పెరిగింది.
2) అంతేగాకుండా వ్యవసాయ ఆధారిత ఆదాయంలో 47.5 శాతం ఆదాయం పెరిగినట్లు అంచనా వేశారు.
3) అంతేగాకుండా చెరువుల నుంచి తొలగించిన మట్టితో
రసాయనిక ఎరువుల వాడకం 35 శాతం నుంచి 50 శాతానికి తగ్గినట్లు కనిపించింది.
4) చెరువు ఆయకట్టు పనిలో కుటుంబాల సరాసరి ఆదాయం 78.5 శాతం, చెరువుల చేపల పెంపక 2013-14తో పోలిస్తే 2016-17లో 36 నుంచి 39 శాతం పెరిగింది.
5) భూగర్భ జలాల్లో సగటు పెరుగుదల 2013-14లో 6.91 మీ. ఉండగా 2016-17లో 9.02 మీ.కు పెరిగింది. దీంతో పాటు అంతకుముందు 15 శాతం ఎండిపోయిన బావులు, బోరుబావులు పునరుజ్జీవం చెందాయి. - నీతి ఆయోగ్ విడుదల చేసిన సమగ్ర యాజమాన్య సూచీలో రాష్ట్రం నీటిపారుదల పునరుద్ధరణలో రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో ఉంది.
జీ గిరిధర్
సివిల్స్ ఫ్యాకల్టీ
బీసీ స్టడీ సర్కిల్
హైదరాబాద్
9966330068
Previous article
BIOLOGY | తాచుపాము సొంత గూడు నిర్మించుకోవడానికి కారణం?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు