పరిసరం పరిశుభ్ర జీవనం – స్వచ్ఛ భారత్‌తో నవశకం
అపరిశుభ్ర పరిసరాల నుంచి పరిశుభ్రత దిశగా, అనారోగ్యం నుంచి ఆరోగ్య దిశగా, కాలుష్యం నుంచి స్వచ్ఛత దిశగా దేశాన్ని ముందుకు నడిపించే మహత్తర కార్యక్రమం స్వచ్ఛభారత్. ప్రజల అలవాట్లలో పెనుమార్పు తీసుకువచ్చి పరిసరాల పరిశుభ్రతకు పెద్దపీటవేసే ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమం ఇది.
స్వాతంత్య్రానంతరం 67 ఏండ్ల తర్వాత కూడా 2014 నాటికి దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 10 కోట్ల గృహాలు, పట్టణ ప్రాంతాల్లో కోటి గృహాల్లో మరుగుదొడ్లు లేని పరిస్థితి ఉండేది. దీంతోపాటు దేశ జనాభాలో సుమారు 55 కోట్లమంది బహిరంగ మలమూత్ర విసర్జన చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇది ఎన్నో రకాల అనారోగ్యాలకు, అపరిశుభ్ర వాతావరణానికి, జల, వాయు కాలుష్యాలకు కారణమవుతూ వచ్చింది. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. దీనికి అనుగుణంగా 130 కోట్ల మంది ప్రజలు బాపూజీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని సాకారం చేసేందుకు సాగించిన కృషి ఇప్పుడు ఫలితాలనిస్తున్నది.
మహాత్ముడి బాటలో..
పరిసరాల పరిశుభ్రత గురించి మహాత్మా గాంధీ స్వాతంత్య్రోద్యమ కాలంలోనే ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. మన గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోతే మన అపరిశుభ్ర అలవాట్లను వదిలించుకోకపోతే స్వరాజ్యానికి విలువ ఉండదని గాంధీజీ ఉద్భోదించారు.
ప్రధాని నరేంద్ర మోదీ 2014, ఆగస్టు 15న ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో దేశాన్ని పరిశుభ్ర భారతావనిగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛభారత్ సంకల్పాన్ని ప్రకటించారు. దీనికి అనుగుణంగా 2019, అక్టోబర్ 2 నాటికి అంటే గాంధీజీ 150వ జయంతి నాటికి దేశాన్ని బహిరంగ మలమూత్ర విసర్జన రహిత దేశంగా, పరిశుభ్ర పరిసరాలు కలిగిన దేశంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
స్వచ్ఛ భారతావనిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడానికి ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. సహజ వనరులు కాలుష్యం బారిన పడకుండా చూడటంపై ప్రజల్లో అవగాహన కల్పించగలిగారు. నదులు, చెరువులు, కాలువలు ఇతర జలవనరులను కాలుష్యం బారినుంచి కాపాడటం, వాయు కాలుష్యం లేకుండా చూడటం, విచ్చలవిడి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం వంటివాటి విషయంలో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు జరిగాయి.
దేశవ్యాప్తంగా 639 జిల్లాలు, 5,89,326 గ్రామాలు బహిరంగ మలమూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్) గ్రామాలు అయ్యాయి. 2014 అక్టోబర్ నుంచి దేశంలో 10 కోట్లకుపైగా గౌరవ గృహాలను నిర్మించారు. దేశవ్యాప్తంగా 4014 పట్టణ స్థానిక సంస్థల్లో ఈ ఏడాది అక్టోబర్ 2 నాటికి 3750 పట్టణ స్థానిక సంస్థలు బహిరంగ మలమూత్ర విసర్జన రహిత ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి.
స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా పలు కొత్త పద్ధతులకు శ్రీకారం చుట్టారు. వ్యర్థ్ధాల నిర్వహణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, వ్యర్థ్ధాల రీసైక్లింగ్, వ్యర్థాల నుంచి ఇంధన సృష్టి వంటివాటిని పలు జిల్లాలు అమలు చేస్తున్నాయి.
దేశ స్వయం సమృద్ధి కోసం మహాత్మాగాంధీ కలల సాకారమయ్యేందుకు ప్రతి ఒక్కరూ ఒక సంకల్పాన్ని తీసుకుని కనీసం ఏడాదిపాటు దానికి కట్టుబడి ఉండాలని మోదీ పిలుపునిచ్చారు. పర్యావరణానికి ముప్పుగా పరిణమించిన వాడి పారేసే ప్లాస్టిక్‌ను 2022 నాటికి నిర్మూలించిడానికి అందరూ కంకణబద్దులు కావాలని ప్రధాని కోరారు. ఆరుబయట మలవిసర్జన అలవాటు నుంచి ఇప్పుడు మన దేశం బయటపడిందని, ప్రపంచ దేశాల్లో భారత్ పరపతి పెరిగిందని చెప్పారు. మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న (బుధవారం) అహ్మదాబాద్‌లో సబర్మతి నదీతీరంలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ దివస్ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు.
స్వచ్ఛ భారత్ గ్రామీణ్, స్వచ్ఛభారత్ అర్బన్ కింద పలు కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేసింది. ఇప్పుడు మన గ్రామీణ భారత్ ఆరుబయట మలవిసర్జన అలవాటులేని దేశంగా మారిపోయిందని ప్రధాని ప్రకటించారు. దీన్ని సూచించేలా దేశ పటాన్ని రిమోట్‌తో ఆయన ఆవిష్కరించారు. 60 కోట్ల మంది కోసం 60 నెలల్లో 11 కోట్ల మరుగుదొడ్లను నిర్మించిన తీరును యావత్ ప్రపంచం కొనియాడుతోందని, ఇదొక మైలురాయి మాత్రమేనని, నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రపంచంలో ప్రతి సమస్యకు పరిష్కారం గాంధీ బోధనల్లో దొరుకుతుందని చెప్పారు. ప్లాస్టిక్ అందరికి ముప్పుగా మారిందని, వాడిన తర్వాత పారవేసే ప్లాస్టిక్‌ను 2022 నాటికి నిర్మూలించాలనే లక్ష్యాన్ని సాధించాల్సి ఉందని ప్రకటించారు.
నిధులు
స్వచ్ఛ భారత్ మిషన్‌కు కేంద్ర ప్రభుత్వం 2014-15 నుంచి 2018-19 వరకు రూ. 51,314 కోట్లు కేటాయించింది. ఫలితంగా ఈ ఏడాది ఏప్రిల్, మే నాటికి దేశవ్యాప్తంగా 98.9 శాతం ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేపట్టారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించడంతోపాటు, వాటి వినియోగంపై ప్రభుత్వం శ్రద్ధపెట్టింది. దీనికి సంబంధించి జాతీయ వార్షిక గ్రామీణ పారిశుద్ధ్య సర్వే ప్రకారం 2018-19 కాలంలో గ్రామీణ భారతంలో 93.1 శాతం గృహాలకు టాయిలెట్ సౌకర్యం ఉందని తేల్చింది. ఈ సౌకర్యం ఉన్న ఇండ్లలోని వారిలో 96.5 శాతం మంది టాయిలెట్ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నట్లు సర్వే గుర్తించింది. సర్వే చేసిన గ్రామాల్లో 95.4 శాతం ఊళ్లలో పారిశుద్ధ్య పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని, చెత్త, మురుగు నీటి నిల్వ వంటి సమస్యలు నామమాత్రంగా ఉన్నాయని పేర్కొంది.
మెరుగుపడిన ఆరోగ్యం
పరిసరాలు పరిశుభ్రంగా మారడంతో ప్రజల ఆరోగ్యం కూడా మెరుగుపడింది. స్వచ్ఛ భారత్ అమలుతో ఐదేండ్లలోపు పిల్లల్లో డయేరియా, మలేరియా మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2013 నాటికి దేశంలో ఐదేండ్ల లోపు పిల్లల్లో 11 శాతం మరణాలు డయేరియా వల్లే ఉంటూ వచ్చాయి. గత నాలుగేండ్లలో డయేరియా వల్ల మరణించే ఐదేండ్లలోపు పిల్లల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ప్రజల ఆరోగ్య స్థితిగతులు మెరుగుపడ్డాయి.
పారిశుద్ధ్యం ఆరోగ్యాన్ని ఏవిధంగా మెరుగుపరిచిందో తెలుసుకునేందుకు కూడా సర్వేలు జరిగాయి. తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ శానిటేషన్ హెల్త్ ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీని (ఓడీఎఫ్) నిర్వహించింది. బహిరంగ మలమూత్ర విసర్జన రహిత విధానాన్ని అమలు చేస్తున్న ప్రాంతాల్లోని చిన్న పిల్లల ఆరోగ్యంలో ఓడీఎఫ్ అమలుకాని ప్రాంతాల్లోని చిన్నపిల్లల ఆరోగ్యంతో పోల్చి చూసింది. ఇందుకు కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్లోని కొన్ని ఓడీఎఫ్‌గా ప్రకటించిన జిల్లాల్లోని ప్రాంతాలతో, ఓడీఎఫ్‌గా ప్రకటించిన ప్రాంత చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహార తీరుతెన్నులను పరిశీలించినప్పుడు ఓడీఎఫ్ ప్రాంతాల్లోని చిన్నారుల పరిస్థితి మెరుగ్గా ఉన్నట్టు తేలింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు