భారతదేశంలో వృద్ధుల సంక్షేమం
మానవ సమాజంలో అనుభవం, జ్ఞానం, వారసత్వ సంపదను, సంస్కృతిని భవిష్యత్తు తరాలకు అందించే సమూహమే వృద్ధులు. భారతదేశంలో 60 ఏండ్లు పైబడి వయ స్సు గల వారిని వృద్ధులు/సీనియర్ సిటిజన్స్‌గా పరిగణిస్తారు. శారీరక, మానసిక సామర్థ్యం ఆధారంగా వృద్ధుల వయస్సును వేర్వేరు సమాజాల్లో వేర్వేరుగా నిర్ధారిస్తారు.
వృద్ధాప్యం అనివార్యం
-మానవ జీవనంలో వృద్ధాప్యం అనివార్యమైన తప్పించుకోలేని దశ. అయితే ఈ వాస్తవాన్ని విస్మరిస్తూ అనేక కుటుంబాలు చివరకు సమాజం కూడా వృద్ధులను భారంగా భావిస్తూ వారిని అనేక రకాలుగా వేధింపులకు గురిచేస్తున్నారు. ఫలితంగా నేటి జీవన పరిస్థితుల్లో వృద్ధాప్యం ఒక శాపంలా మారుతున్నది. నిత్యం అవమానాలను ఎదుర్కొంటూ, శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు పడు తూ నాలుగు గోడల మధ్యనే నలిగిపోతున్న పండుటాకులెందరో. వీరిలో మహిళల పరిస్థితి దుర్భరంగా ఉంది. ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, కుటుంబ బాధ్యతలకతీతంగా వృద్ధులపై వేధింపులు కొనసాగుతుండటం ఆందోళనకర అంశం. ప్రతి ఏడాది అక్టోబర్ ఒకటిని అంతర్జాతీయ వృ ద్ధుల దినోత్సవంగా జరుపుకొంటారు. అంతేకాకుండా జూన్ 15వ తేదీని వేధింపులకు గురవుతున్న వృద్ధుల కోసం జరుపుకొనే ప్రత్యేక దినంగా ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. వీటి ద్వారా ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల సమస్యలపై చర్చలు మొదలయ్యాయి. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 60 ఏండ్లు అంతకంటే పైబడిన జనాభా 120 కోట్లకు చేరనున్నది.
వృద్ధుల సమస్యలు
-సమాజానికి మార్గదర్శకులుగా భావించబడే వృద్ధులను ప్రస్తుతం సమాజం అనుత్పాదక వర్గంగా, భారమైన వర్గం గా భావిస్తూ వారిని అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేయడం జరుగుతున్నది.
-ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై కేంద్రక కుటుంబాలు ఏర్పడటం వల్ల, కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం వల్ల వృద్ధులు అనాథలుగా మారుతున్నారు.
-ఆధునిక పాశ్చాత్య జీవనంలో పరిగెడుతున్న సమాజంలో వృద్ధులకు స్థానం లేకుండాపోయింది.
-సామాజిక, ఆర్థిక భద్రత లేకుండాపోయింది.
-కుటుంబసభ్యులు వృద్ధుల అవసరాలను తీర్చడంలో నిర్లక్ష్యంగా ఉండటం, కడుపునిండా తిండి పెట్టకపోవడం, అవసరానికి మందులు కొనకపోవడం, భావోద్వేగాలతో బెదిరించడం (ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్) బెదిరింపులకు పాల్పడటం, అరవడం, తిట్టడం, కొట్టడం వంటి చర్యలు నిత్యకృత్యమయ్యాయి.
-వృద్ధులు ఒకవేళ దివ్యాంగులైతే వారిని కట్టిపడేయడం వంటి మరింత విషాదకరమైన అంశాలు
వృద్ధుల హక్కులు
-ఐక్యరాజ్యసమితి 1991లో వృద్ధుల హక్కుల కోసం ప్రత్యే క తీర్మానాలు చేసింది.
-ఐక్యరాజ్య సమితిలోని అన్ని సభ్య ప్రభుత్వాలు విధిగా వృద్ధుల సంక్షేమం కోసం కొన్ని ప్రత్యేక పథకాలను రూపొందించాలి.
-వృద్ధులు సమాజంలో గౌరవంగా జీవించే హక్కులను కల్పించాలి.
-ఎలాంటి కుటుంబ, సమాజ ఒత్తిడులు లేకుండా వృద్ధులకు స్వతంత్రంగా జీవించే హక్కును కల్పించాలి.
-వృద్ధులు కుటుంబం నుంచి, ప్రభుత్వం నుంచి ఆసరా పొందే హక్కును కల్పించాలి.
-వృద్ధులు సంతృప్తిగా, ఆనందంగా జీవించే పరిస్థితులను కల్పించాలి.
భారతదేశంలో వృద్ధుల సంక్షేమం
భారతదేశంలో సంక్షేమ యంత్రాంగానికి అధిక ప్రాధాన్యతనివ్వడం జరుగుతుంది. బలహీన వర్గాలైన షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు, మహిళలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, పిల్లలు తదితర వర్గాల సంక్షేమం వారి అభ్యున్నతి కోసం భారత రాజ్యాంగంలో అనేక నిబంధనలను రూపొందించింది. ఈ నిబంధనలకు అనుగుణంగా భారత ప్రభుత్వం అనేక చట్టా లు, పథకాలు, కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తుంది.
-రాజ్యాంగ నిబంధన : 41
-ఈ నిబంధన ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధులకు అన్ని రకాల సహాయాలను అందించేందుకుగాను అనేక పథకాలను చేపట్టాలి.
-వృద్ధాప్య పింఛను పథకం – 1950
-హిందూ దత్తత, నిర్వహణ చట్టం – 1956
-ఈ చట్ట ప్రకారం వృద్ధులు తమ సంతానం నుంచి సహాయాన్ని పొందే హక్కును కలిగి ఉంటారు.
-సంతానం తమ వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఈ చట్టంలోని సెక్షన్ 20(3) ప్రకారం వారిని శిక్షించవచ్చు.
-తల్లిదండ్రుల, వృద్ధుల సంక్షేమం, నిర్వహణ చట్టం – 2007
-ఈ చట్టం ప్రకారం వృద్ధులను నిర్లక్ష్యం చేస్తున్న సంతానం పై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు.
-తమను నిర్లక్ష్యం చేస్తున్న సంతనానికి గతంలో ధారాదత్తం చేసిన ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకొంటుంది.
-వృద్ధుల జీవితాలను, వారి ఆస్తులను సంరక్షించడం.
-అవసరమైన చోట ప్రభుత్వాలే వృద్ధాశ్రమాలను ఏర్పాటుచేయడం.
-వృద్ధులకు తగిన వైద్య సదుపాయాలు, సంరక్షణ కల్పించడం.
-తహసిల్/సబ్ డివిజన్ స్థాయిల్లో ఏర్పాటుచేయబడిన ట్రిబ్యునల్స్ ద్వారా వృద్ధుల హక్కులను సంరక్షించడం.
-వృద్ధులకు సంబంధించి తెలంగాణలోని 10 జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో అప్పిలేట్ ట్రిబ్యునల్స్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 42 ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటు చేసింది.
-క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ (సీఆర్పీసీ)లో సెక్షన్ 575 ప్రకారం తల్లిదండ్రుల పట్ల కఠినంగా వ్యవహరించిన సంతనాన్ని శిక్షిస్తుంది.
వృద్ధుల సంక్షేమ కార్యక్రమాలు
-ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పింఛను పథకం – 1995
-జాతీయ సామాజిక సహాయ కార్యక్రమంలో భాగంగా ఈ పథకాన్ని అమలు చేస్తుంది.
-60 ఏండ్ల పైబడిన వారు ఈ పథకం కింద అర్హులు.
-60-79 ఏండ్ల మధ్య వయస్సువారికి నెలకు రూ. 200
-80 ఏండ్లు పైబడిన వారికి నెలకు రూ. 500 పింఛన్‌ను అందిస్తుంది.
-తెలంగాణ ప్రభుత్వం ఆసరా పథకంలో భాగంగా వృద్ధులకు నెలకు రూ. 1000 పింఛన్ అందించడం జరుగుతున్నది.
వయో శ్రేష్ట సమ్మాన్ పథకం – 2013
-వృద్ధులకు సేవలందిస్తున్న వ్యక్తులు, సంస్థలను గుర్తించడం, గౌరవించడం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
-ప్రతి ఏడాది అక్టోబర్ 1న వృద్ధుల సేవలకు సంబంధించి 13 కేటగిరీల్లో వయోశ్రేష్ట సమ్మాన్ పురస్కారాలు ఇస్తుంది.
వరిష్ట (పింఛను) బీమా యోజన – 2014
-60 ఏండ్లు గల వృద్ధులకు ఆర్థిక భద్రతను కల్పించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం.
-ఈ పథకాన్ని ఎల్ఐసీ నిర్వహిస్తుంది.
జీవన్ ప్రమాణ్ – 2014
-పదవీ విరమణ పొందిన ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు పింఛన్ అందించే పథకం ఇది.
-ఆధార్ ఆధారిత డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను ఈ పథకం ద్వారా పెన్షనర్లు పొందవచ్చు.
సంకల్ప్-2014
-డిపార్టుమెంటు ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలుకుగాను పింఛన్‌దారుల సేవలను ఉపయోగించుకోవడం ఈ పథకం లక్ష్యం.
ఆసరా పథకం – 2014 నవంబర్ 8
-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాజంలో అన్ని రకాలుగా ఇబ్బందులకు గురవుతున్న వర్గాలకు ఆర్థిక భద్రతను కల్పించే ఉద్దేశంతో ప్రారంభించిన పథకం ఇది.
-2014 నవంబర్ 8న మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులో పథకాన్ని ప్రారంభించారు. 2014 డిసెంబర్ 10 నుంచి ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది.
-గతంలో రూ.200 ఉన్న పింఛన్‌దారులకు రూ. 1000, రూ. 500 ఉన్నవారికి రూ. 1500 ప్రతి నెల అందిస్తుంది.
ఇతర కార్యక్రమాలు
-వృద్ధుల కోసం సమగ్ర కార్యక్రమం – 1992
-వృద్ధాశ్రమాలు, మొబైల్, మెడికేర్ యూనిట్ల స్థాపన, నిర్వహణ కోసం కృషి చేస్తున్న ప్రభుత్వేతర సంస్థలు పంచాయతీరాజ్, స్థానిక సంస్థలకు ఈ పథకం కింద ప్రాజెక్టు వ్యయంలో 90 శాతం ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్
-ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
-సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వశాఖ ద్వారా ఏర్పాటుచేసిన స్వతంత్ర సంస్థ.
-వృద్ధుల సంరక్షణ కోసం నైపుణ్యం కలిగిన ప్రాక్టికల్ అనుభవం, శిక్షణ పొందిన కేర్టేకర్లను, సూపర్వైజర్లను తయారుచేయడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం.
-ఈ సంస్థలో సోషల్ జెరంటాలజీ, బేసిక్ జెరియాట్రిక్స్ ఐప్లెడ్ జెరియాట్రిక్స్, జెరియాట్రిక్ నర్సింగ్ వంటి కోర్సులను శిక్షణ రూపంలో అందిస్తుంది.
-2010-11 నుంచి వృద్ధుల ఆరోగ్య సంరక్షణకు సంబంధించి కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
-వృద్ధుల కోసం భారతీయ రైల్వే ప్రత్యేక రాయితీలను అందిస్తుంది.
-65 ఏండ్లు దాటిన వృద్ధుల కోసం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విమాన చార్జీల్లో 50 శాతం రాయితీ కల్పిస్తుంది.
-పన్నుల్లో మినహాయింపు
-వైద్య చికిత్సల్లో రాయితీ
-జీవిత బీమా కల్పన ఇవన్నీ ఉన్నప్పటికీ ప్రభుత్వాలు మరికొన్ని చర్యలను చేపట్టాలి.
-వృద్ధులకు తమ హక్కులపట్ల అవగాహన చైతన్యాన్ని కలిగించాలి.
-వృద్ధాప్యంలో ఎదురయ్యే సమస్యలకు ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలను అందించాలి.
-వృద్ధుల హక్కులను పరిరక్షించే విధానాలను రూపొందించాలి.
వృద్ధులేం చేయాలి?
-వృద్ధాప్యం అనేది ఒక సహజమైన జీవన ప్రక్రియ. అందువల్ల వృద్ధాప్యాన్ని తలుచుకొంటూ బాధపడటం మానేయాలి.
-పాత మిత్రులతోను, ఇరుగుపొరుగు వారితోనూ సంబంధాలను కొనసాగించడం, స్నేహాలను పెంచుకోవాలి.
-స్నేహితులను తమ ఇంటికి ఆహ్వానించడం, వారి ఇళ్లకు తరచుగా వెళ్లడం.
-కొత్త అవకాశాలకు ప్రయత్నించడం, దీని వల్ల కొత్త స్నేహితులు ఏర్పడుతారు.
-విలైనంత వరకు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఒంటరితనం దూరం చేసి అందంగా జీవించే అవకాశం ఉంటుంది.
-రోజు వ్యాయామం, పౌష్టికాహారం తీసుకోవడం తప్పనిసరి.
వృద్ధుల జాతీయ విధానం – 1999 ముఖ్యాంశాలు
-దేశవ్యాప్తంగా వృద్ధుల సంక్షేమానికి సంబంధించి జాతీయస్థాయిలో ప్రత్యేక కార్యక్రమాల రూపకల్పన.
-తల్లిదండ్రులు, వృద్ధులను నిర్లక్ష్యం చేసిన సంతానం నుంచి గతంలో వారికిచ్చిన ఆస్తిని తిరిగి తీసుకోవడం.
-వృద్ధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండే సంతానంపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం.
-వృద్ధులకు అన్నిరకాల భద్రత రక్షణలను కల్పించడం.
-వృద్ధుల రక్షణ కోసం ప్రత్యేక యంత్రాంగాలను ఏర్పాటు చేయడం.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు